Wednesday, April 8, 2009

కృష్ణుడి పై అస్త్రాలు :)

కృష్ణుడు గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది. బహుశా అందుకేనేమో భాగవతం చెప్పేంతటివరకు వ్యాసుడికి మనశ్శాంతి దక్కలేదు. అలాంటి కృష్ణుడి గురించి ఏదో చిన్న జానపదం వ్రాయాలనే కుతూహలం నాలో కలిగింది. వెంటనే కంగారు గా వ్రాసాను ఈ చిన్న తవిక.

ఎంతటి మాయగాడు గోవిందుడు? చింతలు తీర్చువాడు మా బంధుడు

ఇద్దరు తల్లుల ముద్దుల పాపడు, వెన్నముద్దల వేటలు ఆపడు
ముద్దు గుమ్మల ముచ్చట వీడు, ముజ్జగమ్ముల మూలపురుషుడు

అరటితోలుకై అతిథిగ వచ్చెను, అటుకుందుకుని ఆరడి తీర్చెను
మందలో మగువ మానము గాచేను, రథము తోలి రారాజును గూల్చెను

యమునా ఉరకలకు ఊపిరి వీడు, మథుర కథలలో మాధురి వీడు
వెదురు పాటలో వేదము వీడు, రాధ రాగముల పల్లవి వీడు

Sunday, April 5, 2009

బాలాయణం - 2

చిన్నప్పుడు మనకి ఊహ తెలియని వయసులో చాలా అమాయకత్వంలో ఉంటాం. అలాంటి అమాయకత్వంలో మనం నమ్మే విషయాలు పెద్దయ్యాక నవ్వోస్తాయి. అలాంటి విషయాలు :)

% నా చిన్నప్పుడు స్కూల్ లో భాష భలే నవ్వు తెప్పిస్తుంది. కొన్ని పదాలు, వాటి వ్యుత్పత్తులు.
          ఒ interbell (n): ఇంటికి వెళ్లేందుకు bell కొడతారు కాబట్టి ఇది interbell. (interval)
          ఒ tiger-rice (n): పులిహోర
          ఒ లబ్బరి (n): rubber
          ఒ చాక్మార్ (n): sharpener
          ఒ writing oil (v): తెలుగులో రాయడానికి, వ్రాయడానికి వికృతి ఒకటి కావడం తో కలిగిన ఇంగ్లీష్ వికృతి ఇది :) e.g. Today, head is paining. I did not write oil to head.
          ఒ grease (n): crease అనే ఆంగ్ల శబ్దానికి వచ్చిన తిప్పలు. ఎ.గ్. గ్రీస్ గీసుకోరా batsman వి.
          ఒ garden-curry (n): తోటకూర
          ఒ carriage (n): క్యారియర్ కి వచ్చిన తిప్పలు.

% సరే, ఇది ఒక తంటా ఐతే, మా నన్నమ్మకి ఉన్న తెలుగు ప్రేమ ఒక ఎత్తు. ఆవిడ నిఘంటువు:
          ఒ చల్లపెట్టె: fridge
          ఒ అన్ట్లబల్ల: dining table
          ఒ పంఖా: fan

% అందరూ ఎంతో కొంత తల్లిదండ్రులను బట్టి కొన్ని అలవాట్లు నేర్చుకుంటారు. నా మిత్రుడు ఒకడు వాళ్ళ నాన్న కొట్టులో కూర్చునేవాడు. వాడితో చెప్పలేని తంటా. ఎందుకంటే పొరబాటున ఎప్పుడైనా పెన్నో pencil మరిచిపోయి అడిగితే, "ఆ stock లేదమ్మా. రేపు కనిపించు", అనేవాడు.

% కాస్త ఆధ్యాత్మికంగా పురోగతి సాధించినా కొందరు మిత్రులు, "మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు?", అని అడిగేవారు. ఎవరో మొన్న అన్నారు, "నేను సుబ్రహ్మణ్య స్వామిని నమ్ముతాను", అని. వెంటనే నేను, "ఆయన్ని నమ్మితే, వాళ్ళ నాన్న ఐన శివుణ్ణి కూడా నమ్మాలి", అంటే వాళ్ళకి కోపం వచ్చింది :)

% దేవుడికి మనుషుల్ని చూసి ఏ ఫీలింగ్ వస్తుందో తెలియదు కానీ, కచ్చితంగా నవ్వు ఐతే వస్తుంది. మా ఫ్రెండ్స్ కొంతమంది, "ఓయమ్మా ఈ దేవుడు చాల powerful తెలుసునా?", అంటే నాకు అదో రకంగా అనిపించేది. ఐతే పరమాత్మ తత్వాన్ని deep గా అర్థం చేసుకుంటే అలాగ అనడం దోషం కాదేమో కానీ, అదంతా తెలిసి రెండో క్లాసు పిల్లలు అనరేమో అనిపిస్తుంది :)

Saturday, April 4, 2009

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

శ్రీరాముని గొప్పదనం గురంచి చెప్పడానికి, ఆయన నామాన్ని వర్ణించడానికి గొప్పగొప్ప కవులకు కూడా పూర్తిగా సాధ్యం కాలేదు. అలాంటిది అల్పుణ్ణి, సామాన్యుణ్ణి నేను ఎంతటివాడను. ఐనా ఆ స్వామి కృపజేత ఏవో రెండు ముక్కలు నా నోట్లోనుండి వచ్చాయి. ఈ శ్రీరామనవమికి ఆ పరమాత్ముడికి నేను సమర్పించుకునెడి పదపుష్పాలు.

కం:-
నీమాలెరుగను, వేలుగ
నామాలును రావు, లేవు నైవేద్యములున్
ప్రేమారగ గొలిచెద నిను
నా మానసమందు నీవె నాథుడవనుచున్

కం:-
ఈ మాయాజగమునబడి
కామాదులజేత చిక్కి గాసిలు మాకున్
వ్యామోహముబోజేసెడి
రామాయను మాట గంటె రక్షయు గలదే?