Wednesday, December 7, 2011

శ్రీరామరాజ్యం పాటలు - 1

(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)

శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి  పాట గురించి కూడా చెప్పాను.

శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.

1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!

ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
  • "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
  • "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
  • "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
  • "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
పాట మొదటి చరణం ముందు వచ్చే వాయిద్యాల సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఇళయరాజకు తప్పితే ఇంత ఆర్ద్రత కలిగించే సంగీతం ఎవరికి సాధ్యపడుతుంది అనిపించేలాగ ఉంది.

2. శ్రీరామ లేరా ఓ రామ!
    ఈ పాటలో ఒక్క వాక్యాన్ని విడిచిపెట్టడానికి వీలు లేకుండా చేసేసారు జొన్నవిత్తుల. వాల్మీకి రామాయణం చదివితే రాముడి గురించి ఏమనిపిస్తుందో అలాగే ఉంది ఈ వర్ణన. ఒక్కో వాక్యమూ కడిగిన ముత్యం.
    • "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి"  - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
    • "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
    • "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
    • "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
    • "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
    • "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
    • "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
    •  "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
    • "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.

    3. ఎవడున్నాడీ లోకంలో

    ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.

    వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.

    • "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
    • "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు. 
    • "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
    • "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
    4. గాలి నింగి నీరు

    "ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!

    "గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.

    "విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం"  అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).

    "అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!

    "సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?

    5. సీతా సీమంతం

    పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.

    ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.

    "ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.

    6. రామ రామ రామ అనే రాజమందిరం

    చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.

    నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.

    ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
    • "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
    • "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
    • "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
    • "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
    • "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
    • "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
    రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.


    ఇంకా ఉంది...

    17 comments:

    Manasa Chamarthi said...

    చాలా బాగుంది సందీప్! ముఖ్యంగా ఆఖరున ప్రస్తావించిన పాట వింటునప్పుడు నాకలానే అనిపించింది, చిన్ని రాముడి అల్లరి చెప్తూ కథంతా విప్పేస్తారా ఏమిటీ అని. అదొక అందమైన ప్రయోగం. మిగతా భాగాల కోసం ఎదురు చూస్తుంటాము.

    9thhouse.org said...

    తేపతేప అంటే తడవతడవకీ / మాటిమాటికీ అని అర్థం అనుకుంటా

    శ్యామలీయం said...

    మనమున కెయ్యది నచ్చిన
    కనబడు నద్దానియందు ఘనతలె ఘనమై
    మనమొప్పని విషయంబున
    కనబడు దోసములు కోటి కంటె నధికమై.

    బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

    Excellent review.

    కర్ణాటక రాజ్యం ఏర్పడలేదన్న విషయంలో మీరు పొరబడుతున్నారేమో.కర్ణాట ప్రస్తావన పురాణాల్లో కూడా ఉందని చదివాను.

    http://en.wikipedia.org/wiki/Etymology_of_Karnataka

    in Canto 5 - Chapter 6 of the Bhagavata Purana, Karnata is mentioned while narrating the life of Rishabhadeva. It is said in the Bhagavata that the Lord in Rishabhadeva's form ended his avatara in the Kutakachala hill in Karnata province. Kutakchala is a hill in present day Karnataka near Kollur in the Western Ghats.

    ఋషబదేవుడు సాక్షాత్తూ విష్ణ్వాంశ సంభూతుడు.

    Sandeep P said...

    @మానస:
    శ్యామలీయం గారు చెప్పినట్టు మన మనసులో లీనమైన విషయమే ఆ పాటలో కనిపిస్తోందేమో.

    @నాగమురళి:
    మీరు అన్నది నిజమే కావచ్చును. నాకూ తెలియదు. మఱెవరికైనా తెలుస్తుందేమో చూద్దాము.

