Monday, October 6, 2008

నేను హార్లిక్స్ తినను, త్రాగుతాను!

ఈ ఆదివారం నేను హోసూర్ వెళ్లాను. మా అన్నయ్య దగ్గర జ్యోతిష్యం నేర్చుకుందాం అని. గుండమ్మ కథ సినిమా వస్తుంటే చూస్తున్నాము. మధ్యలో ఒక హార్లిక్స్ యాడ్ వచ్చింది. "హార్లిక్స్ ఫర్ వొమెన్" అని. నాకు నవ్వు ఆగలేదు. అంతకు ముందు "జూనియర్ హార్లిక్స్", "హార్లిక్స్ ఫర్ మదర్స్" అని వచ్చినవి గమనించాను.

పక్కన ఉన్నా మా వదినని ఒక సందేహం అడిగాను, "వదిన, నువ్వు ఇప్పుడు మదర్ వి, ఎప్పటినుండో వొమెన్ వి కదా. నువ్వు ఏది తాగుతావు?". మా వదిన దానికి, "mothers హార్లిక్స్ అంటే అది గర్భిణులకు మాత్రామే", అంది. "ఓహో", అనుకున్నాను.

ఇలాగ ఇంక "horlicks for toddlers, vicenarians, tricenarian, quadragenarian, ... centenarian" అని ప్రొడక్ట్స్ వచ్చేస్తే ఎలాగా అనుకున్నాను. వెంటనే నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అది అందరి జీవితాలనీ మార్చేస్తుంది. భవిష్యత్తులోకి వెళ్లి ఒక దృశ్యం చూసాను.

C:కష్టమర్ S: షాప్ ఓనరు

C: హార్లిక్స్ ఇవ్వండి.
S: ఏ హార్లిక్స్ కావాలి సర్

C: అదేమిటి? హార్లిక్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి?
S: ఇరవై నాలుగు రకాలు ఉన్నాయి సార్. మీది ఏ లగ్నం, ఏ రాశి?

C: అదెందుకు?
S: అందులోనే ఉంది అసలు విషయం. మీ రాశిని, లగ్నాన్ని బట్టి మేము హార్లిక్స్ స్పెషల్ గా తాయారు చేస్తున్నాము. ఉదాహరణకి మీది కుంభ లగ్నం అనుకోండి, మీకు లగ్నాధిపతి శని. హార్లిక్స్ ఆయనకీ ప్రీతి కరమైన విధంగా చేస్తాము. అంటే ఇనుము ఎక్కువగా ఉంటుంది, హార్లిక్స్ నల్ల రంగులో ఉంటుంది. అలాగన్న మాట.

C: ఓహో, ఐతే నాది తుల రాశి.
S: మహాచిలిపి. మీ రాశికి అధిపతి శుక్రుడేనా? ఐతే, మీకు కొంచం ములక్కాడల లక్షణాలు ఎక్కువగా ఉండే తులరాశి హార్లిక్స్ ఇస్తాను.

C: మా ఆవిడది వృషభ లగ్నమయ్య...
S: అబ్బా...భలే అదృష్టవంతులు సర్. వృషభ లగ్నం భార్య ఉండటం గొప్ప అదృష్టం. అస్సలు బద్ధకం ఉండదు. ఓర్పు ఎక్కువ. అందులోనూ, నా లాంటి కుంభ లగ్నం బద్ధకిష్టులకి మరీ మంచిది :)

C: ఏంటో, నువ్వు మరీ పోగిడేస్తున్నావు. మా ఆవిడని పొగిడితే నేను పొంగిపోతానోయ్.
S: (మనసులో: ఐతే వీడు ఆవిడకి లొంగిపోయాడు అన్న మాట.) అదేమిటి సర్. ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అన్నారు.

C: అదేమిటి, ఏమైనా కొత్త LIC పాలసీ నా?
S: (ఇలాంటి బుర్ర తక్కువ వాళ్ళు మా షాప్ కి వస్తే అదే చాలు) మీరు మంచి జోక్ లు వేస్తారు సర్.

C: (తను వేసిన జోక్ ఏమిటో తనకే అర్థం కాక) ఇంక వృషభ లగ్నం వల్ల గురించి చెప్పు.
S: వృషభ లగ్నం వాళ్ళకి నోటి దురుసు ఎక్కువ అంటారు సర్. అందుకే ఈ వృషభ లగ్నం హార్లిక్స్ కొంచం మనిషిని కూల్ చేసే విధంగా తయ్యారు చేసారు. అలాగే మంచి బలం కూడా ఇస్తుంది, వాళ్లు బాలు పని చేస్తారు కదా. అస్సలు బద్ధకం ఉండదు మరి.

C: (మనసులో: కెలికితే అసలు విషయం దగ్గరకు వచ్చేసింది.) బాగుంది అయ్యా. ఐతే తుల రాశి హార్లిక్స్, వృషభ లగ్నం హార్లిక్స్ ఇవ్వవయ్యా.
S: అలాగే సర్. అదే చేత్తో మీ లగ్నం, ఆవిడ రాశి కూడా చెప్తే, అవి కూడా ఇస్తాను. ఒక పూట రాశి, ఒక పూట లగ్నం బట్టి తాగచ్చు. ఏమంటారు?

C: అద్భుతంగా ఉందయ్యా నీ ఐడియా. నా జీవితాన్నే మార్చేస్తుంది ఇది. నాది మకర లగ్నం, మా ఆవిడది సింహ రాశి.
S: (అది సంగతి, ఇంట్లో వీళ్ళావిడ సింహం అన్న మాట). మకర లగ్నం అధిపతి కూడా శనే. ఐతే ఇదుగోండి మకర లగ్నం హార్లిక్స్.

C: ఇందులో శనికి నచ్చేవి ఉన్నాయా?
S: అయ్యో, అదేమీ మాట. అసలు శని మొత్తం ఇందులోనే ఉంది.

C: అదేమిటి?
S: అంటే, శనికి నచ్చేవన్నీ ఇందులోనే ఉన్నాయి.

C: మంచిది. మరి మా ఆవిడకి?
S: మీ ఆవిడకి సింహ రాశి హార్లిక్స్ ఇస్తాను సార్. దెబ్బకి ఆవిడ మేష రాశి అయిపోతుంది.

C: అదేమిటి?
S: అంటే, మేక లాగా మారిపోతుంది.

C: అబ్బే, మా ఆవిడ అంత గయ్యాళి కాదు కానీ, నాకు జాతకాలు అంటే ఉన్నా గురి కోసం తీసుకుంటున్నాను. (మనసులో: దేవుడా, ఈ హార్లిక్స్ ఐన మా ఆవిడనుండి నన్ను రక్షించేలాగా చూడు).
S: (మనసులో: నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది బాబు నీ సంగతి.) మంచిది సర్. మీకు శని అంతా మంచిని చేస్తాడు సర్.