Saturday, February 26, 2011

తొలివలపే తీయనిది... (వేటూరి పాట)

సామాన్యజనులకు అర్థమయ్యే విధంగా లోతైన భావాలను వ్రాయగలగడం సినీకవులకు ఉపయోగపడే లక్షణం. వేటూరి వ్రాసిన భావాలను అర్థం చేసుకోవడానికి ఒక్కోసారి భాషలో కానీ, చరిత్ర వంటి విషయాలలో కానీ పట్టు అవసరమౌతుంది. అది ఆయన లేఖినిలోని గాంభీర్యం ఐతే, అలాగ అవసరం లేకుండా వ్రాసిన పాటలు ఆయన కలంలోని లాలిత్యాన్ని ప్రదర్శిస్తాయి. దేని అందం దానిది.

వేటూరి లలితంగా వ్రాసిన పాటల్లో యువరాజు చిత్రంలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. తొలివలపు గురించి ఎంతో లోతుగా చెప్పారు వేటూరి, కానీ ఎక్కడా గ్రాంధికమైన పదాలు కనబడవు. ఒక్కో వాక్యంలోనూ ఒక్కో ఉపమానంతో ఆకట్టుకున్నారు. ఈ పాటకు స్వరకల్పన చేసింది రమణ గోగుల, పాడింది హరిహరన్, చిత్ర.. ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిటో అర్థం కాదేమో...

తొలివలపే తీయనిది, ఆ దాహం తీరనిది
కాలంలా కరిగిపోనిది, తానంలా(?) తిరిగిపోనిది
తొలివలపు ఒక దాహం. మనసులో ఉన్న వ్యక్తిని ఎంతసేపు చూసినా, తనతో ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఒక సారి ప్రేమభంగం అయ్యాక మళ్ళీ ప్రేమించడంలో  "ఇదివరకు చూసినదే" అనే ఒక రకమైన నిర్లిప్తత ఉంటుంది. కాలంతో కరిగిపోకుండా చివరివరకు గుర్తుండే ఒక తీయని జ్ఞాపకం అది.

వేదంలాగా లిపిలేనిది, వేధిస్తున్నా సుఖమైనది
పూర్వం వేదాన్ని ఎవరూ వ్రాసి ఎఱుగరు. అది గురుముఖతః విని కంఠస్థం చేయడమే మార్గం. అందుకే వేదం లిపి లేనిది అంటారు. తొలివలపు కూడా మాటల్లో వివరించలేని ఒక తీయని అనుభూతి అనడానికి దాన్ని వేదంతో పోల్చడం జరిగింది. తొలివలపు వలన చలించినంతగా మనసు మళ్ళీ చలించదు. ఎప్పుడూ అవే ఆలోచనలతో కలవరపెడుతున్నా తీయగా ఉంటుంది. ఇక్కడ "వేదానికి", "వేధిస్తున్నా" కి యతిమైత్రి, ప్రాస కుదరడం గమనార్హం.

ఓడిస్తున్నా గెలుపే అది, ఓదార్చే ఓ పిలుపైనది
ఈ చిత్రంలో తను ప్రేమించిన మనిషి మఱొక అమ్మాయిని పెళ్ళిచేసుకుంటుంటే చూస్తూ సిమ్రన్ ఈ మాటలంటుంది. తనకిష్టమైన వ్యక్తి తనకు దక్కకపోయినా అందులో అతనికి మంచి ఉంటుంది అని తెలిసి ఆ ఓటమిని అంగీకరిస్తూ, తన ప్రేమను గెలిపించుకుంటోంది కాబట్టి "ఓడిస్తున్నా గెలుపే అది". కథానాయకుడు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయాక తనకు మిగిలేవి తొలివలపు జ్ఞాపకాలే కాబట్టి అవే తనకు ఓదార్పు అని భావన.

చుక్కలనే నిలుపునది, దిక్కులనే కలుపునది -- ఆకశం తానై ఉన్నది
ఆకాశానికి ప్రేమకు సామ్యం చెప్తున్నారు వేటూరి. చుక్కలవంటి ఆశలను/జ్ఞాపకాలను ధరించేది, ఎక్కడెక్కడో పుట్టీ పెరిగిన ఇద్దరు మనుషులను కలిపేది, ప్రపంచమంతా ఉండేది ప్రేమ/ఆకాశం.

ఇద్దరిలో ఒక్కటది, ఒక్కరిలో ఇద్దరది -- నీకోసం నేనై ఉన్నది
ఇది నాకు బాగా నచ్చిన వాక్యం. ఇద్దరిలోనూ ఉన్న ఒకే భావం తొలివలపు. ఒక్కరే ఉన్నా తమతో మఱొకరు కూడా ఉన్నట్టు అనిపించేటువంటి భావన ప్రేమ. ఒకరి కోసం ఒకరై జీవించేటువంటి అనుబంధం ప్రేమ.

గుండెల్లోన గూడే ఇది, గుచ్చే రోజామాలైనది
తొలివలపుకు మనసులో శాస్వతంగా ఒక స్థానం ఉంటుంది కనుక, "గుండెల్లోన గూడు" అది. వేధిస్తున్నా సుఖమైనది కనుక గుచ్చేటువంటి రోజాపూల మాల కూడా.

మాటల్లోన మౌనం అది, మనసుల్లోన ధ్యానం అది
సిమ్రన్ మనసులో బాధను పెట్టుకుని మాట్లాడుతున్నా అందులో తన ప్రేమ ఒక మౌనవేదనగా దాగి ఉంది. మనసులోని తమ ప్రేమను నిరంతరం తలుచుకునే ఇద్దరు ప్రేమికుల తపస్సు అది.

ఏ ఋణమో తెలియనిది, ఏ వరమూ అడగనిది, ఏ మజిలీ చేరేనో అది
కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఏదో ఋణం ఉండటం వలనే ఒక్క చూపులో ఇద్దరు మనుష్లు అంత దగ్గర అవుతారు అని కవి భావన. తొలివలపే ఒక వరం, అందులో స్వార్థం ఉండకూడదు. అలాంటి నిస్స్వార్థమైన ప్రేమ ఏ గమ్యం చేరుతుందో అనే ప్రశ్నతో నాయకుడు సందిగ్ధంలో పడ్డాడు.

ఎప్పటిదో తెలియనిది, ఎప్పటికీ మరువనిది, ఓ కథలా చేరే కంచికి
ఎవరు వ్రాశారో తెలియకుండానే "అనగనగనగనగా" అంటూ కథలు చెప్పుకుంటాను. చివరకు కథ కంచికి వెళ్ళింది అని నిద్రలోకి జారుకుంటాము. అలాగే ప్రేమ కూడా. ఎక్కడ మొదలౌతుందో తెలియదు కానీ, కొన్నాళ్ళుండి వెళ్ళిపోయినా జీవితాంతం గుర్తుంటుంది.

ఎద కన్నా లోతుగుంటది, బ్రతుకల్లే తోడు ఉంటది
ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి. మనసు ఎంతో లోతైనది, అందులో ఎన్నో భావాలు ఉంటాయి. ఆ మనసు కూడా అర్థం చేసుకోలేని ఒక రకమైన ఆరాధనా భావం ప్రేమ. ఎందుకు కలుగుతోందో తెలియని ఒక ఆర్ద్రత ప్రేమ. అది బ్రతికున్నంతకాలం గుర్తుంటుంది...

ఈ పాటను క్రింది వీడియోలో చూడవచ్చును.

8 comments:

దేవి said...

సందీప్ గారూ,
సినారె గారు వ్రాసిన తొలివలపే తీయనిది, మదిలో ఎన్నడు మాయనిది (నీడలేని ఆడది) అనే అద్భుతమైన పాట పల్లవితో వేటూరిగారు వ్రాశారా? ఆశ్చర్యం!

Sandeep said...

@దేవి గారు

నాకు సినారే గారి పాట గురించి తెలియదండి. ఆ పాట chimatamusic.com లో ఇప్పుడే వింటున్నాను. చాలా బాగుంది. సత్యం సంగీతం కూడా బాగుంది. వేటూరి మఱొక కవి పాటలోని పల్లవిని తీసుకుని వ్రాయడం చాలా సార్లు జరిగింది. నాకు గుర్తున్నవి.

వేణువై వచ్చాను (అన్నమయ్య)
సమయానికి తగు మాటలాడెనే, ఓడను జరిపే(త్యాగరాజు)
రాజశేఖరా నీ పై మోజు తీరలేదురా (సముద్రాల సీనియర్ (?))
మధురం మధురం (షాక్ చిత్రంలోనిది) (వల్లభాచార్యుని మధురాష్టకం)

ఇది ఆ కవుల మీద వేటూరికి ఉన్న గౌరవానికి నిదర్శనమేమో...

Phanindra said...

Nice writeup, this song does not require much explanation.

I think the pallavi lines for which you put question marks are "praaNamlaa tirigipOdadi" - a rather deep meaning.

Initially I never liked this lyric. The meaning is good but somehow it did not appeal to me. Even in the movie "Gemini" Veturi wrote simple lyrics like this and again I did not like them much. Only after repeated listening I happened to like these lyrics.

వనజవనమాలి said...

nice explain..wonderful.

లలితా స్రవంతి పోచిరాజు said...

music bagaa dominate cEsindi e song ki, so e lyric lo unna bhavam clear ga andalEdu anukunTAnu

రాఘవ said...

"ఒక్కసారైనా ప్రేమలో పడకపోతే ఈ పాటలోని లోతేమిటో అర్థం కాదేమో"

వేఱే కోణంలో చూస్తే, ప్రేమలో పడినవారికి ఈ పాట వింత అర్థాలతో మఱీ గాఢంగా గోచరిస్తుందేమో.

Sandeep said...

@రాఘవ

మీ వ్యంగ్యం బాగుంది. ఇంతకీ మీకు వింతగా అనిపించిన వివరణ ఏమిటో చెప్పనేలేదు?

శ్రీనివాసమౌళి said...
This comment has been removed by the author.