Monday, November 8, 2010

ఉల్లేఖాలంకారము

వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> ఉల్లేఖాలంకారము


సూత్రం: బహుభిః బహుదోల్లేఖా దేకస్యోల్లేఖ ఇష్యతే
అర్థం: ఒకే వస్తువు పలువురికి పలు విధములుగా కనిపిస్తున్నట్టుగా వర్ణించడం ఉల్లేఖాలంకారం అవుతుంది.

ఉదా:- (కావ్యాలంకార సంగ్రహం, రచన: రామరాజభూషణుడు)
బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనోబాణుడని స్త్రీలు, నరసిమ్హరాయలును తలంచెదరు

ఇక్కడ కవితావస్తువు ఒకటే - నరసిమ్హరాయులు. ఆయన కవులకు బాణుడిగా, రాజులకు మురారిగా, స్త్రీలకు మన్మథుడిగా కనిపిస్తున్నాడు అని చెప్పడం ద్వారా కవి ఒకే వ్యక్తికి ఎన్నో స్వరూపాలను తెలియజేశాడు. కనుక ఇది ఉల్లేఖాలంకారము. ఇందులోనే శబ్దాలంకారం కూడా ఉంది - బాణుడు అనే పదం మళ్ళీ మళ్ళీ వస్తోంది - ఇది అనుప్రాస అవుతుందని నా నమ్మకం.


ఒకే వస్తువుకు వేర్వేరు గుణాలను బట్టి వేర్వేరు వస్తువులకు అభేదాన్ని తెలుపడం కూడా ఉల్లేఖాలంకారమే.

ఉదా:- (చంద్రాలోకం)
అతడు వ్యక్తిత్వమందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడు

ఇక్కడ ఒకే వ్యక్తికి బృహస్పతి, అర్జునుడు, భీష్ముడు - ఈ ముగ్గురితో అభేదం చెప్పబడింది. కాకపోతే ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో సమానం అని చెప్పారు. కనుక ఇది ఉల్లేఖాలంకారము.


ఉదా:- (అప్పకవీయం, రచన: అప్పకవి)
తిరమగు త్రిప్రాసము సుం
దరమగు మురవైరిరూపు తరుణులకు మనో
హరమగు, దానవులకు భీ
కరమగు, 'దపసులకూ ముక్తికరమగునవనిన్

"మురవైరి (కృష్ణుడి) రూపము స్త్రీలకు మనసు దోచుకునే విధంగా, దానవులకు భయం కలిగించే విధంగా, తాపసులకు ముక్తి మార్గంగా గోచరిస్తోంది" అని భావం. కృష్ణుడికి ఉన్న ఒక్కో గుణం ఒక్కొక్కరికి ప్రత్యక్షమవుతోంది అని చెప్పటంతో ఇది ఉల్లేఖనాలంకారం అయ్యింది.

ఉదా:- (శ్రీమద్భాగవతం, రచన: పోతన)
రవిబింబంబుపమింపఁబాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుఁదా బ్రహ్మాండమున్ నిండుచోన్

వామనావతారఘట్టంలోని ఈ పద్యం బహుశః అందరికీ తెలిసిన ఉదాహరణ. పోతనామాత్యుడి ఊహాశక్తికి నిదర్శనం. వామనుడు తన శరీదైర్ఘ్యాన్ని పెంచుకుంటూపోతుంటే అతని పక్కన ఉన్న సూర్యుడు చిన్నవాడైపోతున్నట్టుగా అనిపిస్తోందని కవి భావం.

బ్రహ్మచారికి పట్టిన గొడుగుగా, అతడి తల మీద ధరించిన రత్నంగా, చెవుల కుండలాలుగా, మెడలో నగగా, భుజాలపై బంగారు కేయూరంగా, మణికట్టుపైన కంకణంగా, నడుముకు కట్టిన గంటగా, కాలికి ఉంచిన పట్టీలుగా, చివరికి వటుని పాదాలకు పీటగా అనిపిస్తున్నాడుట సూర్యుడు. అంటే పోల్చి చూస్తుంటే వటుడి పరిమాణం పెద్దదైపోతోంది, సూర్యుడు చిన్నవాడైపోయి శిరస్సు పైనుండి, పాదాలకు చేరినట్టనిపిస్తోంది - అని కవి భావం. కవితావస్తువు సూర్యబింబం - ఒక్కో తరుణంలో ఒక్కోలాగా కనిపించడం ఉల్లేఖాలంకారానికి ఆధారమైంది.

ఉదా:- (పాట: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం: వర్షం, రచన: సిరివెన్నెల)
ముక్కుపుడక లాగ, చెవులకు చుట్టూ ఝూక లాగ, చేతికి రంగులగాజుల్లాగా, కాలికి మువ్వలపట్టీ లాగా, మెడలో పచ్చని పతకం లాగా ఉండిపోవే వానచినుక

చినుకును వేర్వేరు వస్తువులతో సమంగా పోల్చడం ద్వారా కవి ఉల్లేఖాలంకారాన్ని ప్రయోగించారు.

6 comments:

Anonymous said...

"కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ - షట్కర్మయుక్తా కులధర్మపత్నీ" - ఇది కూడా ఉల్లేఖాలంకారమా?

చలనచిత్ర గీతాల్లో నుంచి కొన్ని ఉదాహరణలు:

* పాత తెలుగు సినీమాలో సావిత్రిలా... పెరుగులోకి నంజుకున్న ఆవకాయలా... (and so on) తేనె చుక్కలా, వానచినుకులా, మామ్మగారి ముక్కుపుడకలా ఉంది పిల్ల (హాయ్ రే హాయ్! - సిందూరాం - చంద్రబోస్)
* తలలో నాలుకలా, పూసలలో దారము మాడ్కి సతి మదిలోనను మెలగెడు పురుషుడు... (రాదే చెలీ, నమ్మరాదే చెలీ! - మిస్టర్ పెళ్ళాం - వేటూరి; కానీ, ఈ పంక్తులు నంది తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం లోనివి.)
* నవ్వులా అవి, కావు!, నవపారిజాతాలు, రవ్వంత సడి లేని రసరమ్యగీతాలు (తోటలో నా రాజు... - ఏకవీర - సి. నారాయణరెడ్డి)
* చూపులో సూర్యుడు, రూపులో చంద్రుడు (గ్రీకు వీరుడు - నిన్నే పెళ్ళాడతా - సీతారామశాస్త్రి)
* "సూర్యుడు యేడీ? నీతో ఆడి చందమామ అయిపోయాడుగా..." (తూనీగా, తూనీగా! - మనసంతా నువ్వే! - సీతారామశాస్త్రి) (?)

కామేశ్వరరావు said...

సినిమా పాటల్లో మరో ఉదాహరణ:

సిగలో అవి విరులో, అగరుపొగలో, అత్తరులో, మగువా సిగ్గుదొంతరలో, మసలే వలపు తొలకరులో

Sandeep P said...

@నచకి

* "కార్యేషు దాసీ, కరణేషు మంత్రి" -- ఇది కచ్చితంగా ఉల్లేఖాలంకారమే. ఒక్కో గుణంలో ఒక్కొక్కరితో పోలిక చెప్తున్నారు కాబట్టి.

* పాత తెలుగు సినిమాలో సావిత్రిలా -- ఇది ఉల్లేఖాలంకారము కాదు అనిపిస్తోంది. ఒకవేళ, "అందంలో సావిత్రిలాగా, కోపంలో ఆవకాయలా...మాటల్లో తేనె చుక్కలా" అని ఉంటే ఉల్లేఖాలంకారం అయ్యింది. ఇది ఉపమాలంకారమా అంటే అదీ సంపూర్ణంగా కాదు - సామ్యమేమిటో చెప్పలేదు కవి. అందుచేత ఇవి వినడానికి బాగున్నా - సంప్రదాయ అలంకారాలకు కావలసిన అన్ని అంశాలూ లేవు అనిపిస్తున్నాయి.

* తలలో నాలుకలా...ఇది ఉపమాలంకారము. సామ్యం చెప్పబడింది - వీటన్నిటికీ. ఉల్లేఖాలంకారములో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించడం, లేక ఒక్కో గుణంలో ఒక్కొక్కరిని తలపించడం కావాలి. నాకు తెలిసి ఆ రెండూ ఇక్కడ లేవు.

* నవ్వులా...అవి కావు... -- ఇది రూపకాలంకారం. నవ్వులు, పారిజాతాలు ఒకటి కావు. కానీ, కవి అభేదాన్ని చెప్తున్నాడు. "ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే" అనే ఉదాహరణ మనం చెప్పుకున్నాము - అభేదరూపకాలంకారాన్ని చర్చించుకున్నప్పుడు.

* చూపులో సూర్యుడు, రూపులో చంద్రుడు - కచ్చితమైన ఉల్లేఖాలంకారము.

* సూర్యుడు ఏడి -- ఇక్కడ కూడా ఉల్లేఖనం కనిపించట్లేదు.

@కామేశ్వరరావు గారు

మీరు చెప్పిన ఉదాహరణ సరిపోయిందండి. ఒకే వ్యక్తికి ఒకే వస్తువు పలువిధాలుగా అనిపించడం ఉల్లేఖాలంకారం అవుతుందని నా నమ్మకం.

@అందరూ

ముద్దిచ్చి ఓ చినుకు ముతయమైపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే... (చిత్రం: వేటగాడు, రచన: వేటూరి) -- ఈ చరణం కూడా ఉల్లేఖాలంకారమే అనిపిస్తోంది. అదే వస్తువు యొక్క పలు అంశువులు పలువిధాలుగా కనిపించడం.

కొత్త పాళీ said...

చాలా బావుంది.
పోతనగారి నరకాసుర వధ ఘట్టంలో యుద్ధం చెయ్యడానికి లేచిన సత్యభామ కృష్ణుడికి ఎలా కనిపిస్తోంది, నరకుడికి ఎలా కనిపిస్తోంది అని ఒక మంచి సీసపద్యం ఉంది - రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు.
కామేశ్వర్రావుగారి ఉదాహరణ కూడా బావుంది.
రామదాసు కీర్తన ఏమయ్య రామ లో .. సుతుడనుచు దశరథుడు, హితుడనుచు సుగ్రీవుడు, అతిబలుండనుచు కపులు .. ఇలా వస్తుంది - మరి ఇది వర్తిస్తుందో లేదో

Unknown said...

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే
తరతరాల నిసీధి దాటే చిరు వేకువ జాడతడే

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసె బదులతడే
పెను తుఫాను తలొంచి చుసే తొలి నిప్పు కనం అతడే

చిత్రం: అతడు

Unknown said...

నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహసం జాబిలి కిరణం
చిత్రం: తులాభారం రచన: ధాశరధి

ఇందులొ రూపకం మరియు ఉల్లేఖ?