కన్నెపిల్లను వర్ణించవయ్యా అంటే తన విశ్వరూపం చూపించని కవి ఉంటాడా? అందులోనూ వేటూరికి ఈ మాట చెపితే, కపి~నేనంటూ, కపినే~నంటూ వచ్చేస్తాడు. అప్పుడు యే జంధ్యాలవంటి మహానుభావుడో కాస్త "చూసి వస్తే చాలు స్వామీ, కాల్చి రావక్కరలేదు", అని చెప్పకపోతే ప్రమాదమాయె ఈ సర్వబూతాత్మకుడికి. (మీరు సరిగ్గానే చదివారు: "అన్నిటిలోనూ బూతును చూడగలిగే వ్యక్తి", అని వేటూరిని ముద్దుగా ఇలాగ పిలుచుకుంటూ ఉంటాను.
ఇప్పుడు నేను చెప్పబోయే పాట "తెలుగింటి అమ్మాయిని" వర్ణించడానికి వేటూరి పెట్టిన ఒక ప్రమాణం. ఆ తరువాత తన ప్రమాణానికి తగ్గట్టు, "మంచి తెలుగుదనం ఉన్న బాణీ ఇస్తే చక్కని తెలుగుపదాలు కూరుస్తాను", అనే ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ, "పూసింది పూసింది పున్నాగ" లాంటి ఎన్నో గొప్పపాటలను వ్రాశాడు. ఇతర సినీకవుల్లో సిరివెన్నెల వ్రాసిన "చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా", అనే పాట ఈ పాటకు తుల తూగుతుంది అని నా నమ్మకం.
ఈ పాట, "ముద్దమందారం", అనే జంధ్యాల సినిమాలోనిది. రమేష్ నాయుడు స్వరపరిచిన ఈ పాటకి వేటూరి ఎంతో చక్కని ఉపమానాలతో తెలుగు ఆడపడుచును పొగుడుతూ పదాలను అల్లాడు. నాకు నచ్చిన విశేషాలు:
అడుగులా అష్టపదులా, నడకలా జీవినదులా?
విన్న ఆడపడుచు, ఆడనే పడిపోవాలని వేటూరి వ్యూహం అనుకుంటాను :) మరీ, ఆమె అడుగులని జయదేవుడి అష్టపదులతో (రాధాకృష్ణుల ప్రణయకలాపాలను రమ్యంగా చెప్పే పాటలు) పోలిస్తే అమ్మాయి ఏ పొన్నచెట్టో (అంటే రాధ పొన్నచెట్టూ దగ్గర కదా కృష్ణుడి కోసం వేచి చూసేది. అందుకే కొంచం శైలి మార్చాను.) ఎక్కి పడిపోదు? కన్నెపిల్ల అలాగ నడుస్తూ ఉంటే, ఆ గజ్జలమ్రోత నదులు పారుతుంటే వచ్చే శబ్దతరంగాలను పోలి ఉంటుంది అని, వేటూరి అభిప్రాయం. నాది కూడాను!
పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల సందళ్ళు
(కొంచెం సిగ్గుతో కూడిన నవ్వుతో) ఈ వాక్యం ఎందుకు నచ్చింది అంటే ఏం చెప్పమంటారు. కొన్ని కొన్ని విని సంతోషించాలి అంతే అంటాను :) "పొట్టిజుట్టు పొలతలూ కుళ్ళుకోవద్దు, జీనుపాంటుల జేజెమ్మలు ఉడుక్కోవద్దూ", అని తరువాతి రెండు వాక్యాలూ పూర్తి చేస్తే బాగుండు :P
కన్నెపిల్లా కాదు కలలకాణాచి
మరి ఇదే వేటూరికీ సామాన్యులకీ తేడా. "కాణాచి" అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే "inherited right", అని బ్రౌహ్ణ్య నిఘంటువు అర్థం చెబుతోంది. అంటే, "మా కలలన్నింటి మీదా హక్కుదారివి నువ్వే", అని చెప్తున్నాడన్నమాట! అమ్మ బాబోయ్! వేటూరి ఒక్కో సారి ఇలాగ శరీరంలేని విశేషణాలకు కూడా వరసలు కలిపేస్తుంటాడు, ఆడపిల్లల్ని పడెయ్యటానికి. మొన్నటికి మొన్న "ఏయ్ చికిత్తా, సొంపుల సొంత మేనత్త", అని ఒక హీరోయిన్ని ["అర్జున్" సినిమాలో] పడేశాడు.
మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు
"మలిసంజ" అంటే సాయంత్రం సూర్యాస్తమయవేళ. ఆ వెలుగు నారింజపండు రంగు లో ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయి బుంగమూతి (ఎర్రని పగడాలతో పోల్చాడు) పెట్టుకుని వడగళ్ళు కురిపిస్తోంది అని అలకే ఉబ్బితబ్బిబ్బయ్యేలాగా వర్ణించాడు. ఈ నారింజరంగులని వేటూరి ఇంకా వదల్లేదు. ఈ మధ్యన "స్వాగతం" అనే సినిమాలో "సాయంకాలం నీరెండల్లో, సాయం కోరే నారింజల్లో", అని ఈ నారింజని మలిపొద్దు వర్ణానికో, చెలికాడి చిలిపిదనానికో, చినదాని అందాలకో తెలియకుండా వాడేశాడు!
మల్లెపువ్వా కాదు, మరుల మారాణి! బంతిపూవా పసుపు కాలిపారాణి!
పొరబాటున అందరినీ ఆకట్టుకుంటున్నది మల్లెపూవు తావి ఏమో అనుకునేరు, కాదు ఈ ప్రేమదేవత! ఎరుపు, పసుపు కలిపి బంతిపువ్వులాగా ఉంది ఏమిటొ అనుకుంటున్నారా? అది ఆమె పారాణి పెట్టిన కాలు. ఎంత దారుణం స్వామీ, ఈ అమ్మాయి కోసం మల్లెపూవుని, బంతిపూవినీ తక్కువ చేసేస్తావా!
ఇలాగ పొగిడితే ఏ అమ్మాయి ఎలాగ ఫీల్ అవుతుందో నాకు తెలియదు కానీ, ఈ పాట విన్నప్పుడల్లా నాకు చందమామ పుస్తకంలో చంద్రబింబంలాంటి ముఖారవిందంతో కనబడే అందగత్తె గుర్తుకొస్తుంది.
చిత్రం: ముద్దమందారం
దర్శకుడు: కీ.శే. జంధ్యాల
సంగీతం: రమేష్ నాయుడు
గానం: బాలు
ముద్దుకే ముద్దొచ్చే మందరం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం, ముగ్ధశృంగారం
అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా?
పరువాల పరవళ్ళు, పరికిణీ కుచ్చిళ్ళు, విరివాలుజడకుచ్చుల్ల సందళ్ళు
కన్నెపిల్లా కాదు కలలకాణాచి, కలువకన్నులా కలలదోబూచి
పలుకులా రాచిలకలా?, అలకలా ప్రేమమొలకలా?
మలిసంజ వెలుగుల్లో నారింజరంగుల్లో, కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు, మరుల మారాణి, బంతిపూవా పసుపు కాలిపారాణి
12 comments:
మంచి పాటని గుర్తుచేశారు. నెనర్లు.
చాలా బాగా రాశారు.
సాహిత్యం అంటే నేను కూడా పడి చస్తాను.
అందులోనా వేటూరి గారు అంతే చాలా ఇష్టం.
