Thursday, March 25, 2010

మాలధారణం నియమాలతోరణం - వేటూరి

భక్తిరసప్రధానమైన చిత్రాలు తెలుగులో చాలా వచ్చాయి. వాటిల్లో చాలా మంది రచయితలు మంచి పాటలు వ్రాశారు. అలాంటి చిత్రాలలో "అయ్యప్పస్వామి మహత్యం" అనే చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో గీతసారాన్ని గీతాలలో నింపాడు రచయిత వేటూరి. ఒక్కో పాటా ఆణిముత్యం. భావం గంగమ్మలాగా ప్రవహిస్తే తెలుగు గోదారిగంగలాగా పారింది. ఈ పాటలు అయ్యప్పస్వామి భక్తులందరికీ అత్యంతప్రీతిపాత్రమైనవి.

ఈ పాటలను వేటూరే వ్రాసారని ragalahari.comలో చెప్పారు. అయినా నేను నిర్ధారించుకోవడానికి సినిమాలో titles చూశాను. అక్కడ ఆచార్య ఆత్రేయ పేరు (సహాయకులతో సహా) ఒక చోట, వేటూరి సుందరరామమూర్తి అని ఒక చోట పడ్డాయి. కానీ, వారు నిర్వహించిన బాధ్యతలను చెప్పే పదాలు backgroundలో ఉన్న వెలుగు వలన కనబడలేదు. ఆచార్య ఆత్రేయ సినిమాలకు మాటలు వ్రాసేవారు. అందుచేత ఆయన మాటలు వ్రాయగా వేటూరివారు పాటలు వ్రాశారని నా నమ్మకం. ప్రత్యేకించి ఈ పాట శైలి, సాగరసంగమంలో వేటూరి వ్రాసిన "ఓం నమఃశివాయ" శైలితో పోల్చదగినది (ఎందుకో క్రింద చెప్పాను). అందుకే ఇది వేటూరే వ్రాశారని నా నమ్మకం.

మాలధారణం, నియమాలతోరణం
జన్మతారణం, దుష్కర్మవారణం
శరణం, శరణం, శరణం, శరణం, అయ్యప్పస్వామి శరణం, అయ్యప్పస్వామి శరణం

"అయ్యప్పస్వామి మాలను ధరించడం అంటే నియమాలను దండగా చేసుకుని ధరించడం, భవసాగరాన్ని ఆ ఊతతో ఈదడం, చెడ్డపనులవైపు మనస్సు మరలకుండా అప్పడం", అని కవి వర్ణన. అంత్యప్రాస ఎంత చక్కగా కుదిరింది? భావం ఎంత లోతుగా ఉంది? భక్తిపాటలు వ్రాయడంలో తెలుగు చలనచిత్రపరిశ్రమలో వేటూరికి సాటి లేరు అని నా నమ్మకం. వైదీకసూత్రాలను కూలంకషంగా పరిశీలించి వ్రాసినట్టుగా గోచరిస్తాయి ఆయన పాటలు.

ఉదయాస్తమ్ముల సంధ్యలలో, పురుషార్థత్రయసాధనలో
చతుర్వేదములలో రక్షణలో, పంచభూతముల పంజరశుకమై
ఆరుశత్రువుల ఆరడిలోపడి, ఏడు జన్మలకు వీడని తోడని
నిన్ను నమ్మిన నీ నిజభక్తుల, మాలధారణం!

"ఉదయమూ సాయంత్రమూ, ధర్మం-అర్థం-కామం (తలచిన పని సిద్ధించాలని) ఈ మూడింటినీ తీరంగా పెట్టుకుని, నాలుగు వేదాల చేతా రక్షింపబడుతూ ఉంటారు మాలధారులు. పంచభూతములు అనే పంజరములో ఉన్న చిలుకలాగా, అరిషడ్వర్గాలు (కామక్రోధమోహలోభమదమాత్సర్యాలు) చేత వేధింపబడుతూ ఉన్న వారు నువ్వే ఏడు జన్మలకూ వీడని చేయూతవని నమ్మి నీ మాలను ధరిస్తారయ్యా!", అని భావం. ఎంత లోతైన వైదీకమర్మాలను చెప్పాడు? భక్తుల మనస్సులోనున్న ఆవేదన, వారి కష్టాలు, వారు భగవంతుడిని ఎందుకు ఆశ్రయిస్తారు - అన్నీ చెప్పాడు.

