Saturday, May 1, 2010

చూడచక్కని చూర్ణకుంతల (పాట) - వేటూరి

ఈ పాట "మనోహరం" అనే చిత్రంలోనుండి వేటూరి వ్రాయగా, మణిశర్మ సంగీతదర్శకత్వంలో హరిహరన్ పాడాడు. ఈ పాటకు సందర్భం: "నా ఎదురుగుండా ఇంత అందంగా తిరుగుతూ, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు?", అని కథానాయకుడు నాయికను ప్రశ్నించడం.

"పాటకు SPB, పల్లవికి వేటూరి" అని "కొడితే కోలాటం" (చిత్రం: డ్యూయెట్) పాటలో వెన్నెలకంటి వ్రాశాడు. అది ముమ్మాటికీ నిజం అనిపిస్తుంది! "రాగాలా పల్లకిలో కోకిలమ్మ" అని  ఎంతో భావుకతతో వ్రాసినా, "యమహో నీ యమా యమా అందం" అని మహామాసుగా వ్రాసినా - వేటూరి పల్లవి పెదవిపైన ఆడుతూ ఉంటుంది. అలాగ కుదరాలంటే చక్కని ప్రయోగాలు పల్లవిలోనే కనబడాలి. ఆధునిక చలనచిత్రగీతాల్లో "చూర్ణకుంతల" వంటి సామాన్యులకు పరిచయం లేని పదాలను పల్లవిలోనే వాడగల ఘటికుడు వేటూరేనేమో! అలాంటి పదాలు వ్రాసినా అడ్డుచెప్పని చిత్రదర్శకుడు గుణశేఖర్‌ని కూడా మెచ్చుకోవాలి. అసలంటూ చక్కని పదాలను వాడితే జిఙ్ఞాస ఉన్నవాళ్ళు ఆ పదాలకు అర్థాలు తెలుసుకోకుండా ఉంటారా?

చూడచక్కని చూర్ణకుంతల, చూపుకందని హేళ
సందెవేళలో శకుంతల, వెన్నెలెందుకీ వేళ?
హాయినవ్వుల సుహాసిని, తేనెవెచ్చని కలా
వాలుకన్నుల వరూధినీ, లేతహెచ్చెరికలా?
చకోరి చెంచిట, చంచలా, మోహనాలమేఘమాల

పల్లవిలో చూర్ణకుంతల, సుహాసిని అంటూ నాయికను పొగిడి; శకుంతల,  వరూధిని అని పురాణాల్లో స్త్రీలతో కూడా పోల్చాడు. "ఇంతకీ వీళ్ళెవరు?" అని అడిగితే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క భావం ఉంది! చూర్ణకుంతల అంటే "ఉంగారాలు తిరిగిన జుత్తు కలది" అని అర్థం. శకుంతల మేనక కూతురు. అంటే నాయికను "అప్సరస కూతురులాగా ఉన్నావు", అంటున్నాడు. సుహాసిని అంటే "హాయిగా నవ్వేది" అని ఆయనే చెప్పాడు. వరూధిని అంటే పురాణాల్లో నాలాగా పూజలూ, పురస్కారాలు తప్పితే తెలియని అమాయకుడైన బ్రాహ్మడిని ముగ్గులోకి దింపుదామని తన అందాలు ఒలకబోసి (వాలు)కన్నుగీటిన ఒక అమ్మాయి! హమ్మయ్య, ఇప్పుడు ఈ పదాలకూ సందర్భానికీ ఉన్న లంకె అర్థమైందా? 

"తేనెవెచ్చని కల" అనే ప్రయోగం నాకు (అర్థమయ్యింది సరి అయితే) బాగా నచ్చింది. తేనె తీసినప్పుడు అది వెచ్చగా ఉంటుంది. అలాగే మనం తేనె సేవించేటప్పుడు గోరువెచ్చగా సేవిస్తాము. కలని "తేనెవెచ్చ" అనడం కొత్తగా ఉన్నా, తీయగా ఉంది. జరుగుతున్న పొలయలుకని "చూపుకు అందని హేల (ఆట)" గా అభివర్ణించడం, "వెన్నెలెందుకు ఉంది ఈ వేళ?" అని నాయికను సున్నితంగా ఆహ్వానించడం, "నాకు దూరంగా ఉండమని లేత హెచ్చరికలొకటా?" అని అడగటం - అన్నీ మహాచిలిపిగా ఉన్నాయి.

నిలువుటందము నీలో, నిలువుటద్దము నాలో
కలువసోకులు నీలో కలవరింతలు నాలో
ఈల వేసిన ఈడు కోరెను నిన్ను నాకు సగం
ఏడ ఏ సొగసున్నదో మరి ఏల దాపరికం?
గాలుల్లో తేలి పూలల్లోవాలి కవ్వించుకున్న వేళ కంటిపాపకేల జోల?

ఈ చరణంలో ప్రాస అద్భుతం! నిలువుటందం, నిలువుటద్దం; కలువసోకులు, కలవరింతలు వంటి పదాల కలయిక నేను ఎక్కడా చూడలేదు. అమ్మాయికి నిలువెల్లా అందముంటే, తను ఆ అందానికి అద్దమవుతానంటున్నాడు! ఆమె అందం చూసి ఇతనికి కలవరింతలు మొదలయ్యాయిట. ఈడు ముదిరింది అని చెప్పడానికి "ఈల వేసిన ఈడు" అనడం ఎన్నిసార్లు విన్నా పెదాల పైన చిరునవ్వు తెప్పించింది. "సొగసులన్నీ దాచుకోవడం దేనికి?" అని చిలిపిగా అనడం యెత్తైతే "పిల్లగాలీ, పూలూ అన్నీ ఉంటే, కనుపాపలకు లాలి పాడటం దేనికి?" అని అడగటం మరింత చిలిపిగా ఉంది.

కలలు గుప్పెడు కన్నులలో, కలయికెప్పుడు కౌగిలిలో
కథలు చెప్పకు కన్నులతో, కళలు దాగవు కోరికలో
కడలి వెతికే కన్నెవాగై కదలి రావేల?
విరహమల్లే రేగి నాలో కరిగిపోవేల?
కన్యాకుమారి! కాశ్మీరనారి! కస్సూరి ముద్దు పెట్టి కాపురాలు చెయ్యవేల?

"నువ్వు కన్నులతో కథలు చెప్తున్నా, కోరిక ఉన్నట్టుగా కళలు తెలిసిపోతున్నాయి సుమీ!", అని అమ్మాయిని ముట్టడి చేస్తే ఏం చేస్తుంది పాపం? "నువ్వు నదివీ, నేను సముద్రాన్ని - నాలో కలిసిపో" అనడంలో కూడా ఎంతో చక్కని ప్రాస కలిపి వ్రాశాడు వేటూరి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పాటలో భాషా, భావం కలిసిమెలిసి ప్రయాణం సాగించాయి. అందుకే ఈ పాట నాకు ఎంతో ఇష్టం. వేటూరి వ్రాసిన సరసగీతాలలో ఇది అగ్రశ్రేణిలో ఉంటుంది అని నా అభిప్రాయం! సందర్భం రావాలే కానీ, నేనూ ఇదే పాట పాడతానేమో :-P

4 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

వేటూరి గారి అభిమానిని. చక్కగా వ్యాఖ్యానిస్తారు మీరు ( ఓ పక్క అమాయకుడిని అని ప్రతి టపాలో గుర్తు చేస్తూ!!!)
హ..హ్హ..హ..
సందర్భం రావాలే గానీ ఇంతకన్నా మంచి పాటే పాడగలరనుకుంటా...........!

ఆ.సౌమ్య said...

మనోహరంలో ఈ పాట నేనెప్పుడూ గమనించలేదండీ. ఆ సినిమాలో "పచ్చ పువ్వులు విచ్చే గాలుల" పాట అంటే నాకు చాలా ఇష్టం, అదే ఎప్పుడూ వింటూ ఉంటానుగానీ ఈపాట గమనించలేదు.

@.C
మీ వివరణ ఇంకా బావుంది
""పాడు గొంతులు" పట్టించుకోకుండానే పాడేస్తాయని తెలిసినప్పుడు ఆ బాధ్యత గీతరచయితదే అంటాను నేను!)".......హ హ హ, సూపరు, భలే చెప్పారు

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

శకుంతల అప్సరస కూతురు మాత్రమే కాదు. తనూ ఎంతో సౌందర్యవతి కాబట్టే దుష్యంతుడు ఆమెని తొలిచూపులో వరించాడు. ( చిత్తచాపల్యంతో కాదు అని). కాబట్టి కధానాయకుడు నాయకిని శకుంతల తో పోల్చడంలో వింతేమీ లేదు.
ఇక సందీప్ గారు అప్సరస కూతురని శకుంతల ని వర్ణించటంలో బహుశా సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన వంశం అని చెప్పాలనే ప్రయత్నం అనుకుంటున్నాను. వీరులవంశంలో పుట్టిన వాడిగా ఒక వీరుని వర్ణిస్తారుకదా! (ఉదా: రఘువంశ సుధాంబుధి చంద్ర అంటే గొప్పవీరుడైన రఘువు యొక్క వంశపు సుధాంబుధికి చంద్రుని వంటివాడనివీరుడైన శ్రీరాముని వర్ణిస్తారు కదా!

.C said...

@Mandakini: Super cheppaaru! :-)