(గమనిక: ఎప్పటినుండో వ్రాద్దామనుకుంటూ ఉంటే ఇప్పటికి కుదిరింది -- అందుచేత మొన్నటి వార్తలు విన్నట్టనిపిస్తే చదువర్లు మన్నించాలి)
శ్రీరామరాజ్యం చిత్రంలో పటలు అద్భుతంగా ఉన్నాయి అని సర్వత్రా వినబడుతోంది. ఈ పాటల రచయిత పండితులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావ్ గారు. ఆయన కవితాపటిమను గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. తక్కువ పాటలు వ్రాసినప్పటికీ అన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు వ్రాశారు ఆయన. సంస్కృతంలో disco పాట (మహర్షి చిత్రంలో "ఊర్వశి - అస్మద్విద్వత్విద్యుత్ దీపిక త్వం ఏవ"), తెలుగు తిట్లదండకం (ష్...గప్ చుప్ లో "ఒరేయ్ త్రాపి") లాంటి ప్రయోగాలెన్నో చేసారు. గతంలో కుంకుమపూల తోటలో కులికే ఓ కుమారి పాట గురించి కూడా చెప్పాను.
శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.
1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!
ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
2. శ్రీరామ లేరా ఓ రామ!
శ్రీరామరాజ్యంలో వీరు పాటలు వ్రాస్తున్నారు అనగానే ఎంతో సంతోషం కలిగింది. పాటలు విన్నాక మొదట్లో కొంచెం "అరెరే, simple గా వ్రాసారే" అనుకున్నాను కానీ, అలాగ చెయ్యడమే ఈ పాటలను అందరికీ దగ్గరగా చేసింది అని త్వరలోనే గుర్తించాను. పాటలు సులువుగా అనిపించినప్పటికీ మంచి భావంతో ఉన్నాయి. ఈ టపలో ఈ చిత్రగీతాలలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలను గురించి చెప్తాను.
1. జగదానందకారక, జయ జానకీప్రాణనాయక!
ఈ పాటలోనే కాక, ఈ గీతసమూహంలోనే మొట్టమొదట నచ్చింది అపరరామభక్తుడు, కర్ణాటకసంగీతకళానిధి, శ్రీ త్యాగరాజుల వారి పంచరత్నకృతులలో మొదటిదైన "జగదానందకారక జయ! జానకీప్రాణనాయక" అనే కృతి పల్లవితో ఈ పాటలకు శ్రీకారం చుట్టడం. ఇలాగ జరగడానికి దర్శకులు, రచయిత, స్వరకల్పకులు, కవి -- అందరూ కారకులు. అందరికీ త్యాగరాజు మాటల్లోనే "ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు". ఈ పాటలో నాకు నచ్చిన వాక్యాలు:
- "రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే" - మకారంతో వేసిన అనుప్రాస.
- "రామశాసనం తిరుగులేనిదని జలధి బోధ చేసె" - రాముడు సముద్రుడిపై బాణాన్ని వేసిన ఉదంతం గుర్తు చెయ్యడం.
- "రామనామమే అమృతం, శ్రీరామకీర్తనం సుకృతం" - భక్తియోగాన్ని రెండు ముక్కల్లో వివరించడం.
- "శ్రీరామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే" - భక్తులకు మనసులో కలిగే భావాన్ని కూడా ఒక్క ముక్కలో చెప్పడం.
2. శ్రీరామ లేరా ఓ రామ!
- "దరిసనమును కోర దరికే చేరే దయగల మారాజు దాశరథి" - ఎవరైనా (ప్రజలు/భక్తులు) పిలువగానే రాముడు ఆలస్యం లేకుండా వెళ్తాడు.
- "తొలుతనె ఎదురేగి కుశలమునడిగి హితమ్ను గావించే ప్రియవాది" - తాను రాజుననే గర్వం లేకుండా ఎవరైనా వస్తే తానే ముందుగా వెళ్ళి వారికి కావలసినవి సమకూర్చి, "ప్రియం కలిగే విధంగా" మాట్లాడేవాడు రాముడు.
- "ధీరమతియై, న్యాయపతియై ఏలు రఘుపతియే, ప్రేమస్వరమై స్నేహకరమై మేలునొసగునులే" - శ్రీరాముడు స్థిరమతి (స్థితప్రజ్ఞుడై) న్యాయం నిలబెడతాడు, అలాగే అనురాగం నిండిన గొంతుతో మంచి చేస్తాడు. ఇక్కడ స్నేహకరం అనడంలో నాకు శ్లేష గోచరిస్తోంది. స్నేహం కలిగించే విధంగా ఉండేది స్నేహకరం. రాముడు స్నేహకరమయ్యాడు అంటే స్నేహాన్ని పెంపొందించే విధంగా నడుచుకున్నాడు అని. అలాగే, కరం అంటే చెయ్యి అనే అర్థం ఉంది. కనుక రాముడు స్నేహంతో నిండిన చెయ్యిగా మారి మేలు చేస్తాడు అనే ధ్వని కూడా ఉంది. అద్భుతం!
- "అందరునొకటేలే, రాముడికి ఆదరమొకటేలే, సకలగుణధాముని రీతిని రాముని రీతిని ఏమని తెలుపుదులే" - రాముడికి తన-పర భేదం లేదు (స్థిరమతి), అందరినీ ఒకేలాగ ఆదరించేవాడు. ఆయన విధానాలని వర్ణించడం కష్టం!
- "తాంబూలరాగాల ప్రేమామృతం తమకించి సేవించు తరుణం, శృంగారశ్రీరామచంద్రోదయం ప్రతిరేయి వైదేహి హృదయం" - ప్రతీ రోజూ రాత్రి అమ్మవారు తాంబూలంలో ప్రేమామృతం కలిపి అందిస్తుంటే శ్రీరామచంద్రుడి శృంగారరూపం ఆమె హృదయంలో ఉదయిస్తోందట. ఇక్కడ గమనించాల్సిన విషయం రేయిలో శ్రీరామ "చంద్రుడు" ఉదయిస్తున్నాడు అని. చక్కని భావుకత.
- "మౌనం కూడా మధురం" - శ్రీరామచంద్రుడి మాట లాగే మౌనం కూడా తీయగా ఉంటుందట. మొదటి చరణంలో చెప్పిన "ప్రియవాది" కి జోడుగా ఇది రెండొ చరణంలో చెప్పారు.
- "పిలిచే సమ్మోహన సుస్వరమా!" - రామ అనే పదానికి అర్థం "ఆకర్షించగలిగేది" అని. రాముడి మాట, రూపం సమ్మోహనాస్త్రం లాగా ఉన్నాయని కవి భావం.
- "సీతాభామ ప్రేమారాధనమా, హరికే హరిచందన బంధనమా?" - సీతాదేవికి భర్తపైన ఉన్న ఆరాధన పరమాత్ముడికే (హరి) హరిచందనంతో (పసుపురంగు గంధం) వేసిన బంధంలాగ ఉందిట. "హరి" అంటూ యమకం వేసారు కవీశ్వరులు.
- "శ్రీరాముడు రసవేదం, శ్రీజానకి అనువాదం. ఏనాడు వీడిపోని బంధము" - రాముడు వేదాలకు సారం ఐతే అమ్మవారు దానికి అనువాదం అట. ఎంత చక్కని భావుకత! కాళిదాసు వాగర్ధావివను స్ఫురింపజేసింది ఈ వాక్యం.
3. ఎవడున్నాడీ లోకంలో
ఇది హరికథ లాగా కూర్చిన పాట. నిజమే ఇది హరి కథే కదా, అందుచేత ఒక్కటైనా అలాంటి పాట ఉండాలి. బాలు నారదుడికి, వాల్మీకికీ గొంతు మార్చి చక్కగా పాడారు. వాల్మీకికి పాడేటప్పుడు వినయంతో, నారదుడికి పాడినప్పుడు ఆనందంతో పాడారు.
వాల్మీకికి ఒక ఇతిహాసం వ్రాయాలనిపించినప్పుడు నారదుడిని ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పమంటూ కొన్ని లక్షణాలను సూచించాడు (బాలకాండ 2-4 శ్లోకాలు). వాటిని జొన్నవిత్తుల చక్కగా అనువదించారు.
- "ఎల్లరికీ చలచల్లనివాడు" - అందరితోనూ ప్రియంగా ఉండేవాడు అంటూ రాముడి గురించి ప్రతీ పాటలోనూ చెప్పడం చాలా బాగుంది.
- "ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు" - ఓంకారం బ్రహ్మస్వరూపం. "రామ" శబ్దం కూడా బ్రహ్మస్వరూపం అని శంకరాచార్యులు చెప్పినట్టుగా చదివాను. అందుకని వారిద్దరికీ పోలికను చెప్పడం చాలా బాగా కుదిరింది. ఇది అందరు కవులకీ సాధ్యపడే ఊహాశక్తి కాదు.
- "విలువలు కలిగిన విలుకాడు" అంటూ మఱో యమకం వేసారు. విల్లుంటే బలవంతుడు అవుతాడు, కానీ విలువలుంటేనే గొప్పవాడౌతాడు. రాముడికీ రెండూ ఉన్నాయి. అది చక్కని ప్రాసతో చెప్పారు.
- "పలు సుగుణాలకు చెలికాడు" - సుగుణాలను స్త్రీతో పోల్చడంతో స్త్రీలను గౌరవించడమే కాక సుగుణాలు మిత్రులు, అవగుణాలు శత్రువులని గుర్తుచేయడం బాగుంది.
4. గాలి నింగి నీరు
"ఏడుపు పాట" అని తీసేద్దామనుకున్నా గుండెను పదే పదే తట్టేలాగ ఈ పాటను ఇళయరాజ, జొన్నవిత్తుల, బాలు, నటుడు శ్రీకాంత్ చేసారు. ఎంత ఆర్ద్రత ఉన్న పాట!
"గాలి నింగి నీరు భూమి నిప్పు" అంటూ పంచభూతాలను (భూమికి బదులుగా నేల అని ఉంటే అన్నీ తెలుగుపదాలయ్యుండేవి), "రారే మునులు, ఋషులు? ఏమైరి వేదాంతులు?" అంటూ తత్త్వజ్ఞులను (వీరందరూ రాముడు అడవులకు వెళ్తున్నప్పుడు అడ్డుకొందామని ప్రయతించినవారే. ఒకాయనైతే ఏకంగా రాముడికి నాస్తికత్వాన్ని బోధించబోయి నాలుక కరుచుకున్నాడు), "కొండ, కోన, అడవి, సెలయేరు, సరయూనదీ" (ఇవన్నీ సీతారాముల అనురాగాన్ని గమనించినవి) అంటూ ప్రకృతిని, ప్రశ్నించడం ఎంతో లోతుగా ఉంది.
"విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడే" అనడంలో విధికి రెండు అర్థాలు ఉన్నాయి. మొదట తలరాత/బ్రహ్మదేవుడు (destiny) అనే అర్థంలో వాడితే రెండవసారి మార్గం అనే అర్థంలో వాడారు. అందుకని ఇది మఱొక యమకం. అలాగే "ఏడేడు లోకాలకీ సోకేను ఈ శొకం" అనడంలో కూడా శబ్దాలు యమకానికి దగ్గరగా ఉన్నాయి (సోకు, శొకం).
"అక్కడితో ఐపోకుండా ఇక్కడ ఆ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా? ఈ లెక్కన దైవం ఉందా" -- అబ్బబ్బా, గుండె పిండేసారు కదండి. ప్రతిసారి సీతమ్మవారిని అదే అపవాదు అనే రక్కసి ఏడిపిస్తోంటే జగద్రక్షకుడైన శ్రీరాముడే ఏమీ చెయ్యలేక విలపిస్తున్నాడు. "ఈ లెక్కన అసలు దైవం అంటూ ఉందా?" అనే సందేహం ఎవరికి మాత్రం కలిగి ఉండదు? కొన్నిసార్లు ఊహ కంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడంలోనే బరువు ఎక్కువ ఉంటుంది!
"సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా" -- మఱొక అద్భుతమైన ప్రయోగం. సూర్యుని (సహజంగా వెలుగున్నవాడు) వంశాన్ని తన సుగుణంతో వెలిగించిన (భర్తతో అడవులకు వెళ్ళింది, అగ్నిప్రవేశం చేసింది) ఈ కోడలిని ఆ సూర్యవంశ వెలుగే (ప్రతిష్టే) వెలివేస్తే ఈ లోకంలో ఇక వెలుగు ఎక్కడిది?
5. సీతా సీమంతం
పండుగని సన్నాయితోనే పలికించారు ఇళయరాజ. కోకిల, పల్లవి, పున్నమి, ఆమని అంటూ జొన్నవిత్తుల ప్రకృతివర్ణనతో వ్రాసారు.
ఈ పాటలో "కాశ్మీరం నుండి కుంకుమ", "కర్ణాటక నుండి కస్తూరి" అన్నారు కవి. రామాయణం జరిగినప్పటికి ఇంకా కర్ణాటక రాజ్యం ఏర్పడలేదు. ఈ పొఱబాటుని "ఇంత చక్కని గీతసమూహానికి ఇది దిష్టిచుక్క" అనుకుని మనం వదిలేయాలి.
"ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే, అటూ ఇటూ బంధం ఉన్న చుట్టాలంతా మేమే" అనడంలో ఆశ్రమంలోని ప్రేమ వాతావరణాన్ని చక్కగా వర్ణించారు. పాట మొత్తానికి నాకు నచ్చిన వాక్యం "ఎక్కడున్నా నువ్ గానీ, చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడూ" అంటూ రాముడిలో సగానికి మఱో సగాన్ని గురించి చెప్పడం ఎంతో ముద్దుగా ఉంది.
6. రామ రామ రామ అనే రాజమందిరం
చిన్నప్పుడు రాముడు చేసిన అల్లరి గురించి చెప్తూ సాగే ఈ పాటలో, "మర మర మర" అనడం వాల్మీకి గురించిన కథని గుర్తు చేసింది.
నేను ఒక సారి సోదరుడు రాఘవని "రామచక్కని" అంటే ఏమిటి అని అడిగితే "రాఁవుడు ఆంధ్రుల ఆరాధ్యదైవం, అందమైనవాటికి ముందర రాముణ్ణి చేర్చుకుని చెప్పుకోవడం మనకు అలవాటు", అన్నాడు. నాకు ఆ వివరణ ఎంతగానో నచ్చింది. అలాగే ఈ "రామసుందరం" అనే పదం ముద్దుగా ఉంది. తదనుగుణంగానే "ముద్దుగారి పోతడంట" అనడంలో ఎంతో నిండుదనం ఉంది.
ఈ పాటలో జొన్నవిత్తుల అనుకుని చేసారో లేక నా మనసుకే అనిపిస్తోందో మొదటి చరణంలో ప్రతీ వాక్యం రామాయణకథల్లో ఒక ఘట్టాన్ని/పాత్రని గుర్తుచేస్తోంది.
- "బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట" - హనుమంతుడు, వానరసేన
- "వజ్రపుటుంగరము తీసి కాకిపైకి విసురునంట" - కాకిపైన రాముడు బ్రహ్మాస్త్రం సంధించిన కథ
- "సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట" - శబరి ఎంగిలి తినడం (అన్నట్టు, "రామచిలక" అనడం కూడా మన తెలుగువాళ్ళే అందమైన చిలకకు ఇచ్చిన బిరుదు)
- "ఖజ్జురాలు ద్రాక్షలూ ఉడతలకీ పెడతడంట" - ఉడతలు రాముడికి సాయపడడం
- "దాక్కుంటడంట చెట్టుచాటుకెళ్ళి" - వాలి వధ
- "రాళ్ళేస్తాడంట చెరువులోకి మళ్ళీ" - సేతు బంధనం
రెండవ చరణంలో అద్దాన్ని సంచిలో దాచిన కథ కూడా సరదాగా ఉంది. పల్లవిలో "తేప తేప తీయన" అన్నారు. "తేప" అనేది ఒక తీయని వంటకం అని చదివిన గుర్తు, దాని గురించి ఒక సరదా కథ కూడా విన్నాను. మఱి ఇది అదో కాదో తెలియదు. చదువర్లు చెప్పాలి.
ఇంకా ఉంది...