Saturday, April 16, 2011

పెద్దలొస్తున్నారు జాగ్రత్త!

నన్నెఱిగిన చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే: నేను మంచివాణ్ణా, చెడ్డవాడినా అన్న సంగతి పక్కన పెడితే, పెద్దలంటే గౌరవం ఉంది అని. ఇదేదో ఆత్మస్తుతి అనుకునేరు. ఇది నేను యత్నపూర్వకంగా చేసేది కాదు. ఎందుకో చిన్నప్పటినుండి అలాగ అలవాటైపోయింది. ఈ విషయం తెలుసుకోవడానికి నాకు దాదాపు ఇరవయ్యేళ్ళు పట్టింది.

మన దేశంలో ఉండగా ఎప్పుడూ నా స్నేహాలు ఉపాధ్యాయులతోనే (school, junior college, engineeringలో కూడా). నా ఎదురుగుండా ఉపాధ్యాయులను వెటకారం చెయ్యాలన్నా, మనస్పూర్తిగా తిట్టుకుందామన్నా నా స్నేహితులు జంకేవాళ్ళు. అలాంటి స్నేహాలు నాకు విచిత్రంగా తోచకపోయినా నా మిత్రులందరికీ విచిత్రంగా అనిపించేవి (అనిపిస్తున్నాయి). ఇక నిత్యజీవితంలో నాకు నచ్చేవారు కూడా తలలు పండిపోయినవారే. ఇంట్లో నేను మా తాతయ్య కంటే చాదస్తుణ్ణని వినికిడి. భారతంలో నాకు నచ్చిన పాత్రలు భీష్ముడు, వ్యాసుడు, విదురుడు -- అందరూ తలలు పండి నీతులు చెప్పే వాళ్ళే. ఆఖరికి మన భారతక్రికెట్లో T20 ఆటలో కూడా నాకు నచ్చుతున్నది ముసలివాళ్ళే (ద్రావిడ్, తెండుల్కర్, లక్ష్మణ్ :) ).

ఇప్పుడు ఈ చరిత్ర అంతా మాకెందుకు అంటారు. అక్కడికే వస్తున్నాను. ఈ తరం పెద్దలకి (అంటే సుమారుగా 50 ఏళ్ళు దాటినవాళ్ళకి) Internet రావడం వలన జీవితంలో చాలా మార్పులు వచ్చేశాయి. ఒకప్పుడు trunk call చెయ్యాలంటే ముందురోజునుండి ఏమేమి మాట్లాడాలో ఆలోచించుకునేవాళ్ళు, ఈ రోజు ఏమీ తోచక ISD calls చేసేవాళ్ళ మధ్యలో ఇమడటానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుకు కూడా మా చిన్నత్తయ్య, నేను విశాఖపట్నం నుండి తుని వెళ్తుంటే "ఒరేయ్ నాన్న మూడు గంటల passenger పట్టుకుంటే పదిరూపాయలు తక్కువవుతుంది" అంటుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతుంది, "అరే? నా ముందుతరం వాళ్ళు డబ్బుకు ఇంత వెనకాడేవారా? ఈ రోజు మనం జీవితంలో ఏమీ సాధించకుండానే పుట్టినరోజు పేరు చెప్పి మూడువేలు తగలేస్తున్నాము".

మార్పు సహజం. దాన్ని యువత ఆహ్వానించినట్టుగా పెద్దలు ఆస్వాదించలేరు. కానీ, మన ముందుతరం వాళ్ళు మన మీద ప్రేమతో ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే Internet లో మసలడానికి కష్టపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని చూసి మన తరమంతా మనఃపూర్వకంగా గర్వపడాల్సి ఉంది. వాళ్ళు కూడా ఒక్కసారి కొడుకుతోనో, మనవడితోనో వాళ్ళంతటవాళ్ళు chat చేసినా, video callలో మాట్లాడినా పొంగిపోతారు, గర్వపడతారు.

"ఇదంతా సరే, అసలు ఈ శీర్షవాక్యానికి (titleకి) నువ్వు మాట్లాడుతున్నదానికి సంబంధం ఏమైనా ఉందా?", అని ఇప్పటికే చదువర్లు చిఱాకు పడుతూ ఉండి ఉంటారు. అందుకే అసలు విషయంలోకి వస్తున్నాను. మన పెద్దలు చేస్తున్న ప్రయత్నంలో కొంచెం నవ్వు తెప్పించేవి కూడా ఉంటాయి. మన చిన్నప్పుడు మనం తెలిసీతెలియని మాటలు మాట్లాడుతుంటే పెద్దలకు కలిగిన నవ్వులాంటిదే ఇదీను. అందుకే ఈ నవ్వులో కూడా ఒక అభిమానం దాగుంటుంది. అలాగ నాకు ఎదురైన సందర్భాలను చెప్పడమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశం.

నా స్నేహితుడు ఒకడు MS చేసి US లో ఉన్నాడు. వాడు వాడి తల్లిదండ్రులకి ఏకైక సంతానం. వాడి మీదనే వాళ్ళ ఆశలన్నీ పెట్టుకుని పెంచారు. వాడు ఇక్కడకి వచ్చాక, వాళ్ళకు కాళ్ళూచేతులూ ఆడలేదు. వీడు ఒక Computer కొనిపించి అందులోంచి వాడితో ఎలాగ మాట్లాడాలో నేర్పించాడు. అప్పటినుండి తండ్రీకొడుకుల పాత్రలు తారుమారు అయ్యాయి. వాళ్ళ నాన్న గారు కనబడిన siteలోకల్ల వెళ్ళి login create చేసుకోవడం మొదలెట్టారు. ఇప్పుడు అన్ని sitesలోనూ social aspect ని చేర్చారు కాబట్టి invite your friends అని ఉంటే అది click చెయ్యడం. దానితో వీడికీ, వీడి friends కి emails వెళ్ళడం. ఒకసారి ఏకంగా facebook account సృష్టించుకుని వీడికి friend request పంపించారు. అది చూసి మనవాడు ఖంగు తిన్నాడు. ఇంటికి phone చేసి, "నాన్న, మీరంటే నాకు ఇష్టం, గౌరవం ఉన్నాయి. కానీ, Internet లో మాత్రం నన్ను వదిలెయ్యండి. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రాకండి. మీ నాన్న గారు కూడా ఇలాగ మీరు friends  తో కలిసి cigarette కాలుస్తూ బాతాఖానీ కొడుతుంటే వచ్చి చూసేవారా? మీరు facebookలో ఎవరెవరితో ఏమేం మాట్లాడుతున్నారో నేను అడగను. అమ్మతో కూడా చెప్పను. నేను ఏం చేస్తున్నానో మీరు అడగద్దు", అని బొమ్మరిల్లు style లో చెప్పాడు. అది విని నేను తెగనవ్వుకున్నాను.

మఱొక స్నేహితురాలు వాళ్ళ అమ్మగారికి facebookలో ఖాతా సృష్టించి, కొంతవరకు ఎలాగ వాడాలో నేర్పించి US వచ్చింది. ఒక రోజు వాళ్ళ అమ్మ గారి మీద అలిగి phone ఎత్తడం మానేసింది. వాళ్ళ అమ్మగారికి ఇంకా కోపం వచ్చింది. అది ఎలాగ చెప్పాలో తెలియలేదు. facebook లో login అయి ఈమె updates చూసింది. ఈమె ఒక స్నేహితురాలి photo లో ఒక వ్యాఖ్య వ్రాసింది. ఆ క్రింద Add comment అని కనబడింది. aunty కి ఏం తెలుస్తుంది అక్కడ వ్రాస్తే అందరూ చూస్తారు అని. ఆవేశంగా, "phone కూడా ఎత్తట్లేదు. చాలా ఎదిగిపోయావు. thanks!" అని వ్రాశారు. అంతే ఈ అమ్మాయి అన్నం తింటున్నది కాస్తా, బుఱ్ఱ గింగిరాలు తిరిగి వాళ్ళ అమ్మగారి ఖాతా లోనికి login అయ్యి ఆ వ్యాఖ్యని నిర్మూలించింది (deleted). ఆ అలక విషయం నాకు చెప్తూన్నంత సేపు బాధపడ్డవాడిని ఇది వినగానే నవ్వు ఆపుకోలేకపోయాను.

మఱొక స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు వంట వండటం మొదలెట్టాడు. నేను కూర్చుని చూస్తున్నాను. అప్పుడే వాళ్ళ ఇంటినుండి Yahoo! messenger audio call వచ్చింది. నేను వెళ్ళి నీకు call వస్తోందిరా అంటే, వాడు బెంబేలెత్తిపోయి reject కొట్టాడు. అదేమిరా అంటే, "మా అమ్మకు అవసరమైనప్పుడు మాట్లాడటానికి ఉంటుంది అని నేను ఇది నేర్పిస్తే రోజూ నాలుగు సార్లు చేసేస్తోంది. అసలు రోజంతా call ఉంచితే ఏం పోయింది? Internet bill అంతే వస్తుంది కదా అంటోంది.", అన్నాడు. "Internet bill అంతే వస్తుందని ఎలాగ తెలుసురా?" అంటే "మనమెంత మాట్లాడితే అంత ఖర్చవుతుంది అని అనుకుని ఎప్పుడూ 'బాగున్నావా? ఆరొగ్యం జాగ్రత్త. ఉంటాను నాన్న.' అని తప్ప వేరేది మాట్లాడేది కాదు. అప్పుడు చెప్పాను, 'మనది unlimited plan. ఎంత మాట్లాడినా అంతే ఖర్చవుతుంది అని.", అన్నాడు.  నాకు ఏం చెప్పాలో తెలియలేదు -- వాళ్ళ అమ్మగారు వాడిని ఎంత miss అవుతున్నారో చూసి బాధ, ఆవిడ idea కి నవ్వు.

నా స్నేహితుడి అన్నగారు కూడా facebook లో చేరారు. ఒక రోజు వెళ్ళి ఆయన profile చూస్తే ఆయన friends లో ఎవడొ russia వాడున్నాడు. వాడెవడొ spammer కుంక అయ్యి ఉంటాడు. మనవాళ్ళకి తెలియదు కదా. ఎవడో పరాయి దేశస్థుడు మనని రెండు చేతులూ చాచి స్నేహాన్ని కోఱుతుంటే కాదంటే తప్పుగా ఉంటుంది అని అనుకున్నాడొ ఏమో accept చేశాడు. అది చూసి మా వాడు, "ఒరేయ్, ఇది చూడరా మరీను", అని చెప్పి కంగారు పడ్డాడు.

ఇక "Click here and claim your laptop; Congratulations! You're the lucky winner; Win a trip to Maldives for free!: లాంటివి చూసి వీళ్ళు ఇంకేం చేస్తారో; ఎక్కడ click చేసి computerకి ఏ Virusలు తెచ్చుకుంటారో అని ఒక కంగారు. ఒక్కోసారి, రేపు పెద్దయ్యాక పిల్లల మీద అభిమానంతో మనం ఎలాంటి పనులు చేస్తామో అనిపిస్తుంది నాకు. అదీ చూద్దాము :)

11 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

chaalaa baagaa chepparu.nijamgaa nijam.. biddalu dhooramgaa unnandhuku baadhapaduthoo.. biddalani visigisthoo.. Inkaa.. labhinchina avaakaasham tho..yuvatharamtho.. potipaduthunna peddhavaaru unnaaru.. well said.. Sandeep.

Unknown said...

చాలా బాగుంది :)ఆ మాటకి వస్తే ఈ మధ్య నా స్నేహితుడి అన్నయ్య ఒకడు వాడితో కంప్యూటర్ కొనిపించుకున్నాడు. ఆ computer కి Internet connection తగిలించి, చాలా busy అయిపోయాడు, ఎక్కడ పడితే అక్కడ account create చేసేశాడు. రోజు కి 5-6 సార్లు mail చేయడం మొదలెట్టాడు. Facebook లో వాడి girl friends కి friend requests పంపించే మహత్తర కార్యానికి కూడా శ్రీకారం చుట్టాడు. దానితో మా వాడికి మతి పోయి, తల ప్రాణం తోక లోకి వచ్చినంత పని అవుతోంది. ఈ విషయం మొన్న నాకు చెప్పుకుని కంటతడి పెట్టుకున్నాడు ! అప్పుడు జాలి పడ్డాను కాని ఈ blog చదివిన తరువాత తలుచుకుంటే నవ్వొస్తోంది :)

Prasad (kkp) said...

avunu raa ... naaku ide paristhiti.... intlo oka computer konna adi touch screen , skype ela vaadalo nerpincha.... phone maanesi skype meeda paddaru .... emanna ante video chat cheddam antaru ..... baaga fast unnaru maavallu .... emo anukonna .... maa daddy internet shop ki velli bill direct ga naa mail ki pampu intiki vaddu annaranta ..... veellu fb loki vaste emavtundo ento .....

Srikanth.C said...

"ఈ రోజుకు కూడా మా చిన్నత్తయ్య, నేను విశాఖపట్నం నుండి తుని వెళ్తుంటే "ఒరేయ్ నాన్న మూడు గంటల passenger పట్టుకుంటే పదిరూపాయలు తక్కువవుతుంది" అంటుంటే నాలో ఏదో తెలియని బాధ కలుగుతుంది" --- ఇది చదవగానే నాకు నా చిన్ననాటి సంఘటన గుర్తుకు వచ్చింది. సరిగ్గా పది సంవత్సరాల క్రితం నేను ఒక బస్సు స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. రెండు నిమిషాల్లో ఒక ఎక్ష్ప్రెస్స్ బస్సు వచ్చింది. ఆర్డినరీ బస్సు లో వెళ్తే ఒక్క రూపాయి మిగులుతుంది అని ఎక్ష్ప్రెస్స్ బస్సు ఎక్కలేదు. ఇప్పటికి గుర్తు నాకు ఒక గంట సేపు ఆర్డినరీ బస్సు కోసం నిలబడ్డాను బస్సు స్టాప్ లో. నేను అల చేసాను అంటే ఇప్పటి స్నేహితులు వింతగా చూస్తారు. ఆ ఒక్క రూపాయికి ఇచ్చిన విలువ మరిచిపోలేనిది. ఇప్పటి యువత అలా వుండదు. (FYI : నేను జస్ట్ 25 !)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

హాహా.. పెద్దవళ్ళమీద నీకున్న గౌరవం నేనెఱుగుదును. అందుకని వాళ్ళు చేసే కొన్ని పనులవల్ల కలిగే హాస్యాన్నికూడా ఎంత "గౌరవ హాస్యం"తో రాశావో.

నాకు కొంతమంది పెద్దవారు ఇలా కొన్ని సపాం ఫ్రెండ్స్ invites పంపుతుంటారు. అయ్యో పాపం వీళ్ళకు ఎలా చెప్పాలి అనుకునేవాణ్ణీ. ఇప్పుడింక ఈ వ్యాసాన్ని ఫార్వార్డ్ చేస్తాను.... వాళ్ళు నవ్వుకుంటారు :-)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

main వ్యాసానికన్నా నువ్వు రాసిన మిగతా విషయాలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. "డబ్బుకు ఈ కాలం వారు ఇచ్చే విలువ...", "ఉపాధ్యాయులను చూసే తీరు..." " Trunk calls రోజుల్లో మాట్లాడాల్సిన విషయాలు కాగితం మీద రాసిపెట్టుకునేవారు..."

మనం నేర్చుకోవలసినదీ, మార్చుకోవలసినదీ చాలా ఉన్నాయ్.

అద్భుతంగా రాసిన నీకు virtual ఆలింగనాలు :-) Take care...

ప్రవీణ said...

చాల బాగుంది. హాస్యం కలగలిపి చక్కటి విషయాన్నీ మరి చక్కగా చెప్పారు.

రాఘవ said...

సందీపన్నయ్యా, ఇంత సున్నితమైన అంశాన్ని ఇంకా సున్నితంగా చెప్పావు చూసావూ, భలే భలే.

నాకు రామకృష్ణారావుగారు, శంకరయ్యగారు తదితరులను చూస్తూంటే... సరిగ్గా ఇందుకే, వారి ఉత్సాహానికీ శ్రమకీ వారిపైన ఉన్న గౌరవం రెట్టింపౌతుంది.

రవి said...

సందీప్, బాగా చెప్పారు.

నేను బ్లాగు మొదలెట్టినప్పుడు నాకూ ఒక మీమాంస. నాకేమో ఏదిబడితే అది ఎవరేమనుకుంటారోనని అనుకోకుండా రాసెయ్యడం అలవాటు. మా వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందా అని. అయినా సరే, నా ధూమపానం, అభక్ష్యభక్షణ, అపేయపాన, అకార్యకర్తృత్వ (ఇవి చాలా తక్కువ) వివరాలన్ని రాశాను. మా నాన్నను ఒదిలేస్తే, మా బంధువర్గంలో పెద్దలందరికీ తెలియనే తెలిశాయి. చిత్రమేమంటే, నేనంటే మా ఇంట్లో అందరికీ గౌరవం పెరిగింది.

Sandeep P said...

@అందరూ
మీకు నా వ్యాసం నచ్చినందుకు సంతోషం.

