మా వదినమ్మ తను ఆరోనెలలో అడుగుపెట్టగానే తనకు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని తెగ ఆలోచించేసింది. కాసేపు గూగులిన తరువాత, "ఇదంత అర్రీబుర్రీగా తేలే యెవ్వారం కాదు. మా సెగట్రీతో సెర్చించి (searchఇంచి) ఆలోసిత్తాను", అని నిర్ణయించుకుంది. ఈ విషయానికి నన్ను సెగట్రీగా నియమించింది. తనకు నా గురించి తెలియదు పాపం. అందుకే, "నాకు ఈ ప్రపంచంలో ఏదీ నచ్చదు, అన్నిటిలోనూ లోపాలు వెతకడం నా ప్రథమకర్తవ్యంగా భావిస్తాను", అని చెప్పాను. ఐనా సరే నన్నే సెగట్రీగా నియమించింది. అంతే, చర్చ అనుకున్నది కాస్తా, లెక్చర్ అయ్యింది. అదే ఈ రోజు నా టప.
మా వదినమ్మ నాకు ఇచ్చిన సూచనలు (specification) ఏమిటంటే:
- సంస్కృతపదం అవ్వాలి
- రెండు/మూడు అక్షరాలుండాలి
- మరీ పాతపదాలు, మరీ కొత్తపదాలు (posh పదాలు) వద్దు
- పేరులో negative-తనం ఉండకూడదు
- వినగానే "ఆహా, కొత్తగా ఉంది. హాయిగా ఉంది ఈ పేరు." అనిపించాలి.
వదినమ్మా!
నువ్వు పేరు పెట్టడం అనేది ఏదో చాలా సులువైన పనిలాగా మాట్లాడుతున్నావు. అసలు ఈ పేరు పెట్టడం అనే ప్రక్రియే చాలా దీర్ఘమైనది, సునిశితమైన బుద్ధితో కానీ సాధించలేనిది. అందుకే ఈ నామకరణం అనే ప్రాజెక్టుకు పేరు పెట్టడం చాలా ముఖ్యం. నన్నడిగితే దీనికి "ఆపరేషణ్ నామకరణం" (ON) అని పేరు పెడదాము. నీ తొలిబిడ్డ గనుక ఈ సారి version-1 అనచ్చు. అంటే ON-1. రెండో బిడ్డకు ON-2 అలాగ పెంచుకుంటూ పోవచ్చు. ఏమంటావ్? బేమ్మర్ల పెళ్ళిళ్ళల్లో పంతులుగారు అందరి పేర్లకీ చివర్లో శర్మ తగిలించినట్లు సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రతీ పనికి "ప్రాజెక్టు" అనే పదాన్ని తగిలిస్తారు. లేకపోతే motivation రాదాయె!
విషయానికి వస్తే పని చెయ్యడం కంటే సలహా ఇవ్వడం చాలా సులువు అని గీతలో కృష్ణుడు చెప్పాడు కదా? ("ఎన్నో అధ్యాయంలో? నాకు గుర్తులేదే?" అనకు. నిజంగా గీతలో ఉందో లేదో నాకూ తెలియదు కానీ, భారీ కొటేషన్ల వెనుక భగవద్గీత backing ఉండటం మంచిది అని అలాగ అంటున్నాను, ఈ మధ్యన.) అందుకే ఇప్పటికి నీకు పేర్లు-వాటితో ఉండే తంటాలు అనే విషయం పైన కొంచం జ్ఞానోదయం చేస్తాను చూడు.
మొదటగా చెప్పాల్సింది ఏమిటంటే, నీ specificationలో "కొత్తదనం" అనే అంశం నాకు కొంచెం అనవసరమనిపించినది. ఆ మధ్యన మా దూరబ్బంధువుల అబ్బాయికి శ్రేయస్ అనే పేరు పెడితే దానికి బంధువర్గంలో "చాలా కొత్తగా ఉంది, చక్కని పేరు", అని మాంచి talk వచ్చి హిట్టయ్యింది. ఆ తరువాత నేను సాఫ్ట్వేర్ ధర్మానుసారం రెండేళ్ళ తరువాత ఉద్యోగం మారాను. అక్కడికి వెళ్తే కేవలం మా teamలోనే నలుగురు శ్రేయస్లు ఉన్నారు. మా officeలో, confusion ఎందుకని వాళ్ళను సొంతపేర్లతో కాక, ఇంటి పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ తల్లిదండ్రులు, అంత కష్టపడి పెట్టిన పేరూ release కాకుండానే drop అయిన ప్రాజెక్ట్లాగా అయిపోయింది. ఇందులో నీతేమిటంటే, నీకు నచ్చిన పేర్లు చాలా చోట్ల చాలామందికి పిచ్చపిచ్చగా, విచ్చలవిడిగా నచ్చేస్తాయి. కొన్ని ఏళ్ళపాటు ఒక పేరుకు మంచి talk ఉండి, అదే పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాందరూ ఒక చోట చేరితే ఇంక variety ఏముంది?
ఒకసారి ఇలాగే ఒక చెల్లెమ్మ నన్ను పేరు select చెయ్యమని అడిగితే కే. విశ్వనాథ్ చిత్రాల్లో అమ్మవారిపైన పాటలు వింటే నీకు ఏమైనా నచ్చచ్చు అన్నాను. చివరికి ఆమె "సప్తపది" చిత్రంలో పాట విందో లేదో తెలియదు కానీ, వాళ్ళ పాపకు "శశిహాసిని" అనే పేరు పెట్టుకున్నారు. నాకు "హాసిని" అనే పేరు బాగా నచ్చింది. అందులోనూ సరస్వతీదేవి పేరంటే నాకు మక్కువాయే! అక్కడికి OK. ఇంతలో బొమ్మరిల్లు సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా చూసినప్పటినుండీ నాకు హాసిని అనగానే పెదాలు జిడ్డుగారేలాగా lip-stick పూసుకుని, ఆ పెదాలు కలవనివ్వకుండా మాట్లాడుతూ, తెలుగు సరిగ్గా పలకడం చేతకాని; ఎవరితో ఎలాగ behave చెయ్యాలో తెలియని ఒక immature కోతిపిల్ల గుర్తొస్తోంది :-( నేను చెప్పే point ఏమిటంటే మనకు "హాయిగా" అనిపించే పేరు రేపు మరొకరివల్ల చెత్తగా గా అనిపించవచ్చును.
ఇంక నీకు ఇచ్చే కొన్ని సామాన్యమైన సూచనలు:
- పిల్లలకు మనం పెట్టే పేర్లను పెద్దయ్యాక వాళ్ళ friends కుదించడం, కుదిపెయ్యడం సహజం. ఉదాహరణకి మా స్నేహితురాలి పేరు "కౌస్తుభ" - ఎంత చక్కనైన పేరు! ఐతే ఆమెని స్నేహితురళ్ళందరూ, "Hi Cow, How are you?" అంటుంటే, మొదట్లో, "ప్రకృతిధర్మానికి విరుద్ధంగా మానవులకు గోసంతతి కలిగింది", అనిపించింది.
- ఇందాకటి పాయింటుకో జాయింటు. పేరులో రెండు మూడు పదాలు ఉన్నప్పుడు ఆ పదాల మొదటి అక్షరాలు కలిపి కొత్త పేరు సృష్టించి దానితో పిలుస్తూ ఉంటారు స్నేహితులు. నా స్నేహితుడి పేరు కార్తీక్చంద్ర - ఎంత చక్కనైన పేరు! దాన్ని స్నేహితులని చెప్పుకునేవాళ్ళందరూ కలిసి "కాచా" అని మార్చారు. అదేదో కొండాజాతివాళ్ళ బండ పేరులాగా లేదు? ఇంకొకరి పేరు గోపాలరావు. అతనిని ముద్దుగా గోరా అని పిలిచారు. ఇంకా నయం వాళ్ళింటి పేరు ఏ ఆదిభట్లో అయితే అతని పేరు అగోరా అని ఘోరంగా అయ్యేది. పద్మని పద్దు అని (చాకలిపద్దు లాగా), లలితని లల్లి అని పిలువడం నువ్వూ గమనించే ఉంటావు! అందుచేత ఇలాంటి కంకర్రాళ్ళు nicknames గా రాని పేర్లను ఎంచుకోవడం మంచిది.
- మళ్ళీ పై పాయింటుకో జాయింటు. మొత్తం పేరులోని పదాలలో మొదటి ఆంగ్లాక్షరాలను కలిపి nickname ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రక్రియకు బలైపోయిన కొన్ని పేర్లు: పిసుపాటి-చంద్రశేఖర-కుమార్ , అరుముగం-శివ-సామి. తస్మాత్ జాగ్రత్త!