ఇలాగే రాస్తూ ఉండండి.
beautiful
నా మాతౄ బాష తమిళమే . అయినప్పటికి వేటూరి గారి పొయటిక్ బ్యూటి గురించి ఎన్ని గంటలైనా మాట్లాడ గలను. ఇప్పటికి ఈ పాట ఉదహరించి విరమిస్తా
( మాటలు రాని కూతురిని సాగనంపుతూ తండ్రి పాడే పాట )
మాటలకే అందని మనస్సు చూపులతో తెలుసుకో రెప్పవలే కాచుకో
సినిమా: జస్టిస్ చౌదరి
ఈ పాటకు మీరు ఆ బిరుదు ఇవ్వాల్సిన పనేముంది?
మీరు కూడా బాగా రాయగలరు .వేటూరికి పోటీగా, మాకందుబాటులో మొదలెట్టేయరాదూ!
మల్లెపువ్వా కాదు, మరుల మారాణి! బంతిపూవా పసుపు కాలిపారాణి!...
ఇంచుమించు ఇవే పదాలతో - "మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి.." వీరిదేనా ?
జంధ్యాలగారు మొదట్లో వేటూరితోనే ఎక్కువగా పని చేశారు అండి. http://www.telugucinema.com/c/publish/starsprofile/Jandhyala_Songs.php చూస్తే మనకు అమరజీవి జంధ్యాలగారు సినిమాలు తీయడం మొదలుపెట్టిన కొత్తల్లో వచ్చిన సినిమా అనిపిస్తుంది. కాబట్టి ఇది వేటూరిగారిదే అని నాకు అనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఎక్కువ వివరాలు నాకు Internet లో దొరకలేదు :( ఈ పాట గుర్తుచేసినందుకు నెనర్లు!
@ మందాకినిగారు
మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు :)
సందీప్ గారు,
భలే మంచి పాటని గుర్తుచేసారు...మీ టపా చుశాకా నాకు ఇంకో పాట గుర్తుకొచ్చింది...
అమావాస్య చంద్రుడు లో "కళకే కళ ఈ అందము" పాట...అది అయితే నాకు ఒక అమ్మాయిని వర్ణించడానికి "benchmark" లాగా అనిపిస్తుంది...అది కుడా రాసింది వేటూరిగారే అనుకుంటా...
@శరచ్చంద్ర
ఆ పాట అద్భుతమైనది అండి. నాకు బాగా గుర్తు, ప్రతీ వాక్యం classic.
ఏమిటోనండీ, మీరిటువంటివి రాయడం, నేను చదివి పాటలు రెపీట్ మోడ్లో వింటూ పోవడం. అసలు జంధ్యాల- వేటూరి ఇద్దరూ మళ్ళీ తిరిగొచ్చేసి ఇలాంటి పాటలు చేస్తూ పోతే ఎంత బాగుండునో కదా! అదేమిటో ఆశ్చర్యం - ప్రతి పాటా అద్భుతమేనా?!- పదాలన్నీ విడగొట్టుకు తీయతేనియ అర్థాల పాకాలలో మనమిలా మునకలేయాల్సిందేనా!
కొన్ని గజళ్ళ స్టైల్లో చేసిన పాటలున్నాయి. అవి పాడుతా తీయగా్లో ఒకసారి జంధ్యాల స్పెషల్ ప్రోగ్రాం చేసినంత వరకూ నాకూ తెలీని పాటలు. అది బహుశా బాలు టేస్ట్ అయి ఉంటుంది. వీలు కుదిరినప్పుడు అవి కాస్త దొరకాబుచ్చుకుని మీదైన శైలిలో వివరిద్దురూ?
మానస గారు,
వేటూరి-జంధ్యాల జంట అద్భుతమండి. ఎన్ని పాటలు - ష్...గప్చుప్ చిత్రంలో "తెలుగందాలే" అనే పాట వినిచూడండి. అసలు వేటూరిలాగ తెలుగును మనం ప్రేమించగలమా అని అనుమానం కలుగుతుంది.
మీరు చెప్పిన పాటలను వెతికి చూస్తాను.
Post a Comment