Friday, January 8, 2010

జయ తుంగతరంగే గంగే!

సీతాకాలం సెలవల్లో నేను అత్యంతసమయం cricinfo లాంటి వెబ్సైట్లలో పనికిరాని వ్యాసాలు చదువుతూ గడిపేశాను అని తెలుసుకున్నాను. అందుకే నా సమయాన్ని కాస్త ఉపయోగాత్మకమైన పనుల్లో వినియోగించాలని నిర్ణయించుకుని, నాకు నచ్చిన కీర్తనలను అర్థాలను వివరించాలని నిర్ణయించుకున్నాను. నేను స్వయంగా (వినేవాడి కర్ణాలు చచ్చుపడిపోకుండా) కీర్తనలను పాడలేకపోయినా కనీసం సంగీతఙులకు ఈ టపలు ఉపయోగపడితే సంతోషిస్తాను.నేను చెప్పినవాటిల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే దయచేసి సవరించగలరు. నాకు పెద్దగా తెలుగు/సంస్కృతం తెలియవు - జిఙాస/పిపాస/ఆశ తప్పితే!

కీర్తన: తుంగతరంగే గంగే
రాగం: సురటి
తాళం: ఆది
కర్త: సదాశివబ్రహ్మేంద్ర

[పా:- పాట, భా:- భావం, వి:- వివరణ]

పా:- తుంగతరంగే గంగే! జయ తుంగతరంగే గంగే!
భా:- ఉబికిపడే అలలు కల గంగమ్మ! నీకు జయమౌ గాక!

పా:- కమలభవాండ-కరండ-పవిత్రే
భా:- బ్రహ్మదేవుని అండం అనెడి భరణిలో సంస్కరింపబడినదాన!
వి:- గంగ బ్రహ్మ కమండలంలో ఉండటంచేత పవిత్రితను సంతరించుకుంది. ఆమె ఇతివృత్తాన్ని ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెబుతోంది. ఐతే అన్ని పురాణాలు ఒప్పుకునే విషయం ఏమిటి అంటే బ్రహ్మ గంగాదేవికి పవిత్రతను చేకూర్చాడు అని. అంటే గంగకి బ్రహ్మ గురువువంటి వాడు, అని. సిరివెన్నెల గంగమ్మ గురించి "శుభసంకల్పం" చిత్రంలో వ్రాసిన పాట చక్కగా ఉంటుంది అని నా అభిప్రాయం.

పా:-బహువిధ-బంధ-చేద-లవిత్రే
భా:- అనేక రకములైన భవబంధాలను, పాపపుణ్యఫలితాలనూ తెగనరికే కొడవలి వంటి దాన!
వి:- ఇహంలో బంధాలను, కర్మఫలితాలను మాయాప్రపంచానికి ఆత్మను కట్టివేసే తాళ్ళతో పోల్చడం వైదీకసంస్కృతిలో రివాజు.

పా:- దూరీకృత-జన-పాప-సమూహే
భా:- ప్రజల పాపాలను నశింపజేసేదాన!
వి:- గంగలో మునకలేస్తే పాపాలు దూరం అవుతాయి అని పెద్దల మాట! వేటూరి దీన్నే "గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా", అని "గంగోత్రి" చిత్రంలో వర్ణించాడు.

పా:- పూరిత-కఛ్ఛప-గుఛ్ఛ-గ్రాహే
భా:- తాబేళ్ళను మాలగా ధరించేదాన
వి:- గంగానదిలో అనేక జాతుల తాబేళ్ళు ఉంటాయి. గంగలో ఉండే తాబేళ్ళని కంఠాభరణంగా వర్ణిస్తున్నాడు, కవి.

పా:- పరమహంస-గురు-ఫణిత-చరిత్రే
భా:- గురువునోట పొగడబడిన దాన!
వి:- పాలూనీళ్ళను ఏ విధంగా హంస వేరు చెయ్యగలదో, ఆ విధంగా సత్యాసత్యాలను వేరు చెయ్యగలిగే వాడు గురువు. "అట్టి గురువు స్వయంగా నీ చరిత్ర చెప్పాడు కదా!", అనడంలో కవి ఏదైనా పురాణంలో గంగ చరిత్ర చెప్పిన మునుల గురించి ఐనా ప్రస్తావించి ఉండచ్చు. లేక గంగాష్టకం రచించిన ఆదిగురువు శంకరాచార్యుణ్ణి అయినా స్మరించి ఉండవచ్చు.

పా:- బ్రహ్మా-విష్ణు-శంకర-నుతిపాత్రే
భా:- త్రిమూర్తుల చేత పొగడబడే దాన!

ప్రతిపదార్థాలు:-

తుంగ - ఎత్తైన/ఉబికిపడే
తరంగే - అలలు కలదాన!
గంగే - ఓ గంగమ్మ!
జయ - నీకు శుభమౌగాక
కమలభవ - కమలంలో జన్మించినవాడి/బ్రహ్మదేవుడి
అండ - గ్రుడ్డు (అనెడి)
కరండ - భరణి (లోనుండుట వలన)
పవిత్రే - పవిత్రమైన దాన!
బహువిధ - అనేకము రకములైన
బంధ - బంధములను
ఛేద - తెగనరికే
లవిత్రే - కొడవలివంటి దాన!
జన - ప్రజల
పాపసమూహం - పాపములమూట
దూరీకృత - దూరం చేస్యబడిన
పూరిత - కూర్చబడిన
కఛ్ఛప - తాబేళ్ళ
గుఛ్ఛ - సమూహం
గ్రాహే - గ్రహించెడిదాన!
పరమహంస గురు - సత్యాన్నీ, అసత్యాన్నీ వేరు చెయ్యగలిగే ఙానం కలిగిన ఉత్కృష్టమైన గురువు (చేత)
ఫణిత - చెప్పబడిన
చరిత్రే - చరిత్రగలిగినదాన!
బ్రహ్మవిష్ణుశంకర - త్రిమూర్తులు స్వయంగా
నుతి - స్తుతి (పొందడానికి)
పాత్రే - అర్హతకలదాన!

No comments: