Monday, September 3, 2012

హేత్వలంకారము


వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> హేత్వలంకారం


లక్షణం:

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం నుండి)
హేతోర్హేతుమతా సార్థం వర్ణనం హేతురుచ్యతే
అసావుదేతి శీతాంశుర్మానభేదాయ సుభ్రువాం ||

అనువాదం: (ఆడిదము సూరకవి రచించిన తెలుగు అనువాదం నుండి)
కార్యకారణములు రెండు గలియఁబలికె
నేని యది హేత్వలంకృతి నా నెసంగు
నుదయ మందెడు నీ శశి మదవతీ క
దంబమానముల్విచ్చు చెయ్దంబు కొఱకు

వివరణ: హేతువు అంటే కారణం. హేతుమంతం అంటే కార్యం. ఉదాహరణకు సూర్యుడు రావడం హేతువు, పద్మాలు విచ్చుకోవడం కార్యం. హేతువు, హేతుమంతం ఒకే వాక్యంలో చెప్తే అది హేత్వలంకారం (హేతు + అలంకారం) అవుతుంది.

సూర్యుడు ఉదయించడం వలన జరిగే కార్యాలేమిటి? చెట్లు వికసించడం, సముద్రంలోని నీళ్ళు ఆవిరవ్వడం మొదలుకొని ఒడియాలు ఆరడం వరకు అనేకఫలితాలు ఉన్నాయి. కానీ, సూర్యుడు ఉదయించినది కేవలం పద్మాలు విచ్చుకోవడం కోసమేనన్నామనుకోండి, మిగతావి అంత ముఖ్యమైనవి కావు, పద్మాలు వికసించడమే అసలు విషయం అనే ధ్వని వచ్చి పద్మాలను పొగిడినట్టు అవుతుంది. అదే హేత్వలంకారం.

పై శ్లోకంలో (అనువాదంలోనూ) రెండొ భాగంలో కవి ఒక ఉదాహరణ ఇచ్చాడు. "ఈ అందమైన భామల అలుక తీర్చడానికే చంద్రుడు ఉదయిస్తున్నాడు" అని ఆ వాక్యం భావం. నిజానికి చంద్రుడు రావడం వలన అనేకకార్యాలు జరుగుతాయి. మచ్చుకు కలువలు విచ్చుకుంటాయి. కానీ కవి వాటన్నిటినీ త్రోసిపుచ్చి అలిగిన అమ్మాయిలు అలుక వీడి ప్రియులకు లొంగడానికే వచ్చాడు అంటున్నాడు.


హేత్వలంకారం మఱొక లాగా కూడా సమకూరచ్చును. దానికి కవి ఇచ్చిన లక్షణం, ఉదాహరణ చూద్దాము.

సంస్కృత శ్లోకం: (సంస్కృత చంద్రాలోకం)
హేతు హేతుమతోరైక్యం హేతుం కేచిత్ ప్రచక్షతే
లక్ష్మీ విలాస విదుషాం కటాక్షా వేంకట ప్రభోః

అనువాదం: (ఆడిదము సూరకవి)
కార్యకారణములకు నైక్యమగునేనిఁ
గృతులఁ గొందఱు హేత్వలంకృతియ యండ్రు
సత్కవులకున్ రమావిలాసములు వేంక
టేశ్వర కటాక్షము లనంగ నిందు మౌళి

వివరణ: కొంతమంది హేతువు, హేతుమంతం ఒకటేనని చెప్పడం హేత్వలంకారం అంటారు. ఉదాహరణకు "సత్కవులకు లభించే సిరిసంపదలు శ్రీ వేంకటేశ్వరుని కటాక్షం" అన్నామనుకోండి. నిజానికి వెంకటేశ్వరుని అనుగ్రహం "వలన" మనకు సిరిసంపదలు లభిస్తాయి అని ఉద్దేశం. కానీ, ఆ "వలన" అనే పదం విడిచిపెట్టేసి రెండిటికీ అభేదం చెప్తున్నాము. ఇదీ హేత్వలంకారమే.


ఈ అలంకారం చాలా తెలుగు పాటలలో విన్న గుర్తు. గుర్తుకు వచ్చినప్పుడు అవీ కలుపుతాను. ఈ లోపల చదువర్లకు ఏమైనా ఉదాహరణలు తెలిస్తే చెప్పగలరు.

2 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మావి చిగురు తినగానే కోయిల కూసేనా !
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా!
ఈ పాటలో మావి చిగురు ఎందుకు వేస్తుందో కోయిల ఎందుకు కూస్తుందో కానీ రెండూ ఒకదాని కోసమే ఒకటి అన్నట్టు వర్ణించారు. మీరు చెప్పిన అలంకారం ఇక్కడ వర్తిస్తుందనుకుంటాను.

Sandeep P said...

లక్ష్మీదేవి గారు,

ఇది నాకూ అంతగా తెలియట్లేదండి. కావచ్చును.