Sunday, February 24, 2013

అమ్మవారి పైన కొన్ని పద్యాలుఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. 

తోటకం
కలుషారికి మంగళకారిణికిన్
కలితామృతకావ్యవికాసినికిన్
కలకంఠికి శ్రావ్యసుగానఝరీ
జలదాయినికిన్ నమ (నతి) శారదకున్


అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు దిద్దిన శక్తి. ఆవిడ వలనే మనకు ఈ ప్రపంచం ఇన్ని హంగులతో కనిపించి ఆకర్షిస్తోంది. ఆవిడ తలుచుకుంటే ఈ చిక్కునుండి ఒక్క చిటికలో విడిపించగలదు. అలాగ చేస్తే మఱి సృష్టి ఎలాగ కొనసాగుతుంది?

మత్తేభం
తగునా ఈ నలుసంటి జీవి మదిలో దట్టంపు చీకట్లిలా
ఎగదోయన్? దిశ కానకున్నది గదా! ఏ వైపుకుంజూచినా
పగిలే నమ్మిక గాదు నాది జననీ, బ్రహ్మైక్యసంధాయినీ
దిగులొందన్ తిమిరాపహా! ఎరుగనే దీపాంధముల్ నీవుగా?

మత్తకోకిల
చెల్లు దాగుడుమూతలాడుట చిట్టిపాపడి ఖేలకున్
తల్లిగానక పాపయేడ్వగ తానుగా దరిఁజేరదే?
తల్లడిల్లితి నిన్నుఁజూడక దర్శనంబుకుఁ జాలనే?
ఒల్లకుంటివి నాదు ప్రార్థననొందవా దయ శంకరీ!

మన దేశంలో గొప్ప గొప్ప ఋషులు, మునులు, కవులు కూడా స్త్రీని ఎంత శృంగారవతిగా వర్ణించినా తల్లిగానే భావించారు. అది మన సంస్కృతి. రమణ మహర్షీ, రామకృష్ణ పరమహంస ప్రభృతులు వేశ్యలలో కూడా అమ్మవారిని చూసారు. అలాంటి ద్రష్టలు, మహానుభావులు నడిచిన ఈ దేశంలో స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలను గురించి విన్నప్పుడల్లా మనసు రగిలిపోతుంది. మొన్న డిసంబర్లో ఢిల్లీ జరిగిన ఘోరాని గురించి విని వ్రాసిన పద్యాలు. 

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తహ్ ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

శంకరాచార్యుల సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోని తొలి రెండు పాదాలు ఇవు. వీటి భావం "అమ్మవారు లేకుండా శివుడు కొంచెం కూడా స్పందించలేడు" అని. ఈ భావానికి "శివాజ్ఞ లేక చీమైనా కదలదు" అనే నానుడికి కలిపి వ్రాసిన మొదటి రెండు పాదాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినవి. చివరి రెండు వాక్యాలలో కొమ్మ అనే పదంలో శ్లేష వేటూరి ప్రభావం.

ఆటవెలది

శివునియాజ్ఞ లేక చీమయు కదలదు
శక్తి లేక శివుడు జరుగలేడు
మగువ లేక జగతి మనలేదు క్షణమైన
ననిన ధర్మభూమి మనది గాదె?

అట్టి మాటలన్ని వట్టివాయెను నేడు
ఆడుదాని బ్రతుకు మోడు బారె
కామరోగులైరి కర్కోటకులునైరి
పుణ్యభూమిలోని పురుషులెల్ల

ఇట్టి మనుషులున్న మట్టిలో నే రీతి
సుఖము, శాంతి, కీర్తి, శొభలుండు?
అధములెల్ల జేరి యాధారమౌ కొమ్మ
నెంత క్రుంగదీయనంత హాని

తెలుగులో వెలది అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. తత్ఫలితంగా ఆట-వెలది అంటే ఒక చెడ్డ అర్థం కూడా ఉంది. స్త్రీల పట్ల మన సంస్కృతికి ఉన్న గౌరవాన్ని ఆ పద్యరీతిలో చెప్పడం వలన ఆ అర్థం వ్యర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇదే విషయమై వేటూరి చేసిన ఒక చిన్న ప్రయోగం చెప్పాలి. "సిరికాకొలను చిన్నది" నాటికలో ఒకడు ఒక దేవదాసిని (కథానాయిక) చూసి "ఆ వెలది ఆట-వెలదా?" అంటాడు. దానికి మఱొకడు "ఆట-వెలదో కోవెలదో" అంటాడు. పరమాత్మ విగ్రహరూపుడై గుడిలో ఎలాగ కొలువుతీరతాడో, ప్రతి మనిషీ దేహరూపాన్ని ఒక స్త్రీ గర్భంలోనే పొందుతాడు. అందుకే ప్రతి స్త్రీ ఒక కోవెల వంటిది. ఈ మాట ఆమె నడవడి, వ్యక్తిత్వం, మంచి/చెడుకి సంబంధం లేకుండా వర్తిస్తుంది. దానికి రమణ మహర్షి వంటివారే నిదర్శనం. 

2 comments:

మనోహర్ చెనికల said...

పుణ్యభూమిలోని పురుషులెల్ల, అన్నారు.
ఇంకా ఈ లోకంలో రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని బతికేవాళ్ళు కూడా ఉన్నారండీ. అందరినీ ఒకటే గాటన కట్టడం సమంజసమంటారా?

Sandeep said...

సందర్భాన్ని బట్టి మాట అర్థం మారుతుంది అండి. "ఎల్ల" అంటే "ప్రతి ఒక్కడూ" అని అనుకోవడం కంటే "ఎక్కువ పాళ్ళు" అనుకుంటే సరిపోతుంది. ఈ పద్యం ఉద్దేశం ప్రతి మగవాడూ దుష్టుడు అనడం కాదు అన్నది నిర్ద్వంద్వం. మరి ఈ భూమిలోనే శృంగేర్యాది పీఠాధిపతులు కూడా ఉన్నారు కదండి?