Thursday, October 14, 2010

రూపకాలంకారం (metaphor)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> రూపకాలంకారము

లక్షణం: విషయ్యభేద తాద్రూప్య రంజనం విషయస్య యత్
వివరణ: ఉపమేయమునకు, ఉపమానము తోటి అభేదాన్ని గాని, తాద్రూప్యాన్ని గాని వర్ణించటం 'రూపకం' అవుతుంది. మొదటిది అభేదరూపకం, రెండవది తాద్రూప్యరూపకం.

మనం దేన్ని పోల్చదలుచుకున్నామో అది ఉపమేయమని, దేనితో పోలుస్తున్నామో అది ఉపమానమని ఇదివరకే మనం తెలుసుకున్నాము.

ఉదా: (చంద్రాలోకం)
ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే

ఇక్కడ "మహారాజు" అన్నది ఉపమేయం. "ఈశ్వరుడు" అన్నది ఉపమానం. నిజానికి ఈశ్వరుడు, మహారాజు వేరు వేరు. అయినప్పటికీ "సాక్షాత్తు" అన్న పదం ద్వారా వీరిద్దరికీ అభేదం (తేడా లేకపోవడం) చెప్తున్నాడు కవి. అంటే ఈశ్వరుడిలోని ధర్మాలన్నీ ఈ మహారాజులో ఉన్నాయి అని కవి భావం. ఈశ్వరధర్మాన్ని మహారాజుకు ఆపాదించడం కోసం కవి వీరిద్దరికీ అభేదాన్ని చెప్పాడు కనుక ఇది అభేదరూపకం అవుతుంది.

రూపకసమాసం విగ్రహవాక్యవిధానం తెలిస్తే తాద్రూప్యరూపకం గురించి తెలిసినట్టే. ఈ క్రింది ఉదాహరణ చూద్దాము.

ఉదా: (సౌందరనందం, రచన: అశ్వఘోషుడు)
కామవ్యాథుని చేత మనుష్యహరిణములు చంపబడుచున్నవి.

ఈ ప్రయోగంలో రెండు రూపకాలంకారాలు ఉన్నాయి. మొదటిది: "కామవ్యాథుడు" అంటే "కామము అనెడి బోయవాడు" అని భావం. కామానికి, బోయవానికి ఉన్న తాద్రూప్యాన్ని (similarity) చెప్తోంది కాబట్టి ఇది రూపకలాంకారం అవుతుంది. ఇక రెండవది: "మనుష్యహరిణము" అంటే "మనిషి అనే లేడి". వేటాడబడటంలో (కామము చేత) మనిషికి, (బోయవాని చేత) లేడికి కల తాద్రూప్యాన్ని చెప్తోంది కనుక ఇది కూడా ప్యరూపకాలంకారం అవుతుంది.

ఉదా: (మనుచరిత్ర, రచన: అల్లసాని పెద్దన)
విలోకన ప్రభావీచికలన్ తదీయ పదవీకలశాంబుధి వెల్లి గొల్పచున్

పద్యంలోని ఈ పాదానికి భావం, "చంద్రుని కిరణాల వలన సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడతాయో, అదే విధంగా వరూధిని చూపులు తాకి ప్రవరుని బాట పొంగిపొరలుతోంది", అని. ఇక్కడ "పదవీకలశాంబుధి" అనడంలో పదవికి, కలశాంబుధికి తాద్రూప్యాన్ని చెప్పడం ద్వారా ఇది రూపకాలంకారమైంది.

ఉదా: (అంతర్యామి అలసితి సొలసితి, రచన: అన్నమాచార్యులు)
కోరిన కోర్కెలు కోయని కట్లు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మదిలో చింతలు మయిలలు మణుగులు

ఈ వాక్యాలన్నింటిలోనూ రెండు విషయాలకు అభేదాన్ని చెప్తున్నారు మహానుభావులు అన్నమాచార్యులు.

ఉదా: (రఘువంశసుధాంబుధిచంద్ర, రచన:  పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్)
రఘువంశసుధాంబుధిచంద్ర! శ్రీరామ రామ రాజరాజేశ్వర!

రఘువంశసుధాంబుధి అంటే "రఘువంశము అనెడి అమృతం నిండిన సముద్రం" అని అర్థం. ఆ రెండింటికీ అభేదం చెప్పాడు. అక్కడితో ఆగక, చివరన "చంద్ర" అని చేర్చడంతో "రఘువంశమనే సముద్రానికి చంద్రుడవు" అని శ్రీరాముణ్ణి అనడంతో చంద్రుడి ధర్మాలను శ్రీరామచంద్రుడికి ఆపాదించి తాద్రూప్యరూపకాలంకారాన్ని సమర్పించుకున్నాడు కవి.


మహామహులైన కవులు తమ భావనాబుభుక్షను చల్లార్చుకోవడానికి రూపకాలంకారాన్ని సేవించారు. వారందరి ప్రయోగాలనూ ఒకచోట చెప్పడానికి నాబోటి సామాన్యుడికి రెండుమూడు జన్మలు కూడా చాలకపోవచ్చును.ఇదే అలంకారాన్ని మన చలనచిత్రకవులు కూడా చాలా వాడారు. కొన్నిసార్లు ఉచితమైన సందర్భాలకు వాడితే కొన్ని చోట్ల ఈ అలంకారానికి అవమానం కలిగించే విధంగా వాడారు. మనం ఉచితమైనవే చెప్పుకుందాం.

ఉదా: (పాట: ధన్యోహం ఓ శబరీశా, చిత్రం: శ్రీ అయ్యప్పస్వామి మహత్మ్యం, రచన: వేటూరి)
ఉత్తుంగ శబరిగిరిశృంగా, నిత్యనిస్సంగ, మంగళాంగ, పంపాతరంగపుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగా!

"మునుల యొక్క హృదయములు అనెడి తామరపూవుల మీద వాలే తేనెటీగ" అనే లోతైన భావాన్ని వేటూరివారు సంస్కృతభూయిష్టంగా చెప్పారు.


ఉదా: (పాట: సన్నజాజిమంచమెట్టి, చిత్రం: రాంబంటు, రచన: వేటూరి)
చందమామ కంచమెట్టి,సన్నజాజి బువ్వపెట్టి...




చదువర్లకు తెలిసిన కావ్యాలు, కీర్తనలు, పాటల్లోని రూపకాలంకారాలను గుర్తించి చెప్పగలరని ఆశిస్తున్నాను.

12 comments:

Unknown said...

చాలా మంది చేసిన తప్పునే చేసితివి, సోదరా: "రఘువంశసుధాంబుధి..." రచన పట్నం సుబ్రహ్మణ్యం అయ్యరు, త్యాగరాజు కాదు! (వేటూరి గారు కొంత తికమక పెట్టారు "చిరు-త్యాగరాజు" అని గతంలో ఎవఱూ అనని విధంగా పిలిచి, హీరో గారి పేరు కూడా వస్తుందన్న చమత్కృతి కోసం.)

వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనథుని కవితై వినిపించగా (సీతారామశాస్త్రి, "ఇంద్ర") - తన గీతాన్ని శ్రీనాథుని "కాశీఖండము" కావ్యమే అంటున్నారు కనుక ఇది అభేదరూపకం అనుకుంటాను.
వాగ్దేవి గానం, వంశీరవం, సరసాల సుమనాలు (?) సాక్షాత్తు ఓంకారం (చంద్రబోస్, "పెళ్ళి పీటలు") - అభేదరూపకం
జాజిమల్లి తెల్లచీర కట్టుంటే జాబిలమ్మ వెన్నెలపూలు పెట్టుకుంటే అది నువ్వే నువ్వేనమ్మ నూరుపాళ్ళు! (భువనచంద్ర, "చిన్నబ్బాయి") - అభేదరూపకం

ఇప్పటికివి... తక్కినవి మళ్ళీ చెబుతా... ఇవి సరైనవే అయితే!

కొత్త పాళీ said...

బాగుంది. కిరణ్ సవరణలు, ఇతర ఉదాహరణలు కూడ బాగున్నై.

ఫలాని కొమ్మ సాక్షాత్తూ బంగరుబొమ్మే అనడం కూడా రూపకం అవుతుందని తెలీదు నాకు. రెండూ కలిసేసి సమాసంగా ఉంటేనే అది రూపకాలంకారం (అజ్ఞానాంధకారం, విజ్ఞానదీపం టైప్స్) అనుకుంటూ వచ్చా.

Sandeep P said...

@కిరణ్

నా టపలోని తప్పులను సూచించినందుకు ధన్యవాదాలు సోదరా. ఇప్పుడు సరిచేశాను.

వారణాశిని వర్ణించే...ఇది రూపకాలంకారం అని నాకు అనిపించలేదు. పెళ్ళిపీటలు చిత్రంలోని పాట నేను వినలేదు. జాజిమల్లి తెల్లచీర కట్టుకుంటే - ఇది అభేదరూపకం. ఉదాహరణలకు పునరపి నెనఱ్లు :)

@కొత్తపాళి గారు

మీకు నా ప్రయత్నం నచ్చినందుకు సంతోషం అండి. ఆముక్తమాల్యద మొ. వాటిలోనుండి మీకు తెలిసిన పద్యాలలో ఉదాహరణలను ఏమైనా గుర్తొస్తే తప్పక చెప్పగలరు.

Anonymous said...

"పెళ్ళిపీటలు"లోని ఆ పాట వినమని నీకు అంతకు ముందు చెప్పాను. "యమునాతరంగం, యతిరాజు తారంగం, ఎదలోని తాళం ఒకటే కులం..." అని మొదలయ్యే ఆ పాట చంద్రబోస్ వ్రాసిన అతి చక్కని పాటని _నా_ ఉద్దేశం.

"నెనర్లు" అన్న పదంలో ఉన్నది శకటరేఫం కాదని అంతకు ముందు భైరవభట్ల కామేశ్వరరావు గారు (నా తప్పు) సవరించారు (నీ బ్లాగులోనే).

చింతా రామ కృష్ణా రావు. said...

డియర్ సందీప్! నీ వివరణ; కిరణ్ సవరణలతో అద్భుతంగా ఉంది రూపక అలంకరణ.

Varam said...

sandeep garu ee alamkaram gurinchi inka thelsukovalani undi . mundu enny alamkaralu cheppi appudu okati okati explain chesthe inka baguntunadandi

Sandeep P said...

నమస్కారం వరం గారు

మీరు చెప్పినట్లే ముందుగా అలంకారాల గురించి పరిచయం చేస్తూ ఒక వ్యాసం వ్రాశాను. అది ఇక్కడ చూడగలరు. అలాగే - ఇదివరకు వివరించిన అలంకారాలను ఇక్కడ చూడగలరు.

Trinath Gaduparthi said...

"చంద్రుని కిరణాల వలన సముద్రంలో అలలు ఏ విధంగా ఎగసిపడతాయో"

In this sentence I couldn't help but notice the scientific reason behind the rise of tides due to moon positions. Allasani Peddana, 16th century I suppose.Way before Newton, who explained it in his book Principia.

I have been following your blog for quite sometime. Very nice posts and educative too.

I am not sure if this is "rupakAlankAram". Correct me if I am wrong.

"mullOkAlE jaDa kuppelai"

Movie : sItA rAmayya gAri manumarAlu

Song: Poosindi Poosindi

Lyrics : Veturi (?)

Sandeep P said...

@Musings

మీకు నా టపలు నచ్చినందుకు సంతోషం అండి!

మీరు చెప్పిన ప్రయోగం రూపకమనే నాకూ అనిపిస్తోంది. మరిన్ని అలంకారాలను చర్చించినప్పుడు ఏమైనా వేరేగా అనిపిస్తే చెప్తాను.

Unknown said...

కలహంస నడక దాన, కమలాల కనులదాన

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే

Unknown said...

ok its nice

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ said...

కలహంస నడక దాన అన్నప్పుడు కలహంస వంటి నడక, కమలాల కనుల దాన అనునప్పుడు కమలాల వంటి కనులు అని ఉపమాలంకారము అవుతుంది కదా