@శ్రీకాంథ్
హ హ, నమ్మడం కష్టమే :) ఎక్కడినుండి ఎక్కడ పడ్డాం buddy.

@అవినేని అన్నాయ్, రాఘవ
మీ అభిమానానికి కృతజ్ఞతలు.

.C said...

శ్రీకాంత్ వ్రాసిన వ్యాఖ్య నాకూ వర్తిస్తుంది. ఎన్నో సార్లు బాపట్ల నుంచి హైదరాబాదుకు బయలుదేఱి, టిక్కెటుకు డబ్బులు సరిపోయేలా లేవని గమనించుకుని విజయవాడ దాకా ఎఱ్ఱ బస్సెక్కి వెళ్ళి అక్కడి నుంచి అరకొఱగా ఉన్న సూపర్ ఎక్స్‌ప్రెస్ బస్సొచ్చే దాకా ఉండి యెక్కి వెళ్ళేవాడిని. ఇప్పటికైనా డబ్బులు ఖర్చు పెట్టడంలో లోభత్వం లేకున్నా దాదాపు ప్రతి రూపాయి/డాలరు యెంచుకోవటం మాత్రం పోలేదు... మధ్యతరగతి నుంచి కాస్తంత ఎగబ్రాకినా మా అమ్మానాన్నల్లోనూ పోలేదు, నాలోనూ పోలేదు. డబ్బంటే లెక్కలేనితనం వదిలించుకుంటే కానీ యువతలోనైనా, ఎవఱిలోనైనా ఆ జాగ్రత్త రాదు.

ఈ వ్యాసం నేను చదివేసరికి వ్యాఖ్యలేమీ లేవు... వ్రాయబోయి ఆగిపోయాను. ఒక కారణం పై సంగతులు వ్రాస్తే చర్చ ప్రక్కద్రోవ పడుతుందని. మఱో కారణం నేను వ్యాసంలో హాస్యస్ఫోరకంగా చెప్పిన విషయాలతో పూర్తిగా యేకీభవించను కనుక. "పెద్దలకు చెప్పలేని, చెప్పకూడని పనులను చేస్తున్న తప్పు మనలో ఉందా, పిల్లలతో సాధ్యమైనంత యెక్కువగా అనుబంధం పెంచుకుందామనుకునే వాళ్ళలో ఉందా?" అని అడిగితే నేను మొదటిదానికే వోటు వేస్తాను. "నీ దాకా వస్తే కానీ తెలియ"దంటారేమో... దాదాపు పదేళ్ళ క్రితం నేను, మా అన్న సభ్యులుగా ఉన్న ఒక యాహూ! కూటమిలో నేను "Girl friends vs. girlfriends" అన్న విషయం మీద నా అభిప్రాయాలు వ్రాసాను. వయోభేదం రెండేళ్ళు కూడా లేకపోయినా అమ్మాయిల గుఱించి మాట్లాడుకునే అలవాటు లేని అన్నదమ్ములం మేము. (ఈ విషయం ప్రత్యేకించి యెందుకు చెప్పానంటే రాయలసీమలో యెక్కువగా మా లాంటి అన్నదమ్ములనే చూసిన నేను కోస్తాంధ్రులలో అలాంటివాళ్ళు తక్కువని గ్రహించాను తఱువాతెప్పుడో.) అప్పుడు మా అన్నగారు కూటమిలో నన్ను ప్రస్తావిస్తూ వ్రాసిన ఒక సామెత: "ఇంట్లో మొగుడున్నాడని సిగ్గుపడి వీథిలోకొచ్చి చీర మార్చుకుందట నీలాంటిదే ఒకత్తి..." అని. (ఇంతా జఱిగి యిప్పటికీ అలాంటి విషయాలు అన్నతో "మాట్లాడను" నేను, తానూ నాతో మాట్లాడడు.) కనుక చెప్పొచ్చేదేంటంటే... పెద్దలతో పంచుకోలేని సంగతులు మనం చేస్తున్నామేమో కానీ వాళ్ళు మన జీవితాల్లోకి జొఱబడుతున్నారనుకోవటం సరి కాదేమోనని నా అభిప్రాయం. ఎవఱినీ నొప్పించే ఉద్దేశం లేదు... కేవలం నా అభిప్రాయమే చెప్పాను. (అలాగని నా వేగు సంకేతపదాన్ని మా అమ్మానాన్నకి యిచ్చేసేంత పారదర్శకంగా నా జీవితముందని నేను చెప్పటంలేదు! :-( :-P)