Saturday, June 23, 2012

వేటూరి - వానపాటలు (2)


బాధతో నిండిన సందర్భానికి వేటూరి వ్రాసిన వానపాటలు చూద్దాము. సామాన్యంగా వర్షాన్ని సంతోషానికి చిహ్నంగాను, మబ్బుని బాధకు చిహ్నంగాను వాడతారు. వేటూరి కూడా అదే చేసారు. అలాంటి పాటల్లో నాకు మొదట గుర్తొచ్చేది మేఘసందేశంలో రమేశ్ నాయుడు సంగీతంలో వేటూరి వ్రాసిన పాట. మేఘసందేశం పేరులోనే వాన ధ్వని ఉంది కదా! ఈ పాటను ప్రస్తావించే ముందు కొంచెం సందర్భాన్ని పరిచయం చెయ్యాలి. ఒక కవి తనకు స్ఫూర్తినిచ్చే అమ్మాయికి దూరమయ్యాడు.  ఆ విరహంలో మేఘాలతో సందేశం పంపాలనుకున్నాడు. ఈ సామాన్యమైన సన్నివేశానికి అసమాన్యమైన పాటను వ్రాసారు వేటూరి.
ఆకాశదేశాన, ఆషాఢమాసాన మెరిసేటి, ఓ మేఘమా!
విరహమో దాహమో విడలేని మోహమోవినిపించు నా చెలికి, మేఘసందేశం
సందర్భాన్ని, మబ్బుని పరిచయం చెయ్యడం కోసం వేటూరి - "ఆకాశ దేశంలో, ఆషాఢ మాసం" అని అన్నారు. ఈ "ఆకాశదేశం" ప్రయోగం వేటూరికి బాగా నచ్చి ఆ పైన చాలా సార్లు వాడుకున్నారు. [ఉదా:- అగడం బగడం (చిత్రం: హనుమాన్), తెల్ల చీరకు తకధిమి (చిత్రం: ఆఖరి పోరాటం), ఏ కొమ్మకాకొమ్మ (చిత్రం: శీను).] మిగతా పాటలో వాన ప్రస్ఫుటంగా కనిపించకపోయినా ఆ ధ్వని ఉంటుంది. అందుకే కదా అది "మేఘ"-సందేశం! "వానకారు కోయిలనై" (వసంతం వెళ్ళిపోయిన తఱువాత కోకిల), "ఉలిపిరి చినుకుల బాసలతో, తొలకరి మెరుపుల లేఖలతో, రుధిరబాష్పజల ధారలతో విన్నవించు నా చెలికి మనోవేదన...నా మరణయాతన!"

చలనచిత్రంలో కథానాయకుడు కవి అయినప్పుడు పాటలు వ్రాయాలంటే దానికి ఉత్త సినీకవులు న్యాయం చెయ్యలేరనిపిస్తుంది. నిజజీవితంలో కవితాత్మకంగా ఆలోచించగలిగినవారే దానికి న్యాయం చెయ్యగలరు. అలాంటి సహజకవి అయిన దేవులపల్లి పాటలకు సమానంగా ఉండేలాగా వేటూరి ఈ చిత్రంలోని పాటలను వ్రాసారు. అంత కవితాశక్తి ఉంది కాబట్టే,  "మల్లెపువ్వు" (గురుదత్ నిర్మించి, నిర్దేశించి, నటించిన ప్యాసా చిత్రానికి తెలుగు ప్రతి), మేఘసందేశం వంటి చిత్రాలకు దర్శకులు వేటూరి చేత చాలా పాటలు వ్రాయించుకున్నారు.

మేఘాలు, విరహం అంటున్నాను కాబట్టి చెప్తున్నాను.  నాకు తెలిసి ఎవరికైనా సరే వాతావరణంలో మబ్బులు పట్టినప్పుడు నిజంగానే విరహభావం కలుగుతుంది. ఎందుకంటే మబ్బు నీళ్ళు కురుస్తాయి అనే ఆశని కలిగుస్తుంది కానీ వర్షం వచ్చేంత వరకూ ఆ నీళ్ళు రావు. అందుకే విరహంతో కూడిన తీయని బాధని ఆనంద్ చిత్రంలో "మేఘమల్లె సాగివచ్చి దాహమేదో పెంచుతావు. నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు" అన్నారు వేటూరి

మఱొక ఉదాహరణ కావాలంటే "మాతృదేవోభవ" చిత్రంలో వేటూరికి జాతీయపురస్కారాన్ని తెచ్చిపెట్టిన "రాలిపోయే పువ్వా" పాటను చూద్దాము. ఈ చిత్రంలో ఒక మహాతల్లి భర్తను కోల్పోయిన పరిస్థితిలో తాను ఎక్కువ రోజులు జీవించదని తెలుసుకుంటుంది. తన పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి దత్తతు ఇచ్చి తాను పడమర దిక్కుకు పయనిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో చరణంలో ఒకానొక పంక్తిలో ఇలాగ వ్రాసారు.
అనుబంధమంటేనే అప్పులేకరిగే బంధాలన్నీ మబ్బులే
మనిషికి ఇతరులతో ఉన్న కర్మబంధాలే అనుబంధాలై మబ్బులలాగా వస్తాయి. అవి కరిగిపోయి వర్షమౌతాయి, అని కవి భావం. ఇక్కడ వర్షం ఉపమానం, ఉపమేయం రెండూ కాదు. కాకపోతే వర్షించడాన్ని ఒకింత చెడు విషయంగా చెప్పడం అరుదైన విషయం.

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!  [1]

దర్శకుడు వంశీ తొలిచిత్రం "మంచు పల్లకి" లో రాజన్-నాగేంద్ర స్వరపరిచిన ఒక పాటను చూద్దాము. చిత్రంలో గీత తన మిత్రుడు శేఖర్ ని ఇష్టపడుతుంది. శేఖర్ కి కూడా గీత అంటే ఇష్టమే. తనే ఆ విషయం గీతతో చెప్తాడు. తిరకాసేమిటి అంటే గీత ఒక అనారోగ్యం కారణంగా ఎక్కువ రోజులు బ్రతకదు. తన మనసులో ఉన్న ముఖ్యమైన, ఆఖరి, అతిమధురమైన కోరిక తీరే అవకాశం తన ఎదురుగా నిలబడి తలుపు తట్టినా, ఆ తలుపు తీయడం వలన ఒరిగే మంచేమీ లేదని తెలుసుకుని తను మౌనం వహిస్తుంది. ఆ సందర్భంలో తనలో తను పాడుకునే పాట ఇది.

ఇక్కడ కూడా వేటూరి మేఘాన్ని, ఎంతో సంతోషాన్ని బాధతో అణిచిపెట్టి పట్టుకున్న నాయికతో పోల్చారు. నీళ్ళు తెల్లనివి, కానీ మేఘం నల్లగా కనబడుతుంది. ఆమె మనసులో ఉన్నది "అవును" అనే తీయనైన మాట, కానీ అది బయటపడకుండా మేఘంలా గంభీరంగా నడుచుకుంటోంది. పోలిక బాగా సరిపోవడంతో ఏకంగా పల్లవే మేఘంతో మొదలెట్టారు.
మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
గీత, తన దేహాన్ని (ముఖాన్ని) మేఘంగా అభివర్ణిస్తూ మెరవద్దు అంటోంది. మెరుపుకు నవ్వు, ఆనందంతో పోలిక. తను నవ్వితే శేఖర్ కి విషయం తెలిసి ఆశలు పెంచుకుంటాడు, అది జరిగితే తనకు మొత్తం కథంతా చెప్పాలి. అంతటితో అప్పుడప్పుడే నవ్వుతూ తిరుగుతున్న మిత్రులందరూ బాధపడవలసి వస్తుంది.
మెరుపులతో పాటు ఉరుములుగా
మూగబోయే జీవస్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా
వేటూరి ఈ చరణంలో ఆమె నవ్వితే ఏం బయటపడుతుందో చెప్పారు. మెరుపుల వెంటనే ఉరుములు వస్తాయి (మెరుపులు కాంతి కాబట్టి వేగం ఎక్కువ, ఉరుములు శబ్దం కాబట్టి వేగం తక్కువ). మెరుపులు ఎంత అందంగా ఉంటాయో, ఉరుములు అంత కంగారు కలిగించేవి లాగా ఉంటాయి. ఇక్కడ ఉరుములతో ఆమెకున్న అనారోగ్యం విషయం తెలిస్తే వచ్చే బాధను పోల్చినట్టు నాకు తోచింది. ఆ ఉరుములు ఏం చెప్తున్నాయి? ఆమెవి మూగబోయే  జీవస్వరములని (మబ్బు, మెరుపు, ఉరుము - ఏదీ ఎక్కువ కాలం ఉండవు. గీత ప్రాణాలు ఎక్కువ రోజులు ఉండవు), ఆమె తెల్లారుఝామున వచ్చే వెన్నెల తాలూకు ఆఖరి కిరణం వంటిది అని (అది కూడా తెల్లవారుతూనే కనబడదు). ఈ పోలికను వేటూరి మరింత ముందుకు తీసుకెళ్తూ -- తెల్లవారాక ఆ వెన్నెల మరకలు, వాకిట ముగ్గులుగా వెలుగుతాయి అంటున్నారు. ఏమిటా ముగ్గులు అని మనం అడిగే లోపలే స్మృతిలో మిగిలే నవ్వులు అని చెప్పారు. అంటే ఆమె తనువు చాలించాక ఆమె జ్ఞాపకాలను ముగ్గులతో పోల్చారు. వేసవిలో మంచుపల్లకి అంటూ ఆమె జీవితం త్వరగా కరిగిపోతోంది అని పాటను ముగించారు.

ఎక్కడా "చావు" అన్న పదం రాకుండా మొత్తమంతా అధివాస్తవకితతో (surrealism) చెప్పారు. అది వేటూరి ముద్ర. అదే ఒక సామాన్యకవికి గొప్ప కవికి మధ్యలో ఉండే భేదం. సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఒక సారి  శుభలేఖ చిత్రంలో "రాగాల పల్లకిలో కోకిలమ్మ" అనే పాటను వినండి. ఆ విషయం మొదట్లో నాయకుడి మాటల్లో వింటాము కానీ పాటంతా ఉద్యోగం, నష్టం వంటి పదాలేమీ వినబడవు. అది వేటూరి పద్ధతి.

ఈ పాటలో "వేకువఝామున వెన్నెల" అని విన్నప్పుడు చదువర్లు గమనించే ఉంటారు. ఇది వేటూరికి నచ్చిన ఉపమానం. చాలా చోట్ల వాడారు. మేఘసందేశంలో "వానకారు కోకిలనై, తెల్లవారి వెన్నెలనై" అని, గోదావరిలో "కన్నీరైన గౌతమి కన్నా, తెల్లారైన పున్నమి కన్నా" అని, మాతృదేవోభవలో "తిరిగే భూమాతవు నీవై, వేకువలో వెన్నెలవై" అని వినే ఉంటారు.

ఈ పాటలో రెండో చరణం చిన్నదైనా బరువుగా వ్రాసారు. సందర్భం మంచిదైతే, బాణీ అనుకూలమైనది ఐతే, వేటూరి ఎప్పుడూ న్యాయం చేస్తారు అనడానికి ఇది మఱొక ఉదాహరణ. ఈ చరణానికి వానతో సంబంధం లేదు కనుక చూచాయిగా చూద్దాము. పెనుగాలికి (మృత్యువు), పువ్వుతో (గీత) పెళ్ళిచూపులు. పువ్వు రాలితే కల్యాణం జరుగుతుందట. అది రాలే వరకూ ఆ పువ్వుకు ఏమౌతుందో అని ఆరాటం, ఆశల్తో పేరంటం ఉంటాయట. అది జరిగినప్పుడు శేఖర్ తనకు ఒక పూమాలను బహూకరించాలని గీత అడుగుతుంది. "అది ఎందుకో?" అంటూ దుఃఖంతో పాటను ముగిస్తుంది.

ఇంత భారీ పాటను విన్నాక ఈ సారి "సరదా" విషయాలకు వద్దాము. అంటే వానని వానగా వర్ణిస్తూ, ఆ సంబరాన్ని ఎలాగ చెప్తారు? ఇది నేను నాలుగేళ్ళ క్రితం ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాను. వేటూరి పాటలు చూసాక నాకు నాలో ఉన్న కవిపైన చాలా చిన్నచూపు కూడా కలిగింది.

నాకు వెంటనే రెండు పాటలు గుర్తొస్తున్నాయి. రెండూ కమ్ముల శేఖర్, రాధాకృష్ణన్ లకు వ్రాసినవే. మొదట ఆనంద్ చిత్రంలో "వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా" పాటను చూద్దాము. ఇందాకటిదాకా మబ్బులను విరహవర్ణన కోసం వాడుకుని ఇప్పుడు మబ్బులను "బాధ తీరుస్తారా?" అని అడుగుతున్నారు చూడండి. అందులో, "వర్షం కురిపిస్తారా? లేక ఊరకే కనబడి వెళ్ళిపోతారా" అనే ధ్వని కనిపిస్తోంది. అలాగే, చిత్రంలో రూప వానలో మిత్రులతో కలిసి నర్తిస్తుంటే చూసిన ఆనంద్ ఆరాటాన్ని వర్ణిస్తూ వేటూరి వ్రాసిన వాక్యాలు చూద్దాము.
నెమలి ఈకలా ఉలికిపడే ఎవరి కన్నులో
చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

నల్లని మేఘాల మెరుపులందం
తీరని దాహల వలపు పందెం
వర్షం పడేట్టుంటే నెమలి పురివిప్పుతుంది. అందుచేత నెమలి ఈకలు "ఉలికి పడతాయి". మరింత అందంగా ఉంటాయి. అలాగే ఆనంద్ కళ్ళు కూడా రూపని చూసి ఉలికిపడ్డాయి. ఎంత చక్కని భావం! ఆ చినుకుల చాటుగా ఆనంద్ చిటికెలు వేస్తూ (అంటే తాళం వేస్తూ, లేక సమయాన్ని లెక్కిస్తూ) ఎదురుచూస్తున్నాడు (తన ప్రణయం ఫలించడానికి). శభాష్! ఆ తఱువాతి వాక్యాలలో మేఘాలని కొంచెం దూరంలో ఉన్న రూపతోనూ, మెరుపుని ఆమె అందంతోనూ, ఆనంద్ ప్రేమని తీరని దాహంగాను - ఆ మేఘాన్ని ఇతను వర్షింపజేయగలుగుతాడా అనేదాన్ని పందెం గానూ వర్ణించారు.  వర్షం గురించి చెప్పేటప్పుడు నెమలి గురించి చెప్పడం వరకు అందరూ ఊహిస్తారు, కానీ నెమలి కన్నుకి ప్రేమికుడి కన్నుకి మధ్యన అందమైన పోలిక చూడండి! రెండూ పరవశంతో నిండినవే, అది సామ్యం. ఇలాగ చెప్పడం వేటూరికే సాధ్యం.  ఈ వాక్యాలలో మబ్బుని మళ్ళీ ఆశగొలిపే వస్తువుగా వేటూరి వాడుకున్నారు.

ఒక సామాన్యుడి మనసులో వర్షం అనగానే కలిగే భావనలు (పడవ, సెలవు మొ.) ఈ పాటలో వేటూరి పిల్ల, బుల్లి; చదువు, సెలవు లాంటి పదాలతో లయబద్ధం చేసారు. వర్షఋతువు శ్రావణమాసంలో మొదలౌతుంది కాబట్టి శ్రావణమాసల జలతరంగం మన దేశంలో ఒక కొత్త ధ్వనిని (మృదంగం) వినిపిస్తుంది అని చెప్పడం.
శ్రావణమాసాల జలతరంగం, జీవనరాగాలకిది ఓ మృదంగం
వేటూరికి కూడా ఒక ఆవు వ్యాసం వచ్చు - అందాన్ని వర్ణించడం. ఈ వాక్యాలలో స్త్రీ వానకు అందం తెచ్చిందో, వాన స్త్రీకి అందం తెచ్చిందో తెలియనివ్వలేదు మహానుభావుడు. చినుకుల స్పర్శని పురుషుడితో పోల్చి చెప్పిన వాక్యాలు చూద్దాము.
కోరి వచ్చిన ఈ వాన, గోరువెచ్చనై నాలోన
ముక్కులో సిగ్గు ముసిరేస్తే, ముద్దులాటలే మురిపాన
మెరిసే మెరిసే అందాలు, తడిసే తడిసే పరువాలు
గాలివానల పందిళ్ళు, కౌగిలింతల పెళ్ళిళ్ళు
ఇక "గోదావరి" లో వేటురి వ్రాసిన పాటను చూద్దాము.
టప్పులు, టిప్పులు దుప్పటీ చిల్లులు, గాలివాన హోరుజల్లులు
ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటిజింకలు
జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయె ముద్ద ముద్దగా
మబ్బు మబ్బునా మెరుపుతీగె పొద్దులు కళ్ళలోన కన్నుగీటగా
మొదట ఈ పాట విన్నప్పుడు పల్లవి మొదలు నాకు నచ్చలేదు. టప్పులు, టిప్పులు ఏమిటి అనిపించింది. ఇప్పటికీ నాకు ఈ వాక్యం భావం తెలియలేదు కానీ ఆకాశాన్ని దుప్పటీతో పోల్చి అందులోంచి వర్షం దుప్పటీ చిల్లులలోంచి పడుతున్నట్టు కవి భావమేమో.  అది పక్కన పెడితే ఆ జల్లులు ఏటిలో పడితే చేపలు (నీళ్ళపై పడి ఒక్క క్షణం గెంతుతాయి కనుక), చేతిలో పాపలు (మనం చేతులలో జాగ్రత్తగా పట్టుకుని మురిసిపోతాము కనుక). ఇక్కడ నాకు బాగా నచ్చింది "నీటి జింకలు" అనడం. ఊహించండి నిజంగా ఒక జింక నీటితో తయారై గెంతుతుంటే ఎలాగుంటుందో. వాన పడినప్పుడు అదే భావన కలగాదా? అద్భుతమైన ప్రయోగంగా నాకు అనిపిస్తోంది. మళ్ళీ మబ్బును కోరికతో అనుసంధానం చేసి చెప్పారు, గమనించండి.
ఘల్లు ఘల్లున సానితెమ్మెర గౌతమింట గజ్జ కట్టిలే
ఎంగిలడ్డని గంగ ఒడ్డని పండుముసలి శబరి తల్లిలే
చల్లగాలిని నర్తకితో పోల్చి అది గోదావరి ఇంట్లో గజ్జెకట్టిందనడం వేటూరి కవితాపటిమకు మఱొక మచ్చుతునక. శబరి గురించి వ్రాసిన వాక్యం నాకు అర్థం కాలేదు. వాద్యాల హోరు వలన, పాడేవారికి తెలుగు రాకపోవడం వలన నలిగిపోయిన వేటూరి పంక్తులలో ఇదొకటి.  కానీ వర్షం తనపై పడి గంగలో పడటం ఎంగిలౌతుంది అని శబరి ఒడ్డున ఉంది అనే ఉద్దేశంతో వ్రాసారని అనిపిస్తోంది. చదువర్లు వారి అభిప్రాయాలను వివరించగలరు.

కొనసాగుతుంది...

[1]  ఈ వివరణ మొత్తం భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాఖ్య నుండి తీసుకొనబడినది.

5 comments:

కామేశ్వరరావు said...

"అనుబంధమంటేనే అప్పులే, కరిగే బంధాలన్నీ మబ్బులే"

సినిమా పాటలలో లోతైన కవిత్వానికి యిలాంటి పాటలు, యిలాంటి పంక్తులు చక్కని ఉదాహరణలు. ఇక్కడ "అప్పు" అన్నదానికి రెండర్థాలున్నాయి. ఒకటి అందరికీ తెలిసిన "ఋణము". "ఋణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః" అన్న సూక్తిని మనకిక్కడ వేటూరి గుర్తుచేస్తున్నారు. అయితే యిందులో వేటూరి కవిత్వ పటుత్వం ఎక్కడుందంటే, ఇక్కడ "మబ్బుల" ప్రసక్తి తేవడం! బంధాలని మబ్బులతో పోల్చడం. ఆకాశం సముద్రంనుండి నీటిని మబ్బుల రూపంలో అప్పు తెచ్చుకొని వాన రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. ఆ రకంగా భూమికీ ఆకాశానికి అనుబంధం మబ్బులే! అయితే అవి కరిగిపోయేవి. అలాగే బంధాలన్నవి కూడా ఎప్పటికయినా కరిగిపోయేవే. "అప్"/"అప్పు" అంటే నీరు అనే అర్థం కూడా ఉంది. అంచేత అనుబంధమంటే అప్పులే అంటే అనుబంధం అన్నది నీరు వంటిది అనే అర్థం కూడా వస్తుంది. బంధాలుకూడా నీళ్ళలాగే వివిధ రూపాల్లో ఉంటాయి. బంధాలు ఏర్పడడం పోవడం అనే ప్రక్రియ నీటి-చక్రం వంటిది. అదొక నిరంతర భ్రమణం!

