Sunday, February 28, 2010

లీడర్ సినిమా చూశాను

శేఖర్ సినిమాల్లోకల్లా అత్యద్భుతమైన చిత్రం. ఈ సినిమాలో ప్రతీ క్యారక్టరూ చక్కగా ఉంది (ఒక్క ప్రియా ఆనంద్ తప్ప). కోట శ్రీనివాసరావు తప్పితే మరెవరూ ఆ రోల్ చెయ్యలేరు అని నా నమ్మకం. కోట ఒక లెజెండ్. ఎలాంటి రోల్ ఇచ్చినా చేయగల దిట్ట. ఇడియట్లో ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఏడిపిస్తే, ఆ నలుగురు చిత్రంలో పైకి రాయిలాగా కనబడి లోన ప్రేమను నింపుకున్న రాజుగా ఏడిపించాడు, అహ నా పెళ్ళంట, శత్రువు వంటి చిత్రాలలో అసహ్యం కలిపిస్తూనే నవ్వించాడు. అసమాన్యుడు! యే యాస అయినా చక్కగా పలికించగలిగిన దిట్టలు తణికెళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు! అలాగే హర్షవర్ధన్ నటన నిజాయితీగా ఉంది. సుహాసిని తల్లిపాత్రలు ధరించడం మొదలుపెట్టిన తరువాత మొదటిసారి నా నోట "శభాష్" అనిపించింది. గొల్లపూడి మారుతీరావు తన రోల్ కి న్యాయం చేసి "లీడర్షిప్ తెలియక దొంగనాయకులు కారు. దానిని అమలుచెయ్యలేక అవుతారు" అన్న సందేశానిని చెప్పాడు. రీచా గంగోపాధ్యాయ రోల్కి ఎంతో మచూరిటీని, ఎంతో ప్రాముఖ్యతనూ ఇచ్చి మరొక్కసారి "శేఖర్ సినిమాల్లో ఆడవాళ్ళు పైనొక రుమాలు, కిందొక రుమాలు వేసుకుని డాన్సులు చెయ్యడానికి రారు. వాళ్ళకూ ఒక వ్యక్తిత్వం, పరిపక్వతా ఉంటాయి", అని ఋజువు చేశాడు శేఖర్. సుబ్బరాజు మొహం చూస్తేనే ద్వేషించాలి అనిపించేలాగా తన రోల్ కు న్యాయం చేశాడు. ఆహుతి ప్రసాద్ తనకు అలవాటైన పాత్రకు యథావిధిగా న్యాయం చేశాడు. ఇక్కడ చెప్పుకోవాలసిన వాళ్ళల్లో కూతురు చనిపోయి బాధపడుతున్న తాత ఒకడు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాడు. ఇవన్నీ ఒక యెత్తు ఐతే, హీరోగా రానా జీవించాడు. నిజాయతీ ఉన్న పాత్రకు న్యాయం చేశాడు. తెలుగు ఉచ్చరించడంలో ఐతేనేమి, తన ముఖకవళికల్లో ఐతేనేమి ఈ మధ్యన వచ్చిన హీరోలకు గట్టి పోటీ ఇస్తాను అని ఈ చిత్రంతో దండోరా వేశాడు. కెమేరా వర్క్ అయితేనేమి, సంగీతమైతేనేమి, సాహిత్యమైతేనేమి, ఆర్ట్ వర్క్ అయితేమీ అన్నిటిలోనూ నిజాయితీ కనబడింది. అద్భుతమైన సినిమా!

భగవద్గీత చదివి, మనిషి గుండె రాయిలాగా ఉండాలి, స్థితప్రఙత కావాలి అనుకునే నాకు ఎంత ప్రయత్నించినా కళ్ళల్లో నీళ్ళు ఆగని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో, రక్తసంబంధంలేనివాటిల్లో: టంగుటూరి సూర్యకుమారి పాడిన "మా తెలుగు తల్లికి" పాట, పోతన చెప్పిన "మందారమకరందమాధుర్యమున దేలు" పద్యం వొకటీ. వీటిని ఆధునీకరించడం అంటే కత్తి మీద సామే! నా లాంటి ఛాందసుణ్ణి మెప్పించడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అయినా కూడా సంగీతదర్శకుడు అసలుపాటను వింటే కలిగే భావోద్వేగాన్ని తొలగనీయకుండా చక్కగా మలచాడు!

ఇదే తరహాలో వచ్చిన "ఒకే ఒక్కడు", "శివాజీ", "భారతీయుడు", "ఠాగూర్" సినిమాలకూ ఈ సినిమాకూ ఉన్న భేదం ఏమిటి అంటే, ఇందులో ఒక వ్యక్తి ఒక శక్తిగా మారడాన్ని కంటే మారినతరువాత ఆ శక్తి దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఏం చెయ్యాలో చూపించాడు శేఖర్! సినిమాలో మాటలు చక్కగా ఉన్నాయి. మనసు కదిలించే విధంగా ఉన్నాయి. రచయిత శేఖర్కే మొత్తం ఘనత దక్కాలి. ఆయన చెప్పినట్టు ఈ సినిమా చూసి భరతమాత కచ్చితంగా సంతోషిస్తుంది.

