Monday, January 2, 2012

అందమైన అమ్మాయి (పద్యాలు)

రాత్రి రెండు దాటాక నేను మాట్లాడేదానికే అర్థం ఉండదు (అప్పుడప్పుడు పగలు కూడా). అలాంటిది జాలపౌరులు అందరూ చూడగలిగే బ్లాగు వ్రాస్తున్నాను. ఏమైనా అర్థరహితంగా (అదే, పిచ్చి పిచ్చిగా) అనిపిస్తే క్షమించాలి.

అసలు విషయానికి వస్తే: మొన్న ఒక పూటకూళ్ళయింటికి (restaurant) వెళ్ళాను. అక్కడ తిండిని అందించే ఒక అమ్మాయి వర్ణించలేనంత అందంగా క/అనిపించింది. సరే, ఈ మధ్య మనం కాస్త సృజనాత్మకంగా వ్రాసినది ఏమీ లేదు కదా! "బొత్తిగా తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటదీ?" అనుకుని, డిక్కీలో తొంగున్న నా కవిహృదయాన్ని కాస్త బయటకు తీసి, దుమ్ము దులిపి, బ్రౌహ్ణ్య నిఘంటువుని ఊతగా ఇచ్చి పద్యాలు వ్రాయమన్నాను.  ఇవిగో, ఈ క్రిందివి రాలాయి. చదువర్లకు నా తవికలు నచ్చినా నచ్చకపోయినా, నా ప్రయోగాలకు వారి మనసులు నొచ్చుకోకుండా ఉంటే అదే పదివేలు.

గమనికలు:-

పై వాక్యంలో నచ్చు, నొచ్చు -- ఇది అనుకుని వేసిన ప్రాస కాదు. ఎంత డిక్కీలో ఉన్నా నా కవిహృదయానికి ఇంత డొక్కు భావనలు లేవు అని నా నమ్మకం. డిక్కీ, డొక్కు...హ్మ్...రాత్రి రెండు దాటింది! కంగారు పడకండి, ఈ పద్యాలు రోజూ పడుకునే ముందు ఒక్కొక్కటి చప్పున వ్రాసుకుంటూ వచ్చాను. రెండు దాటాక వ్రాసిన పద్యం సివరాకరి కంద పద్యం ఒకటే.

ఔత్సాహిక కవిని కాబట్టి నా పద్యాలలో ఉత్సాహం కనిపించినట్టు భావం కనిపించకపోవచ్చును. పెద్దలు పద్యాలను సవరించడానికి, ఔత్సాహికపాఠకులకు నా బాధేంటో చెప్పడానికి పద్యాల క్రింద (నేను అనుకున్న) భావాన్ని వ్రాస్తున్నాను.

శా:-
దేవీ యెవ్వరివీవు? యీ పురమునన్ దేవాంగనల్ జొచ్చిరే?
ఏ వైజ్ఞానికుడైన శిల్పములలోనెక్కించెనా ప్రాణముల్?
భావావేశము గల్గి బ్రహ్మ రుచితో భావించి నిర్మించెనా?
నీ విభ్రాజితమూర్తి కీర్తి నుడువన్ నేనెంత వాడన్, కొమా!

భా:- ఓ దేవి, నువ్వు ఎవరివి? ఈ మధ్యన మా ఊళ్ళోకి దేవతలు ప్రవేశించారా? ఎవరైనా శాస్త్రజ్ఞుడు శిల్పాలకు ప్రాణం పోయడం నేర్చుకున్నాడా? భావావేశం కలిగి బ్రహ్మ ప్రత్యేకమైన శ్రద్ధతో నిన్ను మలిచాడా? నీ వెలుగులీనే రూపాన్ని కీర్తించడానికి నేను సరిపోను.

చం:-
సుమములఁ బోలు నీ యధరశోభకు లొంగని వారునుందురే?
తమిగొను వారికిన్ మిగులు దాహము తీరగ దారి యున్నదే?
ప్రమదము కల్గి భంగపడు ప్రాణులలో మగవారి తోటివై
భ్రమపడి యెన్ని తుమ్మెదలు భ్రామరమొందగ వాలె నీ యెడన్

భా:- పువ్వులలా మెరిసే నీ పెదవుల శొభకు లొంగనివాళ్ళుంటారా? నీ మోహంలో పడినవారికి కలిగే పిపాస తీరే మార్గం ఉన్నదా? నీ మాయలో పడి (అనుకున్నది దక్కక) చిన్నబోయిన ప్రాణులలో మగవాళ్ళతో పాటు (నీ పెదవులను పూవులనుకుని మోసపోయిన) తేనెటీగలెన్నున్నాయి?

మ:-
ఎవరా ఈశ్వరుడంచు ప్రేలు మొరకుల్ హెచ్చైన నీ పొంకమున్
అవలోకించిన తత్క్షణంబు మదిలోనజ్ఞానమున్ వీడరే?
స్తవముంజేయరె హేతువాదిగణముల్ సర్వేశుఁ గుర్తించి, సం
భవమే కూర్చగ నిన్ను ఈ ప్రకృతికిన్ పైవాడు లేకుండగన్?

భా:- "ఈశ్వరుడు ఎవరు?" అని పొగరుగా అడిగే మూర్ఖులు ఇంత గొప్ప అందాన్ని చూసి వెంటనే తమకున్న అజ్ఞానాన్ని వదిలేసి, దేవుడున్నాడు అని గుర్తించి ఆయనను స్తుతించడం మొదలెడతారు. పైవాడు లేకపోతే, ఇంత అందమైన నిన్ను తయారుచేయడం (ఆలోచనలు లేని) ఈ ప్రకృతికి వీలౌతుందా?

గ:- చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో గుఱ్ఱం జాషువా వ్రాసిన "గిజిగాడు" పద్యాలు చదివిన స్ఫూర్తి ఇంకా ఉందేమో! అందులో ఒక పద్యంలోని "నాస్తికులు నిన్ను చూసి మనసు మార్చుకుంటారు" అనే భావనని పైన జాతీయం చేసాను.

నిజానికి ఆమెను చూసిన వెంటనే, నా పక్కనే ఉన్న నా నాస్తిక మిత్రుడి వైపు తిరిగి, "ఎవఱ్ఱా దేవుడు లేదన్నది? ఆ అమ్మాయిని చూడు. ఇంత అందగత్తె కేవలం by chance తయారైందా? ఎవరో చెక్కినట్టు లేదు?" అన్నాను :)

ఉ:-
మోహిని చెన్నుకున్ మురిసి మూర్ఛిలినారని దానవాళికిన్
సాహసమున్న రీతి తగు సంయమమేదని యన్నవాడనే!
వ్యాహతునైతి నీ యెదుట, వైఖరి మార్చిన నాదు గుండెపై
ద్రోహము జేసెనంచు మతి దోషము లెంచక నూరకుండె, హా!

భా:- మోహిని అందానికి మురిసిపోయి, మూర్ఛపోయిన రాక్షసులకు సాహసం ఉన్నంతగా సంయమం (మనసును అదుపులో ఉంచుకోవడం) లేదు అన్నవాణ్ణి, నీ అందం ముందు ఓడిపోయి నిలిచాను. నా బుద్ధి మనసు తనకు ద్రోహం చేసిందని చిఱాకు పడకుండా ఉండిపోయింది (మనసు, బుద్ధి ఆమె అందానికి దాసోహం అన్నాయి).

త:-
ఒడలు స్పందన లేకనున్నది ఉన్నపాటుగ మైకమా?
ఘడియ మారక గిపోయెను కాలమాగెన? నా భ్రమా?
ఉడుకు నెత్తురు మంచు ముద్దయెనూడి మేఘము రాలెనా?
నొడవనీయక డ్డుతున్నది నువ్వు వేసిన మంత్రమా?

భా:- ఒళ్ళు తెలియట్లేదు, ఉన్నట్టుండి నాకు మైకం కలిగిందా? గడియలు మారుతున్నట్టు అనిపించట్లేదు - కాలమాగిపోయిందా? లేక ఉత్త భ్రమా? ఎప్పుడూ దూకుడు గా ఉండే నా నెత్తురు చల్లబడిపోయింది. ఆకశంలోంచి మబ్బేమైనా ఊడు నా మీద పడిందా? నేను మాట్లాడ లేకపోతున్నాను -- నువ్వు ఏమైనా మంత్రం వేసావా?