    @శ్రీకాంత్:
    మీరన్నది నిజం అయి ఉండచ్చును. నాకు తట్టిన విషయం జొన్నవిత్తుల గారికి తట్టకుండునా? online మహాభారతంలో కర్ణాట, కర్ణాటక కనబడలేదు కానీ భాగవతంలో కనబడ్డాయి. ఈ లెక్కన ఆ పదానికి మూలం కర్ణాట అయి, కర్ణాటకం దాని నుండి వచ్చినదై ఉండాలి. కానీ, రామాయణంలో కర్ణాటక ప్రస్తావన ఎక్కడా లేకపోవడం చేత, నాకు ఇది మునుపు లేదేమోననిపించింది. సవరణకు నెనర్లు.

    @శ్యామలీయం:
    చక్కగ చెప్పితిరి తమరు
    ఎక్కువగా మనసులోన ఎగసే విషయం
    ఎక్కడ చూసిన కనబడు
    చుక్కలు మొదలుకొని నీటి చుక్కల వరకున్!

    (పద్యం బొత్తిగా వ్యావహారిక భాషలో ఉంది, మీ పద్యానికి తూగేది కానే కాదు, క్షమించాలి).

    శ్యామలీయం said...

    మీ పద్యంకూడా బాగుంది, వ్యావహారికభాషలో ఉంటేనేం? నాకా పట్టింపు లేదు. ఉన్నవాళ్ళ కోసం లక్షణభాషలో తిరుగ వ్రాస్తే, మీ పద్యం యిలా ఉంటుంది:
    చక్కగ మీరిది చెప్పితి
    రెక్కువగా మనసులోన నెగసెడు విషయం
    బెక్కడ చూసిన కనబడు
    చుక్కలు మొదలాడి నీటి చుక్కల వరకున్!
    మీక్కూడా యీ వెర్షన్ నచ్చుతుందనుకుంటాను.

    ఆ.సౌమ్య said...

    చాలా బాగా రాసారు సందీప్. శ్రీరామరాజ్యం పాటలు నాకెంతో నచ్చాయి. తేలికైన పదాలలో గొప్ప అర్థాన్ని స్ఫురింపజేసారు కవి. మీ వివరణ బావుంది.

    జగదానందకారక, శ్రీరామ లేరా ఓరామ, రామ రామ మాటలు నాకు బాగా నచ్చాయి. మిగతావి మచ్చున్నవని కాదుగానీ మచ్చుకి చెబుతున్నా!

    ఎల్లరికీ చలచల్లనివాడు - నాకిక్కడ పింగళి గుర్తొచ్చారు. ఇటువంటి భాష ఆయన వాడేవారు. - "కలువకనుల చల్లని సిరి, ఉల్లములో ప్రేమలహరి"

    తేప తేప తియ్యనంట - తేప అంటే చిన్నపిల్లలకి లాలాజలం ఒకపక్కనుండి కారుతుంటుంది, వాళ్ళకి దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలీదు. పడుకున్నప్పుడు ఎక్కువగా కరుతుంటుంది. అదెంతో ముద్దుగా ఉంటుంది...తేప కారిపోతున్న పిల్లలని చూసి ముసిముసిగా నవ్వుతూ "అయ్యో తేప కారిపోతోంది" అని మురిపెంగా తుడుస్తాం. ఆ అర్థంలో వాడినట్టు నాకు తోచింది.

    శ్యామలీయం said...

    అసలు నేను మనమున కెయ్యది నచ్చిన... అంటూ యెందుకు వ్రాసానూ అంటే, నాకు యీ శ్రీరామరాజ్యం సినిమాని మెచ్చటం మాట అటుంచి అంగీకరించటం సాధ్యపడటమే లేదు. మందారమకరంద మాధుర్యమున తేలు మధుపంబు వోవునే మదనములకు అన్నట్లుగా నాకు లవకుశ చూసిన కళ్ళతో యీ శ్రీరామరాజ్యం చూడటం వల్లకాని పని అయిపోయింది. పోల్చి చూడవద్దనటం తేలికే. కాని యెందుకు పోల్చరాదో నాకు బోధపడటం లేదు. ఒక రీమేక్ సినిమా ఒరిజినల్ సినిమాతో యెందుకు పోల్చబడదు? (1963ముందు కూడా 1934లో కాబోలు ఒక లవకుశ వచ్చింది, కాని మనకు అందుబాటులో లేదు) నా మట్టుకు నాకు యే అంశంలోనూ బాపుగారి శ్రీరామరాజ్యం పుల్లయ్యగారి లవకుశ ముందు నిలబడేదిగా అనిపించలేదు. స్థాలీపులాకన్యాయంగా సినిమా ప్రచారంకోసం టివిలో చూపుతున్న, రేడియోలో హోరెత్తించుతున్న పాటలుగాని, క్లిప్పింగులుగాని నాకైతే ఆకట్టుకునే స్థాయిలో కనబడలేదు. శ్రీరామరాజ్యం చూసి ఆనందించే వాళ్ళను నేను ఆక్షేపించటంలేదు. కాని, నభూతోనభవిష్యతి అన్నట్లు ఆకాశానికి యెత్తెయ్యటం హర్షించలేకపోతున్నాను. ఒకటి రెండు బ్లాగుల్లో శ్రీరామరాజ్యంలో పద్యాలు లేకపోవటానికి యీరోజుల్లో ప్రజలకు అర్ధం కావని వింత సమర్ధన చూసాను. 1963లో కన్నా యిప్పుడే చదువరుల శాతం హెచ్చుగదా? అప్పట్లో ఆబాలగోపాలాన్ని ఉఱ్ఱూతలూగించిన తెలుగు పద్యం యిప్పుడు ప్రజలకు చేదై పోతుందా? నిజమేమిటంటే, సినిమా దర్శకనిర్మాతల దృష్టిలో చక్కగా పద్యాలు ఆలపించగల గాయనీగాయకులు వాటికి సరైన హావభావాలు జోడించగల నటీనటులు లేకపోవటమే. ఇలా అన్ని విషయాల్లోనూ ఘోరంగా రాజీపడి ఒక యావరేజి స్థాయి సినమా తీయటం జరిగిందని నా అభిప్రాయం. అందుకే (అంటే ఆ అబిప్రాయం యేర్పడటం వలననే అని) దీనిని చూడబుధ్ధి వేయటం లేదు. నిజానికి యీ పొగడ్తలు చూస్తే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది.

    శ్యామలీయం said...

    "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" అన్నదాంటో సారస్యం అనుమానాస్వదం. నాకు తెలిసి రాముడు దర్భను మంత్రించి కాకాసురునిపై విసిరాడు. రామాయణానికి రకరకాల కవులు రకరకాల కల్పనలు చేసారు. యెవరైనా వజ్రపుటుంగరం అన్నారేమో తమ రామాయణకృతిలో , నాకెరుకలేదు.
    సౌమ్యగారూ, నాకు తెలిసినంత వరకు, "తేప" అన్నమాటకు మీరిచ్చిన అర్ధం నిఘంటువుల కెక్కలేదు. పాటలో "తేప తేప తీయన" అన్నచోట కవి(?) హృదయం, "తేపతేపకు తీయన" అని ఉండవచ్చుననిపిస్తోంది.

    Sandeep P said...

    @శ్యామలీయం

    మీరన్న మాటల్లో నిజం ఉంది. నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు అభినందనలు.

    లవ-కుశలో ఉన్న పద్యాలు ప్రజలకు అర్థమయ్యాయా? లేక ఊరికెనే గంభీరంగా ఉంటే మెచ్చుకున్నారా? అన్నది సందేహం. ఉదాహరణకు ప్రముఖవ్యాఖ్యాత శ్రీ MBS ప్రసాద్ అవి తమ కాలంలో ఎవరికీ అర్థం కాలేదని వ్రాసారు.

    ఇప్పటి ప్రజలలో అక్షరాస్యత ఎక్కువ అనుకుంటున్నాం కానీ, అది ABCD అక్షరాస్యత. అచ్చ-తెనుగు అక్షరాస్యత కాదు. పూర్వం కనీసం పద్యాలు, పాటలూ నేర్చుకోవడం వలన తెలుగు తెలిసేది. ఇప్పుడు అంతా TV, cinema అయిపోయి తెలుగు సరిగ్గా తెలిసినవాళ్ళే కొదవయ్యారు. ఉదాహరణకు మీరు అన్న స్థాలీపులాకన్యాయం అంటే ఏమిటొ తెలుసుకోవడానికి నేను Internetలో వెదికి చివరకు ఇది తర్కశాస్త్రంలో సైతం వాడిన ఒక పద్ధతి అని తెలుసుకున్నాను. మీబోంట్లకు ఇది దైనందినజీవితంలో వాడుకునే పదం అయ్యి ఉంటుంది.

    ఈ తరానికి విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎక్కదు. ఉదాహరణకు రాఘవేంద్ర రావ్ తీసిన చిత్రాలు చూడండి: అన్నమయ్యలో అసలు విశిష్టాద్వైతం గురించి కానీ, అన్నమయ్య గురువు గురించి కానీ చెప్పలేదు కానీ రాజుని ఉత్తపుణ్యాన దుయ్యబట్టారు. రామదాసు చిత్రంలో కబీరు దాసును పట్టుకొచ్చారు -- అసలు వాళ్ళిద్దరికీ ఏమీ సంబంధం లేదు. ఇక పాండురంగడు చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాకు ఇవేవీ నచ్చలేదు. అయినా ప్రజలు వాటిని ఆదరించారు -- ఎందుకంటే వాళ్ళకు సులువుగా అర్థమయ్యాయి అని. శ్రీరామరాజ్యం చిత్రం కూడా ఇలాగే తీసి నన్ను ఇబ్బంది పెడతారు అనుకున్నాను. కానీ అంత దూరం తీసుకెళ్ళలేదు.

    నాలో ఉన్న చరిత్రపిపాసికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమంలో ఉండటం సరి కాదు అనిపించింది. అది యే ప్రతిలోనూ లేని అంశం అనుకుంటున్నాను. ఇక అసలు ప్రశ్న ఉండనే ఉంది: రామాయణంలో ఉత్తరకాండ ఉందా? లేక అది తఱువాత కలిపినదా? అన్నదే ఆస్తికులకు, నాస్తికులకు సైతం ఒక సందేహంగా ఉంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే బోలెడు -- బాలకృష్ణ ముఖంలో ముసలిదనం, ఇళయరాజ కొన్ని కొత్త సంగీత వాయిద్యాలను వినియోగించడం, నటుల వెనుక బాపు గీసిన ఒక స్వీయచిత్రం కనబడటం మొ. ఇరకాటలున్నాయి.

    చివరికి నేను చూసినది ఒకటి: అమ్మాయిలను శృంగారపు బొమ్మలుగా, అశ్లీలతను హాస్యంగా, డబ్బును మాత్రమే గౌరవించి చిత్రాలు తీసే ఈ కాలంలో ఎక్కడా అశ్లీలత లేకుండా, జుగుప్స కలిగించకుండా, కథలో భావం కనుమరుగవ్వకుండా రామకథను తీయగలరా అని. ఆ విషయంలో బాపు మంచి ప్రయత్నం చేసారు అనిపించింది. ఇది పాత లవ-కుశ లాగ classic అనను కానీ, మంచి చిత్రం.

    లవ-కుశలో ఉన్న రామయణగాధ పాటలకు ఈ చిత్రంలో పాటలు తూగవు. మిగతా పాటల్లో భావం నాకు బాగుంది అనిపించింది.

    వజ్రపుటుంగరం బహుశా కవి ఊహే అయ్యి ఉండవచ్చును. నా పద్యాన్ని సవరించినందుకు నెనర్లు :)

    శ్యామలీయం said...

    స్థాలీపులాకన్యాయం అన్నమాట మిమ్మలిన యిబ్బంది పెట్టినందుకు విచారిస్తున్నాను. తెలుగులో 'అన్నం మెతుకు ముట్టుకుంటే చాలదా' అన్న నానుడి ఉంది కదా, అలాగన్న మాట.

    వ్యాఖ్యాత ప్రసాద్ గారు లవకుశలోని పద్యాలు ఎవరికీ అర్థం కాలేదని యెందుక వ్రాసారో. కంకంటివారి సీతాపరిత్యాగం, దువ్వురివారి కృషీవలుడు మేం పాఠశాలలో చదివాము. మాకు బాగానే అర్థమయాయే మరి. కురక్షేత్రంపరుతో పాండవోద్యగవిజయాలు ఊరూరా నాటకాలు నడిచేవి, చెల్లియో చెల్లకో వగైరా పద్యాలు గొడ్లకాపరివాళ్ళుకూడా తన్మయత్వంతో పాడగా విన్నాను.

    పాండురంగడు చిత్రం చూసి, నేనూ మాకుంటుంబం యెంతగా 'hurt' అయామంటే, యింటికిరాగానే పాండురంగమాహాత్మ్యం చేసి సేదతీరాం. నాగార్జున నటించిన అన్నమయ్య, రామదాసు కూడా నాకేమీ నచ్చలేదు.

    హనుమంతుడు వాల్మీకి ఆశ్రమంలో ఉండటం సరి కాదు అని మీరూ నేనూ అనటంకాదు, ఇంటరు తప్పిన మా కారు డ్రైవరుకూడా సీరియస్ గా విమర్శించాడు. ఆతని తండ్రికూడా బాపూ అభిమాని, యీ చిత్రంచూసి కొడుక్కి ఫోన్ చేసాడు 'యేం బాగాలేదురా' అని. బాపుకి రామకథను వేయిసార్లితీసినా తనివి తీరదు - దురదృష్టం యేమిటంటే అతనికి తగిన టీమ్ దొరకదు యిప్పుడు. ముందు సంగతి అంటారా, నందో రాజా భవిష్యతి.

    ఇకపోతే, రామాయణంలో ఉత్తరకాండ ఉందా అన్న ప్రశ్న. రామాయణం ఆరుకాండలే. 'ఉత్తర' (post)అన్నమాటే తెలిపుతోంది కదా!.

    రామదాసు చిత్రంలో కబీరు దాసును పట్టుకొచ్చారు అన్నారు. నాగయ్యగారి భక్తరామదాసులో గూడా అలాగే తీసారు. అన్నట్లు ఒకసారి దూరదర్శన్ వాళ్ళు భక్తరామదాసు ప్రసారం చేసారు లక్ష కత్తిరింపులతో - యేదో డాకూ రాందాస్ లాగా వేసారు. అన్నాడొకాయన - ఎందుకంటే రామదాసుగారు అలా జైలుకు వెళ్ళి ఇలా వచ్చేస్తారు మరి - ఒక్క పాటైనా పాడకుండా!.

    రవి said...

    సందీప్, రె. కాఘవేంద్రరావు విశిష్టాద్వైతం గురించి చెప్పలేదంటారేంటండి? అన్నమయ్య సినిమాలో ఒక సీన్లో అన్నమయ్య నుదుటన నామాలు అనిమేషన్ ప్రక్రియలో 90% తిరిగి ఊర్ధ్వపుండ్రాలుగా మారుతాయి. గమనించండి. అదే విశిష్టాద్వైతమంటే. రాఘవేంద్రరావు సినిమాలు అచ్చ కామెడీ సినిమాలు.వాటిని విమర్శిస్తే సహించను నేను.

    శ్యామలీయం said...

    రవిగారన్నారే, అదే కామెడీ అని, పదకవితా పితామహులు సాక్షాత్ శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారి మీద కామెడీ సినిమా తీయటం అనే గొప్ప అధునాతన ప్రయోగానికి శ్రీరాఘవేంద్రరావుగారిని తప్పక అభినందించాలి. అలాగే, ఈ అన్నమయ్య సినిమా చూడనందుకు నన్ను నేను అభినందించుకోవాలేమో! (గమనిక: చూసినవారిపై నేను సానుభూతి యేమి వ్యక్తం చేయటం భావ్యం కాదనుకుంటాను. ఎందుకంటే, అది నచ్చిన వాళ్ళనేక మంది ఉంటారని, ఉన్నారని; పైగా చూడనందుకు నాపైన సానుభూతి వ్యక్తం చేయగలరనీ నాకు తెలుసును.) ఒక వేళ అన్నమయ్య సినిమా కామెడీ కాకపోతే శుభం. ఇబ్బందే లేదు.

    శ్యామలీయం said...

    అన్నట్లు, లవకుశ చూడని ఒక పెద్దమనిషి రివ్యూ చూడండి 'ఆలోచనాతరంగాలు' బ్లాగులో. లింక్ http://teluguyogi.blogspot.com/2011/12/blog-post_09.html

    Sandeep P said...

    @శ్యామలీయం

    సత్యనారాయణ శర్మ గారి విమర్శలో బాగుంది. ముఖ్యంగా మన పురాణాలను చలనచిత్రాల కోసం ఎడా పెడా మార్చేయడం మంచి పరిణామం కాదు.

    నేను ఈ టపలో వ్రాసినట్టుగా ఈ పాటలు మొదట విన్నప్పుడు నాకూ, "అరెరె, ఇంత సులువుగా వ్రాసేసారేమిటి?" అనే అనిపించింది. కాకపోతే, ఈ తరానికి అంతకు మించిన గ్రాంథికం అర్థం కాదు. వాళ్ళకు "మామూలు" పాటలు మాత్రమే ఎక్కుతాయి. పాటలు ఇలాగైనా ఉండబట్టే కొన్ని చోట్ల వినబడుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఇక ఇళయరాజ సంగీతం పైన విమర్శని నేను కొంతవరకు ఒప్పుకున్నా, ఇదే కారణం చేత అది సమర్థనీయం అని అనుకుంటున్నాను.

    కొత్త పాళీ said...

    బాగుంది సందీప్. తేపతేపకీ అంటే మాటిమాటికీ, రిపీటెడ్ గా అని.

    శ్యామలీయం said...

    Bertrand Russell గారి గురించి వినే ఉంటారు. ఆయన వ్యాసం ఒకటి Book of an hour and book of all time అనేది చిన్నప్పుడు డిగ్రీలో పాఠ్యాంశంగా చదివాను. దాని సారాంశం యేమిటంటే కళాసృష్టి యొక్క లక్ష్యం ప్రజలయొక్క సంస్కారపరిధిని విప్స్త్రృతం చేయటం అని. అందుచేత ఆయన సిధ్ధాంతీకరించినది యేమిటంటే ప్రజల పరిధి సంకుచితంగా ఉందనే వంకతో రచయితలు దిగజారి (భాష, విషయం వగైరా దేనిలోనైనా సరే) వ్రాయరాదని. ఈ సిధ్ధాంతం అన్ని కళలకూ సామాన్యంగా వర్తిస్తుంది. చలన చిత్రాలు మినహాయిపు కాదు.