నా వరకు నాకు నచ్చిన పాత్ర సుహాసినిది. ప్రతీ తల్లీ తన బిడ్డలను ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు తీర్చిదిద్దుతుంది. హీరో అందరు రాజకీయనాయకుల్లాగా పదవికోసం తప్పును చేస్తుంటే ఒక్క మాటతో తన పద్ధతి మార్చి అందరు రాజకీయవేత్తలలాగా మారకుండా ఆపింది. నాకు సినిమాలో మొదటి భాగం కంటే రెండో భాగం నచ్చడానికి ప్రత్యేకమైన కారణం ఇదే! భేష్ శేఖర్ - నువ్వు ఇంకా మంచి చిత్రాలు చేసి ప్రజల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని ఈ faction, action, over-action, routine love/comedy తరహా చిత్రాలను పట్టించుకోని విధంగా ప్రేక్షకులను మలచాలి!

PS: Sekhar is not from my caste! But, I still believe that he's the most honest director in today's Telugu film industry! A lot of my 'acquaintances' still consider caste while 'choosing' their favorite actor, director and disgustingly while exercising their vote! I don't expect people to marry out of caste to eradicate the caste system. Each one has one's own customs. It's fine if you want to live with people who believe in them. But at least when you choose your representative, please don't let caste and religion blind you and there by, hinder the progress of a nation. It's a shame that there are people who have done masters, but praise factionists, corrupts and criminals, for the sake of caste! I hope that there will be a day when people realize that none of these politicians got us freedom from the British. And that those who brought, were not racists.

Saturday, February 27, 2010

వేటూరి - స్టువర్టుపురం పోలీస్ స్టేషన్



ఈ సినిమా పేరు చెప్పగానే box-office దగ్గర బద్దలైపోయిన విషయం గుర్తుకు వస్తుంది. ఈ సినిమాతో director గా మారదామనుకున్న యండమూరి వీరేంద్రనాథ్ ఆశలకు చుక్కెదురైంది. ఐతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం: వేటూరీ, యండమూరి - ఇద్దరూ సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్ళే కాకుండా ముదుర్లు కూడాను. మరి వీరిద్దరూ కలిస్తే ఆ పాటల్లో ఎంత ముదురు-సాహిత్యం ఉంటుందో ఊహించవచ్చు. ఐతే ఒప్పుకుతీరాల్సినది ఏమిటంటే ఎంత ముదురు-సాహిత్యం ఉందో అంత ముతక-సాహిత్యం కూడా ఉంది. ఎందుకో మరి! ఈ సినిమాలో నాకు నచ్చిన ప్రయోగాలన్నీ ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలకూ సంగీతదర్శకుడు ఇళయరాజ, పాటకారి వేటూరి! (సాహిత్యం అనే పదాన్ని దుర్వినియోగం చెయ్యడం ఇష్టం లేక - పాటకారి అంటున్నాను, దుష్టసమాసం ఐనా కూడా)

పాట: చీకటంటి చిన్నదాని (మనో, జానకి)

చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం, చీర దాచలేని సోకు నాకు సంబరం!
అక్కడ యండమూరి action అనగానే చిరంజీవి కంటే ముందు మన వేటూరి ready అయిపోయాడు. చిన్నదాని సిగ్గును చీకటితో పోల్చి (చీకటీ, సిగ్గూ రెండూ ఉన్న విషయాన్ని దాస్తాయి కదా), ఆమె సోకును చీర ఆపలేకపోతుంటే అది తనకు సంబరంగా ఉంది అని వేటూరి ఉవాచ! మహాచిలిపి :)

కాలమంత కత్తిరిస్తె కాస్త యవ్వనం రెండు కళ్ళ కత్తిరేస్తె రేయి ఈ దినం!
హీరోయిన్ ఏమైనా తక్కువ తిందా? "మొత్తం జీవితంలో ఉండేదే కాస్త యవ్వనం. ఆ సమయంలో రెండు కళ్ళూ కత్తెరకు ఉండే రెండు వాసాలకు మల్లే మూసి తెరువగానే పొద్దున్నంతా అయిపోయి రాత్రి వచ్చేస్తోంది. అసలు మనకు సమయమే తక్కువ ఉంది", అని ఎంతో భావుకతతో చెప్పింది. ఈ ప్రయోగం నాకు జీవితాంతం గుర్తుకుండిపోయేది! ఒక రివాజు పాటలో ఏ కవి ఐనా ఎంతకని ప్రయోగాలను చెయ్యగలడు? వేటూరి ఎంత సామాన్యమైన పాట వ్రాసినా ఒక్క చోట తన సంతకం పెట్టందే ఒదలడు! బహుశః చదువర్లు "జయం మనదేరా" అనే సినిమాలో "happy గా" అనే పాటలో "ఓ కావ్యనాయకీ, cameraతో కన్ను కొట్టనీ, కేరింతల పన్ను కట్టనీ" అనే ప్రయోగం గుర్తుచేసుకుని ఉంటారు! camera shutter మూసుకుని తెరిచుకునే వైనాన్ని కన్నుకొట్టడంతో పోల్చడం నాకైతే విపరీతంగా నచ్చింది. చూసే కనుల్లో భావుకత ఉండాలండీ ఇలాంటి ప్రయోగాలు చెయ్యాలంటే!

నరాలవీణ మీటితే స్వరాలు లేని పాటలు
అబ్బా! ఏమి భావుకత? ఇది బూతుగా కొందరికి గోచరించచ్చును. నేనూ ఒప్పుకుంటాను ఇది బూతేనని. కానీ ఇలాగ ఆలోచించగలగడం కూడా గొప్పే అంటాను. ఇందులో వేటూరి అస్లీలంగా ఏమీ వ్రాయలేదు. కేవలం రసికులకు, రసఙులకు మాత్రమే అర్థమయ్యే విధంగా శృంగారాన్ని వర్ణించాడు అనిపిస్తోంది.

సరాగమాడు సందెలో పరాగమాడు తోటలు
పరాగము అంటే పుప్పొడి. తోటలు పరాగమాడటం అంటే అది పువ్వులు పరవశించి తుమ్మెదలను ఆహ్వానించడానికి సంకేతం. జరుగుతున్న రాసలీలను ఎంతో భావుకతతో రెండు ముక్కలలో వర్ణించాడు! ఇది వేటూరికే సాధ్యం!

సగాలు ఒక్కటై ఇలా బిగించుకున్న ప్రేమలు
వరించుకున్న చోటనే ధ్వనించు ప్రేమగంటలు!
దాయలేని భావమో, మోయలేని మోహమో, తోడు లేక తోచదాయెనే ఎందుకో!
ప్రేమికుడు, ప్రేయసి చెరుకో సగం! వాళ్ళు జంటకలిసి ఒక్కటైన చోటనే ప్రేమ-గంటలు ధ్వనిస్తాయి అని శృంగారంలోని ప్రేమభావాన్ని కూడా స్పృశించాడు. 

షిఫానుచీరకొంగుతో తుఫాను రేపు భామలూ
పిపీలికాదిబ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు!
వేటూరిలో ఉన్న చిలిపిదనం, కొంటెదనం ఇక్కడ ప్రస్ఫుటమవుతాయి. అమ్మాయి తన షిఫానుచీరకొంగుతోనే అబ్బాయి గుండెల్లో తుఫాను రేపుతుందిట! అందుచేతనే చీమ మొదులుకొని బ్రహ్మ దాకా అన్ని మగవస్తువుల్లోనూ దాహం పెరిగిపోతోందిట. అయ్యబాబోఇ, వేటూరి నీ ప్రయోగాలు మరెవ్వరూ చెయ్యలేరయ్యా బాబూ! ఇక్కడ లయకు న్యాయం చేస్తూ: "షిఫాను", "తుఫాను" అని ప్రాస కలిపి అలాగే "పిపీలిక", "పిపాస" అని మరొక ప్రాస కలిపాడు. ఎక్కడనుండి వస్తాయయ్యా నీకు ఇలాంటి కొంటె ఆలోచనలు?

ఈ పాటకు వేటురితో పాటు ఇళయరాజాను పొగడాలి. ఎంత చక్కని melody! అలాగే ఈ సినిమాలో నాకు నచ్చిన మరికొన్ని ప్రయోగాలు:

పాట: భలేగ ఉందిరా
"ఇదేమి ముద్దురా? పడింది ముద్దరా! చెడింది నిద్దరా!"
"అందాల ఆరడీ, అయ్యాక నా రెడీ"
"అమ్మాయి తీగెతో సన్నాయి నొక్కుతో సంగీత-నవ్వులే రావాలి"
"శ్రీకాముడీ గుడి, సిందూర పాపిడి. పట్టిందిలే రతి, ప్రాయాల హారతీ"

పాట: నీతోనే ఢంకాపలాసు
"నువ్వే నా కళావరాసు"
"నువ్వే నా రంభావిలాసు"
"మడిగా ఉన్నది వయసు, అడిగా ఇమ్మని మనసు!"
"క్రీగంటి greeting ఇచ్చేస్తా, చెలి చకోరికా ఛలో ఇక, కొంగొత్త coating ఇచ్చేస్తా"
"శ్రీరస్తూ సిగ్గే చిందిస్తా, యావత్తూ నీకే అందిస్తా"

శృంగారానికి, అశ్లీలతకూ చాలా తేడా ఉంది. ఈ మధ్యనే ఒక interview లో వేటూరి: "మీ నాన్న ఉన్నాడా?", "మీ అమ్మ మొగుడున్నాడా?" - ఈ రెంటి మధ్యనా ఉన్న భేదమే శృంగారానికీ, అశ్లీలతకీ మధ్యలో ఉంది అని చెప్పారు. ఇంత చక్కగా విడమర్చి చెప్పగల మహానుభావుడు, ఈ క్రింది ప్రయోగాలు ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి!

"ఫలాన చోట అంటుకోనా? ఫలాల తోట అందుకోనా?"
"వయ్యారి వంటికి వత్తిడంత ఇష్టమా?"


కొంతమంది సిరివెన్నెల అసలు చిలిపి ప్రయోగాలే చెయ్యరు అనుకుంటారు. ఈ "వయ్యారి వంటికి వత్తిడంత ఇష్టమా" అన్న ప్రయోగానికి అటూఇటూగా ఉండే ప్రయోగం సిరివెన్నెల "అతడు" సినిమాలో చేశారు: "సొంతసొగసు బరువేల సుకుమారికీ" అని ఇంకొంచం neat గా చేశారు.

Friday, February 19, 2010

టీవీ420 లో బాలకోకిల




[
* ఈ చిట్టికథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితాలే.
* అక్కడక్కడ ట బదులు త, స బదులు చ type చేశాను. ఇది అనుకుని చేసినదే కానీ, typo కాదు. చిన్నపిల్లలు  ముద్దుముద్దుగా మాట్లాడటాన్ని అలాగ వ్రాశాను.
* ఇది ప్రస్తుతం తెలుగుచిత్రాలలో సాహిత్యం మీద ఒక satire. ఇందుకు lyricists, heroes, directors, audience లో ఎవరో ఒకరిది తప్పు అని నేను అనట్లేదు. ఐతే, ఈ పాటలవలన పిల్లలు ఎలాగ తయారవుతున్నారో చెప్పే ప్రయత్నం మాత్రమే!
* ఇందులో ఏ ఒక్క హీరోనో, lyricistనో, anchorనో కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. అందరినీ కలిపే ప్రశ్నించాలనే ప్రయత్నం తప్పితే!
* మీ మనసు నొప్పించేట్టు ఎక్కడైనా వ్రాసుంటే నన్ను క్షమించండి. నా ఉద్దేశం అది కాదు. దయచేసి మీరు మీకు బాధ కలిగించిన విషయం చెప్తే నేను సరిచేసే ప్రయత్నం చేస్తాను.
* రుగ్మత్ అంటే రోగం, మిషా అంటే నెపం!
]

Anchor: Welcome to the best singing competition on TV -  బాలకోకిల. ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులలో ఉన్న talentని  TVకి ఎక్కిస్తున్నాము. ఈవేళ్టి episodeలొ ఆరు సంవత్సరాలలోపు బాలబాలికల చేత ఒక వినూత్నమైన ఆట ఆడించి, వారి చేత పాడించబోతున్నాము. ఈ కార్యక్రమానికి judge గా వస్తున్నారు ముగ్గురు ప్రఖ్యాతి గాంచిన lyricists - వే-టూ-రా,  ఇంద్రబోసు, పొట్టిబట్ల, బూతుమందిర! వీళ్ళందరూ సార్థకనామధేయులై మన తెలుగుపాటను వాళ్ళ భుజాలపై నడిపిస్తున్నారు అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

ఈ కార్యక్రమంలో పాడటానికి screening దాటి వచ్చినవారు: బేబీ నటాష, బేబీ మిష, మాష్టర్ రుగ్మత్, మాష్టర్ ఆర్కుట్. ముందుగా ఆ చిరంజీవుల parentsతో పరిచయాలు. మీరు మీ పిల్లల పేర్లకు అర్థాలు, ఆ పేర్లు ఎందుకు పెట్టారో చెప్పండి.

నటాష తల్లి: నాకు cinema heroine కావాలని ఆశ ఉండేది అండి. అది ఎలాగూ కుదరలేదు అని, "నటించాలనే ఆశ"కు చిహ్నంగా మా అమ్మాయికి నటాషా అని పేరు పెట్టాను.
మిష తండ్రి: నాకు నిష అనే పేరు పెడదామనిపించింది. కానీ, numerologist mతో start అయ్యే పేరు పెట్టమంటే, మిష అని పెట్టాను. దానికి అర్థమేమైనా ఉందేమో నాకు తెలియదు.
రుగ్మత్ తల్లి: మా తాతగారు ఆయుర్వేదంలో ఏవో శ్లోకాలు చదువుతుంటే రుగ్మత్ అనే పదం వినిపించి నచ్చి పెట్టుకున్నాను. అది ఏదో మూలిక పేరు అయ్యి ఉండచ్చును.
ఆర్కుట్ తండ్రి: నేను, మా ఆవిడ orkut లో కలుసుకున్నాము. మా ప్రేమకు సాయపడిన ఆరొకుత్ కి చిహ్నంగా వాడికి ఆ పేరు పెట్టాము.

చాలా బాగున్నాయి అండి పిల్లల పేర్లు. నాకు బాగా నచ్చాయి. మా అమ్మ, నాన్న నాకు ఇంత creative పేరు పెట్టలేదని బాధగా ఉంది. ఓ, ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా - ఉదయసుమ - అంటే పొద్దున్నే పూసే పువ్వు.

ఇప్పుడు gameలోకి enter అవుదాము. ఇక్కడ డబ్బాలో బోళ్డు చీటీలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక చీటి తీసి, అందులో ఏ అక్షరం ఉంటే ఆ అక్షరంతో పాట పాడాలి. దానికి మా judges feedback ఇస్తారు. We will be back right after a break..

[break తరువాత]

మొదటగా నటాషా వెళ్ళి ఒక చీటీ తీసింది. అది తీసి తిన్నగా వెళ్ళి ఉదయసుమ చేతుల్లో పెట్టింది. 
ఉదయసుమ: అదేంటమ్మా ఏ letter ఉంది?
నటాష: నాకు తెలుగు చదవడం రాదు aunty. అందులో ఏముందో చెప్తే అప్పుడు పాట పాడతాను
ఉదయసుమ: [ఖంగు తిని ఆ చీటి తెరిచి] "అ" తో పాట పాడాలి నటాష!
నటాష: "అ అంతే అంలాపురం, ఆ అంతే ఆహాపురం ... పాలకొల్లు చేరినప్పుడే పిల్లడో పైతజారుదెక్కువాయెరో.."
ఉదయసుమ: Mind-blowing, amazing నటాష. చాలా చక్కనైన పాట పాడావు. ఇప్పుడు ఈ పాట గురించి judge ఇంద్రబోసు గారు ఏమంటారో చూద్దాము.
ఇంద్రబోసు: ఈ పాట మన తెలుగుజాతి గర్వించదగినది. వేటూరి గారు ఈ పాటని పలకగా చేసి మనకు మళ్ళీ కొత్తగా అ,ఆ,ఇ,ఈ లు నేర్పించారు. ఒక్కోసారి నాకు inspiration తక్కువయ్యింది అనిపిస్తే ఈ పాట వింటుంటాను. చక్కని పాటను ఎంచుకున్నావమ్మా! ఐతే, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వడం నా ధర్మం కాబట్టి చెప్తున్నాను - నువ్వు ఉచ్చారణ విషయంలో కృషి చెయ్యాలి. "అంటే" ని "అంతే" అని, "పైటజారుడు" అనే గొప్ప ప్రయోగాన్ని "పైతజారుదు" అని తప్పుగా పలికావు.
[అనగానే ఒక్కసారి screen freeze అయ్యి నటాష మొహం, judge మొహం, నటాష తల్లి మొహం మార్చి మార్చి కనిపిస్తాయి. background లో serial-killer కి మరణశిక్షవేసేటప్పుడు మ్రోగే బాజా ఒకటి మ్రోగుతుంది. ఆ తరువాత commercial break.] 

[break తరువాత]

ఇంద్రబోసు: ఐనా సరే, నీకు నేను పదికి తొమ్మిది మార్కులు వేస్తున్నాను.
ఉదయసుమ: Excellent నటాష! ఇప్పుడు మన తరువాత contestant ఆర్కుట్.
ఆర్కుట్: [చీటి తీసి చదివాడు] "బు".
ఉదయసుమ: అదేంటమ్మ మేము "ఉ" తో ముగిసే letters వ్రాయలేదే [అని చీటి తీసి చూసింది]. ఇది "బు" కాదమ్మ, "ఋతువు"లో "ఋ".
ఆర్కుట్: aunty, నాకు ఋ తో పాటలు రావాంటీ [అని ఏడవటం మొదలుపెట్టాడు]
ఉదయసుమ: ఐతే నీకు zero marks వస్తాయి.
[అనగానే మళ్ళీ screen freeze అయ్యి, judges, anchor, participant, audience మొహాలు మార్చి మార్చి చూపిస్తూ background లో నెమ్మదిగా డప్పులు మ్రోగుతాయి]
వే-టూ-రా: అమ్మా, పెద్దవాడిని, నేను చెప్తున్నాను ధర్మం. వేలకు వేలు పాటలు వ్రాసినవాడిని నాకే ఋ-తో పాటలు రావు. ఈ చిరంజీవికి ఏం వస్తుంది. నాయనా, నీ పేరు "ఆ" తో మొదలవుతుంది కాబట్టి ఆ అక్షరంతో పాడు!
ఆర్కుట్: [single ఇడ్లీకి రెండో సారి చట్నీ వేస్తే వెలిగిపోయినట్లు మొహం వెలిగిపోతూండగా] thank you, grandpa. "ఆకలేస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దుల్పెడతా కుర్రోడా ... wife అన్నమాట మా వంశంలో లేదు...."
ఉదయసుమ: చక్కని పాటను ఎంచుకున్నావు ఆర్కుట్! మరి judge వే-టూ-రా గారు ఏమనుకుంటున్నారో విందాము. అంతకు ముందు ఒక చిన్న commerical break.

