"చలనచిత్రగీతాలలో పదభావపౌనఃపున్యము" అని ఈ టపకు నామకరణం చేద్దామని అనుకుని, చదివే ఆ ఇద్దరు-ముగ్గురు కూడా, "ఇదేదో గ్రాంధికం గోలలాగా ఉంది. light తీసుకుందాము.", అనుకుంటారని కొంచం మామూలు మాటల్లో టైటిల్-ప్రదానం చేశాను. ఇంతకీ విషయం ఏమిటి అంటే ఈ మధ్యన తెలుగుపాటలు వినీ వినీ, "ఈ నవసినీకవులకు ఇంక వేరే పదాలు/భావాలు దొరకవా? ఎంతసేపు ఇవే పట్టుకుని తిప్పితిప్పి వ్రాస్తూ ఉంటారు.", అని అనిపించింది. అందుకే సినిమాకవులకు ఉన్న ఊతపదాలు, ఉత్తిపదాలు, ఊదరగొట్టే పదాలు, ఊరిపోయిన పదాలు, రొటీనైపోయిన భావాలు, రోత పుట్టిస్తున్న, రోగాలు పట్టిన భావాలు ~ వీటి గురించి వ్రాద్దాము అని నిర్ణయించుకున్నాను.
తెలుగు వ్యాకరణం పుట్టినప్పటినుండి కవిత అంటే పద్యాలు అనే అర్థంగా ఉందేమో! నన్నయ్య పదకొండవ శతాబ్దం నుండి పద్యాలు వ్రాయటం మొదలుపెట్టాడు. ఆ తరువాత పదునాల్గవ శతాబ్దంలో పదకవితాపితామహుడు అన్నమయ్య కర్ణాటక సంగీతాన్ని ఆధారంగా కవిత్వాన్ని అల్లడం మనకు తెలుసును. ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. యతిప్రాసాదినియమాలతో రెండూ వ్రాసేవారికి ఒక పందిరి కట్టేవి. ఆ పందిరిపైన కవులు పదాలను తీగెలుగా చేసి కవితలను అల్లేవారు. ఒకచోట గణాలు ఉంటే, మరొక చోట రాగాలు ఉండేవి ~ రెండూ లయను (స్వరాలను) అందించడం కోసమే!
నేను తొమ్మిదో తరగతిలో ఉండగా, "ఊతపదాలు, వ్యర్థపదాలు" అనే ఒక పాఠ్యాంశాన్ని చదువుకున్నాను. అందులో, నన్నయ్య, తిక్కన, పోతన, వంటి మహాకవులు ఛందస్సు కోసం అక్కడక్కడా అనవసరమైన పదాలను పెట్టి కవితలు పూర్తిచేసేవారని, కొందరికైతే కొన్ని గణాలకు ready-made పదాలు ఉండేవి అని రచయిత చెప్పగా చదివాను. అది బహుశ: నిజమేనేమో! నాకూ పద్యాలు వ్రాయడంలో అనుభవం ఉంది కాబట్టి కొంతవరకు నేనూ గ్రహించగలను. ఇలాగ ఛందస్సు అనే గోడల మధ్యన వ్రాసే కవిత్వం యాంత్రికమైపోతోందని, కృష్ణశాస్త్రివంటి కవులు వీటిని ధిక్కరించి అప్పటికి సామాన్యమైన (గ్రాంధికం కాని) తెలుగులో భావకవితలను వ్రాయటం ప్రారంభించారు. అప్పట్లో ఛాందసులుగా పేరుబడిన పద్యకర్తలు కొందరు దీన్ని తీవ్రంగా ఖండించి భావకవిత్వానికి వ్యతిరేకంగా పుస్తకాలు కూడా ప్రచురించారు. ఐనప్పటికీ ప్రజాదరణ వలన భావకవిత్వానికి క్రమేపీ ప్రాచుర్యం లభించింది. ఈ పాటలను కొందరు దర్శకనిర్మాతలు స్వరకల్పన చేయించి తమ చిత్రాలలో వాడుకున్నారు కూడా! ప్రజలు భావకవిత్వాన్ని ఎంతగానో ఆదరించడంతో చలనచిత్రాలలో కూడా అవే మొదలయ్యాయి. చాలా రోజులపాటు మొదట కవి పాటవ్రాసి ఇస్తే అప్పుడు సంగీతదర్శకుడు దానికి బాణీ కట్టడం జరిగింది.
కొన్నాళ్ళకు ఇతరభాషల్లో హిట్టయిన పాటలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో భాగంగా మొదట బాణీ ఇచ్చి తరువాత దానిలో ఇమిడేట్టు పాటలు వ్రాయడం ప్రారంభించారు. "పద్యాలు/పదకవితలు వ్రాసేటప్పుడు గణవిభజన చేసి, స్వరనియమాలను పాటిస్తూ వ్రాయడం వలన, భావాస్వేఛ్ఛ కంటే భాషాబంధనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది", అన్న విషయం మళ్ళీ మొదలైనది. ఇప్పుడు అవే బంధనాలు ముందుగా అల్లిన బాణీలుగా అవతరించాయి. సంగీతదర్శకుడు ఏదో ఒక పాశ్చాత్యబాణీ తెచ్చుకొచ్చి ఇందులో నువ్వు పదాలను నింపవయ్యా అంటే అప్పుడు కవులు మాత్రం ఏం చేస్తారు? దొరికిన అరకొర పదాలే నరికి ఇరికించి బరికేస్తారు. ఇందులో కొంచం వాడుకలోలేని పదాలు వచ్చినా, "ఏమిటయ్యా ఇది? తెలుగు text-book అనుకుంటున్నావా? కాస్త మామూలు మనిషికి అర్థమయ్యేలాగా వ్రాయి", అని పాటకారులని ఇబ్బంది పెడుతున్నారు. సినిమాకథల్లో కొత్తదనం లేకపోవడంతో అటు భావాలకు, బాణీలనూ/so-called వాడుకభాషనూ సంకెళ్ళుగా తగిలించడంతో ఇటు భాషకు స్వేఛ్ఛ లేకుండా తయారయ్యింది. దీంతో దిక్కుతోచని కవులు, "మనసు, వయసు, తెలుసు, అలుసు, సొగసు", "చిలుక, అలక, మొలక", "చెలియ, సఖియ", "అలుపు, గెలుపు", "వలపు, తలపు", "భామ, ప్రేమ, ధీమ" వంటి ready-made పదసమూహాలను జేబులో పెట్టుకుని పాటలు వ్రాస్తున్నారు. అక్కడక్కడా అవసరం లేకపోయినా సరే "ఏ" తగిలిస్తూ ఉంటారు. ఉదాహరణకి: "నా మనసు నీది" అందామనుకున్నప్పుడు సంగీతదర్శకుడు "లా లలలా లాల" అని రావాలి అని అంటే అప్పుడు కవి "నా మనసే నీది" అంటున్నాడు. అంటే, "మనసు ఒక్కటే నీది, తనువు వేరేవాళ్ళది", అనా? లేక, "నా మనసొక్కటే నీది, వేరే వాళ్ళ మనసులపైన నీకు హక్కు లేదు", అనా? అది వ్రాసేవాడికి, OK చెప్పేవాడికి, పాడేవాడికి, వినేవాడికి, award ఇచ్చేవాడికీ కూడా అంతుపట్టని అనవసరమైన విషయం. ఒక్కసారి "నా హృదయం నీది" అంటే సరిపోతోందే అని, ఆగి ఎందుకు ఆలోచించరో నాకు అర్థం కాదు. అలాగే "మరి", "ఇంక", "ఇక", "అంట", "అట" వంటి పదాలు ఎక్కడ పడితే అక్కడ వడ్రంగి చెక్కముక్కలమధ్యలో ఖాళీని నింపడానికి మక్కు పెట్టినట్టు పెడుతున్నారు.
సిరివెన్నెల, వేటూరి, వెన్నెలకంటి, భువనచంద్ర లాంటి సీనియర్లను వదిలేస్తే తక్కినవాళ్ళు యతి గురించి అసలు ఎప్పుడో మరిచిపోయారు. ప్రాస కావాలి. ఉదాహరణకు "బన్ని, చున్ని, పిన్ని" వంటి పదాలను కలిపి ఒకాయన పాట వ్రాస్తే అది సూపర్~డూపర్~హిట్టయ్యింది. "వినేవాడిననాలి అసలు", అనిపించింది. దీనికి కొంతవరకు సినిమాహీరోలను అనాలి. మహాపండితుడు, సామవేదం షణ్ముఖశర్మగారు ఒక చక్కని పాటని "మేలుకొలుపు తొలిరాగం సూర్యోదయం", అని వ్రాస్తే ఆ కథానాయకుడు "మేలుకొలుపు అనేది సంస్కృతపదం. ఇది సామాన్యులకెలాగ అర్థమవుతుంది?", అని అడిగాడట. ఆయన దాన్ని "పల్లవించు తొలిరాగం సూర్యోదయం", అని మార్చాల్సివచ్చిందట. అప్పుడు ఆ హీరో, "పల్లవించు అనేది తెలుగుపదం. ఇది సామాన్యూలకందరికీ అర్థమవుతుంది", అని మెచ్చుకున్నాడట. అమెరికాలో చదివిన ఆ అబ్బాయికి మేలుకొలుపు అచ్చతెలుగుపదమని, పల్లవించు అనేది సంస్కృతం నుండి వచ్చిన పదమని తెలియనప్పుడు ఎందుకు నా పనిలో వేలు పెట్టాలి అని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపొయాడు ఆ మహానుభావుడు. ప్రస్తుతతెలుగుసినిమాకవులకు పూజ్యుడనిపించుకుంటున్న వేటూరి ఒకసారి ఇలాగ అన్నారు: "తెలుగు సినిమా పాట పాంచాలి లాంటిది. ఆమెకు ఐదుగురు భర్తలు. సంగీతదర్శకుడు, నిర్మాత, చిత్రదర్శకుడు, హీరో, వారి బంధువులు ~ తెలుగుసినిమాపాటకు భర్తలు". ఆ మధ్యన "ఏయ్ చికీతా కొమొస్తాస్" అనే పాట ఎందుకు అలగ వ్రాశారండి అని అడిగితే "హీరో వచ్చి, Spanish భాషలో దీని అర్థం 'ఏయ్ పిల్లా ఏట్ఠాగున్నావూ?' అని కాబట్టి అలాగ వచ్చేలా వ్రాయండి" అన్నాడని చెప్పారు ఆయన. ద్రౌపదికి అయితే పూర్వజన్మపుణ్యం వలన ఐదుగురుభర్తల ఉన్నా పాతివ్రత్యానికి ఏమీ భంగం కలగలేదు. ఇప్పుడు వచ్చే సినిమా పాటలను ద్రౌపదితో కాక వేరే రకం స్త్రీలతో పోల్చాల్సి వస్తోంది.
ఇన్ని కత్తుల మధ్యలో నడుస్తున్నా కూడా కవితకు న్యాయం చేసేవాళ్ళూ లేకపోలేదు. ఉదాహరణకు నేను వేటూరి పేరు చెప్తే ముక్కూ, చెవీ, నాలుకా ఇత్యాది శరీరభాగాలను కోసేసుకుంటాను కానీ, భాషకు, భావానికి సమతుల్యం చేకూర్చడంలో నేను సిరివెన్నెలకు వీరాభిమానిని. ఒకప్పుడు వేటూరి కూడా అలాగ వ్రాసేవారు. అయితే వృద్ధాప్యంవలనో ఏమో ఈ మధ్యన భాషకు అంత న్యాయం చేకూర్చట్లేదు అని నా అభిప్రాయం. నాకు పరిచయం ఉన్న ఔత్సాహికపాటకార్లు నన్ను తమ పాటలపై అభిప్రాయం అడిగినప్పుడు, "ఎందుకు ఇలాగ పదాలను ఇరికించావు?", అని అడిగితే, "ఇది మా చేతుల్లో లేదు. దర్శకనిర్మాతలు/సంగీతదర్శకుడూ దీన్ని ఇలాగ మార్చారు", అని చెప్తున్నారు. పాపం, వారినీ అనుకోవడానికి ఏమీ లేదు. "నువ్వు ఇలాగ నా పాటని మారిస్తే ఒప్పుకోను. నీకు కష్టమైతే పో", అని ధిక్కరించే స్థాయికి ఎదగాలంటే, "నేను నా ఇష్టమొచ్చినట్టు నీ పాటని మారుస్తాను. నీకు కష్టమైతే పో", అనే తుఘ్లక్లకు తలవొంచాల్సిందే. స్వయంగా నాకు పాటలు వ్రాయాలని ఉన్నా, నేను సినిమా ప్రపంచం జోలికి పోనిది అందుకే. తరాలు మారినా నాకు పోతన తత్వం నచ్చింది. "బాలరసాలనవపల్లవకోమలకావ్యకన్యకం" అని ఆయన సంస్కృతపదాలతో ఆఛ్ఛేదించి చెప్పినది: "నేను ప్రేమతో కన్న నా కవితలను రాజులకిచ్చి ఆ పడుపుకూడు తినడం కంటే రైతుగా మిగిలిపోవడం మంచిది", అని. "ఈనాటి సినిమాకవిత్వం broiler-chicken లాంటిది. పెంచుకునేది ప్రేమతో కాదు, ఆశతో", అని ఒకాయన చెప్పాడు. నిజమేనేమో అనిపిస్తుంది.
నింద మొత్తం సినిమావాళ్ళమీదా, కవులమీదా వేసేస్తామా? లేదండీ. ప్రేక్షకులను కూడా తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం ఉంది. పాటలు విని ఊరుకున్నా ఫరవాలేదు కానీ, అవి పిల్లలకు మప్పి మరీ stage మీద పాడిస్తున్న మహామహిమాన్వితమాతృమూర్తులను, పిచ్చిపిచ్చిడాన్సులకు రెచ్చిపోయి చప్పట్లు కొడుతున్న ఆదర్శపితృమూర్తులను కూడా అనాలి కదా? అసలు కోడినంటూ తినేవాడు ఉంటేనే కదా, వాటిని ఎవడైనా వాటిని పెంచేది?
దినదినమూ దుర్దశకు దగ్గరవుతున్న ఈ తెలుగు సినిమా పాటలను ఎవరూ రక్షించలేరు అనిపిస్తోంది. కానీ, ఒకప్పుడు ఇదే పరిస్థితిలో "ప్యార్ హో రహా హై, చేయ్న్ ఖో రహా హై, నీంద్ జా రహా హై", వంటి ప్రయోగాలను తిప్పితిప్పి వాడుకున్న హిందీ చిత్రాలు గుల్జర్, జావేద్ అఖ్తర్ పుణ్యమా అని ఇప్పుడు కొంచం కొత్తదనాన్ని అందుకున్నాయి. అలాగే ప్రాచుర్యం వచ్చిన నూతనతెలుగుసినిమాకవులలో కూడా ఎవరైనా కాస్త "వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేల్తలపెట్టవోయ్", అనుకుంటే ఇది తెలుగులో కూడా సంభవిస్తుంది అనే ఆశ ఉంది. ఒకప్పుడు అరిటిపండు ఒలిచి పెడితేనే తినే తెలుగుపాటలశ్రోతకు వేటూరి "పురుషుల్లోన పుంగవా" వంటి ప్రయోగాలను రచించడమే కాకుండా రుచింపజేశాడు! ఆయన అన్నట్టు "వెయ్ వెయ్ పునరపి బంధనం", అని ఎవరైనా తెలుగుపాటకారకుడు పూనుకోకపోతాడా అన్నదే నా ఆశ.
(ఈ వ్యాసంలో కనీసం ఒక డజను దుష్టసమాసాలు ఉన్నాయి. వాటిని "వాడుక భాషలో వ్రాద్దామనే" ప్రయత్నానికి పుట్టిన అక్రమసంతానంగా భావించి విడిచిపెట్టాల్సిందిగా నా మనవి.)