Sunday, October 10, 2010

TV చూస్తున్నప్పుడు ప్రేక్షకుల హాస్యభరితవ్యాఖ్యలు

మనం TV చూసేది వినోదం కోసం. సాధారణంగా ఆ వినోదం కేవలం TVలో వచ్చే విషయానికే కాక, మన చుట్టూ ఉన్నవాళ్ళు చేసే వ్యాఖ్యలకు కూడా వస్తుంది. అలాంటివాటిలో నాకు నచ్చిన కొన్ని చెప్దామన్నదే ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

అసలు ఈ విషయం తలుచుకుంటే నాకు గుర్తొచ్చేది పెద్దవాళ్ళే - అంటే బామ్మలు, తాతలు మొ. వాళ్ళు. పూర్వం నాటికలు చూస్తున్నా, కావ్యాలు చదువుతున్నా ప్రేక్షకుడు/చదువరి చాలా నిమగ్నమై చేసేవారు అని అనిపిస్తుంది. వాళ్ళకు కథలోని ఒక పాత్ర ఆవేశాన్ని అనుభవించడం అలవాటేమో. ఇలాంటి వాళ్ళు TV ముందు చేరారంటే, ప్రతినాయకుడికి ఆయుస్షు మూడినట్టే "అమ్మ నీయమ్మకడుపు మాడ", "అమ్మ తత్తుకొడకో", "వీడి అసాధ్యం కూలిపోను", "వీడి బొంద పెట్ట" వంటి వ్యాఖ్యలు అనాయాసంగా, అప్రయత్నంగా వచ్చేస్తాయి. ఇక ధారావాహికలో ప్రతినాయకుడో లేక ఒక చెడ్డ పాత్రో దుస్థితిపాలైతే కర్మసిద్ధాంతాన్ని వీళ్ళే వల్లించేస్తారు. "ఇప్పుడు తిక్క కుదిరిందా దొంగవెధవ. నిరుడు ఏడిపించుకు తిన్నారు కద దాన్ని. దేవుడు బాగా చేశాడు", అని అంటుంటే "వీళ్ళ దృష్టిలో దర్శకుడు దేవుడన్నమాట", అనిపిస్తుంది.

ఈ బామ్మలకి క్రికెట్ అంటే కూడా ఆసక్తి ఉంటుంది. ఏ తెండుల్కరో slipలో ఒక catch పడితే వెంటనే, "అమ్మ నాయనో. పండు పట్టేశాడురా", అంటారు. చిన్నప్పుడు వీళ్ళ కామెంటరీ వినే, మా అన్నదమ్ములం ఎవరైనా పనికిమాలిన shot కొట్టి outఅయితే, "పండి ఇచ్చి పక్కకెళ్ళాడు" అనడం అలావాటైంది. కొంచెం రామాయణభారతాదికావ్యాలను చదివినవాళ్ళైతే క్రికెట్ ఆటగాళ్ళను పౌరాణిక పాత్రలతో పోలుస్తూ ఉంటారు. అగార్కర్ bowling కి వస్తే, "వచ్చాడండి కర్ణుడు. ఇక పరుగులని దానం చేస్తూనే ఉంటాడు, చేతిలో ఎముక లేకుండా", అనడం చూసి నేను పడిపడి నవ్వుకున్నాను.

ఆ మధ్యన ధోనీ bat పట్టుకుని ఎడాపెడా బట్టలుతికినట్టుతికేసేవాడు. జట్టుకు నాయకుడు అయ్యాక నెమ్మదిగా ఆడటం మొదలెట్టాడు. ఇది మా అన్నదమ్ములెవ్వరికీ మింగుడుపడలేదు. ఆ మధ్యన ఒక test match మేమందరం కలిసి చూస్తుండగా ఒక batsman out అయ్యి, ధోనీ వచ్చాడు. అప్పుడు మా తమ్ముడు పక్కనుండి వచ్చి, "ధోనీ ద్రావిడ్ role కి వచ్చాడు, ధోనీ ద్రావిడ్ గా నుంచున్నాడు. ధోనీ ద్రావిడే అయిపోయాడు. ఇప్పుడు మీరు పూర్తిగా ద్రావిడ్ గా మారిపోయిన ధోనీని చూస్తారు", అన్నాడు (చంద్రముఖి cinema పతాకసన్నివేశాన్ని అనుకరిస్తూ).

చిత్రాల్లో నాటకీయతను ఆధారంగా చేసుకుని హాస్యాన్ని పండించడం ఒక ఎత్తు. ఒకసారి ఏదో చిత్రంలో కథానాయకుడిని చంపడానికి పదిమంది దుండగులు వచ్చి కొట్లాటకు దిగుతారు. కానీ నాయకుడు మీదకు మాత్రం ఒక్కోసారి ఒక్కొక్కళ్ళే వస్తారు. ఇది చూసిన ఒక పెద్దాయన, "ఇదేమైనా ధర్మయుద్ధమారా? నలుగురూ కలిసి ఒక దెబ్బేస్తే చచ్చూరుకుంటాడుగా", అని అడిగారు.

చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో ఎదురింట్లో పిల్లలందరూ చేరారు. అప్పట్లో చిరంజీవి నటించిన "దొంగమొగుడు" అనే చిత్రం cassette తెచ్చి చూద్దామని అల్లరి చేశారు. చూశారు, చూశారు పెద్దాయన, ఎంతకీ పిల్లలు మాట వినకపోతే, "దొంగమొగుడూ లేడు, తత్తుకొడుకూ లేడు. పొండిరా వెధవల్లారా. వేషాలేస్తున్నారు", అన్నారు. దెబ్బకు పిల్లలంతా నోరు మూసుకుని మళ్ళీ జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలయ్యేంతవరకు తెరవలేదు.

మన తెలుగు చలనచిత్రాల్లో దాదాపు అన్ని కథలూ మనకు తెలిసినవే మళ్ళీ తీస్తూ ఉంటారు. ఏమైనా అంటే, treatment కొత్తగా ఉంది అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి మా అన్నయ్య చిత్రకథను ముందుగానే ఊహించి చెప్పాడు. అనుకున్నట్టే చివరికి ప్రతినాయకుడు కథానాయకుడి మిత్రుడే. "చూశార్రా? నేను చెప్పినట్టే జరిగింది", అన్నాడు. వెంటనే మఱొక అన్నయ్య లేచి, "ఊరుకోరా...పౌండ్రకవాసుదేవుడిలాగా నీ డబ్బా...అది అందరికీ తెలిసిందే...", అన్నాడు. ఎక్కడినుండో పౌండ్రకవాసుదేవుడిని పట్టుకొచ్చి ఉపమానం చెయ్యడం చూసి నాకు భలే నవ్వొచ్చింది.

ఇహ మొగుడూపెళ్ళాల వెటకారానికైతే లోటేముంది. గీతాంజలి చిత్రం వస్తోంది. మా పక్కింటావిడ ఆ విషయం తెలుసుకుని భర్తతో, "ఏవండీ...గీతాంజలి cinema పెట్టండి. cancer patient లాగా నాగార్జున చాలా బాగా చేశాడు", అంది. వెంటనే ఆయన, "వాడు చేసేదేముందే...ఎలాగా cancer patient లాగే ఉంటాడుగా...", అన్నాడు. (ఇది కేవలం పరిహాసానికి మాత్రమే అని చదువర్లు గమనించాలి...ఏ మొగుడు మాత్రం భార్య ఫలానా hero బాగున్నాడు అంటే ఒప్పుకుంటాడు? :) )

నా చిన్నప్పుడు JD చక్రవర్తి నటించిన చిత్రం ఒకటి "పేరు పెట్టకుండానే" విడుదలైంది. ఆ చిత్రం ఎలాగుందో తెలుసుకోవాలనే కుతూహలంతో నేనూ, మా తమ్ముడు మా పనమ్మాయిని, "లక్ష్మీ! గెడ్డం చక్రవర్తి కొత్త cinema ఎలాగుంది?", అని అడిగాము. దానికి, "ఏ cinema?...ఓ దిక్కుమాలిన cinemaనా?" అంది. పేరుకు నోచుకోని cinemaని "దిక్కుమాలిన cinema" అనచ్చు అనే ఆలోచన మాకెందుకు తట్టలేదా అని మేమిద్దరం రెండు రోజులు బాధపడ్డాము.

కొంచెం ఎదిగాక కుఱ్ఱాళ్ళు (నేనూను :) ) మరీ ముదిరిపోతారు. ఇలాంటి వాళ్ళల్లో మా మిత్రుడొకడున్నాడు. వాడు చిన్నప్పుడు "దాన వీర శూర కర్ణ" చిత్రం పైన సంధించిన హాస్యాస్త్రానికి ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఆ చిత్రంలో బుల్లికర్ణుణ్ణి పట్టుకుని రాధ, "ఏ తల్లి నిను కన్నదో" అని ఒక పాట పాడుతుంది. సి.నా.రే సాహిత్యంతో లలితంగా సాగే ఈ పాట మధ్యలో ఒక చోట "నా వరాల తొలిపంటగా నీవు నా ఇంట వెలశావురా" అని అన్నప్పుడు, పక్కన అధిరధుని పాత్రను ధరించిన చలపతిరావు వచ్చి మీసాలు మెలేస్తాడు. పక్కనుండి నా మిత్రుడు, "అబ్బా...నువ్వెందుకు మీసాలెగరేస్తున్నావు?", అన్నాడు.
 
సూపెర్ స్టార్ కృష్ణ నటించిన అగ్నిపర్వతం చిత్రం చూసే ఉంటారుగా. ఆ చిత్రంలో పదే పదే జమదగ్ని అనే పాత్రలో కృష్ణ "అగ్గి పెట్తుందా?" అని అడుగుతూ ఉంటాడు. అది చూసి చూసి ఒక పెద్దాయన, "అగ్గి పెట్టి కూడా లేదు కుంకా, నువ్వులు జమదగ్నివా?" అన్నారు. నాకు నవ్వాగలేదు.

మనవాళ్ళు పాటల్ని కూడా వదలరు. "ఆనంద్" చిత్రంలో హరిహరన్, చిత్ర పాడిన "యమునాతీరం" పాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోవడానికి వేటూరి సాహిత్యం, రాధాకృష్ణన్ సంగీతం, శేఖర్ కమ్ముల దర్శకత్వం, కమలిని ముఖర్జీ అభినయం మొ. కారణాలు ఉండేవి. ఆ తఱువాత మా అన్నయ్య వ్యాఖ్య అన్నిటికంటే పెద్ద కారణమైంది. గమనిస్తే హరిహరన్ "మనసు కథా" అని ఒక్కోచోట ఒక్కోలాగా పాడతాడు. వినీవినీ మా అన్నయ్య, "హరిహరన్ పాడుతున్నప్పుడు మనసులో...'ఓరి శ్రోత...నేను ఇందాకటిలాగా అంటాననుకుంటున్నావు కదా? ఈ సారి ఇలా అంటాను చూడూ' అనుకుంటాడా ఏమిటిరా? పాడినట్టు మళ్ళీ పాడడు?" అన్నాడు.

మఱొక సారి ఇళయరాజ స్వరపరిచిన ఒక శ్రావ్యమైన పాట వింటున్నాను (ఏదో చెప్పను). పక్కనుండి నా మిత్రుడు వచ్చి, "ఒరేయ్, ఈ పాట వినరా...తద్దినం మేళాన్ని పట్టుకుని పాటంటాడేమిటిరా ఇళయరాజ?", అన్నాడు. అప్పటినుండి నాకు ఎంతో ఇష్టమైన ఈ పాటని కాస్త వ్యవధినిచ్చి వినాల్సొచ్చింది. నా మిత్రుడొకడు ("పులి" చిత్రం విడుదలయ్యాక) bank నుండి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకున్నాడు. ఆ విషయం మిత్రబృందంతో చెప్తూ, "అయ్యలారా...అమ్మలారా...నా దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టి ఇల్లు కొన్నాను. ఏమైనా అత్యవసరమైన ఖర్చు వచ్చిపడితే నేను మీ గుమ్మాల్లోకొచ్చి రెహ్మాన్ పాటలని పాడతాను", అన్నాడు. "రెహ్మాన్ పాటా?" అని అనుకుంటుండగా..."అదే...'అమ్మా...తల్లే...నోటు-ముత్యాల్ రాల్నియ్యవే...' అని కానీ, 'అమ్మ...అమ్మ...' (హమ్మ...హమ్మ...) అని కానీ పాడతాను", అన్నాడు.

మా చిన్నప్పుడు ఒక ఆట ఉండేది. ఈ ఆటకు మూలం "వివాహభోజనంబు" చిత్రంలో కీ. శే. జంధ్యాల వ్రాసిన ఒక సంభాషణం. ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సుత్తివేలు ఒకరిని ఒకరు నిందించుకుంటూ, "ఒరేయ్, నువ్వు రామాయణంలో శతృఘ్నుడి type. పేరుకే తప్పితే పాత్రేమీ లేదు" అంటాడు ఒకడు. దానికి, మఱొకడు, "ఒరేయ్, నువ్వు భారతంలో దుర్యోధనుడి తొంభైమూడో తమ్ముడివి. నీ పేరు కూడా ఎవరికీ తెలియదు", అంటాడు. అదే ఆధారంగా మా అన్నయ్య, బావ ఒక ఆట మొదలెట్టారు. ఏదైనా చిత్రం రావడం మొదలు...అందులో అస్సలు ముక్కూమొహం తెలియని నటుల పేర్లను ఒకరికి ఒకరు ఆపాదించుకోవడం ఆట. ఆ పరంపరలో దొరికిపోయిన నటులు...శ్రీధర్ (ముత్యాలముగ్గు చిత్రంలో కథానాయకుడు), రాజీవ్ కనకాల (Jr. NTR చిత్రాలు వచ్చేంతటి వరకు చిన్నచిన్న పాత్రలు వేసేవాడు), కీ. శే. రాజా (ధారావాహికలో నటించేవాడు), కీ. శే. అచ్యుత్ (బుల్లితెర megastar) మొదలైనవాళ్ళు. ఇంకా కొంతమంది పేర్లైతే నాకు ఇప్పటికీ తెలియనే తెలియవు. సన్నివేశం మొదలవగానే, "ఒరేఇ..బావొచ్చేశాడురా..." అని మొదలెట్టడం. (ఈ ఆట ద్వారా ఎవరినో అవమానించాలనే ఉద్దేశం లేదు. వాళ్ళకు ఆ వయసులో అంత ఊహ కూడా తెలియదు.)

ఇవన్నీ చూసి/విన్నమీదట నాకు TV చూస్తే మా gang అందరితోనూ కలిసి చూడాలనిపిస్తుంది. లేకపోతే, చూసినట్టుండదు.

11 comments:

రాం చెరువు said...

మయాబజార్(కొత్తది) లొ.. ఒక సన్నివేశం
భూమిక.. హేరో (రాజా) తో..
"నన్ను ఏమండి అని పిలవకు"
వెంటనే సినిమాహాల్లో ఎవరొ వెనుక నుంచి...
"ఆంటీ అని పిలువు" అన్నారు.. అంతే.. హాలంతా... ఘొల్లున నవ్వులు..

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

హహ్హహ..బావున్నాయి మీ కబుర్లు.ఎంతైనా పదిమందితో చూస్తే ఆ మజానే వేరు

శిశిర said...

చాలా బాగున్నాయి మీ కబుర్లు. బాగా నవ్వించారు.

JB - జేబి said...

హహ్హహా! మేమూ ఇంతే!
ధియేటర్లలో, టీవీ చూసేటప్పుడు ఇలా కామెంట్లు/సెటైర్లు వెయ్యడం మాక్కూడ అలవాటు.

'ఒక్కడు ' సినిమాకి వెళ్ళినప్పుడు నాకు, నా మిత్రుడికి చాలా బోరు కొట్టింది. చార్మినార్‌‌పై 'నువ్వేం మాయ చేశావో' పాటముందు భూమిక మహేశ్‌‌ని 'ఆ నెలవంక చూస్తే నీకేమనిపిస్తుంది ' అని అడిగితే నాక్కాలి గోక్కావలినిపిస్తుందని కొంచెం గట్టిగానే అన్నా. మహేశ్ కూడా ఇంచుమించు అదే డయలాగ్ వదిలాడు.

'బామ్మ-క్రికెట్' : మా తాతయ్యలు ఇద్దరూ టీవీలో చెరోవైపు మొహాలు పెట్టి మనవాళ్ళని, అవతలివైపు పాకిస్తాన్ అయితే వాళ్ళని బూతులు తిట్టి, 'అరే మనవాళ్ళెంత కొట్టార్రా?' అని అడిగేవాళ్ళు. మేమేమో 'మీరే వున్నారు తెరంతా, ఇంక స్కోరేం కనిపిస్తుంది తాతయ్యలూ' అనేవాళ్ళం.

కొత్త పాళీ said...

BRILLIANT!!

"అబ్బా...నువ్వెందుకు మీసాలెగరేస్తున్నావు?", అన్నాడు. - ఇది హైలైట్

ఆనంద్ లో నువ్వేనా పాట హరిహరన్ పాడారా? గొంతు తగినంత గంభీరంగా లేదే!

Sandeep said...

@కొత్తపాళి గారు

మీరన్నది నిజమండి. "నువ్వేనా" పాట పాడింది కే.ఎం.రాధాకృష్ణన్. నేను చెప్పాలనుకున్నది "యమునాతీరం" పాట గురించి. ఇప్పుడూ సరి చేశాను.

@అందరూ

టప మీకు నచ్చినందుకు సంతోషం. మీ అనుభవాలు కూడా బాగున్నాయి.

ఆ.సౌమ్య said...

హ హ హ భలే ఉన్నాయి....హరిహరన్ మీద జోక్ మాత్రం సూపరు.
ఇలాంటి ఒక టాపిక్ రాయొచ్చని, రాసి హిట్ చెయ్యొచ్చని నిరూపించారు.congratulations!

ఇలాంటి సంఘటనే ఒకటి నేను పోస్ట్లో రాసాను, వీలైతే చూడండి.
http://vivaha-bhojanambu.blogspot.com/2010/01/blog-post_27.html

శరత్ 'కాలమ్' said...

:)

వేణూరాం said...

కేక పోస్టండీ... ప్రతిపేరా కి (భళ్ళున ) నవ్వుకున్నా... మీరు బోల్డ్ లో పెట్టిన లైన్స్ మళ్లీ, మళ్లీ చదువుకున్నా... టపా రచ్చ..రచ్చ.. :)

నన్ను ఏమండి అని పిలవకు"
ఆంటీ అని పిలువు" .................keeeeeeeevvvvvvvvvvvvvvvvvvvvvvvvvv..:) :)

Spandana Vaidyula said...

Gitanjali cinema chuse mundu nenu Girija patra ki matrame cancer undani anukunnanu. Nagarjuna kuda patient ani telidu. Chusaka

Jogi jogi raasukunte boodida raalindani... Rogi rogi raasukunte (ee chivari maataki kshaminchali) hit cinema raalindanna maata.

Sandeep P said...

@Spandana

:-)