Friday, September 7, 2012

అలంకారాలు - చంద్రాలోకం

దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.

భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు దొరికిన ఆధారాల వరకు, వీరిలో ప్రథముడు భరతుడు (భరతముని అని కూడా అంటారు). ఈయన ఏ కాలంలో జీవించారు అనే దానికి క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300 వరకు సమాధానాలు వినవస్తున్నాయి కానీ కచ్చితమైన నిర్ణయం ఇంకా లేదు. ఈయన "నాట్యశాస్త్రం" రచయితగా ప్రసిద్ధులు. ముఖ్యంగా ఈయన నటనలో రసాలను గుర్తించి వర్ణించారు. అది అటుంచితే, ఈయన 4 అలంకారాలను గుర్తించారు. ఈయన ప్రత్యేకత, ఆసక్తి నాట్యం పైన ఉండటంతో ఆ శాస్త్రాన్ని గురించి చెప్తూ అలంకారాల గురించి అంటీ-అంటనట్టుగానే కొంత వర్ణించారు. అవి ఏ అలంకారాలు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.

విష్ణుధర్మోత్తరపురాణంలో 18 అలంకారాలను వర్ణించారు. ఈ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాలలో చెప్పింది బృహద్ధర్మపురాణం. ఈ పురాణంలో పిపీలికాదిబ్రహ్మపర్యంతం అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలుకొని సూర్యవంశం, చంద్రవంశం, యక్షులు, రాక్షసులు, పాతాళలోకం, పితృకర్మలు, వాస్తు, జ్యోతిషం, వేదాంతం, సంగీతం, సాహిత్యం అన్నిటి గురించీ 3 భాగాలలో, 1345 పర్వాలలో వర్ణింపబడ్డాయి. దీని రచయిత ఎవరు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది భరతముని కాలం తఱువాతనే వ్రాసి ఉండాలి.

సుమారు క్రీ. శ. 6వ శతాబ్దం చిగురులో దండి అనే మహాకవి "కావ్యదర్శం" అనే గ్రంథంలో 38 అలంకారాలను గురించి వ్రాసారు. ఈయన రచించిన దశకుమారచరిత చాలా ప్రసిద్ధమైనది. "కావ్యదర్శం" పైన "భట్టికావ్యం" అనే రచన ప్రభావం చాలా ఉంది అని కొందరి అభిప్రాయం.

క్రీ.శ. 7వ శతాబ్దంలో లో భామహుడు "కావ్యాలంకారం" అనే గ్రంథం వ్రాసారు. ఇందులోని రెండు, మూడు అధ్యయాలలో అలంకారాల 35 గురించి చెప్పారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే దండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దండి వ్రాసిన దండి కావ్యదర్శాన్ని విమర్శించారు. సూటిగా ఫలాన ఆయన ఇలాగన్నాడు అని అనకుండా అపరే, అన్యే  (వేఱే వారు), కేచిత్ (కొంతమంది), అమేధసః (తెలివితక్కువ వాళ్ళు), కేచిత్ మహాత్మాః (కొందరు మహాత్ములు) వంటి సంబోధనలతో దండి రచనని విమర్శించారు. కాకపోతే కొన్ని చోట్ల పూర్తిగా ఏకీభవించారు కూడా.

దండి యమకం, అనుప్రాస అనే శబ్దాలంకారాలను అలంకారాలుగా గుర్తిస్తే భామహుడు వీటిని వేఱుగా శబ్దచిత్రాలు అన్నారు. వచనకవిత్వంలో కథ, ఆఖ్యానం అనేవి రెండుగా వర్ణించినా నిజానికి ఒకటేనని దండి చెప్తే, భామహుడు దాన్ని ఆక్షేపించారు. ఏది ఏమైనా, దండి భామహుడు సమకాలీనులైనా అవ్వాలి లేక దండి భామహుడి కంటే ముందు ఉండి ఉండాలి అని ఒక అభిప్రాయం. కొందరు అది తప్పంటారు.

