Sunday, April 17, 2022

ఎన్నియల్లో మల్లియల్లో

ఒక్కోసారి వేటూరి పాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. పదాల అల్లికలో పచ్చి శృంగారాన్ని దాచేసిన వైనం చూస్తే పట్టపగలు బ్యాంకుదోపిడీ చేసి రోడ్డు మీద నిర్భయంగా నడిచినవాడిలా అనిపిస్తారు. మొన్ననే ఎందుకో శివ సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది. సరే విందాం కదా అని కూర్చుని, వినగానే ముక్కున వేలేసుకున్నాను.

సున్నితంగా "ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు, ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు" అని పాట మొదలైంది. అతడి స్పర్శకి ఆ అందమైన అమ్మాయి మెలికెలు తిరుగుతోంది అనడం బాగుంది కదా అనుకున్నాను. ఆత్రంగా మొదటి చరణం విన్నాను. "సిగ్గేయగా బుగ్గమొగ్గ మందారధూళే దులిపే" - అమ్మాయికి సిగ్గేస్తే మొగ్గలాంటి లేత బుగ్గ ఎఱ్ఱబడింది అనడానికి మందారధూళి దులిపింది అనడం బాగుంది. ధూళి అంటే పరాగం (పుప్పొడి) అని కూడా అర్థం ఉంది. పువ్వులలో పుప్పొడి, తేనె రెండూ ఆస్వాదించడానికి తేనెటీగలు వస్తాయి. ఒకే వాక్యంలో మహానుభావుడు శ్లేష కూడా విసిరి, రెండు శృంగారవంతమైన అర్థాలను వినిపించారు. ఇక ఆపైన వాక్యాలలో దాపరికం ఏమీ లేదు. "(ఆ) ఒత్తిళ్ళతో ఒలిచేస్తుంటే వడ్డించనా వయసంతా", "(అ) వెలుగులో కలబడే కళలు కన్నా, తనువులో తపనలే కదిపిన కథకళిలోన" అని రాస్తే ఏమని వివరించాలి, ఆ భావనాపటిమకు చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప? వారి గదిలో ఒక చిన్న దీపం ఉంది అని గుర్తించి ముందుకు నడవడమే. అది చిన్న దీపం అని ఎందుకు అనుకోవాలంటే దానికి వెంటనే రెండో చరణంలో జవాబు ఇచ్చారు.

"(అ) ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలణిగే, (ఆ) ఈ దివ్వెల క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే" - చీకటే ఆమె చీర అట, దివ్వెల క్రీనీడలు ఆమె మీద నెమ్మదిగా పడుతున్నాయట. "(అ) నీ మబ్బులే గుడికడుతుంటే జాబిల్లిలా పడుకోనా" - అతడు మబ్బులా ఆమెను కౌగిలించుకుంటే చంద్రుడిలా ఆమె నిద్రపోతుందిట. ఈ భోగంలో అనురాగం కొంత పలికించారు - సంతోషం! ఇదంతా రాత్రి సంగతి ఐతే పొద్దున్న పరిస్థితి వర్ణిస్తూ పాట ముగించారు "(ఆ) ఉదయమే అరుణమై ఉరుముతున్నా, చెదరని నిదురలో కుదిరిన పడకలలోనా" - అలసిపోయి పడుకున్న వీరికి పొద్దున్న సూర్యకాంతి తగిలితే ఉరుములలా తోచిందట, ఐనా నిదుర చెదరకుండా పడుకున్నారట. అసంపూర్ణంగా వదిలిన చరణం చివరి వాక్యానికి పల్లవిని కలుపుకుందాం అంటే ఉదయపుటరుణానికి ఎన్నియలకి వైరమాయె! చంద్రుడిలో మచ్చలను వెతకడం కంటే వెన్నెలను ఆస్వాదించడమే నయం కాబట్టి పాటను మళ్ళీ మళ్ళీ తలుచుకుని సంబరపడుతున్నాను.

పాట చూసిన తరువాత అనిపించిన విషయాలు. పాటలో చీర ఉంది కానీ అమల ఎక్కడా చీర కట్టుకోలేదు. ఆమె నృత్యం చక్కగా చేసింది - నాగార్జున ఆమె ముందు తేలిపోయాడు. బాలు, చిత్రం గానం గురించి చెప్పుకోవక్కరలేదు. ఇళయరాజ బాణీలకు కొంచెం భిన్నంగా ఉండే బాణీ ఇది - చాలా నచ్చింది. ముఖ్యంగా చరణాలలో ఆఖరి నాలుగు లైన్లకు బాణీ అద్భుతం. పాటకు సెట్స్, ఆర్ట్ అంత కుదరలేదు అనిపించింది. కాకపోతే ఇదే సినిమాలో "సరసాలు చాలు శ్రీవారు" పాటకు కూడా సుమారుగా ఇదే సందర్భం, సెట్ కాబట్టి ఇలాగ చేసారేమో అనిపించింది.


చిత్రం: శివ (1989)
సాహిత్యం: వేటూరి 
సంగీతం: ఇళయరాజ
గానం: బాలు, చిత్ర

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వితల్లో తుళ్ళింతల్లో ఎన్నెన్ని కావ్యాలో 
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్ళంటుకుంటే చాలు నాట్యాలు
 
సిగ్గేయగా బుగ్గమొగ్గ మందారధూళే దులిపే
జారేసిన పైటంచున అబ్బాయి కళ్ళె నిలిచే
సందేళకే చలి వేస్తుంటే అందించవా సొగసంతా
ఒత్తిళ్ళతో ఒలిచేస్తుంటే వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కళలు కన్నా
తనువులో తపనలే కదిపిన కథకళిలోన

ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలణిగే
ఈ దివ్వెల క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడికడుతుంటే జాబిల్లిలా పడుకోనా
తబ్బిబ్బుతో తడబడుతుంటే నీ గుండెలో నిదురోనా
ఉదయమే అరుణమై ఉరుముతున్నా 
చెదరని నిదురలో కుదిరిన పడకలలోనా


1 comment:

durga said...

అయ్య నమస్కారం ఈ సినిమా రచయతలు వచ్చిన సందర్భాన్ని వాళ్ళకనుగుణంగా మలచుకోవడంలో సిద్ధహస్తులు. మీరు చెప్పినట్టు వేటూరి గారి తరువాత సిరివెన్నెల గారు అంతే ఓ సారి ఏప్రిల్ 1st విడుదల సినిమాలో పాట చూస్తే

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే
బద్నామి శుభగే త్వంజీవ శరదశ్శతంత్వంజీవ శరదశ్శతం త్వంజీవ శరదశ్శతం
లాలిలాలిలాలి ... లాలిలాలిలాలి లాలీ లాలీ ... లాలీ లాలీ
కాంక్షలో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
దీక్షగా ఓర్చుకున్నా మోక్షమే ఉండదా
శ్వాసలో మోహదాహం గ్రీష్మమై వీచగా
వాంఛతో వేగు దేహం వరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయవా
మౌనమే గానమయ్యే మూర్తమే చూడవా 
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ
నిష్ఠగా నిన్ను కోరీ నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుగారే జ్వాలలోడించినా
నేర్పుగా ఈదిచేరే నిశ్చయం మెచ్చనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మధనమే అంతమయ్యే అమృతం అందుకో
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ మోవినీ మగతావినీ ముడివేయనీయవా
కాదని అనలేననీ ఘడియైన ఆగవా
అదుపు పొదుపూ లేని ఆనందం కావాలి
హద్దూ పొద్దూ లేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలు మరీ హాఆఆఅ...