Sunday, July 1, 2012

ఆహాయ వెన్నిలావె (అరంగేట్ర వేళై)

మొన్న శన్యాదివారాల్లో వేటూరి వానపాటల గురించి మూడు భాగాలుగా ఒక వ్యాసం వ్రాసాను. అసలు ఆ రోజు కూర్చున్నది వాన మీద ఒక పాట వ్రాద్దామని. ఎంత ఆలోచించినా వేటూరి మాటలు నన్ను వదలకపోతే, సరే అసలు వేటూరి ఎలాగ వ్రాసారో చూసి నేచుకుందామని మొదలెట్టిన ప్రయత్నం చివరకు ఆ వ్యాసమై కూర్చుంది. అది వ్రాసిన తఱువాత కాస్త నా వస్తుపరిధి పెరిగింది అనిపించింది.

ఈ రోజు కూడా సియాటల్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుంటే ఇంటి పక్కనే ఉన్న పెద్ద విహారవనానికి (park) వెళ్ళి కాస్త కలానికి పదును పెట్టాను. పాట వ్రాయాలంటే కనీసం చూచాయిగా ఐనా బాణీ కావాలి కదా? అందుకు మన బాణీల నిధి ఇళయరాజా ఉన్నారుగా. ఆ సముద్రంలోంచి ఒక ముత్యాన్ని వెతికి తీసాను. "అరంగేట్ర వేళై" అనే చిత్రంలోంచి ఉమా రమణన్, ఏసుదాస్ పాడిన "ఆహాయ వెన్నిలావే" అనే పాట. సాహిత్యకారుడెవరో తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి.





ఈ బాణీని ఆధారం చేసుకుని వాన మీద ఒక పాట వ్రాద్దామని మొదలెట్టాను. కానీ ఎందుకో మేఘం కరిగి వానవ్వడానికి, భావం కరిగి పాటవ్వడానికి సామ్యం చెప్పాలనిపించి ఇలాగ వ్రాసాను. ఈ క్రింది పంక్తులలో ఒకటి వాన గురించి, ఒకటి కవిత గురించి మారుతూ ఉంటాయి. అమ్మాయి వాన గురించి (మొదట పంక్తిలో) చెప్తుంటే అబ్బాయి తనలో పుట్టిన కవితను గురించి (రెండో పంక్తిలో) చెప్తున్నాడు అనుకుంటూ చదివితే అర్థమౌతుందేమో. చదువర్లకు నచ్చితే సంతోషం, నచ్చకపోతే క్షమార్పణలు.
నీలాల మబ్బునంటి కదిపింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర
మొట్టమొదటి పంక్తిలో మొదట "ఆషాఢమేఘం" అన్నాను (వేటూరి hang-over లో). కానీ కొత్తపాళి గారి విమర్శ చదివాక మార్చాను.

తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు. సరే తోచినదానికి రాద్దాము అనుకున్నాను.

మూడో పంక్తిలో "సోయగం మీర" అనడం నాకు సంతృప్తిని ఇచ్చింది.
పూరెమ్మె చిగురు చేరి, జారింది చినుకు కోరి
అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి
పాడింది తోడి రాగం నేలమ్మ పరవశించి
తడి వీణ తోటి తాళం కలిపాయి కనులు మెచ్చి
పూసింది నింగి చేలో పూవంటి ఇంద్రచాపం
సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం
నెమలమ్మ హాయిగా పురివిప్పి ఆడె కోనల్లో
గళసీమ తీయగా తడిసింది తేనెపాటల్లో
తోడి రాగం గురించి నాకు ఎక్కువగా తెలియదు కానీ ఈ చరణం వ్రాసిన తఱువాత తెలిసినది ఏమిటంటే ఇక్కడ యాదృఛ్ఛికంగా ఒక విషయం కలిసివచ్చింది. తోడి రాగం సూచించేది పచ్చని తోటల్లో వీణ పట్టుకుని కూర్చునే ఒక అందమైన అమ్మాయిని అట. ఈ చరణంలో మొదటి పంక్తిలో చిగురు అంటూ పచ్చందనాన్ని సూచిస్తూ మూడో పంక్తి లో నేలమ్మ (స్త్రీలింగం) తోడిరాగం పలికింది అనడం. నిజానికి ఈ పాట ఏ రాగంలో ఉందో నాకు తెలియదు. వానకు తోడుగా నేల పాడుతోంది అని స్వతంత్రించి తోడి రాగం అన్నాను. సంగీతజ్ఞులు మన్నించాలి.  మళ్ళీ దాని వెనకాలే కనులు తడివీణ మీటి తాళం కలిపాయి అనడంలో వీణ ప్రస్తావన కూడా కుదిరింది.