సీ:-
దీపపు కాంతికి తెలినవ్వు మెరిసెనో? 
                          నవ్వుకు వెలిగెనో దివ్వెలెల్ల?
చెక్కిలి వెలుగుకు దిక్కులు రంజిలె
                          ఎవ్విధి పొందితివింత సొగసు?
కనురెప్పలున్నట్టి గండెలు లేవని
                          వింటిని యిన్నేళ్ళు వేయినోళ్ళ!
నీ నీలికన్నుల మీనాలఁ గాచేటి
                          కందెర్లఁ గమనించి కంటి నిజము

భా:- ఈ దీపాల వెలుగుకు నీ నవ్వు మెరుస్తోందో, నీ నవ్వుకే ఈ దీపాలు మెరుస్తున్నాయో తెలియట్లేదు. నీ బుగ్గల ఎఱుపుకు దిక్కులన్నీ వెలుగుతున్నాయి. ఇంత అందం నీకు ఎక్కడిది?

కనురెప్పలున్న చేపలు లేవు అని ఇన్నాళ్ళు అందరూ అంటుండగా విన్నాను. కానీ నీ నల్లని కళ్ళనే చేపలను కాస్తున్న, కను-తెరలు (కనురెప్పలు) గమనించాక నిజం తెలిసింది.

గ:- గండెలు, కందెర్లు -- జై బ్రౌన్ దొర!

ఆ:-
నీవు రెప్ప మోడ్చు నింపాది తాళంబు
నేర్చి నాదు గుండె మార్చె లయను
నడుచు వేళ నీదు నడుమును చూడగ
నటుయిటు కదలాడి యలిసె కనులు

భా:- నీవు నెమ్మదిగా రెప్పలు వేసే "నింపాది తాళం" (ఆది తాళం మీద pun :) ) నచ్చి నా గుండె దానితో పాటుగా కొట్టుకుంటోంది. నువ్వు నడుస్తుంటే కదులుతున్న నడుమును చూడటానికి అటూ ఇటూ ఊగి కళ్ళు అలిసిపోయాయి.

కం:-
కలరే నీయందమునకు
తులతూగే పురుషులిలను? దొరకరె లలనా!
అల వైకుంఠపురములో
కొలువైన హరి సరిజోడు కోమలి నీకున్!

భా:- నీ అందానికి సరితూగే మగవాడు ఈ ప్రపంచంలో దొరకరే అమ్మాయి! వైకుంఠంలో కొలువైన శ్రీహరే నీకు సరిజోడీ.

గ:- పోతన భాగవతం స్ఫూర్తి సుస్పష్టంగా కనబడుతోంది. ప్రత్యేకించి చెప్పక్కరలేదు అనుకుంటాను :)

అమ్మాయి అందాన్ని మెచ్చుకుంటున్నాను కానీ  పిచ్చి పిచ్చి మాటలు, థాటులు (thoughts) లేవనే విషయాన్ని తేటపరచడానికే ముగింపు పద్యంలో "శ్రీమద్రమారమణ గోవిందో హరి!".

10 comments:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

మంచి ప్రయత్నం. రుచి అంటే శ్రద్ధ అనే అర్థముందా? భావావేశం కలిగినప్పుడల్లా మీరిలా పద్యాలు వ్రాస్తారన్నమాట ? మీ చేత ఇన్ని పద్యాలు వ్రాయించిందంటే ఆవిడేవరో మట్టిలో మాణిక్యమై ఉండాలి. మీ భావాల్ని ఆ అమ్మాయికి వినిపించే ప్రయత్నం చెయ్యలేకపోయారా :-)

మందాకిని said...

సందీప్ గారు, అభినందనలు.
ఉత్సాహమొక్కటే కాదండీ, ఎంత అందమైన పదాలు, పదబంధాలు వాడారో, భావాలెంత ఆనందం కలిగించేవిగా ఉన్నాయో!
"దీపపు కాంతికి తెలినవ్వు మెరిసెనో?
నవ్వుకు వెలిగెనో దివ్వెలెల్ల?"
ఈ భావము చాలా కొత్తగా బాగుంది. ఇలాంటి పోలికలు వింటుంటాము.
"అర్థరహితంగా....." అని సంకోచించారు కానీ ఆ చివరి పద్యం ఎంత బాలన్స్ డ్ మైండ్ ఉంటే రాయగలరు!
చాలా బాగున్నాయి. సందీప్ గారి పద్యాల స్థాయిలోనే ఉన్నాయి.
ఇక అవకాశమిచ్చారు కాబట్టి నా సందేహాల లాంటివి కొన్ని.
కొమా అంటే కొమ్మా అని అర్థమాండీ?
నీవు నడచు పదాలను అటుయిటు మార్చి సరిజేసి రాయండి. యతి సరిపోలేదు.
చూడగ నటు అవుతుంది.
పాదం మధ్యలో అ కారం రాకుండా మదిలో నజ్ఞానమున్ అనాలి.

మందాకిని said...

శ్రీకాంత్ గారు, రుచి అంటే మంచి అభిరుచితో అని వారి ఉద్దేశ్యమేమో.

సందీప్ గారు,
ఈ టెంప్లేట్ పెట్టినప్పటి నుంచీ బ్లాగ్ ఒపెన్ కావటానికి చాల టైమ్ తీసుకుంటుంది. ఎందుకో ఏమో శివగారి బ్లాగ్ లో కూడా ఈ టెంప్లెట్ వల్ల బ్లాగ్ ఒపెన్ సమస్య ఉండేది అని నా అవగాహన. ఇపుడు వారు ఏం సవరించారో గానీ సమస్య లేదు. దయచేసి గమనించగలరు.

Narayanaswamy S. said...

NICE!!

రాఘవ said...

అన్నయ్యా, భావనలకేమి తక్కువ? చాలా బాగున్నాయి. పద్యాలు చదువుకోవటానికి తేలికగా హాయిగా ఉన్నాయి కూడ. అర్ధరాత్రి దాటిన తరువాత వ్రాసిన శ్రమ అక్కడక్కడ ముద్రాస్ఖాలిత్యాలరూపంలో తళుక్కుమంటోంది.

Sandeep said...

@శ్రీకాంత్ గారు
రుచి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయండి. ఉదాహరణకు స్వర్ణకమలంలో వినబడే "కొలివై ఉన్నాడే" అనే పాటలో "పలుపొంకమగు చిలువల కంకణములమర, నలువంకల మణి రుచుల వంక కనర(?)" అని రుచి అనే పదాన్ని తేజస్సు అనే అర్థంలో వాడారు. మందాకిని గారు అన్నట్టు ఇక్కడ "అభిరుచి" అనే అర్థంలోనే వాడాను.

ఈ కాలంలో లంగా వోణీ కట్టుకుని గుడికి వెళ్ళే అమ్మాయిలకే పద్యాలు వినిపిస్తే uncle అంటారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలకు వినిపిస్తే రక్షకభటులకు చెప్తుందేమో :)

@ మందాకిని గారు
మీ మంచి మాటలకు, సవరణలకు ధన్యవాదాలండీ. కొమా అనే పదాన్ని కొమ్మ అనే అర్థంలోనే బ్రౌహ్ణ్య నిఘంటువు ద్వారా వాడాను. మీరు చెప్పిన యతిలోపాన్ని సరిచేసాను. అలాగే మధ్యలో అకారాలను తొలగించాను.
ఈ అచ్చు (template :) ) వలన బ్లాగు తెరుచుకోవడం ఆలస్యం అవ్వడం నేనూ గమనించాను. ఇది కాస్తంత javascript తో కూడుకున్న వ్యవహారం కనుక అది తప్పదనుకుంటాను. వేఱే అచ్చులను కూడా ప్రయత్నిస్తాను.

@రాఘవ
ధన్యవాదాలు తమ్ముడా. ముద్రాస్ఖాలిత్యాలు అంటే typo లా? బాగుంది. ఇదే మొదటిసారి వినడం :) నువ్వు గూగుల్ ప్లస్ లో చేసిన సూచనలను కూడా కలుపుతాను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

నాకు వ్యాకరణం తెలియదుగానీ, పద్యం చదివి స్పందించగలిగే మనసుందికాబట్టి ఇక్కడ వ్యాఖ్య రాయటానికి సాహసిస్తున్నాను.

అన్ని పద్యాలూ చదివేందుకు సులువుగా ఉన్నాయి, కొన్నిచోట్ల నువ్వు కింద రాసిన భావం లేకుంటే అర్థంకాలేదు. అన్నీ బాగున్నాయి. సీసపద్యం హైలైట్ :-)
నాకైతే చంపకమాల, మత్తేభము, ఆట"వెలది" బాగ నచ్చాయి.

Sri said...

Chaala bagunnayi Sandeep garu.

Vijay Raghavendra said...
This comment has been removed by the author.
Vijay Raghavendra said...

"పలుపొంకమగు చిలువలకంకణములమర" అనే అర్ధహితమైన వాక్యానికి అర్ధం ఏంటో దయచేసి చెప్పగలరు.