    శ్రీశ్రీగారు ఒకచోట వ్రాసిన మాటలు. విశ్వనాథరామాయణం నిలబడదు, మొల్లరామాయణం నిలబడుతుంది కాలానికి అని. అలా జరుగుతున్నాదా? విశ్వనాథ యెలాగూ పాషాణపాకప్రభువు కాబట్టి యేనాడూ ఒకపట్టాన కొరకుడుపడే రకం కాదు. శ్రీశ్రీ అభిప్రాయం ప్రకారం సులభమైన భాష కారణంగా మొల్లరచన నిలబడాలే! కాని తెలుగువారు పద్యం అనేది యేదో పండితవ్యవహారం అనే అభిప్రాయానికి వచ్చేయటం వలన, మొల్లరామాయణం కూడా మరుగున పడిపోయింది. ఒకప్పుడు అంది యిండ్లలో పోతనగారి భాగవతగ్రంధం ఉండేది. కనీసం దశమస్కంధమైనా. నూటికి నూరుమందికీ అర్ధం అయేదని నేనూ అనలేను - కాని హెచ్చుమందికి చాలా పద్యాలు కంఠగతంగా ఉండేవి. ఈరోజున మందారమకరంద.. పద్యమైనా దాదాపు యెవరికీ రాని పరిస్థితి. కళాసృష్టలు యేమిచేయాలి, ప్రజలమీద వంకపెట్టి దిగజారుడు తనానికి స్వయంగా పూనుకోవటమా? వేరే అవకాశం ఉందా వాళ్ళకి?

    1963లో లవకుశ వచ్చినప్పటికీ యిప్పటికీ సామాన్యప్రజకు గ్రాంధికం సరిగా అర్ధంకాదనే విషయంలో మార్పులేదు. ఏమీచదువుకోని మా బంధుగణం మరియు నా యెరుకలోని యితరులూ లవకుశను ఆదరించి బ్రహ్మరధం పట్టటానికి నాకు తెలిసిన కారణాలు రెండు. ఒకటి భగవత్సంబంధమైన కథ కావటం. రెండు కనులవిందుగా ఉండి చూసి అర్ధం చేసుకోవటానికి సులభంగా ఉండటం. గ్రాంధికభాషలో సంభాషణలూ, సలక్షణమైన పద్యాలూ యేమీ అడ్డుకాలేదు. అప్పట్లో ఊరూరా గణపతినవరాత్రులకు నాటకాలు వేసేవారు ప్రతిరోజునా. వాటిలో కూడా గ్రాంధికమే అన్నిటా. ప్రజలంతా హాయిగా చూసే వారు. అందుచేత రోజులు మారాయనీ యీ రోజున గ్రాంధికం ప్రజలకు నచ్చదనీ అనుకోనవుసరం లేదు.

    ఈ మధ్య ఒక దిక్కుమాలిన trend ఒకటి మొదలయింది. సినిమాపాటలు వ్రాసినవాళ్ళు అవి యెంత నాసిరకంగా ఉన్నా సరే, కొంచెం ప్రజలలోనికి వెళ్ళుతున్నట్లు అనిపుంచగానే, ఆ గొప్ప పాట(ల)ను యెంత ఆలోచనతో, యెంత గొప్పగా వ్రాసిందీ స్వయంగా పత్రికలలో వ్రాసాలు వ్రాసుకోవటం. ఈ ధోరణి దాదాపు సాహిత్యరంగమంతా యెంతో కొంత అలుముకుని ఉన్నది. ఇది నాకు చాలా వెగటుగా అనిపిస్తోంది. రచయితలూ యితర కళాకారులూ నూటికి నూరుపాళ్ళూ వ్రాపారధోరణికి రావటం శుభపరిణామం కాదు.

    డబ్బు సంపాదించినదే ఉత్తమకళ అంటే యే కళకూడా దాని యొక్క అసలు స్వరూపాన్ని పోగొట్టుకోకుండా ఉండలేదు. మంది మెచ్చినదే కళారూపం, ఆ మెప్పును వ్యాపార ప్రయోజనాలూ, ప్రచారం జోడించి సాధిస్తాం అంటే కళలు తీవ్రమైన అనారోగ్యవాతావరణంలో తీసుకుతీసుకు చస్తాయి.

    కళల అభివృధ్ది వికాసాల విషయంలో ప్రజలూ, ప్రజల దీర్ఘకాలికసాంస్కృతిక ప్రయోజనాల విషయంలో కళలూ చాలా జాగరూకతతో ఉండాలి.