Tuesday, May 17, 2011

తెలుగు భారతికి వెలుగు హారతై, ఎద లయలో పదకవితలు కలయ... (అన్నమయ్య జన్మదినం)

ఈ రోజు అన్నమాచార్యుని పుట్టినరోజు. తెలుగువారందరూ ఎంతో గర్వించ-తగిన/వలసిన రోజు. తెలుగు భాషని, భాషకి సేవచేసిన మహానుభావులని మరిచిపోవడం మనకు వెన్నతో పెట్టిన విద్య అయినప్పటికీ ఈ రోజు కాస్త ఆ అలవాటుని పక్కన పెట్టి, ఆ మహానుభావుడిని ఒక్కసారి స్మరిద్దాము.

ఈ రోజుల్లో మన చలనచిత్రాల్లో వస్తున్న పాటలను చూస్తే "ఓసోసి, పాట వ్రాయడం అంటే ఇంత సులువా? నేనూ వ్రాస్తాను" అనుకుని "నిన్ను చూస్తే గుండె కొట్టుకుంది, మాయరోగం నన్ను పట్టుకుంది" అని వ్రాసేద్దామనిపిస్తుంది. చలనచిత్రకవులకు కూడా పదే పదే అదే సందర్భం ఇస్తే తరచూ అవే పదాలు/భావాలు దొర్లుతూ ఉంటాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. అలాంటిది ముప్ఫైవేలకు పైగా పాటలు, ఒక్కడంటే ఒక్కడి మీద, వ్రాయడం, ప్రతీ పాటలో వైవిధ్యం కనబరచడం, వాటిని భావితరాలకు నచ్చేలాగ/ఉపయోగపడేలాగా స్వరపరచడం, ఎక్కడా యాంత్రికంగా అనిపించకుండా ఆవు పొదుగు దగ్గరి పాలలాగ స్వఛ్ఛంగా ఉంచడం అంటే అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న కర్ణాటక సంగీతంలో ఇంతటి అద్భుతాన్ని సాధించినవారిని వేళ్ళ మీద లెక్కపెట్టచ్చును (అంటే తక్కువ సంకీర్తనలను రచిస్తే తక్కువ కవులు/గాయకులు అని కాదు. కానీ రోజుకో అద్భుతమైన గేయం వ్రాయడం గుర్తించదగిన విషయం అని).

నేను గతసంవత్సరం అన్నమయ్య జన్మదినానికి ఒక పాట వ్రాశాను. స్వరాలంటారూ, నా లాంటి స్వరపరిజ్ఞానహీనుడు ఏం చేస్తాడు? ఏదో "ల లా ల" అనుకుంటూ పాట వ్రాశాను. ఈ ఏడాది కూడా ఎలాగైనా ఒక పాట అన్నమయ్య మీద వ్రాయాలని నా మనసు లాగింది. కానీ, గంటసేపు కూర్చున్నా ఏమీ తట్టట్లేదు. ఇప్పుడు నేను అన్నమయ్య అంత కవిని అనే దుస్సాహసం చేయట్లేదు, కాకపోతే ఏడాది ఖాళీ ఉన్నా అదే సందర్భానికి మఱొక పాట వ్రాయలేకపోతున్నాను. మఱి రోజూ వేంకటేశుడి మీదనే వ్రాయాలంటే ఎంత భక్తి, భావనాశక్తి, భాషాపటిమ ఉండాలో ఆలోచిస్తేనే అన్నమయ్యకు పొఱ్లుదణ్ణాలు పెట్టేయాలనిపిస్తోంది. ఐనా సాహసించి అన్నమయ్య గుఱించి ఏమైనా వ్రాద్దామంటే చలనచిత్రకవితాపితామహుడు వేటూరి ఇప్పటికే అద్భుతమైన పదాలను వాడి అన్నమయ్యని మెప్పించేశాడు. ఆ పాటలు తలుచుకుంటేనే "అమ్మో...నేను ఇలాగ వ్రాయలేను మొఱ్ఱో" అనాలనిపిస్తుంది.

