Tuesday, November 20, 2012

పేరులోని తీపి

చం:-

శివయను మాట బిందువయి జిహ్వను తాకినయంత తానుగా
అవిరళమైన తీపి చని ఆవలి సంగతులెల్ల మాయమౌ
దివిధుని పాపరాశులను తీర్చినయట్టుల నాదు హృత్తునన్
భవలవభావతాపములు భంజనమొందును భక్తివాహినిన్


Tuesday, October 9, 2012

అంతా మాయే, అన్నీ ఆమే/అమ్మే

 శా:-

స్తన్యంబీయని తల్లియున్, శిశువులన్ సాకేటి దొడ్డాలియున్
మాన్యంబౌ సిరియున్ దురాశగొలిపే మాయాత్మికాశక్తియున్
కన్యల్ మ్రొక్కెడి మాతయున్! పురుషులన్ కాల్చేటి కామాగ్నియున్
సన్యాసుల్ సుఖభోగులున్ కొలుచుయా శర్వాణివీవే గదే!

 భా:-

బిడ్డకు పాలివ్వని తల్లివీ, పిల్లలను సాకే తల్లివీ నీవే. గౌరవప్రదమైన సంపదవూ నీవే, దురాశ కలిగించే మాయవీ నీవే. కన్యలు కొలిచే జగన్మాతవూ నీవే, మగవారిని దహించే కామాగ్నివీ నీవే. సన్యాసులు, భోగులు ప్రార్థించే శర్వాణివి నీవే.

శివుడు బ్రహ్మం, పార్వతి మాయ. ఆ రెండూ ఒక్కటే. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు: తడి, నీరు వేఱు వేఱుగా ఉంటాయా? తడి లేకపోతే అది నీరే కాదు. నీరే లేకపోతే అసలు తడే ఉండదు.

Monday, September 17, 2012

కారణమాలాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారం



లక్షణం:
(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైః
నయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాలయగును
నీతిచే సిరి సిరి చేత దాతృతయును
దాతృతను భూరియశమన్నరీతి శర్వ

భావం: కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు, "నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి" అన్నప్పుడు నీతి సంపదకు కారణం, సంపద దానగుణానికి కారణం, దానగుణం కీర్తికి కారణం. ఇది కారణ-మాల-అలంకారం.



(గ్రంథం: భగవద్గీత, రచన: కృష్ణ పరమాత్ముడు/వ్యాసభగవానుడు)
ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామో, కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి

భావం: మనిషి విషయాలను గురించి ఆలోచిస్తూ ఉండగా, తనకు వాటిపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన కోఱిక జనిస్తుంది, కోఱిక వలన (అనుకున్నది దక్కకపోతే) కోపం, కోపం వలన సమ్మోహితుడౌతాడు, సమ్మోహం వలన ఆలోచనను కోల్పోతాడు, ఆలోచనను కోల్పోవడం వలన బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశించడం వలన నాశనమౌతాడు.



(చిత్రం: నాలుగు స్తంభాలాట, రచన: వేటూరి సుందరరామమూర్తి)
చినుకులా రాలి, నదులుగా సాగి, వరదలైపోయి, కడలిగా పొంగు నీ ప్రేమ

వివరణ: ఇది సూటిగా కారణమాలాలంకారం కాకపోయినా చినుకు నదికి కారణం, నది వరదకు కారణం, వరద కడలి పొంగుకు కారణం గా చెప్పుకుంటూ పోవడం వలన ఇది కారణ మాలాలంకారం అని చెప్పుకోవచ్చును అని నా అభిప్రాయం.



(చిత్రం: నువ్వే కావాలి రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి)
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కలిగించింది,
కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది

వివరణ: ఈ పంక్తిలో పరిణామాలంకారం, కారణమాలాలంకారం కలిపి ఉన్నాయని నా అభిప్రాయం. "విశాలనయన ప్రసన్నమై నేత్రపద్మాలతో చూచినది" అన్నామనుకోండి, దాని శబ్దార్థం (literal meaning) ఆమె పద్మాలతో చూచింది అని. కానీ పద్మాలతో ఎవరైనా చూడగలరా? లేదు కదా! అందుచేత ఆమె కళ్ళే పద్మాలయ్యాయి అని వాస్తవార్థం (real meaning). ఇక్కడ "చినుకు పాటయ్యింది" అంటే చినుకు అక్షరాలగానో, రాగం గానో అయ్యింది అని కాదు. చినుకులు చేసే శబ్దం పాటలా వినబడింది (పరిణమించింది) అని. అలాగే పాట తాకిన నేల "చిలకలు వాలే చెట్టయ్యింది" అంటే "పాట చేసే సవ్వడి చిలకపలుకుల లాగా తీయగా ఉన్నాయి" అని భావం. ఇవన్నీ పరిణామలంకారమే. కాకపోతే ఇవి వరుసగా పేర్చుకుంటూ ఒకదానికి మఱొకటి కారణంగా చెప్పారు కవి. నింగి చినుకైంది, చినుకు పాటైంది, నేల చెట్టైంది.



కారణమాలాలంకారానికి మఱొక పద్ధతి ఉంది. అది చూద్దాము.

(గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి)
భవంతి నరకాః పాపాత్ పాపం దారిద్ర్యసంభవం
దారిద్ర్యం అప్రదానేన తస్మాత్ దానపరో భవ

(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
నరకములు పాపమునఁ జే
కుఱుఁబాపము లేమిచే నగును లేమి పరి
స్ఫురణం బీకుండుటచేఁ
బరఁగు నటులుగాన దానపరుఁడవు గమ్మ!

భావం: నరకములు పాపము చేత, పాపము లేమి చేత, లేమి దానమీయకుండుట చేత వచ్చును. కాబట్టి దానము చేయవలెను.

వివరణ: ఇందాకటి ఉదాహరణలలో కారణం వెనుక కార్యం, వెనుక మఱొక కార్యం అలాగ వచ్చాయి. ఈ ఉదాహరణలో కార్యం వెనుక కారణం వచ్చింది. ఇది కూడా కారణమాలాలంకారమే.




(గ్రంథం: భగవద్గీత రచన: కృష్ణపరమాత్ముడు/వ్యాసభగవానుడు)
అన్నాత్ భవతి భూతాని, పర్జన్యాత్ అన్న సంభవః
యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞః కర్మసముద్భవః

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, బ్రహ్మ అక్షరసముద్భవం,
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం

భావం: అన్నం నుణ్డి జీవులు వస్తున్నారు, అన్నం వర్షం నుండి వస్తోంది, వర్షం యజ్ఞం నుండి వస్తోంది, యజ్ఞం విధ్యుక్త కర్మల చేత వస్తోంది, కర్మలు వేదాలనుండి పుట్టాయి, వేదాలు బ్రహ్మం నుండి పుట్టాయి. అందుచేత సర్వత్రా ఉన్న బ్రహ్మ యజ్ఞంలో ప్రతిష్ఠింపబడినాడని గ్రహించు.

వివరణ: ఇదివరకు కోపం వలన సమ్మోహం, సమ్మోహం వలన స్మృతిభ్రంశం అంటుంటే ముందు భాగంలో  కార్యం (సమ్మోహం) తఱువాతి భాగంలో కారణం అవుతోంది. ఇప్పుడు జీవులు అన్నం వలన, అన్నం వర్షం వలన అంటుంటే ముందు భాగంలో కారణం (అన్నం) తఱువాతి భాగంలో కార్యం అవుతోంది. అంతే తేడా.



ఈ పద్ధతికి మఱొక ఉదాహరణ కాకపోయిన ఒక అచ్చు (blue-print) లాగా చెప్పవలసినది అందరికీ తెలిసిన ఏడు చేపల కథ.

అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురూ ఏటికి వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. “చేపా, చేపా, ఎందుకు ఎండలేదు?”  అని అడిగితే, “గడ్డిమోపు అడ్డం వచ్చింది” అని అంది చేప. “గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం వచ్చావు?” అని అడిగితే, “ఆవు  మేయలేదు” అని చెప్పింది గడ్డిమోపు.  “ఆవూ, ఆవూ గడ్డి ఎందుకు మేయలేదు?”  అని అడిగితే, “పశువుల కాపరి  విప్పలేదు” అంది. “పశువుల కాపరీ, ఆవును ఎందుకు విప్పలేదు?”  అని అడిగితే, “అమ్మ గారు అన్నం  పెట్టలేదు” అన్నాడు పశువుల కాపరి. “అమ్మ గారు అమ్మ గారు ఎందుకు అన్నం పెట్టలేదు?”  అని అడిగితే, “పాప  ఏడ్చింది” అంది. “పాప పాప ఎందుకు ఏడ్చావు?” అని అడిగితే, “చీమ కుట్టింది” అంది పాప. “చీమా చీమా ఎందుకు కుట్టావు?” అని అడిగితే, “నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?”

అంది చీమ. ఇక్కడ కూడా కార్యం ముందు తెలుస్తోంది, కారణం తఱువాత తెలుస్తోంది.

Friday, September 7, 2012

అలంకారాలు - చంద్రాలోకం

దాదాపు రెండేళ్ళ క్రితం అలంకారాల గురించి వ్రాయడం ఆరంభించాను. అసలు ఈ అలంకారాల గురించి ఎక్కడ చదువుతున్నాను, వీటి చరిత్ర ఏమిటి అనేది కూడా చెప్తే బాగుంటుంది అనిపించింది. ఈ వ్యాసం అందుకే.

భారతదేశంలో తరతరాలుగా కవులు అలంకారాలను గుర్తిస్తూ వాటి గురించి దీర్ఘవిశ్లేషణలతో పుస్తకాలు వ్రాస్తూ వచ్చారు. వీరు అలంకారాల గురించి చెప్పే శాస్త్రాన్ని అలంకారశాస్త్రం అన్నారు. మనకు దొరికిన ఆధారాల వరకు, వీరిలో ప్రథముడు భరతుడు (భరతముని అని కూడా అంటారు). ఈయన ఏ కాలంలో జీవించారు అనే దానికి క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 300 వరకు సమాధానాలు వినవస్తున్నాయి కానీ కచ్చితమైన నిర్ణయం ఇంకా లేదు. ఈయన "నాట్యశాస్త్రం" రచయితగా ప్రసిద్ధులు. ముఖ్యంగా ఈయన నటనలో రసాలను గుర్తించి వర్ణించారు. అది అటుంచితే, ఈయన 4 అలంకారాలను గుర్తించారు. ఈయన ప్రత్యేకత, ఆసక్తి నాట్యం పైన ఉండటంతో ఆ శాస్త్రాన్ని గురించి చెప్తూ అలంకారాల గురించి అంటీ-అంటనట్టుగానే కొంత వర్ణించారు. అవి ఏ అలంకారాలు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు.

విష్ణుధర్మోత్తరపురాణంలో 18 అలంకారాలను వర్ణించారు. ఈ పురాణాన్ని అష్టాదశ ఉపపురాణాలలో చెప్పింది బృహద్ధర్మపురాణం. ఈ పురాణంలో పిపీలికాదిబ్రహ్మపర్యంతం అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు మొదలుకొని సూర్యవంశం, చంద్రవంశం, యక్షులు, రాక్షసులు, పాతాళలోకం, పితృకర్మలు, వాస్తు, జ్యోతిషం, వేదాంతం, సంగీతం, సాహిత్యం అన్నిటి గురించీ 3 భాగాలలో, 1345 పర్వాలలో వర్ణింపబడ్డాయి. దీని రచయిత ఎవరు అనేది కచ్చితంగా తెలియదు కానీ ఇది భరతముని కాలం తఱువాతనే వ్రాసి ఉండాలి.

సుమారు క్రీ. శ. 6వ శతాబ్దం చిగురులో దండి అనే మహాకవి "కావ్యదర్శం" అనే గ్రంథంలో 38 అలంకారాలను గురించి వ్రాసారు. ఈయన రచించిన దశకుమారచరిత చాలా ప్రసిద్ధమైనది. "కావ్యదర్శం" పైన "భట్టికావ్యం" అనే రచన ప్రభావం చాలా ఉంది అని కొందరి అభిప్రాయం.

క్రీ.శ. 7వ శతాబ్దంలో లో భామహుడు "కావ్యాలంకారం" అనే గ్రంథం వ్రాసారు. ఇందులోని రెండు, మూడు అధ్యయాలలో అలంకారాల 35 గురించి చెప్పారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే దండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దండి వ్రాసిన దండి కావ్యదర్శాన్ని విమర్శించారు. సూటిగా ఫలాన ఆయన ఇలాగన్నాడు అని అనకుండా అపరే, అన్యే  (వేఱే వారు), కేచిత్ (కొంతమంది), అమేధసః (తెలివితక్కువ వాళ్ళు), కేచిత్ మహాత్మాః (కొందరు మహాత్ములు) వంటి సంబోధనలతో దండి రచనని విమర్శించారు. కాకపోతే కొన్ని చోట్ల పూర్తిగా ఏకీభవించారు కూడా.

దండి యమకం, అనుప్రాస అనే శబ్దాలంకారాలను అలంకారాలుగా గుర్తిస్తే భామహుడు వీటిని వేఱుగా శబ్దచిత్రాలు అన్నారు. వచనకవిత్వంలో కథ, ఆఖ్యానం అనేవి రెండుగా వర్ణించినా నిజానికి ఒకటేనని దండి చెప్తే, భామహుడు దాన్ని ఆక్షేపించారు. ఏది ఏమైనా, దండి భామహుడు సమకాలీనులైనా అవ్వాలి లేక దండి భామహుడి కంటే ముందు ఉండి ఉండాలి అని ఒక అభిప్రాయం. కొందరు అది తప్పంటారు.

ఉద్భాత అనే క్రీ.శ. 8వ శతాబ్దపు కాశ్మీర్ కవి భామహుడు కావ్యాలంకారానికి "భామహవివరణ" అనే పేరుతో దీనికి వ్యాఖ్యానం వ్రాసారు. ఆయన స్వయంగా "కావ్యాలంకార సంగ్రహం" పేరిట 41 అలంకారాలను వివరించారు. క్రీ.శ. 9వ శతాబ్దంలో రుద్రత అనే కాశ్మీరీ కవి "కావ్యాలంకారం" అనే పేరుతో వ్రాసిన పుస్తకం ప్రసిద్ధమైనది. ఇందులో 16 అధ్యాయాలలో సుమారు 700 శ్లోకాలలో 68 అలంకారాలను వర్ణించారు. 11వ శతాబ్దంలో మమ్మట అనే ఆయన "కావ్యప్రకాశం" లో 67 అలంకారాలను గుర్తించారు. 12 వ శతాబ్దంలో రుయ్యకుడు "అలంకారసర్వస్వం" లో 79 అలంకారాలను చెప్తే, వాగ్భాత 69టి ని సూచించారు. 13వ శతాబ్దంలో జయదేవుడు 100 అలంకారాలతో వ్రాసిన పుస్తకం "చంద్రాలోకం". దాన్నే ఆధరంగా నేను అలంకారాలను చెప్తున్నాను. ఆ తఱువాత 14 వ శతాబ్దంలో కలింగదేశపు విశ్వనాథుడు సాహిత్యదర్పణంలో 84టిని గుర్తించారు. 16వ శతాబ్దంలో తమిళనాడులో జన్మించిన అప్పయ్యదీక్షితుడనే ఒక అద్వైత వేదాంతి "కువలయానందం" లో 124 అలంకారాలను గుర్తించారు.

ఇప్పటిదాక నేను చెప్పినది కేవలం భారతసాహిత్యగగనంలో ఎక్కువ వెలుగు కలిగిన తారలనే. వీరు కాక అనేకానేకులు కావ్యం ఎలాగ వ్రాస్తే రక్తి కడుతుంది అనే అంశం మీద పుంఖానుపుంఖాలు వ్రాసారు. ఇంత చరిత్ర కలిగిన మనం చివరకు అర్థం పర్థం లేని పిచ్చి మాటలను పాటలుగా పాడుకుంటున్నామంటే అది మన దోషమేనని చెప్పుకోవాలి.  ఇక చంద్రాలోకం గురించి చెప్పుకుందాము.

చంద్రాలోకం రచించిన జయదేవుడు, గీతగోవిందం రచించిన జయదేవుడూ ఒకరే అని కొంతమంది వాదన. ఇద్దరూ దాదాపు 12 లేక 13 వ శతాబ్దానికి చెందిన వారే. ఇద్దరూ సంస్కృత పండితులే. ఇద్దరూ ఒరిస్సా నుండి వచ్చినవారే. ఇంత సామ్యం ఉన్నా వారు ఒక్కరే అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గీతగోవిందంలోని పాటల్లో జయదేవుడు తాను భోజదేవుడు, వామదేవీ ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. పైగా ఆయన పరమవైష్ణవుడు. (గీతగోవిందమంతా శ్రీకృష్ణప్రేమామృతమే కదా!) కానీ చంద్రాలోకం రచయిత జయదేవుడు తాను రచించిన "ప్రసన్న రాఘవం" అనే నాటకంలో మహదేవుడు, సుమిత్రా ల సంతానాన్ని అని చెప్పుకున్నాడు. ఈ నాటక శివుడికి సంబంధించిన పండుగ సందర్భంగా మొదట నటింపబడింది అని చెప్పాడు. అప్పట్లో వైష్ణవులకు, శైవులకు ఉన్న పోటీని బట్టి చూస్తే గీతగోవిందం రచయిత ఈతడు అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

చంద్రాలోకాన్ని తెలుగులోకి ఆడిదము సూరకవి అనువదించాడు. ఈయన 18వ శతాబ్దం చివరి భాగానికి చెందిన వాడు. ఆంధ్రనామశెషము, కవిజనరంజనము, రామలింగేశ శతకం వీరి ఇతరరచనలు. సంస్కృత చంద్రాలోకంలో ఒక్కో అలంకారం ఒక్కో శ్లోకంలో వివరింపబడి ఉంది. శ్లోకంలో మొదటి పంక్తి అలంకారం లక్షణాన్ని వివరిస్తే రెండవ పంక్తి ఒక ఉదాహరణను చెప్తుంది.  ఆంధ్ర చంద్రాలోకంలో సూరకవి కూడా అదే శైలిని అవలంబించారు. సంస్కృతశ్లోకాలను ఒకటికి ఒకటిగా తెనిగించారు. తెలుగులో అన్నీ గీతాపద్యాలయ్యాయి. దీని గురించి చాలా మంది వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. వీటిలో అక్కిరాజు ఉమాకాంతవిద్యాశేఖరులు, పరవస్తు వేంకటరంగాచార్యులు వ్రాసిన వ్యాఖ్యానాలను ఆధారంగా డా. బులుసు వెంకటసత్యనారాయణ మూర్తి గారు వ్రాసిన పుస్తకం చదువుతూ నేను అలంకారాలను వివరిస్తున్నాను.

Monday, September 3, 2012

హేత్వలంకారము


వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం


లక్షణం:

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)
హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతే
అసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||

అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)
కార్యకారణములు రెండు గలియఁబలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీ శశి మదవతీ క
దంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకు

వివరణ: హేతువు అంటే కారణం. హేతుమంతం అంటే కార్యం. ఉదాహరణకు సూర్యుడు రావడం హేతువు, పద్మాలు విచ్చుకోవడం కార్యం. హేతువు, హేతుమంతం ఒకే వాక్యంలో చెప్తే అది హేత్వలంకారం (హేతు + అలంకారం) అవుతుంది.

సూర్యుడు ఉదయించడం వలన జరిగే కార్యాలేమిటి? చెట్లు వికసించడం, సముద్రంలోని నీళ్ళు ఆవిరవ్వడం మొదలుకొని ఒడియాలు ఆరడం వరకు అనేకఫలితాలు ఉన్నాయి. కానీ, సూర్యుడు ఉదయించినది కేవలం పద్మాలు విచ్చుకోవడం కోసమేనన్నామనుకోండి, మిగతావి అంత ముఖ్యమైనవి కావు, పద్మాలు వికసించడమే అసలు విషయం అనే ధ్వని వచ్చి పద్మాలను పొగిడినట్టు అవుతుంది. అదే హేత్వలంకారం.

పై శ్లోకంలో (అనువాదంలోనూ) రెండొ భాగంలో కవి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఈ అందమైన భామల అలుక తీర్చడానికే చంద్రుడు ఉదయిస్తున్నాడు" అని ఆ వాక్యం భావం. నిజానికి చంద్రుడు రావడం వలన అనేకకార్యాలు జరుగుతాయి. మచ్చుకు కలువలు విచ్చుకుంటాయి. కానీ కవి వాటన్నిటినీ త్రోసిపుచ్చి అలిగిన అమ్మాయిలు అలుక వీడి ప్రియులకు లొంగడానికే వచ్చాడు అంటున్నాడు.


హేత్వలంకారం మఱొక లాగా కూడా సమకూరచ్చును. దానికి కవి ఇచ్చిన లక్షణం, ఉదాహరణ చూద్దాము.

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం)
హేతు హేతుమతోరైక్యం హేతుం కేచిత్ ప్రచక్షతే
లక్ష్మీ విలాస విదుషాం కటాక్షా వేంకట ప్రభోః

అనువాదం: (ఆడిదము సూరకవి)
కార్యకారణములకు నైక్యమగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రమావిలాసములు వేంక
టేశ్వర కటాక్షము లనంగ నిందు మౌళి

వివరణ: కొంతమంది హేతువు, హేతుమంతం ఒకటేనని చెప్పడం హేత్వలంకారం అంటారు. ఉదాహరణకు "సత్కవులకు లభించే సిరిసంపదలు శ్రీ వేంకటేశ్వరుని కటాక్షం" అన్నామనుకోండి. నిజానికి వెంకటేశ్వరుని అనుగ్రహం "వలన" మనకు సిరిసంపదలు లభిస్తాయి అని ఉద్దేశం. కానీ, ఆ "వలన" అనే పదం విడిచిపెట్టేసి రెండిటికీ అభేదం చెప్తున్నాము. ఇదీ హేత్వలంకారమే.


ఈ అలంకారం చాలా తెలుగు పాటలలో విన్న గుర్తు. గుర్తుకు వచ్చినప్పుడు అవీ కలుపుతాను. ఈ లోపల చదువర్లకు ఏమైనా ఉదాహరణలు తెలిస్తే చెప్పగలరు.

Sunday, September 2, 2012

రాంబాబు కథలు - అసలు కంటే వడ్డీ ముద్దు

ఒక రోజు పొద్దున్నే రాంబాబు & కో మధ్య సంభాషణలు.

వెం: ఆకలేస్తోందిరా. ఏమైనా తినడానికి ఉందా?
రాం: వెళ్ళి వంటింట్లో వెతుక్కో.
వెం: ఇక్కడ biscuit packet ఉంది? ఎప్పటిది?
రాం: అది తినకు, ఎప్పుడో పరమపదించింది.
వెం: (packet పై label చదువుతూ) ఇది September 1st న manufacture ఐందిరా. Best before 2 weeks of manufacture. ఫరవాలేదు.

(వెంకట్ packet తెరిచి ఒక biscuit ముక్క తిన్నాడు. తింటూనే గొంతులో మండినట్టైంది, ఒక రకమైన చేదు నాలికని ముంచేసింది.)

వెం: యక్క్...ఏమిటిరా ఇది? ఇంత దారుణంగా ఉంది?
రాం: బ్రహ్మచారుల ఇళ్ళలో manufacture date చూసినప్పుడు year కూడా చూసుకుంటూ ఉండాలి బాబు. నేను ముందే చెప్పాను. అందుకే...మంచి మనిషికొక మాట, మంచి కుక్కకొక biscuit అన్నారు. నీకు మాట పని చెయ్యలేదు కానీ biscuit పని చేసింది.

(ఇంతలో వెంకట్ లేచాడు.)

చం: Good Morning
రాం: ఆ నీకు శుభోదయం, వీడికి అశుభోదరం.

(చందు phone మ్రోగింది. phone ఎత్తాడు.)

చం: ఏంటి పెద్దమ్మ, ఎలాగున్నావు?
...
చం: ఆవేశపడకు, అసలేం జరిగిందో చెప్పు.
...
చం: నేను అన్నయ్యలతో మాట్లాడతానులే.


(చందు phone cut చేసి, వేఱొక number నొక్కి మాట్లాడసాగాడు).


చం: ఆ, అన్నయ్య. ఇప్పుడే పెద్దమ్మ phone చేసింది. అసలు విషయమేమిటి?
...

(చందు వేఱే గదిలోకి వెళ్ళి చాలా సేపటికి phone పెట్టేసి బయటకు వచ్చాడు. రాంబాబు, వెంకట్ ఏమైందా అని కంగారు పడ్డారు.)


వెం: ఏరా, ఏమైంది?

(దానికి చందు పకలబడి ఒక ఐదు నిముషాల పాటు నవ్వాడు. వెంకట్, రాంబాబులకు ఏమీ అర్థం కాలేదు. విషయం ఏమిటో చెప్పమన్నా చెప్పట్లేదు.)

వెం: అన్నట్టు ఇందాక మా danger బాబాయ్ phone చేసాడు రా. పిసినారు మాష్టారు గారి అమ్మాయి నాకు వద్దని చెప్పేసాను కదా, నాకు తెలిసిన software engineer లు ఎవరైనా ఉంటే సంబంధం చెప్పమన్నాడు. నీ పేరు ప్రతిపాదిస్తున్నాను.

(చందు ముఖం ఉన్నట్టుండి ఎఱ్ఱగా అయిపోయింది.)

చం: రేయ్, ఎంత పని చేసావు రా? నిన్ను friend అని ఆదరించినందుకు నాకు
...
వెం: వోల్డేయ్! అదేమీ జరగలేదు. ఇప్పుడు చెప్పు -- అసలా phone లు ఏంటి, నీ నవ్వేమిటి?
చం: "అసలు కంటే వడ్డీ ముద్దు" అనే సామెత మనవల గురించి చెప్తూ ఉంటారు కదా?
రాం, వెం: ఊఁ
చం: ఇప్పుడు మన bank లకు మల్లే వడ్డీలు ఆట్టే బాగుండట్లేదు. మా పెద్దమ్మ మనవలు, మనవరాళ్ళు ఆవిడకు నచ్చట్లేదు. అదే గగ్గోలు పెడుతోంది.
రాం: ఇంకొంచెం వివరింపుము.
చం: మా పెద్దమ్మకు నలుగురు కొడుకులు. నలుగురూ నాలుగు ఊళ్ళల్లో ఉన్నారు. ఆవిడకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడకు వెళ్ళి వస్తూ ఉంటుంది. కొడుకులందరూ ఆవిణ్ణి బాగా చూసుకుంటారు. ఈ మధ్యన మా పెద్దమ్మ హైదరాబాదులో ఉన్న రెండో కొడుకు ఇంటికి వెళ్ళింది. అదే సుందరన్నయ్య అని చెప్తాను అతను. సుందరన్నయ్య కి పదేళ్ళ కూతురుంది. దాని పేరు  సౌమ్య.

ఒక రోజు తఱగతిలో అందరూ తమ తమ తాత గురించి చెప్పుకుంటున్నారు. సౌమ్య ఏమో అసలు మా పెదనాన్నను చూడనే లేదు. అది పుట్టక మునుపే ఆయన కాలం చేసారు. కానీ తోటి పిల్లల మాటలు విని ఈమెకు బాధేసింది. చాలా ఉక్రోషంతో ఇంటికి వచ్చి అన్నయ్యతో "నాన్న, నువ్వు తాతను నాకు ఎందుకు చూపించలేదు?", అని నిలదీసింది. వాళ్ళ తను నవ్వుతూ, "నువ్వు పుట్టక ముందే తాతగారు చనిపోయారమ్మా",  అన్నాడు. ఆమె ముఖం దిగులుగా మారిపోయింది. కాస్త ఉత్సాహపరుద్దామని, "బాధపడకమ్మా, నువ్వే మా నాన్నవి, తాతే మళ్ళీ నువ్వై పుట్టావు", అన్నాడు. అదే అన్నయ్య చేసిన పాపం. వెంటనే సౌమ్య చెలరేగిపోయింది. వాళ్ళ అమ్మను, నాన్నను పేరు పెట్టి పిలవడం మొదలెట్టేసింది. తిడితే ఏడుస్తుంది అని ఊరుకున్నారు.

అది జరిగిన వారానికి మా పెద్దమ్మ పెద్దన్నయ్య ఇంటినుండి సుందరన్నయ్య దగ్గరకు వచ్చింది. ఆవిడ వస్తూనే సౌమ్య ఆవిణ్ణి పేరుతో పిలిచి, "కాస్త కాఫీ పట్రా" అంది. పెద్దమ్మ నివ్వెరపోయింది. "ఏఁవిటే గుంట, నీ ఆగడం", అంది. దానికి "ఇదిగో, నన్ను గుంట, తుంట అన్నావంటే దెబ్బలు పడతాయి. నన్ను ఏఁవండీ అని పిలవాలి" అంది. పెద్దమ్మకు ఇంకా ఏమీ అర్థం కాలేదు. ఇంతలో అన్నయ్య వచ్చి జరిగిన విషయం చెప్పి, "అమ్మా, రెండు రోజులు ఊరుకుంటే విషయం సర్దుమణుగుతుందిలేవే", అన్నాడు.

అక్కడితో కథ ముగిసింది అనుకున్నాడు కానీ అసలు సంగతి మరిచిపోయాడు. మా పెదనాన్న form లో ఉండగా మా పెద్దమ్మను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకని మా పెద్దమ్మకు ఆయనంటే గొప్ప చిఱాకు. సౌమ్యకు మా పెదనాన్న పోలికలు కొన్ని వచ్చాయి. వెరసి, చంద్రముఖి రజినీకాంత్ నే రాజు అనుకున్నట్టు మా పెద్దమ్మ నిజంగానే సౌమ్య మా పెదనాన్న అని sub-conscious గా ముద్ర వేసేసుకుంది.  పెదనాన్న మీద ఉన్న కక్షంతా ఈ చిన్నపిల్ల మీద చూపించడం మొదలెట్టింది. అది తాగే పాలలో నీళ్ళు ఎక్కువ కలిపేయడం, కోడలు అడిగితే "చిక్కటి పాలు తాగితే అజీర్తి చేస్తుంది", అనడం. అన్నంలో పెరుగనేసరికి  చకచకా మజ్జిగ గిలక్కొట్టేయడం, కోడలు అడిగితే "మజ్జిగ అరుగుదలకు మంచిది", అనడం.  పాప పడుకుంటే fan కట్టేయడం, కోడలడిగితే బుగ్గలు నొక్కుకుంటూ, "ఓసినీ, అంత పెద్ద మంచం మీద పిట్టంత ఉంటే దిండనుకున్నాను", అనడం. చదువు చెప్తాను అని పద్నాల్గు పన్నెండ్లగడం -- చెప్పకపోతే మొట్టేసి, "నీకు దెబ్బలు పడాలి", అనడం. ఒక రోజు ఏం జరిగిందంటే...

<ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్...>

పెద్దమ్మ: ఈ రోజు నక్షత్రం ప్రకారం మీ నాన్న గారి పుట్టినరోజు రా అబ్బాయ్, ఈ చంటిదానికి తలంటు పోసుకుని సంతోషించనివ్వరా.

(వదిన వద్దు అని చెప్పమని అన్నయ్యకు సైగ చేసింది, కానీ అప్పటికే అన్నయ్య కళ్ళల్లో నీళ్ళు municipality గొట్టంలో లాగా చుక్కలు చుక్కలుగా కారుతున్నాయి. గొంతైతే ఆ కుళాయిలో నీళ్ళొచ్చే ముందు లాగా గాలి వస్తోంది
కానీ మాట రావట్లేదు. అప్పటికీ మా వదిన ఆపుదామని ప్రయత్నించింది.)


వదిన: అత్తయ్య గారు, ఎవరైనా English calendar ప్రకారం చేసుకుంటారు, లేకపోతే తిథుల ప్రకారం చేసుకుంటారు, నక్షత్రాల ప్రకారం ఏమిటండి? పైగా ఇది అధిక మాసం కూడాను!
పెద్దమ్మ: నెల తక్కువ వాళ్ళకు అధికమాసంలోనే పుట్టినరోజు చేస్తారని మీ మావయ్య గారు ఎప్పుడూ అధికమాసంలోనే చేసుకుంటూ ఉండేవారులే తల్లీ. ఐనా మా వైపు ఆచారాలు నీకు తెలియవు.
వదిన: అమ్మాయికి జలుబుగా ఉందండి. ఇప్పుడు ఎందుకు?
పెద్దమ్మ: అంతేలే అమ్మా, ఎంతైనా కూతురు లేదనే కదా నీకు నేనంటే లోకువ? మీ మావగారు నాతో ఎన్ని అబద్ధాలు చెప్పినా అదేమిటో మాయదారి దేవుడు ఒక్క ఆడ నలుసును కూడా ఇవ్వలేదు.

(అంటూ కంట తడి పెట్టుకుంది. ఇది చూసి ఓర్చుకోలేక మా అన్నయ్య...)

అన్నయ్య: అమ్మా, నువ్వు సౌమ్యకు స్నానం చేయించాలి. అలా చేయిస్తేనే నాన్న ఆత్మకు శాంతి కలుగుతుంది.

(పది నిముషాలు తిరిగేసరికి సౌమ్య కళ్ళు మంట, జుట్టంతా చిక్కులు. ఆరున్నర శ్రుతిలో ఏడుస్తుంటే వదిన అన్నయ్య దగ్గరకు తీసుకొచ్చి...)

వదిన: మీ నాన్న గారు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. కాస్త ఓర్దార్చండి.

(అన్నయ్య వదిన దగ్గర తువ్వాలు తీసుకుని సౌమ్యని దగ్గరకు తీసుకుని ఆ తువ్వాలు తలపై వేసి చెవులు నొక్కి పట్టుకుని...)

అన్నయ్య: పిచ్చి మొహమా...మా నాన్న సౌమ్య అవ్వడం ఏమిటే వెఱ్ఱిబాగుల్దానా. నువ్వు దీన్ని ఎనిమిదో నెల కడుపుతో ఉండగా మా నాన్న స్వర్గస్థులయ్యారు. అప్పటికే ఇది నీ కడుపులో comfortable గా దొర్లుతూ ఉండటం నా కళ్ళతో sonogram లో చూసాను. కి..కి..కి. నేను అబద్ధం ఆడితే నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న నీకే
తెలియలేదు. అలాగ ఉండాలి అబద్ధం అంటే...
వదిన: అవునా...మరి మీ నాన్న గారి నక్షత్ర-పుట్టినరోజుకు దీనికి తలంటు పోస్తానంటే ఎందుకు ఒప్పుకున్నట్టో? మీ అబద్ధాలు మిమ్మల్ని కూడా నమ్మించేస్తున్నాయి కాబోలు.

(అన్నయ్య తెల్లబోయి చూస్తూ ఉండగా సౌమ్య శ్రుతి పెంచి ఏడవడం మొదలెట్టింది...)

సౌమ్య: నాన్న -- నాకు వినబడటం లేదు. నా చెవులకు ఏదో ఐంది...
అన్నయ్య: బంగారం, ఏఁవీ కాలేదు నాన్న, ఆగు.

(అంటూ తల తుడవడం మొదలెట్టాడు. ఇంతలో పెద్దమ్మ గది బయటనుండి...)

పెద్దమ్మ: ఒరేయ్ నాన్న, మీ నాన్న గారికి ఇష్టమని జీడిపప్పు గారెలు చేసాను రా. అల్లప్పచ్చడి కూడాను.
వదిన: జీడిపప్పు గారెలా? అదేమిటండి?
అన్నయ్య: మా అమ్మకు గారెలంటే పిచ్చి, మా నాన్నకు మందులో నంజుకోవడానికి వేయించిన జీడిపప్పు అంటే ఇష్టం. పుణ్యం పురుషార్థం కలిసొస్తాయని మా అమ్మ ఈ కొత్త వంటకం కనిపెట్టింది. మా గొప్ప రుచిగా ఉంటుంది అనుకో. ఇప్పటికీ మా నాన్నకు తద్దినం పెట్టడానికి వచ్చిన బ్రాహ్మలు "మీ చేత్తో వడ్డించిన గారెలే గారెలండి!" అంటూ ఉంటారు.
పెద్దమ్మ: ఏరా, వస్తున్నారా?

(భోజనాల బల్లమీద అందరూ కూర్చుంటుంటే)

పెద్దమ్మ: అమ్మాయ్, నువ్వు నేను తఱువాత కూర్చుందాము. అదేమిటో వడ్డిస్తూ తిన్నా, ఒక్కదానినీ తిన్నా నాకు వంటపట్టదు.

(వదిన అమాయకంగా తల ఊపుతూ లేచింది).

అన్నయ్య (లొట్టలేస్తూ): అబ్బా, గొప్ప కారంగా కుదిరాయే. సెగొచ్చేస్తోంది నోట్లోంచి.


(ఇంతలో సౌమ్య మళ్ళీ ఏడవడం మొదలెట్టింది...)

అన్నయ్య: ఏమైంది బంగారం?
వదిన: మీ బంగారానికి కారమెక్కువైంది. ఆగండి, పంచదార తెస్తాను.
పెద్దమ్మ (సౌమ్యతో): అదేమిటండి? ఒకప్పుడు ఇవి లొట్టలేసుకుంటూ తినేవారు. ఇప్పుడెందుకు కారమంటున్నరు?
వదిన: ఆఁ, అప్పట్లో పక్కన తీర్థముండేది. ఇప్పుడు ప్రసాదం ఒక్కటీ తింటుంటే ఎక్కట్లేదు.

(అన్నయ్య, సౌమ్య తిని లేచి వేఱే గదిలో కూర్చున్నారు)

అన్నయ్య: బంగారం, నీకొక surprise.
సౌమ్య: నాకు surprise వద్దు. బామ్మతో sorry చెప్పించు. నాకు కోపం తెప్పిస్తోంది.
అన్నయ్య: బామ్మ మనందరి కంటే పెద్దది కదా, sorry చెప్పకూడదు. అందుకే నీకు chocolate తెచ్చాను. ఇదిగో!

(సౌమ్య ఒక చేత్తో chocolate తీసుకుని, మఱొక చెయ్యి చాపింది. అన్నయ్య చెయ్యి తట్టబోతే, చెయ్యి పక్కకు జరిపి మళ్ళీ చాపింది...)

అన్నయ్య: chocolate ఇచ్చాను కదా?
సౌమ్య: రెండు కావాలి.
అన్నయ్య: అమ్మ మీద నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒకటే కదా ఇచ్చేది?
సౌమ్య: అది మా అమ్మ కోపం తెప్పిస్తే. ఇప్పుడు మీ అమ్మ కోపం తెప్పిస్తోంది.

(అన్నయ్య నివ్వెరపోయి రెండొ chocolate ఇచ్చాడు. వెంటనే పక్కనే ఇంకో చెయ్యి చాపి ఉంది. చూస్తే అది మా వదినది.)

వదిన: నాకోటి ఇవ్వండి.
అన్నయ్య: ఎందుకు?
వదిన: ఆఁ, మీ అమ్మ గారు నాకూ కోపం తెప్పించారు.
అన్నయ్య: అబ్బా, ఆశ, దోస...సౌమ్యకు, నీకూ ఒకందుకే కోపం వచ్చింది. నాకు మాత్రం మూడు chocolateలు ఖర్చా?
వదిన: నాకు వేఱేగా కోపం తెప్పించారు.

(అన్నయ్య ముఖంలో ప్రశ్నార్థకం చూసి వీళ్ళు వచ్చేసిన తఱువాత భోజనాల బల్ల దగ్గర జరిగిన విషయం చెప్పింది...)


<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

పెద్దమ్మ: అమ్మాయ్, కూర్చో వడ్డించుకుందాము. ఇప్పటికే పదకొండైంది. మళ్ళీ నువ్వు మధ్యాహ్నానికో రెండు పప్పు గింజలు, నాలుగు బియ్యపు గింజలూ cooker లో పడేసి, కాసిని కూర ముక్కలు వేయించాలి, ఇంత చారో పులుసో కాయాలి. నేనూ రెండు గారెలు తిని కాస్త సాయం చేస్తాను. ఎలాగా నూనె పొయ్యి మీదనే ఉంది కాబట్టి అప్పడాలూ, ఒడియాలూ వేయిస్తాను.
వదిన: అలాగేనండి
పెద్దమ్మ:  అన్నట్టు పొద్దున్న వెంకటేశ్వర స్వామికి కొట్టిన కొబ్బరికాయ పచ్చడి చేసేయమ్మాయ్, లెకపోతే పాడైపోతుంది. అన్నట్టు ఈవేళ శనివారం కదా. రాత్రి నేను tiffin ఏ తింటాను. అందులో ఈ పచ్చడి నంజుంకుని తింటే సరిపోతుంది.
వదిన: అలాగేనండి. రాత్రి మీకు వేఱుగా కాస్త ఉప్పుపిండి వండుతాను.
పెద్దమ్మ: అదేమిటమ్మాయి? నాకేమైనా చక్కెరవ్యాధా, గుండెపోటా? పెసలు నానబోసి చక్కగా నాలుగు పెసరట్లు పొయ్యి. సన్నగా తరిగిన మిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు కూడా దట్టించావనుకో ఆ రుచే వేఱు.

(వింటూనే వదినకి తల తిరిగింది. పెద్దమ్మ రెండంటే రెండే గారెలు తీసి వదిన పళ్ళెంలో వేసింది. వదిన ఆశ్చర్యంగా చూస్తూ...)

వదిన: అదేమిటండి మీరు పదహారు గారెలుకు కదా పిండి కలిపింది?
పెద్దమ్మ: అవునమ్మాయ్, రుచి కోసమని ఓ నాలుగు నోట్లో పడేసుకున్నాను. అదేమిటో ఉప్పు తక్కువైంది అని, కారం తక్కువైంది అని, రెండూ సరిపోతే జీడిపప్పు చాలక, అన్ని సార్లు రుచి చూడాల్సొచ్చింది. అది కాక అబ్బాయ్ ఒక అరడజను తిన్నాడు. వెఱ్ఱి నాగన్న! మంచి తిండి తిని చాలా రోజులైనట్టుంది. గుంటది రెండు తింది, మిగిలిన నాలుగూ నీకు రెండు, నాకు రెండు వేసాను. నీకు చాలకపోతే చెప్పు, ఒక సగం గారె అటేస్తాను.

వదిన: వద్దులేండి.

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

వదిన: అది కూడా సహించానండి. కాకపోతే తింటున్నంత సేపూ మీ నాన్న గారి వలన ఆవిడ అనుభవించిన కష్టాలన్నీ చెప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. పోయినాయన్ని పట్టుకుని, "అసలు మనిషేనా", అని అడుగుతుంటే అవుననాలో కాదనాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాను. పోనీ తింటున్నట్టు నటిద్దామా అంటే ఆ రెండు గారెలు ఎంత గిల్లుకొని తిన్నా అరగంట తినగలనా?

(ఈ కంగారు తట్టుకోలేక మా అన్నయ్య ఇక నిజం చెప్పేద్దామనుకున్నాడు. ధైర్యం చిక్కబుచ్చుకుని, పెద్దమ్మకు ఎదురుబడ్డాడు.)

అన్నయ్య: అమ్మా, నేను నీకొక నిజం చెప్పాలి. అది విని నువ్వు నన్ను తిట్టకూడదు, నువ్వు బాధపడకూడదు.
పెద్దమ్మ: మీ నాన్న నిజం దాచి ముప్పు తెచ్చారు, నువ్వు నిజం ఎంత చేదైనది ఐనా సరే, చెప్పరా.
అన్నయ్య: నేనేదో దాన్ని ఊరడించడానికి అలాగ చెప్పానే కానీ అది నాన్న కాదమ్మా.
పెద్దమ్మ: అవునా?
అన్నయ్య: అవునమ్మ.
పెద్దమ్మ: కాదురా, ఇదే మీ నాన్న అని నా అనుమానం. ఆయన కూడా ఇంతే తలంటితే చాలు గుక్కపెట్టి ఏదుస్తూ ఉండేవారు.

అన్నయ్య: అమ్మా, అలాగైతే అన్నయ్య, నేను, తమ్ముళ్ళిద్దరూ కూడా ఏడ్చేవాళ్ళం. అంత మాత్రాన అందరం నాన్నలమైపోతే ఇది జీవితం కాదు అమ్మ, దశావతారం cinema అవుతుంది. ఐనా మగవాడు జన్మాంతరంలో ఆడదానిగా ఎలాగ పుడతాడే?
పెద్దమ్మ: అవునురోయ్!
అన్నయ్య: నిన్న నాన్న నాకు కలలో వచ్చి 'ఒరేయ్ అబ్బాయ్, నువ్వు పొరబడ్డావు.  నేను నీ కడుపున పుట్టలేదు. నీ తమ్ముడు జానకిరాం ఇంట్లో పుట్టానూ' అన్నారే.

(ఆకలిగా ఉండి పాలు తాగుతున్న వదినకి ఈ మాట వింటూనే పొలమారింది...)

పెద్దమ్మ: అవునా! నిజమేలే ఆ వెధవ నాతో మాట్లాడడు కానీ పనిమనిషితో చొంగ కారుస్తూ వాగుతూ ఉంటాడు.
అన్నయ్య: పోనీలేవే అమ్మా, వాడికి ఇంకా ఇప్పుడే మూడో ఏడు వచ్చింది. ఇంకో ఏడాదిలో చొంగ కార్చడం ఆపేస్తాడు. మాటలంటావు...ఆ వచ్చిన అత్త, అమ్మ, న్యాన, అక్క ఎన్ని సార్లు అంటే మాత్రం ఏమౌతుందిలే. ఇంకో రెండేళ్ళాగితే బడిలో చేరిపిస్తారుగా. అప్పుడు మంచి-చెడూ తెలుస్తుంది.
పెద్దమ్మ: మీ బామ్మ కూడా మీ నాన్న గురించి అదే చెప్పింది, "ఉద్యోగం వచ్చి బయట తిరిగితే మంచి-చెడూ తెలుస్తుంది" అని. మీ నాన్నకు ఉన్న మంచి పోయి, చెడు మాత్రం బాగా అబ్బింది.
అన్నయ్య: అమ్మా, పోయినాయిన్ని ఎందుకు తలుచుకోవడం. ఊరుకోవే.
పెద్దమ్మ: అవును, ఇది మీ నాన్న కాకపోతే మరెవరు? కొంపదీసి మీ నాన్నమ్మ కాదు
కదా?

(ఎవరని చెప్తే ఏం తగులుకుంటుందో అని...)

అన్నయ్య: అబ్బె, కాదులేవే. ఇది ఎవరో - అసలు మనకు సంబంధం లేదు.

(ఇంతలో ఆ గదిలోకి నడుచుకుంటూ వచ్చింది సౌమ్య...)

సౌమ్య: నాన్న, నేను ఎవరు నాన్న. నువ్వు మా నాన్నవు కావా? మా class లో అందైర్కీ నువ్వే మా daddy అని చెప్పాను.

మళ్ళీ సౌమ్యకి అనుమానాలన్నీ తీర్చి మామూలు మనిషిని చెయ్యడానికి ఆరు five-star chocolate barలు అవసరమయ్యాయి.

<ట్రుంగ్ ట్రుంగ్ ట్రుంగ్...>

రాం: అంతేలే...పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కష్టాలు వస్తే bar ఏ కదా దిక్కు...ప్చ్...
చం: అదీ కథ. అసలు తాతను చూడలేదు అంటూ మొదలైన కథ చివరకు, తండ్రి తనేనని ఒప్పించాల్సిన పరిస్థితికి వచ్చింది.
వెం: మఱి ఆ తఱువాత ఏమైంది?
చం: హ్మ్....తఱువాత...తఱువాతేమౌతుంది? పెద్దమ్మ బెంగళూరు వచ్చింది...
రాం: హే, మాయ ఓ మాయ...ఈ life అంటే మాయ...
చం: వెటకారం వద్దు. ఇప్పుడు సమస్య కొత్త మలుపు తిరిగింది.
వెం: ఏమైంది? కొంపదీసి ఆవిడ ఇప్పుదు మన ఇంటికి వస్తున్నారా?

బెంగుళూరులో మా మూడో అన్నయ్య జానకిరాం ఉన్నాడు. వాడి ఇంటికి వచ్చింది. వాడి రెండేళ్ళ కొడుకు ఏం చేసినా అది మా పెదనాన్న అలవాటేనని అంటోందిట. అది సరే, ఈ రోజు వాడు మా సుందర్ అన్నయ్యతో మాట్లాడదామని skype call చేసాడట. అప్పుడు మఱొక నాటకం జరిగింది.

<ట్రింగ్...ట్రింగ్...ట్రింగ్...>

జానకిరాం: ఒరేయ్ అన్నయ్య, అమ్మతో మాట్లాడతావని చేసాను రా. సౌమ్య ఏది?
సుందర్: అమ్మా, సౌమ్యా రా -- నాన్నమ్మతో మాట్లాడుదుగాని...
సౌమ్య: మరి chocolate ఇస్తావా?
సుందర్ (గొంతు సవరించుకుంటూ): అలాగే.
సౌమ్య (video chat లోకి వచ్చి): నాన్నమ్మ, నన్ను "fourteen twelves are" అడుగు?
పెద్దమ్మ: ఆ అడిగాను, చెప్పు.
సౌమ్య: నాకు తెలియదు. మా text book లో లేదు.

(ఎవ్వరికీ అర్థం కాక చూస్తున్నారు...)

సౌమ్య: దెబ్బలు పడతాయా? హ హ...computer లోంచి కొట్టలేవుగా...

<ట్రుంగ్...ట్రుంగ్...ట్రుంగ్...>

చం: అది విని మా పెద్దమ్మకు మళ్ళీ అనుమానం పట్టుకుంది, సౌమ్యే మా పెదనాన్నేమోనని. అందుకే ఇంత పొద్దున్నే నాకు phone చేసి నాకేమనిపిస్తోందో అడిగింది. అది సంగతి.

Saturday, September 1, 2012

వ్యతిరేకాలంకారం

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> వ్యతిరేకాలంకారం


లక్షణం: వ్యతిరేకో విశేషః చేత్ ఉపమేయ ఉపమానయోః

వివరణ: ఉపమేయం, ఉపమానం ఈ రెంటిలో ఏదో ఒకదానిలోనున్న ప్రత్యేకమైన విశేషం చెప్తే అది వ్యతిరేకాలంకారం అవుతుంది. ఆ విషయం ఉపమేయాన్ని పొగిడే విధంగా ఉండటం సహజం. చంద్రాలోకంలో ఇచ్చిన ఉదాహరణ చూద్దాము.


ఉదా:- (చంద్రాలోకం)
సంస్కృత శ్లోకం: శైలా ఇవోన్నతాస్సంతః  కింతు ప్రకృతి కోమలాః
భావం: (మీరు) కొండలవలే ఎత్తుగానున్న వారు కాకపోతే మీకు కోమలత్వం కూడా ఉంది.
వివరణ: కొండలకు, ఒక వ్యక్తికి సామ్యం చెప్పారు (ఎత్తుగా ఉండటం). కాకపోతే వెంటనే కొండలకు లేని, ఆ వ్యక్తికి ఉన్న ఒక విశేషాన్ని చెప్పారు -- సహజ కోమలత్వం. కనుక కొండలకంటే ఆ వ్యక్తే మెరుగు అని తెలుస్తోంది. ఈ వ్యతిరేక విషయం చెప్పడం వలన ఆ వ్యక్తిని మరింత పొగిడినట్టైంది. కనుక ఇది వ్యతిరేకాలంకారం.


ఉదా:- (కావ్యం: భామినీ విలాసం, రచన: జగన్నాథ పండితరాయలు)
పంక్తి:
ఓ ప్రియా, ఇలాటి నీ ముఖముతో రాత్రులందు ముకుళించుకున్న పద్మాలను ఎలాగ పోలుస్తాము?
వివరణ: పద్మాలు పొద్దున్న పూటల విచ్చుకుంటాయి, రాత్రిళ్ళు ముడుచుకుపోతాయి. కానీ వక్త ప్రేయసి ముఖం రాత్రుళ్ళు ముకుళించుకోవట్లేదు కనుక (నే) పద్మాలతో పోలిక న్యాయం కాదంటున్నాడు (పొద్దున్న విచ్చుకునే విషయంలో రెండూ సమానమే అని ఉద్దేశం).


ఈ అలంకారాన్ని కూడా మన సినీకవులు అంతగా వాడుకోలేదు అనుకుంటున్నాను. నా మాటను ఉదాహరణలతో సవరిస్తే సంతోషపడతాను.



పొడిగింపు:

మందాకిని/లక్ష్మీదేవి గారు వ్యాఖ్యలో చెప్పిన పాటనుండి:

చిత్రం: స్వప్న, రచన: ఆత్రేయ, సంగీతం: సత్యం, పాట: ఇదే నా మొదటి ప్రేమ లేఖ
మెరుపని పిలువాలంటే ఆ వెలుగు ఒక్క క్షణం
పూవని పిలువాలంటే ఆ సొగసు ఒక్క దినం

Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (3)

"ప్రేమించు పెళ్ళాడు" చిత్రానికి ఇళయరాజ స్వరపరిచిన "నిరంతరమూ వసంతములే" పాటలో ఋతువులనన్నింటినీ మారిపోతున్నా ప్రేమికులకు మాత్రం వసంతం లాగే ఉంటోంది అనే ఉద్దేశంతో వేటూరి వ్రాసిన పాట అత్యద్భుతం. దీని గురించి నేను ఇదివరకు ఒక వ్యాసం కూడా వ్రాసాను. ఇందులో రెండో చరణంలో అన్ని ఋతువులనూ వర్ణించారు కానీ చిత్రంగా వర్షఋతువుని వదిలేసారు.బహుశా అప్పటికే వర్షఋతువు గురించి చాలా వ్రాసారని ఆయనకు అనిపించిందేమో.

ఇక ప్రణయం, శృంగారం సందర్భంగా వేటూరి వ్రాసిన వానపాటలను చూద్దాము. ఇలాంటి పాటలు వేటూరి బోలెడు వ్రాసారు. ఒక్కో పాటకు శృంగారం పాళ్ళు ఒక్కోలా ఉంటాయి. కొన్ని పాటలలో వాక్యాలు ఇక్కడ వ్రాయడానికి కూడా ఇబ్బందిపెట్టేవి ఉన్నాయన్నమాట వాస్తవమే. అందుకని చర్చించే పాటలను శృంగారం మోతాదుని బట్టి వరుసపరిచాను.


వేటూరి వానపాటల్లో బహుశా అన్నింటికంటే ప్రజాదరణ పొందిన classic కే.వీ.మహాదేవన్ స్వరపరిచినది. ఇది కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన "వేటగాడు" చిత్రంలో "ఆకు చాటు పిందె తడిసే" అనే పాట. పాట చిత్రీకరణ ఎంత శృంగారసూచకంగా ఉందో భావం అంత సున్నితంగా ఉంది అని నా అభిప్రాయం.
ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే
పురుషుడు సౌందర్యాన్ని గురించి ఆలోచించడం, స్త్రీ భావావేశాన్ని గురించి ఆలోచించడం రివాజు. అందుకేనేమో పల్లవిలో నాయకుడు ఆ వనపరిసరంలోని పిందెలతో, పూవులతో అమ్మాయిని పోలుస్తుంటే, అమ్మాయి తన మనసులో గుట్టుగా ఉన్న భావాలను గురించి చెప్తోంది.
ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే
ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే
ఓ చినుకు నీ మెడ లాగా నవ్వుతుంటే
ఈ చరణంలో చినుకును ఊతగా పట్టుకుని అమ్మాయిని వర్ణిస్తున్నారు. ఒక చినుకు అమ్మాయిని తాకి ఆ మెరుపు పూసుకుని ముత్యంలాగా మెరిసిపోతోందట. మంచి భావుకత మాత్రమే కాదు అది వ్యక్తపరచడానికి పదాలపై పట్టూ ఉండాలి. వేటూరి వీలైనంతవరకు పదాల మధ్యన యతి కుదర్చడానికి ప్రయత్నిస్తారు. ముద్దిచ్చి, ముత్యం; చిగురాకు, సిరిమువ్వ; తాకి, డియారు గమనించండి. అలాగ వ్రాసిన పంక్తులు నాలుకపైన సులువుగా ఆడుతాయి.
మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే
ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే
నాయకుడు చినుకు గురించి చెప్తుంటే, నాయిక మెరుపు గురించి చెప్తోంది. మొదటి పంక్తిలో మెరుపు ఆమె చూపుల్లో తనపై ఉన్న ఆకర్షణకు చిహ్నం అని అనిపిస్తోంది. అలాగ జరుగుతుంటే ఆమె మనసులో ఒక కోఱిక మఱొక మెరుపైందట. ఇంతలో అబ్బాయి చూపు మఱొక మెరుపు, నవ్వు మఱొక మెరుపు అయ్యి అంతటా మెరుపులే కనిపిస్తున్నాయట.
నీ పాట విని మెరుపులొచ్చి, నీ విరుపులే ముడుపులిచ్చి,
చలిని పెంచి, చెలిమి పంచి, తలలు వెచ్చంగా తడియార్చుకోవాలి
నాయిక పాటకు వర్షం మరింతగా పెరిగితే, ఆమె తన ఒళ్ళు జలదరించడంలో ఉన్న సోయగాన్ని అతడికి ముడుపు చెల్లించుకోవాలట. అది వారి నడుమ ప్రణయాన్ని బలపర్చి, వారిద్దరూ దగ్గరవ్వాలని అతడి కోఱిక. ఈ పంక్తిలో నాకు నచ్చింది "నీ విరుపులు ముడుపులిచ్చి" అనడంలో శృంగారమే కాక సౌందర్యం కూడా చాలా ఉందని నా అభిప్రాయం.


"కేక" చిత్రంలో చక్రి స్వరపరచిన పాటను చూద్దాము. ఒక యువకుడు, ఒక యువతి వానలో ఉన్నారు. పెద్దగా పరిచయం లేదు. అబ్బాయికి అమ్మాయి నచ్చి line వేస్తున్నాడు. ఈ సందర్భంలో శృంగారానికి ఎక్కువ తావు లేదు. అబ్బాయి అమ్మాయిని పదే పదే తమ మధ్యన కలిగిన ప్రణయభావాన్ని బయటపెట్టమన్నట్టు మాట్లాడతాడు. అమ్మాయి దానికి ఇంకా సమయం రాలేదన్నట్టు చెప్తుంది.
అ: మెరిసే మేఘం కురిసేదెప్పుడో
ఆ: కురిసే వర్షం వెలిసేటప్పుడే

అ: ముసురుకున్నది ఏదో చిలిపి కోరిక
ఆ: ముదరనివ్వకు కథలే చాలు చాలిక
వర్షం కురియాల్సినప్పుడు కురుస్తుంది కానీ, అడిగితే కురవదు కదా. అలాగే వలపు కూడా అంతేనని ఆమె భావం.
అ: మెరిసే తొలకరిలో నిను కనులారా చూసా
ఆ: చలిలో గిలిగిలిలో కొసమెరుపులు ఆరేసా
అబ్బాయి వానలో అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నానని చెప్తుంటే తను చూపించింది కేవలం కొసమెరుపులు మాత్రమేనని అమ్మాయి చమత్కరించింది. అంటే ఆ వాన స్వయంగా అందంగా ఉంటే దానికి చిగురున అమ్మాయి మరింత మెరుపు అద్దిందని అయి ఉండవచ్చును, లేక అమ్మాయి అందం తను ఇంకా కొస మాత్రమే చూసాడని అయి ఉండవచ్చును. బహుశా ఆయన శ్లేషనే ఉద్దేశించి ఉండవచ్చును. వేటూరి పాటకు "ఇదే" భావం అని ఆయన తప్పితే వేఱెవరూ చెప్పలేము.
అ: ముసిరే గాలివానలలో ముదిరే ముద్దుపిలుపులలో
ఆ: తడిసే వానచినుకులలో పడకు మత్తుకవితలలో
 ఇక్కడ కూడా అబ్బాయి ముందుకు మనసులోని ఆలోచనలకు అమ్మాయి కళ్ళాలను వేస్తోంది. ఇక్కడ ఏడు రంగులను చిలకడం అనే ప్రయోగం నాకు నచ్చింది.
అ: ఆడపిల్ల మాటలే అందమైన మాయలే, అర్థమైతే చాలులే అంతకంత హాయిలే
ఇది వేటూరి ముద్ర. ఆడపిల్ల మాటలు అందమైన మాయ. నిజమే "ఆడువారి మాటలకు అర్థాలు వేఱులే"  అనే ఎప్పుడో పింగళి చెప్పారుగా. ఆ మాటలు నిజంగా అర్థమైతే ఆ మాయ ఎంత లోతు అంతకంతా హాయి కలుగుతుందిట. అద్భుతం. నాలుగు ముక్కలలో అమ్మాయిల మాటల గురించి చెప్పారు.
ఆ: ఉడికే వయసులలో తొలి గిలిగింతల వాన
అ: చినుకే చిటపటగా దరువేసెను మదిలోన
గ్రీష్మమంతా వాతావరణం వేడిగా ఉంటుంది. వర్షఋతువులో తొలకరి కురుస్తుంది. ఉడికే వయసులు అనడంలో యవ్వనాన్ని గ్రీష్మంగా వర్ణిస్తూ, వలపును వానగా చెప్తున్నారు. "టప్ టప్" అంటూ పడటాన్ని "దరువు" వేయడం అనడం సరదాగా ఉంది.


"ఆఖరి పోరాటం" లో వేటూరి-ఇళయరాజ-బాలు-లతా మంగేష్కర్ కలిసి చేసిన పాటలో రెండు వాక్యాలు అద్భుతంగా కుదిరాయి.. వాటి అర్థం లతా మంగేష్కర్ కి చెప్తే ఆవిడ చాలా సంబరపడి మెచ్చుకున్నారని వేటూరి కొమ్మకొమ్మకో సన్నాయిలో చెప్పారు. ఆ రెండు వాక్యాలు కూడా వర్షానికి సంబంధించినవే.

ఆషాఢం ఉరుముతుంటే, నీ మెరుపే చిదుముకున్నా
హేమంతం కరుగుతుంటే, నీ అందం కడుగుతున్నా
ఈ పాటలో కూడా ("నిరంతరమూ వసంతములే" పాటలో లాగ) వేటూరి ఋతువులలో ప్రేమికుల భావాలను వర్ణించారు. కాకపోతే ఇందులో శృంగారాన్ని వర్ణించారు. కానీ, ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా వ్రాసారు. ఆషాఢ మాసంలో మేఘాము ఉరుముతుంటే మెరుపు మాత్రం అమ్మాయి ఒంట్లోనుండి వచ్చినట్టు అనిపిస్తోందట, అబ్బాయికి. హేమంతంలో మంచు కరుగుతూ ఉంటే దానితో అతడు ఆమె అందాన్ని కడుగుతున్నాడట. అద్భుతం!


"అడవి దొంగ"లో "వానా వానా వందనం" అనే పాటని చూద్దాము. ఈ పాట అంతా అంత్యప్రాసతో వ్రాసారు. కొన్ని చోట్ల పదాలు ఇరికించినట్టు అనిపించాయి కానీ కనీసం ఆ పదాలు రివాజు పదాలు కాదు. అందుచేత ఎబ్బెట్టుగా లేవు.
చలి పెంచే నీ చక్కదనం, కౌగిట దూరే గాలిగుణం
గాలివానలా కలిసి రేగుతూ కమ్ముకుపోతే యవ్వనం
(అ) మెరుపుని నీలో చూస్తుంటే, (ఆ) ఉరుములు నీలో పుడుతుంటే
వాటేసుకుని తీర్చుకో వానదేవుడి వలపు ఋణం
అమ్మాయిని అబ్బాయిని గాలివానతో పోల్చడం కొత్తగా ఉంది. అబ్బాయిని గంభీరమైన ఉరుముతోనూ, అమ్మాయిని అందమైన మెరుపుతోనూ పోల్చి వాటిని సృష్టించిన వానదేవుడి ఋణం తీర్చుకోవడానికి వాళ్ళు కౌగిలించుకోవాలని కవితాత్మకంగా చెప్పారు. ఇదే పాటలో రెండో చరణంలో అంత చెప్పుకోదగిన అంశాలు కనబడలేదు. ఎంతటి వేటూరైనా ఒక చిత్రంలో వానపాట hit అయిందని ప్రతీ చిత్రంలోనూ వ్రాయమంటే ఇదే జరుగుతుందేమో.


"యముడికి మొగుడు" చిత్రంలో రాజ్-కోటి సంగీతసారధ్యంలో చిరంజీవి, విజయశాంతుల నడుమ సాగే వానపాటలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు చూద్దాము.
కోడె ఊపిరే తాకితే ఈడు ఆవిరే ఆరదా?
మళ్ళీ అబ్బాయి ఊపిరిని వర్షఋతు గాలులతో, అమ్మాయి వయసుని గ్రీష్మఋతు వేడ్మితో పోల్చారు. ఇందాకటి పోలికకి ఇప్పటికి పదాలన్నీ మారిపోయాయి గమనించారా? అది వేటూరి పదాల గారడీ.
అ: తొడగొట్టేసి జడివానకే గొడుగేసాను తల దాచుకో
అమ్మాయిని వాన నుండి రక్షించడానికి అన్నట్టు అబ్బాయి ఆమెను వాటేసుకున్నాడట. తాటి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగుతున్నాను అంటే ఎవడు నమ్ముతాడు. ఉన్న విషయాన్ని అబ్బాయి సరదాగా చెప్పడం బాగుంది.
ఆ: వడగట్టేసి బిడియాలనే వొడి చేరాను వాటేసుకో
"డ" అనుప్రాస కోసం, బిడియాలని వదిలిపెట్టడాన్ని "బిడియాలను వడగట్టాను" అని చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు లోతైనవి కాకపోవచ్చును. కానీ మామూలు భావాలని మళ్ళీ మళ్ళీ అవే పదాలతో వాడకుండా వేఱుగా చూపించడం చలనచిత్ర కవికి కావలసిన లక్షణం. వేటూరి ఈ పాటల్లో మనకు చూపించింది అదే.


వేటూరి చిరంజీవికి చాలా వాన పాటలు వ్రాసారు అని ఇప్పటికే చదువర్లు గమనించి ఉంటారు. ముచ్చటగా మూడో చిరంజీవి పాట. "అన్నయ్య" చిత్రంలో మణిశర్మ స్వరపరిచినది. వాన పాటలో కొన్ని ఎబ్బెట్టు వాక్యాలుండటం సహజమే కానీ ఇందులో పల్లవిలో మొదటి వాక్యం కొంచెం ఎబ్బెట్టుగా వ్రాసారు. అది పక్కన పెడితే ఇందులో కొత్తగా వాడిన ప్రయోగం ఏమిటంటే ప్రేమకు ప్రాసగా "తేమ"ను వాడారు.
ప్రేమ రాగం, తేమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మళ్ళీ వేటురికి నచ్చిన ఆషాఢం, మేఘాలు, దేశం, పదాలు వచ్చాయి. కాకపోతే ఇదివరకుటి వరసలో కాదు, ఆ భావంతో కాదు.
ఆషాఢ మాసంలో, నీటి అందాల ముసుగుల్లో
మేఘాలదేశంలో, కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డ ఒంటినిండా ఈడు కుంపట్లు రాజేస్తే
ఆషాఢ మాసం వర్షం ముసుగులో అమ్మాయికి అబ్బాయితో ఏర్పడిన బంధం (మెరుపు ఆకర్షణకు, కలలకు చిహ్నంగా వాడి ఉండవచ్చును)  ఆమెలో దాహాన్ని రేకెత్తించింది (అబ్బాయి వర్షం అన్నమాట).
పూలంగి గొడుగుల్లో నిన్ను బంధించి ఒడుపుల్లో
చిత్రంలో అమ్మాయి దగ్గర గొడుగు లేక అబ్బాయి గొడుగులోకి వస్తుంది. ప్రణయానికి చిహ్నంగా ఆ గొడుగుని పూలంగి గొడుగు అంటున్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే గొడుగుకి ప్రాసగా "ఒడుపు" అనడం. అంటే అమ్మాయికి తన మనసులో ఉన్న విషయం తెలియకుండా గొడుగులోకి లాక్కుంటున్నట్టుగా పట్టుకోవడం. ఇలాంటి చమత్కారాలు వేటూరి ప్రత్యేకత.


ఇప్పుడు "బంగారు బుల్లోడు" చిత్రంలో రాజ్-కోటి బాణీ వలన బాగా ప్రజాదరణ పొందిన పాటని చూద్దాము.
అ: స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందెవాన
ఆ: సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన
సూర్యుడు స్వాతి నక్షత్రంలో ఉండగా వచ్చే వానని స్వాతివాన అంటారు. ఈ సమయంలో నత్తచిప్పలలో పడిన నీరు ముత్యాలుగా మారుతుంది అని ఒక నుడి. అందుకే అబ్బాయి ఒక స్వాతీసాయంత్రం వేళ వాన తనని  "ముత్యమంత ముద్దు" లాగా ముట్టుకుంది అంటున్నాడు. అమ్మాయి వాన గురించి కాక, చీకటి తనలో సిగ్గు కలిపిస్తోంది అంటోంది. వాన పాటల్లో ఈ పల్లవి కొంచెం కొత్తగా అనిపించింది, నచ్చింది.  ఈ పాటలో వేటూరి మెరుపులకు, ఉరుములకు కొత్త అందాలను అద్దారు.
మేనక మెరుపులు, ఊర్వశి ఉరుములు కలిసేనమ్మ
మేనక మెరుపు అనడంలో ఆమె అందాలు అనే అర్థం ఉంది, ఊర్వశి ఉరుములు అనడంలో నాకు లోతైన అర్థమేమీ కనబడట్లేదు. కేవలం యతి కోసం వాడి ఉంటారు. రెండో చరణంలో వేటూరి కొంచెం శృంగారం పాళ్ళని పెంచారు.
తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుముల కొమ్మల తొడిమలు వణికే వాన
ఇక్కడ అన్నిటికీ రెండు రెండు అర్థాలు ఉన్నాయి. మనం మామూలు అర్థాన్నే చూద్దాము. పూవులపై తుమ్మెదలు వాలి తేనె పీల్చుకోవడం వలన మిగిలిన మరకలను ఈ వాన కడుగుతోందిట. వాన ధాటికి వాలిపోతున్న తొడిమలు వణుకుతున్నాయట. వాన శృంగారాన్ని సూచిస్తోంది అని పూవులని, తేనెటీగలను అడ్డుపెట్టుకుని చెప్పారు. ఇంక వెతుక్కునవాళ్ళకు వెతుక్కున్నంత.
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
ఇక్కడ వేటూరి చిలిపిదనం నాకు బాగా నచ్చింది. వాన-వల్లప్ప పాటలో లాగానే గొడుగులో గుస-గుసని వర్ణిస్తూ నాలుగు అడుగుల గొడుగులో ఇద్దరు సర్దుకోవడానికి ఇబ్బంది పడటమే వాన (అందుకోసమే వాన) అంటున్నారు.
గాలివాన గుళ్ళోన ముద్దేలే జేగంట
గాలి-వాన వచ్చినప్పుడు వాటిని ప్రసన్నం చేసుకోవాలంటే జంట దగ్గరవ్వడమే మార్గమనడానికి పై వాక్యం. భావలకోసం కానీ, పదాల కోసం కానీ వేటూరి వెతుక్కోరు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఇది వినగానే, "కేక" చిత్రంలో ఇందాక మనం ప్రస్తావించుకున్న పాటలో "వానదేవుడొచ్చినప్పుడే వయసే మొక్కు తీర్చుకోక తప్పదు. చినుకు తేలు కుట్టినప్పుడే జతగా మంత్రమేసుకోక తప్పదు" అనే పంక్తులు గుర్తొచ్చాయి.


వేటూరి భావాల కంటే, ఆ మాటకొస్తే అర్థం కంటే లయకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్రాసిన పాటలు "అల్లరి అల్లుడు" చిత్రంలో కీరవాణి స్వరపరిచినవి. నాకు గుర్తున్న అన్ని పాటల్లోనూ వేటూరి భావాలకు కొంచెం అన్యాయమే చేసారు. ఇందులో "కమ్మని ఒడి బొమ్మని" అని ఒక వాన పాట ఉంది. అందులో రెండో మూడో వాక్యాలు బాగున్నాయి.
మిడిసిపడకె తొలిసొగసు మొగలిపూరేకా! కస బుస కస కసిగా
పడగ విడిచి విరిపడక పరుచుకున్నాగా పగ వగ ఇదే పదరా
అమ్మాయిని మొగలిపూవుతో పోల్చడం రివాజే. ఈ వాక్యాల్లో వేటూరి శృంగారంలో అబ్బాయి తగువుని, అమ్మాయి తెగువని కొంచెం భిన్నంగా చెప్పారు అని నా అభిప్రాయం.


ఇక చివరిగా వేటూరి వ్రాసిన వానపాటల్లోకల్లా అత్యంత బూతుగా అనిపించిన వాక్యాన్ని చెప్తున్నాను. అసలు ఇది వ్రాయడం నాకు ఇష్టం లేకపోయినా ఎంత బూతునైనా వేటూరి పదాల మాయలో అందంగా కనబడేలాగా చేయగలరు అని చెప్పడానికే వ్రాస్తున్నాను. ఇది "నా అల్లుడు" చిత్రంలో దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన "పట్టుకో పట్టుకో" అనే పాటలోనుండి.
అందము తడిసిన వేళ, ఆడది ఒక జ్వాల
కూసం విడిచిన వేళ, కుదుపుల ఉయ్యాల
గమనిస్తే రెండు వాక్యాలలోనూ ఆది ప్రాస, అంత్యప్రాస కూడా కలిపారు.

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

వేటూరి - వానపాటలు (1)

ఈవేళ సియాటల్లో వర్షం పడుతోంది. సియాటల్ గురించి తెలియని వాళ్ళు "ఔనా?" అనుకుంటారేమో కానీ సియాటల్ గురించి తెలిసినవాళ్ళు "అందులో పెద్ద విశేషమేముంది?" అనడగుతారు. సియాటల్లో ఏటికి సుమారు అరవై-డబ్భై రోజుల్లో మాత్రమే సూర్యుడు నిరాటంకంగా గగనవీధిలో సంచరిస్తాడు. మిగతా రోజుల్లో మబ్బులూ, వర్షం సహజం. సియాటల్ ని అందరూ ఎప్పుడూ చీకటిగా ఉండే చోటని ఆడిపోసుకుంటారు. కానీ నాకు సియాటల్ బాగా నచ్చింది. నేను ఇళ్ళు వెతికేటప్పుడు కొంచెం వాస్తు చూస్తాను. తత్ఫలితంగానో, కాకతాళీయంగానో ఎప్పుడూ వెలుతురు బాగా వచ్చే ఇళ్ళలోనే ఉన్నాను. సూర్యుడు బయటకు రావాలే కానీ, మళ్ళీ ఇంటికెళ్ళేంత వరకు మా ఇంట్లోకి చూస్తూనే ఉంటాడు. అందుచేత మాకు పగటి వేళలో చీకటి గొడవ లేదు. కాస్త మబ్బుగానో, నెమ్మదిగా చినుకులు పడుతుండగానో, వసారాలో కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఒళ్ళు తెలియదు. వెనకటికి నేను నర్శీపట్నం దగ్గర ఉండేటప్పుడు తోటల్లో తరచూ ఇదే చేసేవాళ్ళం.

ఏ విషయం గురించి మాట్లాడినా చివరకు ఆవు వ్యాసం అప్పజెప్పే కుఱ్ఱాడిలాగా, ఎటు తిప్పి ఎటు తిరిగినా నా మనసు గుర్తుచేసే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి వేటూరి. వానకీ వేటూరికి బలమైన సంబంధమే ఉంది. వేటూరి వ్రాసిన వానపాటలు చాలా ప్రజాదరణ పొందాయి. వీటిల్లో కొన్ని పాటల్లో భావం ఒక్కోసారి సున్నితంగా, ఒక్కోసారి సునిశితంగా, మఱో సారి బాహాటంగా ఉంటుంది. విషయం భక్తి ఐనా, బూతైనా పదాలను పట్టుకోవడంలో వేటూరి చాకచక్యం ఏ కవినైనా కవ్విస్తుంది. వానపాటల్లో మరీను.

నాలోని శ్రోతకి వేటూరి ఎన్నో బహుమానాలు (అవే, పాటలు) ఇచ్చాడు కానీ నాలోని కవికి వేటూరి ఇచ్చిన స్ఫూర్తి కంటే, భయమే ఎక్కువ. పదాలను, భావాలను అనర్గళంగా, అనాయాసంగా చెప్పగలిగిన వేటూరిని చూస్తే నాకు "మన వల్ల కాదు బాబు!" అనిపిస్తుంది. ఒక్కోసారి చలనచిత్రాలలో చూపించినట్టు నా అంతరాత్మ ఎదుటపడి వివాహభోజనంబు చిత్రంలో కోట శ్రీనివాస రావు లాగా, "రాస్తే అట్టాంటి పాట రాయలే. బాలీ, నీ లెక్క ఔలా పాట రాస్తాడనుకున్నావ్రా?" అంటుంది.

సియాటల్లో వరుసవానల పుణ్యమా అని నాకు ఏ రోజు మానసిక పరిస్థితిని బట్టీ ఆ రోజు, వర్షం ఒక వేటూరి పాటను గుర్తు చేస్తుంది. ఉన్న మాట చెప్పుకోకపోవడం ఎందుకు. గుర్తొచ్చే పాటలలో అత్యధిక శాతం ప్రణ్యశృంగారావేశభరితంగా ఉంటాయి. అదే, మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే పచ్చిగా ఉంటాయి. అర్థమైనవాడికి పదాలనే తీయని గుజ్జు వెనుక చేదైన బూతు విత్తనం తగలవచ్చును. అర్థం కానివాడికి వగరు తొక్క వెనకాల తీయని గుజ్జు కనిపించకపోవచ్చును. ఎవరేమన్నా ఆ పాటల్లో వగరూ, తీపి, చేదు అన్నీ ఉన్నాయి. వెరసి అది మావిడి పండు. కొంచం గంభీరంగా చెప్పాలంటే చూతపాకం అనాలేమో. అన్నట్టు మన్మథుడిని చూతాస్త్రుడు అంటారని బ్రౌహ్ణ్య నిఘంటువు ఉవాచ. వేటూరి పాటలలో ఉత్తుంగశృంగారభావాల కారణంగా ఆ కోణంలో కూడా ఆయన పాటలని చూతపాకం అనడం సబబేమో.

వాన చుట్టూ ఎన్ని విషయాలు ఉంటాయి? ఉరుము, మెరుపు, తళుకు, తొలకరి, జల్లు - ఇలాగ ఒక dozen పదాలుంటాయనుకోండి. వేటూరి కనీసం ఒక పాతిక వానపాటలు వ్రాసారు అనుకుంటున్నాను. ఉన్న డజను పదాలతో ఈ పాటల మధ్యన ఎంత వైవిధ్యం కుదురుతుంది? సందర్భాన్ని కూడా కలుపుకుందాము అంటారా? అవును శంకరా నాదశరీరాపర సందర్భం వేఱు, వాన వల్లప్ప వల్లప్ప సందర్భం వేఱు. కానీ "మన తెలుగు చలనచిత్రాలలో ఎన్ని సందర్భోచితమైన పాటలు ఉంటాయి?", అని ఆలోచిస్తే, ఆ పాతిక పాటల్లో పదిహేను పాటలకు సందర్భం ఇదే: "చిరంజీవికి, హీరోయిన్ కి love. వాన పడింది. పాట వ్రాయలయ్య కవి". ఐనా కూడా పాట పాటకీ కొత్త కొత్త భావాలను, పదాల గారడీని చూపించారు వేటూరి.

మొదట మనం భక్తి రసంతో మొదలేడదాము. వానపడుతోంది. ఒక భక్తుడులో "తను చేస్తున్న మంచిపనికి లోకం ఎందుకు హర్షించట్లేదు" అనే ఆవేశం కలిగింది. దాన్ని సాహిత్యంలో ఎంత ఎత్తుకు తీసుకెళ్ళవచ్చును అని (కే) విశ్వనాథుడు, (కే.వీ) మహాదేవుడు వేటూరిని అడిగితే, దానికి వేటూరి వినమ్రంగా ఇలా బెదిరించారు. శంకరాభరణం చిత్రంలో...
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంథరా నీలకంథరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది
అవధరించరా! విని తరించరా!
ఈ సంస్కృతం అర్థం కావడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పటికీ నాకు అర్థమైనది సరో కాదో తెలియదు కానీ, "పొగరుతో (ధిక్కరి) ఉన్న ఇంద్రుణ్ణి జయించిన హిమ గిరీంద్రుడి (ఇంద్రుడి వర్షానికి, గాలులకీ హిమాలయాలు కదలవు కదా?) చలువు (సిత) గొంతులో (కంథర) నిండిన నీలకంథరా (విషం గొంతులో ఉన్నవాడు). సామాన్యులు (క్షుద్రులు) తెలుసుకోలేను రుద్రవీణ నిర్నిద్ర (అలుపు లేని) గానమిది, విను (అవధరించు), విని తరించు (సంతోషించు)". లోకులు మనిషిపై పెట్టే ఒత్తిడిని ఇంద్రుడితో పోల్చి, దాన్ని గెలిచిన హిమాలయాలను మనిషి పట్టుదలతో పోల్చి, అటువంటి మనిషిని ఆదరించేవాడిగా శివుణ్ణి వర్ణించి, కేవలం ధర్మాత్ములకు మాత్రమే అర్థమయ్యే తన జీవనగీతాన్ని చూసి సంతోషించమని శివుణ్ణి అడుగుతున్నాడు. ఆ అడగటంలో కూడా శంకరశాస్త్రి గాంభీర్యం మనకు కనబడుతుంది. అది వేటూరి సత్తా.

ఆ తఱువాత
మెరిసే మెరుపులు మురిసే పెదవుల ముసిముసి నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకుజారెనా శివగంగా
నా గానలహరిఁ నువు మునుగుంగా, ఆనందవృష్టిఁ నే తడువంగా
శివుడు పెట్టిన పరీక్షకు తను ఎలాగ ప్రతిస్పందిస్తున్నాడొ చూద్దామని లీలావినోది ముసిముసి నవ్వులు నవ్వుతుంటే అవి మెరుపులయ్యాయని, తన నడవడికి, గానానికి సంతోషించి శివుడు చేసే నాట్యంలో తుళ్ళుతున్న మువ్వల అలికిడి ఉరుములగానూ, ఆ వర్షం శివుడు తాదాత్మ్యంలో ఉండటం వలన గంగ క్రిందికి ఒలకడం గానూ వర్ణించడంలో వేటూరి మఱొక్క సారి "యద్భావం, తద్భవతి" అనే నానుడిని గుర్తుచేసాడు. శంకరశాస్త్రి "శాస్త్రి". శాస్త్రాలను, భగవంతుణ్ణి మూలంగా ఉంచుకుని నడిచే వ్యక్తి. అతనికి ఆకు కదిలినా, పువ్వు మెదిలినా శివలీలగా అనిపిస్తుంది. ముందు చరణంలో అచంచలమైన గాంభీర్యం పక్కనే రెండో చరణంలో చలింపజేసే భక్తి. వేటూరి కత్తికి రెండు వైపులా కాదు, తొమ్మిది వైపులా (నవరసాలు) పదునే.

ఒక్క ఉదాహరణే ఇస్తే ఎలాగ అంటారా? సరే వేటూరి గురించి పుస్తకాలే వ్రాసినవాళ్ళు ఉన్నారు. నేను మఱొక ఉదాహరణ ఇవ్వలేనా? సరిగమలు చిత్రంలో రవి శంకర్ శర్మ (బొంబాయి రవి) సంగీతానికి వేటూరి వ్రాసిన మాటలు చూద్దాము. ఇది వాన పాట కాదు కానీ వానతో కూడిన భావం. అంటే నిఖార్సైన ఉదాహరణే. అప్పటిదాకా సంగీతం చేతకాని వాడు గురువు అనుగ్రహం వలన, దైవబలం వలనా గొప్ప పాటగాడయ్యాడు. అప్పుడు వేటూరి అన్న మాటలు:
కుండల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
అద్వైతభాష్యాలను చదివిన వాళ్ళకు కుండలో నింగి అంటే ఏమిటో తెలుస్తుంది. బ్రహ్మమంతా ఒకటే అనడానికి దృష్టాంతాలంకారంతో గౌడపాదులు (శంకరాచార్యుల గురువుకు గురువు) చెప్పిన ఉదాహరణ ఇది.
బ్రహ్మం ఆకాశంలాగా అంతటా ఉంది. కుండలలోనూ ఉంది, బయటా ఉంది. కుండల వలన అది వేఱు వేఱుగా ఉన్నట్టు అనిపిస్తోంది. అలాగే మాయ (మట్టి)ని తొలగిస్తే అంతటా ఉన్నది బ్రహ్మమే (ఆకాశమే). 
అలాగే ఇన్నాళ్ళూ తనలో ఉంచుకున్న సంగీతశక్తి తనకు ఆ కుండ అవధి కాదని తెలుసుకుని ఒక్కసారిగా ఉరిమింది అని కవి భావన. ఈ మధ్యన నేను అద్వైతసాహిత్యం ఎక్కువగా చదవడం వలన నాకు ఈ విషయం అర్థమైంది. తఱువాత సోదరుడు ఫణీంద్ర పుణ్యమా అని కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో వేటూరి ఇచ్చిన వివరణ చదివిన తఱువాత మరింత సంతోషం కలిగింది. వేటూరి భావాలను అర్థం చేసుకోగలగడంలో ఉండే తృప్తి అలా ఉంటుంది.  వెయ్యండిరా నూరు వీరతాళ్ళు అనాలనిపించట్లేదు?

కొనసాగుతుంది...

Thursday, June 7, 2012

రాంబాబు కథలు - పెళ్ళి చేసి చూడు (3)

"పెళ్ళిచేసి చూడు" అనే అంకంలో ముందు భాగాలు: 1, 2.

రాం: ఆసక్తితో పాటు విరక్తిని కూడా కలిగించడం నీకే సాధ్యం రా!
వెం: Thank you. Of course, ఉత్త విరక్తి కలిగించాలంటే నీకు నువ్వే సాటిలే.
చం: ఇంకా కథలు చెప్పరా అబ్బాయ్!
వెం: కొన్ని matrimony profiles, e-mails లాగా ఉంటాయి. వీళ్ళు eye-tex నేటి మహిళలు అన్నమాట. Profile description లో వాళ్ళ గురించి చెత్తా చెదారం రాసి జనాలను ఊదరగొడతారు. ఉదాహరణకి
Hi
This is Rota. Myself, a software engineer in a reputed MNC in Hyderabad. I have studied in IIT Amalapuram. My interests include but are not limited to సెల్లు-లొ-సొల్లు, parlor లో బిల్లు, pub లో థ్రిల్లు, ఒళ్ళు కొవ్వు ఫుల్లు, home management లో డల్లు, responsibility నిల్లు. 

ఇలాగ రాసుకుంటూ పోతారు.
రాం: ఈవిణ్ణి చేసుకున్న వాడి గతి హెల్లు.
వెం: చివర్లో ఒక చిన్న చణక్కుంటుందిరోవ్. All the best for your search. అని ఒక ముక్కుంటుంది. రాతి యుగంలో websites లో వ్రాసేవారు "Thanks for visiting my website" అని. పెళ్ళయ్యాక మొగుడికి ఉంటుందో లేదో కానీ, profile description లో ఈ పనికిమాలిన courtesy ఒకటి.
చం: పోనీలేరా, కొంతమంది కొంచెం social గా వ్రాస్తారు. దానిదేముంది? అవును, English లో తప్ప తెలుగులో ఉండవా ఈ profiles?
వెం: ఉండవు. తమ profiles తామే సర్దుకునేవాళ్ళకు తెలుగు అంటే చిన్నచూపు. పిల్లల profiles చక్కదిద్దే తల్లిదండ్రులకు తెలుగులో ఎలాగ రాయాలో తెలియదు. వాళ్ళ English కష్టాలు చూడాలి. అసలు, వాళ్ళ్ రాతల్లో నన్ను అన్నిటికంటే ఎక్కువ బాధపెట్టే సమాసం, "homely girl".
రాం: అందులో తప్పేముందిరా?  Girl next door అంటే పక్కింటి అందమైన అమ్మాయి అన్నట్టు, homely girl అంటే సంప్రదాయం కలిగిన అమ్మాయి అనే కదా అర్థం?
చం: రెండూ తప్పేరా. ఒకటి, మన పక్కింటి అమ్మాయి అందంగా ఉంది అనడం అందం అనే పదాన్ని పాతాళంలో పాతిపెట్టడంతో సమానం. రెండు, homely అంటే English లో negative పదం. పెద్ద అందంగా లేకపోతే homely అంటారు. అంటే "సామాన్యమైన" అనే ఉద్దేశంతో.
వెం: మన పక్కింటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదురా?
చం: నీ time బాగుంది. ఈవేళే newspaper లో చదివాను. lip-stickలో మెరుపు రావడానికి చేపపొలుసులు వాడతారట. ఈ లెక్కన ఆవిడ రోజుకు వాడే lip-stickకే రెండు తిమింగళాలని చంపాలి. అది ఇప్పుడెందుకు కానీ, నువ్వు నీ కథ కొనసాగించు.
వెం: ఎవరైనా handsome boy కావాలి అని అడుగుతారు, ఒక profile లో We want a boy with a handsome salary అని ఉంది.
చం: కలికాలం!
వెం: కొంతమంది మితభాషులు ఉంటారు. వాళ్ళు విషయానికి మించి ఒక్క పదం కూడా ఎక్కువ చెప్పకూడదు అనుకుని రాస్తూ ఉంటారు. ఉదాహరణకి: "good girl, job in mnc in bangalore, 1 elder brother, married, father works in telegraph department, mother house-wife, snb." ఈ రాతల్లో capital letters ఉండవు, full-stop, comma ఉండవు, is, am మొదలైన అనవసరమైన పదాలు ఉండవు. ఇది నేను మొదట చదివినప్పుడు, commaలు లేక, 1 elder brother married father అని చదివి నేను ఖంగు తిన్నాను.
రాం: హ హ, SNB ఏమిటిరా? ISI లాగ ఏమైనా మార్కా?
వెం: SNB తెలియదా? పిచ్చివాడా...SNB అంటే sub-sect no bar. అంటే within the caste communists అన్నమాట.
చం: పోనీలే అదీ మంచిదే.

రాం: అవును, communist అంటే గుర్తొచ్చింది...ఈ జాతకాలు....
వెం: అబ్బా....ఎందుకురా ఇప్పటిదాక బాగానే ఉన్నాము కదా? ఇప్పుడదెందుకు గుర్తు చేస్తావు?
చం: (ముసిముసి నవ్వులు నవ్వుతూ) వాడు జాతకాలు అన్నాడు, జాఁవకాయ్ లు అనలేదు.
వెం: హా, (పిడికిలి బిగించి నోటి మీద పెట్టుకుని) జాఁవకాయల సంగతి నీకు ఎలాగ తెలుసును?
రాం: అదేంటిరా? జామకాయలు ఏమైనా చిరంజీవి నూటేభయ్యో చిత్రం title ఆ -- ఎవరికీ తెలియకపోవడానికి?
వెం: నువ్వు నోర్ముయ్...చందూ, చెప్పు -- నీకు ఎలాగ తెలిసింది జాఁవకాయల కథ?
చం: హ హ హ...మొన్న చాలా రోజుల తఱువాత శ్రీకాంత్ కి (చందూకి, వెంకట్ ని పరిచయం చేసిన స్నేహితుడు) phone చేసాను. వాడు చెప్పాడు.
రాం: ఆ కథేంటిరా?
వెం: No, చందూ! ఆ కథ చెప్పడానికి వీల్లేదు.
చం: నువ్వు ఇన్ని tragedy కథలు చెప్పిన తఱువాత నేను ఒక్క comedy కథైనా చెప్పకపోతే ఎలాగరా?
రాం: వెంకీ, నువ్వు ఈ పాలకోవా తిను. చందూ, నువ్వు కథ చెప్పరా.
చం: ఎవరికైనా శత్రువులు మనుషులో, జంతువులో ఉంటారు. మనవాడికి జాఁవచెట్టు శత్రువు.
రాం: Interesting...అదెలాగ?
చం: మనవాడికి జాఁవచెట్టు ఎప్పుడూ అచ్చిరాలేదు. వాళ్ళ వసారాలో జాఁవచెట్టు ఒకటి ఉంది. మనవాడు tender 20s లో ఉండగా ఒక రోజు ఆ చెట్టు కింద కూర్చుని చదువుతున్నట్టుగా pose ఇస్తూ పక్కింటి అమ్మాయికి సైట్ కొడుతున్నాడట.
వెం: అది అబద్ధం. అలాంటి పని మా ఇంటా వంటా లేదు. నిప్పుని కడిగే వంశం మాది.
రాం: అంటే fire-department ఆ?
చం: ఇంతలో ఒక రాయి వచ్చి వీడి జబ్బకు తగిలింది. ఏంటా అని చూస్తే ఒక ఏడెనిమిదేళ్ళ కుఱ్ఱాడు జాఁవకాయల కోసం రాళ్ళు విసురుతున్నాడు. వీడు ఒక్క కేక పెట్టాడు, "ఎవర్రా నువ్వు?" అని. అంతే కుఱ్ఱాడు వీడి దేహపుష్టి చూసి "Sorry uncle, మీరు ఉన్నారు అని చూసుకోలేదు", అన్నాడు. అంతే పక్కింటి అమ్మాయి ఫక్కున నగియెన్. వీడికి కోపమొచ్చి "ఒరేయ్, నన్ను అన్నయ్య అని పిలు", అన్నాడు. దానికా కుఱ్ఱాడు, "మా అన్నయ్య 5th class చదువుతున్నాడు, uncle" అన్నాడు. అంతే వీడికి మరీ కాలింది, "నన్ను uncle అని పిలిస్తే నీకు ఒక్క జాఁవపండు కూడా ఉండదు. పైగా మీ ఇంటికి వచ్చి మీ అమ్మా నాన్నతో నువ్వు అల్లరి చేస్తున్నావని చెప్తాను, ఫో", అని కసిరి గెంటేసాడు. ఆ కుఱ్ఱాడు మౌనంగా వెళ్ళిపోయాడు. మనవాడు కాస్త కుదుటపడి పడకకుర్చీ మీద పడుకుని ముఖం మీద పుస్తకం పెట్టుకుని తనలో తానే దుర్యోధనుడి ఏకపాత్రాభినయం వేసుకుంటుండగా మఱొక రాయి వచ్చి పడింది. దానితో కోపం నషాలానికి అంటి వీరావేశంతో వీధితలుపు తెరిచి చూస్తే అక్కడ ఒక పదిమంది కుఱ్ఱాళ్ళు ఉన్నారు. అందరూ "Uncle, ఒక్క జాఁవపండు ఇవ్వండి, uncle!" అనడం మొదలెట్టారు. మధ్యలో తల నెమ్మదిగా పైకెత్తుతూ, వెక్కిరింతతో కూడిన నవ్వుతో ముందటి కుఱ్ఱాడు కసిగా చూసాడు. వెంటనే కొంచెం పక్కకి తిరిగి, "అక్క, నువ్వైనా uncle కి చెప్పక్కా...", అన్నాడు. మనవాడి మొహం చూడాలి. RGV కీ ఆగ్ cinema, multiplex లో black ticket కొనుక్కుని మరీ చూసి బయటకు వచ్చినవాడిలాగా పగతో రగిలిపోయింది.
రాం: హ హ హ, నలుగురు బుడంకాయల చేతులో పరాభవానికి గురైన వెంకట్.
(వెంకట్ గోడకు తలాంచి మౌనంగా ఉన్నాడు. ఒక్క సారిగా వెనక్కి తిరిగి...)
వెం: జాతకాలు నప్పితే అమ్మాయి నచ్చదు, అమ్మాయి నచ్చితే జాతకాలు నప్పవు. అందుకే ఇదివరకు రెండూ కలిపి పంపేవాళ్ళు. ఒక వేళ అమ్మాయి photo నచ్చకపోయినా జాతకం నప్పలేదు అని diplomatic గా చెప్పవచ్చును కదా అని.
రాం: బాగా try చేసావు రా. ఒక్క నిముషం వోల్డేయ్! చందూ, నువ్వు చెప్పరా...
చం: అంతే కాదు, ఒక సారి అదే అమ్మాయికి exercise చేస్తున్నట్టు pose ఇద్దామని జాఁవ కొమ్మ పట్టుకుని ఊగబోతే అది కాస్తా విరిగి మనవాడి నడుం పచ్చడైంది.
వెం: ఐపోయిందా...నీ feeling అంతా చెప్పేసావా? ఈ చేదు జ్ఞాపకాలు Hutch కుక్కలాగా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్నాయి.
చం: హ హ...ఇంకో కథ ఉంది. ఇది sweet 16s లో. జాఁవకాయలు కోసి ఇచ్చి అదే అమ్మాయిని impress చేద్దామని, చెట్టేక్కబోతుంటే ఆ చెట్టు కొమ్మ ఎప్పటికంటే నున్నగా తగిలింది. ఏమిటా పచ్చపచ్చగా, మెత్తమెత్తగా ఉంది అని చూస్తే అది కొండచిలువ. ఒక్క పెట్టున దూకి పరుగో పరుగు. అప్పటిదాక hero pose లు ఇచ్చి ఒక్క సారిగా పలాయనమంత్రం పఠించిన కథ వీళ్ళ college అంతా తెలిసింది.
రాం: అమ్మ దొంగ, నీకు చాలా flash-back ఏ ఉందే.
చం: ఇప్పుడు over to వెంకట్.
వెం: నాకూ time వస్తుందిరా. అప్పుడు చెప్తాను.
రాం: ఇప్పుడే చెప్పు ... నీ matrimony కథలు.

వెం: ఈ మధ్యన ఆడపిల్ల తరఫు వాళ్ళు వేటికవి step-by-step చేయమంటున్నారు. దానివలన ఎవరికి లాభమో తెలియదు. మా పెదనాన్న సామాన్యంగా అన్ని వివరాలూ అడిగి, అన్నీ చూసుకుని అవుననో కాదనో చెప్తాడు.  ఒకాయన "జాతకాలు నప్పాయో లేదో చెప్పండి, అప్పుడు photo పంపిస్తాము", అన్నాడు. సరే జాతకాలు నప్పాయి అని చెప్పాము. అప్పుడు photo పంపించారు. అమ్మాయి మా అన్నయ్య కి నచ్చలేదు. అమ్మాయి తండ్రికి ఏ కారణం చెప్పి వద్దనాలో పెదనాన్నకి తెలియలేదు. వేఱే ఏమీ చెప్పడానికి లేదు, photo చూడకముందే అమ్మాయి గురించి అన్ని వివరాలు, జాతకాలు నప్పాయన్న విషయం తెలుసును. ఇంక చేసేదేమీ లేక phone చేసి "అమ్మాయ్ మా వాడికి నచ్చలేదండి.", అన్నాడు. దానికి అవతలాయనకు కోపం వచ్చి, "ఐతే photo వెనక్కి పంపేయండి", అన్నాడు.
రాం: మరి పంపారా?
వెం: E-mail లో పంపిన photoని వెనక్కి ఎలాగ పంపుతామురా? ఆ విషయం తెలియక, ఆయన కూతురు మాకు నచ్చలేదు అని చెప్పామనే ఆవేశంలో, అలాగ అన్నాడు.

కొనసాగుతుంది...

Sunday, May 20, 2012

రాంబాబు కథలు - పెళ్ళి చేసి చూడు (2)

మొదటి భాగం ఇక్కడ చూడవచ్చును.

చం: ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే వెనకతరం మగవాళ్ళు చేసిన పాపాలు శాపాలై మనకు తగులుతున్నాయి అనిపిస్తూ ఉంటుందిరా. ఆడవాళ్ళని కట్నం అని, లాంఛనం అని వేధించారు.
రాం: బాబు, ఏ కథకైన రెండు వైపులూ ఉంటాయి. తెలివైన ఆడవాళ్ళు మగవాళ్ళనీ ఏడిపించారు. మా ఊళ్ళో కొంతమంది మగవాళ్ళైతే వాళ్ళ జీవితమంతా "నేనంటే మా ఆవిడకి దడ" అనే అమాయకత్వంలో ఉంటూనే వాళ్ళ పెళ్ళాళ్ళకు ఊడిగం చేసారు. ఆ కథలు మఱొక రోజు చెప్పుకుందాము.
వెం: రాంబాబూ, నీకు మీ school లో ఏ వచనం ఎప్పుడు వాడాలో చెప్పారన్నావు?
చం: సరే లేరా -- గొడవాపి ఇంకేమైన కొత్త కథలు చెప్పు.
వెం: matrimony profiles లో రకరకాలు ఉంటాయి. వాటిని ఉదాహరణలతో విశ్లేషించి చెప్తాను విను.
(రాంబాబు, చందు ఊఁ కొడుతున్నారు).
వెం: ఒక profile మా అన్నయ్యకి, పెద్దమ్మకి, పెదనాన్నకి తెగ నచ్చింది. వెంటనే జాతకాలు అవీ చూపించుకుంటే బాగా కలిసాయి అన్నారు. సరే అని phone చేస్తే అమ్మాయి తల్లి ఎత్తింది. అన్నివిధాలుగా photo నచ్చింది కదా అని మా పెదనాన్న ఏదో ఒక లాగా సంబంధం కలిపేద్దామనుకున్నాడు.

(టోఁ, టోఁ, టోఁ...flash back పె: పెదనాన్న, వ్య: phone ఎత్తిన వ్యక్తి.)
పె: నమస్తే, నా పేరు సత్యనారాయణ.
వ్య: నమస్తే అండి. ఎవరు కావాలి?
పె: మీ ఇంట్లో దుర్గ అనే అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు అని విన్నాను. దాని గురించి మాట్లాడదామని.
వ్య: ఆ...అది
పె: మా అబ్బాయి B.Tech చదువుకుని పెద్ద software company లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు.
వ్య: అది కాదం...
పె: జాతకాలు ముప్పయ్యారు కి ముప్పై మూడు pointలు కలిసాయి అని మా సిద్ధాంతి గారు చెప్పారు.
వ్య: అవుననుకోండీ...
పె: మాకు పది ఎకరాల మాగాణి ఉంది. నాకు మా ఆవిడకి ఈ ఊరు వదిలి వెళ్ళే ఉద్దేశం లేదు. కాబట్టి అమ్మాయి, అబ్బాయి చిలకగోరింకలలాగ foreign లో ఉండచ్చును. మేము అస్సలు వాళ్ళని ఇబ్బంది పెట్టము. మాకు ఆడపిల్లలు లేరు.
వ్య: బాగుంది...కానీ...
పె: మీరు ఊఁ అంటే అబ్బాయి photo, జాతకం మీకు 2-day courier లో పంపిస్తాము. దగ్గరలో ముహుర్తాలు లేవు...మొన్న మార్చి 29 న ఆఖరి ముహుర్తం. మళ్ళీ మూఢం మొదలైపోతోంది...
(అటుపక్కన నుండి ఏమి మాట రాకపోతే...)
పె: హలో, హలో...అమ్మా ఉన్నారా?
వ్య: మీ మనసులో భావాలన్నీ చెప్పేసారా అండి? ఇంకా చెప్పల్సింది ఏమైనా ఉందా?
పె: అంతేనమ్మా...మీరేమంటారు?
వ్య: మొన్న మార్చి 29 న తెల్లవార్ఝామున రెండు గంటల ఇరవై ఎనిమిది నిముషాలకు మా అమ్మాయి రమ్య పెళ్ళి ఐపోయింది అండి. పొఱబాటున profile తీయడం మరిచిపోయాము. ఇక్కడ current పోయింది. రాగానే తీసేస్తాము.
(టోఁటోఁటోఁ....flash front)

రాం: నీ గూడు చెదిరింది...నీ గుండె పగిలింది...ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు...?
వెం: matrimony profiles లో అతి ప్రమాదకరమైనవి ఇవే.
చం: వీటిని ఎలాగ గుర్తించాలో చెప్తావా?
రాం: పెళ్ళైపోయిన profiles ఎలాగుంటాయి? వాటిని ఎలాగ గుర్తించాలి? వాళ్ళు ఎలాగ మాట్లాడతారు? ఎలాగ నడుచుకుంటారో తెలుసుకోవాలనుంది.
వెం: శ్రద్ధగా విను. పెళ్ళైపోయిన profile కి last login date కనీసం ఒక నెల ముందు ఉంటుంది. వాళ్ళ chat now button మూగబోయి ఉంటుంది. మనం message పంపించినా ప్రత్యుత్తరం రాదు. అలాంటి profile తగిలితే వెంటనే విడిచిపెట్టెయ్యి.

చం: ఆపండిరా బాబు. సరే ఇంకో రకం చెప్పు.
వెం: later
చం: ఏం? ఇప్పుడు వర్జ్యమా? రాహుకాలమా? దుర్ముహూర్తమా? యమగండమా?
వెం: కాదు, later.
చం: చెప్పెహే
వెం: నేను చెప్తున్నది ఒక రకం profiles గురించి. వాటికి పేరు later అని ఉంటుంది.
రాం: ఆ మధ్యన గెడ్డం చక్రవర్తి తీసిన cinema లాగా ఈ అమ్మాయికి కూడా పేరు పెట్టలేదా? పెళ్ళయ్యాక మొగుడు పెట్టాలా ఏంటి?
వెం: కాదు. ఈ రకం profiles ఉన్న అమ్మాయికి లేక వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు matrimony లో ఉన్నట్టు తెలియడం ఇష్టం ఉండదు. పేరు బట్టి ఎవరైన వెతికి వాళ్ళను పట్టుకుంటారు అని భయం.
చం: చాలా మంచిదే కదరా? ఈ కాలంలో అమ్మాయి photo కనబడితే చాలు దాన్ని పట్టుకుని ఎన్ని వెధవ పనులు చేస్తున్నారు జనాలు?
వెం: హ హ హ
చం: ఆ నవ్వు ఎందుకు?
వెం: ఎంత పొఱబాటు. ఒక profile చూసి ఇలాగే అనుకుని మా అన్నయ్య  shame to shame పొఱబాటు చేసాడు. పెదనాన్నకి చెప్తే ఆయన అమ్మాయి తండ్రికి phone చేసి అన్నయ్య వివరాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి వివరాలు మా అన్నయ్యకు తెలిసిన తఱువాత facebook లో కొడితే ఆ అమ్మాయి photoలు తెగ పెట్టేసింది. birthday కి ముఖమంతా cake పూసుకున్న photo దగ్గరనుండి బిర్లామందిర్ ఎదురుగుండా భిక్షగాడికి బిళ్ళ వేస్తున్నప్పటి photo వరకు అన్నీ photoలు ఉన్నాయి. తన facebook profile ఏమో సార్వజనిక చిత్రశాల లా పెట్టుకుని, matrimony profile లో తన పేరు కూడా పెట్టకుండా ఉంది చూసావా? అది ఆ అమ్మాయికున్న తెలివితేటలు.
రాం: అమ్మాయి కొంచెం social అనుకుంటాను.
వెం: social కాదు, వేషాలు.
రాం: ఈ కథలు వింటుంటే నాకు ఒళ్ళు గగురుపొడుస్తోంది. నువ్వు ఇంకా చెప్పు.
వెం: ఒక్కోసారి ఈ later profiles వలన land mines పేలతాయి. ఉదాహరణకు ఒక సారి మా అన్నాయ్య ఒక profile చూసి interest ఉంది అని message పంపించాడు. మర్నాడు response చూస్తే అది పిసినారి మాష్టారు మొదటి కూతురు. అబ్బో...మా ఊళ్ళో చాలా కథలు నడిపిందిలే. Big boss cinema చూసిన తఱువాత మా అన్నయ్య మళ్ళీ అంత shock కి గురైంది ఈ విషయం తెలిసాకనే.

చం: చాలా కథే ఉందన్నమాట.
వెం: నీకు మఱొక విచిత్రమైన విషయం చెప్తాను విను. ప్రతీ వ్యక్తికి తను తీయించుకున్న photosలో ఒకటో రెండో నచ్చుతాయి. అమ్మాయిలకు ఇంకొన్ని నచ్చుతాయి. అంతవరకు OK. కాకపోతే అవన్నీ సుమారుగా ఒకే వ్యక్తిని చూపించాలా? కానీ కొన్ని profiles లో photos ఒక దానికి మఱొక దానికి పొంతన ఉండదు. వాటిలో ఏది ఇప్పటిదో, ఏది చిన్నప్పటిదో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియదు.
చం: అదెలాగ రా?
రాం: దశావతారం లాగా దశావతారిణా?
వెం: దీని వెనుక రహస్యం adobe వారి photoshop. ఏ ముహుర్తంలో కనిపెట్టారో కానీ మన దేశంలో అమ్మాయిలకు రూపురేఖలు మార్చేస్తోన్న మంత్రం ఇదే.
రాం: మరి ఐతే అసలు ఏదో నకిలీ ఏదో ఎలాగ తెలుసుకుంటాం?
వెం: చాలా సులువు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. పిల్లని పిల్లతోనే తెలుసుకోవాలి.
రాం: చిల్లును చిల్లుతోనే పూడ్చక్కరలేదా?
చం: నువ్వు ఆగరా...
వెం: కిటుకు ఏమిటంటే మన స్నేహితులలోనో, చుట్టాల్లోనో ఆడపిల్లలు ఉంటారు కదా. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు కూడా photo లు తీయించుకుని వాటికి మరమ్మత్తులు, కసరత్తులు చేస్తారు కదా. అందుచేత వాళ్ళకు ఏది నకిలీనో, ఏది సరైనదో, photo లో ఏ భాగంలో ఎంత work జరిగిందో తెలుస్తుంది. Photoshop చేయబడిన చిత్రాలలోనుండి సునిశితమైన పరిశీలనతో మొటిమలు, ఎత్తు పళ్ళు, గెద్ద ముక్కు, వంకర మూతి నుండి తెల్ల జుట్టుపోగు సైతం గుర్తించగలిగే శక్తిని ఆ భగవతుడి ఈ సృష్టిలో అమ్మాయిలకే ఇచ్చాడు. అందుకే మా అన్నయ్యకు photo నచ్చగానే నేను తనిఖీ చేయించడానికి మా బంధువుల అమ్మాయికి forward చేస్తూ ఉండేవాడిని. మీరు నమ్మరు కానీ: ఎవరో మాట వరసకి "వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చేయచ్చు" అన్నది మన తరంలో కొంతమంది అమ్మాయిలు యథాతథంగా అన్వయించుకుని ఒక్క photo లోనే వెయ్యి అబద్ధాలను జొప్పించి మరీ పంపిస్తున్నారు.
రాం: ఇది కాదా నేరం? దీనికి లేదా శిక్ష? ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం.
వెం: కొన్ని photos అసలు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకుందాం అనే ఉద్దేశంతోటే పెట్టిందా అన్నట్టుంటాయి. జబ్బలు తీసేసిన జాకట్ల నుండి ఇంక అలాగ చూసుకుంటూ పోతే...అన్నట్టు నీకు ఒక profile చూపిస్తాను ఆగు. (Computer లో కాసేపు వెతికి...) ఆ చూడు. అసలు ఈ అమ్మాయి సగం చీరని దాని పని అది చెయ్యకుండా ఆపేసేటట్టైతే ఇంక అది కట్టుకొవడం దేనికో.
రాం: ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, జోహారులే వీరి అమ్మకు...
చం: సరేలేరా..అది ఆ అమ్మాయికి నచ్చిన style. ఏదో సరదాగా పెట్టింది.
వెం: పిచ్చివాడా...అందుకే profile మొత్తం చూడకుండా secular కూతలు కుయ్యకూడదు. ఇక్కడ చూడు. Profile created by: Parents. అంటే వీళ్ళ నాన్న తనకున్న photoలలోకల్లా ఇదే బాగుంది అని వెతికి మరీ పెట్టాడన్నమాట. ఆహాహా, ఏం తండ్రి రా.

కొనసాగుతుంది...

Saturday, May 5, 2012

రాంబాబు కథలు - పెళ్ళి చేసి చూడు (1)

ఒక ఆదివారం మధ్యాహ్నం రాంబాబు, వెంకట్, చందు ముగ్గురూ భోజనం చేసి కూర్చున్నారు.

రాం: ఏరా వెంకట్, మీ danger బాబాయ్ నీకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నాడట? ఎవరో పిసినారి మాష్టారు అట? వాళ్ళ అమ్మాయిని చూసావా?
వెం: ప్రశాంతంగా ఉన్న మధ్యాహ్నాన్ని ఎందుకు చెడగొడతావురా?
రాం: పెళ్ళంటే భయమా, బాబాయంటే కంగారా, పిసినారి మాష్టారు అంటే చిఱాకా, వాళ్ళ అమ్మాయి ఇష్టం లేకా?
వెం: (నుదుటి మీద చెయ్యి పెట్టుకుని) దేవుడా...
చం: రాంబాబు మొదలెట్టేసాడురా. ఇప్పుడు నువ్వు ఇంక ఆపలేవు.
వెం: అవన్నీ కలిపేరా బాబు. మన దేశంలో పెళ్ళీడు వచ్చిన అబ్బాయిని ఎంత లోకువగా చూస్తారో తెలుసునుగా? మా అన్నయ్యకి పెళ్ళి చేసేసరికే మా నాన్నకు సరదా తీరింది.
చం: అంత కష్టమేముందిరా? ఏదో ఆడపిల్ల గుండెలపై కుంపటి అన్నట్టు మాట్లాడుతున్నావు?
వెం: ఈ కాలంలో పట్నాలలో ఆడపిల్లల గురించి మొగుళ్ళకు తప్ప తండ్రులకు కంగారు ఉండట్లేదు.
రాం: నా మొహం లా ఉంది. చిన్నప్పుడు మీ schoolలో ఏ వచనం ఎప్పుడు వాడి ఏడవాలో చెప్పలేదా?
చం: అబ్బా, రాంబాబు -- నువ్వు నోర్మూయరా. భావం అర్థమైంది కదా?
వెం: మీకు నా భావం కాదు అర్థమవ్వాల్సింది. అనుభవం.
రాం: నీ అనుభవం ఏముంది? టమాటా పప్పు, అన్నం, ఉప్మ, పిండి రుబ్బిస్తే అట్లు, జావా, సీ++. అంతే కదా?
చం: రాంబాబు -- నువ్వు ఆగు. ఒరేయ్ వెంకట్, చెప్పరా -- ఎవరినైనా ప్రేమించావా?
వెం: ప్రేమా? నా మొహమా. పెళ్ళి సంబంధాలు చూడటమంటే భయం. మా పెదనాన్నకు ముగ్గురు కొడుకులు. వాళ్ళందరికీ పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు జరిగిన పరాభవాలను చూస్తుంటే నాకు కడుపు రగిలిపోయేది. అసలు మగవాళ్ళంటే ఆటబొమ్మలా? అనిపించేది.
చం: నీ build-up ఆపి విషయమేమిటో చెప్పరా.
వెం: చెప్తాను. నా గుండెల్లో కఱుడు కట్టుకుపోయిన భయానికి కారణమేమిటో మీకు చెప్తాను. అసలు గొడవంతా matrimony siteలతో మొదలవుతుంది. అక్కడ వాడు చాలా ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడుగుతాడు.
రాం: జీతం గురించా?
వెం: కాదు. body type అంటాడు. ఏం చెప్తాము. మనసు athletic అని పెట్టు అని చెప్తుంది. కానీ నేను ఎప్పుడూ exercise చేసిన పాపాన పోలేదు.
రాం: అదేంటిరా -- ఆ మధ్యన company లో ఏదో program కి పేరు ఇచ్చావు కదా...selections కి వెళ్తే నువ్వు చేసిన dance చూసి drill master అని బిరుదు కూడా ఇచ్చినట్టు గుర్తు.
వెం: out-dated jokeలు వెయ్యకు.
చం: పోనీ లేరా -- మొన్న ఏదో free యోగా classలు ఉన్నాయి అంటే వెళ్ళినట్టున్నావు?
రాం: హ హ హ హ -- అబ్బ, అది మట్టుకు గుర్తుచెయ్యకురా బాబు. నవ్వలేను.
చం: ఏమైంది?
రాం: మనవాడి చేతి పిల్లి ఆసనం, కుక్క ఆసనం అన్నీ వేయించారు. అవి చెయ్యలేక వీడు మరియా షెరపోవా లాగా వగర్చడం మొదలెట్టాడు. అందరూ ఒకటే నవ్వడం.
చం: ఐతే ఏమైందిరా -- నాలుగు రోజులు చేస్తే అదే అలవాటౌతుందిగా
రాం: అయ్యేది -- కానీ ఆఖర్న శవాసనం వేసి relax అవ్వమంటే మనోడు గుఱక పెట్టడం మొదలెట్టేసాడు. అప్పటికప్పుడు instructorమనోణ్ణి లేపి, కాసిని మంచినీళ్ళు తాగించి ఇంటికెళ్ళి మర్నాడు రమ్మన్నాడు. అప్పటినుండి మనవాడు వెళ్ళట్లేదు.
వెం: ఇప్పుడు ఆ చరిత్ర అవసరమా?
చం: పోనీ అసలు విషయానికి రా -- అది ఒక్కటి ఏమీ select చెయ్యకుండా వదిలెయ్.
వెం: అలాగే, బరువు-ఎత్తు -- ఇవన్నీ వదిలెయ్యనా?
చం: అబ్బా -- ఇవన్నీ పెద్ద విషయాలు కావురా. ఐనా body type ని బట్టి అమ్మాయిలు చేసుకోరు. అమ్మాయిలు మంచి మనిషిని కోఱుకుంటారు.
రాం: అబ్బా, మఱి అందుకేనా దివ్య అలాగ చేసింది.
చం: ఒరేయ్, మధ్యలో నీ flash-back ఎందుకురా?
వెం: అమ్మాయిలు తెలివైనవాళ్ళు, అబ్బాయిలు యోగ్యులు -- ఇలాంటి సామాన్యమైన నానుళ్ళు ఎప్పుడో పోయాయి. సంబంధాలు కలవాలంటే అదొక పెద్ద తలనొప్పి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మా పెదనాన్నకు ఎదురైన అనుభవాలు చెప్తాను విను. అన్నిటికంటే ముందు కొంచెం comedy తో మొదలెడతాను.
చం: (రాంబాబు అటుగా వెళ్ళడం చూసి) ఏరా రాంబాబు ఎక్కడికి వెళ్తున్నావు?
రాం: మొన్న ఊరెళ్ళినప్పుడు తెచ్చుకున్న జంతికలు తెచ్చుకుంటాను. వీడు ఎలాగా కథ చెప్తానాంటున్నాడు కదా -- దానికి ఊఁ కొడుతూ నోట్లో పడేసుకోవచ్చును.
చం: నీకు బుద్ధి లేదురా. స్నేహితుడు కష్టాలు చెప్తుంటే ఓపిగ్గా వినడం మానేసి అదేదో cinema చూస్తున్నట్టు జంతికలు, సమోసాలు, pop-corn తింటారా? (వెంకట్ కేసి తిరిగి) వీడింక మారడు. (మళ్ళీ వెనక్కి తిరిగి) సరే ఆ అఘోరించేదేదో ఓ రెండు పాలకోవా ముక్కలు కూడా వేసుకుని తీసుకురా. (వెంకట్ కేసి తిరిగి) నువ్వు చెప్పరా.
వెం: మా పెదనాన్న వివాహవేదిక పుస్తకంలో చూసి ఒక ఇంటికి phone చేసారు. అటుపక్కన ఒక ఆడగొంతు వినిపించింది. "అమ్మా మీ ఇంట్లో ప్రవీణ అనే అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని వివాహవేదిక పుస్తకంలో చూసాను." అంటే "అవునండి", అంది. "ఆ విషయమై మాట్లాడదామని చేసాను. మీరు ఆమెకు ఏమౌతారు?", అన్నాడు. అటుపక్కనుండి "హె హె హె....అది అది...నేనేనండి", అంది.

మా పెదనాన్న, "మీ ఇంట్లో పెద్దవాళ్ళెవరికైనా ఇవ్వమ్మా", అంటే "మా వాళ్ళందరూ చిరుత cinema చూడటానికి వెళ్ళారండి. మా బామ్మ ఒక్కత్తే ఉంది. ఆవిడకు సరిగ్గా వినబడదు", అంది. ఇంతలో backgroundలో "ఈ దెబ్బతో దాని కాపురం సర్వనాశనమై పోతుంది. హ హ హ. <టీఁవ్ టీఁవ్ టీఁవ్...> అమ్మా, ఎందుకమ్మ నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు. నేనేం తప్పు చేసాను." అని వినబడింది. పెదనాన్న, "అమ్మా, కాస్త TV sound తగ్గించమ్మా", అన్నాడు. ఇంతలోనే "ఒసేఁవ్ ప్రవీ, నాకు సరిగ్గా వినబడట్లేదు. వచ్చి ఏం జరిగిందో చెప్పకుండా ఆ phone ఏఁవిటే.", అని ఒక ముసలి గొంతు వినబడింది. మా పెదనాన్న కాస్త గొంతు ఎత్తి, "అమ్మాయ్, మా phone number ఇస్తాను. మీ అమ్మా, నాన్న రాగానే phone చేయించు.", అన్నాడు. దానికామె "ఏఁవండి, మా land-line పాడైపోయింది, వాళ్ళు రాగానే పదింటికి ఈ cell phone లోంచే చేయిస్తాను." అంది. Phone పెట్టేలోపలే "అన్నట్టు, నా phone లో balance లేదు. నేను missed call ఇవ్వనా అండి", అంది.

రాం: (కఱక్, కఱక్ మంటూ జంతికలు నవులుతూ) హ హ హ -- మరి missed call వచ్చిందా?
వెం: వచ్చింది. రెండు మూడు సార్లు వచ్చింది. భోజనాల హడావుడిలో ఉండి చూసుకోకపోతే నాలుగో సారి, "dis is pravina. y not callin" అని ఒక message కూడా వచ్చింది.
రాం: ఇంత comedy గా ఉంటుందని తెలిస్తే కాసిని మంచినీళ్ళు కూడా తెచ్చుకునేవాడిని. పొలమారుతోంది. ఒక్క నిముషం ఆగు, మంచినీళ్ళు తెచ్చుకొస్తాను.

చం: సరే continue...
వెం: ఈ పెళ్ళి సంబంధాలు విషయానికి వస్తే నాకు పెళ్ళి కూతుళ్ళ కంటే వాళ్ళ తల్లిదండ్రులంటేనే చిఱాకు రా.
చం: ఏఁవి?
వెం: ఉదాహరణతో కొడతాను. మా పెదనాన్న ఒక సంబంధం ఉంటే phone చేసాడు. రెండు సార్లు ring అయ్యాక cut ఐంది. పోన్లే అని మళ్ళీ చేస్తే మళ్ళీ అదే ఐంది. ముచ్చటగా మూడో సారి చేద్దామని ప్రయత్నిస్తే మళ్ళీ అదే తంతు. చిఱాకు వచ్చి ఊరుకున్నాడు. ఇంతలో అదే number నుండి call వచ్చింది. ఇలాగ ఎత్తబోయాడో లేదో, ఇంతలోనే missed call అని call ఆగిపోయింది. పోనీలే మనమెవరో తెలియక missed call ఇచ్చారు కదా అనుకుని phone చేసాడు. అంతే అవతల వ్యక్తి అందుకున్నాడు, "ఎవరయ్యా నువ్వు? ఇందాకటినుండి missed calls ఇస్తున్నావు?", అన్నాడు. పెదనాన్న, "అదేంటండి, మీరే కదా missed call ఇచ్చింది", అన్నాడు. దానికి అతను, "నేనా? వెటకారంగా ఉందా?" అని తగులుకున్నాడు. ఇలాగ మాట్లాడుతున్న జనాలతో పెళ్ళి సంబంధాల గురించి ఏం మాట్లాడతామని మా పెదనాన్నా phone పెట్టేసాడు. Basic గా అవతలాయన తిరుగుతున్న చోట signal సరిగ్గా ఉండి ఉండదు. ఆ విషయం ఆయన తెలుసుకోకుండా అదేదో మా పెదనాన్నా తప్పన్నట్టు తిట్టిపోయడం మొదలెట్టాడు. పెళ్ళీడుకొచ్చిన కూతురున్నవాడికి కూడా కొంచెం ఓర్పు, సహనం లేకపోతే ఇంక వాడి కూతురికెంత ఉంటుంది చెప్పు.
రాం: "గాంధి పుట్టిన దేశమా ఇది? నెహ్రు కోరిన సంఘమా ఇది? phone ఎత్తి వాదులాడే దురుసువీరుల రాజ్యమా?". సహనం కరువైపోయిందిరా.
చం: ఒరేయ్ రాంబాబు, ఇది కలియుగమని ఎందుకన్నారో తెలుసునా?
రాం: ఎవరైన phone చేస్తే నమస్తే చెప్పనంత పొగరుబోతులున్నారనా?
చం: అది ఒక కారణం. రెండోది....మనుషుల సహనాన్ని కరి మ్రింగిన వెలగపండు గుజ్జు కరణిని మ్రింగే నువ్వు సహనం గురించి మాట్లాడతమే రా.
వెం: ఒక్కోసారి అమ్మాయి తండ్రి కాదు, తల్లి కొంచెం విచితంగా మాట్లాడుతుంది. ఒక సారి మా పెదనాన్న ఇంటికే phone వచ్చింది. మా పెదనాన్న ఇంట్లో లేకపోతే పెద్దమ్మ ఎత్తింది. ఆడగొంతులో "మీరు ఫలానా వాళ్ల అమ్మ గారా? మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా?" మొ. ప్రశ్నలు అడిగితే అన్నిటికీ మా పెద్దమ్మ సమాధానాలు చెప్పింది. ఇంతలో ఆవిడ, "మీ అబ్బాయి US లో పని చేస్తున్నాడని చెప్పారు. మరి జీతం నెలకు డబ్భై వేలు అని చెప్పారేమిటి?" అంది. మా పెద్దమ్మకు ఈ జీతాలు, భర్త్యాలు గురించి తెలియదు. ఏదో మొగుడి చాటు భార్య. "ఏమోనండి అది నాకు తెలియదు. మా అబ్బాయి పని చేస్తున్నది మన దేశంలోనే. ఏదో పని ఉంది అని ఒక ఏడాది అక్కడ ఉండమన్నారు. జీతం అక్కడే వస్తుందని చెప్పాడు.", అంది. అవతలావిడ ఊరుకుంటేగా "ఏం లేదండి, మనకు డబ్భై వేలంటే, అమెరికా లో ఏ ఒకటిన్నర వేలో ఎంత. అది పెద్ద విలువ కాదు", అందుకే అడుగుతున్నాను అంది. రెండు మూడు సార్లు ఓపిగ్గా సమాధానం చెప్పిన మా పెద్దమ్మకు చివరకు  బాధేసి "ఏఁవండి...మీ సంబంధం మాకు వద్దు అండి.", అంది. దానికి అవతలావిడ నివ్వెరపోయి, "అదేమండి?" అంటే, "పదే పదే డబ్బు గురించే అడుగ్తున్నారే తప్ప, మీ వాడు ఏం చదువుకున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అలవాట్లేమిటి -- ఏమీ అడగరే? అందుకే నచ్చలేదు" అని చెప్పి పెట్టేసింది.

