Saturday, October 25, 2008

సంగీతసాహిత్యసమలంకృతే...

నాకు సరస్వతీదేవి అంటే అధికమైన ప్రేమ. సరస్వతీదేవి కళ్ళల్లో నాకు జ్ఞ్యానం, ధర్మం, కరుణ మొదలైన సద్భావాలు కనిపిస్తాయి. సరస్వతీదేవి గురించి మన సినిమాల్లో ఎన్నో పాటలు వ్రాసారు. వేటూరి, సినారె, సిరివెన్నెల మొ|| కవులు ఎన్నో విధాలుగా పొగిడారు.

వీటిల్లో నాకు బాగా గుర్తుండిపోయే పాట "స్వాతికిరణం" చిత్రంలో "సంగీతసాహిత్యసమలంకృతే" అనే పాట. ఈ గీతకర్త "సినారె". ఎంతో లలితంగా వ్రాసిన ఈ పాటకి మామ కే.వి. మహదేవన్, పుహళేంది చేకూర్చిన సంగీతం జాతీయ అవార్డు పొందింది అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. పూజ్యుడు మహదేవన్, ఆయన సంగీతంలో కనబడే సత్వగుణం నాకు వేరేవారి పాటల్లో కనబడలేదు అని చెప్పాలి. మహానుభావుడు మామకి నమస్కరిస్తూ ఈ పాట గురించి చెప్తాను. పాట మొత్తం సంస్కృతంలో ఉంటుంది అండోయ్.

సంగీతసాహిత్యసమలంకృతే, స్వరరాగపదయోగసమభుషితే
హే భారతీ మనసా స్మరామి, శ్రీ భారతీ శిరసా నమామి

భారతీ అనేది సరస్వతీదేవి పేరు. సంగీతసాహిత్యాలతో చక్కగా అలంకరించబడిన, స్వరాలతో కూడిన రాగాలతో, పదాల అల్లికతో అలరారే సరస్వతీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకుంటాను, శిరస్సు వంచి నమస్కరిస్తాను.

వేదవేదంతావనవాసినీ, పూర్ణశశిహాసినీ

"వేదం, వేదాంతం అనేది వనంలో జీవించే దానవు నీవు. పూర్ణచంద్రుని వలె భాసించే హాసం కలదానావు నీవు. "

ఇక్కడ వేదం, వేదాంతం మధ్యన భేదం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రెండు పదాలు పడని వాళ్లు ఈ ఖండం విడిచి తక్కినది చదువచ్చు.

"వేదం" అంటే "తెలుసుకోదగినది" అని అర్థం. అది జ్ఞ్యానం. పాంచభౌతిక ప్రపంచాన్ని విడిచి వెళ్ళేది కాదు. భౌతికమైన వృద్ధి, లబ్ది కోరి ఏమేమి చెయ్యచ్చు అనేది చెప్పేవి వేదాలు. అవి సత్వ, రజ, తామస గుణాలకు అతీతం కావు. అవి మనిషి ధర్మాధర్మాలు, బాధ్యతలూ, కట్టుబాట్లు తెలిపేవి మాత్రమే. ఇందులో యజ్ఞాలు, యాగాలూ మొదలైన సందర్భాలకి అగ్ని, వాయువు మొదలైన దేవతలను ఏ విధంగా తృప్తి పరచాలో చెప్పేవి.

"వేదాంతం" అంటే "జ్ఞ్యానానికి చివరిది" అని అర్థం. వేదాంతం తెలుసుకోవడం అంటే "బ్రహ్మాన్ని తెలుసుకోవడం". భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదాలను రక్షిస్తాను అని చెబుతూనే కర్మకాందని ఖండిస్తాడు. అది సామాన్యమైన యోగమని, దానితో పరమాత్మని/బ్రహ్మాన్ని చేరుకోవడం కష్టమని చెబుతాడు. ఈ సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా "భక్తిగుణం" తోనే తనను చేరుకోవడం సులభమని చెప్తాడు.

వేదానుసారంగా బ్రతికేవాడికి, కర్మలాచరించేవాడికి ఉన్నతమైన మరుజన్మ లభిస్తుంది. భౌతిక లబ్ధి (డబ్బు, భార్య, బిడ్డలు, పాడి, పంట, సుఖం మొ||) సిద్ధిస్తుంది. అదే వేదాంతం ఎరిగి "దానిని ఆచరించినవాడికి", మరుజన్మ ఉండదు. వాడు పరమాత్మను చేరుకుంటాడు.

నాదనాదాంతపరివేషిణీ, ఆత్మసంభాషిణీ

నాదం అంటే (లయబద్ధమైన) శబ్దం. "పరివేష్టించుట" అంటే "చుట్టుముట్టుట" అని అర్థం. "అమ్మా, నువ్వు సంగీతం మధ్యలో కొలువైయున్నదానవు" అనే భావం ఒక సంస్కృతభూయిష్టమైన, నాకు మహాయిష్టమైన రీతిలో చెప్పాడు కవి. "అత్మసంభాషిణీ" అంటే "తనలోనే మాట్లాడుకునేది" అని అర్థం. నా లాంటివాళ్ళు లోడలోడా వాగుతూనే ఉంటారు. జ్ఞ్యానులు అత్యవసరమైనది మాత్రమే మాట్లాడతారు. వారిది ఆత్మానందం. పరమాత్ముడి గురించి ఆలోచిస్తూ, దృష్టిని అక్కడ లగ్నం చేస్తూ తమలో తామే ఆనందిస్తారు.

వ్యాసవాల్మీకివాగ్దాయినీ, జ్ఞ్యానవల్లీ, సవుల్లాసినీ

"వ్యాసుడు, వాల్మీకి వంటి మహాకవులకు, మహాజ్ఞ్యానులకు మాటను ప్రసాదించిన దానవు. జ్ఞ్యానం అనే తీగావు. ఎల్లప్పుడూ ఉల్లాసం కలిగించేదానావు నీవు. "

ముందు వాక్యమ్లో సంగీతం గురించి మాట్లాడిన కవి, ఇప్పుడు సాహిత్యం (రామాయణం, భరతం, భాగవతం, పురాణాలు, ఇవన్ని సాహిత్యం, జ్ఞ్యానానికి పరాకాష్టలు) చెప్పడం బాగుంది. ఈ మహోన్నతమైన గ్రంధాలు చదువుతుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, మనస్సుకు ఊరట ఉల్లాసం కలగట్లేదు అంటే అది దురదృష్టమనే చెప్పుకోవాలి.

బ్రహ్మరసనాగ్రసంచారిణీ, భవ్యఫలకారిణీ

"బ్రహ్మ యొక్క నాలుకపై నడిచేదానా, నీవు శుభాలను చేకూర్చే వేల్పువు."

ఏ మహాపురుషుడికైనా భార్య కూడా గొప్పదైతే కలిగే కీర్తి వేరు. విష్ణువు లక్ష్మిని గుండెలో పెట్టుకుంటే, శివుడు పార్వతికి అర్థశరీరాన్ని ఇచ్చాడు. అలాగే బ్రహ్మ నాలుక సరస్వతికి స్థానం. ఆమె అక్కడ ఉండుటవలనే ఆయన చెప్పినదల్లా జరుగుతోంది. ఆయన మాటకు అంత శక్తి లభించింది.

సరస్వతీదేవి కరుణ ఉన్నవారి వాక్కు ఫలిస్తుంది. ఎందుకంటే సకలవిద్యలకు ఆమె దైవం. ఆమె అనుగ్రహంతోనే మనిషికి విద్య లభిస్తోంది. విద్యలేని వాడి మాట ఎలాగ ఫలిస్తుంది? [ విద్య అంటే "టెక్స్ట్ బుక్స్ లో చెప్పేది" అని మాత్రం దయచేసి అనుకోకండి. విద్య అంటే అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఆర్ట్ కావచ్చు ... ఏదైనా స్కిల్ ].

నిత్యచైతన్యనిజరూపిణీ, సత్యసందీపిణీ

నిత్యచైతన్యం ఎవరికీ ఉంటుంది? ఆ పరబ్రహ్మను ఉపాసించే వారికి, వేదాంతం ఎరిగినవారికి ఉంటుంది. అటువంటి రూపం పరబ్రహ్మకు అద్దం పడుతుంది. మనుషులకు సత్యాన్ని బోధిస్తుంది.

సత్యం అంటే అదేదో "ట్రూత్" అనుకోకండి. నిజానికి సత్యానికి తేడా ఉంది. నిజం భౌతికప్రపంచంలో కాలానికి కట్టుబడి ఉంటుంది. సత్యం కాలానికి, ఈ ప్రపంచానికి అతీతమైనది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సత్యం అనేది నిజం కంటే గొప్పది. ఉదాహరణకి బ్రహ్మజ్ఞ్యానం లోని మర్మాలు సత్యాలు.

సకలసుకళా సవున్మేషిణీ, సర్వరసభా సంజీవినీ

అన్ని కళలనూ వికసింపజేసేది దానవు. అన్ని రసభావాలనూ బ్రతికించేది దానవు.

"రసము" అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ "స్పిరిట్" అనే అర్థంలో వాడినట్లు అనిపిస్తోంది. "భావము" అంటే "ఫీలింగ్" అని చెప్పుకొనవచ్చు. (సరస్వతీదేవి గురించి చెప్పడానికి ఇంగ్లీష్ పదాలు అవసరమైనందుకు చింతిస్తున్నాను. చదివేవాళ్ళు నన్ను క్షమించాలి.) ఒక కవికి కానీ, నర్తకునికి కానీ ధర్మం - ఒక భావాన్నీ, దాని రసాన్నీచూపించగలగడం. అది కరుణ కావచ్చు, శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అంటే వారు ఆ రసానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అన్న మాట.

అలాటి కళలకూ, భావాలకూ ప్రాణం పోసేది ఆ తల్లి, సరస్వతీదేవి.

సరస్వతీదేవి గురించి చెప్పడానికి నాకు పదాలు చాలవు. దేవి ముఖారవిందం చూస్తేనే నాకు ఎన్నో నాళ్ళనుండి తీరని దాహం తీరినట్లు, జ్ఞ్యానమనే వెన్నెలలో స్నానం చేస్తున్నట్లు, అమ్మ వొడిలో పడుకున్నట్ల, పరబ్రహ్మను అద్దంలో నుండి చూసినట్లు అనిపిస్తుంది. తల్లికి పాదాభివందనాలు అర్పించుకుంటున్నాను.

ఈ పాట ఇక్కడ చూడవచ్చును.

2 comments:

నేను said...

నాకు ఈ పాటంటే చాలా ఇష్టం.....విన్నప్పుడల్లా అనిపిస్తుంది ఇదో గొప్ప పాట అని....., మీ వివరణ చదివకా అర్ధమైంది ఎంత గొప్ప భావం సాహిత్యంలో వొదిగిపోయి వుందో....

Unknown said...

Idi naku kuda one of my favourite songs...