Friday, November 6, 2009

జాబిలితో చెప్పనా?

వేటూరి తొక్కిన బూతుపుంతలకూ ఆయన సరససాహిత్యానికీ పొంతన ఉండదు అని నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అది బహుశా రసికులకందరికీ తెలుసును. ఈ రోజు నేను చెప్పబోయే పాట "ఆకు చాటు పిందె తడిసే", "చూడర చూడర సులేమాన్మియా" వంటి "ఊపు" ఉన్న పాటల మధ్యలో కొట్టుకుపోయిన ఒక అద్భుతమైన పాట. అదేమిటో తెలియదు కానీ, "రాఘవేంద్రరావు" అనగానే వేటూరి కలానికి యవ్వనం వచ్చిపడుతుంది. ఈ పాట వేటగాడు చిత్రంలో, హీరో హీరోయిన్ ప్రేమలో పడిన కొత్తలో, మత్తులో పాడుకునే పాట.

ప్రేమలో పడ్డాక ప్రేయసి కంటే అందం ఇంకోటి కనబడకపోయినా, ఆమెకు దగ్గరగా వచ్చే పోటీదారుడు చంద్రుడు. అసలే విరహవేదనతో బాధపడుతుంటే దానిపైన తన కిరణాలతో అత్తరు చల్లే గుణం ఆయనది. ఈ భావాన్ని ఎంతో సున్నితంగా చెప్పాడు వేటూరి. ముఖ్యంగా నాకు నచ్చే వాక్యాలు:

తుమ్మెదలంటని తేనలకై తుంటరి పెదవికి దాహాలు

ప్రేయసి పెదవులలో మధువలను "తుమ్మెదలంటని తేనెలు", అని వర్ణించడం ఒక ఎత్తైతే "వాటికై తుంటరి పెదవులు అనే తుమ్మెదలకు కోరిక కలిగింది", అని చెప్పడంతో వేటూరి "వీడి ఇల్లు బంగారంగానూ", అనిపించాడు.


చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు

"చుక్కలు లేని చీకటి" అంటే చిమ్మచీకటి అనుకుంటున్నారా? నాకు ఎందుకో "నాయికానాయకులకు మధ్యలో ఉన్న బెరకు" లాగా అనిపిస్తోంది. లేకపోతే ఎంత చీకటైతే అంత స్పష్టంగా చుక్కలు కనబడతాయి, ఆ చీకటిని చూస్తాయి కదా? అందులో "దిక్కులు కలవని విరహాలు", అంటే "ఒక చోటకు చేరని విరహాలు". ఒక్క చోటకు చేరి దిక్కులు  కలిస్తే విరహాలు ఎందుకౌతాయి? సరసాలు అవుతాయి :)


గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు

ప్రేయసిని/ప్రియుడిని చూడగానే హృదయంలో ఏదో తెలియని అలజడి, ఆ హృదయం గొంతులోనుండి బయటకు వచ్చేద్దామని ప్రయాణిస్తుందే కానీ, పెదాలు దాటదాయే! ఈ అనుభవం లేని ప్రేమికుడు/ప్రేయసి ఉన్నారు అంటే వాళ్ళను చూసి నేను జాలిపడతాను. ఆ భావాన్ని: "గొంతులు దాటిన గుండె" అని మూడు ముక్కల్లో వ్రాసేశాడు ఈ మహాపిసనారి కవి. కోయిల గొంతులో గమకాలు విని పరవశించిపోవడం రివాజు. అయితే ఈ గుండె గొంతు దాకా వచ్చాక అందులో పుట్టే గమకాలు ఇంకా ఉత్కంఠభరితంగా ఉంటాయి. అది ఒక చెప్పలేని తీపిబాధ. ఆ కలల్లో, ఆ గళంలో పుట్టే రాగాలు ఇంకా మధురంగా ఉంటాయి. ఇంతటి పురాణాన్ని ఒక్క వాక్యంలో వ్రాసిపడేశాడు ఈ అసాధ్యుడు.

సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు

సూర్యుడు చూడని గంగలు అంటే ఏమిటా అని సంసారపక్షంగా చాలా ఆలొచించగా నాకు అర్థమైనది ఏమిటీ అంటే అవి ప్రేమికుడి కలలు అని. కాకపోయినా "ఆమె అందాలే అలలుగా పారిన గంగలను సూర్యుడు చూడలేదు", అనే భావం కూడా ఉండచ్చు. వేటూరి పాటలు నోస్త్రదాముని కాలజానం లాగా కొంచం వినేవాడి ఊహాశక్తికి వదిలేస్తాయి అనిపిస్తుంది. అలా ఉండటం ఒక అందం!

చివరిగా "కౌగిట కాముని పున్నిమలు", అనడంతో శ్రీకాకుళసాంప్రదాయాన్ని వేటూరి చిలిపిగా వాడుకుని తనకు చరిత్ర పట్ల ఉన్న అవగాహనకు ఒక ఆనవాలుగా వదిలేశాడు. ఈయన రచించిన "సిరికాకొలను చిన్నది", చదివితే ఈ "కాముని పున్నిమల", గురించి ఇంకా తెలుసుకోవచ్చు!

చిత్రం: వేటగాడు
సంగీతం: శ్రీ కే వీ మహాదేవన్
పాడింది: సుశీల, బాలు
రచన: వేటూరి

జాబిలితో చెప్పనా, జామురాతిరి నిదురలోన నువ్వు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా, జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా

తుమ్మెదలంటని తేనలకై తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు
చూపలలో చలి చురచురలు, ఆకలి తీరని విరవిరలు
అన్నీ ఆవిరి పెడుతుంటే, నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా?

గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు
కౌగిట కాముని పున్నములు, వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే, పెళ్ళికి పెద్దవి నీవేలెమ్మని
చెప్పనా?

4 comments:

Mauli said...

'గొంతులు దాటిన గుండెలలో' అంటే, 'ఇద్దరు మాట్లాడుకొనే మాటల్లో' అని అర్ధం (jabilithi tho cheppanaa ani cheppesukontunnaru kada).

'కోయిల పాడని గీతాలు' మరి అప్పుడు ఏం మాట్లాడుకొన్న తియ్యగానే అనిపిస్తుంది కదా... వాటిని కవి కోయిల పాడని (అయినా తియ్యని) గీతాలు గ వర్ణించారు


alage

మందాకిని said...

మంచి పాటను తీసుకున్నారు. చక్కగా వ్యాఖ్యానిచారు.
ఇంతకన్న గొప్ప పదాల్లో ఎలా చెప్పలో తెలిసుంటే నేను "వేటూరి"కి కాకపోయినా మీకు పోటీ కావడం ఖాయం అయ్యేది.

Anonymous said...

I think vetagadu music is by chakravarti not mahadevan.

Sandeep said...

@bonagiri

సంగీతం చక్రవర్తే! అలాగే సులేమాన్మియా పాట ఈ చిత్రంలోనిది కాదు. ఈ రెండు పొరబాట్లనీ చెపుదామని ఎప్పటినుండో అనుకుని బద్ధకిస్తున్నాను. మీ వ్యాఖ్య ద్వారా చదువర్లకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు.