Sunday, March 14, 2010

సినిమా పాటల్లో మళ్ళీ మళ్ళీ కనబడే పదాలు, భావాలు

"చలనచిత్రగీతాలలో పదభావపౌనఃపున్యము" అని ఈ టపకు నామకరణం చేద్దామని అనుకుని, చదివే ఆ ఇద్దరు-ముగ్గురు కూడా, "ఇదేదో గ్రాంధికం గోలలాగా ఉంది. light తీసుకుందాము.", అనుకుంటారని కొంచం మామూలు మాటల్లో టైటిల్-ప్రదానం చేశాను. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఈ మధ్యన తెలుగుపాటలు వినీ వినీ, "ఈ నవసినీకవులకు ఇంక వేరే పదాలు/భావాలు దొరకవా? ఎంతసేపు ఇవే పట్టుకుని తిప్పితిప్పి వ్రాస్తూ ఉంటారు.", అని అనిపించింది. అందుకే సినిమాకవులకు ఉన్న ఊతపదాలు, ఉత్తిపదాలు, ఊదరగొట్టే పదాలు, ఊరిపోయిన పదాలు, రొటీనైపోయిన భావాలు, రోత పుట్టిస్తున్న, రోగాలు పట్టిన భావాలు ~ వీటి గురించి వ్రాద్దాము అని నిర్ణయించుకున్నాను.

తెలుగు వ్యాకరణం పుట్టినప్పటినుండి కవిత అంటే పద్యాలు అనే అర్థంగా ఉందేమో! నన్నయ్య పదకొండవ శతాబ్దం నుండి పద్యాలు వ్రాయటం మొదలుపెట్టాడు. ఆ తరువాత పదునాల్గవ శతాబ్దంలో పదకవితాపితామహుడు అన్నమయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధారంగా కవిత్వాన్ని అల్లడం మనకు తెలుసును. ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. యతిప్రాసాదినియమాలతో రెండూ వ్రాసేవారికి ఒక పందిరి కట్టేవి. ఆ పందిరిపైన కవులు పదాలను తీగెలుగా చేసి కవితలను అల్లేవారు. ఒకచోట గణాలు ఉంటే, మరొక చోట రాగాలు ఉండేవి ~ రెండూ లయను (స్వరాలను) అందించడం కోసమే!

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా, "ఊతపదాలు, వ్యర్థపదాలు" అనే ఒక పాఠ్యాంశాన్ని చదువుకున్నాను. అందులో, నన్నయ్య, తిక్కన, పోతన, వంటి మహాకవులు ఛందస్సు కోసం అక్కడక్కడా అనవసరమైన పదాలను పెట్టి కవితలు పూర్తిచేసేవారని, కొందరికైతే కొన్ని గణాలకు ready-made పదాలు ఉండేవి అని రచయిత చెప్పగా చదివాను. అది బహుశ: నిజమేనేమో! నాకూ పద్యాలు వ్రాయడంలో అనుభవం ఉంది కాబట్టి కొంతవరకు నేనూ గ్రహించగలను. ఇలాగ ఛందస్సు అనే గోడల మధ్యన వ్రాసే కవిత్వం యాంత్రికమైపోతోందని, కృష్ణశాస్త్రివంటి కవులు వీటిని ధిక్కరించి అప్పటికి సామాన్యమైన (గ్రాంధికం కాని) తెలుగులో భావకవితలను వ్రాయటం ప్రారంభించారు. అప్పట్లో ఛాందసులుగా పేరుబడిన పద్యకర్తలు కొందరు దీన్ని తీవ్రంగా ఖండించి భావకవిత్వానికి వ్యతిరేకంగా పుస్తకాలు కూడా ప్రచురించారు. ఐనప్పటికీ ప్రజాదరణ వలన భావకవిత్వానికి క్రమేపీ ప్రాచుర్యం లభించింది. ఈ పాటలను కొందరు దర్శకనిర్మాతలు స్వరకల్పన చేయించి తమ చిత్రాలలో వాడుకున్నారు కూడా! ప్రజలు భావకవిత్వాన్ని ఎంతగానో ఆదరించడంతో చలనచిత్రాలలో కూడా అవే మొదలయ్యాయి. చాలా రోజులపాటు మొదట కవి పాటవ్రాసి ఇస్తే అప్పుడు సంగీతదర్శకుడు దానికి బాణీ కట్టడం జరిగింది.

కొన్నాళ్ళకు ఇతరభాషల్లో హిట్టయిన పాటలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా మొదట బాణీ ఇచ్చి తరువాత దానిలో ఇమిడేట్టు పాటలు వ్రాయడం ప్రారంభించారు.  "పద్యాలు/పదకవితలు వ్రాసేటప్పుడు గణవిభజన చేసి, స్వరనియమాలను పాటిస్తూ వ్రాయడం వలన, భావాస్వేఛ్ఛ కంటే భాషాబంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది", అన్న విషయం మళ్ళీ మొదలైనది. ఇప్పుడు అవే బంధనాలు ముందుగా అల్లిన బాణీలుగా అవతరించాయి. సంగీతదర్శకుడు ఏదో ఒక పాశ్చాత్యబాణీ తెచ్చుకొచ్చి ఇందులో నువ్వు పదాలను నింపవయ్యా అంటే అప్పుడు కవులు మాత్రం ఏం చేస్తారు? దొరికిన అరకొర పదాలే నరికి ఇరికించి బరికేస్తారు. ఇందులో కొంచం వాడుకలోలేని పదాలు వచ్చినా, "ఏమిటయ్యా ఇది? తెలుగు text-book అనుకుంటున్నావా? కాస్త మామూలు మనిషికి అర్థమయ్యేలాగా వ్రాయి", అని పాటకారులని ఇబ్బంది పెడుతున్నారు. సినిమాకథల్లో కొత్తదనం లేకపోవడంతో అటు భావాలకు, బాణీలనూ/so-called వాడుకభాషనూ సంకెళ్ళుగా తగిలించడంతో ఇటు భాషకు స్వేఛ్ఛ లేకుండా తయారయ్యింది. దీంతో దిక్కుతోచని కవులు, "మనసు, వయసు, తెలుసు, అలుసు, సొగసు", "చిలుక, అలక, మొలక", "చెలియ, సఖియ", "అలుపు, గెలుపు", "వలపు, తలపు", "భామ, ప్రేమ, ధీమ" వంటి ready-made పదసమూహాలను జేబులో పెట్టుకుని పాటలు వ్రాస్తున్నారు. అక్కడక్కడా అవసరం లేకపోయినా సరే "ఏ" తగిలిస్తూ ఉంటారు. ఉదాహరణకి: "నా మనసు నీది" అందామనుకున్నప్పుడు సంగీతదర్శకుడు "లా లలలా లాల" అని రావాలి అని అంటే అప్పుడు కవి "నా మనసే నీది" అంటున్నాడు. అంటే, "మనసు ఒక్కటే నీది, తనువు వేరేవాళ్ళది", అనా? లేక, "నా మనసొక్కటే నీది, వేరే వాళ్ళ మనసులపైన నీకు హక్కు లేదు", అనా? అది వ్రాసేవాడికి, OK చెప్పేవాడికి, పాడేవాడికి, వినేవాడికి, award ఇచ్చేవాడికీ కూడా అంతుపట్టని అనవసరమైన విషయం. ఒక్కసారి "నా హృదయం నీది" అంటే సరిపోతోందే అని, ఆగి ఎందుకు ఆలోచించరో నాకు అర్థం కాదు. అలాగే "మరి", "ఇంక", "ఇక", "అంట", "అట" వంటి పదాలు ఎక్కడ పడితే అక్కడ వడ్రంగి చెక్కముక్కలమధ్యలో ఖాళీని నింపడానికి మక్కు పెట్టినట్టు పెడుతున్నారు.

సిరివెన్నెల, వేటూరి, వెన్నెలకంటి, భువనచంద్ర లాంటి సీనియర్లను వదిలేస్తే తక్కినవాళ్ళు యతి గురించి అసలు ఎప్పుడో మరిచిపోయారు. ప్రాస కావాలి. ఉదాహరణకు "బన్ని, చున్ని, పిన్ని" వంటి పదాలను కలిపి ఒకాయన పాట వ్రాస్తే అది సూపర్~డూపర్~హిట్టయ్యింది. "వినేవాడిననాలి అసలు", అనిపించింది. దీనికి కొంతవరకు సినిమాహీరోలను అనాలి. మహాపండితుడు, సామవేదం షణ్ముఖశర్మగారు ఒక చక్కని పాటని "మేలుకొలుపు తొలిరాగం సూర్యోదయం", అని వ్రాస్తే ఆ కథానాయకుడు "మేలుకొలుపు అనేది సంస్కృతపదం. ఇది సామాన్యులకెలాగ అర్థమవుతుంది?", అని అడిగాడట. ఆయన దాన్ని "పల్లవించు తొలిరాగం సూర్యోదయం", అని మార్చాల్సివచ్చిందట. అప్పుడు ఆ హీరో, "పల్లవించు అనేది తెలుగుపదం. ఇది సామాన్యూలకందరికీ అర్థమవుతుంది", అని మెచ్చుకున్నాడట. అమెరికాలో చదివిన ఆ అబ్బాయికి మేలుకొలుపు అచ్చతెలుగుపదమని, పల్లవించు అనేది సంస్కృతం నుండి వచ్చిన పదమని తెలియనప్పుడు ఎందుకు నా పనిలో వేలు పెట్టాలి అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపొయాడు ఆ మహానుభావుడు. ప్రస్తుతతెలుగుసినిమాకవులకు పూజ్యుడనిపించుకుంటున్న వేటూరి ఒకసారి ఇలాగ అన్నారు: "తెలుగు సినిమా పాట పాంచాలి లాంటిది. ఆమెకు ఐదుగురు భర్తలు. సంగీతదర్శకుడు, నిర్మాత, చిత్రదర్శకుడు, హీరో, వారి బంధువులు ~ తెలుగుసినిమాపాటకు భర్తలు". ఆ మధ్యన "ఏయ్ చికీతా కొమొస్తాస్" అనే పాట ఎందుకు అలగ వ్రాశారండి అని అడిగితే "హీరో వచ్చి, Spanish భాషలో దీని అర్థం 'ఏయ్ పిల్లా ఏట్ఠాగున్నావూ?' అని కాబట్టి అలాగ వచ్చేలా వ్రాయండి" అన్నాడని చెప్పారు ఆయన. ద్రౌపదికి అయితే పూర్వజన్మపుణ్యం వలన ఐదుగురుభర్తల ఉన్నా పాతివ్రత్యానికి ఏమీ భంగం కలగలేదు. ఇప్పుడు వచ్చే సినిమా పాటలను ద్రౌపదితో కాక వేరే రకం స్త్రీలతో పోల్చాల్సి వస్తోంది.

ఇన్ని కత్తుల మధ్యలో నడుస్తున్నా కూడా కవితకు న్యాయం చేసేవాళ్ళూ లేకపోలేదు. ఉదాహరణకు నేను వేటూరి పేరు చెప్తే ముక్కూ, చెవీ, నాలుకా ఇత్యాది శరీరభాగాలను కోసేసుకుంటాను కానీ, భాషకు, భావానికి సమతుల్యం చేకూర్చడంలో నేను సిరివెన్నెలకు వీరాభిమానిని. ఒకప్పుడు వేటూరి కూడా అలాగ వ్రాసేవారు. అయితే వృద్ధాప్యంవలనో ఏమో ఈ మధ్యన భాషకు అంత న్యాయం చేకూర్చట్లేదు అని నా అభిప్రాయం. నాకు పరిచయం ఉన్న ఔత్సాహికపాటకార్లు నన్ను తమ పాటలపై అభిప్రాయం అడిగినప్పుడు, "ఎందుకు ఇలాగ పదాలను ఇరికించావు?", అని అడిగితే, "ఇది మా చేతుల్లో లేదు. దర్శకనిర్మాతలు/సంగీతదర్శకుడూ దీన్ని ఇలాగ మార్చారు", అని చెప్తున్నారు. పాపం, వారినీ అనుకోవడానికి ఏమీ లేదు. "నువ్వు ఇలాగ నా పాటని మారిస్తే ఒప్పుకోను. నీకు కష్టమైతే పో", అని ధిక్కరించే స్థాయికి ఎదగాలంటే, "నేను నా ఇష్టమొచ్చినట్టు నీ పాటని మారుస్తాను. నీకు కష్టమైతే పో", అనే తుఘ్లక్లకు తలవొంచాల్సిందే. స్వయంగా నాకు పాటలు వ్రాయాలని ఉన్నా, నేను సినిమా ప్రపంచం జోలికి పోనిది అందుకే. తరాలు మారినా నాకు పోతన తత్వం నచ్చింది. "బాలరసాలనవపల్లవకోమలకావ్యకన్యకం" అని ఆయన సంస్కృతపదాలతో ఆఛ్ఛేదించి చెప్పినది: "నేను ప్రేమతో కన్న నా కవితలను రాజులకిచ్చి ఆ పడుపుకూడు తినడం కంటే రైతుగా మిగిలిపోవడం మంచిది", అని. "ఈనాటి సినిమాకవిత్వం broiler-chicken లాంటిది. పెంచుకునేది ప్రేమతో కాదు, ఆశతో", అని ఒకాయన చెప్పాడు. నిజమేనేమో అనిపిస్తుంది.

నింద మొత్తం సినిమావాళ్ళమీదా, కవులమీదా వేసేస్తామా? లేదండీ. ప్రేక్షకులను కూడా తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఉంది. పాటలు విని ఊరుకున్నా ఫరవాలేదు కానీ, అవి పిల్లలకు మప్పి మరీ stage మీద పాడిస్తున్న మహామహిమాన్వితమాతృమూర్తులను, పిచ్చిపిచ్చిడాన్సులకు రెచ్చిపోయి చప్పట్లు కొడుతున్న ఆదర్శపితృమూర్తులను కూడా అనాలి కదా? అసలు కోడినంటూ తినేవాడు ఉంటేనే కదా, వాటిని ఎవడైనా వాటిని పెంచేది?

దినదినమూ దుర్దశకు దగ్గరవుతున్న ఈ తెలుగు సినిమా పాటలను ఎవరూ రక్షించలేరు అనిపిస్తోంది. కానీ, ఒకప్పుడు ఇదే పరిస్థితిలో "ప్యార్ హో రహా హై, చేయ్న్ ఖో రహా హై, నీంద్ జా రహా హై", వంటి ప్రయోగాలను తిప్పితిప్పి వాడుకున్న హిందీ చిత్రాలు గుల్జర్, జావేద్ అఖ్తర్ పుణ్యమా అని ఇప్పుడు కొంచం కొత్తదనాన్ని అందుకున్నాయి. అలాగే ప్రాచుర్యం వచ్చిన నూతనతెలుగుసినిమాకవులలో కూడా ఎవరైనా కాస్త "వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేల్తలపెట్టవోయ్", అనుకుంటే ఇది తెలుగులో కూడా సంభవిస్తుంది అనే ఆశ ఉంది. ఒకప్పుడు అరిటిపండు ఒలిచి పెడితేనే తినే తెలుగుపాటలశ్రోతకు వేటూరి "పురుషుల్లోన పుంగవా" వంటి ప్రయోగాలను రచించడమే కాకుండా రుచింపజేశాడు! ఆయన అన్నట్టు "వెయ్ వెయ్ పునరపి బంధనం", అని ఎవరైనా తెలుగుపాటకారకుడు పూనుకోకపోతాడా అన్నదే నా ఆశ.

(ఈ వ్యాసంలో కనీసం ఒక డజను దుష్టసమాసాలు ఉన్నాయి. వాటిని "వాడుక భాషలో వ్రాద్దామనే" ప్రయత్నానికి పుట్టిన అక్రమసంతానంగా భావించి విడిచిపెట్టాల్సిందిగా నా మనవి.)

11 comments:

sathibabu akella said...