మీరు గమనించినట్టైతే ఇక్కడ రెండు సంధ్యలు, మూడు పురుషార్థాలు, నాలుగు వేదాలు, పంచభూతాలు, ఆరు శత్రువులు, ఏడు జన్మలు" అన్నాడు కవి. పెరుగుతూ ఉన్న సంఖ్యలను చూడండి. సాగరసంగమం చిత్రంలో "ఓం నమఃశివాయ" పాటలో "త్రికాలములు నీ నేత్రత్రయమై, చతుర్వేదములు ప్రాకారములై, పంచభూతములు ముఖపంచకమై, ఆరు ఋతువులే ఆహార్యములై, ప్రకృతి పార్వతీ నీతో నడచిన ఏడు అడుగులూ స్వరసప్తకమై, నీ దృక్కులే అష్టదిక్కులై, నీ వాక్కులే నవరసమ్ములై, నీ మౌనమే దశోపనిషత్తులై ఇలవెలయా", అంటూ సంఖ్యలను పెంచుకుంటూ వెళ్ళాడు. అందుకే "మాలధారణం" పాట శైలిని "ఓం నమఃశివాయ" పాటతో పోల్చినది.

"అ-ఉ-మ" సంగమనాదంలో ఓం, ఓం, ఓం
హరిహరరూపాద్వైతంలో శరణం, శరణం, శరణం, శరణం
నిష్ఠురనిగ్రహయోగంలో, మండలపూజామంత్రఘోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే, ఆత్మహారతులు పట్టిన భక్తుల మాలధారణం!

ఈ చరణం గురించి చర్చించుకునే ముందు కే.వీ.మహదేవన్ గురించి చెప్పుకోవాలి. వేటూరి ఆయన్ని కలిసిన కొత్తల్లో tune చెప్పండయ్యా అంటే, "tune మేము చెప్తే ఇంక రచయితకు స్వేఛ్ఛ ఎక్కడుంటుందయ్యా? నువ్వు పాట వ్రాయి, నేను tune చేస్తాను", అన్నాడట. ఆహ! ఒక మలయాళీయుడయ్యుండి, తెలుగుజనాలకు తనపాటలతో మృష్టాన్నభోజనం తినిపించిన మహానుభావుడు మామ, మహదేవన్. మొదటి చరణానికీ రెండో చరణానికీ tune భేదం ఉంది గమనించండి. అంటే వేటూరి ముందు పాట వ్రాశాకా, దానికి లయలు నేర్పించాడు మామ! ఈ చరణం ముందు వచ్చే వేణునాదంలో భక్తితరంగాలు తాండవించాయి. మహదేవన్ నిజంగా మహానుభావుడు!

"ఓం" అనే నాదం, "అ", "ఉ", "మ" అనే మూడు స్వరాలను కలిపితే వచ్చింది అని వైదీకుల నమ్మకం. ఈ ప్రపంచం ఆ నాదంలోనుండి పుట్టింది అని మన విశ్వాసం. అయ్యప్పస్వామి హరిహరుల తనయుడని, వారిద్దరి మధ్యనా భేదాలు/విభేదాలు లేవని నిరూపించేందుకు పుట్టాడని ఆయన చరిత్ర చెబుతోంది. ఈ మూడు స్వరాల కలయికలో, ఆ రెండు మహాశక్తుల మేళనలో, ఎంతో కఠినమైన నియమాలను పాటిస్తూ, మంత్రాలనడుమ భక్తులు వారు చేసిన పాపపుణ్యాలను కర్పూరం చేసి అయ్యప్పస్వామికి హారతిగా పడతారుట! కర్మ, దాని ఫలితం ఉన్నంతకాలమే ఆత్మ ఈ భౌతికప్రపంచంలో నడుస్తుంది. ఆ కర్మను నాశనం చేసేవాడు యోగేశ్వరుడైన పరమాత్మ. ఆ నైష్కర్మ్యాన్ని సాధించేందుకు భక్తులు స్వామి వద్దకు మాలను ధరించి వస్తున్నారు అని ఎంత లోతైన భావాన్ని తక్కువ మాటల్లో చెప్పడో వేటూరి!

ఈ చిత్రంలో మిగిలిన పాటలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. త్వరలోనే ఆ పరమాత్ముడి దయతో అవన్నీ కూడా వ్రాయగలనని ఆశిస్తున్నాను. హరిః ఓం.

6 comments:

శ్రీనివాసమౌళి said...

ఈ పాట వేటూరి అని తెలియదు నాకు... మంచి పాట అని అనుకుంటూ ఉండేవాడిని... చాలా చక్కగా వ్రాశారు.... ఇలానే సంఖ్యలుపెంచుకుంటూ అనంత శ్రీరాం ఒక ప్రేమపాట లో వాడాడు.... "రెండో స్వర్గాన్ని నేనే కడుతున్నా! మూడో మనిషెవరూ ఇక రానేరాకుండా ! నాల్గే దిక్కులని అంతా అంటున్నా ...ఐదో దిక్కుంది అది నువ్వేలే" అని

satvika said...

"purushartha traya sadhana" - dharma-artha-kaamamulemo anukuntunnaanu endukante, nenu vinnanthalo, sadharananga puranallo arthanni kaamanni dharmamu cheta mudi veyatam tho moksham kuda danantata ade sidhdhistundi anduke adi pratyekanga cheppanavasram ledu antaaru.. neway, chaalaa manchi pata gurinchi rasavu.. enni sarlu vinnaa bore kottani tune,manchi lyrics..

Sandeep P said...

పొరబాటును తెలిపినందుకు నెనర్లు కలర్స్ గారు! ఇప్పుడు టపను సవరించాను.

Harish Kakumanu said...

sandy, atreya is a very well known lyricist. He is known as manasu kavi. He had written many well known telugu songs. I don't know who might have written that song. attached the some of the list of acharya aatreya's penned down popular telugu songs.
http://www.chimatamusic.com/telugu/searchlyrnew.php?st=Acharya%20Athreya

Sandeep P said...

@హరీష్
ఆ లంకెను (link) ఇచ్చినందుకు నెనర్లు (thanks). ఆత్రేయ గురించి తెలియని తెలుగుపాటల అభిమాని ఉంటాడా? మనసుకవి వ్రాసిన పాటలు తెలుగు సీమలో అందరికీ favorites ఏ. ఆయన గురించి ఒక article మొత్తం వ్రాస్తాను త్వరలోనే. ఆయన ఇచ్చినన్ని మనసుపాటలు తెలుగు చిత్రసీమలో ఎవరూ ఇవ్వలేదు. ఆత్రేయని వేటూరి గురుతుల్యుడిగా భావిస్తే సిరివెన్నెల వేటూరిని గురుతుల్యుడిగా భావిస్తాడు.

Narenbharat said...

నాకు ఈ బ్లాగ్గింగ్ గురించి చాలా సంవత్సరాల నుండి తెలిసు కాని, నాకు నేనే ప్రేక్షకుడిగా ఉండేవాడిని, మీరంతా కలిసి ఇలా పంచుకుంటుంటే చాలా ముచ్చట గా అనిపించి మిమ్మల్ని వెంటాడుతున్నా (follow).
మీ టపాలు చాలా విషయాలను విశేషాలను తెలియచేస్తున్నాయి, ధన్యవాదాలు.

మీ
నరేంద్ర వర్మ (భరత్)