కీ.శే. జంధ్యాలకి వేటూరి ఎన్నో చక్కని పాటలను వ్రాసాడు. సంగీతం పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న దర్శకుడి చేతిలో పడాలే కానీ, వేటూరి ఎంతో చక్కని తెలుగు పాటలు వ్రాస్తాడు. అలాంటి పాటల్లో "రెండు రెళ్ళు ఆరు" అనే సినిమాలో "కాస్త అందుకో" అనే పాట ఒకటి.
జంధ్యాల మాటలు వ్రాసాక వేటూరి పల్లవి వ్రాశాడో, వేటూరి పల్లవి వ్రాసాక జంధ్యాల మాటలు వ్రాశాడో తెలియదు కానీ, పల్లవి వేటూరి స్థాయికి తగ్గట్టు ఉంటుంది. "అరెరే భలే భలే" అనిపించే పదాలగారడీ తో మొదలుపెట్టి, "ఆహా, ఎంత చక్కని భావం", అని అనిపించడం వేటూరి శైలిగా చెప్పుకోవచ్చును.
సినిమాలో హీరో (వెంకట శివం) హీరోయిన్ని(విఘ్నేశ్వరి) ప్రేమించి "నా ప్రేమకు దరఖాస్తు పెట్టుకుందాము అనుకుంటున్నాను", అంటాడు. ప్రేమకు దరఖాస్తు అంటే ఏమిటో తెలియక తికమక పడ్డ హీరోయిన్‌కి అది ముద్దు అని తెలిసినప్పుడు వచ్చే పాట ఇది. పాట మొత్తంలో "ముద్దు" అని అనకుండా వ్రాసాడు వేటూరి. లేదు లేదు, గీతాంజలిలో "ముద్దు" మీద వ్రాసిన "ఓం నమః" పాటకు ఈ పాట పోటీ రాదు కానీ, లలితంగా సాగిపోయే పాట అవ్వడం చేత నాకు నచ్చింది.
కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో
"కాస్త", "దరఖాస్తూ", "ధర కాస్త" అంటూ ప్రాసను కాస్తూ వ్రాసాడు వేటూరి. "ప్రేమ వెల" గా ముద్దును వర్ణించడంలో సద్భావాన్నే జనాలు గ్రహించాలి అని అనుకుంటున్నాను :-)
చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?
చిరుగాలిని (స్వేచ్చ,వేగం) పురుషునితోనూ, కరిమబ్బును (గంభీరం/సిగ్గు) స్త్రీతోనూ పోల్చి, చిరుగాలి కరిమబ్బును తాకడాన్ని ముద్దుతో పోల్చి చెప్పాడు. స్త్రీ ముఖములో చిగురించే సిగ్గుతో కూడిన నవ్వును మెరుపుతో పోల్చడం, అలాగే మెరుపుని కరిమబ్బు నవ్వుతో పోల్చడం కూడా అద్భుతంగా అనిపించింది.
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
చందమామను చూసి ప్రియుణ్ణి గుర్తు చేసుకుంటూ మురిసిపోతున్న ఆడపిల్లకు సిగ్గుతో చెక్కిళ్ళు ఎరుపెక్కడాన్ని వెన్నెలగా కొత్త,చిలిపి నిర్వచనం ఇచ్చాడు.
దరి చేరి కూడా దరఖాస్తులేలా?
చివరలో ఆడపిల్ల అర్థం అయ్యీ కాకుండా ఉండేటట్టు "ఇంత దగ్గరలో ఉన్న ఇంకా దరఖాస్తులేల" అంటూ "ఇంకా మొహమాటం ఏమిటి?" అని చిలిపిగా అనడంతో ఈ "ధర లేని" పాట "కాస్తా" పూర్తి అయ్యింది.
చిత్రం: రెండు రెళ్ళు ఆరు
సంగీతం: రాజన్-నాగేంద్ర
రచన: వేటూరి
పాడింది: జానకి, బాలు
కాస్తందుకో, దరఖాస్తందుకో, ప్రేమ ధర కాస్తందుకో!
ముద్దులతోనే ముద్దరవేసి ప్రేయసి కౌగిలి అందుకో!
కాస్తందుకో, దరఖాస్తందుకో, భామ (?) ధర కాస్తందుకో!
దగ్గర చేరి దత్తతు (?) చేసి ప్రేయసి కౌగిలి అందుకో!
చిరుగాలి దరఖాస్తు లేకుంటే కరిమబ్బు, మేరుపంత నవ్వునా చినుకైన రాలునా?
జడివాన దరఖాస్తు పడకుంటే సెలయేరు, వరదల్లె పొంగునా కడలింట చేరునా?
శుభమస్తు అంటే దరఖాస్తు ఓకే!
చలిగాలి దరఖాస్తు తోలియీడు వినకుంటే, చెలి చెంత చేరునా చెలిమల్లే మారునా?
నెలవంక దరఖాస్తు లేకుంటే చెక్కిళ్ళు, ఎరుపెక్కిపోవునా? ఎన్నెల్లు పండునా?
దరి చేరి కూడా దరఖాస్తులేలా?
9 comments:
ఇది మంచిపాట...
అయితే ప్రేమ ధర కాస్తందుకో... అంటారా... నేనింకా ప్రేమ దరఖాస్తందుకో... అనే అనుకుంటున్నాను.
BTW ఇది ఏదో హిందీ పాటకి కాపీ... ఒరిజినల్ కాదు.
పాట గురించి చక్కగా వ్యాఖ్యానించారు, సందీప్ గారూ!
పాటను మించిన అందం ఉంది మీ భావాల్లో!
పాటను చాలా బాగా విశ్లేషించారు,నిజంగా ఆ పాట చాలా బాగుంటుంది.
ప్రేమ వేల ? నా లేక ప్రేమ వెల నా ?
ఆ... గుర్తొచ్చిందోచ్... ఆ హిందీ పాట యాద్ ఆరహీహె... తేరీ యాద్ ఆరహీహె...
@విజయక్రాంతిగారు
"ప్రేమ వెల" అండి. సరిచేసాను ఇప్పుడు. చెప్పినందుకు నెనర్లు :)
its dhaara
not dhara
Sandeep garu,
In the lyrics, for the second Question Mark (?):
It is not "Dattatu"... It actually is "Dastkatu"...which means "to sign" in Urdu...But here obviously Sri Veturi garu used in the meaning "to kiss"... Just sharing...
Aparna
అపర్ణ గారు, మీ వివరణకు అభినందనలు అండి.
Post a Comment