ఉద్భాత అనే క్రీ.శ. 8వ శతాబ్దపు కాశ్మీర్ కవి భామహుడు కావ్యాలంకారానికి "భామహవివరణ" అనే పేరుతో దీనికి వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన స్వయంగా "కావ్యాలంకార సంగ్రహం" పేరిట 41 అలంకారాలను వివరించారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రుద్రత అనే కాశ్మీరీ కవి "కావ్యాలంకారం" అనే పేరుతో వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమైనది. ఇందులో 16 అధ్యాయాలలో సుమారు 700 శ్లోకాలలో 68 అలంకారాలను వర్ణించారు. 11వ శతాబ్దంలో మమ్మట అనే ఆయన "కావ్యప్రకాశం" లో 67 అలంకారాలను గుర్తించారు. 12 వ శతాబ్దంలో రుయ్యకుడు "అలంకారసర్వస్వం" లో 79 అలంకారాలను చెప్తే, వాగ్భాత 69టి ని సూచించారు. 13వ శతాబ్దంలో జయదేవుడు 100 అలంకారాలతో వ్రాసిన పుస్తకం "చంద్రాలోకం". దాన్నే ఆధరంగా నేను అలంకారాలను చెప్తున్నాను. ఆ తఱువాత 14 వ శతాబ్దంలో కలింగదేశపు విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో 84టిని గుర్తించారు. 16వ శతాబ్దంలో తమిళనాడులో జన్మించిన అప్పయ్యదీక్షితుడనే ఒక అద్వైత వేదాంతి "కువలయానందం" లో 124 అలంకారాలను గుర్తించారు.

ఇప్పటిదాక నేను చెప్పినది కేవలం భారతసాహిత్యగగనంలో ఎక్కువ వెలుగు కలిగిన తారలనే. వీరు కాక అనేకానేకులు కావ్యం ఎలాగ వ్రాస్తే రక్తి కడుతుంది అనే అంశం మీద పుంఖానుపుంఖాలు వ్రాసారు. ఇంత చరిత్ర కలిగిన మనం చివరకు అర్థం పర్థం లేని పిచ్చి మాటలను పాటలుగా పాడుకుంటున్నామంటే అది మన దోషమేనని చెప్పుకోవాలి.  ఇక చంద్రాలోకం గురించి చెప్పుకుందాము.

చంద్రాలోకం రచించిన జయదేవుడు, గీతగోవిందం రచించిన జయదేవుడూ ఒకరే అని కొంతమంది వాదన. ఇద్దరూ దాదాపు 12 లేక 13 వ శతాబ్దానికి చెందిన వారే. ఇద్దరూ సంస్కృత పండితులే. ఇద్దరూ ఒరిస్సా నుండి వచ్చినవారే. ఇంత సామ్యం ఉన్నా వారు ఒక్కరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గీతగోవిందంలోని పాటల్లో జయదేవుడు తాను భోజదేవుడు, వామదేవీ ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. పైగా ఆయన పరమవైష్ణవుడు. (గీతగోవిందమంతా శ్రీకృష్ణప్రేమామృతమే కదా!) కానీ చంద్రాలోకం రచయిత జయదేవుడు తాను రచించిన "ప్రసన్న రాఘవం" అనే నాటకంలో మహదేవుడు, సుమిత్రా ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. ఈ నాటక శివుడికి సంబంధించిన పండుగ సందర్భంగా మొదట నటింపబడింది అని చెప్పాడు. అప్పట్లో వైష్ణవులకు, శైవులకు ఉన్న పోటీని బట్టి చూస్తే గీతగోవిందం రచయిత ఈతడు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రాలోకాన్ని తెలుగులోకి ఆడిదము సూరకవి అనువదించాడు. ఈయన 18వ శతాబ్దం చివరి భాగానికి చెందిన వాడు. ఆంధ్రనామశెషము, కవిజనరంజనము, రామలింగేశ శతకం వీరి ఇతరరచనలు. సంస్కృత చంద్రాలోకంలో ఒక్కో అలంకారం ఒక్కో శ్లోకంలో వివరింపబడి ఉంది. శ్లోకంలో మొదటి పంక్తి అలంకారం లక్షణాన్ని వివరిస్తే రెండవ పంక్తి ఒక ఉదాహరణను చెప్తుంది.  ఆంధ్ర చంద్రాలోకంలో సూరకవి కూడా అదే శైలిని అవలంబించారు. సంస్కృతశ్లోకాలను ఒకటికి ఒకటిగా తెనిగించారు. తెలుగులో అన్నీ గీతాపద్యాలయ్యాయి. దీని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. వీటిలో అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, పరవస్తు వేంకటరంగాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను ఆధారంగా డా. బులుసు వెంకటసత్యనారాయణ మూర్తి గారు వ్రాసిన పుస్తకం చదువుతూ నేను అలంకారాలను వివరిస్తున్నాను.

12 comments:

కమనీయం said...




అలంకారశాస్త్రం గురించి మీ వివరణ ,అందించిన సమాచారం బాగున్నవి.ఇప్పటి వచనకవులు కూడా తెలిసో,తెలియకో ,అలంకారాలు ఉపయోగిస్తూనే ఉన్నారు కదా.ముఖ్యంగా ,ఉపమ,ఉత్ప్రేక్ష ,వంటివి.కాని వాటికి పదచిత్రాలనో ఏదో పేరు పెడుతున్నారు .ఏ అలంకారమూ లేకపోతే కవిత చప్పగా ఉంటుంది కదా.

Sandeep P said...

