Saturday, July 5, 2014

మారిపీలికాట్టే మారిప్పోకు

ఈ మధ్యన ఆఫీసులో పని ఎక్కువై పాటలు వినే తీరిక లేకపోయింది. ఎప్పుడైనా కాస్త తీరికగా కూర్చుని పని చేస్తుంటే చెవులకు గరికిపాటి వారి భారతం వినిపిస్తున్నాను. అప్పుడప్పుడు మరీ వెలితిగా అనిపిస్తే అప్పుడు కాస్త ఇళయరాజా రసం పట్టిస్తున్నాను. అలాగ పట్టించి రసాలలో ఒకటి మలయాళం చిత్రం పుదియ తీరంగళ్ (కొత్త తీరాలు) లోని మారిపీలికాట్టే మారిప్పోకు అనే పాట. వినగానే నాకు చాలా నచ్చింది. ఇంత సున్నితమైన, శ్రావ్యమైన పాట విని చాలా రోజులైంది.


మలయాళంలో ఈ పాట భావం కానీ సందర్భం కానీ నాకు తెలియవు. రచయిత కైతప్రం దామోదరన్ నంబూద్రి, స్వరకర్త ఇళయరాజా అని మాత్రం తెలుసును. చిత్రంలో అన్ని పాటలూ బాగున్నా, ఈ పాట నన్ను బాగా ఆకట్టుకుంది. దీనిని తెనుగీకరించాలి అని సంకల్పించి ఒక గంటలో ఏది వ్రాయగలిగితే అది వ్రాసాను. అక్కడక్కడ తెలుగుకు అనుగుణంగా స్వరాలను మార్చాను.

భావం విషయానికి వస్తే. ఆఫీసు వ్యవహారాలతో హడావుడిలో ఉన్న కొన్ని రోజులు నిద్ర చెడింది. అదే సందర్భంగా తీసుకుని, కొంచం గాఢపరచి వ్రాసాను. అంటే నిరాశకు లోనైనా ఒక భగ్నప్రేమికుడు ఎలాగ ఆలోచిస్తాడో అలాగా వ్రాసాను.

వాలిపోయే పొద్దా ఆగిపోవా
ఆగిపోయి నాతో ఆడుకోవా
ఒంటరైన గుండెతో జావళీలు పాడవా
కంటిపాప నిండుగా రంగుతోట చూపవా
చీకట్లు కమ్మనీక!

పల్లవిలోని తోలిపలుకులను వేటూరి వ్రాసిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే జాతీయ పురస్కారం లభించిన పాట లోంచి యథాతథంగా తస్కరించాను. ఇది ఆయన పట్ల గౌరవంతో, ప్రేమతో చేసిన ప్రయోగంగా చదువర్లు గ్రహించి మన్నించాలి.

నాకు రోజు ఎంత భారంగా సాయంత్రం సంధ్యా సమయంలోని ఆకాశాన్ని చూస్తె ఉత్తేజం కలుగుతుంది. ఆకాశాన్ని "రంగుతోట" చేసేది సంధ్య (మలిపొద్దు). ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన వెంట వచ్చే వాటిల్లో ఆ సౌందర్యం ఒకటి.

పొద్దు వాలితే ఎందుకో ఎదకోత రేగునే
నిద్దురన్నదే చేరక కను ఎఱ్ఱబారునే
గుండె లోతులో వెలుతులే తెగ మండె కంటిలో వెలుతురై
చీకట్లాగిపోయే ఱెప్పల ముంగిట్లో
జోకొట్టే వాఱేరి చిక్కుల పాన్పుల్లో
వెన్నెలంటే వెగటొచ్చింది, తారలన్ని భారమయ్యె - ఏమైందో ఎందుకనో...

సాధారణంగా చీకటిని చెడ్డదిగా, వెలుతురిని మంచిదిగా వర్ణిస్తారు. కళ్ళు మూసుకున్నప్పుడు మనసు ఖాళీగా ఉంటె, అప్పుడు నిద్ర సులువుగా పడుతుంది. అదే మనసులో వెలితి ఉంటె, అది కళ్ళు మూసుకున్నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సూర్యుడి కింది కళ్ళు మూసుకుని పడుకున్నా నిద్ర పట్టదు. అలాగే మనసులో అంతటి వెలితి మండుతూ ఉంటె కూడా నిద్ర పట్టదు. కమ్మిన చీకట్లన్నీ కంటి బయటే ఆగిపోతాయి. అలాంటి రోజుల్లో కిటికీ లోంచి వెన్నెల వచ్చినా కంటికి ఇంపుగా ఉండదు. చుక్కలన్నీ చిక్కుల్లాగా అనిపిస్తాయి. అందుకని ఇక్కడ నిద్రనిచ్చే చీకటిని మంచిదిగా, నిద్రపోనివ్వని వెలుతురిని చేద్దడిగా వర్ణించడం జరిగింది.

తెల్లవారితే కలవరం పొలికేక ధాటికే
చల్లబోయిన మది నరం ముసుగైన తీయదే
రోజు మారితే రోజనం, మది తీరు మారితే నవదినం
చింతల చీకటి మాపేసే సూరీడున్నాడో
దొంతర ఆశల మబ్బుల్లో దాక్కుని ఉన్నాడో
చెయ్యందించి చేదనిపించే జీవితమిచ్చే తీపిని పంచే వెలుగొచ్చేదింకెన్నడో...

ఉదయం మంచం మీద నుండి దిగేటప్పుడు మనసు ఉత్సాహంగా లేకపోతె మనం జీవితంలో ఏదో పొరబాటు చేస్తున్నాము అని సూచన. ఆశ, స్ఫూర్తి, ధైర్యం, తెగువ లేని మనిషి తోలి అడుగు తనకే కాక, భూమికి కూడా భారం అవుతుంది. కలతలో ఉన్న మనిషికి పొద్దున్న లేవగానే అదే గుర్తొస్తుంది. గుర్తు రాగానే మనసులో ఒక పెద్ద గొయ్య త్రవ్వినట్టు అనిపించి, లోటు తెలుస్తుంది. ఇంకాఁ మనసు నిద్ర లేవడానికి ఇష్టపడదు.

తేదీ మారితే కొత్త తేదీ వస్తుంది. అంత మాత్రాన దాన్ని "కొత్త రోజు" అనడానికి లేదు. కొత్త అంటే "వాడనిది, వాడిపోనిది" అని కదా అర్థం. ఎప్పుడైతే మనసు నడత మారి సరికొత్త పుంతలు తోక్కుతుందో అప్పుడు "నవ దినం", ఒక కొత్త పర్వం మొదలైంది అని అంటాము. కవితా స్వేచ్ఛను అనుసరించి, ఈ భావాన్నే "రోజు మారితే రాజనం" అని కుదించాను. వేటూరి అభిమానులు కోపగించుకోరు కానీ అన్యులకు ఇది న్యూనంగా అనిపించవచ్చును.

ఏదో ఒక సమయంలో మనిషికి తానున్న వెలితిలోంచి బయట పడే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను నిచ్చెన చేసుకుని మనసులోని గోయ్యలోంచి బయటకు పాకుతాడు. అలాంటి ఆలోచన ఆశలోంచే కలుగుతుంది కానీ నిరాశలోంచి కాదు. అది కలిగాక అప్పటి వరకూ చేదుగా అనిపించిన జీవితం ఉన్నట్టుండి తీయగా అనిపిస్తుంది. ఆ కొత్త రోజు కోసం ప్రతి ఒక్కరూ వేచి ఉండాలి. ఆ ఆలోచనే నిజమైన వేడ్మి, కాంతి కలిగిన సూర్యుడు.

No comments: