Tuesday, October 7, 2008

జానకి కల గనలేదు...

ఎవరేమన్నా సరే సంసారం అంటే అంతా సులువైన విషయం కాదు అన్నది సత్యం. ఇది అన్ని పురాణాలు, స్మృతులు, ఉపనిషత్తులు ఘోషిస్తున్న సత్యం. అసలు ఒక్కసారైనా కొట్టుకొని భార్యాభర్తలు ఉండరు అన్నది నా ప్రఘాఢ విశ్వాసం. అప్పుడప్పుడు ఇలాంటి పాటలు వింటే, నాకు కూడా ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది, "అంత కంగారు పడాల్సింది ఏమి లేదు. ఇందులో తలనొప్పి కంటే అమృతాంజనమే ఎక్కువ ఉంటుంది ఏమోలే" అని :)

భార్యాభర్తలు అనగానే మనం చెప్పుకొనే రెండు జంటలు ఉన్నాయి. అవి: పార్వతీపరమేశ్వరులు , సీతారాములు.
అర్థనారీశ్వరుడు శివుడు ఖ్యాతికి ఎక్కితే, ఏకపత్నివ్రతుడు రాముడు ఖ్యాతికి ఎక్కాడు. వీరు ఇరువురు నాకు జీవితంలో ఆదర్శం (ఒక్క విషయంలోనే కాదు సుమీ :) ). వీళ్ళు కూడా కొట్టుకున్న సందర్భాలు మనం పురాణాల్లోచదివాము [ శివపురాణం, వాల్మీకి రామాయణం ]. కానీ, "కోపం ఉండటం వేరు. ఇష్టం లేకపోవడం వేరు. ", అని నానమ్మకం.

ఇక అసలు విషయానికి వస్తే ఈ పాట "రాజ్కుమార్" సినిమాలో ఇళయరాజా స్వరపరచిన పాట. ఇది వ్రాసింది ఆచార్యఆత్రేయ. చక్కని సాహిత్యమ, సుమధురమైన సంగీతం రెండూ కలిపితే నిజంగా
పార్వతీపరమేశ్వరులు చూసిన భావమేకలుగుతుంది.


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు

రాముడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో అడవులకు వెళ్ళేటప్పుడు అసలు అందరూ "వీడు మళ్ళీ వెనక్కి వస్తాడా?", అనేభయంతోటే ఉండి ఉంటారు. అలాటిది, అనుకున్న దానికంటే ఎక్కువ దానవసంహారం చేసి, అహల్యను అనుగ్రహించి, పెళ్లికూడా చేసుకుని వస్తాడు అని ఎవరూ అనుకోలేదేమో, ఒక్క వశిష్టుడు, విశ్వామిత్రుడు తప్ప - వారు బ్రహ్మర్షులు. వారికిజరిగేది, జరిగింది, జరగబోయేది అన్నీ తెలుస్తాయి. "Marriages are made in heaven",
అంటారు. అలాగ, అనుకోకుండానే ఒకరికి ఒకరు జతపడ్డారు సీతారాములు. ఈ జంట పరవశంలో అలాగే వారి వలె వీరు కూడా కలిసారుఅని సంతోషిస్తోంది.

ఇక్కడ పారాయణం అనే పదం చక్కగా అమరింది. పారాయణం అంటే మొదటినుండి చివరిదాకా శ్రద్ధగా చదవటం. పూర్వం భాగవతపారాయణం అని చదివేవారు. అంటే, మొత్తం భాగవతం కూర్చుని శ్రద్ధగా చదవడం. వీరి జీవితాలనుచూస్తేకనుక ఆ రామాయణం లాగే ఉంది అని వీరి భావం.


చెలి మనసే శివధనుసైనది; తొలిచూపుల వశమైనది
ఆత్రేయ గారు మహానుభావుడు. మనసు కవి ఆత్రేయ అంటారు. అలాగ, చక్కనైన ప్రయోగం చేసారు. ఎక్కడైనా కొంచంసిగ్గు, బెట్టు, జాగ్రత్త అన్నీ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. ఆమె చేత అవుననిపించడమే అసలు ఒక పెద్ద విషయం. అలంటి ఆ స్త్రీ మనసే, శివధనుస్సు అంత బలమైనది అని చెప్పటం నాకు నచ్చింది. వారి చూపులు కలిసినప్పుడే అదిలొంగిపోయిందిట.


తొలిచుక్కవు, నీవే చుక్కానివి నీవే
ఎవరైనా ఉపవాసం/నక్తం చేసేవాళ్ళు ఉంటే, వారికి ఈ తోలిచుక్క విలువ తెలుస్తుంది. పొద్దున్న లేచినప్పటినుండి రాత్రిఒక చుక్క కనబడేవరకు భోజనం చెయ్యరు. అది కనబడ్డాక "బ్రతుకు జీవుడా" అనుకుని తినేవాళ్ళు కొంతమందిఉంటారు :) ఆ తోలిచుక్కతో ఈమె తన ప్రియుణ్ణి పోల్చడం బాగుంది.

చుక్కాణి అంటే పడవకు దరి చూపేది (rudder). దారి చూపేది కూడా అతడే అని భావం. అతడితోనే, తన పయనం అనిపునరుద్ఘాటిస్తోంది. ఇలాంటి చక్కని పదాలు అప్పుడప్పుడు వేటూరి, సిరివెన్నెల ప్రయోగిస్తున్నారు. గోదావరి సినిమాలోవేటూరి "
చుక్కాణే చూపుగా..బ్రతుకు తెరువు ఎదురీతేగా...", అని టైటిల్ సాంగ్ లో వ్రాయడం నాకు భలే నచ్చింది.


సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
నివాసం అంటే ఇల్లు. వారికీ ఇల్లు అంటే ఒకరితో ఒకరు కలిసి ఉండటమేనట. అందులో హద్దులేవి ఉండవు.

ఇక "ప్రతిపొద్దు
ప్రణయవేశం" అనే ప్రయోగం నాకు గొప్పగా నచ్చింది. ఆవేశం అంటే ఒక భావనకు లోను కావడం. సహజంగా మనం ఆ భావాన్ని కోపానికి మాత్రమే అపాదిస్తము. ఐతే, అది ప్రణయం మనోహరమైన భావాలకు వాడెకవులు తక్కువ. అందుకే నాకు చక్కగా అనిపించింది.

ఆ ఆవేశం వ్యక్తపరిచే విధానం కూడా చాల తేలిక మాటల్లో చెప్పారు - "హాసం". అంటే, చిరునవ్వుతోనే ఆ భావాలనుతెలుపుకున్తున్నారు!


సుమసారం మన సంసారం;
పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు అన్నీ ఉన్నదిట వారి సంసారం. పువ్వులో ఉండే ముఖ్యమైన లక్షణాలు: రంగులు, సువాసన, తేనె, అందం. ఇవన్నీ, మన మనసుకు ఉల్లాసం కలిగించేవి. అలాంటివి అన్నీఉన్నాయి ఆసంసారంలో అని చక్కగా, తక్కువ మాటల్లో చెప్పాడు కవి.

అసలు ఇలాంటి ప్రయోగాలు (సుమసారం) చేసే కవులు ఇంకా ఎక్కడ మిగిలారు అనిపిస్తుంది నాకు. తెలుగుపాటల్లో కూడా ఇంగ్లీష్ పదాలే నిండిపోతున్న కాలంలో, ఇలాంటి చక్కని ప్రయోగాలు వింటే నాకు చెవుల్లో తేనే పోసినట్టు ఉంటుంది.


మణిహారం మన మమకారం
మణిహారంలో అనేక మణులు ఉంటాయి. అలాగే వారి మమకారంలో కూడా అనేక భావాలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి, తల్లి, తండ్రి, స్నేహితులూ ఒకరికి ఒకరు అవుతారు కాబట్టి ఆ విభిన్నమైన రూపాలు ధరిస్తున్న అనురాగం మణిహారంలాగా ఉంటుంది.


గతమంటే నీవే కధ కానిది నీవే
ఆమె గతం మొత్తం చెరిపేసి అతడు అక్కడ నుంచున్నాడుట. గతం అంత తనే కనిపిస్తున్నాడు.
ఐతే, గతం సహజంగా కథగా మిగిలిపోతుంది. కానీ, ఇతడు కథ కాదు అని ఋజువు చేస్తూ ఆమె ఎదురుగుండా
నిలిచున్నాడు!

ఈ లైన్ వింటే నాకు చక్రం సినిమాలో సిరివెన్నెల "ఒకే ఒక మాట" అనే పాటలో చేసిన చక్కని ప్రయోగం
గుర్తుకొచ్చింది: "నువ్వు రాక ముందు జీవితం గురుతైన లేదనీ, నిను కలుసుకున్న ఆ క్షణం నను వదిలిపోదనీ"

ఇక ఈ పాటలో మనం మరిచిపోకూదనివి కొన్ని ఉన్నాయి. అవి సుశీల, బాలు చక్కగా పాడి పాటను రక్తి
కట్టించడం. అలాగే, background score కూడా చక్కగా కలిసింది. ఇళయరాజా లాంటి మెలొడీలు ఇచ్చే
సంగీతదర్శకులు ఇప్పుడు అరుదు. అడపోదడపో మణిశర్మ, దేవిశ్రీ కొన్ని చేస్తున్నారు అంతే. ఆంధ్ర అందగాడు
శోభన్ బాబు కెరీర్ లోనే ఇది ఒక గొప్ప యుగళగీతం అని నా అభిప్రాయం.

చిత్రం: రాజ్కుమార్


సంగీతం: ఇళయరాజ
పాడింది: బాలు, సుశీల


జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిదీ ఈనాడు మనకూ నిజమైనదీ
ఆ రామాయణం మన జీవన పారాయణం

చెలి మనసే శివధనుసైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయం వరమైనపుడు గెలువనిదీ యేదీ
ఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని యశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావి
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరు జన్మకు నీవే

సహవాసం మనకు నివాసం; సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం; పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశశృంగారం
గతమంటే నీవే కధ కానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే