వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> దృష్టాంతాలంకారము
వివరణ: వాక్యములు ఒకదానికొకటి బింబప్రతిబింబాలుగా (reflections) గా ఉంటే దాన్ని దృష్టాంతాలంకారం అందురు.
ఉదా:- (చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)
త్వమేవ కీర్తిమాన్ రాజన్! విధురేవ కాంతిమాన్
భా:- ఓ రాజా, నువ్వే కీర్తిమంతుడవు; చంద్రుడే కాంతిమంతుడు.
వి:- గతంలో ఉపమాలంకరాములో ఉపమేయము, ఉపమానము, సమానధర్మము చూసాము. దృష్టాంతాలంకారంలో సమానధర్మం ఉండదు! కాకపోతే ధర్మాలకు మధ్యన పోలిక ఉంటుంది. ఉదాహరణ కీర్తికి, కాంతికి కొంత పోలిక ఉంది -- రెండూ అన్నివైపులా ప్రాకుతాయి. అందుచేత వీటికి పొసిగింది. సూటిగా రాజుని చంద్రుడు అని కానీ, కీర్తి కాంతి వంటిది అని కానీ అనకపోయినా -- రెండు వాక్యాల నిర్మాణం దాదాపు ఒకేలాగ ఉండటం వలన ఇది అర్థమౌతోంది.
దృష్టాంతాలంకారం కేవలం కవిత్వప్రయోజనాలకే కాక, తర్కానికి కూడా మన దేశంలో ఎక్కువగా వాడారు. శంకరాచార్యులు వివేక చూడామణిలో దృష్టాంత పద్ధతి ద్వారా చాలా విషయాలను బోధపరిచారు.
63-64:- శత్రువులను జయించకుండా "నేను రాజుని" అన్నంత మాత్రాన రాజువు కావు. మాయని నశింపజేసి ఆత్మ తత్త్వం తెలుసుకోకుండా "బ్రహ్మం" అన్నంత మాత్రాన ముక్తి రాదు.
65:- దాచిపెట్టి ఉన్న నిధి "నువ్వు రా" అన్నంత మాత్రాన వచ్చిపడదు. మాయ అడ్డుగా నిలబడిన ఆత్మతత్త్వం వాదనల వలన తెలియదు.
348:- చూస్తున్నది పాము కాదు, తాడు అని తెలిస్తే భయం పోతుంది. ఎదుటనున్నది సత్యం కాదు మాయ అని తెలిస్తే బంధం పోతుంది, మోక్షం కలుగుతుంది.
243-244:- ఈశ్వరుడి ఉపాధి మహత్, జీవుడి ఉపాధి పంచకోశం -- ఉపాధి తీసేస్తే ఉన్నది ఒక్కటే -- అది బ్రహ్మం. సింహాసనం మీద కూర్చున్నవాడు రాజు, డాలు పట్టుకున్నవాడు భటుడు. సింహాసనం, డాలు తీసేస్తే అక్కడ ఉన్నది మనిషి మాత్రమే.
శంకరాచార్యుల కవిత్వం పక్కనే వేఱే ఎవరిదీ వ్రాయకూడదనో ఏమో, నాకు ఈ అలంకారం ఉన్న చలనచిత్రగీతాలు గుర్తుకు రావట్లేదు. మీకు తెలిస్తే చెప్పగలరు.
పొడిగింపు:
మందాకిని గారి వ్యాఖ్య చూసాక నాకు మఱొక మంచి పాట గుర్తొచ్చింది.
ఉదా:- (చిత్రం: ప్రణం ఖరీదు, రచన: కీ. శే. జాలాది రాజ రావ్)
యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.
ఉదా:- (చిత్రం: మాతృదేవోభవ, రచన: కీ. శే. వేటూరి సుందరరామమూర్తి)
కన్నీటికి కలువలు పూచేనా? కాలానికి ఋతువులు మారేనా?
మబ్బులెంతగా కురిసినా ఆకాశం తడిసేనా? మాటలతో మరపించినా మనసున వేదన తీరేనా?
12 comments:
ఏతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
అనే పాట ఇలానే అనిపిస్తోంది మరి. ఔనా కాదా మీరే చెప్పాలి.
(ఏతాము అంటే నీళ్ళు తోడే సాధనమనుకుంటాను. పొలానికి ఇద్దరు కలిసి తోడుతున్నట్టుగా సినిమాలో చూశాను. పొంత అంటే చిన్ని కుండ.)
