Saturday, July 31, 2010

ఆపరా నీ ఫియాన్సే గోల

నాకు ఒక తమిష్జస్నేహితుడు ఉన్నాడు. వాడు ఒకమ్మాయిని ప్రేమించాడు. పెద్దల అంగీకారాన్ని సంపాదించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఈ పరిస్థితుల మధ్య వాడితో వచ్చిన తంట విచిత్రంగా ఉంది. అదే ఈ టపలో మూలవిషయం.

మేమిద్దరం బెంగుళూరులో ఉన్నప్పుడు వారానికో సాయంత్రం కలుసుకుని ఒక రెండు గంటలు cinema చూసి, కృష్ణా cafe లో దోశలు లాగించి, Corner Houseలో హిమక్రీములనారగించి, ఊరు నిదరోయే సమయంలో తీరిగ్గా, కుక్కలు తిరగని వీధుల్లో నడుచుకుంటూ, ఇందిరా గాంధి పెళ్ళి వెనుక రహస్యాల నుండి "జంతువులకు బట్లేసుకోవాలని ఎందుకు అనిపించదు?" వంటివాటి వరకు అన్ని విషయాలనూ సమగ్రంగా చర్చించుకునేవాళ్ళం. అమెరికా వచ్చాక కూడా అప్పుడప్పుడు కలుసుకుంటున్నాము. కాకపోతే agenda మారిపోయింది. అలాటి సాయంత్రాలలో ఒకటి నిన్నటిది...

సాయంత్రం ఆరు గంటలకు నేను బస్సు దిగి అక్కడే వాడి గురించి నిరీక్షిస్తూ ఉన్నాను. వాడు చెవులో phone పెట్టుకుని మాట్లాడుకుంటూ, "ఇల్లెడీ, నాన్ ఒణ్ణుమే సాపిడల్లె, నెజమా సొల్రేన్ [నేనేమీ తినలేదు. నిజంగా చెప్తున్నాను]", అనుకుంటూ వచ్చాడు. నేను "నిజంగా సొల్లే" అనుకున్నాను. భుజం తట్టి "పద పోదాం" అన్నట్టు సైగ చేశాడు. పది నిముషాలు నడిచాము. ఇంకా phone అవ్వలేదు. ఇంతలో Walmart (departmental store) వచ్చింది. వాడు phone లో, "ఇరు ఇరు, నా అప్ప్రమా కాల్ పణ్ణువేఁ [ఉండు, తరువాత కాల్ చేస్తాను]"  అని పెట్టేశాడు. "మళ్ళీ call చేస్తే, తుపాకితో నిన్ను కాల్చేస్తాను", అనుకున్నాను. నాకేసి తిరిగి, సాంబార్ వాసన వచ్చే యాసతో, "ఎలా వున్నావు?" అని అడిగాడు. "అఘోరించావులే తెలుగులో", అనుకుని; "Walmart లో ఏమైనా కొనాలా?", అని అడిగాను. "చాలా కొనాలి. అసలే నా పెళ్ళి దగ్గరకొస్తోంది. అన్నీ చక్కబెట్టుకోవాలి", అన్నాడు. సరే అని Walmart లోకి వెళ్ళాము.

"ఏం కొనాలి", అని అడగగానే, Leather case లోంచి ఒక phone తీశాడు. వాడికి office లో ఒక blackberry phone ఇచ్చారు. అందులో వాడు కొనాల్సినవాటి జాబితా వ్రాసుకున్నాడు. అది నాకు చూపించాలని తాపత్రయం. నేను ఒక విరక్తియుక్తమైన నవ్వు నవ్వాను. "మొదట ఒక దుప్పటి కొనాలి. చలిగా ఉంటోంది", అన్నాడు. దుప్పట్ల section కి తీసుకెళ్ళాను. అక్కడ వాడు అన్ని దుప్పట్లూ, వాటి ధరలూ చూశాడు. చూసి, "నిజం చెప్పాలంటే, దుప్పట్లు, కర్టెన్లు సంగతి ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. ఈ సారి నా ఫియాన్సేని తీసుకొచ్చినప్పుడు కొనుక్కుంటాను", అన్నాడు. సరే అని, "ఇంకేం కొనాలి", అన్నాను. "Mixer కొనాలి", అన్నాడు. వాడిని తీసుకుని Mixers section కి వెళ్ళాను. నా అనుభవం మేరకు అన్నీ చూపించాను. వాడు "Phone a friend" option వాడుకున్నాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఒక పావుగంట సేపు: మధ్యనం sandwichలో ఎంత cheese వాడారు, Inception cinema చూస్తున్నప్పుడు ఎంతసేపు నిద్రపోయారు వంటి అత్యవసరవిషయాలను చర్చించి, చివరకి నా మీద దయతో "ఏ mixer కొనాలి" అన్న ప్రశ్నపై దృష్టి పెట్టారు. వీడు restaurant లో waiter లాగా అన్ని mixer ల ధరలు, ప్రత్యేకతలు చెప్పాడు. చివరికి, "నేను చూడందే నిశ్చయించుకోలేను", అంది. వాడు నాకేసి తిరిగి, "మాఁవ, తను చూస్తే కానీ చెప్పలేను అందిరా", అన్నాడు. సరేనని అదే విధంగా ముందుకుపోయాము. "నా structure పాడైపోతోంది, running చెయ్యాలి కద, మాఁవ!", అన్నాడు. వెంటనే విషయం అర్థమైంది. ఉన్నట్టుండి మగవాడికి అంత సద్బుద్ధి ఎలాగ వస్తుంది మరి? "సరే, ఇప్పుడేం కావాలి?" అన్నాను. socks కొనాలి అన్నాడు. సరే పద అన్నాను. అక్కడా scene repeat.

చివరికి నా మటుక్కు నేను biscuits కొనుక్కున్నాను. నేను vegan ని కాబట్టి పాలు లేనివి కొనుక్కున్నాను. అవి అంత రుచికరంగా ఉండవు. "నీకూ కావాలా?", అన్నాను. దానికి వాడు, "ఓ! sorry. నేను junk food (చిరుతిళ్ళు) తినడం మానేశాను. ఇందులో అన్నీ carbs ఏ తెలుసునా?", అన్నాడు. మళ్ళీ విషయం అర్థమైంది. "మాఁవ, నాకు అంతటి పరిజ్ఞానం, జిజ్ఞాస - రెండూ లేవు", అన్నాను. Credit card అంటగడదామని ప్రయత్నిస్తున్న ఏజెంటుని చూసినట్టు ఒక చూపు చూశాడు. ఇంటికి వచ్చాము.

"Dinner కి ఏం వండుతున్నావు", అన్నాడు. "నాకు వంట రాదని తెలుసుగా? Sandwich చేస్తాను", అన్నాను. "అందులో ఏం వేస్తావు?" అన్నాడు. "పనీర్ మసాల, ఆలూగోబీ, భెండీ fry - ఏది better అంటావు?", అని వ్యంగ్యంగా అడుగుదామనుకుని, "సరే పెళ్ళి చేసుకుంటున్నాడు వెధవాయ్. పెద్దరికం వహిద్దాము", అని నిర్ణయించుకుని "Garlic sauce, Hummus, Onions, Tomatoes, Peppers", అన్నాను. "Hummus అనగానేమి?", అన్నాడు. Hummus అంటే మన వేరుశనగ చట్నీ లాంటిదే" అని చెప్పాను. "సరే try చేస్తాను", అన్నాడు. నా మానాన వెళ్ళి కూరలు తరగడం మొదలెట్టాక వచ్చి, "నాకు hummus నచ్చదు మాఁవ", అన్నాడు. "నువ్వెప్పుడూ తినలేదు కదా?', అన్నాను. "ఆ అమ్మాయికి నచ్చలేదుట", అన్నాడు. నేను లేని రెండు నిముషాల్లో phone చేసి మరీ కనుక్కున్నాడు అని అర్థం చేసుకున్నాను. Hummus తీస్తున్న చెంచాతో రెండు ముద్దలు తీసి వాడి నోట్లో కుక్కేద్దామనిపించింది. ఆపుకుని, "ఒక ముక్క తిను. నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దాము", అన్నాను. తన ముప్ఫై ఏళ్ళ career లో, ఎల్లపుడూనిజాయితీగా ఉన్న government officer, మొదటి సారి, పై అధికారి ఒత్తిడి వలన తప్పు చేయాల్సొస్తే ఎంత బాధపడతాడొ అంత బాధగా మొహం పెట్టాడు. తరువాత, పళ్ళాలు కడగటం మొదలెట్టాను. వెనుకనుండి వచ్చి, "ఈ brush బాగా రుద్దదు మాఁవ. ఆ అమ్మాయికి ఇది నచ్చదు. పీచైతే better.", అన్నాడు. ఆ brush తో వాడి నాలుకని తోఁవేద్దామనిపించింది. ఊరుకున్నాను.

