Saturday, February 13, 2010

శివరాత్రి సందర్భంగా!

ఓం నమ:శివాయ!

చం:-
శివుడని తల్చినంత మది శీతనగంబుగ మారుచుండగన్
కవనము పొంగుబట్టె సురకర్షువు పారెడి రీతి జిహ్వపై
సవనవిరోధి, తెల్పు! గతజన్మములో తపమేమి చేసితిన్
కవితలఁ గూర్చిజేయ, కరకంఠుడ! నీ యభిషేకమీ గతిన్!

భా:-
"శివ" అని తలుచుకోగానే నా మనసు మంచుకొండగా మారుతోంది. (అక్కడనుండి) కవిత్వం గంగలాగ నాలుకపై పరుగులెడుతోంది. శంకర! ఈ విధంగా నీకు పద్యాలతో అభిషేకం చెయ్యడానికి నేను గతజన్మలో ఏమి పుణ్యం చేసుకున్నానో చెప్పవయ్యా!

ఉ:-
దేహము అగ్నిగుండమని, తీరిన కోర్కెలు ఏధమయ్యి ఆ
దాహము పెంచుచుండునని, దక్కని కోర్కెలు గాలిధోరణిన్
వాహనమల్లె మోసి నలువైపులకంపెడివంచు నేర్చి, వ్యా
మోహము బోవఁగోరి కయిమోడ్చితి గావర, శైలమందిరా!

భా:-
"శరీరం ఒక అగ్నిగుండంలాంటిది, తీరిన కోర్కెలు అందులో వేసే ఇంధనంలాగ అగ్నిని పెంచుతాయి, తీరని కోర్కెలు గాలి లాగా మంటను నలువైపులకూ పంపుతాయి", అన్న నిజం తెలుసుకుని, ఈ మోహమనెడి మంటనుండి విమోచనం కోరి నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను శంకర! నన్ను రక్షించవయ్యా!

గతంలో నేను శివుడిపై సంస్కృతంలో వ్రాసిన పాటను గుర్తుచేసుకున్నాను.

5 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

శివ మహిమల్ గణింపవొకొ! చేకొనెనా కవితాస్రవంతినే
శివుడొసగున్ శుభాత్ములకు,చిన్మయ తత్వవిదాంవరాళికిన్
సవినయ భక్తి పూర్ణులకు, సద్గుణశీల మహాత్మ పాళికిన్,
భవుఁడన నెవ్వడయ్య? వరభావస్వరూపమె.దీప మిత్రమా!

ఏతత్ కారణముననే
మీతో రచనాదికంబు రక్షకుఁడెలమిన్
ప్రీతినిచేయించెనయా!
ఖ్యాతిగ సాగింపవయ్య ఘన! సద్‍రచనల్.

ఊకదంపుడు said...

నంస్కారమండీ మీ ఈ బ్లాగు ఆలస్యం గా చూస్తున్నాను. మీరు వేటూరి వారి పాటలపై ఒక బ్లాగు నిర్వహించేవారని గుర్తు. అది ఎక్కడా కనబడలేదండీ

Sandeep P said...

నమస్కారం ఊకదంపుడు గారు, నేను నా తెలుగు బ్లాగులన్నీ కలిపేశాను. వేటూరి వారి మీద వ్రాసిన టపలన్నీ ఇదే బ్లాగులో "వేటూరి" అనే లేబుల్తో ఉన్నాయి. ఇదిగో లంకె:

http://manonetram.blogspot.com/search/label/%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF

Sandeep P said...

ఇంతకీ మీ అసలు పేరు ఏమిటో చెప్తే ఆ పేరుతో పిలుస్తాను. ఇందాకటి కామెంటులో మిమ్మల్ని "ఊకదంపుడు గారు" అని సంబోధించినది తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం వేరే ఏమీ లేదు

ఊకదంపుడు said...

>>
"ఊకదంపుడు గారు" అని సంబోధించినది తప్పుగా అనుకోకండి. నా ఉద్దేశం వేరే ఏమీ లేదు
<<

ఒక్క గారు తప్ప అందులో తప్పుగా అనుకోవడనికి ఏమీ లేదండి.

వేటూరి వారి పుట్టిన రోజు నాడు ఓ టపా దంచుదామనుకొని, లంకె గా ఇద్దామని మీ (పాత) బ్లాగు కోసం వెతికితే దొరకలా .. విరమించుకున్నాను.. మాకు ఇంకో సంస్కృత కవి అన్నమాట .. సంతోషమండీ. ఫాటలు ,పద్యాలు, సంస్కృత శ్లోకాలు కాస్త తరచుగా వ్రాస్తూ ఉండండి.