Saturday, July 3, 2010

అంత్యప్రాసాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> అంత్యప్రాసం


లక్షణం: మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.

వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది. గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం ఒకే గుణింతంలోనుండి వస్తుంది. ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే "ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో "క్క" తో ప్రాస కుదురింది. ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.

మన తెలుగు చలన చిత్రంలో అతి ఎక్కువగా వాడబడుతున్న ప్రాస ఇదే.ఎంతో భావుకతతో శ్రోతలు ఊహించని విధంగా ప్రాస కలపడంలోనే అంత్యప్రాస అందం ఉంది అని నా అభిప్రాయం. దీని గురించి వ్యాసాలు కాదు, పుస్తకాలు వ్రాయచ్చును. అంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి నాకు నచ్చిన ప్రాసలు కొన్ని చెప్పి శబ్దాలంకారాలు ముగిస్తాను. ఆ తరువాత అర్థాలంకారాలు వైపు నడుద్దాము.


ఉదా: (చిత్రం: ఆంధ్రకేసరి, రచన: ఆరుద్ర)
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు

మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట ఇప్పటికీ గోదారిగంగ అలలలాగా నా మనసులోతుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. "ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం, "పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు. కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" (గోదావరి అలల వేగం వలన కలిగిన నాదం) అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?

కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" అన్నప్పుడు ఎవరైనా, "ఐతేనేమి? కాటన్ దొర బ్యారేజీ మిగిలిందనో, రచించిన కవితాసౌధాలు మిగిలాయనో చెప్తారు", అని శ్రోతలు అనుకుంటే "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న చందాన, "వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు, అది చాలు", అని చెప్పడం విన్న ప్రతిసారి, నాకు కళ్ళు చెమరుస్తుంది.


ఉదా: (చిత్రం: రాజ్కుమార్, రచన: ఆత్రేయ)
సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం

"జానకి కలగనలేదు" అనే పాటలోనిది ఈ చరణం. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు (1). ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, ఎంతో చక్కందనం ఉంది. అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.


ఉదా: (చిత్రం: శుభసంకల్పం, రచన: వేటూరి)
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు

ఇక్కడ రెండు అక్షరాలతో చక్కని అంత్యప్రాస కుదిరింది. "కట్టె, కొట్టె, తెచ్చె" అని రామయణం చెప్పడం తెలుగువారికి తెలిసే ఉంటుంది. అదే రామయణాన్ని ఈ రెండు వాక్యాలలోనూ కవి ఎంతో అందంగా చెప్పాడు. రాముడి సుగుణాల, సీతమ్మ అందాల, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు కలిసినప్పుడు జరిగిన వైభోగాలు - అంతే కదా రామయణం!


ఉదా: (చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)
ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?

"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?" అని చదువర్లకు సందేహం రావచ్చు. "ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది. అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి", అని చెప్పడానికే ఇది వ్రాశాను. ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?


ఒకప్పుడు ఇది నిజంగా అలంకారంగానే (తగినపాళ్ళలో వాడేవారు) ఉండేది. ఉదాహరణకి దేవులపల్లి, పింగళి, సినారె, దాశరథి మొదలగు కవుల పాటల్లో ఇది ఒక నియమంలాగా ఉండదు. రాను రాను, ఒక నియమం అయిపోయింది. ప్రాస కలపడం, అది ఒక పాటనడం - ఇది రివాజైపోయింది. "బన్ని, పిన్ని, చున్ని" ప్రాసపాటలు, తెలుగువైభవాన్ని చూసినవారికి గుండెపోట్లై కూర్చుకున్నాయి. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.


ఈ అలంకారానికి పద్యాలలో ఉదాహరణలు నాకు తెలియవు. మీకేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

(1) "వివరించేటప్పుడు నీ అలంకారాల గోలేమిటయ్యా?", అని అనుకోకండి. దైనందినజీవితంలో వాడితేనే కదా అలంకారాలకు అలంకారం?

10 comments:

.C said...

ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతై ధ్రువునిపై నంతై మహార్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడిఁ వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ, కృపాబ్ధి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

పై రెండే కాక పోతన వ్రాసిన చాలా పద్యాలలో కనిపిస్తుంది అంత్యప్రాసాలంకారము. (పైన అన్ని ద్విత-మకారాలూ అంత్యాక్షరాలే కాదు కనుక ఇది వృత్యనుప్రాసం కూడానేమో. "మహత్వ కవిత పటుత్వ" అన్నప్పుడు "త్వ" అన్న అంత్యప్రాస ఉంది.) అంత్యప్రాసకు అచ్చు కూడా ఒకటే ఉండాలి. అంటే నాకు ఛందస్సు నేర్పిన గురువులలో ఒకరైన మోహనరావు గారి మాటల్లో "'మోహన'కు, 'వాహిని'కి అంత్యప్రాస చెల్లదు."

పద్యాలలో త్రిభంగి వంటి వృత్తాలలోనూ, రగడ పద్యరీతులలోనూ అంత్యప్రాస నియమం ఉంది.

రవి said...

వామన వృత్తాంతములో
"వసుధాఖండము వేడితో, గజములన్ వాంఛించితో, కోరితో యువతులన్.."

"రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై.."

జ్యోతి గారి బ్లాగులో ఓ పాత తమిళసినిమా పాట, దాని రీమిక్సు పెట్టారు. ఆ పాటలో కూడా మొదట్లో, మధ్యలో ఒక చరణంలో వస్తుంది.

"పొన్మగళ్ వందాళ్
పొరుల్ కోడి తందాళ్"

అంత్య ప్రాస శ్రవణశుభగకారి అనుకుంటాను. అందుకే ఎక్కువగా క(వి)నిపిస్తుంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

అన్వేషణ చిత్రంలోని ఏకాంత వేళ.. పాటలో అంత్యప్రాస కూడా చాలా బాగా వస్తుంది.

కామేశ్వరరావు said...

నాకు చప్పున గుర్తుకు వచ్చిన ఉదాహరణ:

చిన్న చిన్న రాళ్ళు, చిల్లరదేవుళ్ళు
నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు
సజ్జజొన్న కూళ్ళు, సర్పంబులును త్రేళ్ళు
పల్లనాటి సీమ పల్లెటూళ్ళు

ఇలాగే అంత్యప్రాసతో కూడిన తేటగీతి పద్యాలు కూడా కొన్ని ఉన్నాయి కాని గుర్తుకు రావడం లేదు. ఈ ఏడాది పొద్దు పద్య కవి సమ్మేళనంలో నేనూ అంత్యప్రాసతో రెండు తేటగీతులు ప్రయత్నించాను. అవి ఇక్కడ చదువుకోవచ్చు: http://poddu.net/?p=4096

Sandeep P said...

మీరు చెప్పిన పద్యం చాలా బాగుందండి. ఎందులోదో తెలుసునా?

మీరు కవిసమ్మేళనానికి వ్రాసిన పద్యాలు చూసి ఆశ్చర్యం వేసిందండి.

సర్ప సంధానితోన్నత జటభరమ్ము
శ్రవణమున వ్రేలు రుద్రాక్షసరయుగమ్ము
గళ రుగతి కజ్జలితమౌ మృగాజినమ్ము
తనరు నా యోగమూర్తి సదాశివమ్ము

-- అద్భుతం! మీ బోటీ కవులు ఉండటం ఈ తరం చేసుకున్న అదృష్టం అండి!

కామేశ్వరరావు said...

"చిన్న చిన్న రాళ్ళు" పద్యం శ్రీనాథుని చాటువుగా ప్రసిద్ధిపొందింది. అతను పల్నాటిసీమ వెళ్ళినప్పుడు ఇలాంటి పద్యాలు కొన్ని చెప్పాడు(ట).

నన్ను మరీ అలా మునగచెట్టెక్కించెయ్యకండి! :-) కవిత్వం ఒక తపస్సయితే దాన్ని చెయ్యడానికి చాలాసార్లు ప్రయత్నించి అది భగ్నమైనవాడిని. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నవాణ్ణీను.
"సర్పసంధానితోన్నత..." పద్యంలో పదాలు మాత్రమే (కొంతవరకూ) నావి, భావం కాళిదాసుది.

Sandeep P said...

@కామేశ్వరరావు గారు
ఓహో! శ్రీనాథుడు చాలా గొప్ప భావుకత ఉన్న కవి.

భావం, భాష రెండూ బాగుంటేనే కదా పద్యానికి అందం. ఆ పద్యం పండటంలో మీ ప్రతిభ కూడా ఉందనటంలో అతిశయోక్తి లేనే లేదు.

@.C

అమ్మలగన్నయమ్మ "మ్మ"తో వృత్త్యనుప్రాస అని నా అభిప్రాయం. అలాగే మహత్వ, కవిత్వ, పటుత్వ - ఇది వృత్త్యనుప్రాస. అంత్యప్రాసకు అచ్చు సమమవ్వాలనే నా అభిప్రాయం కూడా. కానీ ఈ వ్యాకరణం పుస్తకంలో అది వివరంగా చెప్పలేదు. త్రిభంగి, రగడ పద్యరీతుల గురించి నాకు తెలియదు. నీకు తెలిసిన పద్యాలేమైనా ఉంటే తప్పక తెలుపగలవు.

@ మందాకిని గారు

అందులో "ట్లో"తో అంత్యప్రాస నడుస్తుంది. ఆ పాటలో భావుకత కంటే పదాల గారడికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చారనిపించింది. అదే చిత్రంలో, "కీరవాణీ" పాటలో ఉన్న భావుకత అద్భుతం! "నీ కవనాలలో నే తొలిప్రాసనై, నీ జవనాలలో జాజుల వాసనై" - ఆహా! ఎంత బాగుంది ఈ వాక్యం!

@రవి గారు

అంత్యప్రాస ప్రధానంగానే మనం చాల ఇంగ్ళీషు పోయెంస్ చదివాము. వినడానికి చాలా బాగుంటుంది అది, మీరన్నట్టే!

@ అందరూ

మీ కామెంట్లు నాకు జీమెయిలులో కనబడ్డాయి కానీ, ఇక్కడ కొన్ని మాయమయ్యాయి. ఇది బ్లాగరుగారి విన్యాసమేమో!

శ్రీనివాసమౌళి said...

కూనలమ్మ పదాల్లో ఆరుద్ర అంత్యప్రాసలు చాలా చమత్కారంగా వాడారు...

కూనలమ్మ పదాల్లో ఆరుద్ర అంత్యప్రాసలు చాలా చమత్కారంగా వాడారు...

ఏక పత్నీవ్రతము
ఎలుగెత్తు మన మతము
వేల్పు భార్యలో! శతము...
ఓ కూనలమ్మా!
--ఆరుద్ర

ఏదో ఆశువుగా వ్రాసింది

కలలు తెలియని వాణ్ణి
కదిపింది ఒకవాణి
మనసాయెనే ఖూనీ
ఓ కూనలమ్మా!
--శ్రీనివాసమౌళి

Abhishek Matta said...
This comment has been removed by the author.
Abhishek Matta said...

హృదిమృదులకంకణాపృతనంతరాళ దీర్ఘమృగణాన శ్రవణించు మృత్యుపంజరి రవళి
పృథికృతులంకనాశృంఖలాలంకులాల విప్రకృష్టమాన ఉపశృతించు త్యాజ్యదుర్ఝరి సరళి

కన్నీటివానా, పన్నీటిఖానా
ఏకాంతసోన, అమాసవీణ!
రేగు వెన్నెల జాబిలమ్మా కలలవిరులను కోయకమ్మా
తూగు కన్నుల కొలనిలోన తీపితీగలు తిలకవమ్మా

మనసులో వేవెతలు మెదులు స్వరజతులు కదులు
వయసులో విలయములు పొరులు శక్వరులు దొరులు
మరి మనసేమో నిను చూడగ మౌనరాగమందునే
హృదివయసేమో అలలెరుగని నావలాగనుండునే

చెలియా శ్వేతాబరియా ప్రియరమ్యా నీలాలసుజన్యా
చెంత చేరవోయి కావిచంప మోవికీవోయి
అదిరే అధరమున పారిజాతన్నల్లవోయి...