Saturday, May 4, 2013

రాధమ్మ రాకుందే ఏమైనదో!


2009 లో మలయాళంలో పళసి రాజా అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం కేరళను పరిపాలించిన ఒక రాజు జీవిత చరిత్రను ఆధారం చేసుకుని తీయబడింది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించగా ఒ.ఎన్.వి.కురుప్ అనే రచయితా సాహిత్యాన్ని అందించారు. ఈ చిత్ర నేపథ్య సంగీతానికి గాను ఇళయరాజాకి జాతీయ పురస్కారం లభించింది.

ఈ చిత్రం లో నాకు బాగా నచ్చిన పాట "కుణ్ణత్తే కుణ్ణక్కుం" అనే పాట. ఈ పాటను ఆలపించినది తేనేగొంతు చిత్ర. పాట  అంతా లాలిత్యంతో నింపేశారు ఇళయరాజా, చిత్ర. దర్శకుడు చూడటానికి కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు. నాకు ఈ పాటకు సందర్భం, భావం తెలియవు కానీ -- ఇది శృంగారం కలిసిన పాట అని అనిపిస్తోంది. ఏది ఏమైనా ఇంత మంచి బాణీకి తెలుగులో కూడా పదాలను అద్దితే బాగుంటుంది అనిపించింది.

కొంతసేపు భక్తి పాటగా మారుద్దామా అనుకున్నాను కానీ మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. భక్తీ, రక్తీ కలిసింది ఏమిటా అని కాస్త ఆలోచించగా రాధాకృష్ణులు గుర్తొచ్చారు. సరే వారి మీదనే పాట వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఎప్పుడూ కృష్ణుడి కోసం రాధ పరితపించిపోతున్నట్టు వ్రాస్తారు కాబట్టి ఈ సారి తారుమారు చేసి కృష్ణుడు రాధ కోసం తపిస్తున్నట్టు వ్రాసాను. ఎంత పరబ్రహ్మ అయినా మాయని విడిచి ఉండలేదు కదా? ఆ తత్త్వాన్నే ఈ పాటలో కూడా నింపుదామని ప్రయత్నించాను. ఎంత వరకు సఫలీకృతుడిని అయ్యానో చదువర్లు చెప్పాలి.

ఎప్పటి లాగా మొదట చరణాలు వ్రాసి తరువాత పల్లవి వ్రాసాను. అందుకని చరణాలు బాగా వచ్చాయి కానీ తెల్లారుకట్ట 3 గంటల నుండి 4 గంటల వరకు వ్రాసిన పల్లవి అంతగా రుచించలేదు.

రేయమ్మ నింగంతా ముగ్గేసినా
రాధమ్మ రాకుందే ఏమైనదో!
మువ్వల సవ్వడి కానరాదేఁ?
నవ్వుల పువ్వులూ పూయలేదేఁ?
కలతో, ఇది అలకో, నలతో, విధి నడతో
మగువా, ఇది తగవా, నువు బిగువు నగము దిగవా?

అభౌతికమన వస్తువులకు "అమ్మ" ని చేర్చడం వేటూరి దగ్గర నుండి నేర్చుకున్నాను. ఉదాహరణకు ఆయన "నిదురమ్మ పలకరింతా నివురాయె వలచినంత" అని వ్రాసింది విని నేను ముగ్ధుణ్ణి అయ్యాను . ప్రేమలో పడగానే నిద్ర పట్టడం మానేసింది అని తరతరాలుగా కవులు చెప్తూనే ఉన్నారు. కానీ వేటూరి అదే విషయాన్ని ఎంత వినూత్నంగా చెప్పారో చూడండి. అప్పటినుండి నాకు అది భలేగా నచ్చేసింది. ఇప్పుడు నా నోట వచ్చింది.

రేయి నింగి వాకిట్లో చుక్కలతో ముగ్గేసింది అంటే చీకటి పడింది అని అర్థం. చుక్కలతో ముగ్గు అని చెప్పేంత చోటు లేక చుక్కలను ప్రత్యేకించి చెప్పలేదు. ఆఖరి రెండు పంక్తులలో ఇంకొంచెం పొంతన ఉంటె ఇంకా బాగుండేది అనిపించింది. ఒక పావు గంట ఆలోచిస్తే ఏమైనా తట్టేది ఏమో కానీ -- ఇప్పటికే నాలుగైంది. అందుకని ఇక్కడితో ముగించాను.

కొయ్యకు ఊపిరినూదగా నాదు వూపిరి లేదుగా
        నీ సుగంధము లేని గాలిని పీల్చలేను ప్రియా
రేగే వేణువు మూగదై గోకులంలో వ్యాకులం
        నిండెనే మది ఎండెనే తొలివానవై రావా
సాయంత్రం వాడెనే, నా శాంతం ఓడెనే
ఏకాంతం వాడలో, నిట్టూర్పు వేడిలో
కలనో, నే కలనో లేనో తెలియకుంది, తెలుసా?

రాధ పరిమళం నిండని గాలిని పీల్చలేని కృష్ణుడు మురళిలో మాత్రం గాలిని ఎలాగ ఊదుతాడు చెప్పండి? ఆ మురళీరవం వినని గోకులంలో మనశ్శాంతి ఎలాగ ఉంటుంది? సాయంత్రమయ్యే కొద్దీ కృష్ణుడి ఓర్పు, ఆశ సన్నగిల్లుతున్నాయి. ఆ విరహంలో "ఇది కలా నిజమా? అసలు నేను అంటూ ఉన్నానా లేనా?" అనే ప్రశ్న కృష్ణుడిలో వచ్చింది.

వేచున్నా నే హంసనై వేఱు చెయ్యగ పాలని    
        జాడ కానదె! కంటనున్నవి నీటిబిందువులే
మూగే గోపికలెందరో మేను మేలిమికేమిలే!
        తేనె చూపులు కోఱి నా మది వేగుతున్నదిలా 
రాధందం రాధదే, ఈ గోవిందుడు రాధకే
వేదాంతం పాడినా, ఈ అనుబంధం వీడునా?
లలనా! మనగలనా? నీవు గాక నేను వేఱు గలనా?

హంస పాలు-నీళ్ళు కలిసి ఉంటె వాటిలో పాలను మాత్రమె తాగి నీళ్ళను విడిచిపెడుతుంది అంటారు. అలాగ కృష్ణుడు సామాన్యమైన గోపికల మధ్యలో రాధ కోసం వేచి ఉన్నాడు. కానీ కళ్ళకు నీళ్ళు (గోపికలు) కనిపిస్తున్నాయి కానీ పాలు (రాధ) కనిపించట్లేదు. ఇక్కడ శ్లేష ఏమిటంటే ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని. ఈ ప్రయోగం నాకు బాగా సంతృప్తిని ఇచ్చింది.

గోపికలందరూ అందంగా ఉండచ్చును కానీ వాళ్ళలో కృష్ణుడిపై రాధకు ఉన్నంత అవ్యాజమైన ప్రేమ లేదు. ఆమె చూపులోనే అనురాగపు తేనె తీయదనం ఉంది. అందుకే రాధ అందం రాధకు మాత్రమె ఉంది. గోవిందుడు ఆమెకే అంకితం. కృష్ణుడు స్వయానా భగవద్గీత (వైరాగ్యం) చెప్పినా, ఆయనకు రాధతో అనుబంధం తీరదు. అదే ఆయన "నువ్వు లేక నేను మనగలనా? అసలు నేనంటూ వేఱే ఉన్నానా?" అంటూ ఆమెను వేడుకుంటున్నాడు.



ఒక చిన్న వ్యాఖ్య: ఈ పాటలో కృష్ణున్ని తక్కువ చేసి చూపించాలని నా ఉద్దేశం కాదు. ప్రకృతీపురుషులకు పరస్పరం ఆరాధన ఉండాలి అని మాత్రమె నా ఉద్దేశం. 

Friday, May 3, 2013

తెలుగందాలే - వేటూరి

ఈ వ్యాసం మొదట వేటూరి.ఇన్ లో వెలువడింది. దయచేసి వేటూరి.ఇన్ ని సందర్శించి ఆ వెబ్సైటు ని విజయవంతం చేయగలరు అని ప్రార్థన.



“ష్ గప్‌చుప్” సినిమాలోని ఈ పాటలో తెలుగుదనాన్ని కాచి వడబోసారు వేటూరి. మాట మాటలో తెలుగుదనాన్ని నింపారు. మాటి మాటికీ తెలుగు ధనాన్ని గుర్తు చేసారు. ఇలాంటి పాట వ్రాయాలన్నా, చిత్రంలో పెట్టుకోవాలన్నా చాలా తెలుగుప్రేమ కావాలి. ఆ ప్రేమ సినిమా ఫంక్షణ్లలోనూ, రాజకీయవేదికలలోనూ వాడుకునే ప్రేమ కాక, మనసులో పొంగిపోయే ప్రేమ అయ్యి ఉండాలి. అది జంధ్యాలకు, వేటూరి కి ఉంది.

తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా
మకరందాలే మది పొంగి పొంగి పోయెనమ్మ తుంటరిగా
అమ్మడి సిగ్గులే గుమ్మడి పువ్వులై
పిల్లడి పల్లవే పచ్చని వెల్లువై
కాటుకాకళ్ళలో కన్నె వాకిళ్ళలో

పాటను మొదలు పెట్టడమే తెలుగుతో మొదలుపెట్టి శ్రోతకు రాబోయే తీయదనాన్ని సూచించారు. అమ్మాయి తెలుగు అందాలు అబ్బాయి గుండెను తొలకరి (తొలిప్రేమ) లాగా తాకాయి,ఆమెలో వలపుతేనె(మకరందం) మనసు దాటి తుంటరిగా బయట పడుతోంది అట. ఇలాంటి సున్నితమైన భావాలను తెలుపడం ఈ మధ్యన పాటల్లో కరువైపోయింది అని అనిపిస్తోంది. జొన్నవిత్తుల వంటి రచయితలు కొంచెం ఆశని కలిగిస్తున్నారు కానీ వారికి ఎంతవరకు అవకాశం దక్కుతుందో చూడాలి.
పల్లవి దాటిన వెంటనే అమ్మాయి సిగ్గుని, గుమ్మడి పువ్వుతో పోల్చారు. గుమ్మడి పువ్వులు ఎంత పసుపుపచ్చగా అందంగా ఉంటాయి . ఇదివరకు ఆడవాళ్ళు ముఖానికి పసుపు రాసుకోవడం వలన ఈ పోలికకు మరింత లోతు ఏర్పడింది. అబ్బాయి ఉత్సాహాన్ని జీవానికి సంకేతం అయిన పచ్చని పొలాలతో పోల్చింది. అన్నపూర్ణ ఐన ఆంధ్రదేశంలో పచ్చందనం కంటే మంచి ఉపమానం  దొరుకుతుందా?

