Wednesday, July 20, 2011

మహాభారతంలో యజోపయజుల కథ

(వ్యాసుడు రచించిన మహాభారతంలో ఆదిపర్వంలో, చైత్రరథపర్వంలో ఈ కథ కనబడుతుంది. దీన్ని ఆంగ్ళంలో ఇక్కడ చదువవచ్చును, సంస్కృతంలో ఇక్కడ చదువవచ్చును.)

ద్రోణుడి చేతులో పరాభవం పొందిన ద్రుపదుడు ఎలాగైనా ద్రోణుడిపైన పగ తీర్చుకోవాలనే తపనతో దానికి కావలసిన యోగబలం పొందడం కోసం యజ్ఞయాగాదులు తెలిసిన గొప్ప బ్రాహ్మణుల కోసం వెదుకసాగాడు. యమునా, గంగాతీరాలలో వెదుకుతూ ఉండగా ఒకానొక ఆశ్రమంలో కశ్యపుడి వంశంలో జన్మించిన యజుడు, ఉపయజుడు అనే ఇద్దరు బ్రాహ్మలను చూశాడు. వారు ఇద్దరూ ఎంతో గొప్ప తపోబలం కలిగినవారని తెలుసుకుని వారికి సేవలు చేయనారంభించాడు. వారిరువురిలో తమ్ముడే గొప్పవాడని నిర్ణయించుకుని ఉపయజుడితో, "ద్రోణుడు నాకు కలుగజేసిన అవమానానికి ప్రతీకారంగా అతడిని వధించగలిగే ఒక పుత్రుడు నాకు కలిగే విధంగా ఏమైనా యజ్ఞం చేస్తే మీకు 10,000 గోవులను ఇస్తాను", అన్నాడు. మహాజ్ఞాని అయిన ఉపయజుడు "ద్రుపద, ఇటువంటి చెడు ఉద్దేశాలతో నేను పవిత్రమైన యజ్ఞాలను చేయలేను", అన్నాడు.

అయినా పట్టు వదలకుండా ద్రుపదుడు ఉపయజుణ్ణి మఱొక సంవత్సరం సేవిస్తాడు. అప్పుడు ఉపయజుడు అతడితో, "ద్రుపద, ఒక రోజు అడవిలో సంచరిస్తుండగా నా అన్న యజుడు మలినమయమైన నేల పైన రాలిన ఒక పండుని తీసుకుని సేవించడం నేను చూశాను. జ్ఞానం కలిగినవాడై కూడా అందులో అతనికి ఏమీ తప్పు తోచలేదు. ఒక చోట మలినాన్ని పట్టించుకోనివాడు, మిగతా అన్ని చోట్లా పట్టించుకుంటాడు అని అనుకోలేము. ఇంతకు ముందు మా గురువు గారి వద్దనుండగా అతడు గురుకులంలోని మిగతావారు విడిచిపెట్టిన తినుబండారాలను తినడం నేను చూశాను. అతడికి నచ్చని తిండి గురించి మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. తిండి పట్ల ఇంత యావ ఉన్నవాడికి తప్పక ఐహికమైన వాంఛలు బలీయమైనవయి ఉంటాయి. కనుక నీకు కావలసిన యజ్ఞం అతడు చేస్తాడు అని అనిపిస్తోంది", అన్నాడు.

ఉపయజుని అంత గొప్పవాడు కాడని అనుకున్నా, ద్రుపదుడు యజుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు, "గురువర్యా, మీరు నా కోసం ఒక యజ్ఞం చేసినట్టైతే మీకు 80,000 గోవులని ఇస్తాను. ద్రోణుడు చేసిన అవమానం నన్ను దహించివేస్తోంది. బ్రహ్మాస్త్రం సంపాదించిన అతడు మఱో పరశురాముని వలే తన బ్రహ్మతేజంతో క్షత్రియుల నాశనాన్ని తలబెడుతున్నాడు. నా దగ్గర క్షత్రియశక్తి ఉన్నప్పటికీ, అతడిని అడ్డుకొనే బ్రహ్మతేజం లేదు. కానీ, మీరు అతని కంటే గొప్ప బ్రహ్మజ్ఞాని. మీరు తప్పక ఈ యజ్ఞాన్ని జరిపి నాకు బ్రహ్మశక్తిని కూడా జత చేయగలరు.". యజుడు యజ్ఞం చెయ్యడానికి ఒప్పుకుంటాడు.

