Friday, February 13, 2009

తెలుగు భారతికి వెలుగు హారతి

నేను వ్రాసిన అరకొర పద్యాలు టపావళి (బ్లాగు) లో చదివి కొంతమంది ఔత్సాహిక తెలుగు పద్యకర్తలు జేరి నన్ను వాళ్ళల్లోకి కలుపుకున్నారు. అందరూ "ఉగాది కవి సమ్మేళనం" పేరిట ఒక ఈమెయిలు ప్రారంభించారు. అందులో చాలా చక్కని కవితలు వ్రాసారు. నేను కూడా ఒక మంచి కవిత వ్రాద్దాం అని నిర్ణయించుకుని ఆ తల్లికి నమస్కరించుకుని కలం పట్టాను. ఏ ముహూర్తం లో మొదలెట్టానో నిజంగా మంచి కవితే మనసులో కలిగింది. అంతా ఆ జగదంబ కృప.  నేను వ్రాసిన కవితకి ఒక కవివర్యుడు (డా|| ఆచార్య ఫణింద్ర) సవరణలు చేసి, ఈ రెండు పద్యాలు ఇచ్చారు.


సీ:-
మత్త కోకిల జేరె మందారమై సిగన్, తేటగీతి నుదుట తిలకమయ్యె
దండకమ్ము మెడను దండయై తరియించె, కందముల్ కదలాడు కర్ణికలయె
సీసమాయెను తల్లి చీనాంబరపు చీర, ఆట వెలది అమ్మ పైట చెంగు
పంచ చామర మామె వడ్డాణమై నిల్చె, అశ్వ గతులె కాలి అందెలయ్యె

తే:-
గజ విలసితముల్ బంగారు గాజులయ్యె
మంజు భాషిణుల్ పాదాల మట్టెలయ్యె
వివిధ ఛందముల్ భూషలై వెలుగుచుండ
తెలుగు తల్లి అందముగ మూర్తీభవించె

ఇందులో విశేషం ఏమిటి అంటే, ప్రతి సీసపద్యానికి వెనక ఆటవెలది, తేటగీతి పద్యం వ్రాయడం రివాజు. అలాగే సీసపద్యాలు పొడవుగా ఉంటాయి. అందుకని సీసాన్ని చీరతోను, ఆటవెలదిని పవిటకొంగుతోనూ పోల్చడం జరిగింది.

No comments: