చాలా రోజుల బట్టి ఆంగ్లసరస్వతిని అర్చిస్తూ అచ్చతెలుగుసరస్వతిని తలుచుకోవడం కుదరలేదు. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఈ పూట మా బాబాయ్, నేను అమ్మ మీద కొన్ని పద్యాలు వ్రాయాలని నిర్ణయించుకున్నాము. ఆ ప్రయత్నఫలితంగా:
సీ|| నవమాసములు మోసి నన్నుగాచిన తల్లి, అవనిలో తారాడు ఆదిశక్తి
ఆకలనకమున్నె యన్నంబు తినిపించు, అమృతాంభునిధియామె అన్నపూర్ణ
అమరమై నిలిచెడి అక్షరమ్ములుమప్పి, సద్బుద్ధులొసగిన శారదాంబ
తన బిడ్డ సుఖముకై దైవాల ప్రార్థించు, విమలహృదయ పూర్ణ విజయలక్ష్మి!
ఆ|| పలుకుతేనెలమ్మ! పద్యాభిషేకంబు
జరప(గోరె మనసు, సాదరముగ
కరుణ(జూచు తల్లి, కామితార్థద! నీవు
అందుకొనుమ మాదు వందనాలు!
తొలుత నేను వ్రాసిన పద్యానికి మెరుగులు దిద్ది మరింత అందంగా మలచిన చింతా రామకృష్ణారావు గారికి నా ధన్యవాదాలు!
4 comments:
బాగుంది రా నీ బాషా పాండిత్యము....
బావుందండీ !
ప్రియమైన చిరంజీవి సందీప్!
మీ మాతృమూర్తిపై మీకుఁగల అపారమైన ప్రేమకు అభినందిస్తున్నాను.
మీ రచనాభిలాషకు సంతసిస్తున్నాను.
మీరు వ్రాసిన సీసానికి చిన్న మెరుగులు దిద్ద వలసిన అవసరం కనిపించి, దిద్దుతున్నాను. మీరూ చూచి మీ మెయిన్ పోష్ట్లో సరిచేయగలిగితే మంచిదనిపిస్తోంది.
చూడండి.
1.{ఆకలవ్వక మునుపె} ఆకలనకమున్నె.
2.{అమృతాంబుధి యామె}అమృతాంభు నిధి యామె.
3.{ఆఅలు దిద్దించి}అమరమై నిలిచెడి.
4.{విమల హృదయె నాకు} విమలహృదయ పూర్ణ.
5.{పలుకు తేనెలమ్మ.}పలుకు తేనెలమ్మ!
6.{జరప గోరె మనసు,}జరుపఁ గోరె మనసు.
7.{కరుణ చిలుకు తల్లి,}కరుణఁ జూచు తల్లి!
8.{కైమోడ్పులివ్వియె}కామితార్థ ద! నీవు
9.{అందుకొనవె మాత}అందుకొనుమ మాదు
ఛెందో భంగాలను పరిహరిస్తూ ఔచిత్యాన్ని కొంచెం చేకూర్చే విధంగా నాకనిపించిన విధంగా వ్రాసాను.
తప్పైతే అన్యధా భావింపరని తలమ్తును.
నమస్కారం రామకృష్ణ గారు
నేను కూడా ఈ ఉదయం లేచి చూసి ఈ పద్యంలో కొన్ని దోషాలు ఉన్నాయి అని గుర్తించాను. ముఖ్యంగా "మునుపె" అనే పదం అక్కడ గణానికి కుదరట్లేదు అని గుర్తించి సరిదిద్దదలచితిని కాని కార్యభారం వలన చెయ్యలేకపోయాను. సరిదిద్దుతాను. అమ్రుతంబుధి అనే దాంట్లో ఉన్న దోషాన్ని ఇప్పుడే గుర్తించాను. మిగత చోట్ల కూడా మీరు చూపిన సూచనలు చక్కగా ఉన్నాయి. అవి నేను మేళవించి తిరిగి ఆ పద్యాన్ని ప్రచురిస్తాను.
మీ అభిమానానికి ధన్యుడను. మీ బోటి అనుభవజ్ఞుల విమర్శలను, సూచనలను ఎంతో అపురూపంగా భావిస్తాను. భవిష్యత్తులో కూడా తప్పక చెయ్యగలరు.
ధన్యుడను!
Post a Comment