Saturday, September 25, 2010

నిదుర రాని నిట్టూర్పుల జోల పాటలు

ఈ మధ్యన నాకు ఒకదాని తఱువాత మఱొకటి పనులు వచ్చి పడుతున్నాయి. ఇన్ని పనుల మధ్యలో తీరిగ్గా కూర్చుని ఒక పద్యం వ్రాద్దామన్నా, ఒక పాట వ్రాద్దమన్నా, ఒక హాస్యభరితమైన టప వ్రాద్దమన్నా కుదరట్లేదు (ఇదేదో డబ్బా కొట్టుకోవడం కాదు. ఇలాగ పనులు వచ్చిపడటానికి కారణం నాకు క్రమశిక్షణ తక్కువవ్వడమే!).

ఈ పరిస్థితుల నడుమ పడుకునే ముందు రెండు నిముషాలు మనసుని ప్రశాంతపరుచుకుని రెండు మూడు వాక్యాలు వ్రాసి ఆ సంతృప్తితో పడుకుందామని అనిపించినప్పుడల్లా ఏవో వ్రాస్తున్నాను. వాటిల్లో కొన్ని మిత్రులకు నచ్చాయి. అవి ఇక్కడ కూడా వ్రాస్తే బాగుంటుంది అనిపించింది. ఇవి పాటలా అంటే నాలుగైదు వాక్యాలకు మించి ఉండవు, పద్యాలా అంటే ఛందస్సును అనుసరించవు, వాక్యాలా అంటే లయ ఉంటుంది, తవికలా అంటే మరీ అంత తేడాగా ఉండవనే అనిపించింది. వీటినేమనాలో నాకు తెలియదు. అందుకే ఈ టప శీర్షవాక్యం (title) అలాగ వ్రాశాను.

నేను వ్రాసినవాటిల్లో కొన్ని ఇక్కడ వ్రాస్తున్నాను. వాటికి సందర్భాలు అంటూ ప్రత్యేకించి ఉంటే వివరిస్తాను. వాక్యం చివరన $ పెడితే నాకు నచ్చిందని :-D. 


"ఎబ్బే, ఛ ఛ" మొదలైన భావాలేమైనా ఉంటే వ్యాఖ్యల ద్వారా చెప్పండి - ఇకపైన ఈ బ్లాగ్పొల్యూషణ్ని నివారిస్తాను. మనోనేత్రంలో ఇలాంటి నలుసులు మళ్ళీ పడకుండా జాగ్రత్తపడతాను :)

సం:- పడుకోబోతుంటే ఒక అమ్మాయి చిత్రం (photo) చూశాను. లక్ష్మీదేవి లాగా కళగా ఉంది.

ఈ సిగ్గు ఏ ముంగిలి ముగ్గో
ఈ నవ్వు ఏ వాకిలి పువ్వో
ఈ వలపు ఏ గడపల పసుపో $
ఈ సొగసు ఏ రాముడి సగమో $

సం:- ఒకమ్మాయి తిరుపతి మీదుగా బస్సులో వెళ్తోంది. ఏదో భయంలో ఉంది. కాస్త చల్లబడేలాగా రెండు మాటలు చెప్దామనిపించింది. అప్పుడు పంపిన SMS.

వీచేటి ఈ గాలితో పంపాను, నీ మోవిపై చిరునవ్వుపూలన్ని చిరకాలముండేట్టు శ్రీరస్తుభావాలని
పూసేటి సిరివెన్నెల జోలాలి అంటుండగా, ఏ చింతలూ లేక ఈ బంతి నిదురమ్మ ఒడిలోన ఒదగాలని
"జాబిల్లి నీ చెల్లిలాగుందె ఓ బుల్లి, ఏ పల్లె మారాణివే?", అనుకున్న దోవెళ్ళి వెంకన్ననడగాలి ఎవరని

సం:- వేటూరి పూనేశాడు. కొంచెం శృంగారరసం కలపాలనిపించింది. తప్పుగా అనిపిస్తే చదువర్లు క్షమించాలి.

వయసు వాయనాలడుగగ వచ్చానే మగువా!
నా వలపునోము చెల్లించగ నీకెందుకు బిగువ?
జాబిలమ్మ పందిరేసి పిలిచాక తగువా? $
పెదవిగంధమద్దుతాను* మడిపీట దిగవా? $

సం:- మధ్యమధ్యలో నాకు పిల్లరాతాలు వ్రాయలనిపిస్తుంది. అంటే కొత్త ప్రేమకొడుకు భావాలు. అలాగ అనిపించినప్పుడు:

ఆ రోజున నిను చూసిన నన్ను, ఏనాడూ నే మరువగలేను
ఆ నిముషంలోనే జీవిస్తున్నాను $

నువు లేకనె నా పైనే నాకు, కలిగిందే ఈ వింతచిరాకు
ఇటు రాకని నేనే చెబుతున్నా నాకు $


* దుష్టసమాసానికి క్షంతవ్యుణ్ణి.

# ఈ టప శీర్షవాక్యం "నేను" చిత్రంలో వేటూరి వ్రాసిన "దేవతలా నిను చూస్తున్నా" పాటలోని వాక్యం. ఈ పాటకు సందర్భం ఒక కుఱ్ఱాడు తన తోటి విద్యార్థినిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి అతనితో స్నేహంగా ఉన్నా, మఱొకరిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ ఈ కుఱ్ఱాడి ముందు తిరుగుతుంటే అతనికి కలిగే ఆవేదనని, తన ప్రేయసి వేరొకరిని ప్రేమిస్తోంది అని తెలిసినా తనని మరచిపోవడం వీలు కాని అసహాయతనీ వ్యక్తం చేసే పాట అది. ఈ పాటను ఇక్కడ చూడవచ్చును, దాన్ని విశ్లేషిస్తూ సోదరుడు ఫణీంద్ర వ్రాసిన వ్యాసాన్ని ఇక్కడ చదువవచ్చును. ఆ పాటలో దాదాపు అన్ని వాక్యాలూ నాకు నచ్చినా, ఈ వాక్యంలో ఇంకా లోతు కనబడింది. అందుకే దీన్ని నా టపకు శీర్షవాక్యం గా చేశాను.

Friday, September 17, 2010

ఉప్మా కథ

నాకు చిన్నప్పుడు ఉప్మా, ఇడ్లీ - ఈ రెండింటి మీద కొంచెం చిన్నచూపు ఉండేది. ఐనా, చట్నీ బాగుంటే, అందులో ఇవి నంజుకుంటూ సర్దుకుపోయేవాణ్ణి. అమెరికా వచ్చాక మాత్రం ఉప్మా నా జీవనాధారం అయిపోయింది. అది ఎందుకో జీవితంలో ఒక్కసారైనా ఉప్మా వండినవాళ్ళకు తెలుస్తుంది. పావుగంటలో వండుకునే భారతీయ ఉపహారాలు చాలా తక్కువ. అందులో ఉప్మా శ్రేష్ఠమైనది అని నా అభిప్రాయం. పోకిరి సినిమాలో చెప్పినట్టు, "semesterలు semesterలు ఉప్మా తిని బ్రతికేస్తున్నాను". ఈవేళ కూడా అదే వండుకుని తిన్నాను. అది వండుతున్నప్పుడు నాకో కథ గుర్తొచ్చింది.

మాకు చిన్నప్పుడు బడిలో Moral Science చెప్పేవారు. ఐతే ఆరో తఱగతి దాటాక ఆ subject లో మార్కులు total లో లెక్కపెట్టేవారు కాదు. అందుచేత విద్యార్థులందరూ ఆ classలో కళ్ళు తెరిచి పడుకోవడం, book-cricket ఆడుకోవడం, మర్నాడు ఉదయానికి hand-writing వ్రాయడం వంటి పనులు చేసుకుంటూ ఉండేవారు. అది చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులు మాకు ఈ subject అంటే ఆసక్తి లేదని గ్రహించి, కొంతసేపు విషయం చెప్పి, మధ్యలో విద్యార్థుల దృష్టిని మళ్ళీ తమవైపు మరల్చుకోవడానికి కథలు చెప్పేవారు. అలాంటి కథల్లోదే ఈ ఉప్మా కథ. చెప్పిన ఉపాధ్యాయుని పేరు ఆరుముగం శివసామి. ఇంతకీ ఆ కథ ఏమిటో చూద్దాము.

అనగనగా తమిళనాడులో, ఒక ఊళ్ళో ఒకబ్బాయి ఉన్నాడు. అతనికి చదువు అవ్వగానే ఎక్కడో ఉత్తరభారతదేశంలో ఉద్యోగం వచ్చింది. మనవాడా అరవోడు. పొట్ట కోస్తే హిందీ ముక్క రాదు. అక్కడికి వెళ్ళి ఉద్యోగంలో చేరాడే కానీ మరీ తిండికి ఇబ్బందయ్యింది. ఇతడికి వంట రాదు. బయట hotel లో దక్షిణభారతదేశపు వంటకాలు దొరకవు. ఒకసారి అతడు ఇంటికి వచ్చినప్పుడు అతను తింటున్న తీరుని బట్టి, "వీడు మన తిండికి మొహం వాచిపోయి ఉన్నాడు. వీడికి పెళ్ళి చేస్తే మంచిది", అని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. "బాగా వంట వచ్చిన అమ్మాయి కావాలి" అనుకుని, సంబంధాలు వెతగ్గా వెతగ్గా ఒకమ్మాయి photo అతడికి బాగా నచ్చింది.

ఒక సుముహూర్తంలో అందరూ కలిసి పెళ్ళి చూపులకు వెళ్ళారు. అక్కడ ఉప్మా పెట్టారు. ఆ ఉప్మా తిన్న కుఱ్ఱాడు పెనం మీద పడ్డ వెన్నముద్దలాగా కరిగిపోయాడు. ఆ ఉప్మా అమ్మాయే చేసింది అని తెలుసుకుని మురిసిపోయాడు. అమ్మాయి అందరికీ బాగా నచ్చింది. పెద్దలు అన్నీ మాట్లాడుకుని పెళ్ళి జరిపించారు.

స్వంత ఊరు వచ్చిన మొదటి రోజు, అతను భార్యతో, "నువ్వు పెళ్ళిచూపులప్పుడు చేసి పెట్టిన ఉప్మా అద్భుతం. మళ్ళీ చెయ్యవూ?" అన్నాడు. ఆమె అందుకు అంగీకరించి, చక్కగా వండిపెట్టింది. మనవాడు కొత్త పెళ్ళికొడుకు కావడం చేత ఎంత తింటున్నాడో చూసుకోకుండా సుబ్బరంగా తినేసి "మా ఆవిడ వంటలో best" అని చాటింపేశాడు. ఇంక ఆ వారమంతా అదే ఉప్మా తిన్నాడు. మరుసటివారం మనవాడికి కొంచెం వెగటు వచ్చి, "ఈ రోజు దోశలు చెయ్యవోయ్. ఉప్మాకి కొంచెం break వేద్దాం", అన్నాడు. ఆమె, "నాకు దోశలు చెయ్యడం రాదండి" అంది. కొత్తసంసారంలో కోపాలు ఉండకూడదు, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామన్న సదుద్దేశంతో:
అ: "పోనీ నీకేం వచ్చు"
ఆ: "నాకు ఉప్మా చెయ్యడం వచ్చును."
అ: "అది కాకుండా?"
ఆ: "నాకు అదొకటే వచ్చునండి"
అ: "ఆఁ? ఆ ముక్క పెళ్ళికి ముందు ఎందుకు చెప్పలేదు?"
ఆ: "మీరు అడగలేదు కదండి"

సరే ఇంత చిన్న విషయాన్ని పెద్దది చెయ్యడం ఎందుకు అనుకుని అతను రోజూ అదే tiffin గా సేవిస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు అతడుంటున్న ఊళ్ళో ఒక South Indian restaurant (అదే, దక్షిణభారతవంటకాల పూటకూళ్ళ ఇల్లు) ప్రారంభించారు. పందొమ్మిదివందల నలభై ఏడు, ఆగష్టు పదిహేనున మన జాతీయపతాక ఎగిరినప్పుడు గాంధీగారు ఎంత ఉబ్బితబ్బిబ్బైపోయారో, మన కథానాయకుడు కూడా అంతే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. సాయంత్రం త్వరగా office నుండి వచ్చేసి, భార్యాసమేతంగా ఆ restaurant దగ్గర వాలిపోయాడు.

ఒక waiter, menu తీసుకొచ్చి మనవాడి ముందు ఉంచాడు. "ఎన్నిరిక్కు?" అని ఆత్రంగా అడిగాడు మనవాడు. "menu దేఖియే" అన్నాడు waiter. అప్పుడు అర్థమైంది అకడ waiters అందరూ హిందీలో సంభాషిస్తున్నారు అని. menu కూడా హిందీలో ఉంది. సరే, హిందీ రాదనే విషయం భార్యకు తెలిస్తే నామోషీ అని దేవుణ్ణి తలుచుకుని ఉన్నవాటిల్లో ఒకదాని మీద వేలు పెట్టి waiterకి చూపించాడు. Waiter, "ఓ, అర్థమైంది", అన్నట్టు తల ఊపి, తన చేతిలో ఉన్న కాగితం మీద ఏదో బరుక్కుని వెళిపోయాడు. ఇంతలో మన వాడు భార్యకేసి చూసి, "Waiter లతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే లోకువైపోతాము", అన్నాడు. అతని భార్య అమాయకంగా, "ఓ, అలాగా", అని తల ఊపింది.

ఇంతలో మన వెయ్టరు రెండు పళ్ళాల నిండా ఉప్మా పెట్టుకుని తీసుకొచ్చాడు. అది చూసిన మనవాడు ఉప్మా కంటే ముందు ఖంగు తిన్నాడు. భార్యకేసి తిరిగి, కాస్త తెల్లముఖానికి గాంభీర్యం పూసి, "ఎప్పుడూ నీ చేతి ఉప్మా తింటున్నాను కదా. ఈ సారి అసలు బయట ఎలాగ చేస్తారో తెలుసుకుందామని order చేశాను" అన్నాడు. భార్య మళ్ళీ అమాయకంగా తల ఊపి తినడం మొదలెట్టింది. మనవాడు తింటున్నాడే కానీ, ఒకటే వెగటు పుట్టింది. మొత్తానికి అయ్యింది అనిపించి, "సరే, ఇంకేమైనా తిందాం" అనుకున్నాడు. పక్క బల్ల మీద కూర్చున్న వాళ్ళేమి order చేస్తున్నారో చూస్తూ ఉన్నాడు. ఒకాయన ఏదో హిందీలో చెప్పాడు. అది విన్న waiter ఘుమఘుమలాడే సాంబార్తో వడలు తీసుకొచ్చాడు. మనవాడికి మనసు లాగింది. ఆయనేమన్నాడో అలాగే గుర్తుపెట్టుకుని waiter వచ్చాక అదే చెప్పాడు. waiter, "ఓహో" అన్నట్టు చూసి లోపలికెళ్ళాడు.

కాసేపాగి మళ్ళీ waiter రెండు ప్లేట్లలో ఉప్మా పట్టుకొచ్చాడు. మనవాడు బిక్కమొహం వేసి, "ఏంటిది? వెటకారమా? owner తో మాట్లాడతాను" అని వాడితో తగువుపెట్టుకున్నాడు. Owner తెల్లని పంచి కట్టుకుని, అడ్డనామాలు పెట్టుకుని, కిళ్ళీ నవులుతూ వచ్చాడు. "Problem ఏంటి సార్", అని అడిగితే మనవాడు అరవంలో తన బాధ వెలిబుచ్చుకున్నాడు. ఆ owner, waiter తో, "ఈయన ఏమి చెప్పారు?" అని అడిగితే "ఫిర్ యెహీ లాయియే, అన్నారు సార్", అని waiter చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న owner, "సార్, మీరు ఇదివరకు తెచ్చిందే తెమ్మని చెప్పారుట కదా సార్" అన్నాడు. అప్పుడు వెలిగింది మనవాడికి, ఆ పక్క బల్ల వాడు ముందు కూడా సాంబార్వడ order చేసి ఉంటాడు అని. తగువు పెట్టుకుంటే అసలు విషయం తెలిసిపోతుందని, "అయ్యో, నేనో పరధ్యానంలో ఉన్నాను" అని owner తో చెప్పి మళ్ళీ ఉప్మా తినేశాడు.

మూడో సారి కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మనవాడు menu తిరగేశాడు. "సరే, అది ఉప్మా అనుకో, మిగతావేవీ ఉప్మా కాకూడదు కదా?" అనుకున్నాడు. ఎందుకైనా మంచిది అని ఉప్మాకు అతిదూరంలో ఉన్న, menu లోనే ఆఖరి item ని order చేశాడు. అదేదో మిగతావాటికంటే వేరే font తో, special గా ఉంది, కచ్చితంగా ఏదో అద్భుతమే అయ్యుంటుందని ఊహించాడు. ఆ waiter ఒక వెర్రిచూపు చూసి, వెళ్ళి owner తో మాట్లాడాడు. Owner వచ్చి, "సార్, మీరు చెప్పింది మేము తీసుకురాలేము", అన్నాడు. "ఎందుకు తీసుకురాలేరు", అని అడిగాడు మనవాడు. ఆ owner ఒక వెటకారపు నవ్వు నవ్వి, "ఆ menu చివరిలో ఉన్నాది, నా పేరు సార్", అన్నాడు.

మొత్తానికి కథానాయకుడికి ఉప్మా తప్ప వేరే ఏదైనా తినాలనే కోరికకు అలాగ అడ్డంకులు పడుతూ వచ్చాయి అన్నమాట. నా పరిస్థితి కూడా అలాగే ఉంది.


--
సెర్చి పార్టీలకు: Viveka Vardhani/Vardhini Public School, Arumugam Sivasami/Sivasamy, Tuni

Tuesday, September 14, 2010

చుప్పనాతి శూర్పనఖ (వేటూరి వారి పాట)

భారతావనిలో స్త్రీద్వేషి రాంబాబా గారిని కలిసినప్పుడు, ఆయన నాకు చాలా బోధలు చేశారు. వాటన్నిటితోనూ నేను ఏకీభవిస్తానా లేదా అన్న విషయం పక్కన పెడితే, అవన్నీ విన్నమీదట నాకు వేటూరి వారి పాట ఒకటి గుర్తొచ్చింది.

ఈ పాట "సుందరానికి తొందరెక్కువ" అనే లో-బడ్జెట్ చిత్రంలోనిది. తారాగణం, సాంకేతికవర్గం అందరూ కొత్తవారే కావడం, తగినంత ప్రచారం జరగకపోవడం వలన చిత్రానికి పెద్ద పేరు రాలేదు కానీ, నేను చూసిన రెండుమూడు సన్నివేశాలు మాత్రం బానే ఉన్నాయనిపించింది. ఎలాంటి చిత్రానికైనా మంచి సన్నివేశం, తెలుగుదనం ఉన్న బాణీ ఇస్తే వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు కదా. అలాంటి పాటల్లో ఇదొకటి.

ముందుగా పాట వ్రాస్తున్నాను, తఱువాత నాకు నచ్చిన అంశాలను చెప్తాను. ఈ పాటను ఇక్కడ వినవచ్చును.

చిత్రం: సుందరానికి తొందరెక్కువ
గాయకులు: బాలు
రచన: వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: నాగరాజ్

చుప్పనాతి శూర్పణక్క చుట్టుముట్టుకున్న లంక, రాములోరి రాత కూడా మార్చినట్టి మాయజింకరా, ఓరి సోదరా!
కొప్పుచుట్టనంటు ఇంక, నిప్పు పెట్టిపోయెనింక, భారతాన ద్రౌపదమ్మ భద్రకాళికైన అక్కరా, తిక్కశంకరా!
ఒంపుసొంపు చూసి ఓడిపోకి, ఓర చూపు చూడగానె ఒంగిపోకు, దాని దోరనవ్వు చూసి లొంగిపోకు
తొరబడి, పొరబడి, నువ్వు కోకలాంగి తోక కాకు

పానశాలకి దేవదాసును పంపినట్టి పార్వతమ్మ ఆడదేనురా
చందమామకే మచ్చ తెచ్చిన మచ్చెకంటి తార కూడ ఆడదేనురా
ఆడరోషమున్న రోషనార, నాగులేటి నాగులాంబ సాటిలేని జాణలేనురా
ఈడ అమ్మ తప్ప, అత్తలైన దుత్తలెవ్వరైన, పెళ్ళమైన గొళ్ళెమేనురా

రాములోరిని కానకంపిన, మంథరమ్మ ఆడశకుని కాకపోదురా
కృష్ణమూర్తినే కాలదన్నిన సత్యభామ కూడా స్వఛ్ఛమైన ఆడదేనురా
అల్ల తాటకైన, పూతనైన, లంకిణైన, బొంకిణైన ఆడదాని అంశలేనురా
ఇల్ల మేనకైన, ఊర్వశైన, రంభపంబలెవ్వరైన ఇంద్రజాలకీలలేనురా

మొదటగా ఈ పాటలో గమనించవలసిన విషయం ఏమిటి అంటే వేటూరికి పురాణాలపైన, చరిత్రపైన ఉన్న పట్టు. సీతా, సత్యభామా మొదలుకొని శూర్పనఖ, మంథర వరకు మన పురాణాలలో ఉన్న అన్ని రకాల ఆడవాళ్ళనీ గుర్తుచేశాడు. అలాగే చరిత్రనుండి రోషనార, నాగులాంబ వంటి వారిని కూడా ఉదాహరణలుగా చూపించాడు.

చరిత్ర మీద వేటూరికి ఉన్న పట్టు గతంలో కూడా చాలా గీతాల్లో తెలిసింది. ఉదాహరణకు "యమహా నగరి" (చిత్రం: చూడాలని ఉంది) పాటలో ఎంతమంది బెంగాలీయులని తలుచుకున్నాడు (ఠాగూర్, సత్యజిత్ రే, వివేకానంద, సరోజిని నాయుడు, మదర్ థెరెసా, శరచ్చంద్ర, ఎస్.డీ. బర్మన్ - మరెందరో). ఒక ఊరు గురించి చెప్పవయ్యా అంటే ఆ జంక్షన్ ఉంది, ఈ సర్కిల్ ఉంది అని కాకుండా ఆ ఊరిలో ఉన్న గొప్పవారి గురించి చెప్పే ఔన్నత్యం ఆయనది. రెండు చరణాలు రికార్డింగ్ అయ్యాక, అప్పటికప్పుడు మూడో చరణం వ్రాసి ఇచ్చి - "ఇది కూడా పెట్టండి" అని అడిగి మరీ ఆ ఊరుని పొగడటం వేటూరికే చెల్లుతుందేమో!

మళ్ళీ పాట విషయానికి వస్తే, ఈ పాటలో మనం గమనించాల్సిన మఱో విషయం, వేటూరి సరదా ప్రయోగాలు. కోమలాంగికి ని వెటకారంగా కోకలాంగి అని వక్రీకరించడం, రోషానికి కూడా లింగభేదం కల్పించడం ("ఆడరోషమున్న"), పెళ్ళాన్ని గొళ్ళెమనడం ఉదాహరణలు. స్త్రీత్వానికి ఒక వ్యక్తిత్వాన్ని ఆపాదించి స్త్రీలందరినీ ఆ శక్తియొక్క ప్రతిబింబాలుగా చెప్పడం నాకు బాగా నచ్చింది. "సత్యభామ కూడా స్వఛ్ఛమైన ఆడదే" అనడంలో ఆమె చేసిన పని పూర్తిగా స్త్రీగర్వఫలితమే అన్న భావం నాకు స్ఫురించి నవ్వొచ్చింది.

చివరగా "ఈడ అమ్మ తప్ప, అత్తలైన దుత్తల్లెవ్వరైన, పెళ్ళమైన గొళ్ళెమేనురా" అనడం నాకు భలే నచ్చింది (ఆడవాళ్ళూ, దయచేసి తిట్టుకోకండి!). (సాధారణంగా) ఈ సృష్టిలో ఏ తలనొప్పీ తీసుకురాకుండా,  స్వార్థం చూసుకోకుండా మనకు ఏదో చెయ్యాలనుకునేది ఒక్క తల్లే. నిజమైన స్త్రీత్వానికి ప్రతిరూపం ఆమె! రాంబాబా గారు చెప్పినట్టు, అత్తగారు బ్రతిమాలి కాఫీ ఇచ్చినా, ఆ నురుగలో "మా అమ్మాయిని బాగా చూసుకో" అని కనిపిస్తుంది.

Sunday, September 12, 2010

అంతరాయానికి చింతిస్తున్నాము

నేను దాదాపు నెలరోజులపాటు ఒక్క టప కూడా వ్రాయలేదు. (అంటే, నా టపల కోసం ఎవరో కాచుకుని కూర్చున్నారు అని అనట్లేదు అనుకోండి.) దానికి కారణం నా స్వదేశగమనం. భారతదేశానికి వెళ్ళి అక్కడ కుటుంబాన్ని, బంధువులని, మిత్రులని కలిసి వెనక్కి వచ్చాను. నేను వెనక్కి రాగానే శనైశ్చరుడు హస్త (నాకు నైధన తార) మీదకు జరిగాడు. తస్సాదియ్యా, నాకు సరదా తీరిపోతోంది. 2011 సెప్టెంబర్ వరకు నాకు చక్కని కాలక్షేపం.

రెండు రోజులనుండి టప వ్రాద్దామని ప్రయత్నిస్తున్నాను కానీ, "ఇదేంటి, ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉందే. ఇవన్ని టపలు వ్రాసింది నేనేనా?" అనే భావం మెదులుతోంది మనసులో. స్వగృహదూరవేదన (home-sick ని తెనుగీకరిద్దామని ప్రయత్నించాను) మనసులోకి దూరదామన్నా ఖాళీ లేనంత పనిలో పడ్డాను. ఏదేమైనా నీళ్ళల్లోకి దూకాక ఈదక తప్పుతుందా.

అలంకారాల టపలు కొనసాగిస్తాను. వీలైనప్పుడు మళ్ళీ పద్యాలు వ్రాస్తాను. వేటూరి వారి సాహిత్యం గురించి కూడా టపలు వ్రాస్తాను. చిట్టి కథలు కూడా వ్రాస్తాను. చదువర్లు అక్షతలు వెయ్యాలనుకుంటే వ్యాఖ్యలను వాడుకోగలరు.

ఇంతే సంగతులు
చిత్తగించగలరు
భవదీయుడు
రామకృష్ణ సందీప్