Friday, January 28, 2011

వేటూరి గారి జయంతి

జనవరి వస్తోంది అనగానే మా ఇంట్లో పుట్టినరోజు పండుగల హడావుడి. ఇద్దరు వదినలు, ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య -- అందరూ ఇదే నెలలో పుట్టారు. అలాగే నేను గుర్తుంచుకున్న మఱొక పుట్టినరోజు వేటూరిది -- జనవరి 29. నా బంధువులందరూ నా కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు. మఱి వేటూరో? లేదు. ఆయనకు ఫలానా సందీప్ అనే అభిమాని ఉన్నాడనే తెలియదు. మఱి వేటూరి పుట్టినరోజుతో నాకేమిటి సంబంధం? ఇది పరోక్షమైనది. ఆయన నన్ను పట్టించుకోకపోయినా, ఆయన పాట నన్ను పట్టుకుంది. బహుశః దీన్ని పాటిచ్చుకోవడం అనాలేమో. నా కష్టసుఖాల్లో నా ఆత్మీయులందరితో పాటు ఆయన పాటలు కూడా తోడున్నాయి. అందుకే ఆయన పాటంటే నాకు ప్రాణం. ఆ పాట ఇచ్చిన మనసు అంటే నాకు అభిమానం.

మొన్న ఒక నాలుగు రోజులు అనారోగ్యం చేసి పక్క దిగలేదు. తత్ఫలితంగా నా mp3 player లో పాటల్ని కూడా వినలేదు. నయమయ్యాక ఒక్క రోజు నాలోనే నాకు తెలియని గొంతు ఒకటి మేలుకొని,  "వేటూరిని మరిచిపోతున్నావా సందీప్?" అని అడిగింది. ఒక్క నిముషం నివ్వెరపోయి చూశాను - "ఎన్నాళ్ళైంది వేటూరి పాట విని - వారం దాట వస్తోందా?", అనిపించింది. సరిగ్గా ఆలోచిస్తే - "లేదే - మొన్ననే వేటూరిని తలుచుకున్నాముగా", అని గుర్తొచ్చింది. ఏదో రెహ్మాన్ సంగీతం గురించి చర్చిస్తూ, "మెరుపు కలలు చిత్రంలోని గీతాలు బాగుంటాయి కదా?", అంటే నా స్నేహితురాలు - "అమ్మో, అందులో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు", అంది. నిజమే! నేను కూడా రెండుమూడు పదాలకు అర్థాలు నిఘంటువులో చూసుకోవలసివచ్చింది. మఱి భాష మీద ఆయన పట్టు అది. "తల్లో తామర మడిచే ఓ చిలకా...అట్టిట్టాయెను మనమే ఓ థళుకా! చెలి ఒడిలో కాగెను హృదయం, నా కంఠం వరకూ ఆశలు వచ్చే వేళాయె, నీ నల్లని కురుల నట్టడవుల్లో మాయం నేనైపోయానే, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టే కొత్తగా, పరువం వచ్చిన పోటు తుమ్మెదల వైశాఖం, గలబా కప్పలు జతకై చేరే ఆషాఢం, ఎడారి కోకిల పెంటిని వెతికే గాంధారం, విరాళిగీతం పలికే కాలం ప్రియానుబంధం ఈ కలం, నఖం కొరికిన పిల్ల అదెంతదో నీ ఆశ, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ? ఇదే సుమా కౌగిలి భాష" -- ఇలాంటి పదాలను వాడితే సగటు తెలుగు చిత్రవీక్షకుడికి ఏమర్థమవుతుంది. "నువ్వసలు నచ్చలే అనో నీ బలుపు ఇష్టం అనో అంత లేదె అంత లేదె అనో if you gonna love me, i gonna love you" అనో అంటే సులభంగా అర్థమవుతుంది. మళ్ళీ ఒక సారి గుర్తొచ్చింది, "అయ్యో...మళ్ళీ ఇలాంటి కొత్తపాట వినలేమా?" అనిపించి నా మీద నాకే జాలేసింది. "ఏరెల్లి పోతున్నా నీరుండిపోయింది నీటిమీద రాత రాసి నావెల్లిపోయింది" అని ఆయన చెప్పిన మాటలే మళ్ళీ తలుచుకోనా?

అదే రోజు రాత్రి ముగ్గురం స్నేహితులం కూర్చుని కర్నాటిక సంగీతం గురించి చర్చించుకుంటున్నాము. ఇంతలో రాగాల పేర్ల గురించి వస్తే, వేటూరి రాగాల పేర్లను ఎలాగ పాటల్లో వాడేవారో చెప్తూ అన్నాను - "వేటూరి రాగాల పేర్లని ఊరికెనే వాడరండీ... అక్కడ ఆ రాగం బాణీలో కూడా ఉండాలి" అని. డబ్బు మీద ఆశ వదులుకొమ్మని చెప్పేటప్పుడు, "శ్రీరాగమందు కీర్తనలు మానర" అనడం గొప్ప ప్రయోగమే. కానీ, అప్పుడు బాణీలో కూడా అదే ఉంటే అప్పుడు అది మహాద్భుతం. అలాగే, "నాలో రేగే హంసానందీరాగాలై", "అరవిచ్చేటి ఆభేరిరాగాలు" అన్నీను.

ఇంతలో వాళ్ళు "మధురాష్టకం" పెట్టారు. అందులో "అధరం మధురం, వదనం మధురం" అని పల్లవి. వెంటనే నాకు వేటూరివి రెండు పాటలు గుర్తొచ్చాయి -- shock చిత్రంలో "మధురం మధురం" అనే పాట దాదాపు ఇలాంటి ప్రయోగాలతోనే సాగుతుంది,  "యువరాజు" చిత్రంలో "మనసేమో చెప్పిన మాటే వినదు" పాటలో పల్లవికి, మొదటి చరణానికి మధ్యలో కూడా ఈ పాట ఉంటుంది. ఈ రెండూ వేటూరికి మధురాష్టకం పైన ఉన్న అభిమానానికి ఋజువులేమో. ఒక సామాన్యమైన యుగళగీతం వ్రాయమంటే కృష్ణభక్తిభరితమైన వల్లభాచార్యుని పాటను తీసుకురావడాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

ఉఫ్...లేదు ఇంకా నేను వేటూరిని మరిచిపోలేదు. అది సంభవం కూడా కాదు. తొలిప్రేమను ఎవరూ మరిచిపోరంటారు. మరి వేటూరి పాట మీద నాకున్న ఈ ప్రేమ తొలిప్రేమే కాదు, మలిప్రేమ కూడానేమో. మళ్ళీ ఇంకొకరి పాటలు వేటూరి పాటలలాగ నన్ను ఆకర్షించవేమో...

వేటూరి వాక్కులనే నేను సామెతలుగా వాడుకుంటూ ఉన్నాను. పిల్లకాయలు ప్రేమ ప్రేమ అని తెగ ఉత్సాహపడిపోతుంటే వారిని చూసిన విరక్తిలో, "పిపీలికాది బ్రహ్మలో పిపాస రేపు ప్రేమలు" అని, ఏళ్ళ తరబడి పెళ్ళి చేసుకోకపోతే, "ఉలకడూ పలకడూ ముదురుబెండడు" అని, పని చెయ్యాలని నన్ను నేనే ఉత్తేజపరుచుకోవడానికి, "మనసు ఉంటే మార్సు దాక మార్గముంది ఛలో" అని, జీవితం మీద విరక్తి వచ్చినప్పుడు "అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే" అని, అందమైన అమ్మాయిని చూస్తే "కిన్నెరసాని వచ్చిందమ్మ, వెన్నెల పైటేసి" అని...ఇంక ఇలాగ చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి. ఆఖరికి నా పెళ్ళి గురించి నేను ఇప్పటి దాకా ఆలోచించిన ఏకైక విషయం ఏమిటి అంటే, "పెళ్ళి cassette లో ఏమేం వేటూరి పాటలు పెట్టించవచ్చును?", అని. బహుశః నాది పిచ్చేమో. కానీ, నాకు అందులో తృప్తి ఉంది.

వేటూరి పుట్టినరోజును ఆయన అభిమానులు చాలామందే గుర్తుంచుకోకపోవచ్చును. కానీ, ఆయన పాటలను ఇంకా తమ సొంతవాటిలాగే అభిమానిస్తున్నారు. ఇంతకంటే ఏ కవి మాత్రం కోరుకునేది ఏముంది?..."ఎగిరి ఎగిరిపోయింది సీతాకోకచిలుక. మిగిలింది వేలిపై అది వాలిన మరక..."