Sandwich చేశాను. తిన్నాడు. ఒక ముక్క తినగానే లేచాడు. "ఏం, నచ్చలేదా?", అన్నాను. నవుల్తూనే, "బాగుంది" అన్నట్టు తలూపాడు. మంచినీళ్ళకు లేచాడనుకున్నాను. తిన్నగా వెళ్ళి phone తెచ్చాడు. అప్పుడు అర్థమైంది, TV9 updates లాగా, బీవీ-1 updates మొదలెట్టాడని. "ఎన్నడీ, hummus ఒణక్కు ఎదుక్కు పుడికిల? సెమ్మదాఁరుక్కే? [ఏమే? నీకు hummus ఎందుకు నచ్చలేదు? బానే ఉందిగా?]", అంటూ మొదలు. పెట్టినవాణ్ణి నాకు "బాగుంది" అని చెప్పడం మానేసి అదేదో బావిలో పడిపోయిన పిల్లాడి గురించి NDTV update లాగా చెప్పడంతో నాకు నవ్వాలో, చిఱాకు పడాలో అర్థం కాలేదు.

భోజనలయ్యాయి, అరాయించుకోవడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక పాట అందుకున్నాను. వెంటనే, "ఏయ్, నీకూ ఇదే పాట ఇష్టమా?", అన్నాడు. "అదేఁవిటి? వీడికీ పాట ఇష్టం లేదే? నీకూ అని సాగదీస్తాడేంటి?", అనుకున్నాను. వెంటనే, "ఆ అమ్మాయికీ ఇదే ఇష్టం తెలుసునా", అన్నాడు. "దేఁవుడా!" అనుకున్నాను. ఇంతలో వాడి phone మ్రోగింది. వాడికి బాగా పరిచయం ఉన్న, నాకు కేవలం ముఖపరిచయం ఉన్న ఒక స్నేహితుడు phone చేశాడు. వాడు phone మాట్లాడటం మొదలెట్టాడు. వాడి ధోరణిలోనే "అవును మాఁవ. ఆ అమ్మాయి కూడా..." అనుకుంటూ మాట్లాడాడు. ఇంతలో అదే phone లో ఆ అమ్మాయినుండి call వచ్చింది. మాట్లాడుతున్న phone ని నా చేతిలో పెట్టేసి "నా friendతో నువ్వు మాట్లాడు మాఁవ", అన్నాడు.

నాకు ఆ friendతో ముఖపరిచయం అయ్యి ఆరేళ్ళు దాటింది. మేము మాట్లాడుకుని నాలుగున్నరేళ్ళు అయ్యింది. నేను phone తీసుకుని, "హేయ్, ఎప్పిడి ఇరుక్కే? [ఎలాగున్నావు?]", అన్నాను. వాడు దానికి "సందీప్, నేను బాగున్నాను. మీ అక్కకి కఁవలపిల్లలంటగా", అన్నాడు. "స్వామీ, నాకు అక్కాలేదు, ఆవిడ పురుడోసుకోనూ లేదు, కఁవలపిల్లలూ పుట్టనూలేదు. నేను ఆ సందీప్ ని కాను. పీ.ఆర్.కే ని ", అన్నాను. వాడు "ఆఁ, పీ.ఆర్.కే. ఎలాగున్నావు? మీ కుటుంబం బాగుందా?", అన్నాడు. అలాగ రెండు నిముషాలు వరకూ మాట్లాడుకున్నాము. నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడా? అని చూస్తే నా phone లోంచి ఫియాన్సేకి phone చేసి: తన phone వెంటనే ఎందుకు ఎత్తలేకపోయాడు, ఆ phone చేసిన ఫ్రెండ్ ఎవరు? వాడికి అక్కచెల్లెళ్ళున్నారా వంటి ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నాడు. ఇంతలో ఈ phone లోని friend, "ఇంగ్లండ్ ఎలాగుంది", అన్నాడు. "నేను ఇంగ్లండు ఎప్పుడూ వెళ్ళలేదు మహప్రభో", అనగానే "ఐతే నువ్వు శాండీవి కావా?", అన్నాడు. "వామ్మోవ్, నేను నువ్వనుకునే శాండీనైతే కాదు బాబు. ఉండు నాయనా, నువ్వు మన కాలేజీలో ఉన్న అందరు సందీపులనీ cover చేసేలోపుల నా biodata చెప్తాను.", అని మొత్తమంతా చెప్పుకుంటూ వెళ్తే, చివరికి వాడు నన్ను గుర్తుపట్టకపోగా, "ఆఁ! గుర్తొచ్చావు. బాగుంది బాగుంది. నీతో మాట్లాడి చాలా రోజులైంది. సరే phone వాడికియ్యి", అన్నాడు. అది తీసుకెళ్ళి నా friend చేతుల్లో పెట్టగానే వాడు కళ్ళెర్రజేసి ఇంకో చేతులోని phone నా చేతులో పెట్టాడు. అది ఎత్తితే అందులో వాడి ఫియాన్సే. "సందీప్, ఎలాగున్నావు? Hummus మావాడికి నచ్చిందిట. అది చాలా ఆశ్చర్యం తెలుసునా!", అంటూ మొదలెట్టింది. అర్ధరాత్రిలో మద్దెల దరువంటే ఏమిటా అనుకున్నాను. ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. కాసేపటికి రెండు phone లూ పెట్టేశాము.

నేను కాస్త ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టను. ఇంతలో cassette ని side-B కి మార్చాడు. అంటే: వాళ్ళు ఎప్పుడెప్పుడు తగువాడుకున్నారు, మళ్ళీ ఎప్పుడు గొడవాడుకునే అవకాశం ఉంది, అసలు problem అంతా ఎక్కడుంది - ఇత్యాది విషయాలపై ఏకపాత్రాభినయం చేశాడు. రాయబారం సీన్లో రెండోకృష్ణుడి కోసం వేచియున్న ప్రేక్షకుడిలాగా నేను నోరెళ్ళబెట్టుకుని కూర్చున్నాను. అప్పుడు కాసేపాగి, "ఏమిటి మాఁవ, నువ్వేమీ మాట్లాడట్లేదు. ఈ మధ్యన బాగా సైలెంటైపోయావు", అన్నాడు. Question paper లో ఐదే ప్రశ్నలిచ్చి, ఆరో సమాధానం వ్రాయలేదని మార్కులు cut  చేసినంత దారుణమైన ఈ మాట విన్న నేను, బ్రహ్మానందం లాగా ఒకసారి నిట్టూర్చి, "హుఁ, నీకలాగ అనిపిస్తించిందా మహాశయా! ఓ మహర్షీ, ఓ మహానుభావా! అసలు నువ్వు నన్నెక్కడ మాట్లాడనించావు? ఏమైనా అంటే నేను, నా ఫియాన్సే, మా పెళ్ళి, ఆ తరువాత కొనుక్కోవల్సిన వెచ్చాల లెక్కలు, నా బొచ్చు. ఆ అమ్మాయికి ఇష్టమైన Tea brand నుండి TV brand వరకూ అన్నీ చెప్తూ ఉంటే నేనింకేమి మాట్లాడతాను? నువ్వు ఫ్రెండువా, చెవులో పుండువా? నిన్ను భరించడం నా యొక్క వల్ల కాదు బాబూ. త్వరగా నిదురించి నన్ను విముక్తుణ్ణి చెయ్యి.", అని మనసులో అనుకున్నాను. వీటిల్లో ఏ మాట నేను బయటికి అన్నా, వాడికి కోపమొస్తుంది. కాబట్టి "నువ్వు చెప్తున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అందుకే వింటున్నాను.", అని చెప్పి తప్పించుకున్నాను. వాడు మాట్లాడుతూనే పడుకున్నాడు. సహజంగా నా పక్కన ఉన్నవాళ్ళని మాట్లాడనివ్వకుండా లొడలొడా వాగే నాకు తలనొప్పొచ్చేలాగా మాట్లాడిన వాడి వాగ్శక్తికి జోహార్లు చెప్పుకుంటూ నేనూ పడుకున్నాను.

నాకు పరిచయం ఉన్న చాలా మంది అమ్మాయిలు, పెళ్ళి తరువాత నన్ను పలకరించడం తగ్గించేశారు/మానేశారు. వారి వారి పనుల్లో busy అయ్యారులే అని ఊరుకున్నా, అప్పుడప్పుడు "మరీ అసలు పుట్టినరోజుకు కూడా wish చెయ్యట్లేదు ఏమిటి?", అనుకునేవాణ్ణి. నిన్న అర్థమైంది, అదే నయమని.

PS: ఉన్న విషయానికి కొంచెం నా ఊహాశక్తిని జోడించినా, అసలంటూ విషయం మాత్రం ఉందండోయ్!

Sunday, July 18, 2010

మీకు తెలిసిన బండి-ర (ఱ) ఉన్న పదాలు చెప్పండి!