- తెలుగు ఉచ్చారణ తెలియని English-medium స్నేహితుల దౌష్ట్యాన్ని కూడా మనం కాస్త దృష్టిలో పెట్టుకోవాలి. ఉదాహరణకి: పేరులో "శ" లేకుండా చూసుకో! ఎందుకంటే కొంతమంది "శంకర్" ని "సంకర్" (అదే, వర్ణసంకరంలో సంకర్) అని గానీ, "షంకర్" అని గానీ పిలుస్తున్నారు. వింటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంటోంది.
- ఇంటి పేర్లతో ఉండే తంటా కొంత ఉంటుంది. మా దూరబ్బంధువు ఇంటిపేరు "కొట్రా". అతడు లవ్వాడి, ఇంట్లోవాళ్ళతో గొడవాడి, ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళాడాడు. అంతవరకూ బానే ఉంది. ఆ అమ్మాయి పేరు "బెట్టి". ఇంటిపేరుతో కలసి, "కొట్రా బెట్టి" అయ్యింది. పేరు వింటే violins విన్న feeling రావాలి కానీ, violence కనబడకూడదు కదా?
- పేరులో కాస్త లింగభేదం ఉంచడం మంచిది. చైతన్య, ప్రసన్న లాంటి పేర్లు పెడితే e-mails వ్రాసేటప్పుడు లింగభేదం తెలియక ఎవరైనా "Prasanna is a nice girl" అంటే nice అన్నందుకు ఆనందించాలో, girl అన్నందుకు దుఃఖించాలో తెలియక పిల్లలు బాధపడతారు.
- ఇంక ప్రాస కోసం ప్రయాస పడుతూ, శ్వాస విడిచేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పిల్లలపేర్లన్నిటికీ ప్రాస కుదర్చాలని ప్రయత్నిస్తారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ప్రాసతో పాటు కాస్త భావం, అర్థం బాగుంటే సొంపుగా ఉంటుంది. ఈ ప్రాసపై ఆశకు ప్రతిరూపలుగా ప్రతాప్-ప్రేలాప్, పురుష్-పరుష్, అభిషేక్-అరబ్ షేక్ వంటి నామద్వయాలు ఉద్భవిస్తున్నాయి.
- సంస్కృతంలో బాగుండే కొన్ని పదాలు జంట లేకపోతే నిరర్థకాలవుతాయి. ఉదాహరణకి చరణ్ అనే పేరు వాడుకలో ఉంది. ఆ చరణానికి ఒక మొండెం, తలకాయ కూడా ప్రసాదిస్తే బాగుంటుంది. వాడు విష్ణుచరణ్ ఆ? సాయిచరణ్ ఆ? శివచరణ్ ఆ? అలాగే ప్రతీక్ అంటే "ఓహో!" అనిపిస్తున్నా దాని అర్థం "గుర్తు" అని. ప్రేమకు ప్రతీకా? మంచితనానికి ప్రతీకా? ఏమిటి అన్నది ఆ బిడ్డకు తెలుసుకోవాలనే కుతూహలం కలిగేదాకా ఆగకుండా ముందే చెప్తే సంతోషిస్తాడు. ఏమంటావ్?
- సంస్కృతం అంటే గుర్తొచ్చింది. కొంతమంది సంస్కృతం కంటే ఆంగ్లాన్ని ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో. అందుకని కొన్ని పేర్లను ఆంగ్లీకరిస్తున్నారు. ఉదాహరణకు లవకుశుల పేర్లను ఈ మధ్యన love, khush గా మార్చి పెట్టుకోవడం నేను గమనించాను. ఒక idea పిల్లల జీవితాన్నే మార్చేయగలదు!
- ఈ మధ్యన పేర్లకు prefixలు, suffixలు తగిలించడం రివాజు అయ్యింది. సాయి వాడుకలోనున్న ఒక prefix. సాయిచరణ్, సాయికిరణ్, సాయికరుణ్, సాయిశరణ్ మొదలైనవి మనం వింటూనే ఉన్నాము. ఐతే దీనితో వచ్చిన బాధేమిటి అంటే ముద్దుగా కొడుకుని సాయి అని పిలుచుకోలేము. "సాయ్" అనగానే "ఓయ్" అనేవాళ్ళు బోళ్ళుమంది ఉంటారు. అప్పుడు సాయిని వదిలేసి, "కిరణ్", "తరుణ్", "చరణ్" వంటి తాడుతెగిన గాలిపటాలలాంటి పేర్లు వాడుకోవాలి. కుమార్ మనకు తెలిసిన ఒక suffix. మా friend ఒకడి పేరు "రవికుమార్". వాడిని ఒకడు "రవికి ఇద్దరు కుమారులు. శని, యముడు - నువ్వెవరు నాయినా?" అని అడిగాడు. వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. అందుచేత కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో కూడా!
- కొన్ని పేర్లకు అర్థం వెతికితే నాకు ఏమీ తోచదు. ఉదాహరణకి "సతీశ్" (*) అనే పేరుకు అర్థం నాకు తెలియదు. "సతి + ఈశ్" అనుకుందాము అంటే "సతికి అధిపతి" అని అర్థం వస్తుంది. ఎవడు మాత్రం పెళ్ళానికి మొగుడు కాకుండా పోతాడు చెప్పు? ఒకవేళ నేను సంధిని విడదీయడంలో తప్పు చేసి ఉంటే సవరించు సుమీ! అలాగే ఇదివరకు నేను పని చేసే చోట ఒకడి పేరు "అల్పేశ్". "అల్పంగా ఉండే ఈశుడా" అనుకుని ముక్కున వేలేసుకున్నాను.
- కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లు, ముఖ్యంగా తండ్రి పేరు కొడుక్కి పెట్టుకుందాం అనుకుంటారు. దీనివల్ల పూజల్లోనూ, తతంగాలలోనూ తండ్రి, తాత, ముత్తాత పేర్లు చెప్పుకోవడం సులువవుతుంది! అలాగే కొడుకును పిలిచినప్పుడల్లా తండ్రిని గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడిదాకా బాగుంది కదా అనుకునేవాణ్ణి. ఇదే పద్ధతి కొన్ని తరాలు పాటించిన మా teacher ఒకాయన వంశవృక్షం చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. ఆయన పేరు అరుముగం శివసామి. అరుముగం ఆయన తండ్రి పేరు, శివసామి ఆయన పేరు. ఈయనకి వీళ్ళ తాతగారి పేరు పెట్టారుట. అంటే తాత పేరు శివసామి. ఇప్పుడు తండ్రి పూర్తి పేరు "శివసామి అరుముగం". అరుముగం తండ్రి పేరు, శివసామి ఆయన తండ్రి పేరు. ఇలాగ మూడు నాలుగు తరాలు ముందుదాకా వెళ్తే అందరూ శివసామి అరుముగం, అరుముగం శివసామి అనే రెండు పేర్లను audio cassette A-side, B-side లాగా మార్చి మార్చి పెట్టుకుంటూనే ఉన్నారు. పాపం, అల్పసంతోషులు అనిపించింది. మీ వాడు తండ్రి పేరు చివర్లో తగిలించుకుందాం అంటే ఇబ్బంది కాకుండా చూసుకోండమ్మోవ్!
- అన్నట్టు ఈ తండ్రి, తాత, ముత్తాతల పేర్లు పెట్టుకోవాడానికి మన ఆంధ్రులకు ఇంకో మార్గం ఉంది వదినమ్మోయ్! ఏంటంటే కొడుకు పేరులో "శివ, వీర, వేంకట, నాగ, కనక, ఫణి" వంటి పదాలు కొన్ని తగిలిస్తే అందులో ఏదో ఒకటి తాతకో, తండ్రికో ఉండకపోతుందా? ఆ విధంగా వాళ్ళ పేరు పేరు కూడా కొడుక్కి పెట్టినట్టు ఉంటుంది కదా?
- అమ్మాయిలకు పేర్లు పెట్టేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. "అంకిత" లాంటి పేర్లు పెట్టద్దు. ఎందుకంటే వెంటనే మనసులోకి వచ్చే ప్రశ్న, "ఎవరికి అంకితం చేశావు? ఏం అంకితం చేసేశావు?". అలాగే అన్వేషిత, ఆకాంక్షిత వంటివి కూడా అలాంటి అర్థాలే వస్తాయి.
- "ప్రియలలిత", "ప్రియదర్శిని", ప్రియమణి" లాంటి పేర్లు కూడా పెట్టద్దు. ఎందుకంటే నీ ఎదురుగుండానే ప్రతీ తలకు మాసిన వెధవా ఆమెని "ప్రియా..ప్రియా..." అని పిలుస్తాడు. అది వినలేక మనం ఏడవాలి. ఆమె మొగుడికి అనవసరమైన అనుమానాలు కూడా వస్తాయి. అన్నట్టు, ఆ ప్రియదర్శిని అనే పేరుకు అర్థమే నాకు తోచలేదు ఇప్పటికీ!
- పైన చెప్పినదానికి కొంచం reverse చేసుకుంటే తరువాతి సూత్రం వస్తుంది. ఏమిటంటే, "జననీ", "జగదంబ" వంటి పేర్లు బయటవాళ్ళు పిలుస్తుంటే ఆమె మొగుడికీ ఒక sense of security ఇచ్చినా, స్వయంగా నోరారా పెళ్ళాన్ని పూర్తి పేరుతో పిలుద్దాము అనుకుంటే ఘోరాలు జరిగిపోతాయి.
- ఈ మధ్యన numerlogyతో ఒక చిక్కు వచ్చి పడింది. పాప(డు) పుట్టిన తేదీ బట్టి పేరు decide చేస్తామంటారు. దీని కోసం ఎంతో చక్కని పేర్లను ఖూనీ చేస్తారు. ప్రేమ (Prema) అనే పదాన్ని ప్రేమా (Praemaa) గా వ్రాయడం లాంటి పైత్యాలు గమనించాను. వెంటనే నాకు "దీని అసాధ్యం కూల. ఇంకా నయం పేరు శ్రద్ధ (Sraddha) అయ్యి, numerologist ఇంకో రెండు అచ్చులు (vowels) కలపమన్నాడని శ్రాద్ధా (Sraaddhaa) అని వ్రాసింది కాదు!", అనుకున్నాను. చెప్పొచ్చేదేమిటంటే మనం ఎంతో ప్రేమగా పెట్టుకునే పేరు రేపు పిల్లలు numerology అని మార్చుకోగలరు. అలాగ మార్చుకుంటే తప్పుడర్థాలు రాని పేరైతే మంచిది అనుకుంటున్నాను. (+)
అదీ సంగతి! ఇంక నువ్వాలోచించు!
(*) సతీశ్ అనే పదం గురించి శిశిర గారు వివరించడంతో నాకర్థమైంది. సతి అంటే అమ్మవారు (దక్షుని పుత్రి), సతీశ్ అంటే శివుడు. నేను చిన్నప్పుడు తునిలో పెరిగాను. అక్కడికి అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు. అందుచేత అక్కడ సత్యనారాయణ స్వామి భక్తులు ఎక్కువ. వాళ్ళు సత్యనారయణ అనే పేరుకు మారుగా సతీశ్ అని వాడటం గుర్తు. అందుకే నాకు సతీదేవి సంగతే గుర్తురాలేదు.
(*) సతీశ్ అనే పదం గురించి శిశిర గారు వివరించడంతో నాకర్థమైంది. సతి అంటే అమ్మవారు (దక్షుని పుత్రి), సతీశ్ అంటే శివుడు. నేను చిన్నప్పుడు తునిలో పెరిగాను. అక్కడికి అన్నవరం పద్దెనిమిది కిలోమీటర్లు. అందుచేత అక్కడ సత్యనారాయణ స్వామి భక్తులు ఎక్కువ. వాళ్ళు సత్యనారయణ అనే పేరుకు మారుగా సతీశ్ అని వాడటం గుర్తు. అందుకే నాకు సతీదేవి సంగతే గుర్తురాలేదు.
(+) ఈ పాయింటు శ్రీదేవి గారి కామెంటు చూసి చేర్చడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు!
35 comments:
శ్రీరంగం శ్రీనివాసరావు "శ్రీశ్రీ" అయినట్టు... అని ఆయనే "సి-ప్రా-లి" పుస్తకం ముందు మాటలో చెప్పినట్టుగా... వపా, శ్రీశ్రీ, బేరా, చేరా వంటి పేర్లెన్నో చూసి అనాలోచితంగా "నచకి" అన్న కలంపేరు నాకు తట్టినా/సిద్ధించినా... ఎంతో కాలంగా (ఆ పేరు ఎలా వచ్చిందో) తెలిసినవాళ్ళు కూడా "నాచకీ" అని పిలిస్తే "పాతకీ" అన్నట్టు వినిపిస్తుంది నాకు. :-( మరిన్ని భ్రష్టరూపాలో, రూపాలంతరాలో ఉన్నాయి - "నర్తకి", "కీచక", "కిచకిచ" వగైరా అన్న మాట! అయినా నా కలంపేరు నాకు ముద్దు, అంతే పో! :-)
Asalu inta post rase inspiration and chance ichina haritha ki thanks ledu kani Nachaki ki enduku anta dhanyavadalu cheppav???