12 comments:

శిశిర said...

చాలా బాగా రాసారు. బాగుంది.

Phanindra said...

Very nice writeup sOdaraa. Heart touching!

వనజ తాతినేని/VanajaTatineni said...

veturi paata yedhanu meeta. aa.. pata leni chota rasaheenathaki nelavata. aayana..Telugu paata ki praatahsmaraneeyudata. veturi pai mee abhimaanaaniki.. spandhinchi.. aanandhamtho.. thankyou..friend.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

తమ్ముడూ, ఇంటెర్నెట్లో నిన్ను వాటేసుకుని నా సంతోషాన్ని తెలుపడం కుదరదుగాని చదువుతుంటే ప్రతి లైన్‌కీ మేనూ, మనసూ పులకరించింది! అంత బాగ రాశావు. నీ వేటూరి భక్తి నేనెరగనిది కాదుగాని, ఆయన మీద నువ్వు రాసినవి చదివిన ప్రతిసారి వేటూరి పాటలా నన్ను ఆనందింపచేస్తుంది.

"వేటూరి పాట మీద నాకున్న ఈ ప్రేమ తొలిప్రేమే కాదు, మలిప్రేమ కూడానేమో. మళ్ళీ ఇంకొకరి పాటలు వేటూరి పాటలలాగ నన్ను ఆకర్షించవేమో..."
పైన రాసిన ఈ లైన్ నాకూ వర్తిస్తుంది రా!

ఊకదంపుడు said...

బావుందండి - నే బాగా తలుచుకొని నన్ను నేను ఓదార్చుకునే పాట - "ఆది నుంచి ఆకాశమ్ మూగది - అనాది గా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు - ఈ నడమంత్రపు మనుషులకే మాటలు" - ఆ మాటే ఇవాళ నా బ్లాగులో చెబుదామంటే కుదరలేదు. మీరు ఇలా చెప్పించారు.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

చాలా బాగా వ్రాశారు.

Vasu said...

వేటూరి గారికి తెలుగు జాతి ఎంత అన్యాయం చేసింది అని బాధ పడుతూ ఆయన గురించి గూగులిస్తుంటే మీ టపా కనపడింది.
మీ లాటి వీరాభిమానుల ప్రేమ మూట కట్టుకున్నాడు. ఇంతకంటే ఏ కవికైనా ఏం కావాలి అనిపించింది.

అవినేని భాస్కర్ గారు నా గుండెల్లో మాటల్ని చెప్పారు.

గుండెల్ని హత్తుకునేలా రాశారు అనడం చాలా understatement అవుతుంది.

Vasu said...

ఒక వారం ముందు తెలిసుంటే ఇతోధికంగా వేటూరిని స్మరించుకునే వాడిని అనిపించింది. జనవరి ౨౯ న పుట్టినరోజు అన్నారు కదా.
"వేటూరి పుట్టినరోజును ఆయన అభిమానులు చాలామందే గుర్తుంచుకోకపోవచ్చును" - ఇందులో నేను ఒకడిని . ఆయన పుట్టిన రోజు కూడా తెలుసుకో నందుకు కొంచం సిగ్గుపడుతున్నాను.

Mauli said...

@@@"పెళ్ళి cassette లో ఏమేం వేటూరి పాటలు పెట్టించవచ్చును?",

మీ పెళ్ళిచూపుల్లో ..పాడుకోవాల్సిన పాటల్ని కూడా :)

వేటూరి పాటలన్నీ ఒకచోట పెట్టకూడదూ...అభిమానుల్తో పాటు మే౦ కూడా వి౦టా౦ :)

sharma said...

"పిపీలికాది బ్రహ్మలో" ante ardham enti sir..

Sandeep P said...

@శర్మ

పిపీలికం అంటే చీమ, బ్రహ్మ అంటే తెలిసినదే. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే చీమ (అన్నిటికంటే చిన్న జీవిని) మొదలుకొని బ్రహ్మ (అన్నిటికంటే పెద్ద జీవి) వరకు అని అర్థం.

sharma said...

dhanyavaadaalu!