నా మనో భావాలని మీ "మనో నేత్రం" తో చూసినందుకు ధన్యవదాలు.

-సత్తిబాబు.

అక్షర మోహనం said...

మీ 'మనో నేత్రం' నిప్పులు చెరిగింది.

Ravi said...

సృజనాత్మకతకు పెద్దగా తావులేని ఇలాంటి పాటలు వినవలసి వస్తున్న మన ధౌర్భాగ్యాన్ని ఎత్తిచూపారు.

Saahitya Abhimaani said...

కంకర్రాయిలాంటి మాటను మీ వ్యాసానికి పేరుగా పెట్టనందుకు ధన్యవాదములు. వ్యాసం బాగా వ్రాశారు. ఈ మధ్య మీడియాలో, ముఖ్యంగా న్యూస్ చానేళ్ళల్లో తరచూ వినబడే పదాలు, "ఐతే" లేదా "ఈ నేపధ్యంలో". ఒక్కో రెపోర్టరు , ఊపిరి తీసుకోకుండా ఎక్కలు అప్పచెబుతున్నట్టుగా, తమ రిపోర్టును చెప్పే ఆతృతలో ఈ మాటలు అసంకల్పితంగా వాడి వాడి మన ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి పద ప్రయోగాల గురించికూడ ఒక చక్కటి వ్యాసం వ్రాయండి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

హమ్మయ్య! ఎన్నాళ్ళకు నా మనసులోని బాధకు మీ టపా రూపం కల్పించింది. నా చుట్టూ వుండే వాళ్ళు కానీ, బ్లాగ్లోకంలోనూ బయటి లోకంలోనూ తారసపడ్డవాళ్ళు కానీ బాణీల గొప్పతనాన్ని, సంగీతపు మాధుర్యాన్ని గురించి మాట్లాడే వాళ్ళే గానీ, ముందుగా తయారుచేసిన బాణీల ఇరుకు సందుల్లో బాధలు పడుతున్న భాషా ప్రవాహాన్ని గురించి అనుకునే వాళ్ళే లేరు. (సంగీతపు గొప్పదనాన్ని నేను కాదనను.)
నేనేదైనా చెప్పబోయినా లిరిక్స్ కన్నా మ్యూజిక్ ముఖ్యం అనే వాళ్ళే ఎక్కువ. కవులకు, పాటల రచయిత(త్రి) లకు ఏమాత్రం ప్రాధాన్యత లేకపోవటం చూసి మనసు ఎంతో కష్టపడుతుంది.
అసలు పదాలు లేకుండా వీళ్ళంతా ఎన్ని రోజులు వఠ్ఠి సంగీతం వినగలరో చూడాలి అని మంచి రచయితలు పూనుకుంటే... ! (అప్పుడూ చేతికొచ్చిన చెత్తంతా రాసే వాళ్ళు ఉంటారుగా.. ప్చ్...)

Ramesh said...

even when the situation demands rich lyrics few lyricists writing lyrics like this


నచ్చినట్లుగా నీ తల రాతను బ్రహ్మే రాస్తాడు
తోచి నట్లుగా నీ తల రాతను నువ్వే మార్చుకో

Satish Kumar said...

అగ్రజా,
మీ వ్యాసం పేరు చూసి,కొందరు 'సినీ'కవులు తాలూకా ఊతపదాలని, భావాలనీ ప్రస్తావిస్తూ హాస్యభరితమైన ఓ వ్యంగ్య రచన చేసుంటారనుకున్నాను.అంటే నేనేదో అనుకుని చదివి అది కానందుకు నిరుత్సాహ పడ్డాను అని కాదు.ఊరికే మనసులో మాట చెప్పా అంతే.సరే అది పక్కన పెడితే మీ వ్యాసంలోని బాధ అర్థమైనా, మీరు పాటలు వ్రాయకపోవటానికీ,లేక చిత్రపరిశ్రమకి దూరంగా ఉండటానికి అన్నట్టు చెప్పిన కారణం ఎందుకో నాకు మింగుడుపడట్లేదు. పోతన తత్వం నచ్చింది అని చెప్పినా సరే మీలాంటి వారు "తెగించి అడుగేస్తే తలవంచదా నింగైనా" అని,ఎంతో కొంత మార్పునకు కారణమవ్వగలిగే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో? సినీ పాటకు ఐదుగురు భర్తలున్నారు అని పెద్దాయన అన్నా, అసలు భర్త (భరించువాడు) ఆరో వాడు ("ఆరవవాడు" అని వ్రాయబోయి ఎవరైనా పొరపాటున అరవ వాడు అని చదివుతారేమో అని భయమేసింది), ప్రేక్షకుడే కదా, మరి పాపం ఆ భర్త బాధలూ పట్టించుకోవాలి కదా (కొందరు ఏ పాటైనా తలాడించువారు కాలెత్తువారు ఉండొచ్చుగాక).'లీడర్ ' సినిమా చూసి మీకు నచ్చింది అని చెప్పారు మనలో ఒకడు అలా సిద్ధపడితే సమాజంలో ఎంతోకొంత మార్పు వస్తుందని మీరు విశ్వసిస్తున్నారని భావిస్తున్నాను. మరి ఆ ఎవరో ఒకరు మనమే ఎందుకు కాకూడదు? మనం చేస్తున్నదానికి ఫలితం కష్టతరమే కావచ్చు, సమయం ఎక్కువ పట్టొచ్చు..కానీ ప్రయత్నించొచ్చు కదా?ఎంతటి గొప్ప ప్రయాణామైనా మొదటిగా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది,ఆ ఒక్క అడుగు మనమే వేద్దాం అనుకుంటే బాగుంటుంది.ఎంతవరకూ సాధించాము/గలము అని ఆలోచనలక్కర్లేదేమో, "కర్మన్యేవాధికారస్తే మా ఫలేషుకదాచన".

(మందాకిని గారు)
మీరన్నది నిజమే.సంగీతం మాత్రమే చాలదు అలానే భాష ఒక్కటే కూడా సరిపోదు. సంగీతంలో పదాలు కూర్చినా, పదాలకు బాణీలు కట్టినా తప్పులేదు. (ఇది మీరు కూడా ఒప్పుకుంటారని తెలుసు)...సంగీతం ఎంత ముఖ్యమో ,వచనమూ అంతే ముఖ్యం, రెంటికీ సమానత్వం ఆపాదించినప్పుడే అది గొప్పగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం, చెవులకింపుగా లేనప్పుడు వేదం కూడా వినమేమో, అలానే స్వరం బాగున్నంతమాత్రాన బూతులు వినలేము.

తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.

Sandeep P said...

@సతీష్

నువ్వు చెప్పిన మాటలు నిజమే! కేవలం ఎవరికో తలవంచాలన్న విషయానికే నేను సినిమాప్రపంచానికి దూరంగా ఉండట్లేదు. నిజంగా ఈ సమాజంలో మార్పే తీసుకురావాలి అనుకుంటే సినిమాపాటలకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. పేదరికం, నిరక్షరాస్యతి, అనారోగ్యం వంటివి ఉన్నాయి. నా దృష్టి వాటిపైన ఉంది. నిజం చెప్పాలంటే నేను ప్రయత్నించి, ఎదిగి పాటకారుడిగా సాధించేది నాకు శాశ్వతమైన తృప్తిని కలిగించదు అనిపించింది. అందుకే లైట్ తీసుకున్నాను. "జీవితంలో గెలుపుకి సూత్రం తెలియదు కానీ, ఓటమికి సూత్రం చాలామందిని తృప్తిపరచాలనుకోవడమే", అన్నాడొకాయన. అదే నా పాలసీ కూడా. నాకున్న వ్యాపకాల (ఆధ్యాత్మికపురోగతి, చదువు, జ్యోతిషం, కవిత్వం, సేవ మొ||) మధ్యలో ఈ సినిమాప్రపంచం పట్టదు అనిపించింది. నిజంగా నాకు అంత కవిత్వ-టేలంట్ [:)] ఉంటే కృష్ణశాస్త్రిలాగానే "నాకిష్టమొచ్చినట్టు వ్రాస్తాను. మీకు నచ్చితే తీసుకోండి. లేకపోతే పొండి.", అనే అనుకుంటాను :)

ఆ.సౌమ్య said...

బాగ చెప్పారండీ. కానీ ఒక చిన్న మాట. ప్రజలని బట్టి కవులు ఇలా రాస్తున్నరు అనేకంటే ప్రజలకి అలాంటి సాహిత్యపు రుచి ని చూపించాల్సిన బాధ్యత కవులదే అంటే బావుంటుందేమో.

నా అభిమాన రచయిత సిరివెన్నల. ఆయనా ఎలాంటి పరిస్థితులలోనూ, ఎలాంటి పాటకయినా భాష ని దిగజార్చలేదు. కానీ వేటూరి అలా కాదు. ఆయన "అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ" అని రాస్తూనే "ఆకు చాటు పిందె తడిసె" అని కూడా రాసారు. ఎందుకు రాయాలి? "రేపల్లియ యద ఝల్లున" పాట ఎంత పెద్ద హిట్టో తెలియనిది కాదు. అలాంటి పాటలు రాస్తే హిట్ అవ్వవు అనుకోవడం తప్పు. ఇది వేటూరి గారి గురించి మాత్రమే కాదు. అందరు కవుల గురించి చెప్తున్నాను. ఉదహరణగా వేటూరిగారి విషయం చెప్పానంతే.

"లాహిరి లాహిరి లాహిరిలో" అని రాస్తే అర్థం కాలేద? "పడమటి సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం" అంటే అర్థం కాలేదా? మనకి ఆ సాహిత్యపు విలువల రుచి చూపించవలసినది కవులే. వాళ్ళు రాస్తేనే కదా మనకి తెలిసినది. ఇప్పుడు కూడా అంతే. వాళ్ళు రాస్తే మనకి తెలుస్తుంది. మనం వింటాం. దాన్ని ఆదరిస్తాం. అందరు కవులు చేరి మేము దిగజరుడు భాష వాడం అని ఉద్యమాన్ని చేపడితే ఎందుకు గొప్ప పాటలు రావు?

ఈ విషయంలో నేను సిరివెన్నెల గారి కి చేయెత్తి నమస్కరిస్తాను.ఏ పాటలోనూ కూడా ఎక్కడా కూడా భావచాతుర్యం తగ్గదు. అసభ్యతకు తావు ఉండదు. భాష దిగజారదు. మొన్న మొన్న వచ్చిన మహత్మా సినిమా లో పాటలు చూడండి. చిన్న చిన్న పదాలతోనే ఎంత అందంగా రాసారో. ప్రతీ కవి అలా ఉంటే భాష కి గొప్ప రోజులు మళ్ళీ వస్తాయి.

హరి said...

బాణీల చట్రాన్ని చేధించుకొని కవిత్వం బయటికి రావడానికి ప్రయత్నించడం, దాన్ని తిరిగి బాణీ సీసాలో బంధించి బిరడా బిగించడం మొదటి నుండీ ఉన్నవే. బాణీలతో భావ ప్రకటనా స్వేచ్ఛ తగ్గి పోతే, అవి లేక పోవడం వల్ల, కవిత్వం వచన సమానంగా మారుతుంది. స్వేచ్ఛగా వ్రాసే గేయ కవి కూడా తన మనసులో ఏదో ఒక బాణీ అనుకోకుండా కవిత రాయ లేడు. అంతే అసంకల్పితంగా తన స్వేచ్ఛను తానే తగ్గించు కుంటాడన్న మాట! దీన్ని బట్టే తెలుస్తుంది, బాణీకి, కవితకు ఉండే అవినా భావ సంబంధం. గొప్ప కవి ఈ రెండిటినీ సరిగ్గా బ్యాలన్సు చేయ గలడు.

Venugopal said...

Definitely the writers/poets are not at fault. The producers and Heros are responsible for imposing this crap on us in the name of mass appeal. Our writers are capable of writing better stuff than what we have heard till now. Let us hope that they'll get an opportunity in the near future.



http://www.tkvgp.blogspot.com/