Monday, January 25, 2010

రాంబాబు కథలు - స్త్రీద్వేషి

రాంబాబు ఏదో ఒకరోజు మారతాడు, కార్పొరేట్ సెంటు పూసుకుంటాడు అని చందుకి ఎక్కడో కొంచం ఆశ ఉండేది. కానీ, ప్రతీ రోజూ ఇంగ్లీషు idioms కి విపరీతార్థాలు తీస్తూ idiot అనిపించుకుంటూనే ఉన్నాడు. చందు, రాంబాబు అమాయకత్వాన్ని చూసి తన రూంలోనే ఉండమన్నాడు. వాళ్ళు ఇప్పుడు room-mates and  team-mates. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాయి. తఱువాత చందు మిత్రుడి ద్వారా వెంకట్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. తనూ software engineer ఏ కావడం, వాళ్ళ office చందు ఇంటికి దగ్గరగా ఉండటం చేత చందు వాళ్ళ ఇంట్లోనే చేరతానంటే చందు ఒప్పుకుంటాడు.  ఒక మధ్యాహ్నం పూట వెంకట్ సామాన్లతో చందు, రాంబాబుల ఇంట్లోకి దిగాడు. అప్పటినుండి వెంకట్కి చెవుల్లో జోరీగ duplex house కట్టుకుని కాపురం ఉంటున్న feeling మొదలైంది.

వెళ్తూనే రాంబాబుని చూసి, "Hello, I am Venkat, from Vijayawada!" అన్నాడు. దానికి రాంబాబు, "I am Rambabu from baapaTla." అన్నాడు. వెంటనే రాంబాబు చిరునవ్వుతో "Do you care for a చిలగడదుంప?" అన్నాడు. ఒక్క నిముషం వెంకట్ కి అర్థం కాలేదు. అది గమనించిన చందు, "ఏం లేదు వెంకట్, రాంబాబు 'చిలగడదుంప తింటావా?' అని అడుగుతున్నాడు", అన్నాడు. దానికి వెంకట్ రాంబాబుని చూసి, "నేను తెలుగువాడినేనండి", అన్నాడు. దానికి రాంబాబు, "I know. But, still I talk in English only", అన్నాడు. ఆ shock నుండి వెంకట్ తేరుకుని ఇల్లు సర్దుకునేసరికి రాత్రి అయ్యింది. ఆ time కి రాంబాబు వంట చేసాడు.

భోజనానికి paper పరుచుకుని ముగ్గురూ కూర్చుక్న్నారు. వెంకట్ కూర తిన్నవెంటనే మజ్జిగ packet పట్టుకోవడం చూసిన రాంబాబు, "Hey, Help yourself to some పులుసు!" అన్నాడు. dinnerతోపాటు ఖంగు తిన్న వెంకట్, "రాంబాబు, పులుసు అనేది తెలుగుపదం కదా? మరి దాన్ని ఇంగ్లీషు వాక్యంలో ఎలాగ వాడుతున్నావు?", అని ధర్మసందేహం అడిగాడు. దానికి రాంబాబు ఒక నవ్వు నవ్వి, "How much possible, that much I talk in English. I do my best and leave the rest!" అన్నాడు. అప్పుడు తెలిసింది వెంకట్కి తను భోజనం చేసి అక్కడనుండి వెళ్ళిపోవడం ఉత్తమం అని.

పొద్దున్నే లేచి సుప్రభాతం వినడం అలవాటు ఉన్న వెంకట్ laptopలో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి సుప్రభాతం పెట్టాడు. ఆ సడికి మెలుకువొచ్చిన రాంబాబు లేచి, "Oh! Morning morning you listen సుప్రభాతం ఆ?", అన్నాడు. అది విన్న వెంకట్ వెంటనే సుప్రభాతం కట్టేసి, తన చెవులకి కాస్త శాంతిని కలిగిద్దామని bathroomలోకి దూరాడు. brush తీసి దానిపైన paste వేశాడో లేదో, ఇంతలో రాంబాబు తలుపుతట్టి, "Hey, I want to write oil to my hair. Please give me Parachute." అన్నాడు. నాలికబద్దతో రాంబాబు నాలిక కోసెయ్యాలి అనిపించినంత కోపం వచ్చినా సముదాయించుకుని ఆ నూనెసీసా బయటకు ఇచ్చి రక్తం వచ్చేంత speedగా పళ్ళు తోముకున్నాడు.

రాంబాబు NDTV పెట్టుకుని వార్తలు వింటున్న సమయంలో చందు లేచి వచ్చాడు. అప్పుడు వెంకట్, చందు ఏదో బాతాఖానీ కొట్టుకుంటూండగా, తనకు ఆఫీసులో ఒకమ్మాయి ఎంతగా కోపం తెప్పించిందో చందు చెప్తున్నాడు. "That is why I hate ladies", అని రాంబాబు, ఎక్కడనుండి వచ్చాడో తెలియకుండానే వచ్చి అన్నాడు. వెంకట్ 'ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావూ?' అన్నట్టు ఒక చూపు చూశాడు. అప్పుడు రాంబాబు ఇచ్చిన ఉపన్యాసానికి వెంకట్కి సన్యాసం తీసుకోవాలి అనిపించింది. "I hate ladies. Coolly they come at 10'o clock to office like Perantaas. I tell them the work like a parrot. They listen with one ear and leave it another ear.Everything is over-head-transmission. They don't finish their work before deadline. When I ask them why, they start dropping crocodile tears. They have no insight but want onsite. It is not words to tell the headache they create.", అన్న రాంబాబును చూస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు వెంకట్. రాంబాబు ఆ ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు.

తను చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీషుని రెండురోజుల్లో మరిచిపోయేలాగా చెయ్యగల రాంబాబుని చూసి వెంకట్కి దిమ్మదిరిగింది. చందుని పక్కకు పిలిచి, "అసలు వీడి problem ఏమిటి? ఎందుకు ఇలాగ ఇంగ్లీషుని ఖూని చేస్తున్నాడు?", అని అడిగాడు. అప్పుడు చందు చెప్పాక తెలిసింది అసలు విషయం.

రాంబాబుకి స్వతహాగా తెలుగంటే పిచ్చయిష్టం. కానీ తన జీవితంలో మరిచిపోలేని దినం - 22-మే-2009 - ఆ రోజు జరిగిన విషాదానికి అతని గుండె ముక్కలుముక్కలయ్యిపోయింది. ఆ రోజునుండి తన పద్ధతే మారిపోయింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రెండింటికి దూరమయిపోయాడు - ఒకటి తెలుగు, రెండు దివ్య!

రాంబాబు చేరిన రెండు మూడు రోజులకే Luckwhereలో మహేష్, దివ్య అనే ఇద్దరు చేరారు. వాళ్ళని రాంబాబు టీంలోనే వేశారు. మహేష్ తమిళుడు. దివ్య తెలుగుది. దివ్యను చూసిన వెంటనే రాంబాబుకు కళ్ళు తిరిగి కిందపడిపోయాడు - "ఏం అందం, ఏం అందం! దివ్య నాకే!" అనుకున్నాడు మనసులో. ముగ్గురూ bank accounts open చెయ్యాలి కాబట్టి కలిసి దగ్గరలో ఉన్న bank కి వెళ్ళారు. మహేష్, దివ్య ఇంగ్లీషులోనే మాట్లాడుకోవడం చూసిన inferiorగా feel అయ్యాడు. ఎలాగైనా తన ఇంగ్లీషు ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. ముగ్గురూ queue లో application forms fill చేసి, పట్టుకు, నుంచున్నారు. మొదట రాంబాబు వెళ్ళి ఆ form అక్కడ ఉన్న officer కి ఇచ్చాడు. "Fill challaan sir", అంది ఆమె. challaan అంటే ఏమిటో తెలియని రాంబాబు అది కన్నడం అనుకుని, "Speak in English, అన్నాడు. ఆమె, "I spoke in English sir", అంది. వెంటనే మహేష్, దివ్య నవ్వారు. ఆ గాయం తాకిన బరువైన గుండెతో రాంబాబు ఆఫీసుకి వచ్చేశాడు. ఆ బాధను మరిచిపోవడానికి అరగంట foosball ఆడాడు, అరడజనుసార్లు కాఫీ తాగాడు. కాస్త మనసు కుదుటపడ్డాక తన computer ముందుకు వచ్చి కూర్చున్నాక తన teamలో తెలుగువారందరూ cinema కి వెళ్దామని అనుకుంటున్నారని మనశ్శాంతికోసం తనూ వెళ్ళాలి అనుకున్నాడు. తెలుగు సినిమా కాబట్టి మహేష్ రాడనుకున్నాడు రాంబాబు. పాపం, తనకు తెలియదు అక్కడ తన గాయం మీద కారం పడుతుంది అని.

సినిమాలో రాంబాబు అనే పేరుని చాలా తక్కువగా చూపించి, మహేష్ అనే పేరుని గొప్పదిగా చిత్రీకరించారు. అది చూసి తన colleagues అందరూ (దివ్యతో సహా) తనకేసి చూసి నవ్వడం  మొదలెట్టారు. అది సహించాడు. కానీ, బయటకు వచ్చాక దివ్య "నేనే హీరోయిన్ ని అయితే రాంబాబుని కాదు మహేష్నే పెళ్ళి చేసుకునేదాన్ని", అనడం ఆ 70mm screenని 7mm bladeగా చేసి తనగుండెను కోసినట్లుగా అనిపించింది. సహించాడు. కానీ ఆ తరువాత కొన్నాళ్ళకు తెలిసింది మహేష్, దివ్య ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అని. ఇది జరిగినప్పటినుండి రాంబాబుకు అమ్మాయిలంటే చిరాకు పట్టుకుంది. ఎప్పటికైనా మహేష్ కన్నా పాషుగా ఇంగ్లీషు మాట్లాడి దివ్యకంటే అందమైన అమ్మాయిని ప్రేమలోకి దింపాలన్నది వాడి ఆశయం. అది వాడి విషాదగాధ!

కథంతా ఓపిగ్గా విన్న వెంకట్ తన సానుభూతిని ఒక్కముక్కలో తేల్చేశాడు, "తూ, వీడొక గధా, వీడిదొక గాధ!", అన్నాడు. వెంటనే వెంకట్కి ఒక సందేహం వచ్చింది, "అవునూ, వీడికి అమ్మాయిలంటే ద్వేషమన్నావు? మరి ప్రేమలోకి దింపడం దేనికి?", అన్నాడు. దానికి చందు, "అదే కదా వాడి sadism. అమ్మాయి తనకు propose చేశాక, no చెప్పి స్త్రీజాతిమీద తనకున్న కచ్చి తీర్చుకోవాలన్నదే వాడి తపన!", అన్నాడు చందు. "software industryలో ఇంగ్లీషు-మన్మథుడన్నమాట. అఘోరించనీ", అన్నాడు వెంకట్.

చందు రాంబాబుని సముదాయించడానికి గదిలోకి వెళ్ళాడు. అక్కడ రాంబాబు ఉడికిపోతూ ఉన్నాడు. చందు, "రాంబాబూ, control yourself", అన్నాడు. రాంబాబు ఊపిరి బలంగా పీలుస్తూ మఱొక ప్రసంగం మొదలుపెట్టాడు.

రాంబాబు: ఈ ఆడవాళ్ళతో ఒక తంటా కాదురా బాబు. గొప్ప చిరాకు తెప్పిస్తారు.  వీళ్ళను చూసి చూసి నాకు పెళ్ళి చేసుకోవాలనే కోరిక నానాటికీ చచ్చిపోతోంది. చందు (మనసులో): ఇప్పుడు నిన్ను పెళ్ళి గురించి ఎవరడిగారు?  రాంబాబు: మనిషి తనకు అనుకూలంగా ఉన్నదాన్ని మాత్రమే ఒప్పుకుని, అనుకూలంగా లేనిదాన్ని వ్యతిరేకించడం సహజమే. కానీ, అలాగ చెయ్యడంలో కాస్త కన్సిస్టెన్సీ ఉండాలి కదా? అహా, అసలు మనలో మన మాట! చందు: అవునురా? ఇప్పుడేమైంది?
రాంబాబు: స్త్రీపురుషుల సమానత్వం అంటారు - ముప్పీమూడు శాతం reservation అంటారు! ఒరేయ్, అందరం కలిసి shopping కి వెళ్తే డబ్బు ఖర్చు చేసేది మనము, luggage మోసేది కూడా మనమేనా? ఇదేం న్యాయం రా?
చందు: నిజమే! రాంబాబు: నిజాలు చెప్తే ఒప్పుకోరు, ఒప్పుకోలేరు, జీర్ణించుకోలేరు.  డ్రెస్సులు కొంచెం ఆకర్షించేలాగ వేసుకోవాలనుకుంటారు. అదేమంటే - మాకు comfortable గా ఉండద్దా? అంటారు. జాకెట్టుకు బొక్క- ఏమన్నా అంటే మాధురీ దీక్షిత్ దీనికక్క! గుడ్డ్లప్పగించి చూసేవాళ్ళ గురించి లెక్చర్లు దంచుతారు. మగవాళ్ళు ఆడవాళ్ళను కాక వీధిలో కుక్కల్ని, విహాయసవీధిలో చుక్కల్ని చూస్తారా? చందు: అవును. (ఇంత ఆవేశంలో కూడా ప్రాస కోసం రాంబాబు పడే ప్రయాసను చూసి నవ్వుకున్నాడు). రాంబాబు: ఏ దేశంలోనైనా మగవాడలాగే ఉంటాడంటే ఒప్పుకోరు. ఏమైనా అంటే ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా అంటారు. నేను కాలేజీలో జాయినైన కొత్తల్లో ఒకడు మా పక్కనుండి వెళ్తున్నమ్మాయిని చూసి movie styleలో కామెంటు చేశాడు. నేను, "తప్పురా, పరస్త్రీ మాతృసమానురాలు" అన్నాను. దానికి వాడు, "మన స్త్రీ ఎవరో తెలిస్తేనే కదా, పరస్త్రీ ఎవరో తెలియడానికి", అన్నాడు.చందు: హ హ హ, వాడన్నదాంట్లో కూడా కొంత విషయం ఉంది.రాంబాబు: అది సరే. కానీ, వాడు అమ్మాయి ముందు మాట్లాడేటప్పుడు మాత్రం, అభ్యుదయభావాలతో, సున్నితత్వంతో మాట్లాడేవాడు. అప్పుడు తెలుసుకున్నాను అందరూ ఒక లాగే ఆలోచించరు అని. ఆలోచించినదే మాట్లాడరని. ఈ విషయం అమ్మాయిలకు ఎప్పుడు అర్థమవుతుందో! ఏమైనా చెప్దామని ప్రయత్నిస్తే...judge చెయ్యద్దంటారు (ఇదొక విచిత్రం, judge  చెయ్యని మనిషిని చూపించు జగజ్జడ్జీ! అని భగవంతుణ్ణి అడగాలనిపిస్తుంది.) - మరి మగవాళ్ళతో మాట్లాడినట్టే మీతో మాట్లాడితే (అంటే కొంచెం పదునైన మాటల్తో, కఠినమైన వాస్తవాలతో, అక్కడక్కడా level-1 తిట్లతో) ఎందుకు ఒప్పుకోలేరు?చందు: మామ, నీలో మంచి ఆవేశం ఉందిరా. బాగా చెప్పావు.
రాంబాబు: వీళ్ళనర్థం చేసుకోవడం: నా వల్లకాదు, నాదు వల్లకాదు, నా చేతన్, చేన్, తోడన్, తోన్ వల్లకాదు,  నా వలనన్, కంటెన్, పట్టి వల్ల కాదు, నా కొఱకున్, కై వల్లకాదు, నా కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ వల్లకాదు, ఓయీ, ఓసీ, ఓరీ, ఏమే, ఏమేమే, ఓరోరీ నా వల్లకాదు! కాదంటే కాదు. 
చందు: విభక్తులనన్నిటినీ వాడి నీ విరక్తిని చెప్పావు కదరా మాఁవా!

Saturday, January 16, 2010

నిత్యజీవితంలో పద్యాలు - శృంగారరసం!

ఈ పద్యాలు పద్దెనిమిదేళ్ళు దాటినవాళ్ళు మాత్రమే చదవాల్సిందిగా మనవి. పద్దెనిమిదేళ్ళు దాటినా, ఇది చదివి "ఛీ ఛీ" అనుకునేవాళ్ళకు నా హృదయపూర్వక క్షమార్పణలు.

సం:-
పెళ్ళిలో వధూవరులను వర్ణిస్తూ ఒక సరసామృతభరితపద్యం వ్రాయమని అడిగితే!

సీ:-
మొగ్గవిచ్చిననాడు మొదలైన తాపాలు మోజుపడినవాని మోముజూడ
సిగ్గుపడ్డ మగువ చిరునవ్వులోజేరి వరునికై వెదికాయి ఓరకంట
బుగ్గయెరుపులోన పులుపంత తెలిపెలే, కంటిమెరుపులోని కలలసాక్షి
పగ్గమెరుగకున్న పడుచుతనము నేడు, కోరివోడెను పెళ్ళికొడుకుముందు!

భా:-
తెలివి వచ్చినప్పటినుండి మనసులో మొదలైన కోర్కెలన్నీ సిగ్గుతో ఉన్న అమ్మాయి చిరునవ్వులో చేరి పెళ్ళికొడుకును ఓరచూపుతో వెదకసాగాయి, ముద్దు ఎరుగని ఆమె బుగ్గలో తిమ్మిరి, కలలతో మెరుస్తున్న ఆమె కళ్ళూ చెప్తున్నాయి. ఇన్నాళ్ళూ విర్రవీగిన ఆమె పడుచుదనం ఈ రోజు తోడు కోసం కావాలని ఓడిపోయింది.

ఆ:-
కన్నెమోవిపైన కదలాడు రాగాలు
నన్నుచేరమనుచు కన్నుగీటె
వన్నెలాడి సొంపు వరదల్లె పొంగగా
మన్నులోన కలిసె వరుని పట్టు

భా:-
వధువు పెదవిపైన కనిపిస్తున్న రంగు "నన్ను చేరవయ్య!" అంటూ కన్నుగీటి పిలుస్తుంటే, ఆమె అందాలవరదకి ఆ వరుడి పట్టు అంతా మట్టిలో కలిసిపోయింది.

సం:- 
ప్రేయసిని చూడగానే ముద్దుపెట్టుకోవాలనిపించడం వర్ణిస్తూ ఒక పద్యం వ్రాయమని అడుగితే!

చ:-
పగడపుకాంతులీను,నవపల్లవసన్నిభకోమలాధరం
బుగని, యనేక లాలసలు పుట్టెనదేమొ హృదాంతరాలలో
తెగువను చూపి కౌగిట మథించి మదీయబుభుక్ష చూచుచున్
నగెడి సుధాసమృద్ధరదనఛ్ఛదయామళమందుకోవలెన్!

భా:-
పగడం లాగా మెరిసిపోతూ, లేతచిగురాకు లాగు మృదువుగా ఉన్న అధరాన్ని ఏమిటో బోళ్ళు కోరికలు నా మనసు లోతుల్లో పుడుతున్నాయి. కాస్త తెగువ చూపించి ఆమెను కౌగిట్లో చిలికి, నా ఆకలిని చూసి నవ్వుతున్న అమృతం నిండియున్న పెదవులజంటని అందుకోవాలి.

Friday, January 15, 2010

మకరసంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి పండుగ వైదీకసంస్కృతిలో సూర్యమానాత్ నూతనసంవత్సరం. అంటే, సూర్యుడు భూమిదృష్ట్యా ఎక్కడ ఉన్నాడు అన్నది పరిగణంలోకి తీసుకుంటే అప్పుడు ప్రతి ఏడూ దాదాపు జనవరి 13/14 తేదీలలో మకరరాశిలోకి (ఉత్తరాషాఢ-2వ పాదం) ప్రవేశిస్తాడు. సూర్యుడు మకరం నుండి మిథునం వరకు సాగించే ప్రయాణాన్ని (అంటే నిజానికి సూర్యుడు కాదు భూమి పయనిస్తుంది, నేను చెప్పేది భూమిదృష్ట్యా అంటే relative motion) ఉత్తరాయణపుణ్యకాలమని అంటారు! మోక్షం వచ్చేవారు ఈ సమయంలోనే దేహయాత్ర చాలిస్తారు అని భగవద్గీత చెప్తోంది.

ఈ పుణ్యకాలాన్ని ఆహ్వానిస్తూ "సర్వే జనాః సుఖినో భవంతు" అనుకుందాము.

శా:-
ఆమూలాగ్రముతుంచరే జగతిలో అఙానమున్ విద్యతో
ప్రేమోల్లాసము నింపరే మనసులో భేదాలు పోగొట్టగన్
వ్యామోహంబు నశింపనందుకొనరే వైదూష్యభక్త్యాదులన్
ఆ మార్తాండుడు వుత్తరాయణముకై ఔత్సుక్యమున్ జూపగా!

ఉ:-
పిల్లలు బుద్ధిమంతులవ పెద్దల మాటలు గౌరవించుచున్
చెల్లని కౌతుకోన్నతియు చేరగ విద్యలెరుంగబూనుచున్
చల్లగనుండ కాపురము జంటలు ప్రేమగ మాటలాడుచున్
ఎల్లరు శాంతినుండ సిరి యింటనె తాండవమాడగోరెదన్

నిత్యజీవితంలో పద్యాలు

ఈ మధ్యన కాస్త పని ఎక్కువగా ఉండటంతో నేను ఆట్టే బ్లాగించలేకపోతున్నాను. అందుకే ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటున్న "సాఫ్ట్వేర్ ప్రపంచం-2", "నామకరణం", "తమిళాయణం" వంటి టపలు పూర్తి చెయ్యలేకపోయాను. ప్రస్తుతానికి నేను వ్రాసిన కొన్ని పద్యాలు బ్లాగుతున్నాను.

సం:-
శైలజగారు నాకు గరళఫ్రెండు (girl friend) ఎందుకు లేదో అడిగితే
ఆ:-
మగువ మనసు పువ్వొ, మకరందమును దాచ!
గ్రోలనైతినాయె కోతి నేనొ?
నారి హృత్తు కనగ నారికేళమొ, నీరు!
త్రాగనైతి తేనెటీగ నేనొ?
భా:-
అమ్మాయి మనసు పువ్వయ్యి, నేను కోతినవ్వడం చేత అందులోని తేనెను నేను గ్రహించలేకపోతున్నానో; లేక అమ్మాయి మనసు కొబ్బరిబోండాం అయ్యి నేను తేనెటీగను కావడం వలన గ్రహించలేకపోతున్నానో!

కం:-
తిరవుగ సత్యము తెలియదు
నెరవుగ శొధన జరపిన, నేరమదేమో!
తరుణుల మదిలో మర్మము
యెరుగగ లేకుంటినకట యేందులకిటులో!
భా:-
ఈ రెండిటిలో ఏది నిజమో ఎంత ఆలోచించా తెలియట్లేదు. మొత్తానికి నాకు అమ్మాయిలు అయితే అర్థం కారు, ఎందుకో!

సం:-
అన్నమయ్య మీద ఒక పద్యం వ్రాయమని అడిగితే
ఆ:-
అఖిల లోకములకు ఆకలి బాపేటి
అమ్మ, లక్ష్మి సతిగ అవతరించ
కొండపైన స్వామి గొదగొన్న సమయాన
అన్నమయ్య పాటె అన్నమయ్యె!
భా:-
సమస్తలోకాలకీ ఆకలి తీర్చేటి అమ్మ తనకు భార్యగా చేరింది కానీ,ఆయనకు ఆకలి వేస్తే మాత్రం అన్నమయ్య పాటే కావాలంటాడు వేంకటేశ్వరుడు

కం:-
పాటలతో కవితిలకుడు
పోటెత్తగ జడిసెను గద, భూధరచయముల్
గాటపుగోడలుగ వెలయు
కూటము కోటగ కులికెడి కొండలఱేడే!
భా:-
అన్నమయ్య పాటలతో పోటెత్తితే (భక్తితో ప్రార్థిస్తే/యుద్ధానికి దిగితే) కొండలసమూహాలు గోడలుగా ఉన్న పర్వతశిఖరాన్ని కోటగా చేసుకున్న వేంకటేశ్వరుడు జడిశాడు (దయచూపించాడు/భయపడ్డాడు).

Friday, January 8, 2010

జయ తుంగతరంగే గంగే!

సీతాకాలం సెలవల్లో నేను అత్యంతసమయం cricinfo లాంటి వెబ్సైట్లలో పనికిరాని వ్యాసాలు చదువుతూ గడిపేశాను అని తెలుసుకున్నాను. అందుకే నా సమయాన్ని కాస్త ఉపయోగాత్మకమైన పనుల్లో వినియోగించాలని నిర్ణయించుకుని, నాకు నచ్చిన కీర్తనలను అర్థాలను వివరించాలని నిర్ణయించుకున్నాను. నేను స్వయంగా (వినేవాడి కర్ణాలు చచ్చుపడిపోకుండా) కీర్తనలను పాడలేకపోయినా కనీసం సంగీతఙులకు ఈ టపలు ఉపయోగపడితే సంతోషిస్తాను.



నేను చెప్పినవాటిల్లో ఎక్కడైనా తప్పులు ఉంటే దయచేసి సవరించగలరు. నాకు పెద్దగా తెలుగు/సంస్కృతం తెలియవు - జిఙాస/పిపాస/ఆశ తప్పితే!

కీర్తన: తుంగతరంగే గంగే
రాగం: సురటి
తాళం: ఆది
కర్త: సదాశివబ్రహ్మేంద్ర

[పా:- పాట, భా:- భావం, వి:- వివరణ]

పా:- తుంగతరంగే గంగే! జయ తుంగతరంగే గంగే!
భా:- ఉబికిపడే అలలు కల గంగమ్మ! నీకు జయమౌ గాక!

పా:- కమలభవాండ-కరండ-పవిత్రే
భా:- బ్రహ్మదేవుని అండం అనెడి భరణిలో సంస్కరింపబడినదాన!
వి:- గంగ బ్రహ్మ కమండలంలో ఉండటంచేత పవిత్రితను సంతరించుకుంది. ఆమె ఇతివృత్తాన్ని ఒక్కో పురాణం ఒక్కో విధంగా చెబుతోంది. ఐతే అన్ని పురాణాలు ఒప్పుకునే విషయం ఏమిటి అంటే బ్రహ్మ గంగాదేవికి పవిత్రతను చేకూర్చాడు అని. అంటే గంగకి బ్రహ్మ గురువువంటి వాడు, అని. సిరివెన్నెల గంగమ్మ గురించి "శుభసంకల్పం" చిత్రంలో వ్రాసిన పాట చక్కగా ఉంటుంది అని నా అభిప్రాయం.

పా:-బహువిధ-బంధ-చేద-లవిత్రే
భా:- అనేక రకములైన భవబంధాలను, పాపపుణ్యఫలితాలనూ తెగనరికే కొడవలి వంటి దాన!
వి:- ఇహంలో బంధాలను, కర్మఫలితాలను మాయాప్రపంచానికి ఆత్మను కట్టివేసే తాళ్ళతో పోల్చడం వైదీకసంస్కృతిలో రివాజు.

పా:- దూరీకృత-జన-పాప-సమూహే
భా:- ప్రజల పాపాలను నశింపజేసేదాన!
వి:- గంగలో మునకలేస్తే పాపాలు దూరం అవుతాయి అని పెద్దల మాట! వేటూరి దీన్నే "గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడు మునకలే చాలుగా", అని "గంగోత్రి" చిత్రంలో వర్ణించాడు.

పా:- పూరిత-కఛ్ఛప-గుఛ్ఛ-గ్రాహే
భా:- తాబేళ్ళను మాలగా ధరించేదాన
వి:- గంగానదిలో అనేక జాతుల తాబేళ్ళు ఉంటాయి. గంగలో ఉండే తాబేళ్ళని కంఠాభరణంగా వర్ణిస్తున్నాడు, కవి.

పా:- పరమహంస-గురు-ఫణిత-చరిత్రే
భా:- గురువునోట పొగడబడిన దాన!
వి:- పాలూనీళ్ళను ఏ విధంగా హంస వేరు చెయ్యగలదో, ఆ విధంగా సత్యాసత్యాలను వేరు చెయ్యగలిగే వాడు గురువు. "అట్టి గురువు స్వయంగా నీ చరిత్ర చెప్పాడు కదా!", అనడంలో కవి ఏదైనా పురాణంలో గంగ చరిత్ర చెప్పిన మునుల గురించి ఐనా ప్రస్తావించి ఉండచ్చు. లేక గంగాష్టకం రచించిన ఆదిగురువు శంకరాచార్యుణ్ణి అయినా స్మరించి ఉండవచ్చు.

పా:- బ్రహ్మా-విష్ణు-శంకర-నుతిపాత్రే
భా:- త్రిమూర్తుల చేత పొగడబడే దాన!

ప్రతిపదార్థాలు:-

తుంగ - ఎత్తైన/ఉబికిపడే
తరంగే - అలలు కలదాన!
గంగే - ఓ గంగమ్మ!
జయ - నీకు శుభమౌగాక
కమలభవ - కమలంలో జన్మించినవాడి/బ్రహ్మదేవుడి
అండ - గ్రుడ్డు (అనెడి)
కరండ - భరణి (లోనుండుట వలన)
పవిత్రే - పవిత్రమైన దాన!
బహువిధ - అనేకము రకములైన
బంధ - బంధములను
ఛేద - తెగనరికే
లవిత్రే - కొడవలివంటి దాన!
జన - ప్రజల
పాపసమూహం - పాపములమూట
దూరీకృత - దూరం చేస్యబడిన
పూరిత - కూర్చబడిన
కఛ్ఛప - తాబేళ్ళ
గుఛ్ఛ - సమూహం
గ్రాహే - గ్రహించెడిదాన!
పరమహంస గురు - సత్యాన్నీ, అసత్యాన్నీ వేరు చెయ్యగలిగే ఙానం కలిగిన ఉత్కృష్టమైన గురువు (చేత)
ఫణిత - చెప్పబడిన
చరిత్రే - చరిత్రగలిగినదాన!
బ్రహ్మవిష్ణుశంకర - త్రిమూర్తులు స్వయంగా
నుతి - స్తుతి (పొందడానికి)
పాత్రే - అర్హతకలదాన!

Wednesday, January 6, 2010

నిత్యజీవితంలో పద్యాలు!