[break తరువాత]

వే-టూ-రా: బాబూ, ఈ వయస్సులో కూడా నాకు లేచి dance చెయ్యాలనిపించే పాట పాడావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐతే, ఇలాంటి పాటలు out-going ఆడపిల్లలు పెళ్ళిచూపుల్లో పాడాలే కానీ, మగవాళ్ళు పాడకూడదు. అందుకు నీకు ఒక మార్కు తగ్గించి తొమ్మిది వేస్తున్నాను. 
ఉదయసుమ: ఇప్పుడు మన తరువాతి contestant మిషా.
మిషా: [వెళ్ళి ఒక చీటి తీసి] చ
ఉదయసుమ: "చ" అంటున్నావు, ఆ అక్షరంతో నీకు పాట రాదా?
మిషా: కాదు సుమ, చ-తో పాత పాడాలి. [అని ముద్దుముద్దుగా అని, మొదలెట్టింది] "చలిగా ఉందన్నాడే చల్లాకీ బుల్లోడు దుప్పట్లో దూరాడే మొగలాయీ మొనగాడు ... నైటంతా కితకితలే పెట్టాడు".
ఉదయసుమ: నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ పాట వచ్చినప్పటికి మిషా పుట్టి కూడా ఉండదు. మరి ఈ పాట ఎలాగ నేర్చుకుందో తెలుసుకోవాలి అనుకుంటే let's meet after the break.

[break తరువాత]

మిషా: మా mummy బాలకృష్ణ fan. నేను పుట్టకముందు బాలకృష్ణకు ఒక hit movie ఉందని, అందులోని పాట నా చేత stage మీద పాడించాలని mummy కోరిక.
[ అనగానే screen freeze అయ్యి, lights dim అయ్యి, focus మిషా తల్లి మీదకు వెళ్తుంది. ఆమెకళ్ళల్లో పుత్రికోత్సాహం ఆనందబాష్పాలుగా జారతాయి.]
ఉదయసుమ: బాలకృష్ణ చేసినన్ని variety movies తెలుగు industryలో ఎవరూ చెయ్యలేదు అన్నది జగమెరిగిన సత్యం. ఆదిత్య-369, భైరవద్వీపం, నరసిమ్హనాయుడు లాంటి వైవిధ్యమైన movies చేసిన బాలకృష్ణగారి పాట ఎంచుకోవడం అబినందనీయం!
పొట్టిబట్ల: మీ mummy కి బాలకృష్ణపై ఉన్న అభిమానానికి నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఈ పాట వ్రాసిన భువనచంద్రగారు నాకు మంచి స్నేహితులు. చక్కనైన తెలుగుపాటలు వ్రాయాలన్న ఆయన కోరిక ఇందులో కనబడుతుంది. "చల్లాకీ, దుప్పటి, మొగలాయీ" లాంటి పదాలు వాడటమే అందుకు సాక్ష్యం. ఈ పాటకు నీకు పది మార్కులు వేస్తున్నాను.
మిషా: [ఏడవటం మొదలుపెట్టి] uncle నాకు మరీ తక్కువ వేచారు. నాకు ఎనిమిది ఇవ్వి.
ఉదయసుమ: అదేంటమ్మ, నీకు 10 marks వేశారు కదా?
మిషా: ఓ, పది అంటే ten ఆ? నేను ఇంకా seven అనుకున్నాను. thank you uncle.
ఉదయసుమ: next మనకు తన తీయనైన పాటని వినిపించడానికి వస్తున్నాడు రుగ్మత్!
రుగ్మత్: [చీటి తీసి] నాకు "క్ష" తో పాట రాదు aunty
ఉదయసుమ: ఓ, మళ్ళీ ఇలాంటి క్లిష్టమైన అక్షరం వచ్చింది. మరి judge బూతుమందిర గారు ఏమంటారో చూద్దాము!
బూతుమందిర: వే-టూ-రా గారే మనందరికీ పూజ్యులు, ఆయన చెప్పినట్టు పేరు మొదలయ్యే అక్షరంతో పాట పాడితే సరిపోతుంది.
ఉదయసుమ: రుగ్మత్ "ర" తో ఏమి పాట పాడతాడో తెలుసుకోవాలి అంటే break తరువాత కలుసుకుందాము!

[break తరువాత]

రుగ్మత్: ఐతే నేను పాడతాను uncle. "రేయ్ నీయబ్బ, సాలే KD"
ఉదయసుమ: బాబూ, ఎందుకు తిడుతున్నావు? ఎవర్ని తిడుతున్నావు? "ర"తో పాట రాకపోతే వేరే అక్షరం ఇస్తాము.
రుగ్మత్: నేను తిత్తత్లేదు ఆంతీ. ఇది బాలకృష్ణ uncle act చేసిన ఒక్కమగాడు cinemaలోని పాట. మిషాకి బాలకృష్ణ పాట పాడితే 10 marks వచ్చాయి అని నేనూ ఆ uncle పాటే పాడాను!
బూతుమందిర: ఈ పిల్లాడి సమయస్ఫూర్తి అభినందనీయం! ఇతన్ని ప్రోత్సహిస్తే రేపటి ఎస్పీబీ అవుతాడు! రుగ్మత్, నీకు నేను పదికి పదకొండు మార్కులు వేస్తున్నాను.
వే-టూ-రా: అసంభవం. అలాగ ఎలాగ వేస్తారు? మీరు పక్షపాతబుద్ధి ప్రదర్సిస్తున్నారు.
[అనగానే screen dim అయ్యి, camera మార్చి మార్చి judges మొహాలు చూపిస్తుంది.]
బూతుమందిర: అయ్యా, మన తెలుగుసినిమాల్లో హీరోలు మీసాలు మెలివేస్తేనో, తొడలు కొడితేనో, pen విసిరితేనో విలన్లు గింజుకుగింజుకు చచ్చిపోతుంటారు. అలాంటి చిత్రాలకు పాటలు వ్రాసే మనకు "అసంభవం" ఏముంటుంది చెప్పండి. మీరు పెద్దమనసుతో ఒప్పుకోవాలి.
వే-టూ-రా: ఈసారికి క్షమిస్తున్నాను. కానియ్యండి.

[దెబ్బకు, audience అంతా చప్పట్లు కొడతారు. ఇది జీర్ణించుకోలేని మిగతా contestants ఏడవటం, వాళ్ళ parents వచ్చి ఓదార్చడం జరుగుతుంది. titles scroll అవుతాయి. ఇంతలో విజేత రుగ్మత్ stage మీదకు వచ్చి, "అమ్మా లేదు నాన్నా లేడు ..ఏక్ నిరంజన్" అనే గీతం పాడతాడు. అయ్యాక...]

ఉదయసుమ: నిజంగా అమ్మా, నాన్నా లేని వాడిలాగానే కాకుండా, ఉట్టి బేవార్స్ లాగా పాడావు నాయినా! నీకు మంచి భవిష్యత్తు ఉంది. Industry needs people like you! ఈ episode చూసి సంతోషించిన audienceని మళ్ళీ వచ్చే వారం episode లో మరికొందరు కొత్త contestantsతో కలుసుకుంటాము. Until then, bye bye!.

Saturday, February 13, 2010

శివరాత్రి సందర్భంగా!

ఓం నమ:శివాయ!

చం:-
శివుడని తల్చినంత మది శీతనగంబుగ మారుచుండగన్
కవనము పొంగుబట్టె సురకర్షువు పారెడి రీతి జిహ్వపై
సవనవిరోధి, తెల్పు! గతజన్మములో తపమేమి చేసితిన్
కవితలఁ గూర్చిజేయ, కరకంఠుడ! నీ యభిషేకమీ గతిన్!

భా:-
"శివ" అని తలుచుకోగానే నా మనసు మంచుకొండగా మారుతోంది. (అక్కడనుండి) కవిత్వం గంగలాగ నాలుకపై పరుగులెడుతోంది. శంకర! ఈ విధంగా నీకు పద్యాలతో అభిషేకం చెయ్యడానికి నేను గతజన్మలో ఏమి పుణ్యం చేసుకున్నానో చెప్పవయ్యా!

ఉ:-
దేహము అగ్నిగుండమని, తీరిన కోర్కెలు ఏధమయ్యి ఆ
దాహము పెంచుచుండునని, దక్కని కోర్కెలు గాలిధోరణిన్
వాహనమల్లె మోసి నలువైపులకంపెడివంచు నేర్చి, వ్యా
మోహము బోవఁగోరి కయిమోడ్చితి గావర, శైలమందిరా!

భా:-
"శరీరం ఒక అగ్నిగుండంలాంటిది, తీరిన కోర్కెలు అందులో వేసే ఇంధనంలాగ అగ్నిని పెంచుతాయి, తీరని కోర్కెలు గాలి లాగా మంటను నలువైపులకూ పంపుతాయి", అన్న నిజం తెలుసుకుని, ఈ మోహమనెడి మంటనుండి విమోచనం కోరి నీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను శంకర! నన్ను రక్షించవయ్యా!

గతంలో నేను శివుడిపై సంస్కృతంలో వ్రాసిన పాటను గుర్తుచేసుకున్నాను.

Thursday, February 11, 2010

అదో రకం భక్తి!

శివరాత్రి అంటేనే నా మనసులో ఎన్నో ఊసులు గుర్తొస్తాయి. భక్తులకు దాసుడైపోయి, వారి వెన్నంటుండే సదాశివుణ్ణి భక్తకోటి రోజంతా అర్చించి తరిస్తారు. ఆ మహాదేవుని ధ్యానంలో మునిగిపోతారు. ఐతే ఇలాంటి పవిత్రమైన పండుగల్లో కొంతమంది విచిత్రమైన భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటివి కొన్ని గుర్తు వస్తున్నాయి.

- మా చిన్నప్పుడు దేవీనవరాత్రులకి వీధి చివరన అమ్మవారి ఆలయం బాగా అలంకరించి పెద్దపెద్ద speakersలో పాటలు పెట్టేవారు. అక్కడిదాకా బానే ఉంది. ఆ పాటల ఎంపిక కొంచం తేడాగా ఉండేది. "నడక కలిసిన నవరాత్రి" (Movie: Hitler) పాట వేసేవారు! సరే పాటలు వేసేవాడికి ఏం తెలుస్తుంది, "నవరాత్రి" అనే పదం కనబడటంతో వేసేశాడులే అనుకున్నాము మా కుటుంబమంతా.

- శివరాత్రికి ఏదో భక్తి cinema వేస్తాడు కదా అని అందరం TV ముందు కూర్చుంటే, మా cable TV వాడు, "శివ" cinema వేశాడు. ఎంత title match అయితే మాత్రం, మరీ "శివ" cinemaకి శివరాత్రికి ఏమీ సంబంధం లేదు అని తెలుసుకోవడానికి ఎంత పరిఙానం కావాలి అంటారు?

- కొంతమంది ఉపహారం/ఫలహారం ఉంటారు. అవి కూడా విచిత్రంగా ఉంటాయి. మా చుట్టాల్లో ఒకావిడ కోడలితో, "అమ్మా, ఈ రోజు నేను ఉపవాసం. కేవలం ఫలహారం మాత్రమే", అని చెప్పింది. ఆ కోడలు అత్తగారి నోటికి ఎంతో కొంత రుచి తగుల్తుంది అని పెసరట్టు వేసింది. అది చూసిన వెంటనే ఆవిడ మెచ్చుకుంటుంది అనుకుంటే, వెంటనే: "అదేమిటే నీ మొహం? ఉల్లిపాయల్లేకుండా నేను ఎప్పుడైనా పెసరట్టు తిన్నానా?", అని అడిగింది. ఏమిటో, చిత్తశుద్ధిలేని శివపూజలేమో అనిపిస్తుంది.

- వినాయకచవితి వచ్చిందంటే కొందరికి వినాయకుడికంటే ఎక్కువ ఆకలి వేసేస్తుంది. చిన్నప్పుడు మా సోదరులమందరమూ రెండు రోజుల ముందునుండి "ఏమి వండమని చెప్పాలి అమ్మకి?", అని తెగ ఆలోచించేవాళ్ళం. పూజ చివర్లో మా అమ్మగారు, "కథ తప్పినా, వ్రతం తప్పకూడదు; వ్రతం తప్పినా ఫలం తప్పకూడదు స్వామీ", అని చెప్పగానే మా నన్నగారు, "ఏమి తప్పినా ప్రసాదం తప్పకూడదు", అనేవారు.

- శివరాత్రికి జాగరణ చేసే పద్ధతుల్లో కూడా చాలా వింతలు ఉంటాయి. మా ఊళ్ళో, "శ్రీరామా talkies" లో "శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర" cinema, mid-night show వేస్తే, దానికి competition గా వేరే theatre వాడు, "ప్రెసిడెంటు గారి పెళ్ళాం" అనే భక్తిరసప్రధానచిత్రాన్ని వేశాడు. ఎక్కడ భక్తిరసపానమత్తులైన ప్రజలు కుప్పలుతెప్పలుగా, కప్పలుగా చేరి ఉంటారో ఊహించడం పెద్ద కష్టం కాదు.

- భక్తి-పాటల్ని వ్రాయడానికి cinema tunes ఎంచుకోవడం నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఈ మధ్యన "పౌరుడు" cinemaలో, "హృదయం ఎక్కడున్నది" (ఘజిని చిత్రంలోని పాట) అనే పాటను, church లో father, "ఏసు ఎక్కడున్నాడు", అని మార్చి పాడటం ఎంత నవ్వు వచ్చినా, అది తప్పు అనే నాకు అనిపించింది. చిన్నప్పుడైతే, సాయిబాబా మీద "ముఠామేస్తిరి" title song remake ప్రయోగించడం నాకు చిత్రంగా అనిపించింది.

- భగవద్గీత అంటే అందరికీ లోకువే. ఎవరికి నచ్చిన "గీతసారం" వాడు చెప్పేస్తాడు. పాపం, కృష్ణుడు, వ్యాసుడు, అర్జునుడు, సూర్యుడూ కూడా ఆశ్చర్యపోయే అర్థాలు అందులోంచి వెలికితీస్తూ ఉంటారు నవతరం భక్తులు. అసలే మన భక్తులకు "చర్చ ఎక్కువ, చర్య తక్కువ". మా అమ్మగారితో పాటు school లో పని చేస్తున్న ఒకావిడ, "నేను భగవద్గీత చదవకపోతే నాకు రోజంతా అదొకలాగుంటుంది అండి", అని చెప్పేది. ఒక రోజు వాళ్ళ ఇంట్లో వేరే వాటాలో ఉండే ఆవిడ, వీళ్ళ దండెం మీద బట్టలు ఆరేస్తే, అవన్నీ పీకి పక్కన పారేసి, "నా దండెం మీద వేరే వాళ్ళ బట్టలు ఆరెయ్యడం నాకు నచ్చదు", అని బలమైన హెచ్చరిక జారీ చేసిందిట. మరి కృష్ణుడు ఏమనుకున్నాడో తెలియదు గానీ.

శివరాత్రి అనగానే నాకు మధురమైన, హృదయం కదిలించే మరి కొన్ని విషయాలు గుర్తుకొస్తాయి. అవి వేరే టపలో వ్రాస్తాను. మరి సెలవు!