నమస్కారం రమణారావు గారు

మీరన్నది నిజమే. కొత్త తరం కవులు బాగానే అలంకారాలను వాడుతున్నారు. కాకపోతే రాను రాను మిగతా అలంకారాలు పోయి అతిశయోక్తులు మిగులుతున్నాయి. ఒక సారి ఈ మధ్యన బాగా విజయవంతమైన చిత్రగీతాలను పరికిస్తే ఆంగ్లపదాలతో విన్యాసాలు బాగుంటున్నాయి తప్పితే, కవిత్వంలో లోతు, అలంకరణ తగ్గిపోయాయనిపిస్తోంది. నేను అలంకారలను గురించి వ్రాయడం మొదలెట్టినప్పుడు ఉదాహరణలుగా కేవలం చలనచిత్రగీతాలను చెప్పాలనుకున్నాను. కానీ శబ్దాలంకారలకు దొరికినంత విరివిగా అర్థాలంకారాలకు ఉదాహరణలు దొరకలేదు. అప్పుడు అనిపించింది. చలనచిత్రకవిత్వం ఇంకా చాలా ఎదగలవలసి ఉంది అని. ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల, సి.నా.రే వంటివారు చాలా కృషి చేసారు. కానీ ఇంకా మిగిలి ఉన్నది చాలా ఉంది అని నా అభిప్రాయం.

రవి said...

మీరు వ్రాస్తున్న అలంకారాలు చాలా బావున్నాయ్.

వీలయితే చిత్రమీమాంస - అప్పయ్యదీక్షితుల వారి సంస్కృత పుస్తకం చూడగలరు. అలంకారాల గురించి అనేక అలంకారశాస్త్రగ్రంథాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రత్యేకత ఏమంటే "ఆమె ముఖము చంద్రుని వలె ఉన్నది" అన్న ఉపమాలంకార వాక్యాన్ని దాదాపు అన్ని అలంకారాలలోనూ ఎలా చెప్పవచ్చునో ఆయన వివరించారు. "ఉపమైకా శైలూషీ" అని ఆయన సిద్ధాంతం.

ఇలా చెప్పిన ఇతర అలంకారజ్ఞులు లేరు. అందుచేత అలంకారాలను ఉపయోగించదలచిన వారికీ, అలంకారాలను పోల్చి నేర్చుకునే వారికీ కూడా ఈ పుస్తకం చక్కగా ఉపకరిస్తుంది.

Sandeep P said...

రవి గారు,

తప్పకుండా ఆ పుస్తకం చిక్కఁబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను అండి. మీ ఉపాయానికి నెనర్లు.

Vidwan Gopi Krishna Ayanambakam said...

alankaaram goorchi theliyani vishayaalu cheppaaru.krithagnathalu.

Rekha Jithendra said...

sapta padi cinma lo repalliya eda ghalluna pongina murali ani oka song undi kadaa.... aa song lo oka line vastundi .......acheruvuna acheruvuna vichina kannula juuda ....idi ye alankaram ??

Unknown said...

Naaku sarigga teliyadu. Ache ruby and maataki ikkada rendu ardhalu. Okati specific cheruvu rendu aascharyamu surprise. Oke mataki veru veru ardhalu unde alankaram. Roopakam? Thappayite kshamincha mani manavi

Unknown said...

Rekha garu

apologies. Adi Yamakam anukunta. Antaku munupu vakyamlo kuda oke mataku rendu ardhalu vastayi. "aa bala gopalam aa bala gopaluni".

Devulapalli varu deenni patallo chala sarlu vaadaaru.

Naa midi midi gnanaaniki maro sari kshamapanalu.

Unknown said...

దెవులపల్లి పాటల్లొ శబ్ధాలంకారములు

చిత్రం: సంపూర్ణ రామాయణం

ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఎదో చెప్ప బోతోంది. వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది. వుండుండి నా వళ్ళు వూగి వూగి పోతుంది. ఇది ఛేకానుప్రాస. ఇక్కడ రెండు మాటలకు అర్ధంలొ కాని తాత్పర్యంలో కాని తేడాలేదు.
తప్పైతే దయతో సరి చేయమని మనవి.

Unknown said...

సందీప్ గారు
కలహంస నడక దాన, కమలాల కనుల దాన (ఏ సినిమాయో గుర్తు రావడంలేదు).

ఇందులో సమాన ధర్మం మరియు ఉపమావాచకము లోపించాయి. కనుక లుప్తం.

ఇంకోసారి మనవి. నావి తప్పటడుగులు. మన్నించగలరు.

Unknown said...

అలా కాదు రూపకం అంటారా? ఉపమానానికి, ఉపమేయానికి భేధం లేనట్టు ఉంది.

Unknown said...

అర్ధ శ్లేష అలంకారం