ఒక భక్తుడు ఈ మలినపూరితజగతిని చూసి దుఃఖిస్తూ మనఃశాంతిని వెతుక్కుంటూ ఆఖరికి స్వామి మాలను ధరించి ఆ హరిహరపుత్రుడి దర్శనం చేసుకుంటాడు. ఆ దర్శనం కలిగిన క్షణంలో అతని హృదయంలో పుట్టే ఆనందంతో కూడిన ఆవేశం ఈ పాట రూపంలో చెప్తాడు. ఆ భక్తుడి ఆవేశానికి తగినట్టు బాణీని సమకూర్చిన మహదేవన్, దానికి తన గళంతో న్యాయం చేకూర్చిన బాలు - ఇద్దరూ నిజంగా అభినందనీయులు. వేటూరి ఈ పాటలో సంస్కృతశబ్దాల ప్రయోగం ఎక్కువ చేసి, ఎంతో లోతైన భక్తిభావాన్ని, వేదసూత్రాల్ను ఎప్పటిలాగే ఒక మాలధారిని పాత్రధారిని చేసి చెప్పాడు.
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుంగశబరిగిరిశృంగ, నిత్యనిస్సంగ, మంగళాంగ,
పంపాతరంగ, పుణ్యానుషంగ, మునిహృదయజలజభృంగ!
అయ్యప్పస్వామిని ఎంతో ఎత్తులో ఉండే శబరిగిరియొక్క శిఖరంతోనూ, పంపానదిలో తరంగాలతోనూ పోల్చి, భవబంధాలు లేని వాడిగా, శుభకరమైన రూపం కలిగినవాడిగా, మంచివారిని ప్రేమించేవాడిగా, మునుల మనస్సులను గ్రోలే (అందులోని భక్తిని అందుకొనే) తుమ్మెదగా అభివర్ణించాడు. అసలు, ఆ ప్రాస చూడండి! అద్భుతం. భావానికీ, భాషకీ న్యాయం చేకూరుస్తూ ఎంతో చక్కగా వ్రాశాడు.
బ్రహ్మచారినై, భక్తియోగినై, ద్వంద్వము అన్నది వీడి,
విగతకామినై, మోక్షగామినై, తాపత్రయమును విడచి
కన్నెసామినై, కర్మధారినై, కాలాంబరములు తొడిగి
నీ దరి చేరితి నీలగిరీశా! బంధము తెంచితి పన్నగవాసా!
బ్రహ్మచారి అనే పదానికి ఎంతో పవిత్రమైన అర్థం ఉంది. బ్రహ్మచారులు పరబ్రహ్మనే మనసులో ఉంచుకుని ఐహికవాంఛలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఈ కాలంలో బ్రహ్మచారులంటే ఆడపిల్లలు కనిపిస్తే కరిగిపోయే కాముకులకు పర్యాయపదంగా వాడుకోవడం మన భారతదేశసంస్కృతికి పట్టిన దుర్దశ. అయ్యప్పస్వామి మాల ధరించిన వారందరూ నిజంగా బ్రహ్మచారులై, ఆడువారికి దూరంగా ఉంటూ, ప్రతీ స్త్రీలోనూ తల్లిని చూస్తూ, అన్నీ ఆ పరమాత్ముడికోసం చేస్తూ భక్తియోగాన్ని అవలంబిస్తారు. చలి - వేడి, సుఖం-దుఃఖం వంటి ప్రాపంచికభావాలను విడచి కేవలం పరమాత్మ మీదనే దృష్టిని నిల్పుతారు. కామాన్ని విడిచి, మోక్షపథంలో నడిచి, దైనందినజీవితంలో కలిగే కష్టనష్టాలకు దూరంగా విధ్యుక్తకర్మను అనుసరిస్తూ నల్లని బట్టలు ధరించి ఆ అయ్యప్పస్వామి సన్నిధానానికి చేరుకుంటారు. ఇంతలోతైన భావాన్ని, చిన్నచిన్న మాటలతో వర్ణించాడు వేటూరి. నాకు ఈ చరణం వింటే భగవద్గీత చదివిన భావం కలుగుతోంది. భక్తియోగం, నిర్ద్వంద్వం, విగతకామి, మోక్షగామి, కర్మధారి, బంధములను తెంచుకోవడం - అంతా కృష్ణుడు భగవద్గీతలో బోధించినదే కదా? భగవద్గీత అంటే వేదసారమే కదా? అందుకే నేను చెప్పింది "వేటూరి వ్రాసిన భక్తిపాటల్లో వేదసారం ఉంటుంది", అని.
శరణం శరణం భవతరణ, శబరిగిరీశా అయ్యప్పా!
సుఖదం, శుభదం నీ చరణం, హరిహరపుత్రా అయ్యప్పా!
అయనరేఖలా సంగమవేళ మిథ్యావాదపు మధ్యస్థలిలో
సూన్యజగతిలో సూక్ష్మపరిధిలో నికరపు వెలుగుల కాంతిపుంజమై
సకలచరాచరసృష్టిదీపమై మకరజ్యోతిగ వెలిగేది,
నీ మహిమ ఒక్కటే అయ్యప్పా, ఈ మహికి దేవుడే అయ్యప్ప!
శబరిగిరీశా ధన్యోహం ||
సూర్యుడు మకరరాశి మొదలుకొని కర్కాటకరాశివరకూ సాగించే ప్రయాణాన్ని (అంటే సుమారుగా ఆంగ్ళ క్యాలెండరు ప్రకారం జనవరి 13/14 తేదీలనుండి జూలై 13/14 తేదీలవరకు) ఉత్తరాయణం అని, అలాగే తిరిగి సింహరాశినుండి ధనుర్రాశివరకూ సాగించే ప్రయాణాన్ని దక్షిణాయనం అని అంటారు. ఈ రెండు అయనాలూ సంగమించేది మకరసంక్రాంతిరోజు. ఆ పర్వదినాన మకరజ్యోతి కనబడుతుంది. "మకరసంక్రాంతిరోజు మిథ్యావాదాన్ని ఛేదిస్తూ ఆకాశంలో చిన్నదీపమై వెలిగేది మకరజ్యోతి - అది నీ మహిమే", అని అయ్యప్పస్వామిని వందిస్తున్నాడు వేటూరి.
ఈ "మహిమ, మహి" అన్న పదాలు కలిపి వాడటం వేటూరికి బాగా ఇష్టం అనుకుంటాను. "రాఘవేంద్ర" అనే (ప్రభాస్ హీరో గా వచ్చిన) సినిమాలో "నమ్మిన నా మది మంత్రాలయమేగా", అనే పాటలో "మహిని దాచిన మహిమంత, మరల చూపరా" అని వ్రాశాడు. అలాగే, "అర్జున్" చిత్రంలో "మధుర, మధురతర మీనాక్షి" అనే పాటలో "మహిని మహిమ కల మీనాక్షీ", అని వ్రాశాడు. కొన్నికొన్ని ప్రయోగాలు వేటూరి పదే పదే చేసినా వినడానికి ఇబ్బంది కలగవు! వాటిల్లో ఇది ఒకటి!
1 comment:
మునిహృదయజలజభృంగ - వేటూరి ది గ్రేట్..
ఇలాటి ప్రయోగాలు తెలుగు పాటలలో తేలికగా చెయ్యడం వేటూరికే సాధ్యం.
మంచి పాట తెలియజేశారు. నేను విన్నాను కానీ అంత గుర్తు లేదు ఈ పాట
Post a Comment