చం: ఒరేయ్, ఈ మధ్యన love, love అని చావగొట్టి ఆడపిల్లలు ఎవరెవరినో పెళ్ళి చేసుకుంటున్నారు. మనకు పిల్లలు కరువైపోతుంటే మనం కాస్త సర్దుకోవాలి. అబ్బాయి అందం చూడటం, అమ్మాయి అబ్బాయి ఆర్థికస్థాయిని చూడటం అనాదిగా వస్తున్న ఆనవాయితీ కదరా...
వెం: ఏ కాలంలో ఉన్నావు రా? అమ్మాయి కనీసం B Tech చేసి ఉండాలి, ఉద్యోగస్థయై ఉండాలి అని NRI బిడ్డలు చావగొడుతుంటే?
రాం: అవును నీ దగ్గర NRI కథలేఁవీ లేవా? వాళ్ళ బ్రతుకు ఇంకా దుర్భరమని విన్నాను.
వెం: అవును. మా పెదనాన్న ఒక సంబంధం గురించి phone చేసి, మా అబ్బాయి US లో పని చేస్తున్నాడు అండి అని చెప్పాడు. "మఱి ఎందుకు phone చేసారు?" అని సమాధానం. "ఒక ఏడాది పని మీద వెళ్ళాడు. వచ్చేస్తున్నాడు", అని చెప్తే "అయినా వద్దు", అని phone దఢేల్ మని పెట్టేసారు. అక్కడికి ఏదో NRI అంటే పురుగూఇనట్టు, బెంగుళూరులో ఉంటే అదే వెధవ మెరుగైనట్టు.
రాం: హమ్మయ్య, నాకే ఇబ్బందీ లేదు. ఇక్కడే ఉన్నాను.
చం: అది మాకు ఇబ్బంది. నీకు on-site వచ్చేలాగా ఉంది కదా...చూద్దాము ఆ సంగతి ఏమిటో...
వెం: ఒక్కోసారి matrimony profile చూస్తే జీవితం మీద విరక్తి వచ్చి, "పెళ్ళంటే ఇంతేనా అనిపించేది". ఆగు -- నా e-mail లో ఉండాలి ఒక set requirements. ఆ...దొరికింది. ఆ description చెప్తాను విను: * నన్ను గౌరవించాలి * పద్ధతిగా ఉండాలి * నిజాయితీ ఉండాలి * నన్ను ఆదరించాలి (?) * నన్ను ప్రేమించాలి * బాధ్యత ఉండాలి * కనీసం పరదేసంలో settle అయి ఉండాలి.
చం: కనీసం పరదేశంలో settle అవ్వడం ఏమిటిరా? ఆ తఱువాతి స్థాయిలు చంద్రమండలం, అంగారకగ్రహం -- అవా?
వెం: ఏం చెప్తాం రా బాబు. ఇంకా విను - valid work permit ఉండాలి.
చం: అది లేకుండా ఎలాగ settle అవుతాడురా? ఇంకా నయం passport ఉండాలి అంది కాదు.
వెం: * తెల్లగా, అందంగా ఉండాలి. * సంబంధం OK అయిన తఱువాత ఒక ఏడాది పాటు నాతో మాట్లాడిన తఱువాత పెళ్ళి చేసుకోవాలి.
చం: వామ్మోవ్, ఈలోపల ఇంకో అమ్మాయిని చేసుకుంటే కొన్ని requirements తగ్గుతాయి, ఒక పిల్లాడు కూడా పుడతాడు.
రాం: * షరతులు వర్తిస్తాయి.
చం: నువ్వు నోర్ముయ్యి.
వెం: * మనిషి సరదాగా ఉండాలి * ప్రయాణాలు అంటే ఇష్టం కలిగి ఉండాలి * ముక్కుసూటిగా ఉండాలి * friendly గా ఉండాలి. అసలు friendly అంటే అర్థం ఏమిటిరా? మళ్ళీ పక్కనే * సంప్రదాయంగా ఉండాలి. మా ఇళ్ళల్లో సంప్రదాయం అంటే పెళ్ళాన్ని "ఏఁవేఁవ్" అని పిలవడమే. అలా పిలిస్తే friendly కాదు అంటుందేమో? అదిగో మళ్ళీ పక్కనే * trendy గా ఉండాలంటోంది. అంటే jeans వేసుకుని పీట మీద కూర్చుని భోజనం చెయ్యడమా?
రాం: దాని friendly కూడా చేర్చుకుంటే jeans వేసుకుని మట్టి బొచ్చెలో tomato soupలో రెండు straw లు వేసుకుని మొగుడూ పెళ్ళాలు తాగాలేమో?
చం: ఒరేయ్, నీ కవిహృదయానికి కట్టిపారేయ్.
వెం: ఒక్క ముక్కలో చివరలో చెప్పిందిరా, "the perfect man" కావాలట.
రాం: ఓహో, ఐతే ఇందాకటి statement లో jeans తీసేసి Raymond పెట్టు.
వెం: క్రింద షరతులు వర్తిస్తాయి అన్నట్టు రెండు చిన్న points వ్రాసింది. అబ్బాయి కేవాలం మా కులంలో వాళ్ళ శాఖలోనే అయి ఉండాలట. అలాగే వయోభేదం మూడు సంవత్సరాలకు మించి ఉండకూడదట.
చం: చాలా దారుణంగా ఉంది. అమ్మాయికి ఇన్ని requirements, స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి అంటే already అమెరికాలో settle అయ్యి ఉండాలే.
వెం: హుఁ...అమ్మాయి B Tech మూడేళ్ళ క్రితం పూర్తైంది. ఇక్కడే పని చేస్తోంది.
చం: అబ్బో...

కొనసాగుతుంది...

Monday, April 23, 2012

కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?

చాలా రోజుల తఱువాత కిట్టు వాళ్ళ తాతయ్య (మాతామహుడు) కృష్ణయ్య ఇంటికి వెళ్ళాడు. వయోవృద్ధుడైన కృష్ణయ్య వ్యాపారబాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి ఇంట్లోనే ఉంటున్నారు. వీలైనంతసేపు దైవధ్యానం, ఇంటికి వచ్చిపోయేవాళ్ళకు ఒక నమస్కారం లేక ఆశీర్వాదం తప్పితే ఆయనకు వేఱే పని ఏమీ లేదు. పిల్లలు, మనవలు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండటం చేత ఆయన వీలైనంత వరకు ఎవరికీ పని చెప్పకుండా ఇంటి పట్టునే ఉంటారు. ఎప్పుడైన ఆయన దౌహిత్రులు (కూతిరి కొడుకులు) ఇంటికి వచ్చినప్పుడు "కాస్త అలా నడుద్దాము పద", అని వీధిలోనే కొంతసేపు నడిచేవారు. ఈ సారి కిట్టు వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది.

"ఒరేయ్ నాన్న, ఒక సారి రావు గారి ఇంటికి వెళ్ళివద్దాము పద. ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదు.", అన్నారు కృష్ణయ్య. రావు గారంటే అదే వీధిలో ఉండే మఱొక వ్యాపరస్థుడు. చాలా ఆస్తి, మందిబలం ఉన్న వ్యక్తి. ఇంట్లో ఆడవాళ్ళతో చెప్పి కిట్టు, కృష్ణయ్య కలిసి రావు గారి ఇంటికి వెళ్ళారు. రావు గారు ఒక పడకకుర్చీలో కూర్చుని ఎవరైనా వస్తారేమోనన్నట్టు చూస్తున్నారు. కృష్ణయ్య గారిని చూసి "రండి, కూర్చోండి", అంటూ ఇంట్లో ఆడవాళ్ళకు వినబడేలాగా, "కృష్ణయ్య గారు, ఆయని మనవడు వచ్చారు. coffeeలు పట్టుకురండి", అన్నారు.

ఇంతలో రావు గారు, కృష్ణయ్య గారు కూర్చుని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వారి పిల్లలు ఎలాగ నడుపుతున్నారో చర్చించుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కిట్టుకు ఇదేమీ అర్థం కాక చుట్టూ ఉన్న చిత్రపటాలను చూస్తున్నాడు. ఇంతలో coffeeలు వచ్చాయి. ముగ్గురూ తాగడం మొదలెట్టారు. మెల్లగా, అటు తిరిగి ఇటు తిరిగి, మాట ఆస్తుల పంపకాల గురించి వచ్చింది.

రా: ఏఁవయ్య కృష్ణయ్య, నీ వీలునామా వ్రాసావా?
కృ: ఎప్పుడో! ఆ మధ్యన 90లలో అనారోగ్యం చేసినప్పుడే వ్రాసాను. ఆడపిల్లలని, అబ్బాయిని పిలిచి విషయం చెప్పి సంతకాలు పెట్టించాను.
రా: కొడుక్కి కొంచెం ఎక్కువ ఇచ్చావా? అందరికీ సమానంగా పంచావా?
కృ: కూతుళ్ళకు ఇవ్వలేదు. పెళ్ళిళ్ళు చేసాను కదా. కొడుక్కే దాదాపు అంతా వ్రాసాను.
రా: అలాగెలాగ కుదురుతుంది? నీకు మీ నాన్న దగ్గరనుండి ఆస్తి సంక్రమించింది కదా?
కృ: నా మొహం లే. సుబ్బన్న (తన తండ్రి) గారు నన్ను చాలా ప్రేమగా పెంచారు కానీ నాకు ఇవ్వడానికి పెద్దగా ఆస్తి ఏమీ మిగలలేదు. అరయెకరం ఇచ్చారేమో. మాకున్న అప్పులకు కూడా అది సరిపోలేదు. అప్పులోళ్ళకి ఆ ఉన్న పొలాన్ని హామీ ఇచ్చి, ఈ వూరొచ్చి వ్యాపారం చేసి చేతులూ కాళ్ళూ కాల్చుకుని ఐదారేళ్ళ తఱువాత తీర్చాను.
రా: ఏమైతేనేఁ నీకు ఆయన దగ్గరనుండి సంక్రమించిన ఆస్తి నువ్వు పెట్టిన వ్యాపారానికి ఉపయోగపడింది కదా? నువ్వు అది అనుభవించావు కదా?
కృ: అర ఎకరానికి కూడా "అనుభవించడం" లాంటి మాటలెందుకులే.
రా: ఏమైనా స్వామీ, నీ కూతుళ్ళు న్యాయస్థానంలో దావా వేస్తే నువ్వు నీ ఆస్తిని సమానంగా పంచి తీరాల్సింది.

కృష్ణయ్య గారు కాఫీ త్రాగుతున్నారు కానీ ఆయన కళ్ళు ఎఱ్ఱగా మారుతున్నాయి. ఆయన కొంతసేపు మౌనం వహించారు. కిట్టు ఇది గమనించాడు. రావు గారి ఇంటికి కృష్ణయ్య గారి ఇంటికి మధ్యన నాలుగు ఇళ్ళు దూరం. ఈ విషయం గురించి చెప్పాలి అనుకుంటే కిట్టు వెళ్ళాక చెప్పచ్చును. ఆయన ఉద్దేశం హెచ్చరించడం అనుకోవడానికి లేదు. పరిస్థితిని బట్టి ఆయన ఉద్దేశాన్ని ఊహిస్తే, అంత మంచి అభిప్రాయం కలగదు. కృష్ణయ్య కాస్త ఓరిమి తెచ్చుకుని మాట్లాడారు.

కృ: పోనీలే, నా కూతుళ్ళు అలాగ అడిగేవాళ్ళు కాదు.
రా: బాగుంది, నీ మీద ప్రేమతో ఇప్పుడేమనట్లేదు. వాళ్ళకూ ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకీ పెళ్ళిళ్ళు చేయాలి కదా. మరి కట్నాలు కానుకల దగ్గర నువ్వు సాయం చెయ్యకపోతే ఊరుకుంటారా?
కృ: నేను చేసేది చేస్తూనే ఉన్నానయ్యా. ఎప్పుడూ నా కూతుళ్ళకు నేను లోటు చెయ్యలేదు.
రా: మరి అలాంటప్పుడు ఆస్తి కూడా చెరిసమానంగా పంచాలి కదా?

కృష్ణయ్య మహాకోపీష్టి. కాకపోతే అనారోగ్యంతో ఉన్న పెద్దమనిషిని పలకరిద్దామని వచ్చి తిరిగి జవాబు చెప్పడం దేనికని ఊరుకున్నారు. కిట్టు అది గమనించాడు. తను మాట్లాడవలసిన సందర్భం వచ్చింది అని అందుకున్నాడు.

కి: తాతగారు, మీరు అన్నది సబబేనండి. కూతుళ్ళకు కూడా సమానమైన వాటా ఇవ్వాలి.

తాత్కాలికంగా రావుగారి కళ్ళు వెలిగిపోయాయి. ఆయన సాయంత్రం సఫలమైంది అని భావమో ఏమో. కృష్ణయ్యకి కొంచెం బెంగ పట్టుకుంది.

కి: కానీ, దాదాపు ముప్పై ఏళ్ళనుండి మా అమ్మ కానీ, పిన్నులు కానీ, వాళ్ళ సంతతి కానీ మా తాతగారి పక్కన లేము. మేము వేఱే ఊరిలో ఉన్నాము. ఆయనకు జ్వరం వస్తే ఒక మాత్రా ఇవ్వలేదు, రొంత చారు కాచలేదు. మా మటుకు మేము ఎండాకాలం సెలవులలో రావడం, సరదాగా గడిపి వెళ్ళిపోవడం తప్ప చేసింది ఏమీ లేదు. ఆయన ఇంట్లో ఒక బీరువా సర్దలేదు, ఒక చింతా పంచుకోలేదు, ఆయన వ్యాపారానికి ఏమీ సాయమూ చెయ్యలేదు. మరి మా మేనమావ, బావలు అవన్నీ చేస్తూనే ఉన్నారు. మా తాతగారు ఒక కేక వేస్తే పలికే వాడికే కదా ఆస్తి చెందాల్సింది?

కృష్ణయ్య గారి కళ్ళల్లో కాస్త తెరిపి కనబడింది. రావు గారు వాదించడానికి మళ్ళీ మొదలయ్యారు. ఇంతలోనే కిట్టు...

కి: పోనీ ఆ అరయెకరం గురించే మాట్లాడుకుందాం. నేను LKG, UKG ఇక్కడే చదువుకున్నాను. అల్లుడి దగ్గర రూపాయి తీసుకోను అని మా తాతగారు నా fees ఆయనే కట్టారు. ఆ తఱువాత engineering చదివేటప్పుడు కొంచం డబ్బులు అవసరమైతే సర్దారు. మా తాతగారు ఆయన తండ్రి అరయెకరం మీదనే ఈ ఆస్తి అంతా సంపాదించారు కాబట్టి అందులో భాగం ఆయన పిల్లలకు చెందాలంటే, నేను ఆ LKG, UKG, engineering వలనే ఈ రోజు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాను కాబట్టి నేను నా ఆస్తిలో మా తాతగారికో, మా మేనమాఁవకో వాటా ఇస్తున్నానా? లేదు కదా? అరయెకరం ఆస్తి చేతిలో ఉండి, ఎకరం పాటి అప్పుండి ఉన్న వాళ్ళల్లో ఎంతమంది కష్టపడి, వ్యాపారం పెట్టుకుని, సుఖపడి నలుగిరికి అన్నం పెట్టే పరిస్థితులో ఉన్నారో చెప్పండి. దానికి ఆ అరయెకరమే కారణమనుకోవాలా? లేక ఆ వ్యక్తి వ్యాపారదక్షతే కారణం అనుకోవాలా?

కి: మఱోలా అనుకోకండి కానీ, మా తాతగారి ఆయన కూతుళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని నా అభిప్రాయం. ఇంటికి వచ్చినప్పుడు ఆయన మమ్మల్ని అభిమానంగా పలకరించి, నాలుగు అనుభవపూర్వకమైన మాటలు చెప్తే అదే పదివేలు.

రావు గారికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కృష్ణయ్య అంతటితో ఆపి, "నాన్న కిట్టు, పదరా బయల్దేరదాము. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.", అని చెప్పి చేతి కఱ్ఱ పట్టుకున్నారు. కిట్టు వెళ్ళి ఆయన చెప్పులు కాళ్ళ దగ్గర సర్దాడు. ఆయన, కిట్టు, రావు గారికి నమస్కారం చెప్పి నడవసాగారు.

కొంచెం దూరం వచ్చాక, కృష్ణయ్య కిట్టు భుజాల మీద చెయ్యివేసి కొంచెం దగ్గరకు లాగి, "ఒరేయ్ నాన్న, ఈ రోజు నాకు మహదానందం కలిగించే మాట అన్నావురా. ఆయన ఎంత పుల్లలు పెట్టాలని చూసిన, నువ్వే అడ్డుకునేసరికి ఆయనకు బుఱ్ఱ తిరిగిపోయింది. అందుకేరా అన్నది:

ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేసిరో 
రాముని తల్లియున్ బరశురాముని తల్లియు భీముతల్లియున్
 కాముని కన్న తల్లియును కంజదళాక్షుననుంగు దల్లియున్
 శ్రీ మహిత ప్రతాపుడగు సిద్ధయ తిక్కన గన్న తల్లియున్

అని...తల్లిదండ్రుల పుణ్యాన్ని బట్టే పిల్లల బుద్ధులుంటాయిరా. మీ అమ్మ, నాన్న ఎప్పుడూ ఒకడి రూపాయి కోసం ఆశించలేదు. నేను పుచ్చుకోలేదు కానీ మీ నాన్న నీ చదువుకైన డబ్బులిచ్చేస్తాననే వచ్చాడు. మరి అదే లక్షణాలు మీకూ వచ్చాయి. చెట్టుని బట్టే కాయలు ఉంటాయిరా. కిత్తనార మొక్కకి అనాసకాయలు కాస్తాయా?"
 
వృద్ధాప్యంలో అన్ని విషయాలపైనా విరక్తి కలిగి అరుదుగా సంతోషం కనబడే వాళ్ళ తాతయ్య మొహంలోని తృప్తి కిట్టు మనసులో ప్రతిబింబించింది.