తిక్కనలో తీయదనం లిపి చక్కని నీ కన్నెతనం
పోతనలో రామరసం, వడబోసెను నీ ప్రేమరసం
ప్రాయానికే వేదం, నవపద్మావతీపాదం
రాగానికే అందం రసగీతగోవిందం
వంశధార ఒడిలో హర్షవల్లికా
సూర్యకాంత వీణారాగదీపిక

తిక్కన కవిత్వంలో తీయందనం కొత్త ఉపమానం కాకపోవచ్చును కానీ “లిపి చక్కని నీ కన్నెతనం” అనడం లో వేటూరి దస్తూరి కనిపిస్తోంది. ఒక మంచి భావాన్ని ఎవరు వ్రాసినా దాని లోతు అలాగే ఉంటుంది. చక్కని పద్యాన్ని అందమైన దస్తూరితో వ్రాస్తే అది చదివేటప్పుడు ఇంకా ఆవేశం కలుగుతుంది .అలాగే అమ్మాయి ఎవరైనా ఆమెలో సహజంగా సౌందర్యం ఉంటుంది. కానీ లిపి చక్కని అనడంలో ఆమె ఆకృతి కూడా చక్కగా ఉంది అని అంటున్నారు.
ప్రేమ అనే పదాన్ని తెలుగు ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారు అని నా ఉద్దేశం. వైదిక సాహిత్యంలో  ప్రేమ అనే పదానికి చాలా లోతుని కల్పించారు. (భగవంతునిపై) ప్రేమ కలిగిన వ్యక్తికీ వేరే ధ్యాస ఉండదు. జీవన్మరణాలు దానిలోనే. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రాలు, ప్రజలు ఆకర్షణకి, కోరికకి, వెఱ్ఱికి, ప్రణయానికి కూడా ఈ పదాన్ని వాడేస్తున్నారు. వేటూరి చాలా పాటలలో ప్రేమని సులువుగా వాడేసారు కానీ ఈ చరణంలో కాస్త లోతును కల్పించారు. పోతనలో రాముడి పై ఉన్నంత ఆవేశం, నాయకుడిలో నాయికకై ఉంది అని ఆమె నమ్మకం. చక్కని ఉపమానమ్. ఇక్కడి దాక తెలుగు కవుల ప్రస్తావన చేసారు.
ఆ పైన, ప్రాయానికి నడక నేర్పించేది పద్మావతి దేవి కొత్త అవతారంలాగ కనిపించే నాయిక యొక్క పాదం అంటూ తిరుపతిని గుర్తు చేసారు. ఆ పైన కొంచెం తూర్పుకు వెళ్లి జయదేవుని గీతాగోవిందం సంగీతానికి అలంకారంగా కొనియాడారు. ఇక్కడ సందర్భానికి అది నాయకుడి ప్రేమగీతంగా భావించాలి అని నా నమ్మకం. ఆంధ్రప్రదేశ్ కి తూర్పున వంశధార నది ఉంది. ఆ నది దగ్గర హర్షవల్లి (అరసవల్లి) అనే ఊరిలో సూర్యుని గుడి ఒకటుంది. ఆ గుడితో (సూరుని తేజస్సు) అమ్మాయిని పోల్చారు. తనను తాను సూర్యకాంతగా (సూర్యుని అంశతో జన్మించిన స్త్రీ)  అంగీకరిస్తూ, ఆ కాంత (జీవన) వీణా రాగం అతడేనని నాయిక చేత చెప్పించారు.

క్షేత్రయలో జాణతనం, వరదయ్యెనులే వలపుతనం
అందని నీ ఆడతనం, అమరావతిలో శిల్పధనం
ఏడుగ చీలిందిలే నది గౌతమి గోదావరి
ఏకం కావాలిలే ఏడు జన్మలబంధాలివి
కృష్ణవేణి జడలో శైలమల్లిక
శివుని ఆలయాన భ్రమరదీపిక

ఈ చరణం మొదటి పంక్తిలో వేటూరి చిన్న ప్రయోగం చేసారు. క్షేత్రయ్య అన్నా, వరదయ్య అన్నా ఒక్కరే. క్షేత్రయ్య శృంగార గీతాలలో జాణతనం వరదయ్యింది అంటూ వరదయ్య అనే మాటను కూడా కలిపారు. అమ్మాయి అందాన్ని అమరావతిలో శిల్పసంపదతో పోల్చారు.
గోదావరి ఏడూ పాయలుగా విడిపోయినట్టు నాయికానాయకుల బంధం కూడా ఏడూ జన్మలుగా విభజించబడింది. ఆ బంధాన్ని సంపూర్ణంగా ఈ జన్మలో సాకారం చేసుకోవాలి అని నాయకుడు ఆశగా వర్ణించారు. ఆ బంధం కృష్ణవేణి (వేణి అంటే జడ లేక పాయ/నది. అందుకే కృష్ణ వేణి అంటే నల్లని జడ అని ఒక అర్థం; కృష్ణా నది అని మరొక అర్థం; అలాగే తెలుగునాట కృష్ణవేణి అనేది ఒక స్త్రీనామంగా కూడా వాడతారు) జడలో శ్రీశైలం అనే మల్లెపువ్వు వంటిది; ఆ శ్రీశైలంలో శివుని ఆలయంలో భ్రమరాంబికా దేవి ముందు వెలిగించిన దీపం వంటిది అంటూ పాటను ముగించారు.
ఈ పాట యువకవులకు ఒక పాఠం. ప్రతి కవితకూ ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువుని పట్టుకుని అటు పీకి, ఇటు పీకి కవిత్వం వ్రాయడం రివాజు. ఒక పది ఉపమానాలు ఐదు అతిశయోక్తులు కలిపి చెప్పడం కూడా షరా మామూలు. ఒక వస్తువుని అనేక భాగాలుగా విభజించి, ఒక్కో ఉపవస్తువును మరొక వస్తువుకు అద్దంగా చూపుతూ రెండింటినీ పొగుడుతూ పోవడంలో ఎంత సౌందర్యం ఉందొ చూడండి.
అమ్మాయి అందాన్ని,ఒయ్యారాన్ని,అనురాగాన్ని వర్ణించారు. అన్నీ కలిపితేనే కదా ఆనందం? అలాగే అబ్బాయిలోని సున్నితమైన భావాలను, శృంగారాన్ని కూడా వర్ణించారు. ఈ మధ్యలో నదులు, గుడులు, దేవతల పేర్లు, కావ్యాలు అన్నీ వచ్చాయి. తెలుగునాడు గురించి తెలియని వారికి కూడా ఎన్ని విషయాలు తెలిసాయో చూడండి. అదీ వేటూరి అంటే.

Sunday, March 31, 2013

వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి...


నేను ఇంగ్లీష్ పాటలు వినేది తక్కువ. విన్నా అమెరికా పాటల కంటే కెనడా, బ్రిటన్ పాటలు వింటాను. వాళ్ళ సాహిత్యంలో లోతు ఎక్కువ అనిపిస్తుంది నాకు. చాలా రోజులుగా ఒక టీవీ ధారావాహిక చూస్తున్నాను. దాని పేరు Scrubs. నాకు బాగా నచ్చింది. హాస్యంతో పాటు కొంచెం లోతుని కూడా జోడించి తీసారు. ఆ ధారావాహిక శీర్షగీతం నచ్చి ఈ రోజే పూర్తిగా విన్నాను. అది కూడా నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ క్రింది పంక్తులు మనందరికీ వర్తిస్తాయి అని నా అభిప్రాయం.

You've crossed the finish line
Won the race but lost your mind
Was it worth it after all?


అందరం ఒకటే పరుగులో ఉన్నాము. ఒక సారి ఆగి వెనక్కి తిరిగి మనని ఇంత దూరం పంపిన వాళ్ళను, మన కోసం ఎదురుచూస్తున్న వాళ్ళను పలకరించే తీరిక లేని హడావుడిలోనే ఉన్నాము. అదే ఆలోచిస్తూ ఈ కింది పంక్తులను వ్రాసాను.

మంచం దిగాక, మైకం విడాక, మళ్ళీ పరుగులంటున్నావు
కొంచెం చిరాగ్గా, కొంచం చలాగ్గా, సాగే ప్రయాణం కోఱావు
ఎన్నాళ్ళైందో నువ్వు, చిందించి ఓ నవ్వు
వెనకకు తిరిగి చూడు ఓ బాటసారి

తీరం చేరాక, జోరెంతదాక, దూరం పెరుగుతోంది నీతో
పందెం నెగ్గాక, పతకం దక్కాక, పతనం తెలియకుంది నీకు
వెన్నుని నిమిరే నన్ను, వెతకదేల నీ కన్ను?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

సైన్యం ముందుంటే, ధన్యం జన్మంటూ, పోరే యుద్ధంలో మేలు  (యాదృఛ్ఛయా చోపపన్నం...)
శత్రువు లోనుంటే, గమ్యం బైటంటూ, పోయే మోసంలో లేదు
కలలు చూపు నీ కళ్ళు, చూపవ నా కన్నీళ్ళు?
వెనుకకు తిరిగి చూడు ఓ బాటసారి

Monday, February 25, 2013

వేటూరి పాటల్లో సంస్కృతం - ఒక విహంగవీక్షణం

ఈ వ్యాసం తొలుత veturi.in లో ప్రచురింపబడినది. దయచేసి veturi.in ని సందర్శించండి.


వేటూరి ఒక అచ్చతెలుగు కవి. ఆయనకు తెలుగు అంటే ఉన్న మమకారం మనందరికీ తెలుసును. ఆయన పాటల్లో తెలుగుదనాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు సంపదను ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం ఇదివరకు చర్చిన్చుకున్నదే. వీటికి తోడు వేటూరి పాటల్లో నాకు నచ్చే మరొక అంశం ఏమిటి అంటే, ఆయన వాడే సంస్కృత సమాసాలు. కొన్ని గంభీరంగా ఉంటాయి, కొన్ని ముద్దుగా ఉంటాయి, కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని తప్పులు కూడా. ఏది ఏమైనా ఆయన ధారగా సంస్కృత పదాలను వాడి తెలుగు పాటలకు మరింత అందాన్ని చేకూర్చారు. ఆయన సౌరమానజన్మదినం సందర్భంగా అలాంటి కొన్ని ఉదాహరణలు గుర్తు చేసుకుందాము.

తొలుత ఆయన సంపూర్ణంగా సంస్కృతంలో వ్రాసిన ఒక పాటను గమనిద్దాము. అది సప్తపది చిత్రంలో "అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి" అనే పాట. అందులో మూడు చరణాలలో ముగురమ్మలను వర్ణిస్తూ వ్రాసారు. ఈ మధ్యనే ఈ పాటను "పాడుతా తీయగా"లో ఎవరో పాడితే బాలసుబ్రహ్మణ్యం గారు "(ఇది వ్రాసింది ఎవరు అన్నది) నాకు అనుమానం ఉంది. ఇది కూచిపూడి సంప్రదాయంలో వచ్చిన పాట. ఇది చిత్రంలో వినియోగించడం జరిగింది (అనుకుంటున్నాను)." అన్నారు. వెంటనే న్యాయనిర్ణేతగా వచ్చిన సామవేదం షణ్ముఖ శర్మ గారు "కొన్ని శబ్దాలు చూస్తుంటే వేటూరి మాత్రమె చెయ్యగలరు అనిపిస్తోంది. ఉదాహరణకు శర్వార్ధగాత్రి, సర్వార్థ సంధాత్రి -- ఈ అందం, పైగా శిల్పరచన అంతా చూస్తుంటే వేటూరి గారిదే అనిపిస్తోంది. అలాగే మొదటి చరణంలో పార్వతి, రెండవ చరణంలో మహాలక్ష్మి, మూడవ చరణంలో సరస్వతి గురించి చెప్పి నాలుగవ చరణంలో సమన్వయం చేస్తూ తీసుకురావడంలో ముగురమ్మల మూలపుటమ్మ స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ చేసిన అద్భుతమైన రచన ఇది (ఇది వేటూరి శైలే.)", అన్నారు. ఆయన అంతగా పొగడటం వేటూరి పండిత-పామర జనరంజకంగా పాటలు వ్రాస్తారు అని అందరికీ తెలిసిన విషయానికి మరొక రుజువు. తఱువాత బాలు అది వేటూరి వ్రాసిన పాటేనని రూఢీ చేసారు.

ఈ పాటలో అందమైన సమాసాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సామవేదం గారు చెప్పినవి: శర్వార్ధగాత్రి అంటే శర్వుడి (శివుడి) శరీరంలో సగభాగం అని, సర్వార్థ సంధాత్రి అంటే అన్ని పనులనూ నేరవేర్చే శక్తి అని. పార్వతీ దేవికి ఇది ఎంత అందమైన వర్ణన? సరస్వతీ దేవిని వర్ణిస్తూ సరససాహిత్య, స్వరస సంగీత స్తనయుగళే అన్నారు. అంటే సంగీతం సాహిత్యం రెండు వక్షోజాలుగా కలిగింది అని చెప్తున్నారు. బిడ్డలకు కలిగే కళాపిపాసను తీర్చగలిగిన తల్లి ఆవిడే కదా, మరి. నాకు ఇంకా నచ్చినది శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని గణ పూజిత శుభచరణే అనడం. సమాసం కాలవ్యతిరేకక్రమంలో ఉన్నా భాగవతం చెప్పిన శుకుడి దగ్గర నుండి రామాయణం వ్రాసిన ఆదికవి వాల్మీకి దాక అందరూ ఆవిడ పాదాలను పూజించారు అనడంలో మన సాహిత్యం మొత్తానికి ఆవిడే ఆధారభూతం అని వ్యక్తం అవుతోంది. చక్కని మాట. అలాగే వింధ్యాటవీవాసినే కి ప్రాస కుదిరేలాగా యోగ సంధ్యా సముద్భాసినే అనడం చక్కగా ఉంది. యోగాభ్యాసం పూర్తీ కావస్తుంటే అమ్మ ఉద్భాసిస్తుంది (వెలుగుతూ కనిపిస్తుంది) అని లోతైన భావాన్ని చెప్పారు!

అదొక్కటే కదా సంస్కృతంలో వ్రాసిన పాట అనుకుంటున్నారా? ఆలాపన చిత్రంలో ఆరు ఋతువులు అనే పాటలో రెండో చరణాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అని నేను ఇక్కడ వ్రాయట్లేదు అంతే. అది ఒక సారి విని చూడండి. మీకు పూర్తిగా అర్థమైతే నాకు చెప్పండి. మరొక చక్కని పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో జై చిరంజీవా జగదేక వీర. చిన్న చిన్న పదాలతో చక్కగా సాగే భక్తీగీతం.

తరువాత అయ్యప్ప స్వామి మహత్యం చిత్రంలో ఆయన వ్రాసిన పాట ఒకటి చూద్దాము. 
ధన్యోహం ఓ శబరీశా, నీ శుభరూపం నేటికి చూశా
ఉత్తుం శబరీ గిరి శృం, నిత్య నిస్సం, మంగళాంగ, 
పంపాతరం, పుణ్యానుషం, మునిహృదయ జలజ భృం
ఇందులో గమనిస్తే " అంగ"  తో వృత్త్యనుప్రాస నడిపించారు. అయ్యప్ప స్వామిని ఎత్తైన శబరిమల అంచుగా, సర్వసంగ పరిత్యాగిగా (ఆయన పెళ్లి చేసుకోలేదు, భక్తులు ఆయనకు తప్పితే వేరే పనీ లేదు), మంగళ కరమైన విగ్రహం కలిగిన వాడిగా, పంపానది తరంగంగా, పుణ్యాత్ములను ప్రేమించేవాడిగా, మునుల హృదయాలు అనే తామర పూవులలోని భక్తి అనే  తేనెను త్రాగే భ్రమరంగా పోల్చారు. ఎంత లోతైన వర్ణన, ఎంత అందమైన పదాల గమనం? 

మరొక పాట భైరవద్వీపంలో  శ్రీ తుంబుర నారద నాదామృతం. పాట పల్లవిలో
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం
సంగీతామృత పానం,
ఇది స్వరసురజగతీ సోపానం
గమనిస్తే ఒక్క "ఇది" అనే మాట తప్ప మిగతాది అంతా సంస్కృతమే. ఒకటి రెండు పదాలు పునరుక్తిలాగా అనిపించినా భావం చక్కగా ఉంది. పదాల అల్లిక శ్రావ్యంగా ఉంది. ముఖ్యంగా భక్తిపాటలలో ఇలాంటి ప్రయోగాలు వేటూరి చాలా చేసారు.

వేటూరిలో ఉన్న ఒక విశేషం ఏమిటి అంటే -- మనం ఆయన్ని గురించి ఒక మాట చెప్పగానే, దానికి వ్యతిరేకమైన మాట కూడా నిజమేనని గుర్తు చేస్తారు. ఇప్పుడే భక్తీ పాటలు అన్నానా? వెంటనే "నాయనా, భక్తికి సంస్కృతానికి సంబంధం ఏమిటి?"  అన్నట్టు మరొక పాట గుర్తొచ్చింది. వినేవాళ్ళకు ఆశ్చర్యంగానో, వెటకారం గానో, అసభ్యంగానో అనిపించినా వేటూరి వ్రాసిన ఒక mass పాటలో మరొక అందమైన ప్రయోగం ఉంది.
ఇందువదన, కుందరదన, మందగమన, మధురవచన, సొగసులలన, గగనజఘునవే
చంద్రుడిలాంటి ముఖం కలదానా, మల్లెపూల వంటి పలువరుస కలిగిన దాన, నెమ్మదిగా నడిచేదానా (నెమ్మదిగా నడవడంలో అందం కూడా ఉంటుంది అని కవులు ఇలాగ అంటారు), చక్కగా మాట్లాడేదాన, అందమైన దాన అంటూ నాయికను పొగిడి మళ్ళీ "ఆకాశం వాలే విశాలమైన వంటి కటిప్రదేశం కలిగినది" అంటూ తమదైన శైలిలో కొంచెం సంస్కృతం సమాసాల-మసాలా కూడా దట్టించారు.

