Wednesday, July 27, 2011

రాముడు కాకిపై బ్రహ్మాస్త్రం సంధించిన కథ

ఆధారం: ఈ కథ ప్రస్తావన వాల్మీకిరామాయణంలో సుందరకాండలో వస్తుంది. దీని మూలం (సంస్కృతంలో), ఆంగ్ళానువాదం ఇక్కడ చదువవచ్చును.

సందర్భం: హనుమంతుడు సీతమ్మని అశొకవనంలో చూశాడు. తనను తత్క్షణం రాముని వద్దకు తీసుకువెళ్తానని, తన వీపుపై కూర్చోమని హనుమంతుడు కోరినా అనేక కారణాలను సూచించి, సీతమ్మ రాను అంటుంది. అప్పుడు హనుమంతుడు ఆయన సీతమ్మవారిని కలిసినట్టుగా రుజువు కోసం రాముడికి, సీతమ్మకూ మాత్రమే తెలిసిన ఏదైనా ఒక విషయాన్ని చెప్పమని కోరతాడు. అప్పుడు సీత చెప్పిన కథ ఇది.

కథ (సీతమ్మ రాముడికి చెప్తున్నట్టుగా హనుమంతుడితో అంటుంది)

చిత్రకూటానికి ఈశాన్యంలో, గంగానదికి దగ్గరగా సిద్ధులు అనేకులు నివసిస్తుండేవారు. అక్కడ కొండల్లో గుట్టల్లో నువ్వు (రాముడు), నేను సంచరిస్తుండగా నీవు తడిసిపోయి నా సమీపంలో కూర్చున్నావు. అప్పుడు ఒక కాకి మాంసాన్ని ఆశించి తన ముక్కుతో నన్ను పొడవసాగింది. అక్కడే ఉన్న మట్టిగడ్డను తీసి (విసిరి) నేను దానిని ఆపాను. అయినా ఆ కాకి వెళ్ళక అలాగే ఉంది. ఆ కాకి నా బట్టను పట్టుకుని లాగుతుండగా, అది జారకుండా నేను బొందుని లాగిపట్టుకొనుచుండగా నీవు నన్ను చూశావు. అసలే కోపంలో ఉన్నాను, నువ్వు నన్ను చూసి నవ్వుతుండటంతో సిగ్గేసింది. అలిసిపోయి నీ ఒడిలో వాలాను. నీవు నన్ను ఓదార్చగా మళ్ళీ నా ముఖం విరిసింది. కన్నీళ్ళతో నిండిన నా కన్నులను నెమ్మదిగా తుడుచుకుంటూ ఉండగా నువ్వు నన్ను చూశావు. నేను నీ ఒడిలో, నీవు నా భుజాలలో సేద తీరుతున్నాము.

ఇంతలో మళ్ళీ ఆ కాకి వచ్చింది. రాముడి ఒడిలోంచి లేస్తున్న నన్ను చన్నుల నడుమ పదే పదే గ్రుచ్చసాగింది. అప్పుడే నా రక్తం కనబడుతున్న నా చన్నులను గమనించిన నీవు బుసఁగొడుతున్న పాము లాగా లేచి, "ఎవరు నీ చన్నులను గాయపరిచింది. కోపంలో ఉన్న ఐదు-ముఖాలు గల పాముతో ఆడుకోవాలని చూసే ఆ మూర్ఖుడు ఎవరు?" అని అడిగావు. నేను ఏమీ అనక మునుపే, చుట్టొ చూసి గోళ్ళపై రక్తబిందువులు కలిగి నా ముందు ఉన్న ఆ కాకిని గమనించావు. అక్కడ ఉన్నది ఒక్క ఆ కాకే కనుక, అదే ఈ పని చేసి ఉంటుంది అని అనుకుని దానిని దండించాలని నిశ్చయించుకున్నావు.

పర్వతాలలో వేగంగా సంచరించే ఆ కాకి ఇంద్రుడి సంతతి అని అనుకుంటాను. అయినా నువ్వు సంకోచించకుండా, నీ పాంపులోంచి ఒక దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా ప్రయోగించావు. ఆ కాలాగ్ని వంటి కాంతిని చూసిన కాకి భయంతో ఎగిరింది. నీ బ్రహ్మాస్త్రం దాన్ని తరిమసాగింది. రక్షణ కోరి ఆ కాకి ఈ లోకమంతా సంచరించింది. ఇంద్రుడు, దేవతలు, మహర్షులూ కూడా కాపాడమని చెప్పగా తిరిగి తిరిగి ఆ కాకి నిన్నే శరణు కోరింది. ఆ కాకి నీకు తెచ్చిన కోపానికి గాను చంపదగినదే. కానీ, నీ కృప వలన రక్షింపబడింది.

ఆ కాకి అలిసిపోయి నేల మీద పడింది అని గమనించిన నువ్వు, "అలిసిపోయిన నిన్ను నేను చంపను. ఐతే బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలో నువ్వే చెప్పు", అన్నావు. ఆ కాకి, "రామ! నీ అస్త్రం నా కుడికంటిని తాకేలాగా చూడవయ్యా", అంది. అలాగే చేశావు. ఆ విధంగా తన కుడికంటిని వదులుకొని, ప్రాణాలను రక్షించుకుంది. నీ ఔన్నత్యం తెలుసుకొని దశరథునికి, నీకు నమస్కరించి తన ఇంటికి వెళ్ళింది.

రామ! నా కోసం ఒక కాకి పైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించావే. మరి ఈ రోజు నీ నుండి నన్ను దూరం చేసినవాడిని ఎందుకు శిక్షించట్లేదయ్యా? నువ్వు కాక నన్ను ఎవరు రక్షించగలరు? నీ ముందు యుద్ధంలో దేవతలు కూడా నిలువలేరు కదా? మఱి ఎందుకు ఈ జాప్యం? త్వరగా వచ్చి నన్ను రక్షించు.

8 comments:

Praveen Kumar B said...

chala baga rasaru.... chala mandiki ee story teliyademo...

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

రామాయణం లో ఇదో ముఖ్యమైన కథగా చెప్తారు. బాగ రాశావ్!

anrd said...

ఆ కాకి చేసిన పనివల్ల , పాపం దాని తరువాతి తరాల కాకులు గుడ్డితనంతో జీవించవలసి వచ్చింది.

anrd said...

చాలామందికి తెలియని కధను తెలియజేసారు.
కాకి చేసింది చిన్న తప్పు కాదు.
అయినా పక్షి కాబట్టి , సీతారాముల కృప వల్ల ప్రాణాలు పోకుండా , ఒక కన్ను మాత్రమే కోల్పోయి ,....... చిన్న శిక్షతో బయటపడింది.
రావణాసురుడు ఎన్నో తెలిసీ తప్పు చేశాడు కాబట్టి , తన వారసులతో సహా ప్రాణాలు కోల్పోయాడు...........ఆ విధంగా పెద్ద శిక్ష పడింది.
కాకి కోల్పోయిన కన్ను ........ , వారసులతో సహా అంతరించిన రావణుడు .......కధల వల్ల తాము చేసే తప్పులవల్ల తమ తరువాతి తరాలు కూడా బాధలు పడే అవకాశం ఉంది అని ప్రజలు తెలుసుకోవచ్చు.

ramakumari Balantrapu said...

calaa baagaa wrasaaru sandeep...good..

Sandeep P said...

@ప్రవీణ్, confident girl, arnd, అవినేని

ధన్యవాదాలు :)

@arnd

ఆ కాకి తఱువాత తరాలు గుడ్డిదనంతో జీవించాయని నాకు తెలియదండి. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందా?

anrd said...

సోదరులు సందీప్ గారికి ,
అసలు ఏం జరిగిందంటేనండి.......నేను వాల్మీకి వారి రామాయణం ఎప్పుడూ చదవలేదండి. అయితే పైన చెప్పిన కధ తెలుసు. అయితే కొందరు అంటారు గదా ! కాకులకు ఒక కన్ను కనబడదని. ( ఈ విషయం ఎంతవరకూ నిజమో నాకు తెలియదు. ) అందుకని నేను అలా అనుకోవటం జరిగింది.
అయితే మీ బ్లాగులో వ్యాఖ్య వ్రాసిన తరువాత బాగా ఆలోచించాను. అసలు ఈ సంఘటన గురించి వాల్మీకి వారి రామాయణం లో ఏమని ఉందో వివరంగా తెలుసుకోవాలనిపించింది.
నెట్ లో వెతకగా ,వెతకగా ఒక పోస్ట్ లో సరిగ్గా ఈ సంఘటన శ్లోకములు అర్ధంతో సహా వివరించటం కనబడింది. . ( విచిత్రం ఏమిటంటే మీరు ఇచ్చిన లింక్ గురించి నేను మర్చిపోయానండి. )

వారి పోస్ట్ లో బ్రహ్మాస్త్రం వల్ల కాకి కన్ను పోగొట్టుకున్నట్లు చెప్పబడింది. అంతకుమించి మిగతా కాకుల గురించి వివరములు లేవు.
అందుకే నేను కొంతభాగం తప్పుగా వ్యాఖ్యానించటం జరిగిందని తెలుసుకున్నాను. నా తప్పు సరిదిద్దుకోవాలని చూస్తే , మీ బ్లాగ్ పేరు మర్చిపోయానండి. కొంతసేపటి క్రితం స్వగతం బ్లాగ్ లో , కమలం గురించి టపా చదువుతుంటే ,అందులో మీ వ్యాఖ్య చూసి మీ బ్లాగ్ కు వచ్చాను. ( బాల ఆంజనేయుని చిత్రము , మీ పేరు కనిపించింది. ) అదండి జరిగింది. మీ వ్యాఖ్య కూడా ఇంతకు ముందే చూశానండి.

** నేను చెప్పేది ఏమంటే, నేను కొంతభాగం పొరబాటుగా వ్యాఖ్యానించాను. అందువల్ల, దైవానికి , ఇంకా , అందరికీ క్షమాపణలు చెప్పుకుంటూ, జరిగిన పొరపాటుకు క్షమించాలని వేడుకుంటున్నానండి.........

సీతారాములు దయగలవారు కాబట్టి అంతగా గాయపరిచిన కాకిని చంపకుండా వదిలేశారు. జీవించిఉన్న మానవులను అలా రక్తం వచ్చేవరకు గాయపరచటం కాకుల సహజలక్షణం కాదు. చీమ గానీ, దోమ గానీ మనల్ని కుడితే పాపం అల్పజీవి కదా ! కుట్టనీ ! అని జాలిపడము కదా ! నలిపేసి చంపేస్తాము. కానీ సీతారాములు దయకలవారు కాబట్టి చిన్న శిక్షతో వదిలేశారు..

Babu said...

crow can see 90 degrees only at a time but we can see 180 degrees at a time.so that's why humans says that crow has only one eye.In the story of the king Bali also we can hear this crow story when Shukracharya lost his one eye by the god vamanudu.