నాకు ఈ చరణంలో నాకు సంతృప్తిని ఇచ్చింది "సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" అన్న పంక్తి. కవితను అమ్మాయితో పోతనామాత్యుడు ఎప్పుడో పోల్చాడు. రాగాన్ని ఆ కన్య ధరించే బట్టగా (అలంకారంగా) చెప్పాలనిపించింది. 
నేలింటి మట్టి కోరె నింగింటి నీటి స్నేహం
పదునైన మాట కోసం పెదవింట వేచె భావం
విరహాలు కరిగి నీరం ఒదిగింది మట్టి వొళ్ళో
తగుమాట కలిసి భావం పెళ్ళాడె కైతగుళ్ళో
పులకించి గాలి హృదయం, చిలికింది మంచి గంధం
సంగీతబ్రహ్మ మంత్రం, కలిపింది దివ్యబంధం
ఈ ప్రేమ చెమ్మలో తడిసేటి జన్మలింకెన్నో
ఈ పాట తీపిలో మురిసేటి గుండెలింకెన్నో
ఈ చరణంలో దూరంగా ఉన్న మట్టి, నీరు ప్రేమించుకుంటే వారి స్నేహితుడు గాలి ఇద్దరినీ కలిపి వారి కలయికకు మురిసి గంధం (మట్టిలో తొలకరి జల్లు పడితే వచ్చే వాసన) జల్లాడు అని అమ్మాయి చెప్తుంటే, అబ్బాయి దానికి సమాంతరంగా భావం, భాష పెళ్ళాడుకుంటుంటే సంగీతం పౌరోహిత్యం వహించింది అని చెప్తున్నాడు. 

8 comments:

Bhãskar Rãmarãju said...

అభినందనలు సోదరా!
"పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర"
అద్భురంగా ఉంది.

Unknown said...

ఆషాఢమేఘమేదో తాకింది లేతగాలి
ఆవేశభావమేదో కరిగింది కవిత రగిలి
ఉరికింది నేలకై దివిగంగ సోయగం మీర
పలికింది పాటగా ఒక వూహ గుండెలో వూర

naku oka marpu cheppali anipinchindi sandeep garu

aashadamegham karigi
aavesabhavam takindi ante ardhavantam ga untundi emo kada
aavesabhavalu karagayi ante avi taggipoyayi ane bhavana kalugutondi
letgalulaki karigevi aashadameghale

next gundello vuura matram super

Sandeep P said...

@శ్రీ గారు

ఆవేశభావం మేఘంలా కరుడుగట్టి ఉంది. అది కవితగా కరిగింది. మొదట "కదిలింది" కవిత రేగి అందామనుకున్నాను. మేఘం, భావం రెండూ కరిగాయి అంటే సామ్యం కుదుర్తుంది అని అలాగ ఉంచాను. మీరు చెప్పిందీ బాగుంది.

Unknown said...

bagundi andi meeru cheppindi karudu gattina bhavam karigindi ante nenu ekibavisthunanu
any ways kadilindi kuda bagundi
chala rojula tarvata anni chaduvutuna
anni chakkaga unnai

కామేశ్వరరావు said...

పాట బాగుంది. వెతికి వెతికి బాణీ కోసం కష్టమైన పాటని ఎంచుకున్నారు!

"తమిళంలో పదాలు పొల్లుతో (హలంతం) ముగియడంతో సమస్య ఏమిటంటే మాత్రలు అంత సులువుగా అర్థం కావు. నాలుగైదు సార్లు విన్నా నాకు బాణీ అర్థం కాలేదు."

హలంత పదాలు కూడా రెండు మాత్రలు కాక ఒక మాత్ర కిందే లెక్క రావడం ఒక సమస్య అయితే, మీకీ బాణీ సరిగా అర్థం కాకపోవడానికి దీని తాళంలో ఇళయరాజా చేసిన ఇంద్రజాలం మరొక కారణం (అసలు కారణం!) అనుకుంటాను. ఈ పాట వినగానే తాళం నాకు తేడాగా అనిపించి (నాకు సంగీతజ్ఞానం లేదు) దీని కోసం గూగులిస్తే ఇందులో విశేషాలు రెండూ తెలిసాయి. ఒకటి, పల్లవి/చరణం చివరి రెండు పాదాలలో గతిభేదం. గురులఘువు/మాత్రాక్రమం బట్టి చూస్తే పాటలో రెండు patterns ఉన్నాయి.

ఒకటి:
IIUI UI UU IIUI UI UU లేదా 5 3 4, 5 3 4
ఈ pattern పల్లవి/చరణాల్లో చివరి రెండు పాదాలు కాక మిగతా అన్నిచోట్లా కనిపించేది.

రెండు - చివరి రెండు పాదాల్లో కనిపించేది:
IIUI UIU IIUI UIU UU లేదా 5 3 2, 5 3 2, 4

జాగ్రత్తగా గమనిస్తే రెండిటికీ మాత్రల సంఖ్య ఒకటే. తేడా ఏమిటంటే, మొదటి patternలో పాదంలో మొదటి భాగంలో ఒక గురువు తగ్గి, అది రెండవ భాగంలో చివరి నాలుగు మాత్రల ముందు చేరింది.

సంగీతపరంగా చెప్పాలంటే అన్ని చరణాలూ రూపకతాళమే అయినా, చివరి రెండు చరణాల్లో దాని cyclesలో తేడా ఉంది(ట).
ఈ పాట తాళంలో మరొక తమాషా ఏమిటంటే, వెనక వచ్చే tabla rhythm ఆదితాళంలో ఉందట!

ఈ సంగీత విశేషాల గురించి కొన్ని లంకెలు:

http://ramaaramesh.wordpress.com/2011/12/26/for-the-love-of-raaja/
http://www.oocities.org/ilaiyaragam/rajaresearch3.htm
https://sites.google.com/site/violinvicky/tala-bedham

Kottapali said...

యాదృఛ్ఛికంగానైనా భలే టపాలో దొర్లి పడ్డాను. మా వూరి వాతావరణానికీ నప్పేట్టుగానే ఉంది సందీప్. పాటలో చాలానే చక్కటి చమక్కులున్నై. కానీ ఒక చిన్న విమర్శ. భారతదేశంలో ఆషాఢ మేఘం కురవదు. అది కవిసమయంకూడా కాదు. అంచేత అక్కడ ఆషాఢానికి బదులు ఇంకేదైనా మార్చేందుకు వీలుందేమో చూడండి.

Unknown said...

చాలా బాగా రాశారండి.
"సరిగమల పరికిణీలో వెలిగింది కవిత రూపం" - ఈ వాక్యం నాక్కూడా అద్భుతంగా నచ్చింది.

కొన్ని నా observations మీద మీ అభిప్రాయాలూ తెలుసుకోవాలని ఉంది.

మొదటి చరణంలో "అధరాల చిగురు దాటి, పొంగింది పదము ధాటి" అన్నప్పుడు పొంగిన పద ధాటి, రెండవ చరణం వచ్చేసరికి "పదునైన మాట కోసం పెదవింట వేచె భావం" ఇంకా పదరూపం కూడా ఎత్తకుండా భావంలానే ఉంది.

పూరెమ్మె: పువ్వు రేకు అయితే, చినుకు, నేల మధ్య ప్రధానంగా నడుస్తున్న ప్రేమాయణంలో పువ్వు ప్రస్థావన రావడం.

P.S: ఈ వాఖ్యలో 'observations' కి సరిపడా తెలుగు పదం సూచించగలరు. నెనర్లు.

Sandeep P said...

@కొత్తపాళి గారు

మొత్తానికి మొదటి పదంలోనే తప్పు పట్టుకున్నారు :) చక్కని విమర్శ. ఆషాఢ, ఆవేశ కొంచెం పొంతన కుదిరింది అని అలాగ వ్రాసాను. కానీ పొరబాటైంది. సరిచేస్తాను.

@భైరవభట్ల గారు

మీరు చెప్పిన రెండు బిందువులూ సరైనవే. పాట వ్రాయడం మొదలెట్టాక తెలిసింది ఈ ఆఖరి రెండు పంక్తులూ కాస్త ఇరకాటంలో పెట్టాయని. తమిళంలో హలంతాక్షరాలను ఒకటే మాత్రగా పరిగణిస్తారని మీరు చెప్తేనే అర్థమైంది.

@హరికృష్ణ గారు

మంచి విమర్శ చేసారు. మొదటి చరణంలో వాన పడుతున్నప్పటి సంగతులన్నీ చెప్పి రెండవ చరణంలో వాన పడటం వరకు జరిగిన flash-back చెప్పాను. అది అనుకోకుండా జరిగినదే.

ఇక రెండో విషయం కూడా నిశితమైన పరిశీలనతో చెప్పారు. రెండో చరణంలో నీటికి, మట్టికి పెళ్ళి అంటూ మొదటి చరణంలో చినుకు పూరెమ్మను ముద్దాడింది అనడం సబబుగా లేదు. నిజానికి రెండు చరణాలు సంబంధం లేకుండా వ్రాసాను. కానీ కొన్ని చోట్ల వ్యతిరేక భావాలు దొర్లాయి. మొదటి చరణంలో మొదటి పంక్తి మార్చడం సులభమే (పూరెమ్మ చిగురు చేరి, ఊగింది/జారింది చినుకు కోరి - అనవచ్చును). అక్కడ "ముద్దాడి" అని ఎందుకు అన్నాను అంటే ఆ తఱువాతి వాక్యంలో "అధరాల" ప్రస్తావన వచ్చింది. ఒక ధార ఉంది కదా అని. మారుస్తున్నాను.

observation కి సంగతి అనడం సరేమో. దృష్టం అంటే "చూడబడినది" అని అర్థం. అది కూడా సరిపోవచ్చును. ఇలాంటివి తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యంగారు బాగా చెప్తారు. వారిని అడిగి చూడండి.