ఇక చిటిపొటి సమాసాలను చూద్దాము. అంటే ఇవి పాటకి సందర్భానికి/బాణీకి సరిపోగా వేటూరి అల్లిన సరదాసమాసాలన్న మాట. చూడాలని ఉంది చిత్రంలో యమహానగరి పాటలో ఒక చోట శరన్నవలాభిషేకం అన్నారు. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు చిరంజీవి పిచ్చితో ఆ మాట అర్థం కాకుండానే పాడుతుంటే మా అక్క చెప్పింది అది "శరత్ నవల అభిషేకం" (అంటే శరత్ చంద్ర నవలల వెల్లువ) అని. నిజానికి నాకు తెలిసి నవల అనేది సంస్కృత శబ్దం కాదు, అది ఆంగ్ల "novel" నుండి గ్రహించబడిన వ్యావహారికశబ్దం. (తెలుగులో నవల అంటే స్త్రీ అని అనుకోండి. అది ఇక్కడ అనవసరం.) కానీ సందర్భానికి కుదిరంది కదా అని వేటూరి కొంచెం చొరవ చేసి ఈ పదాలను కలిపారు. నిజానికి ఇది సమాసం అనడం కంటే అనునాసిక, సవర్ణదీర్ఘ సంధులు అనడం సబబు అనుకుంటున్నాను. అదే పాటలో జనగణ మనముల స్వరపదవనముల హృదయపు లయలను శృతిపరిచిన ప్రియ శుక పీక ముఖ సుఖ రవళులతో అని కూడా అన్నారు.

స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ చిత్రంలో వేటూరి కొన్ని గమ్మత్తైన ప్రయోగాలు చేసారు. బహుశా దానికి కారణం ఆ చిత్రదర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ కూడా సాహిత్యాభిలాషి అవ్వడం కావచ్చును. చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం అనే శృంగారరసభరితగీతంలో పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు అని అన్నారు. పిపీలికాదిబ్రహ్మ అనడం సాధారణమే కానీ దానికి యతిని, ప్రాసను కూడా కలిపి పిపాసను పక్కన పెట్టడం వేటూరి చిలిపి గాంభీర్యం.

ఇక ఊహించని తరుణంలో కొన్ని సంస్కృతపదాలను చేరుస్తూ కూడా ఉంటారు. గీతాంజలి చిత్రంలో ఆమనీ పాడవే తీయగా పాటలో ఒక చోట వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక అన్నారు. ఆ భావం ఎంత లోతైనదో మరీచిక అనే పదానికి అర్థం ఎండమావి అని తెలిస్తే బోధపడుతుంది. అదిగో భావం లోతు అన్నాను. ఇప్పుడు వేటూరి భావం లోటుని కూడా గుర్తు చేసారు. అదీ చూద్దాము. హిట్లర్ చిత్రంలో నడక కలిసిన నవరాత్రి అనే పాటలో ఒక చోట మరాళి అన్నారు. అంటే హంస అని అర్థం. ఆ మాట చుట్టూ ఎంత ముతక మసాలా ఉన్నా అక్కడ ఈయనకు ఎలాగో ఈ పదం తోచింది. ఇలాంటి ఉదాహరణలు చిరంజీవి చిత్రాలలో చాలానే ఉన్నాయిలెండి.

చివరిగా వేటూరి దుష్టసమాసాలను కూడా ఒక సారి చెప్పాలి. ఎందుకంటే ఆయన వాటితో కూడా అందంగా కవిత్వం చెప్పగలరు. దుష్టసమాసం అంటే సమాసం పొసగని పదాలకు సమాసం కలపడం. ఉదాహరణకు తెలుగు పదాలను, సంస్కృత పదాలను నియమాలకు వ్యతిరేకంగా కలిపెయ్యడం. ఆయన కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గంగోత్రి చిత్రంలోని జీవనవాహిని పాటను చర్చిస్తూ జలదీవెన అన్నది దుష్టసమాసమే కానీ, "మనం భక్తిపాటలు అనట్లేదు? మరి అదీ దుష్టసమాసమే" అని సమర్థించారు. సమాసాల గురించి చదువుకున్న మనమే భక్తిపాటలు అనగా లేని తప్పు చిత్రంలో ఎక్కువగా చదువు అబ్బని వాడు జలదీవెన అని భక్తితో అనడంలో తప్పేముంది, అది అతని భక్తి -- అందులోనూ అందం ఉంది.

అదిగో నేను భక్తి అన్నాను. ఇప్పుడు కేసెట్ రెండో వైపును గుర్తు చేసారు వేటూరి. ఒక ముద్దొచ్చే చిలిపి దుష్టసమాసం దేవరాగం అనే మళయాళ చిత్రానువాదంలో యా యా యా నెమలి కన్నుల కలయా అనే పాటలో కృష్ణుణ్ణి కౌగిళ్ళనిలయా అనడం. నిజమే మరి ఎంతో మంది గోపికలు ఆయనే సర్వస్వం అనుకుని వారి కౌగిలిలో బంధించే ప్రయత్నం చేసారు. ఎవరికి వారే యమునా తీరే అని ఊరేకేనే అన్నారా? మరి అన్ని కౌగిళ్ళలో ఒకే సారి నివసించినవాడు కృష్ణుడే కదా? అందుచేత సబబేను. తప్పొప్పులు పక్కన పెడితే ఈ ప్రయోగం ముద్దుగా లేదు? కవిత్వం అంటే అదే కాదా -- చక్కని భావాన్ని తీయని పదాలతో పండితులకు, పామరులకు నచ్చేలాగా చెప్పడం. వేటూరికి వచ్చింది,  ఆయన మనకు ఇచ్చింది, మనకు నచ్చింది అదే కదా!

