Saturday, February 27, 2010

వేటూరి - స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ఈ సినిమా పేరు చెప్పగానే box-office దగ్గర బద్దలైపోయిన విషయం గుర్తుకు వస్తుంది. ఈ సినిమాతో director గా మారదామనుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఆశలకు చుక్కెదురైంది. ఐతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం: వేటూరీ, యండమూరి - ఇద్దరూ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళే కాకుండా ముదుర్లు కూడాను. మరి వీరిద్దరూ కలిస్తే ఆ పాటల్లో ఎంత ముదురు-సాహిత్యం ఉంటుందో ఊహించవచ్చు. ఐతే ఒప్పుకుతీరాల్సినది ఏమిటంటే ఎంత ముదురు-సాహిత్యం ఉందో అంత ముతక-సాహిత్యం కూడా ఉంది. ఎందుకో మరి! ఈ సినిమాలో నాకు నచ్చిన ప్రయోగాలన్నీ ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకూ సంగీతదర్శకుడు ఇళయరాజ, పాటకారి వేటూరి! (సాహిత్యం అనే పదాన్ని దుర్వినియోగం చెయ్యడం ఇష్టం లేక - పాటకారి అంటున్నాను, దుష్టసమాసం ఐనా కూడా)

పాట: చీకటంటి చిన్నదాని (మనో, జానకి)

చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం, చీర దాచలేని సోకు నాకు సంబరం!
అక్కడ యండమూరి action అనగానే చిరంజీవి కంటే ముందు మన వేటూరి ready అయిపోయాడు. చిన్నదాని సిగ్గును చీకటితో పోల్చి (చీకటీ, సిగ్గూ రెండూ ఉన్న విషయాన్ని దాస్తాయి కదా), ఆమె సోకును చీర ఆపలేకపోతుంటే అది తనకు సంబరంగా ఉంది అని వేటూరి ఉవాచ! మహాచిలిపి :)

కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తిరేస్తె రేయి ఈ దినం!
హీరోయిన్ ఏమైనా తక్కువ తిందా? "మొత్తం జీవితంలో ఉండేదే కాస్త యవ్వనం. ఆ సమయంలో రెండు కళ్ళూ కత్తెరకు ఉండే రెండు వాసాలకు మల్లే మూసి తెరువగానే పొద్దున్నంతా అయిపోయి రాత్రి వచ్చేస్తోంది. అసలు మనకు సమయమే తక్కువ ఉంది", అని ఎంతో భావుకతతో చెప్పింది. ఈ ప్రయోగం నాకు జీవితాంతం గుర్తుకుండిపోయేది! ఒక రివాజు పాటలో ఏ కవి ఐనా ఎంతకని ప్రయోగాలను చెయ్యగలడు? వేటూరి ఎంత సామాన్యమైన పాట వ్రాసినా ఒక్క చోట తన సంతకం పెట్టందే ఒదలడు! బహుశః చదువర్లు "జయం మనదేరా" అనే సినిమాలో "happy గా" అనే పాటలో "ఓ కావ్యనాయకీ, cameraతో కన్ను కొట్టనీ, కేరింతల పన్ను కట్టనీ" అనే ప్రయోగం గుర్తుచేసుకుని ఉంటారు! camera shutter మూసుకుని తెరిచుకునే వైనాన్ని కన్నుకొట్టడంతో పోల్చడం నాకైతే విపరీతంగా నచ్చింది. చూసే కనుల్లో భావుకత ఉండాలండీ ఇలాంటి ప్రయోగాలు చెయ్యాలంటే!

నరాలవీణ మీటితే స్వరాలు లేని పాటలు
అబ్బా! ఏమి భావుకత? ఇది బూతుగా కొందరికి గోచరించచ్చును. నేనూ ఒప్పుకుంటాను ఇది బూతేనని. కానీ ఇలాగ ఆలోచించగలగడం కూడా గొప్పే అంటాను. ఇందులో వేటూరి అస్లీలంగా ఏమీ వ్రాయలేదు. కేవలం రసికులకు, రసఙులకు మాత్రమే అర్థమయ్యే విధంగా శృంగారాన్ని వర్ణించాడు అనిపిస్తోంది.

సరాగమాడు సందెలో పరాగమాడు తోటలు
పరాగము అంటే పుప్పొడి. తోటలు పరాగమాడటం అంటే అది పువ్వులు పరవశించి తుమ్మెదలను ఆహ్వానించడానికి సంకేతం. జరుగుతున్న రాసలీలను ఎంతో భావుకతతో రెండు ముక్కలలో వర్ణించాడు! ఇది వేటూరికే సాధ్యం!

సగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న ప్రేమలు
వరించుకున్న చోటనే ధ్వనించు ప్రేమగంటలు!
దాయలేని భావమో, మోయలేని మోహమో, తోడు లేక తోచదాయెనే ఎందుకో!
ప్రేమికుడు, ప్రేయసి చెరుకో సగం! వాళ్ళు జంటకలిసి ఒక్కటైన చోటనే ప్రేమ-గంటలు ధ్వనిస్తాయి అని శృంగారంలోని ప్రేమభావాన్ని కూడా స్పృశించాడు. 

షిఫానుచీరకొంగుతో తుఫాను రేపు భామలూ
పిపీలికాదిబ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు!
వేటూరిలో ఉన్న చిలిపిదనం, కొంటెదనం ఇక్కడ ప్రస్ఫుటమవుతాయి. అమ్మాయి తన షిఫానుచీరకొంగుతోనే అబ్బాయి గుండెల్లో తుఫాను రేపుతుందిట! అందుచేతనే చీమ మొదులుకొని బ్రహ్మ దాకా అన్ని మగవస్తువుల్లోనూ దాహం పెరిగిపోతోందిట. అయ్యబాబోఇ, వేటూరి నీ ప్రయోగాలు మరెవ్వరూ చెయ్యలేరయ్యా బాబూ! ఇక్కడ లయకు న్యాయం చేస్తూ: "షిఫాను", "తుఫాను" అని ప్రాస కలిపి అలాగే "పిపీలిక", "పిపాస" అని మరొక ప్రాస కలిపాడు. ఎక్కడనుండి వస్తాయయ్యా నీకు ఇలాంటి కొంటె ఆలోచనలు?

ఈ పాటకు వేటురితో పాటు ఇళయరాజాను పొగడాలి. ఎంత చక్కని melody! అలాగే ఈ సినిమాలో నాకు నచ్చిన మరికొన్ని ప్రయోగాలు:

పాట: భలేగ ఉందిరా
"ఇదేమి ముద్దురా? పడింది ముద్దరా! చెడింది నిద్దరా!"
"అందాల ఆరడీ, అయ్యాక నా రెడీ"
"అమ్మాయి తీగెతో సన్నాయి నొక్కుతో సంగీత-నవ్వులే రావాలి"
"శ్రీకాముడీ గుడి, సిందూర పాపిడి. పట్టిందిలే రతి, ప్రాయాల హారతీ"

పాట: నీతోనే ఢంకాపలాసు
"నువ్వే నా కళావరాసు"
"నువ్వే నా రంభావిలాసు"
"మడిగా ఉన్నది వయసు, అడిగా ఇమ్మని మనసు!"
"క్రీగంటి greeting ఇచ్చేస్తా, చెలి చకోరికా ఛలో ఇక, కొంగొత్త coating ఇచ్చేస్తా"
"శ్రీరస్తూ సిగ్గే చిందిస్తా, యావత్తూ నీకే అందిస్తా"

శృంగారానికి, అశ్లీలతకూ చాలా తేడా ఉంది. ఈ మధ్యనే ఒక interview లో వేటూరి: "మీ నాన్న ఉన్నాడా?", "మీ అమ్మ మొగుడున్నాడా?" - ఈ రెంటి మధ్యనా ఉన్న భేదమే శృంగారానికీ, అశ్లీలతకీ మధ్యలో ఉంది అని చెప్పారు. ఇంత చక్కగా విడమర్చి చెప్పగల మహానుభావుడు, ఈ క్రింది ప్రయోగాలు ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి!

"ఫలాన చోట అంటుకోనా? ఫలాల తోట అందుకోనా?"
"వయ్యారి వంటికి వత్తిడంత ఇష్టమా?"


కొంతమంది సిరివెన్నెల అసలు చిలిపి ప్రయోగాలే చెయ్యరు అనుకుంటారు. ఈ "వయ్యారి వంటికి వత్తిడంత ఇష్టమా" అన్న ప్రయోగానికి అటూఇటూగా ఉండే ప్రయోగం సిరివెన్నెల "అతడు" సినిమాలో చేశారు: "సొంతసొగసు బరువేల సుకుమారికీ" అని ఇంకొంచం neat గా చేశారు.

3 comments:

Satish Kumar said...

రెండు కళ్ళ కత్తిరేస్తె రేయి ఈ దినం!
aahaa vETUrO!!

E time ainaa naaku OK!
pagalainaa raatrichEsE kaipu nee korakE

bayaTenta veluturunnaa
kannulu mUsukunTE cheekaTEgaa

mattulagammattula kaipulavindulO
kanubommalu siggu paDitE
kaamuDu aDDucheppaDugaa mari ;)

Sastry said...

nice post :)

Guns said...

Ee patallo Raaja gari music ni chaala enjoy chesevadini..

mee post dwara sahitayam kooda enjoy cheyyatam nerchukunela unna.. Thanks a lot..