అన్నమయ్య గళానికి (అదే...నందకానికి!) రెండు వైపులా పదునే. అటు సంఘాన్ని విమర్శించినా (బ్రహ్మమొకటే), ఇటు సంఘాన్ని విస్మరించినా (అదినే నెఱగనా); అటు శృంగారమైనా (ఏమొకో చిగురుటధరమున), ఇటు పరమవైరాగ్యమైనా (అంతర్యామి అలసితి); అటు గంభీరమైన సంస్కృతమైన (ఫాలనేత్రానలప్రబల), ఇటు జానపదమైనా (సిరుతనవ్వులవాడే సిన్నెక్క) -- అన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చినవే అనిపిస్తుంది. ఒక వంద thesisలు వ్రాయగలిగినన్ని విషయాలు ఆయన పాటల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆయన కవితాపటిమ గుఱించి చెప్పడానికి నా బోటి అల్పుడు సరిపోడు. ఆ ప్రయత్నం కూడా నేను చేయదలుచుకోలేదు.

కొంతమంది కారణజన్ములు అని వారిని చూడకపోయినా వారి సృష్టిని బట్టి చెప్పచ్చును. ఆది శంకరుడి గొప్పదనం తెలియడానికి ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ చదవక్కరలేదు. సంస్కృతంలో అక్షరం ముక్క తెలియని వాడైనా "అయి గిరి నందిని" అన్న శ్లోకం విన్నాడంటే, "ఇదెవరో మహానుభావుడు వ్రాశాడురోయ్!" అనుకుంటాడు. అలాంటి కారణజన్ముడే అన్నమాచార్యుడు కూడా. నేను దైనందినజీవితంలో విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఆయన మాటలను గుర్తుచేసుకుంటుంటాను. ఆయన వైరాగ్యభరితమైన పాటలు వింటూవుంటే నా మనసుకు ఊరట కలుగుతుంది. భగవద్గీతలోని లోతంతా ఒక్క నిముషంలో చూసినంత ఎత్తుకు వెళ్ళిపోతాను.

"కోరిన కోఱ్కెలు కోయనికట్లు, తీరవు నీవవి తెంచక; మదిలో చింతలు మయిలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక"
"యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి; కొంతైన బ్రహ్మచింత కోటిలాభము"
"పైపై నె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా"

 
ఇలాగ చెప్పుకుంటే పోతే ఎన్ని రోజులైనా చెప్పుకుంటూపోవచ్చును. ప్రస్తుతానికి ఇక్కడితో ఆపి, పదకవితాకులంలో ఒక మరుగుజ్జునైన నేను మనసార ఆ మహాత్ముడికి ప్రణామం చేస్తున్నాను. "మహానుభావ... మళ్ళీ నీకు పుట్టే ఉద్దేశం ఉంటే చెప్పు, నీకు చెప్పులుకుట్టేవాడిగా పుట్టినా నాబోంట్ల జన్మ ధన్యమవుతుంది", అని గట్టిగా అరవాలనిపిస్తోంది.

PS: సోదరుడు శ్రవణ్ కుమార్, తన బ్లాగు ద్వారా అన్నమయ్య పాటలను నలుగురికీ అందే విధంగా చేస్తున్నాడు. ఆ బ్లాగులో అన్నమయ్య అనే అనంతరత్నాకరంనుండి గ్రహించిన అమూల్యమైన వజ్రాలు ఉన్నాయి. చదువర్లు ఆ బ్లాగుని దర్శించవలసిందిగా నా మనవి. 

3 comments:

Sravan Kumar DVN said...

mi chivari line chustunte naku oka kirtana gurtostondi: annamayya annadi chudandi ..

ఇన్ని జన్మములేటికి హరిదాసు-
లున్న వూరఁ దానుండినఁ జాలు

శ్రీవేంకటేశుఁ జూచినవారి శ్రీపాద-
సేవకుడై యుండఁజేరినఁ జాలు
ఈవిభుదాసుల హితుల పాదధూళి-
పావనమై సోకిఁ బ్రదికినఁ జాలు
-----
అచ్యుత మిమ్ము(దలచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా

అంది నీకు భక్తులైన యలమహానుభావుల-
చందపు వారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటు బంటుకు
సందడి బంటనవుటే చాలదా నాకు

Sandeep said...

@శ్రవణ్

హ హ, ఆఖరికి ఆయన గురించి ఒక్క వాక్యమైనా స్వతఃగా చెప్దామని ప్రయత్నిస్తే అది కూడా ఆయన వందలసంవత్సరాల క్రితం patent చేసుకున్నారు. మహానుభావుడని ఊరికెనే అంటారా!

ఈ కీర్తన ఇదివరకు నేను వినలేదు. చూపినందుకు కృతజ్ఞుణ్ణి. మీ బ్లాగులో దీన్ని వెతికి పట్టుకుని వింటాను.

వనజవనమాలి said...

baagundhi.. meeku, Srvan kumar garki abhinandhanalu.