ఈ మధ్యన మళ్ళీ చింతా రామకృష్ణారావుగారు, శైలజ గారు, ప్రియదర్శిని నా చేత కొన్ని పద్యాలు వ్రాయించారు. అవి ఇక్కడ వ్రాస్తున్నాను. విమర్శించ మనవి!

[ రామకృష్ణారావుగారు ఇచ్చట అడిగిన ప్రశ్నకు సమాధానం నేను "ఈగ" అనుకున్నాను. సమాధానం తప్పైనా, కవిత్వం బానె ఉంది అనిపించింది.]
ఆ:-
వంటలన్ని జుర్రి, మటుమాయమయ్యేను
కాని కిట్టమూర్తి కానె కాదు!
తేనెలూరు పెదవి, తెమ్మెరంటినడక
తమ్మితోన చెలిమి, తన్వి గాదు!

ఆ:-
ఇంటి మగువ పెదవి, యెరుపెక్కు చందాన
ముద్దులాడు గాని మొగుడు కాదు!
ఆవులించినంత ఆలపించును లాలి
అమ్మ కాదు జూడ, బదులు ఈగ!

[ముక్కుపుడక మీద పద్యం వ్రాయమని శైలజగారు అడుగగా]
కం:-
ముక్కెర తొడిగిన మానిని
చక్కని హాసము మనసున చల్లును మరులన్
ముక్కున పగడపు కాంతులు
పెక్కువ జేయవె కనుగవ వెండివెలుగలన్!

[పంచెకట్టు, నామం, జంధ్యం ఉండేట్టు ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగారు. నాకు వెంటనే మనసులో త్రివిక్రముడే (వామునుడు) మెదిలాడు. ఆయన నా చేత వ్రాయించుకున్న పద్యం.]
ఆ:-
పంచభూతములను పంచెగా ధరియించి
నుదుట నామమెట్టి వేదమెల్ల
ఉపనిషత్తులన్ని ఉపవీతముగ జేర
బలిని తుంచనరిగె వామనుండు

[సాంబారు వండాను అని చెప్తే ప్రియదర్శిని/శైలజగారు అది ఎలాగుంది అని అడుగగా చెప్పిన పద్యం]
కం:-
సాంబారని పిలిచి పెడితి
ఏం బావుళ్ళేదనుచును యెదుటనె మిత్రుల్
ఏం బాబూ! వంటెరుగని
సోంబేరిగ మిగిలితివని శోకించిరిటన్!

[అమ్మాయి కళ్ళ గురించి ప్రియదర్శిని చేత వ్రాయిద్దామనుకుని, ఆ భావావేశంలో నేనే వ్రాసిన పద్యం]
ఆ:-
వలపు కురియు వేళ నెలవంక చలువాయె
సిగ్గుపడగ లేతమొగ్గ మోడ్పు
కోపమొచ్చినంత కుంపట్ల సెగలాయె
పలికె భావమెల్ల భామ కనులె

[సన్నజాజి, మల్లె, సంపంగి, చామంతి - ఈ పూవులు ఉండేలాగ ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగితే వ్రాసినది]
తే:-
లేత బుగ్గలు చామంతులేమొ! కనగ
మృదులచంపకాలె సుదతి పెదవులేమొ!
సన్నజాజిరేకులవియె సఖియ పనులొ!
మల్లెమొగ్గలొ? మరులను చల్లు కనులొ!

[నాది "నూనుగు మీసాల నూత్నయవ్వనం", అని రామకృష్ణారావుగారు అభిప్రాయపడ్డప్పుడు]
కం;-
నూనుగుమీసములన్నియు
ఏనాడోపోయినాయి ఎన్నగనిపుడున్
ఏనుగు తొండము చందము
కానగ నా మీసకట్టు కవితాధారా!

[ఇక్కడ మీసాన్ని ఏనుగుతొండంతో కాకుండా తుమ్మెదతో పోల్చమని రామకృష్ణారావుగారు చెప్పగా, ఇలాగ మార్చాను. కొంచెం సరసం ఎక్కువున్న పద్యం చూసి తప్పుగా అనుకోరు కదా?]
నూనుగుమీసపు రోజుల?
ఏనాడో పోయినవవి యెన్నగనిపుడున్
పూనగవుల వేటాడగ
పూనిన తుమ్మెద కరణిని ముదిరెను మీసం!

Saturday, January 2, 2010

నిత్యజీవితంలో పద్యాలు

కళ నిత్యజీవితంలో భాగమైతేనే దాన్ని మనిషి అనుభవించగలడు. ఒకసారి గరికిపాటి వారు చెప్పారు, "అవధానం అభ్యసించడానికి నిత్యజీవితంలో ఏది ఎదురైనా దాని గురించి ఆలోచించేటప్పుడు పద్యరూపంలో ఆలోచించాలి", అని. అది అక్షరసత్యం అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యన నా కవితాశక్తిని పెంపొందించుకోవడానికి నేను వీలైనప్పుడల్లా పద్యాలు వ్రాస్తున్నాను. అలాంటి పద్యాలు కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. ఈ పద్యాలలో తప్పులను సరిచేసి, మరింత అందంగా అమర్చిన శ్రీ చింతా రామకృష్ణారావుగారికి నా ధన్యవాదాలు! ఇందులోని కొన్ని పద్యాలు ఆయనతో సంభాషిస్తూ వ్రాసినవే!

[ప్రియదర్శిని విఘ్నేశ్వరుని మీద వ్రాయమనగా]
ఆ:-
చందమామఁ బోలు చక్కని రూపంబు
చలువకనులు చల్లు చందనములు
జగతిఁ గాచునట్టి చక్కని దైవమా!
కావుమయ్య మమ్ము గణపతయ్య

[రామకృష్ణారావుగారు సరస్వతీదేవి కృప గురించి మాట్లాడుతుండగా]
ఆ:-
చక్కనైన కవిత జాలువారగనోట
చదువులమ్మ చలువు చాలు మనకు
ఆమె కనుల వెలుగు అంతరంగములోన
మెదలునంతవరకు పదములొలుకు!

[రామకృష్ణారావుగారి పద్యంలో లేని దోషాన్ని వెదికిన నా తెలివి పైన]
ఆ:-
మొదటి పాదమొదిలి మునకలేసితి నేను
అవకతవక మదికి అర్థమయ్యె
మీదు కవితలోన లేదండి దోషంబు
నాదు బుర్రలోన నాచుబట్టె!

[శైలజగారు "నూతనసంవత్సరం వచ్చినా స్నేహితుడితో అనుబంధము మారలేదు" అని అర్థం వచ్చేట్టు వ్రాయమని అడుగగా]
కం:-
నూతనవత్సరమడుగిడె
చైతన్యము నింపె మదిని చలువకలలతో
పాతాయెను కాలము, మరి
నీతో గడిపిన సమయము నిధిగా మిగిలెన్

[పై పద్యము నాకు నచ్చలేదు అని నేను అంటే, చక్కగా ఉందని అన్న శైలజగారి ఉదారస్వభావాన్ని వర్ణిస్తూ]
ఆ:-
తీపి పలుకు చూడ తేనెబొట్టుకరణి
పేర్మియున్న మనసు వెన్నపూస
పెంచుకున్న మంచి పంచదారకు సాటి
నెయ్యి కమ్మదనము నెయ్యమందు!

[ఇద్దరు ప్రేమికులు వారి బంధం కాలంతో పాటూ మారలేదు అని చెప్పుకునే విధంగా వ్రాయమని శైలజగారు అడిగిన సందర్భానికి]
కం:-
చేరితివే నా ముంగిట
తీరని మధుమాసమువలె తిరముగ నిలువన్
మారిన కాలము మురిసెను
మారని మన ప్రేమనుగని మదినిండంగన్

["నల్లని మేని", "తెల్లని కన్నులు", "ఎర్రని నామం", "పచ్చని పూమాల" - ఈ పదాలకు పర్యాయపదాలతో వేంకటేశుని మీద పద్యం వ్రాయమని శైలజగారు అడిగితే]
కం:-
నల్లని మేనియె చదలుగ
తెల్లని కన్నుల జిలుగదె తెలిపూవయె, రా
జిల్లెడి పూమాల పసుపు
విల్లెత్తిన కనులు మోసె పింజరనామం!

[ధనుర్మాసం హడావుడిలో పద్యానికి సందర్భం అడిగితే శైలజగారు "విష్ణువు", "పూమాల", "గోదమ్మ", "పొంగలి" - ఈ పదాలకు పర్యాయపదాలతో ఒక పద్యం చెప్పమన్నప్పుడు]
ఆ:-
పుష్పమాలబట్టి పూబాల గోదమ్మ
విష్ణుమూర్తి కనుల వెన్నెలాయె
వారి నడుమ వలపు వరమాయె కళ్ళకు
పొంగలేల మాకు భోజనముగ


[వేంకటేశ్వరుని పైన ఒక పద్యం వ్రాయమని శైలజగారు అడిగినప్పుడు]
కం:-
సిరులనొసగురేడు శేషశైలముపైన
కొలువుదీరె భక్తకోటి కొరకు!
ఏడుకొండలెక్కి ఏడేడులోకాల
కాయుచుండు వాడు కలియుగమున!


["స్వామి పదములు", "అవి చూసినప్పుడు పలికే పదములు(మాటలు)", "మొక్కిన చేతులు", "కలిగే అనందం" - వీటిని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమని శైలజగారు అడిగినప్పుడు]
కం:-
కరములు జోడించ కురిసె
స్వరములు నానోట స్వామి సన్నుతి సలుపన్
వరదగ పదములు పొంగెను
వరదుని పాదాలుజూడ పద్యము గూర్చన్

[రామకృష్ణగారు వేగంగా పద్యాలు అల్లుతున్నట్టు నేను అల్లలేక, అలిసిపోయి]
ఆ:-
పాలకడలి పైన పన్నగాగ్రణి ముందు
బీడు బావిలోని భేకమెంత
వెండికొండపైన వేల్పు చందము మీరు
క్రింది భూమిలోని క్రిమిని నేను

[రామకృష్ణగారితో మాట్లాడుతూ ఒక పద్యంలో ప్రాసనియమం వదిలేసినందుకు ప్రాయశ్చిత్తంతో]
ఆ:-
ప్రాస నియమమెరుగి పద్యాలనల్లితే
బాగుగానెయుండు పాఠకులకు
సూక్ష్మమెరుగలేక సుత్తిలాంటికవిత
చెప్ప మీకు చెవుల నొప్పి కలిగె