@మందాకిని గారు
అద్భుతమైన పాటను ఉదహరించారు. అభినందనలు. నిజమే ఇది దృష్టాంతాలంకారమే.
ఈ లోతైన పాటను వ్రాసిన జాలాది గారు ఈ మధ్యనే స్వర్గస్థులైనారని మీకు తెలిసే ఉంటుంది. వారు ఇదే పాటలో ఈ అలంకారాన్ని మఱికొన్ని సార్లు వాడారు.
ఏడు వర్ణాలు కలిసి ఇంధ్రధనస్సౌతాయి
అన్ని వర్ణాలకూ ఒకటే ఇహము పరముంటాయి
నడుమవచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు
Sandeep.....mari idhi em alankaram...?
Kamalakshu narchinchu karamulu karamulu...Srinathu Varninchu Jihva Jihva
సుందరకాండ అనే వెంకటేశ్ సినిమాలో "ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకే, చందమామకు రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ మూడునాళ్ళే ఈ జీవయాత్రలో , ఒకపూటలోనె రాలు పూవులెన్నో " అనే పాట కూడా గమనించండి.
@శ్రీకాంత్
మీరు చెప్పినదాన్ని లాటానుప్రాసాలంకారం అంటారు. దాని గురించి వ్రాసిన వ్యాసం ఇదిగోండి: http://manonetram.blogspot.com/2010/06/blog-post_13.html
అది దృష్టాంతాలంకారం కాదు -- ఎందుకంటే అక్కడ పరోక్షమైన పోలిక కూడా లేదు. రెండు వాక్యాల నిర్మాణం ఒకేలాగ ఉన్నా, ఒక దాన్ని ఉదాహరణగా చూపించి మఱొకదాన్ని విపులీకరించనందున అది దృష్టాంతాలంకారం కాదు.
ఏతాము అంటే నీళ్ళు తోడే సాధనమే! కానీ, పొంత అంటే చిన్ని కుండ కాదు. పొంతకడవ లేదా పొంతకాఁగు అన్నమాటకు ప్రొయ్యిదగ్గఱి నీళ్లకుండ అన్న అర్ధం. ఇక్కడ 'పొంత' అన్న మాటకు సమీపమనే అర్ధం. శంకరనారాయణీయం యీ పొంతను పుంతతో కలిపేసింది. జనబాహుళ్లయంలో పుంతదారి అనే మాట ఉంది . ఈ పొంత అనే మాటకు 'ఒడ్డు' అనే అర్ధం కూడా ఉంది. అందుచేత పుంతదారి అనేది బహశః పొంతదారి అంటే యేదైనా నది లేదా పొలం ఒడ్డు ప్రక్కన దారి అని అర్ధంలో అయి ఉంటుందేమో. పాట దగ్గరకు వస్తే, "పొంత నిండదు" అంటే ప్రొయ్యిదగ్గఱి నీళ్లకుండ నిండదని అర్ధం చెప్పుకోవాలనుకుంటాను.
ఎప్పటినుంచో మీ బ్లాగు ఉన్నా ఇప్పటిదాకా చూడలేని నా అశక్తతకు మన్నించగోర్తాను.. తెలుగు మీద , తెలుగు సాహిత్యంమీదా ఓ ఆసక్తి.. మీ బ్లాగు చేస్తున్న సాహిత్య కృషి బాగుంది.. అభినందనలు.. ఛందస్సు గురించి వ్రాసిన తెలుగు బ్లాగులు కాని, సైట్స్ కాని ఉంటే తెలియజేయగోర్తాను.. తెలుగులోనే ఉండాలి.. శ్రమకు అన్యథా తలపవలదు.
నమస్తే హనుమంతరావు గారు
ఛందస్సు గురించి వ్రాసిన బ్లాగులు తెలియవు కానీ, సంక్షిప్తంగా సంక రామకృష్ణ గారు వ్రాసిన టపలు ఉన్నాయి. అవి RTS లో వ్రాయబడి ఉన్నాయి. వాటిని lekhini ద్వారా తెలుగు ఖతులలోకి (fonts) మార్చుకోవచ్చును. లంకె ఇదిగో.
ఇది తప్ప వేఱేవి నాకు తెలియవండి. క్షంతవ్యుణ్ణి.
అన్నానికి అరిటాకు
సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామిపాదం తాకు - అత్తారింటికి దారేది చిత్రంలో
Ayya!!! Thokka gundu waste
పొంత అనగా పొయ్యి పక్కన వేడి నీటికి పెట్టే కుండ.అని అర్థం.
Post a Comment