ఈ పదాలలోనే ఆయనను చూసుకుంటూ, తలుచుకుంటూ సాగుదాము.


Sunday, February 24, 2013

అమ్మవారి పైన కొన్ని పద్యాలు



ఎందుకో ఒక రోజు శారదాదేవిని తలుచుకుంటే ఈ పద్యం స్ఫురించింది. నాకు ఎంతగానో నచ్చిన పద్యాలలో ఇది ఒకటి. సంగీతం, సాహిత్యం అమ్మకు రెండు స్తనాలు అని పెద్దల ఉవాచ. అదే అమ్మ మళ్ళీ నా చేత చెప్పించింది. 

తోటకం
కలుషారికి మంగళకారిణికిన్
కలితామృతకావ్యవికాసినికిన్
కలకంఠికి శ్రావ్యసుగానఝరీ
జలదాయినికిన్ నమ (నతి) శారదకున్


అమ్మవారు మాయా. అంటే స్వతహాగా గుణాతీతమైన బ్రహ్మానికి రంగులు దిద్దిన శక్తి. ఆవిడ వలనే మనకు ఈ ప్రపంచం ఇన్ని హంగులతో కనిపించి ఆకర్షిస్తోంది. ఆవిడ తలుచుకుంటే ఈ చిక్కునుండి ఒక్క చిటికలో విడిపించగలదు. అలాగ చేస్తే మఱి సృష్టి ఎలాగ కొనసాగుతుంది?

మత్తేభం
తగునా ఈ నలుసంటి జీవి మదిలో దట్టంపు చీకట్లిలా
ఎగదోయన్? దిశ కానకున్నది గదా! ఏ వైపుకుంజూచినా
పగిలే నమ్మిక గాదు నాది జననీ, బ్రహ్మైక్యసంధాయినీ
దిగులొందన్ తిమిరాపహా! ఎరుగనే దీపాంధముల్ నీవుగా?

మత్తకోకిల
చెల్లు దాగుడుమూతలాడుట చిట్టిపాపడి ఖేలకున్
తల్లిగానక పాపయేడ్వగ తానుగా దరిఁజేరదే?
తల్లడిల్లితి నిన్నుఁజూడక దర్శనంబుకుఁ జాలనే?
ఒల్లకుంటివి నాదు ప్రార్థననొందవా దయ శంకరీ!

మన దేశంలో గొప్ప గొప్ప ఋషులు, మునులు, కవులు కూడా స్త్రీని ఎంత శృంగారవతిగా వర్ణించినా తల్లిగానే భావించారు. అది మన సంస్కృతి. రమణ మహర్షీ, రామకృష్ణ పరమహంస ప్రభృతులు వేశ్యలలో కూడా అమ్మవారిని చూసారు. అలాంటి ద్రష్టలు, మహానుభావులు నడిచిన ఈ దేశంలో స్త్రీలపైన జరుగుతున్న అత్యాచారాలను గురించి విన్నప్పుడల్లా మనసు రగిలిపోతుంది. మొన్న డిసంబర్లో ఢిల్లీ జరిగిన ఘోరాని గురించి విని వ్రాసిన పద్యాలు. 

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తహ్ ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి

శంకరాచార్యుల సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలోని తొలి రెండు పాదాలు ఇవు. వీటి భావం "అమ్మవారు లేకుండా శివుడు కొంచెం కూడా స్పందించలేడు" అని. ఈ భావానికి "శివాజ్ఞ లేక చీమైనా కదలదు" అనే నానుడికి కలిపి వ్రాసిన మొదటి రెండు పాదాలు నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చినవి. చివరి రెండు వాక్యాలలో కొమ్మ అనే పదంలో శ్లేష వేటూరి ప్రభావం.

ఆటవెలది

శివునియాజ్ఞ లేక చీమయు కదలదు
శక్తి లేక శివుడు జరుగలేడు
మగువ లేక జగతి మనలేదు క్షణమైన
ననిన ధర్మభూమి మనది గాదె?

అట్టి మాటలన్ని వట్టివాయెను నేడు
ఆడుదాని బ్రతుకు మోడు బారె
కామరోగులైరి కర్కోటకులునైరి
పుణ్యభూమిలోని పురుషులెల్ల

ఇట్టి మనుషులున్న మట్టిలో నే రీతి
సుఖము, శాంతి, కీర్తి, శొభలుండు?
అధములెల్ల జేరి యాధారమౌ కొమ్మ
నెంత క్రుంగదీయనంత హాని

తెలుగులో వెలది అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది. తత్ఫలితంగా ఆట-వెలది అంటే ఒక చెడ్డ అర్థం కూడా ఉంది. స్త్రీల పట్ల మన సంస్కృతికి ఉన్న గౌరవాన్ని ఆ పద్యరీతిలో చెప్పడం వలన ఆ అర్థం వ్యర్థం అయ్యింది అని అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇదే విషయమై వేటూరి చేసిన ఒక చిన్న ప్రయోగం చెప్పాలి. "సిరికాకొలను చిన్నది" నాటికలో ఒకడు ఒక దేవదాసిని (కథానాయిక) చూసి "ఆ వెలది ఆట-వెలదా?" అంటాడు. దానికి మఱొకడు "ఆట-వెలదో కోవెలదో" అంటాడు. పరమాత్మ విగ్రహరూపుడై గుడిలో ఎలాగ కొలువుతీరతాడో, ప్రతి మనిషీ దేహరూపాన్ని ఒక స్త్రీ గర్భంలోనే పొందుతాడు. అందుకే ప్రతి స్త్రీ ఒక కోవెల వంటిది. ఈ మాట ఆమె నడవడి, వ్యక్తిత్వం, మంచి/చెడుకి సంబంధం లేకుండా వర్తిస్తుంది. దానికి రమణ మహర్షి వంటివారే నిదర్శనం. 

కొన్ని పద్యాలు



మనోనేత్రంలో కొంచెం దీర్ఘమైన వ్యాసం వ్రాసి అప్పుడే ఆరు నెలలు అవుతోంది. ఇతర వ్యాసంగాలలో హడావుడి పెరిగింది. ఏమిటో ఒక రకమైన బద్ధకం కూడా ఏర్పడింది. ఈ రోజుతో ఆ అడ్డంకిని తొలగించుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్యన నా Google plus ఖాతాలో ఉంచిన కొన్ని పద్యాలను ఈ టపలో ప్రచురిస్తున్నాను.

సందర్భం
ఒక రోజు కొంచెం చల్ల గాలికి జలుబు చేసినట్టు అనిపించింది. మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది. కొంచెం చల్లగాలికే ఇలాగ ఐపోతే మరి ఉత్తరాదిలో సాధువులు ఎలాగ సాధన చేస్తూ ఉంటారా అని. మరి యోగులకు నేత ఐన శివుడి సంగతో?

ఉత్పలమాల
చల్లని గాలి సోకినను జల్లులు తాకిననొక్క పూటలో
వెల్లువఁవోలె తుమ్ములిక వెల్వడు కాలము లెక్క లేనివై
చెల్లెను నీకె శంకరుడ జిల్లను గంగను నెత్తినుంచి నా
ఇల్లన మంచుకొండలను, యించుక గుడ్డయు లేక సుష్టుగా!

సందర్భం
కొత్త పద్యరీతులను నేర్చుకోవాలని మొదలుపెట్టి ఒక తోటకం వ్రాసాను. ఇందులో శివుడి శౌర్యం గురించి చెప్పాలి అని ప్రయత్నించాను. త్రిపురుని సంహారం, గంగావతరణం, దక్షయజ్ఞవిధ్వంసం, మన్మథ దహనం, పరశురామాది శిష్యుల విజయం, శివుడి ఆయుధాలు -- వీటిని ప్రస్తావించా(లనుకున్నా)ను.

తోటకం
త్రిపురాంతక! దేవఝరీ మదహా!
రిపుయాగవినాశక! శ్రీజహరా!
అపరాజితశిష్యగణార్చిత! పా
శుపతాస్త్రి! పినాకి! త్రిశూలి! నతుల్

సందర్భం
ఎప్పుడు చూసినా పనికిమాలిన విషయాల గోల తప్ప కాస్త సాధన చేద్దామంటే మనసు ఒప్పుకోదు. మధ్యమధ్యలో ఉపవాసం చేస్తేనైనా మనసుకు ఓపిక తగ్గి ఈశ్వరుణ్ణి తలుచుకుంటుంది అనే ఆశతో వ్రాసాను.

ఉత్పలమాల
చిత్తములోన యోచనలు చేరును కోట్లుగనెల్లవేళలన్
ఎత్తఱినే వికారములనెందుకు పొందెదనో ఎరుంగనే
విత్తము విద్య బంధువులు విందులు వింతలు స్త్రీలు సంగతుల్
మొత్తము జేరి ముంచఁ మది మోహములోఁ బడి చిక్కెనీశ్వరా!

చంపకమాల
వదలవు ఱెప్పపాటు గడువైన హృదంబును నీచసంగతుల్
కుదురుగనుంచలేను నిను గుండెల నిండుగఁ గాని శంకరా!
ఉదరమునుంచితిన్ శుచిగ నొక్కదినంబున క్రొవ్వు తగ్గె, నా
ఎదురుగ నీదు మూర్తి గననీక్షణమీక్షణముల్ తరించెరా!

సందర్భం
పరమేశ్వరుడి ఉపాధి మాయ, జీవుడి ఉపాధులు సామాన్యమైన ఇంద్రియాలు, మనసు, అహంకారం వంటివి. మనం శివుడితో పోరగలమా? అందుకే ఒక చిన్న చమత్కారం చేసాను. శివుడు నాకున్న అవిద్యని (అజ్ఞానం అన్నాను) ఏమీ చెయ్యలేడు అని అన్నాను. ఎందుకంటే ఆ అవిద్య నశిస్తే ద్వైతం కరిగిపోయి అద్వైతం మిగులుతుంది. అప్పుడు శివుడు, నేను అని నామరూపభేదాలు ఉండవు. ఉన్నది ఒక్క బ్రహ్మమే.

మేఘవిస్ఫూర్జితము
మదీయాజ్ఞానంబుంబెరుకఁదరమే మారసంహార నీకు
న్న, దివ్యాస్త్రవ్రాతంబునకు? పురహంత తుషారాద్రి వాస్త
వ్య, దుర్భేద్యోపాధుల్ తమరొకరికే వచ్చెనో? పోఱబోకో
యి, దానిన్ మర్దింపన్ మనుగడిట నీకేది? మృత్యుంజయుడా!

సందర్భం
తరళపద్యం వ్రాయాలని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా అస్సలు అంతు చిక్కలేదు. ఎంత ప్రయత్నించినా గొంతులో కవిత్వం రాకపోతే నా కవిత్వం శివుడి గొంతులో విషం కంటే కఠినమైనది అని చమత్కరించాను.

తరళం
సరళరీతులవన్ని యుండగఁ జాలవంటిని శంకరా!
తరళపద్యము వ్రాయఁబూనితి, తప్పుఁజేసితినందువా?
గరళకంఠుడవందురందరు, కాని నాదు ప్రయోగమున్
సరిగ వీనుల విన్నవారలు సమ్మతించరు గాంచరా!

ఈ పద్యాలకు సద్విమర్శను ప్రసాదించి, సరిచేసిన పెద్దలు భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సోదరుడు రాఘవ కి నా నెనర్లు.