Sunday, May 22, 2011

వేటూరికి నివాళి

నేటికి సరిగ్గా ఒక సంవత్సరం క్రితం వేటూరి అస్తమించారు. ఆయనని తలుచుకుంటూ ఏవో నాలుగు మాటలు కూర్చాను. వారికి ఇదే నా పదాంజలి.

తలపులన్నీ మనసు-తలుపు తడుతున్నా, కలముతో ఈ పాట వ్రాయలేకున్నా
మాటలన్నీ మధుర జ్ఞాపకాలాయి, మనసులోన నింపె ఆనాటి హాయి
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

తెలుగుకోకిలమ్మ మూగబోయింది, తేటగీతి నీవు ఇవ్వలేదంటూ
మనసు-తేనెటీగ మధువు చేదంది, పాత పాటపూల మధురమేదంటూ
పాటలన్నీ యిచ్చి పయనమైనావు, మైనమల్లే నీవు మాయమైనావు
కన్ను వెతుకుతోంది ఆనాటి వెలుగు, నిన్ను అడుగుతోంది నీ తల్లి తెలుగు...

రంపమంటి బాధ రగిలించె మంట*, రాగమాగనంటు కదిలింది వెంట
అంపశయ్య మీదె అల్లావు పాట, సాగి చేరుకుంది పదిమంది నోట
పాపగా ఎదిగావు తెలుగమ్మ కంట, పాటగా మిగిలావు మా అందరింట
మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట...

వెన్ను తట్టి లేపె ఈ నాటి ఉదయం, నిన్నటి నీ పాట తేనె నెమరేసె హృదయం...
మరపురాని పాట మరలి రాదంటే, రేపు లేని నిన్న కావాలి అంతే...

* వేటూరి గారు ఎన్నో పాటలు ICUలో ఉండి వ్రాశారని చాలామంది చెప్పగా విన్నాను.

6 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

తేటతెలుగుని పాటల జగతిని వదలివెడలి నాకలోకము నలరించ జనిన వేటూరి వారికిదే నివాళి!

Anonymous said...

"మైనమల్లే నీవు మాయమైనావు"

అత్యంత కవితాత్మకం!

"పాపగా ఎదిగావు తెలుగమ్మ కంట, పాటగా మిగిలావు మా అందరింట"

హృద్యంగా చెప్పిన సత్యం!

Phanindra said...

చక్కని పాట సోదరా!

Naga Pochiraju said...

మనసుపొరల బొంత కింద నీ పాట, దాగి ఆడుతోంది దోబూచులాట...i love this line

మురళి said...

A fitting tribute

panguluru sailaja said...

"paapagA edigAvu telugamma kanTa,paaTagA migilAvu maa andarinTa" kaLLu chemarchaai nijamgaa.chaalaa baagaa vrASAru Sandeep