మీకూ, మీ ఇంటిల్లిపాదికీ, మీ శ్రేహోభిలాషులకూ నా మనఃపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు! శ్రీరామనవమి గురించి తలుచుకుంటే ఈ బ్లాగుకు రెండేళ్ళు నిండాయన్న సంగతి ఙప్తికి వచ్చింది. శ్రీరాముడి గురించి చెప్పడానికి నేను చాలను. వాల్మీకి, తులసీదాస్, విశ్వనాథ సత్యనారాయణ, త్యాగరాజు వంటి మహానుభావులు ఏళ్ళ తరబడి తపిస్తే వ్రాయగలిగిన పుణ్యగాధ శ్రీరామునిది. వారితో పోలిస్తే నేను మహాసాగరంలో ఒక నీటిబొట్టును. సముద్రానికి, జలబిందువుకూ పరిమాణంలో తేడా ఉన్నా, వాటిలోని గుణం ఒక్కటే. అలాగే ఆ మహాకవుల గొప్పదనానికి నేను సరితూగలేకపోయినా, వారిని నడిపించిన భక్తే నన్నూ నడిపిస్తుంది అన్న నమ్మకంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను.
రాముడి గురించి ఏమైనా చెప్పుకునే ముందు, ఆదికవి వాల్మీకిని స్తుతించడం మన సంప్రదాయం. అందుకే ఒక్కమారు ఆయన్ని తలుచుకుందాము:
పద్యం:-
కూజంతం రామరామేతి మధురం, మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ||
భా:-
కవిత అనే కొమ్మనెక్కి "రామ, రామ" అనే మధురమైన అక్షరాలను తీయగా పాడుతున్న వాల్మీకి అనే కోకిలకు నేను నమస్కరిస్తున్నాను.
జంటగా కూస్తున్న రెండు పక్షులలో ఒకదానికి బోయవాడు గాయం చేయడం చూసిన వాల్మీకి ఆవేశంలో, మొట్టమొదటిసారిగా సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పాడు. అందుకే రామాయణాన్ని "శోకంలో పుట్టిన శ్లోకంగా" చెప్పుకుంటారు. ఆ శ్లోకాన్ని, దాని కథని మీరు వాల్మీకికవి వికిపిడియా వ్యాసంలో చూడవచ్చును. అలాగే సంపూర్ణరామాయణం, ఆంగ్లానువాదం ఇక్కడ చూడవచ్చును.
వాల్మీకి నారదమునిని: "ఎవరయ్యా సర్వగుణసమిష్టిరూపం? సద్భుద్ధి కలిగినవాడు, ప్రతాపం కలిగినవాడు, ధర్మం తెలిసినవాడు, నిజమే మాట్లాడేవాడు, పట్టుదల ఉన్నవాడు, కామక్రోధమోహలోభమదమాత్సర్యాలను జయించినవాడు - వాడెవ్వడయ్యా ఈ లోకంలో?", అని అడిగితే అప్పుడు నారదముని చెప్పిన సమాధానమే "రాముడు". రాముడు ఇతరభగవదవతారాల్లాగా మానవాతీతశక్తులను ప్రదర్శించినట్లుగా రామాయణంలో ఎక్కడా లేదు. ఒక సామాన్యుడు తన మనస్సును ధర్మమార్గంలో పెడితే అప్పుడు అతడు ఎలాగ ఉంటాడు అన్నది మాత్రమే రాముడు చూపించాడు. నాకు, మీకు, మనందరికీ ఆదర్శపురుషుడు రాముడు. పరమాత్ముడు, గురువు, తండ్రి, తల్లి, పినతల్లులు, తమ్ముళ్ళు, భార్య, దేశం, ప్రజలు - వీరందరి పట్లా తన ధర్మం తప్పక పాటించిన మహాత్ముడు రాముడు. ప్రపంచం తల్లక్రిందులైనా భరతఖండంలో ప్రతీ ఇసుకరేణువులోనూ నిండే కథ రామాయణం.
ఏకపత్నీవ్రతుడైన రాముడి ఔన్నత్యం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూడా ముగ్గురిని పెళ్ళి చేసుకున్నవాడికి తెలియదు. ధర్మఙుడైన రాముడి ఙానం రామాయణంలో ఒక్క శ్లోకం కూడా చదవకుండా "చాకలి మాటకు ఇల్లాలిని అడవిపాలు చేశాడు", అని నిందించే కూహనామేధావులకి తెలియదు. భ్రాతృప్రేమకు నిలువుటద్దమైన రాముడి ప్రేమ సొంతతమ్ముడు తిన్నాడొ లేదో చూడకుండా బ్రతికేవాడికి తెలియదు. పితృవాక్పరిపాలకుడైన రాముడి గరిమ తండ్రి చివరిరోజుల్లో దగ్గరుండి సేవ చెయ్యాలని తెలియనివాడికి తెలియదు. సత్యానికి అధీనమై నడచుకున్న రాముడి గొప్పదనం నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయనాయకులకి తెలియదు. కేవలం నిర్మలమైన భక్తిని మనసులో నింపుకున్న భక్తుడికే తెలుస్తుంది. కలలో కనబడి పుస్తకం వ్రాయమంటే ఏళ్ళ తరబడి కూర్చుని వెన్న కన్నా, జున్ను కన్నా, తేనె కన్నా రుచికలిగిన పద్యాలతో స్వామి రసనాన్ని మెప్పించిన పోతరాజు (పోతన) వంటి మహాభక్తులకే తెలుస్తుంది. రామనామము అనేకకోటిసార్లు జపించిన త్యాగరాజుకు తెలుస్తుంది. ఒకటి - మనకు భక్తి ఉంటే ఆ మార్గంలో పయనించాలి. రెండు - మనకు లేకపోతే మన పని మనం చూసుకుని, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వాలి. కలియుగప్రభావాన ప్రస్తుతం ఈ రెండువర్గాలవారూ తక్కువే!
ఆ శ్రీరామకృపవలన నాకు అంతో ఇంతో భక్తిభావం మనసులో కలిగింది. సరస్వతి అనుగ్రహించినంతవరకు, నాకు వీలైన మాటల్లో, ఈ పద్యాలను వ్రాస్తున్నాను:
సీ:-
తండ్రిమాటకొఱకు తాటకనువధించి, యఙాన్ని కాచావు యతినిగూడి
పినతల్లి కోర్కెకై ఎనలేని భోగాలు, విడనాడి అడవికి వెడలినావు
ఇల్లాలి ముచ్చట నెరవేర్చగోరుచు, లేడివెనుక వేటలాడినావు
ధర్మాన్ని రక్షించ దశకంఠునోడించి, నీతికి రూపమై నిల్చినావు
తే:-
ప్రేమ, ధర్మంబు తోడుండ ఏమి లోటు?
కలిమి యెంతైన శౌర్యము కల్గునొక్కొ?
అడవిలోనైన, అయోధ్యనైన నీవె
రాజువుగదయ్య లోకాన! రఘుకులేశ!
ఆ:-
ఆంజనేయుఁగాను హృదయాన్ని చీల్చగ
త్యాగరాజుఁగాను రాగమనగ
పోతరాజుఁగాను కైతలు కురిపించ
పామరుండనయ్య పాహి రామ!
ఇంతసేపూ రాముణ్ణి పొగిడాను కదా. ఇప్పుడు సరదాగా రెండు పద్యాలు వ్రాద్దామనిపించింది. ఇది నా అఙానాన్ని ప్రదర్శించడమే తప్ప, రాముణ్ణి తక్కువ చేసే ప్రయత్నం కాదని రసఙులు గమనించగలరు.
ఆ:-
అందమందు నిండుచందురుడికి సాటి
గుణములోన మెరియు మణి కదయ్య
అమ్మలాగ యింటినాదరించెడి తల్లి
ఆమె చాలనియననద్భుతంబు !!!
కం:-
అందము కొంచెమె చాలయ
కందువ తెలియక మెలగుచు కాస్త శమముతో
అందరిని చూచి, మన్నన
పొందెడి సతి చాలనియన పొగడరె నన్నున్?
భా:- గొప్ప అందకత్తె, గుణంలో మణి, ప్రేమమూర్తి అయిన సీత ఒక్కత్తే చాలని నువ్వంటే అది ఒక అద్భుతం. (మరి, రాముడు ఏకపత్నీవ్రతుడు కదా!) కొద్దో గొప్పో అందం ఉంటే చాలు, కుట్రలు చేయకుండా, అందరినీ చూసుకుంటూ, కాస్త మెప్పు పొందే ఒక అమ్మాయి చాలు అంటే మాత్రం నన్నెవరూ పొగడరెందుకో?
3 comments:
బాగున్నాయండి.
chAlA aMdamaina padyAlu....abhinaMdanalu.
చాలా బావున్నాయండి.
నా రాముడిని అపార్థం చేసుకుని దూషించి ద్వేషించే వారే ఎక్కువ, మీ ఈ పోస్ట్ చూసి నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది. :)
Post a Comment