Sunday, February 24, 2013

కొన్ని పద్యాలుమనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.


4 comments:

లక్ష్మీదేవి said...

బాగున్నాయండీ!

కనకాంబరం said...

యువత తెలుగు సాంప్రదాయ రీతుల పద్య సాహిత్యం రాయాలని ఉత్సాహ పడటం పట్టుదలతో చందోబద్ధ కవిత్వం సృష్టించడం అభినందనీయం.చాల బాగుంది మీ పద్యసాహిత్యమున్నూ డియర్ ప్రకాష్ మల్లవోలు....శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాంబరం)

Sandeep P said...

@కనకాంబరం

నెనర్లు అండి!

శ్యామలీయం said...

పద్యాలు చాలా బాగున్నాయి.

(అన్నట్లు తోతకంలో మూడవపాదంనుండి నాల్గవపాదానికి ప్రవాహగుణంతో మాట కొనసాగించారు. తెలుగులో తప్పుకాదు. వీలయితే తోటకం ఏ పదానికాపాదం విరిగేలా వ్రాయండి - ఇంకా బాగుంటుంది)