సమస్య (దత్తపది):- పూలజడ, క్రోధం, బుట్ట, వేపపువ్వు.
ఇచ్చింది: స్రవంతి గారు
పూరణ (ఆటవెలది):-
క్రోధమయ్యెనేమొ కొమ్మకు ఈవేళ
బుసలుగొట్టసాగె పూలజడదె
నాగసరమునూది కౌగిలిబుట్టలో
పెట్ట వేపపువ్వు పట్టుతేనె!
భావం:-
అమ్మాయికి ఈరోజు కోపం కలిగినట్టుంది, ఆమె పూలజడ బుసగొడుతోంది. నాగసరం ఊది (నాలుగు మంచిమాటలు చెప్పి) కౌగిలి అనే బుట్టలో పెడితే ఇప్పటిదాకా వేపపువ్వులాగా చేదునొలికిస్తున్న ఆమె, పట్టుతేనెలాగా తీయగా మారిపోతుంది. [[ మొదటి మూడూ చూసి నాకు అభినవశ్రీనాథుడైన వేటూరి పూనాడు. ఐతే ఆఖరిది చూడగానే "ఐస్క్రీం లో ఆవకాయముక్కలాగా" అనిపించింది. ఎప్పుడైనా అలాగ ఉంటేనే కదా పద్యాలు కాస్త తమాషాగా ఉంటాయి :) ]]
సమస్య (దత్తపది):- త్రివిక్రముడు, విక్రమార్కుడు, మూడు, మూర్ఖుడు
ఇచ్చింది: శైలజ గారు
పూరణలు:-
(ఆటవెలది) భార్గవ ఉవాచ:-
సాహసాన యినుడి సరి విక్రమార్కుడౌ
గనుకయట్లు బలినియనగఁదగును
మూడడుగులనిచ్చె మూర్ఖుడై నామాట
వినక ఏలనోత్రివిక్రమునకు
భావం:-
(వామనావతారం ముగిసిన తరువాత శుక్రుడనుకుంటున్నాడు
విక్రమార్కుడు అంటే విక్రమంలో అర్కుడితో (సూర్యుడు) సమానమైనవాడు అని అర్థం కాబట్టి, ఆ పేరు బలికి సరిపోతుంది. అట్టి (నా శిష్యుడైన) బలి నా మాటలను వినకుండా, ఆ మూడు అడుగులను త్రివిక్రముడికి (వామనుడికి) ఎందుకు ఇచ్చాడు? అహో!
(తేటగీతి) సందీప ఉవాచ:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మంచి పేర్లు
కలిగి కూడ చెత్తగనుండు గదర మూడు!
ఇడియటనగమూర్ఖుడెయైన ఇంపుగుండు
వినగ మాటలు తోచు త్రివిక్రముండు
భావం:-
భద్ర, విక్రమార్కుడు, కృష్ణ - మూడూ మంచి పేర్లు ఉన్నా కూడా చెత్తగా ఉంటాయి. అదే మూర్ఖుడు అనే అర్థం ఉన్న ఇడియట్ చిత్రం మాత్రం చాలా బాగుంటుంది. అందులోని మాటలు వింటే నాకు త్రివిక్రముడు (త్రివిక్రం శ్రీనివస్) గుర్తుకొస్తాడు.
సమస్య (దత్తపది):- మనసు, మాట, మౌనం, మనువు
ఇచ్చింది:- శైలజ
పూరణ (కందం):-
మునుపుటి మాటలనడిగిన
మనసుకు మిగిలిన బదులది మౌనంబేనా?
చనువుగ పలుకుమ! యంటిని
మనికితమును చూపి నేను మనువడిగితినా?
భావం:-
ఇదివరకుటిలాగా మాట్లాడమని అడిగిన నా మనసుకు నువ్వు ఇచ్చే సమాధానం మౌనమేమా? చనువుగా మాట్లాడమన్నానే కానీ, నా మనసులోని బాధ తెలిపి పెళ్ళిచేసుకోమని అడిగానా?
సమస్య (వర్ణన):- పల్లవి గారు గీసిన ఈ చిత్రాన్ని వర్ణించాలి.
ఇచ్చింది:- బాబాయ్ (రవీంద్ర)
పూరణ:-
సీసం:-
సూర్యునికిరణాలు సోకి చంద్రునివోలె అద్దంబు మెరిసె నీ అందమునకు
జడబిళ్ళ తొడిగిన పొడవైన నీ వేణి మణియున్న ఫణివోలె మదికి తోచు
బొమవింట బాణమై పొడిచెను తిలకంబు, సంపంగిముక్కుపై సరఘ నత్తు
ఆడజన్మఁగొనిన సౌందర్యమా! నీదు సొగసుచూడతరమా? శోభనాంగి?
ఆటవెలది:-
కోటిసిరుల మోము కొలను చందమునుండ
కళలు చల్లు కనులు కలువలౌన?
రాజసాన మెలగ రాజహంసలెయౌన?
రూపసామ్యమునకు చేపలౌన?
భావం:-
సూర్యుడి కిరణాలు తగిలి చంద్రుడు ఏ విధంగా వెలుగుతాడో, అదే విధంగా నీ అందం తగిలి అద్దం కూడా మెరిసిపోతోంది. జడబిళ్ళ తగిలించిన నీ అందమైన జడ పడగపై మణి ఉన్న నాగుపామును గుర్తుచేస్తోంది. నీ రెండు కనుబొమలూ చూస్తే ఒక ధనుస్సులాగా ఆ మధ్యన ఉన్న తిలకం బాణం లాగా అనిపిస్తున్నాయి. నీ ముక్కు సంపెంగపువ్వులాగా ఉంటే, దానిపైన ముక్కెర తుమ్మెద లాగా ఉంది. సౌందర్యమ ఆడజన్మ ఎత్తితే అది నువ్వేనేమో? నీ సొగసు చూడతరమా?
ఎన్నో కళలున్న నీ ముఖం, కొలనైతే - మృదువుగా ఉన్న నీ కళ్ళు కలువలవుతాయా? రాజసంగా అటూ ఇటూ కులుకుతున్నందుకు రాజహంసలవుతాయా? లేక, చూడటానికి చేప ఆకారంలో ఉన్నాయి కాబట్టి చేపలవుతాయా? (చెప్పవూ?) [[ ఈ పద్యాలకు స్ఫూర్తిని ఇచ్చిన పల్లవి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. ఇంత అందంగా ఎవరైనా బొమ్మ గీస్తే కవిత్వం పొంగకుండా ఉంటుందా? ]]
5 comments:
సందీప్ గారూ,
ఎంత అందమైన పద్యాలండీ! ఎంత బాగా రాశారు! ఆ చిత్రం చూసి వచ్చాను.
ఆ చిత్రాన్ని మించిన అందం ఈ పద్యాల్లో ఉంది.
సీస పద్యంలో ఆ పోలికలు అద్భుతం. అందం వల్ల అద్దం మెరవడం, తిలకం భ్ర్రూధనువు యొక్క బాణం అనడం వాహ్...
కళ్ళకు ఉండే అన్నిపోలికలూ ఒకే ఆటవెలదిలో పెట్టి రక్తి కట్టించడం బహు సుందరం.
మొదటి దత్తపది, చివరి వర్ణన చాలా అందంగా ఉన్నాయండి! మందాకినిగారన్నట్టు, సీసంలోని పోలికలన్నీ అద్భుతంగా ఉన్నాయి!
@మందాకిని గారు, కామేశ్వరరావు గారు
పద్యకవిత్వానికి ఆదరణ తగ్గిపోతున్న ఈ రోజుల్లో మీ బోటివాళ్ళ మంచి మాటలే నాలాంటి వాళ్ళకు స్ఫూర్తినిస్తాయి. మీ మాటలకు నెనర్లు అండి.
Brilliant poem! aa seesa padyam chaala baagundi...
on a lighter note, nenu bhadra, krishn... vikramarkudu & krishna lo raviteja and brahmi action chaala baaguntundi :)
Post a Comment