ఒక సినిమాపాట పంక్తిలో ఇంత లోతైన అర్థాన్ని అలతి పదాలతో కూర్చిన వేటురికి (మరోమారు)హేట్సాఫ్!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

సందీప్ గారు,
ఆన్లైన్ లో లిరిక్స్ చూస్తే
ఘల్లు ఘల్లున సానికిన్నెర ఓటమింట గజ్జెకట్టెలే
నింగినంటని గంగ వంటిది పండుముసలి శబరి కళ్ళివే
అని ఉంది.
పాట విందామంటే వాయిద్యఘోష ఎక్కువగా ఉండి స్పష్టంగా వినిపించటం లేదు.
ఈ పాట వినాలని ఇదివరకు అనుకోలేదు.
మొదటి పాదంలో కిన్నెర సాని ఓటమింట గజ్జెకట్టిందంటే.. కిన్నెరసాని కూడా ఈ వర్షపు నాట్యంలో ఓడిపోయిందని అనిపించింది
రెండో పాదం అనుప్రాస కోసం వ్రాసినట్టనిపిస్తుంది. కానీ శబరి కళ్ళు వర్షిస్తున్నట్టుగా నేలవైపే సాగుతున్న వర్షం గురించేమో అనిపిస్తుంది.

Sandeep P said...

@కామేశ్వరరావు గారు

మీ వివరణను మక్కీకి మక్కీ దింపుతున్నాను. మీరు ఆలోచించినంత లోతుగా నేను ఆలోచించలేదు. అందుకే వేటూరి రచన ఆలోచనామృతం. కృతజ్ఞతలు.

@లక్ష్మీ దేవి గారు

మీరు చెప్పిన "నింగినంటని గంగవంటిది పండు ముసలి శబరి" చాలా బాగుందండి. అది వేటూరే వ్రాసారంటే నేను నమ్మేవాడిని. అద్భుతమైన వర్ణన. కానీ, నేను ఇప్పుడే పాట మళ్ళీ గట్టిగా పెట్టుకుని విన్నాను. వాక్యం "ఎంగిలి" తోటే మొదలైంది. శబరి, ఎంగిలి పదాలకు సంబంధం ఉండనే ఉంది. దాన్ని వాన-సందర్భంగా వేటూరి ఎలాగ చెప్పారో అర్థం కావట్లేదు.

Anonymous said...

టప్పులు, టిప్పులూ వాన చప్పుళ్ళు. నీటి చుక్క నేల రాలేటప్పుడు టప్‌మని ధ్వని చేస్తుందంటారుగా.. అక్కడిదా టప్. హిందీ పాట ఏదో ఒకటుంది... టిప్ టిప్ బర్సా పానీ... అని, గుర్తుండే ఉంటుంది. అక్కణ్ణుంచి టిప్. (అప్పుల గురించి భైకారా గారు ఇప్పటికే చెప్పేసారుగా.)
ఏటిలో చేపలూ, చేతిలో పాపలూ తుళ్ళిపడుతూంటారు... కుదురుగా ఒక్క క్షణం ఉండరు. అలాగే నీటి జింకలు (మీ వర్ణన బాగుంది) కూడా ఎగిరెగిరి పడుతుంటాయన్నమాట.
మంచి వ్యాస పరంపర. నేనింకా దిక్కరీంద్ర.. గురించి ఆలోచిస్తున్నాను. ఏమయినా తడితే మళ్ళీ వస్తా. అంతవరకూ సెలవ్.

Anonymous said...

గౌతమి, శబరి రెండూ గోదావరి ఉపనదులే. శబరికి దగ్గరలోనే (కిన్నెర)సాని వాగు ఉంది. వాన గోదావరి మీద అన్న ఉద్దేశంలో (అందునా... సినిమా భద్రాద్రి ప్రయాణమే కదా) ఆ రెంటినీ కవి సూచిస్తున్నాడేమో అని నా ఊహ. ఎంతైనా వేటూరా(మా)యణం అర్ధం చేసుకోడం కొంత ప్రయత్నంతో చేయాల్సిన ప్రయాణమే.