నేను శాస్త్రీ శతకం పేరిట మూడున్నరసంవత్సరాల క్రితం నుండి వ్రాస్తున్న పద్యాలను నిన్న ఒక్క సారి తిరగేశాను. అందులో చాలా వ్యాకరణదోషాలు కనిపించాయి. వాటిలో ఒకటి: ర (సాధు రేఫ), ఱ (శకటరేఫ) కి భేదం చూపకుండా ప్రాస కలపడం. మన తెలుగు వ్యాకరణపుస్తకాలు నిశ్చయంగా చెప్తున్నది ఏమిటంటే, ఈ రెండింటికీ ప్రాస కుదరదు అని. దీన్నే ప్రాసవైరం అంటారు.

ఈ రెండింటికీ ఉచ్చారణలో భేదం ఉంది. అది ఎలాగ చెప్పలో నాకు తెలియదు కాని, 'ఱ' అన్నప్పుడు నాలుక ఇంకా బలంగా మూర్ధాన్ని (నోరు పై భాగాన్ని) తాకుతుంది అని నా నమ్మకం. ఏది ఎప్పుడు వాడాలో తెలుసుకుందామని సోదరుడు రాఘవని అడిగాను. ఆయన ఈ క్రింది విషయాలను తెలిపారు.

  • రఱల భేదాలు తెలుపుతూ సూత్రాలు ఏమీ లేవు. వాడుకని బట్టి గ్రహించటమే మార్గం. ఈ సూత్రాలభ్యం వల్ల పోతన కూడా ఎక్కడ ర వాడాలో ఎక్కడ ఱ వాడాలో సరిగా నిర్ధారించుకోలేక ఇబ్బంది పడ్డారని చెబుతారు.
  • ఉచ్చారణ విషయానికి వస్తే, 'ఱ' కొంచెం నొక్కినట్టుగా పలుకుతాం, 'ర' కొంచెం తేలికగా పలుకుతాం. ముఖ్యంగా ద్విత్వాలు వచ్చినప్పుడు ఈ భేదం ఇంకా బాగా తెలుస్తుంది. 
  • అప్పకవీయంలో ర-ఱ భేదం తెలుసుకోవటానికై ఉపయోగపడేలా రకారం వాడే పదాలూ, ఱకారం వాడే పదాలూ వేఱు వేఱు వర్గాలుగా ఇవ్వబడ్డాయి.

నాకు అప్పకవీయం చదవటానికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపల మన బ్లాగ్మిత్రులకు తెలిసిన 'ఱ' ఉన్న పదాలని సంగ్రహిద్దామని ఈ వ్యాసాన్ని వ్రాస్తున్నాను. నాకు తెలిసిన 'ఱ' ఉన్న పదాల జాబితా ఈ క్రింద ఉంది. మీకు తెలిసినవి కూడా వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

కొన్ని ఉదాహరణలు:
మఱియు, ఇద్దఱు, ఆఱు, చిఱునవ్వు, ఎఱుగు, వఱకు, చెఱకు, తఱచు, మఱి, ఎఱుపు, పిఱికి, అఱుపు, కఱుకు, ఱొమ్ము, గఱి (గరుత్తుకు వికృతి, రెక్క అని అర్థం), చెఱువు

ద్విత్వం ఉన్న పదాలు:
జీలకఱ్ఱ, చిఱ్ఱెత్తు, ఎఱ్ఱని, జెఱ్ఱి, గుఱ్ఱము, కఱ్ఱ, వెఱ్ఱి, మఱ్ఱి, బుఱ్ఱ

కొన్ని పదాలు వస్తువుల చేసే శబ్దాన్ని అనుకరించే ప్రయత్నంలో వాడతాం. అలాంటి వాటిల్లో శకటరేఫం ఉండే పదాలు కొన్ని:
జఱ జఱ (ఈడ్చుట, జారుట)
కొఱ కొఱ (కోపంగా చూడటం)
కఱ కఱ (నవిలే విధానం)
కిఱ కిఱ (బండి చక్రం తిరిగే విధానం)
గఱ గఱ (గరుకుతనాన్ని తెలిపేది)
చొఱ చొఱ (నెత్తురు కారడం)
బిఱ బిఱ (తొందరగా నడవటం)
కిఱ్ఱు కిఱ్ఱు (తలుపు తెరిచేటప్పుడు వచ్చే శబ్దం)

Saturday, July 17, 2010

నిత్యజీవితంలో పద్యాలు - పాప పుట్టినరోజు

సందర్భం: రేపు, మా బంధువులమ్మాయి పుట్టినరోజు. నేను, బాబాయ్ ఏవైనా పద్యాలు వ్రాద్దామని అనుకున్నాము. ఆయన వ్రాసిన పద్యాలు ఇక్కడ చదవగలరు. నేను వ్రాసినవి ఇవి. ఈ పద్యాలను వినిపించేది మామూలు తెలుగు (వ్యావహారికం) మాత్రమే తెలిసినవారు కాబట్టి (శ్రోతలకు) నిఘంటువుతో పనిలేకుండా వ్రాయాలని నిర్ణయించుకున్నాను. అక్కడక్కడా అలంకారాలను సూచించేటువంటి అక్షరాలను ముద్దగా దిద్దాను. చదువర్లు గమనించగలరు.

గమనిక: వీటిలో తప్పులుండే అవకాశం ఉంది. అక్కడక్కడా నాకున్న సందేహాలను వ్రాశాను. చదువర్లు సందేహాలను నివృత్తి చేసి, తప్పులను సవరించవలసిందిగా కోరుతున్నాను.

ఆ :-
పసిడినగవులమ్మ పాలపళ్ళు తెలుపు
బుల్లిమోముతల్లి బుగ్గ ఎఱుపు
కలువకంటి పాప కంటిపాప నలుపు
నునుపుమేను బంతి నుదురు పసుపు

విశేషాలు:
1. అన్ని పాదాలలోనూ చివరి అక్షరం "పు". అందుచేత ఇది అంత్యప్రాస అవుతుంది.
2. "కలువకంటి" అంటేనే "స్త్రీ" అని అర్థం. మరి, "కలువకంటి పాప" అనడం సరి అవుతుందా? అయితే, కలువకంటి పాప అంటే, కలువ వంటి కనులు కలిగిన పాప. కంటిపాప అంటే pupil of eye. ఇక్కడ ఛేకానుప్రాస కుదిరింది.

ఆ :-

రంగులన్ని యిట్లు రంరించెను బ్రహ్మ
గంభంగి పొంగెనంగు - అవనిఁ!
ముంగిలి మురిసేది రంవల్లికి, మరి
లోగిలి! చిటిపాప ఆగడముకు!

విశేషాలు:

1. రంగు, రంగరించు, గంగ, భంగి, పొంగె, అంగు, ముంగిలి, రంగవల్లి - ఇవన్నీ కూడా వృత్త్యనుప్రాసకు ఉపకరించాయి. గంగ, భంగి, పొంగె, అంగు - ఇవి నాలుగు వరుసగా రావడంతో (మిగతా పదాల సంగతి ఎలాగున్నా) ఇది వృత్త్యనుప్రాస అవుతుంది.
2. "అవనిన్" అనే పదాన్ని "అవనిఁ" అని మార్చడం సరి అవుతుందా? ఇదే వ్యాకరణనియమానుసారం అవుతుంది? ఒకవేళ సరి ఐతే: అవనిఁ అనడంలో రెండు అర్థాలు: a) పుట్టినరోజు పాప పేరు "అవనిజ". ఆ  పేరుకు ముద్దు పేరు అవని అవుతుంది. b) "అవనిలోపల అందం గంగలా ప్రవహించింది" అనే అర్థంలో కూడా "అవనిఁ" సరిపోతుంది. కనుక, ఇది శ్లేషాలంకారం అవుతుంది.

సీ :-

బుజిపాప నోరార బువ్వలు తినుచుండ, కన్నవారికి కూడ కడుపు నిండె
చిరునవ్వు చిగురించు చిన్నారి సిరిమోము, చిత్తాన చైత్రమై, చింతఁ దీర్చె
బుడతమ్మ నట్టింట పడిలేచి పారాడు సవ్వళ్ళు మాగుండె చప్పుడయ్యె
అలసిన పాపాయి అరమోడ్పుకనుదోయి, గాంచిన నిట్టూర్పు గాసిఁ దీర్చు
విశేషాలు:
1. "కన్నవారికి" అంటే తల్లిదండ్రులు అని ఒక అర్థం, చూసినవారు అని మఱొక అర్థం. అందుచేత ఇది శ్లేషాలంకారం అవుతుంది.
2. "చ" తో రెండో పాదంలో ఒక విన్యాసం చేశాను. ఇది చాలా వరకు అనాలోచితంగా వచ్చినదే. ఇది వృత్త్యనుప్రాస అవుతుందా?

తే :-

లక్ష్మి యెల్లవేళల నీకు లక్షలివ్వ
దుర్గ ఆపద రాకుండ తోడునుండ
శారదాంబ కరుణఁజూచి చదువులివ్వ
నిండు నూరేళ్ళు చల్లగనుండవమ్మ!


చదువర్లు వ్యాఖ్యల ద్వారా నా సందేహాలను నివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను.

Friday, July 16, 2010

మనిషి నైజం - 1

(సూచన: ఈ వ్యాసంలోని భావాలన్నీ నా ఊహలే. వాటిల్లో నిజాలెన్నో, అబద్ధాలేన్నో చదువరులు తమకు తాముగా తెలుసుకోవాలి. ఈ వ్యాసం, "మనిషి నైజం" అనే శీర్షికలోని మొదటిభాగం.)

మనిషి జాతి, కులం, మతం, ప్రాంతం, రంగు, ఎత్తు అంటూ తనకు తాను ఎన్ని విషయాలను ఆపాదించుకున్నా, నైసర్గికంగా మానవనైజం మాత్రం ఒక్కటే. చరిత్ర చూసినట్టైతే, ప్రపంచంలో వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాలలో జరిగిన ఒకేలాంటి సంఘటనలు ఒకే పరిణామానికి దారితీశాయని తెలుస్తుంది. మనుషులు ఏ దేశంలో పుట్టినా, ఏ సంప్రదాయంలో పెరిగినా, ఏ నాగరికత మరిగినా - చివరికి అన్ని సమూహాల్లోనూ అన్ని రకాల మనుషులూ ఉన్నారు. ఒక మనిషికి స్ఫురించేటువంటి ఆలోచన, ఎక్కడో భూమికి అటువైపు మఱొక మనిషికి స్ఫురించవచ్చును. ఆ ఆలోచన ఇచ్చే ఫలితం మాత్రం దాదాపుగా అదే ఉంటుంది.

ఒక ఉదాహరణ తీసుకుందాం. మనిషికి, "ఈ ప్రకృతిని సృజింపజేసినది ఎవరు?" అనే ప్రశ్న కలిగి, దానికి "పరమాత్మ"(1) అని సమాధానం ఇచ్చుకున్నాడు. ఎప్పుడో ఐదువేల సంవత్సరాల క్రితం సనాతనధర్మం (దాన్నే "హిందూయిసం" అంటారు), రెండున్నరవేల సంవత్సరాల క్రితం జుడాయిసం, రెండువేల సంవత్సరాల క్రితం క్రిష్టియానిటీ, పదిహేనువందల సంవత్సరాల క్రితం ఇస్లాం - అన్నీ అదే ప్రశ్నకు సమాధానాలుగా వచ్చాయి. దీన్నే మామూలు భాషలో మతం అంటారు. మనిషిని పరమాత్ముడి దగ్గరకు చేర్చడం మతం ఉద్దేశం.

ఒక మతానికి కాని, నమ్మిన వ్యక్తికి కాని ఒక్క పరమాత్మతో తప్ప, వేరేవాళ్ళతో సంబంధం ఉండకూడదు. ఒక బ్యాంకుకెళ్తే ఎవరి ఎకౌంటు వాళ్ళది. ఒకరి వివరాలు మఱొకరికి చెప్పరు కదా? పరమాత్మకి, మనిషికి అనుసంధానమైనది మతం ఐతే, మరి దాంట్లో "సమాజం" ప్రస్తావన ఎందుకు వచ్చింది?". అక్కడ మళ్ళీ మనిషి ఒక ఆలోచన చేశాడు: "ప్రజలకు దేవుడంటే భయమో భక్తో ఉంటుంది. దానిని మనం ఉపయోగించుకుంటే సమాజంలో మార్పు తీసుకురావడం సులువు", అని. మనిషి generalizations చెయ్యడం మొదలుపెట్టి, "ఆడవాళ్ళు ఇలాగ ఉంటారు. మగవాళ్ళు ఇలాగ ఉంటారు. అందుకని వీళ్ళు ఇది చెయ్యాలి, వాళ్ళు అది చెయ్యాలి", అంటూ సంఘాన్ని ఒక రూపుకు తీసుకువచ్చే యత్నం చేశాడు. ఒక్కొక్క నియమం అప్పటి సమాజస్థితిని బట్టి సృష్టించాడు. సమాజంలో పరిస్థితులు మారాయి, నియమాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీని వలన ఇప్పుడు దాదాపు అన్ని మతాలూ ఎంతో కొంత అత్యాచారానికి ఆధారలౌతున్నాయి.

మనిషి మతాన్ని మాటల్లో పెట్టాలనుకున్నాడు. కానీ, ఆ మాటల్ని ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చదివి "నేనే రైటు", అనుకుంటాడన్న విషయాన్ని ఊహించలేకపోయాడు. దానితో అన్ని మతాల్లోనూ చీలికలు బయల్దేరాయి. అన్నిటికంటే పాత మతమైన సనాతనధర్మంలో "శివుడు గొప్పా? విష్ణువు గొప్పా?", అని కొట్టుకున్నారు. అలాగే కులాలన్నారు. ఆ తరువాత బుద్ధిసం, సిఖిసం అని వేరే మతాలు కూడా పుట్టాయి. జుడాయిసం కూడా ఇలాగ క్రిష్టియానిటీకి, ఇస్లాంకి దారులు వేసింది. క్రిష్టియన్లు ప్రొటెష్టెంట్, కేతలిక్ అని; ముస్లింలు సూఫీ, సూని అని కొట్టుకున్నారు.

హిందువులు ఏసు-క్రీస్తు హిమాలయాల్లో ఒక సాధువు దగ్గర జ్ఞానోదయం పొందాడని, క్రిష్టియన్లు హైందవమతం బోధిస్తున్నది క్రీస్తు గురించేనని, ముస్లింలు హైందవమతపురాణాలు చెప్తున్నది అల్లా గురించేనని - ఎవరికి వారు, మాదే పైచేయి అని వాదించుకుంటున్నారు. ఇహ కొన్ని మతాలు తమను విస్తరించుకోవడానికి చేసే ప్రయత్నం సంగతి నేను చెప్పక్కరలేదు. మనిషికి ఒక అలవాటు ఉంది. ఒక వాహనం ఎక్కి ప్రయాణం మొదలుపెట్టిన తరువాత గమ్యం గురించి మరిచిపోయి, ఆ వాహనం తనదని, ఆ దారిలో పరిచయినవి శాశ్వతమని అనుకోవడం. అందుకే పరమాత్ముడి మీద దృష్టి సృతి తప్పి, అది మతం మీద పడటం సంభవించి అనర్థాలకు దారి తీస్తోంది. ఈ మతకలంకం అంటని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. మతం ఏదైనా, దానిలో జరిగే మార్పులు, దాని వలన వచ్చే పరిణామాలు - వీటిల్లో చాలా సారూప్యం ఉంది. మతానికి కూడా మనిషి లాగా, "కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం" వంటి దశలు ఉన్నాయి అన్నమాట! అంతే కదా? మతం ప్రతిబింబించేది మనిషి ఆలోచనని. అదే ఆలోచన ఎక్కడ పుట్టినా మనిషిదే కదా! అందుకే ఈ సారూప్యం.

సశేషం...

(1) ఈ పదాన్ని లింగభేదం లేకుండా వాడుతున్నాను.

Tuesday, July 13, 2010

అనన్వయాలంకారము

వ్యాకరణం -> అలంకారములు -> అర్థాలంకారాలు -> అనన్వయాలంకారం

లక్షణం: ఉపమానోపమేయత్వం యదేకస్యైవ వస్తునః
వివరణ: ఒక వస్తువుకు దానినే ఉపమానంగా చెప్పడాన్ని అనన్వయాలంకారం అంటారు.

ఒక మహారాజును వర్ణిస్తూ, "మహారాజులాగా ఉన్నాడు" అనడం అనన్వయానికి ఉదాహరణ అవుతుంది.

గమనిక: అనన్వయాలంకారం అర్థాలంకారం. అందుచేత శబ్దానికి ప్రాధాన్యతలేదు. అంటే రెండు సార్లు ఒకటే వస్తువుని వేరే పదాలతో పిలిచినా ఫరవాలేదు. కానీ, తాత్పర్యభేదం, అర్థభేదం ఉండకూడదు! ఉంటే అది లాటానుప్రాసం అయ్యే అవకాశం ఉంది.

ఉదా: (రేరాణి, రచన: ఎల్. నాగలక్ష్మి)
రాణి రాణి వలెనతిలోక సౌందర్యవతి

ఇక్కడ రాణితో పోల్చదగిన వస్తువు మఱొకటి లేదు కనుక, రాణి రాణిలాగా ఉంది అన్నారు.

ఉదా: (కావ్యాలంకారసంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
నీ దయకు నీడు జోడు
నీ దయ, నీ జయము సాటి నీ జయమిలలో
నీ దానమునకు నెనయగు
నీ దానము, నీకు సాటి నీవె నృసింహా

నరసరాజు (అనబడే రాజు) దయ, విజయం, దానం - వీటికి ఇవే సాటి అనే ఉద్దేశంతో ఈ పద్యం చెప్పబడింది.

ఉదా: (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
శశి శశి భంగి కాంత్యుదగ్రుడు

దీని అర్థం "చంద్రుడు చంద్రుని వలెనే కాంతిలో గొప్పవాడు" అని. చంద్రుడినే ఉపమానంగానూ, ఉపమేయంగానూ వాడటం చేత ఇది అనన్వయం అయ్యింది.

చలనచిత్రగీతాల్లో అనన్వయాలంకారం నేను తక్కువగా చూశాను.  లాటానుప్రాస గురించి చర్చలో సోదరుడు కిరణ్ చెప్పిన ఉదాహరణ ఒకటి:

ఉదా: (ఇల్లాలు, రచన: ఆత్రేయ)
అందమంటె నువ్వే, ఆనందమంటే నువ్వే, నువ్వంటే నువ్వే, నీ వంటిది నువ్వే నువ్వే

"నిన్ను" పోలి "నువ్వు" తప్ప వేరేవారు లేరు అనడం వలన ఇది అనన్వయాలంకారం అవుతుంది.

Sunday, July 11, 2010

ఉపమాలంకారము (Simile)

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉపమాలంకారము


అంత్యప్రాసాలంకారంతో శబ్దాలంకారాల గురించి చెప్పడం ముగిసింది. ఇక అర్థాలంకారాలు. 'అర్థమే' ప్రథానంగా గల అలంకారాలను అర్థాలంకారాలు అంటారు. ఇవి వందకు పైగా ఉన్నాయి అని కొందరు చెప్తారు, అంతకంటె తక్కువగానే ఉంటాయని మఱికొందరు చెప్తారు. సుమారుగా వంద ఉంటాయి అని అంటే తగువు ఉండదు. స్థూలంగా ఉన్న ఒక అలంకారాన్ని చిన్నచిన్న భేదాలతో విభజిస్తే అప్పుడు సంఖ్య పెరుగుతుంది. అలంకారాలను గురించి వివరించడానికి పూర్వీకులు పుస్తకాలను రచించారు. కానీ, నేను వ్రాస్తున్నది కేవలం అలంకారాలను పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో కాబట్టి, ముఖ్యమైనవి కొన్ని చూద్దాము.

కాళిదాసు ఉపమాలంకారాన్ని ఎక్కువ వాడేవాడని "ఉపమా కాళీదాసస్య" అని పెద్దలు చెప్తారు. అలాగే శ్రీనాథుడికి అర్థాంతరన్యాసాలంకారము, భాస్కరశతకం మారద వెంకయ్యకి దృష్టాంతాలంకారము, చేమకూర వేంకటకవికి శబ్దాలంకారాలు/శ్లేషాలంకారము, పోతనకి శబ్దాలంకారాలు ఇష్టమని వారి కావ్యాలు చదివితే తెలుస్తుంది(ట). అలాగ మీకు తెలిసిన కవులు ఎక్కువగా వాడిన అలంకారాలను గురించి వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

ఈ అలంకారలకు చలనచిత్రగీతాలను చెప్పుకుంటూపోతే బోళ్ళు ఉదాహరణలు ఉంటాయి. కొన్ని అవి, కొన్ని పద్యాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థాలంకారాలు కర్ణాటక సంగీతంలోని కీర్తనలు కూడా ఎక్కువ వినబడతాయి. అవి కూడా చర్చించుకుందాము.

ఉపమాలంకారం

ఉపమాలంకారము అన్ని అర్థాలంకారాలలోకి ఎక్కువ ఉపయోగించబడుతున్నది అని నా నమ్మకం. దీన్ని ఆంగ్లంలో "simile" అంటారు.

లక్షణం: ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయోః
వివరణ: ఉపమానానికి, ఉపమేయానికి సామ్యరూపమైన సౌదర్యాన్ని చెప్పడం "ఉపమా" అలంకారం అవుతుంది.

ఈ అలంకారానికి నాలుగు వస్తువులను మనం చూసుకోవాలి.
ఉపమేయం: దేని గురించి చెప్తున్నాము?
ఉపమానం: దేనితో పోలుస్తున్నాము?
సమానధర్మం: రెండింటికీ పోలిక ఏమిటి?
ఉపమావాచకం: ఏ పదాన్ని వాడి ఈ రెండింటికీ పోలికను వ్యక్తపరుస్తున్నాము?

ఉదా: (రఘువంశం, రచన: కాళిదాసు)
వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థప్రతిపత్తయే
జగతఃపితరౌ వందే, పార్వతీపరమేశ్వరౌ ||

అర్థం: పదాలను (వాక్కులు), అర్థాలను నాకు ప్రసాదించమని - వాక్కు, అర్థం వలె కలిసి ఉండే పార్వతీపరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.

ఉపమేయం: పార్వతీపరమేశ్వరులు; ఉపమానం: వాక్కు, అర్థం; సమానధర్మం: కలిసి ఉండటం; ఉపమావాచకం: ఇవ (సంస్కృతంలో), వలె (అనువాదంలో)

ఇక్కడ వాగర్థాలకు, పరమేశ్వరులకు సామ్యం చెప్పబడింది. శబ్దం లేకుండా అర్థం లేదు, అర్థం లేకపోతే శబ్దానికి విలువలేదు - ఇవి రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాగ ఆ పార్వతీపరమేశ్వరులు కూడా కలిసే ఉంటారు. ఇది ఈ రెండు విషయాల మధ్యనా ఉన్న సామ్యం.

ఈ నాలుగు వస్తువులూ ఉన్న ఉపమాలంకారాన్ని పూర్ణోపమాలంకారం అంటాము. కొన్ని సందర్భాలలో వీటిలో కొన్నే ఉండవచ్చును. ఇలాంటివి మనం చలనచిత్రగీతాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము.

ఉదా: (భగవద్గీత, రచన: వ్యాసభగవానుడు)
బ్రహ్మణ్యధాయ కర్మణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేణ పద్మపత్రమివాంభసా

అర్థం: పరమాత్ముడికి అన్నీ వదిలేసి, కర్మలను రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ఆచరిస్తారో వారిని తామరాకులను నీరు అంటని విధంగా పాపం అంటదు.

ఉదా: (మంచి మనసులు, రచన: ఆత్రేయ (?) )
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

ఉదా: (ఆనంద్, రచన: వేటూరి)
మేఘమల్లె సాగివచ్చి, దాహమేదొ పెంచుతావు; నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు

ఉదా: (యువరాజు, రచన: వేటూరి)
తొలివలపు వేదంలాగా లిపిలేనిది


తెలుగుకావ్యాలలో, చలనచిత్రగీతాల్లో ఈ అలంకారాన్ని గుర్తించిన చదువర్లు తప్పకుండా వ్యాఖ్యలద్వారా తెలుపగలరు.  ఇంతకన్నా మంచి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

Saturday, July 10, 2010

విధాత తలపున (సిరివెన్నెల చిత్రంలోని పాట)

  • అప్రస్తుతమైన విషయాలు చదవకుండా, ఈ పాట గురించి మాత్రమే చదవాలనుకునేవారు మొదటి ఐదు పేరాలు వదిలెయ్యడం మంచిది.
  • ఈ వ్యాసం వ్రాయడానికి సహాయపడిన సోదరులు - కిరణ్, ఫణీంద్రలకు; వ్రాయమని అడిగిన ప్రణీత స్వాతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.


"సిరివెన్నెల" చిత్రంతో చలనచిత్రరంగానికి పరిచయమై, అప్పటి నుండి ఆయన పాటలతో ప్రేక్షకులకే కాక, తెలుగు సాహిత్యాభిమానులకు కూడా ప్రీతిపాత్రులైనటువంటి రచయిత సీతారామశాస్త్రి గారు. ఆయనంటే నాకు అమితమైన అభిమానం, గౌరవం. నేను సహజంగా ఆయన పాటల గురించి ఈ బ్లాగులో వ్రాయను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి: ఆయన పాటలు పండితపామరజనరంజకంగా ఉంటాయి. సహజంగా, వివరించి చెప్పాల్సినంత భాషని కానీ, భావుకతని కానీ (వాడగలిగినా) వాడరు. ప్రతిమనిషికీ అర్థమయ్యి, వారు ఆ పాటను అనుభవించగలిగేలాగా వ్రాయడం ఆయన శైలిలో నాకు నచ్చేటువంటి అంశం. రెండు: ఆయనకు యువతరంలో అసంఖ్యాకమైన అభిమానులున్నారు. ఆయన అభిమానులు బోలెడు వెబ్-సైటులను ఏర్పరిచి ఆయన ప్రతిగీతాన్ని వర్ణించుకుంటూ వెళ్తున్నారు. అందుచేత నేను ఇప్పుడు పనిగట్టుకుని చెయ్యవలసింది లేదు. మూడు: ఆయనతో ప్రతిరోజూ మాట్లాడే ఆయన శిష్యులు చాలామంది సిరివెన్నెల ఆర్కుట్ కమ్యూనిటీలోనో, తదితర వెబ్సైట్లలోనో ఆయన పాటలకు ఆయనే ఇచ్చుకున్న విశ్లేషణలని చెప్తూ ఉంటారు. నాలుగు: సిరివెన్నెల తరంగాలు ఇత్యాది పుస్తకాల ద్వారా కూడా ఆయన పాటల ప్రేక్షకులకు దగ్గరవుతున్నాయి. ఈ బ్లాగులో నేను, ముందుతరంలోని కవులు ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి మొ.; అలాగే ఆయన తరంలో ఎంతో లాఘవం కలిగి ప్రజాదరణకు ఆట్టే నోచుకోని కవులు జొన్నవిత్తుల, వెన్నెలకంటి, భువనచంద్ర మొ. వారి పాటల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.

నాకు కవిని కావడానికి స్ఫూర్తి మా మాతామహులు, నాన్నగారు మొదలుకొని చాలా మంది ఉన్నారు. అయితే మామూలు చలనచిత్రగీతంలో కూడా విషయాన్ని చెప్పచ్చు అని తెలిసింది ఆయన పాటలు విన్నప్పుడే. ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూలో "వేటూరి ఆయనకు గురుతుల్యుడు" అని అంటే "హమ్మ! ఈయనకే గురువా?" అనుకుని, వేటూరి వ్రాసిన పాటలు చూసుకుంటూ పోతే నాకు మతి తిరిగిపోయింది. అప్పటినుండి నేను ఆ వేటూరి-మాయలో ఉండిపోయాను - బహుశా ఎప్పటికీ ఉండిపోతాను. వేటూరి వ్రాసిన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకం చదివాక ఆయనకు ఆత్రేయగారి మీద ఉన్న గౌరవం తెలిసింది, నాకున్న గౌరవం మరింత పెరిగింది. సిరివెన్నెల చాలా విధాలుగా ఆత్రేయని గుర్తుచేస్తారు అని ప్రేక్షకులలో ఒక నుడి. వీరిరువురూ ఒక పాట వ్రాయడానికి నెలకంటే ఎక్కువ తీసుకోవడం జరిగిన సందర్భాలు ఒకింత కారణం ఐతే, ఒక మామూలు ప్రేక్షకుడికి (సగటు భాషాజ్ఞానం,ఊహాశక్తి ఉన్నవాడికి) కూడా అర్థమయ్యి, మనసు కరిగేలాగానో, కదిలేలాగానో వ్రాయగలగడం మఱొకటి.

ఇంతకీ విషయానికి వస్తే సిరివెన్నెల వ్రాసిన "విధాత తలపున" అనే పాట తెలుగువాడూ గర్వించదగిన పాట. ఈ పాటకు జాతీయస్థాయి అవార్డు రాకపోవడం ఆ అవార్డుకు దురదృష్టంగా పేర్కొనవచ్చును. ఈ పాట గురించి వ్రాయమని ప్రణీతాస్వాతిగారు అడిగితే, "Internetలో ఎక్కడైనా దీన్ని గురించి విశ్లేషించారా?" అని వెదుకగా ఎక్కడా దొరకలేదు. అందుచేత ఏదైనా వ్రాద్దామని పూనుకున్నాను.

ఈ పాటను వ్రాసినప్పుడు ఆయన పరిస్థితులేమిటి అన్నది ఈ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. "సిరివెన్నెలతరంగాలు" పుస్తకంలో ఆయన కూడా ఈ పాటను వర్ణించారు. (ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే ఆయన ఇంటర్వ్యూ చివరన ఉన్న చిరునామాను సంప్రతించండి). అది చదివిన తరువాత నేను ప్రత్యేకించి చెప్పవలసిన విషయం ఏమీ లేదు. అర్థాలను వివరిస్తే, ఆయన మాటలను ఇక్కడ వ్రాస్తే సరిపోతుంది అని తెలుసుకున్నాను.  శాస్త్రిగారు చలనచిత్రసీమకు పరిచయం కాకముందు "భరణి" పేరిట వ్రాసిన ఒక కవితని కొంచెం మరమ్మత్తు చేసి వ్రాసినది ఈ పాట. పాట మూలాన్ని ఇక్కడ చదవవచ్చును. చిత్రంలోని పాటను పూర్తిగా ఇక్కడ చదవవచ్చును.

ఈ పాట గురించి చెప్పుకోవలసినవాళ్ళు చాలామంది ఉన్నారు.  మొట్ట మొదట చెప్పుకోవలసినది కళాతపస్వి కే. విశ్వనాథ్ గారి గురించి. సిరివెన్నెల వ్రాసిన మొట్టమొదటి పాట ఇంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈ పాటలో ఉన్నంత భావుకత, బరువు, వైశాల్యం, లోతు నాకు ఎక్కడా కనబడలేదు. మళ్ళీ వ్రాయలేకనా? కాదు! సందర్భం లేక. శ్రేష్ఠమైన సందర్భాలను, కవికి స్వేఛ్ఛనూ ఇచ్చేటువంటి దర్శకులు కరువయ్యి మళ్ళీ ఇలాంటి పాట రాలేదు. అందుకని ఈ పాటలో విశ్వనాథ్ గారికి పెద్దవాటా ఉంది.  అలాగే "నువ్వు వ్రాయవయ్యా. నేను స్వరపరుస్తాను.", అనేటువంటి ఔన్నత్యం ఉన్న సంగీతదర్శకుడు మామ, కే.వీ.మహదేవన్. ఆయనకు హిందూ వార్తాపత్రిక ఇచ్చినా  స్వరపరుస్తారు అని చలనచిత్రరంగంలో పేరు. ఆయనకు కూడా ఈ పాటలో పెద్దవాటా ఉంది.  ఈ చిత్రానికి వేణుగానాన్ని అందించిన హరిప్రసాద్ చౌరాసియా గారు కూడా పాట భావానికి, సందర్భానికి తగిన స్వరాలను వినిపించారు. ఇహ బాలు, సుశీల గురించి చెప్పుకోవడం దేనికి? పంచదార తియ్యనా, తేనె తియ్యనా అన్నట్టు ఉంటుంది వారి గాత్రాల జంట.

అనాదిగా విధాత (పరబ్రహ్మ) ఉన్నాడని వేదాలు చెప్తున్నాయి. ఆ పరబ్రహ్మ హృదయంలో మెదిలిన ఒక ఆలోచన నుండి ఈ సృష్టి పుట్టింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ఆలోచన స్వరూపం ఓంకారం. ఆ ఓంకారమే ఈ సృష్టికి మూలం. ఆ ఓంకారమే ప్రకృతిలోనూ, జీవరాశుల్లోనూ చైతన్యమై నిండివుందన్నది ఆవిష్కరించడం ఈ పాటలోని ప్రథానాంశం. ఈ పాట కవి స్వగతం కాబట్టి, దీని గురించి కవి స్థానంలో ఉండి చెప్పడం అవసరం. అందుకే మొత్తం కవి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నాను.


విధాత మనసులో కలిగిన ఊహ ఓంకారం. ఆ ఓంకారం ప్రతిజీవిలోనూ చైతన్యమై నడిపిస్తోంది.

భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించినప్పుడు అక్కడ ఏముందో వ్యాసభగవానుడు సవివరంగా చెప్పాడు.  ప్రకృతిలోని గ్రహాలు, నక్షత్రాలు మొదలుకొని రాయి, రప్ప వరకు అన్ని వస్తువులు; సమస్తజీవరాశులు జననం నుండి మరణం వరకు చేసే ప్రయాణం - సృష్టి, స్థితి, లయ అన్నీ ఒక్కచోట అర్జునుడికి కనిపించాయి.   అది చూసి అర్జునుడు, అవన్నీ నడిపిస్తున్నది ఆ పరమాత్ముడే అని తెలుసుకున్నాడు.

అదే విశ్వరూపవిన్యాసం ప్రతిమనిషికీ కనిపిస్తుంది. అది ఎప్పుడంటే - సృష్టి మొత్తం నిండినది ఒకటే నాదం, ఒకటే జీవం, ఒకటేచైతన్యం అన్న విషయం అర్థమయినప్పుడు. ఆ దివ్యనేత్రం తెరుచుకున్నప్పుడు, మనిషి సృష్టిని ఒక్కచోటనే నిలబడి చూస్తాడు. "ప్రతిజీవి గుండెలోని లయా ఆ ఓంకారమే.  అది విరించి (బ్రహ్మ) విపంచి (వీణ) గానం, పరమాత్మ స్వరూపం. నేను అంటే ఈ మేను కాదు, ఆత్మ. నా ఆత్మ, చూడాటానికి వాడే పరికరాలు కళ్ళు. ఆ ఆత్మ చూడవలసింది, తెలుసుకోవలసినది(1) సృష్టిని, దాని వెనుకనున్న ఓంకారాన్ని. అదే జీవనవేదం.", అని  విదితమవుతుంది. ఆ సృష్టిని ప్రతిబింబించేటువంటి కవితను వ్రాయడానికి నేను ఒక  విరించిని(2) అయ్యాను, అది పాడి వినిపించడానికి నేను ఒక వీణను (విపంచి) అయ్యాను.

సంగీతానికి మూలం సామవేదం. సామవేదంలో స్వరాలను ఎలాగ పలకాలో, వేదాలను ఎలాగ చదవాలో ఉంటుంది. ఆ వేదం మూలంగా కలిగి, తీయని స్వరాలు (సరసస్వర) నీరుగా ఉన్న గంగ (సురఝరి) నా పాట. ఈ పాట  జీవనవేదాన్ని చెబుతుంది.

నిద్ర మృత్యువుతో సమానమని మన యుద్ధధర్మాలు బోధిస్తున్నాయి. ఆ మృత్యువుని తీసుకొచ్చేటువంటి వాహనం రాత్రి. ఆ మృత్యువుని సంహరించి, ప్రకృతికి చైతన్యాన్ని తీసుకువచ్చేది ఉదయం. ప్రొద్దున్నే మేలుకొని గుంపులుగా చేరిన పక్షులు (జాగృత-విహంగ-తతులు) నీలిగగనమనే వేదికపైన, తూరుపుదిక్కును ఒక వీణగా మలచి (ప్రాక్-దిశ-వీణియ) సూర్యుడి కిరణాలను దానికి తీగెలుగా బిగించి (దినకర-మయూఖ-తంత్రులు), తమ రెక్కలనే వేళ్ళుగా చేసుకుని ఆ వీణియను వాయిస్తూ, తమ కిలకిలారావాలను (స్వనములు) పాడటమే ఈ జగతికి (ఒక కొత్త) శ్రీకారం అవుతోంది. సృష్టి మళ్ళీ చైతన్యంతో నడుస్తోంది. ఈ విషయం తెలుసుకుంటే విశ్వం అనే కావ్యానికి భాష్యం చెప్పడం చేతనౌతుంది. ఆ భాష్యమే నా గీతం.

పుట్టిన ప్రతిప్రాణి గళంలో వినబడేటువంటి స్వరం, ఓంకారంలోని ఒక తరంగం (జీవననాదతరంగం). ఆ చైతన్యానికి స్పందనగా, గుండె ఒక మృదంగంగా మారి ధ్వనిస్తోంది (గుండెచప్పుడు). ఆ చప్పుడు మొదలైనప్పటినుండీ ఒకేలాగా ఉంటుంది కనుక ఆదితాళం. అది పాడుతున్న జీవనవేదానికి ఆది-అంతం లేవు కాబట్టి దానిది అనాదిరాగం. ఇదే రీతిలో అనంతమైన జీవరాశులు ప్రవహిస్తున్న నది సృష్టి (అనంత-జీవన-వాహిని).  ఆ సృష్టి విలాసమే నా ఈ గీతంలోని విషయం. సృష్టిరహస్యమే నా ఊపిరిగా (ఉఛ్చ్వాసం) వెళ్ళి, నాలో ఉన్న ప్రాణచైతన్యాన్ని స్పందింపజేసి, గానంగా బయటకు (నిశ్వాసం) వస్తోంది.


(1) వేదం అంటే తెలుసుకోవలసినది అని అర్థం.
(2) విరించి అంటే బ్రహ్మ (సృష్టించేవాడు). కవి కవితను సృష్టిస్తాడు.

Saturday, July 3, 2010

అంత్యప్రాసాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> శబ్దాలంకారాలు -> అంత్యప్రాసం


లక్షణం: మొదటి పాదం చివర ముగిసిన అక్షారసమూహంతోనే తరువాతి పాదం కూడా ముగిస్తే అది అంత్యప్రాసం అవుతుంది.

వివరణ: సాధారణంగా ప్రాస అంటే రెండో అక్షరానికి వర్తిస్తుంది. గమనిస్తే అన్నమయ్యకీర్తనలలో ప్రతిచర్ణంలోనూ రెండో అక్షరం ఒకే గుణింతంలోనుండి వస్తుంది. ఉదాహరణకు "ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీ సుతుడు" అనే పల్లవిని పరికిస్తే "ముద్దు, తిద్ద" - ఈ రెండు శబ్దాలకూ ప్రాస కుదిరింది. అలాగే సుమతీ శతకంలో (కందపద్యాలలో) ప్రతీ పాదంలోనూ రెండో అక్షరానికి ప్రాస కుదురుతుంది. ఉదాహరణకు: "అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు" లో "క్క" తో ప్రాస కుదురింది. ఇదే నియమం పాదంలో ఆఖరి అక్షరానికి వాడితే అది అంత్యప్రాసం అవుతుంది. భావకవిత్వంలో పాదం బదులు "వాక్యం" చివరి అక్షరసమూహాన్ని పరిగణించడం రివాజు.

మన తెలుగు చలన చిత్రంలో అతి ఎక్కువగా వాడబడుతున్న ప్రాస ఇదే.ఎంతో భావుకతతో శ్రోతలు ఊహించని విధంగా ప్రాస కలపడంలోనే అంత్యప్రాస అందం ఉంది అని నా అభిప్రాయం. దీని గురించి వ్యాసాలు కాదు, పుస్తకాలు వ్రాయచ్చును. అంత అవసరం ఇప్పుడు లేదు కాబట్టి నాకు నచ్చిన ప్రాసలు కొన్ని చెప్పి శబ్దాలంకారాలు ముగిస్తాను. ఆ తరువాత అర్థాలంకారాలు వైపు నడుద్దాము.


ఉదా: (చిత్రం: ఆంధ్రకేసరి, రచన: ఆరుద్ర)
గజపతులు, నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించెను గౌతమి హోరు

మహానుభావుడు ఆరుద్ర రాజమహేంద్రపురం గురించి వర్ణిస్తూ వ్రాసిన ఈ పాట ఇప్పటికీ గోదారిగంగ అలలలాగా నా మనసులోతుల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. "ఊరు" కి ఎన్నో ప్రాసపదాలు వాడటం మనం చూశాం, "పేరు", "ఏరు", "నీరు" వంటివి రివాజు. కానీ, ఆరుద్ర ఎంతో ఆలోచించి "నినదించెను" వంటి చక్కని పదాలను అక్కునచేర్చుకుని "గౌతమి హోరు" (గోదావరి అలల వేగం వలన కలిగిన నాదం) అని ఎంత చక్కని అంత్యప్రాస కలిపారు?

కొట్టుకొనిపోయెనొక కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు

అలాగే, "కొట్టుకొని పోయెనొక కోటిలింగాలు" అన్నప్పుడు ఎవరైనా, "ఐతేనేమి? కాటన్ దొర బ్యారేజీ మిగిలిందనో, రచించిన కవితాసౌధాలు మిగిలాయనో చెప్తారు", అని శ్రోతలు అనుకుంటే "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అన్న చందాన, "వీరేశలింగం పంతులు మిగిలాడు మాకు, అది చాలు", అని చెప్పడం విన్న ప్రతిసారి, నాకు కళ్ళు చెమరుస్తుంది.


ఉదా: (చిత్రం: రాజ్కుమార్, రచన: ఆత్రేయ)
సహవాసం మనకు నివాసం, సరిహద్దు నీలాకాశం, ప్రతిపొద్దూ ప్రణయావేశం, పెదవులపై హాసం
సుమసారం మన సంసారం, మణిహారం మన మమకారం, ప్రతిరోజూ ఒక శ్రీకారం, పరవశశృంగారం

"జానకి కలగనలేదు" అనే పాటలోనిది ఈ చరణం. ముక్కలైపోయిన గుండెలగురించి గుక్కతిప్పుకోకుండా చెప్పే "మనసు-కవి", "మన-సుకవి" ఆత్రేయగారు, ఈ పాటలో ఒక్కటైపోయిన మనసుల గురించి చక్కగా చెప్పారు (1). ఒక్కో మాటలోనూ ఎంతో లోతైన భావం ఉంది, ఎంతో చక్కందనం ఉంది. అందుకే ఈ అంత్యప్రాస బాగా కుదిరింది.


ఉదా: (చిత్రం: శుభసంకల్పం, రచన: వేటూరి)
సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు, ఏకమైన చోట వేదమంత్రాలు

ఇక్కడ రెండు అక్షరాలతో చక్కని అంత్యప్రాస కుదిరింది. "కట్టె, కొట్టె, తెచ్చె" అని రామయణం చెప్పడం తెలుగువారికి తెలిసే ఉంటుంది. అదే రామయణాన్ని ఈ రెండు వాక్యాలలోనూ కవి ఎంతో అందంగా చెప్పాడు. రాముడి సుగుణాల, సీతమ్మ అందాల, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు కలిసినప్పుడు జరిగిన వైభోగాలు - అంతే కదా రామయణం!


ఉదా: (చిత్రం: మనీ రచన: సిరివెన్నెల)
ఇదీయమీను సద్దాం హుసేను హిట్లర్ ఎట్సెట్రా
ఇంట్లో ఉండే పెళ్ళాం కంటే డిక్టేటర్లట్రా?

"పెరుగన్నంలో పీడ్జాముక్క నంజుకున్నట్టు అంత గొప్ప పాటల మధ్యలో ఇది వ్రాశావు? సిరివెన్నెల ఇంతకంటే గొప్పవెన్నెన్నో ప్రయోగాలు చేశారు కదా?" అని చదువర్లకు సందేహం రావచ్చు. "ఇంగ్లీషు పదాలకు, తెలుగుపదాలకు ప్రాస కలపడంలో కూడా అందం ఉంది. అది చెయ్యడానికి కూడా చాలా ఆలోచన కావాలి", అని చెప్పడానికే ఇది వ్రాశాను. ఈ పాట నచ్చని తెలుగువాడుంటాడా చెప్పండి?


ఒకప్పుడు ఇది నిజంగా అలంకారంగానే (తగినపాళ్ళలో వాడేవారు) ఉండేది. ఉదాహరణకి దేవులపల్లి, పింగళి, సినారె, దాశరథి మొదలగు కవుల పాటల్లో ఇది ఒక నియమంలాగా ఉండదు. రాను రాను, ఒక నియమం అయిపోయింది. ప్రాస కలపడం, అది ఒక పాటనడం - ఇది రివాజైపోయింది. "బన్ని, పిన్ని, చున్ని" ప్రాసపాటలు, తెలుగువైభవాన్ని చూసినవారికి గుండెపోట్లై కూర్చుకున్నాయి. అది ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి.


ఈ అలంకారానికి పద్యాలలో ఉదాహరణలు నాకు తెలియవు. మీకేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా చెప్పగలరు.

(1) "వివరించేటప్పుడు నీ అలంకారాల గోలేమిటయ్యా?", అని అనుకోకండి. దైనందినజీవితంలో వాడితేనే కదా అలంకారాలకు అలంకారం?

Thursday, July 1, 2010

ఎవ్వరో ఎవ్వరో (మల్లెపువ్వు చిత్రంలోని పాట)

బాణీ కట్టిన తరువాత పాట వ్రాయడం ఒక రకంగా అదృష్టమైతే ఒక రకంగా శిక్ష. కవిత్వం ధారలాగా పొంగితే అందులో భావానికి ఎల్లలు ఉండవు. అదే ఇక్కడ రెండు లఘువులు వెయ్యి, ఇక్కడ ఇంకో రెండు మాత్రలు పడాలి అంటూ కట్టడి చేస్తే అది కాలువ అవుతుందేమో కానీ నది కాలేదు. అలాంటి భావకవిత్వం ఉన్న పాటలు, రచయితకి స్వేఛ్ఛనిచ్చే సంగీతదర్శకులు ఉంటే సాధ్యమవుతుంది. కే.వీ.మహదేవన్, రమేశ్ నాయుడు దాదాపు అన్ని పాటలకూ, సాహిత్యం ముందు వ్రాసి ఇమ్మనేవారు అని తెలిసిందే. ఆ తరువాత చక్రవర్తి, ఇళయరాజ కొన్ని పాటలకు అలాగ వ్రాయించుకునేవారుట.

కొంతమందికి సందేహం కలుగుతుంది - "అలాగ వ్రాసిన పాటల్లో లయ ఉండదేమో? వాటిని ప్రజలు ఆదరించరేమో?" అని. కే.విశ్వనాథ్ చిత్రాలలో చాలా వరకు పాటలు ముందు వ్రాసి, ఆ తరువాత స్వరకల్పన చేయబడినవే. మరి శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతికిరణం, సిరివెన్నెల - మొన్న మొన్న సంగీతానికి నేషనల్ అవార్డు వచ్చిన స్వరాభిషేకం అలాగ చేయబడినవే! వాటిల్లో అన్నీ వినసొంపుగా ఉన్నపాటలే!ఇటు చూస్తే వేటగాడు, అడవి రాముడు మొదలైన చిత్రాలలో పాటలూ అలాగ వ్రాసినవే. మరి వాటిల్లో "ఊపు" లేదా? ఇంకో రెండు తరాల తరువాత కూడా గుర్తుండిపోయేటువంటి పాటలు చూసుకుంటే అవి భాష, భావం, స్వరం, గానం అన్నిటికీ న్యాయం చేకూర్చినటువంటి పాటలే కాని, వేరేవి కావఇప్పుడు నేను చెప్పబోతున్నది అలాగ రచించిన పాటే (అని అది వింటే తెలుస్తుంది). హిందీలో వచ్చిన ప్యాసా సినిమాకు రీమేక్, "మల్లె పువ్వు". హీరొ పాత్రను శోభన్ బాబు పోషించాడు. గురు దత్ సినిమా కాబట్టి సందర్భాలు ఉన్నతమైనవి. హీరో ఒక సానివాడకు వెళ్ళి అక్కడి వేశ్యల దైన్యస్థితిని చూసి పాడే పాట ఇది. ఇందులో గొప్ప భావోద్వేగం ఉంది. ఇది వ్రాసింది వేటూరి అని నా నమ్మకం. chimatamusic.com అదే సూచిస్తోంది. అక్కడక్కడ ప్రయోగాలు చూస్తుంటే కూడా వేటూరేననిపిస్తోంది. స్వరకల్పన చేసింది చక్రవర్తి. వేటూరి-చక్రవర్తి - వీరిద్దరికీ ఉన్న సామ్యం ఏమిటి అంటే అసమాన్యమైన శక్తి ఉన్నా, ప్రొడ్యూసర్లూ, డైరక్టర్లూ చేరి వీరిద్దరి చేతా చాలా సామాన్యమైన/నాసి రకమైన పాటలు వ్రాయించారు. ఈ పాట వారి కలిసి కృషి చేస్తే ఎంత గొప్పనైన పాటని అందించగలరు అన్నదానికి నిదర్శనం.

చిత్రం: మల్లె పువ్వు
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి (?)
గానం: బాలు

ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగేవారెవ్వరో
ఈ పాపం కడిగే దిక్కెవ్వరో
ఎవ్వరో వారెవ్వరో

అందెలు సందడి చేసిన జాతరలో, ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో, అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో ఈ చిందులు, ఎవరికో ఈ విందులు
ఏమిటో ఏమిటొ ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో? ఏమిటో ఆ ధర్మం ఏమిటో?

శీలానికి శిలువలు, కామానికి కొలువులు
కన్నీటి కలువలు, ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు, రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన, నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేదింకెన్నడో?
ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?

అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
మైల పడిన మల్లెలు ఈ నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పూవులు
ఎందరికో ఈ కౌగిళ్ళు, ఎన్నాళ్ళో ఈ కన్నీళ్ళు
ఎక్కడా ఎక్కడా ఏ వేదం ఇది ఘోరం అన్నదో
ఏ వాదం ఇది నేరం అన్నదో
ఎక్కడో ఆ వేదం ఎక్కడో

ఈ మల్లెల దుకాణాలు, ఈ గానాబజానాలు
వెదజల్లిన కాగితాలు, వెలకట్టిన జీవితాలు,
వల్లకాటి వసంతాలు, చస్తున్నా స్వాగతాలు
కట్లు తెగిన దాహాలకు, తూట్లు పడిన దేహాలు
ఎక్కడో ఎక్కడో ఈ రాధల బృందావనమెక్కడో
ఈ బాధకు వేణుగానం ఎక్కడో
ఎన్నడో ఎక్కడో ఎప్పుడో


ఈ పాటలో విశ్లేషించడానికి ఏమీ లేదు. ఎక్కడా కష్టమైన పదాలు వాడలేదు కవి. చిన్న చిన్న పదాలతో గొప్పభావాన్ని వ్యక్తపరిచాడు. ఒక చరణానికి, మఱో చరణానికీ బాణీలో పొంతనలేదు. అందుకే ఇది మొదట సాహిత్యం వ్రాసిన పాట అని అనిపించింది.

కొన్ని మాటలు నిప్పుకణాలలాగా ఉన్నాయి. కన్నీటి కలువలు, కదులుతున్న శవాలు, రగులుతున్న శ్మశానాలు, మైలుపడిన మల్లెలు, వెలగట్టిన జీవితాలు, వల్లకాటి వసంతాలు - ఇవన్నీ బరువైన ప్రయోగాలు. "కన్నీటి కలువలు" అని విన్నప్పుడు "మాతృదేవోభవ" చిత్రంలో "కన్నీటికి కలువలు పూచేనా?" అనే వాక్యం గుర్తుకొచ్చింది. అలాగే, "ఈ రాధల బృందావనమెక్కడో?" అని అనడం ఇది వేటూరి వ్రాశారేమో అన్న నమ్మకాన్ని బలీయం చేస్తోంది. వేశ్యల గురించి వర్ణిస్తూ కూడా రాధమ్మను తలుచుకుంటూ, అందులో ఎటువంటి దైవధిక్కారం లేకుండా, ఒక రకమైన ఆవేశాన్ని చూపించాడు కవి. ఇలాగ ఈ పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా వ్రాయచ్చు. కాకపోతే ఇది వర్ణించేటువంటి సాహిత్యం కాదు, మనసుని సూటిగా గుచ్చే సాహిత్యం. విని అనుభవించాలి, అంతే! వేటూరి మాటల్లో చెప్పాలంటే, "మనసు...మాటలు కాదుగా?"