యజుడు ఈ యజ్ఞం చాలా కష్టమైనది అని గ్రహించి, ఉపయజుడి సహాయం కూడా అడుగుతాడు. ఉపయజుడు ఏమీ ఆశించకుండానే సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. వారిద్దరూ కలిసి జరిపిన యజ్ఞంలోనే దృష్టద్యుమ్నుడు, ద్రౌపది పుట్టారు. వారికి నామకరణం కూడా యజుడే చేశాడు. (నిజానికి, ద్రౌపది నల్లగా ఉండటం చేత ఆమెకు "కృష్ణా" అనే పేరు పెట్టారు. కానీ, ద్రుపద రాజు కూతురు కావడం చేత ఆమెను ఎక్కువగా ద్రౌపది అని సంబోధించడం చూస్తున్నాము.) ద్రుపదుడు ఎంతో సంతోషించి యజుడికి తాను మాటిచ్చినట్టుగా అనేక గోవులను దానం చేసి సత్కరించాడు.

ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్ళంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది.

3 comments:

పద్మ said...

"ఈ కథలో నీతి ఏమిటంటే, మనిషి వ్యక్తిత్వానికి ఆధారభూతమైన నియమాలు అతను చేసే ప్రతీ పనిలోనూ కనిపిస్తాయి. దీనినే ఆంగ్లంలో integrity అంటాము. ఒక చోట నియమాన్ని ఉల్లంఘించినవాడు మఱొక చోట దాన్ని గౌరవించకపోయే అవకాశమే ఎక్కువ. అందుకే చిన్నపిల్లలు చెప్పే చిన్న చిన్న అబద్ధాలను, అనే చిన్న చిన్న చెడు మాటలను కూడా సున్నితంగా ఖండించి వారిని సన్మార్గంలో ఉంచాలి అని పెద్దలు చెప్తున్నది."

ఇది చాలా చాలా నిజం. ఒక మనిషి చిన్నప్పటి నించి నేర్చుకున్న విషయాలే (మీరన్న నియమాలు) అతను బాలుడి నించి యువకుడిగా ఎదిగే క్రమంలో అడుగడుగునా అతను చేసే పనిలోనూ, అనే మాటలోనూ కనిపిస్తూనే/వినిపిస్తూనే ఉంటాయి. ఒక సినిమా కధే అయినా అందులో సారం చాలా పచ్చి నిజం. ఒక పిల్లవాడు చిన్నప్పుడు తోటకూరని దొంగిలిచ్చి తెచ్చి తల్లి కి ఇస్తే మానాయనే అని మెచ్చుకుని ప్రోత్సహిస్తుంది. ఆ పిల్లవాడు అలా అలా చిల్లర దొంగతనాలు చేస్తూనే ఎదిగి పెద్దవాడయ్యాక దొంగతనం నేరం మీద జైల్లో పడతాడు. అప్పుడు తల్లి దొంగతనం తప్పు అని చెప్పబోతే, మరి ఆ విషయం తోటకూర నాడే ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులని చూసి చూడకుండా వదిలేస్తే ఆ పిల్లలు ఆ తప్పులని మళ్ళా మళ్ళా చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత అది వారికి తప్పు అని కూడా తోచదు.

Sandeep P said...

@పద్మ గారు

మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను అండి.

మీరు చెప్పిన కథ "తోటకూర నాడే చెప్పనైతివే తల్లి" అనే సామెతకు మూలం కదండి. చాలా రోజులైంది ఆ సామెత విని :)

Phanindra said...

చక్కని కథా, సందేశం. వీలైతే Pregnant King పుస్తకం చదవు, భారతంలోని కథతో ఒక ఆసక్తికరమైన fiction novel అది.