BTW, nenu kuda blog raddam anukunna deeni meeda...ee lope nuvvu rasesav...anyways gud one :)
అయ్యో PSK, office లో కూర్చుని చదువుతుంటే - నవ్వాలేక చదవటం ఆపాలేక తెగ ఉక్కిరి బిక్కిరి అయ్యా...
ML పక్కనపెట్టి NA (namalogy analysis చేస్తున్నావా?
Anyway, it is very humorous :)
ha ha ha...... bravo !!!
amazing post !!!
వామ్మో నవ్వలేక చచ్చాను.
మీ మనోనేత్రంతో చూసి పేరు మీద గొప్ప వివరణ ఇచ్చారు. ఒక పేరు పెట్టడానికి ఇన్ని ఆలోచనలు చేయాలన్నమాట. బాగుంది.
శ్రీవాసుకి
srivasuki.wordpress.com
:D
సతి అంటే పార్వతీదేవికి మరో పేరు. సతీశ్ అంటే ఆమె భర్త శివుడు. బాగుంది మీ టపా. :)
ON1-
ha ha.. good one..spontaneous ga vundi.. variety ga vundi..
This is the first time that I got to read your blog through bubly.. ade.. haritha..
Wow..what a write up.. I could not control myself from laughing while reading your post.. my 3 1/2 year old son kept on asking me why I was laughing so much as he cannot find anything funny/moving on my lappy.. lolzz..
Good One..
I really enjoyed reading it..
One should get ideas/words to pen down such hilarious sentence..
Best
Ratna
ప్రాజెక్టు స్పెక్స్ అవీ ఖచ్చితంగా ఉన్నాయండి.
ఖచ్చితంగా ఇవే స్పెక్స్ ప్రకారం, యేడాదిన్నర క్రితం పాపాయికి "సంహిత" అన్న పేరు పెట్టాము. "సంహి" అని కొంత హింస ఎదురవుతోంది. అయితే పర్లేదు. పాప మాత్రం, తన పేరు చెప్పమంటే నోరు తిరుగక "తమ్మి" అంటోంది. "తమ్మి" అచ్చతెనుగు తామర కాబట్టి, ఈ బోనస్ కూడా మాకు లాభించింది.
ఏంటో ఈమధ్య చిత్రమైన పెర్లొస్తున్నాయి .శబ్దానికితప్ప అర్ధానికి ప్రాధాన్యతలేకుండాపోతున్నది. రాబోయే రోజులలో
అసభ్య , అసహ్య లాంటి పేర్లుకూడా ఫేమస్ అయిపోతాయేమో చూడండి .
చంపేసారండి బాబూ.. ఇంక నవ్వలేక పోతున్నాను. ఇవ్వాళే ఒక కొత్త పేరు చూసాను. ఒక పాపకి సాయి కిష్వ అని పేరు పెట్టాడు. దాని అర్ధం ఏమితో ఆయన్ని అడిగినా చెప్పలేకపొయ్యాడు. నాకు తెలియలేదు. ఏమయినా పేరు పెట్టాడానికి ఎంత ఆలోచన చెయ్యాలో చక్కగా చెప్పారు.
@ నచకి
అన్నాయ్, నీ పేరుకు వంకలు పెట్టేటంత సీన్ నాకెక్కడిది. జరిగిన విషయం విశదీకరించాను అంతే. తప్పుగా అనుకోకుమీ!
@ వదినమ్మ (హరిథ)
నీ పేరు privacy issues కి భయపడి పెట్టలేదు. ఇప్పుడు నీ పేరు, నీ బ్లాగు కలిపి పెట్టాను చూడుడి :)
@ రవి
అయ్యా, సంహి అనగానే నాకు బాలయ్య సిమ్హ గుర్తొస్తోంది. కానీ, మీ పాప దాన్ని తమ్మి అని పిలువడం నాకు నచ్చింది. ఎంత చక్కని పదం! నాకు చాలా ఆహ్లాదం కలిగించింది, వినగానే!
@ శిశిర
మీరు చెప్పాక నాకు తట్టిందండి. ఆ విషయం బ్లాగులో update చేశాను. థ్యాంకులు/నెనర్లు :)
@ జగదీశ్
కిష్వ నా? నువ్వే కావాలి సినిమాలో MS నారయణ వ్రాసిన కథలో హీరో పేరు "అనిర్విష్". అంటే ఏమిటి అంటే "పేరు variety గా ఉంది అని పెట్టాను", అంటాడు. అది గుర్తుకొచ్చింది.
kausthuba is lot better than Kaumudhi...:P
పిల్లలకు పేరు పెట్టే ముందు ఎంత జాగ్రత్త అవసరమో మీ వ్యాసం వ్యంగభరితంగా తెలియచెప్పింది. చదివే సమయంలో ఎన్నో నవ్వులు -నా లోంచి. అభినందనలు. మా కుటుంబం లో నూతన సభ్యుడు ఐరా Ira. పేరుకు అర్థం తెలుసుకోవటానికి నిఘంటువు, గూగుల్ చూడవలసివచ్చింది. ఈ బాలుడు అమెరికాలో పెరుగుతున్నాడు కాబట్టి ఉచ్ఛారణలో పెద్ద సమస్య ఉండబోదనుకుంటాను(?).
ఏదో మీ ఈ పోస్ట్ లంచ్ టైంలో చదివాను కాబట్టి సరిపోయింది. లేదంటే అసలే ఈ తెల్లదేశంలో అనుమానాలెక్కువ జనాలకి. బావుంది మీ నామోపాఖ్యానం. :)
ఈ ముద్దు పేర్లు నిజంగానే ఒక హింస. చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక అమ్మాయి పేరు రజని. ఆ పిల్లని రజని అని ఏ రోజూ పిలిచిన గుర్తులేదు వాళ్ళింట్లో. రజ్జు, రజ్జు అని పిలిచేవాళ్ళు. వాళ్ళ చెల్లెలి విషయం ఇంకా ఘోరం. ఆ పిల్ల పేరు స్వప్న అయితే సప్పు సప్పు అని పిలిచేవారు. నాకు మండి ఏ సబ్బు అని అడగాలనిపించేది. అలానే ఇంకో పిల్ల పేరు బిందు. వాళ్ళ ఇంట్లో పిలవటం రాక బిందే బిందే అని పిలిచేవాళ్ళదేంటో. ఆ పిల్లని బిందె చెంబు అని ఏడిపించేవాళ్ళు. :)
ఈ మధ్య నేను గమనించిన వికారం అయితే పిల్లలకి నోరు తిరగని, అర్థం పర్థం లేని పేర్లు పెట్టటం - అడిగితే ఇది విష్ణు సహస్రంలో ఉందనో లలితాసహస్రంలో ఉందనో అంటారు. విష్ణు సహస్రనామాలు సహస్రం సార్లు చదివినవారికి కూడా ఆ పేర్లెక్కడ ఉన్నాయో తెలీదు.
Nice post. I really enjoyed reading it through. :)
@cbrao గారు, ఐరా అమ్మాయి పేరు కాదా? ఈ మధ్య నా కలీగ్ వాళ్ళ అమ్మాయికి ఆ పేరు పెట్టాడు. అర్థం అదేదో దేశపు దేవత అని చెప్పాడు. :(
బ్రహ్ణ్య నిఘంటువు "ఐరా" అనే పదానికి "ఔరా" అనే అర్థం చూపిస్తోంది:
ఐర (p. 0204) [ aira ] aira. [Tel. for అయిర.] n. Dimness of sight మసకకమ్ముట.
అక్కటా!
కెవ్వ్వ్.
అంతేలెండి. కళ్ళకి మసకలు కమ్మితేనే ఇలాంటి అర్థం పర్థం లేని పేర్లు పెడతారు.
%macro random_name(gender);
Libname Vishnu "C:\Vishnu_sahasram.sas7bdat";
Libname Lalita "C:\Lalita_sahasram.sas7bdat";
%If &gender. = "male" %then %do;
Proc surveyselect data = Vishnu method = SRS n = 1 seed = 999 out = t1;
run;
%end;
%else %do;
Proc surveyselect data = Lalita method = SRS n = 1 seed = 999 out = t1;
run;
%end;
Proc print data = t1;
var Name;
run;
/***** The above piece of program returns one Random name from Lalita Sahasram or Vishnu Sahasram based on the gender specified in the macro parameter *****/
%mend();
%random_name(Male);
నచకి.........మొదట ఈ పేరు విన్నప్పుడు ఇదేమి పేరు, సాచ్చకి కి modern పేరేమో అనుకున్నా :P :D
మా బాబాయ్ ఒకాయన పేరు కిశో(షో)ర్ కుమార్ - ఒకే అర్ధం వచ్చే రెండుపదాలు పక్కపక్కనేమిట్రా అని పెద్దవాళ్ళు వెక్కిరించేవారు.
peru pette appudu thesukovalsina jaagratthalu anni chaala funny ga chepparandi.e madya kotthaga vachina numerology ni marchipoinattunaaru.idivaraku evaryna peru cheppagane kaastha sanklistam ga vunna,spelling raayadam pedda problem ayyedi kadu.but ippudu e numerology punyama ani peru spellings lo bhayankaramyna marpulu vachayi.spelling tho sahaa me peru cheppandi ani adagalsina paristhithi.
@ శ్రీదేవి గారు
చాలా మంచి విషయం చెప్పారండి. నేను బ్లాగును కొంచం extend చేస్తాను, ఈ విషయంతో. మీకు థ్యాంకులు/నెనర్లు అండి :) btw, నాకు శ్రీదేవి పేరంటే ఇష్టం అండి. వినగానే ఏదో royal, kind గా అనిపిస్తుంది.
chala bagundi.. nenu chachanu navvaleka... nenu haritha sister ni.. ma akka me burra ela thindo naku baga telsu... intlo kuda papa puttakka mundhu nunchi ma burra lu baaaaagggaaaa thindi e blog chusaka i hope adi inka a vishyam gurinchi ekuva alochinchadu ani ;)
ప్రియదర్శిని ante maya bazaar cinimaa lo unde addam petti ...adi koodaaa teleedaaa :P
మా పాప పేరు కోసం ఇలాంటి specs తోనే project మొదలు మొదలు పెట్టాము. ఇంకా కొన్ని అదనపు specs కూడ ఉన్నాయి.
$ పేరు english లొ రాయడానికి, అంతర్జాతీయ మిత్రులు పలకడానికి సులువుగా ఉండాలి
$ పేరు ఏదైనా దేవీస్తోత్రం (సహస్ర నామం etc.) లో వచ్చినదై ఉండాలి.
ఓక పాతిక పేర్లు ఎంచుకొని, 5/6 పేర్లు shortlist చేసి చివరకి అనఘ (anagha) అనే పేరు నిర్నయించేము. మా పాప పేరు విషయాలు గుర్తు చేసినందుకు thanks .
మా అమ్మాయి పేరు కూడ అనఘే :))
@మలక్పేట రౌడీ & బీకే గారు
"అనఘ" అనే పేరు చాలా బాగుంది అని వదినమ్మ, సోదరుడు అనుకున్నారు. ఇది already మాంచి talk వచ్చి, hit అయిన పేరు అని చెప్పాలి వాళ్ళకి :)
@అందరూ
గొల్లపూడి గారు నామకరణం మీద వ్రాసిన అద్భుతమైన వ్యాసం:
http://www.koumudi.net/gollapudi/072709_ring_festival.html
Inta discussion ayyaka finally ma ammai peru June 21st na "Mugdha" ani pettam :D
Idigo daani details :
http://harithas-space.blogspot.com/2010/06/whats-in-name.html
ఈ మధ్యన కొత్త పేర్లు రెండు విన్నాను. చదువర్లు గమనించాల్సిందిగా కోరుతున్నాను.
1) తండ్రి పేరు (మనోహర్) కొడుక్కి పెట్టుకోవాలని నిశ్చయించుకున్నారు నా మిత్రులు. కానీ, అది పాత తరహాగా ఉంది అని, దాన్ని కొంచెం మార్చారు. har-man అని పెట్టారు. నాకు వేటూరి వారి గసగసాల కౌగిలింత ప్రయోగం గుర్తొచ్చింది.
2) కొండా అనే ఇంటి పేరు కల అబ్బాయి, Anna అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడుట. అప్పుడు ఆ అమ్మాయి పేరు Anna Konda అయ్యింది (ఏనకొండా...).
naku nachina konni perlu....
AGNIVESH
ALEKHYA
AMOGH
ANOOSHA
AVANTHI
BHARADWAJ
CHANDANA
CHETHAN
DHATHRI
DHRUVA
HARINI
HARSHINI
HARSHITHA
KAAVYA
MRUDULA
RAVALI
RUTHVICK
SNEHITH
SRI VALLI
SRUTHI
YUKTHA etc......
:):):) వామ్మో! పేరు పెట్టాలంటే ఇంత ఆలోచించాలా? మా అమ్మని ఎప్పుడూ అడుగుతూ ఉండేదానిని నాకు ఈ పేరెందుకు పెట్టారు? ఎవ్వరూ సరిగ్గా పలకటం లేదు అని! ఇంత ఆలోచించలేదేమో!!!
Post a Comment