Sunday, February 12, 2012

వేటూరి - అనువాదగీతాలు


నిప్పు లేనిదే పొగ పుట్టదు అంటారు. అలాగని వందమంది అన్నంతమాత్రాన కాకి కోకిలా అవ్వదు కదా? అందుచేత ప్రజలలో ఎక్కువగా వినబడే అభిప్రాయాన్ని రెండు వైపుల నుండీ జాగ్రత్తగా విశ్లేషించి కానీ ఒక అభిప్రాయానికి రాలేము. ఇంతకీ ఆ పొగ ఏమిటి అంటే "వేటూరి అనువాదగీతలు సరిగ్గా వ్రాయలేదు. వాటిల్లో చెప్పుకోదగ్గ పాట ఒకటి కూడా లేదు. దానికి కారణం ఆయనలో ఉన్న అశ్రద్ధ." ఇది ఒక వాదన. కొంతమంది ఈ వాదనని కొంచెం సాగదీసి, "వేటూరి 1990 లలో ఎప్పుడో retire అయిపోయి ఉండాల్సింది" అని ఒక గాలి-సలహా [1] ఇస్తూ ఉండేవారు. బావుంది.

ముందు ఆ సలహా గురించి కొంచెం చర్చించుకుందాం. ఆ తఱువాత అసలు విషయానికి వద్దాము.  అసలు retirement ఎందుకు తీసుకుంటారు? ఇంద్రియాలు సహకరించకపోయినా, పని చెయ్యాలనే కోఱిక తగ్గిపోయినా, పటిమ (ability) తగ్గిపోయినా విరమిస్తారు.  వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాము. వేటూరిని ఆయన ఆరోగ్యం బాగా ఇబ్బందిపెట్టింది, నిజమే. అందుకని విరమించవలసిందా? కాదు అని అంటాను. కవి వాడే ఇంద్రియం అంతరింద్రియం, శరీరం కాదు. మఱోలా చెప్పలంటే కవి యొక్క హృదయం పనిచెయ్యడం మానేయడానికి అది engine కాదు. అదే ఇంధనం. శరీరం సహకరించాలి కానీ, హృదయం ఉన్నంతకాలం పరిగెట్టడానికి సిద్ధమే.

వేటూరి 1970, 1980 ల లో వ్రాసినన్ని మంచిపాటలు 1990, 2000 లలో వ్రాయలేదు అని దాదాపు అందరూ ఒప్పుకుంటారు. దీనికి కారణాలు అనేకం చెప్పుకోవచ్చును. మంచి సందర్భాలు ఇచ్చే కే. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, వంశీ వంటివారి ఉద్ధృతి తగ్గిపోవడం, చలనచిత్రగీతసంగీతంలో తెలుగుదనం తగ్గిపోవడం, సీతారామశాస్త్రి, భువనచంద్ర వంటివారు ఎదగడం ఎంతో కొంత కారణం అని నేను అనుకుంటున్నాను. లేదు కోఱిక, పటిమ తగ్గిపోవడమే కారణం అనుకుంటే, అనువాదగీతాలతో పాటు మామూలు గీతాలు కూడా పెద్ద బాగా కుదిరేవి కాదు అనడం సబబే కదా? అందుకని వేటూరి ఎప్పుడూ అద్భుతంగా వ్రాసిన విశ్వనాథ్, బాపు ల 1990-2000 ల చిత్రాలను పరిశీలిద్దాము.

వేటూరి విశ్వనాథ్ కి 1984 లో సాగరసంగమం తఱువాత 1995 లో శుభసంకల్పం కి పాటలు వ్రాశారు. అందులో "సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు", "చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి" వంటి గీతాలు చాలా చక్కగా, గొప్పగా ఉన్నాయి. ఆ తఱువాత వచ్చిన 2004 లో వచ్చిన స్వరాభిషేకంలో "వయ్యారంగా పార్వతి, శృంగారంగా శైలపతి ఓంకారంగా కలిసి, ఏకాక్షరమై నిలిచే పరవశమంతా మనదే, మన ఇద్దరిదే" అంటూ శృంగారంలో కూడా అద్వైతాన్ని చూపించగలగడం ఒక ఎత్తైతే, "ఉసురుగాలులను వెదురు పాటలుగ మలచు వేణువుకు గొబ్బిళ్ళో" అంటూ కృష్ణుడి మురళికి తెలుగుదనాన్ని అద్ది కొత్త రాగాలు పలికించడం మఱొక ఎత్తు. అలాగే బాపుతో 1993 లో "త్యాగరాజ కృతిలో సీతాకృతిని" తలపింపజేసినా, 1996 లో "చందమామ కంచమెట్టి సన్నజాజి బువ్వ" పెట్టినా, మొన్న 2005 లో రాధాగోపాళంలో "సూరీడు చుట్టూ భూగోళం, రాధమ్మ చుట్టూ గోపాళం" అన్నా, నా మనసు స్వఛ్ఛందంగా అద్భుతం అని ఈల వేసింది. నిన్న, మొన్న వచ్చిన మాయాబజార్, ఆనంద్, గోదావరీ లాంటి చిత్రాల గురించి కూడా చెప్పుకోవచ్చును. కానీ సారం ఏమిటయ్యా అంటే వేటూరి చివరి చిత్రం (వరుడు) దాకా ఆయనలో పటిమ, కోఱిక తగ్గలేదు. సరైన అవకాశం దొరికితే ఆయన ఎప్పుడూ మంచి సాహిత్యాన్నే అందించారు.

అందుచేత వేటూరి విరమించి ఉంటే బాగుండు అనుకోవడం సరి కాదు. ఆ మాటకు వస్తే వేటూరే కాదు, సి.నా.రే కానీ, సిరివెన్నెల కానీ, కవిత్వం నుండి విరమించాలి అని అనుకోవడం పొఱబాటు. ఒక సందర్భానికి చక్కని ఉపమానమో, శ్లేషో, ఆఖరికి పదమో పడినప్పుడు మనసులో కలిగే ఆ తృప్తి అనుభవించకుండా కవికి సలహా ఇవ్వడం, ఎడారిలో ఉండి గోదారి ఒడ్డున ఉన్నవాళ్ళకు రోజుకు ఎన్ని గ్లాసుల నీళ్ళు త్రాగాలో చెప్పినట్టుంటుంది.

ఇక అనువాదగీతాలు విషయానికి వద్దాము. నాకు అనువాదగీతాలు వ్రాసిన అనుభవం లేదు కానీ, ఇళయరాజా పాటలు కొన్ని నేను తెనుగీకరించాను. దాదాపు రెండు మూడు గంటలు కూర్చుంటే కొన్ని ఇఱికింపులతో, కాస్త వినసొంపుగానే వచ్చాయి. కానీ, lip-synchronization (అధరసమతుల్యం?) బాగా తక్కువైంది. అందుచేత అది కొంచెం ఇబ్బందే అనుకుంటున్నాను. ఒక పక్కన lip-sync, మఱొక పక్కన అప్పటికే చిత్రీకరించబడిన దృశ్యాలు, మఱొక పక్కన మాతృకలో భావాలు -- ఇవన్నీ తూగాలంటే కొంచెం కష్టమే. 

శ్రీ శ్రీ, రాజశ్రీ అనువాదచిత్రాలకు మంచి సాహిత్యం వ్రాసారు అని అంటారు. నాకు శ్రీ శ్రీ గురించి పెద్దగా తెలియదు. నాకు రాజశ్రీ వ్రాసిన పాటలు చాలానే నచ్చాయి. అలాగని అవి కూడా ఎప్పుడూ బాగుండేవి అంటే నా మనసు అంగీకరించదు. ఉదాహరణకు "డబ్బులిచ్చుకో జోళ్ళు పుచ్చుకో", "చెయ్యాలి కుఱ్ఱకారు పూజ", "నిన్న కాదు, నేడు కాదు, ఎప్పుడూ నే రాజ", వంటి వాక్యాలు నాకు రుచించవు. ఆ వాక్యాలలో భావం తెలుస్తోంది కానీ, అర్థం ఐతే భావంతో సమాంతరంగా లేదు. కొన్ని సార్లు ఆయన బాగా వ్రాసినా మిగతావారందరూ కలిసి దాన్ని రుచించకుండా చేసారు. ఆయన వ్రాసిన ఆఖరి చిత్రం ప్రేమికుడులో "అధరం, ఉదరం నడుమన ఏదో అలజడి రేగెనులో" అనే వాక్యం ఉన్నికృష్ణన్, రహ్మాన్ కలిసి "అధరమూదరము నడుమన" అంటూంటే అప్పట్లో నా పసి మనసుకు అర్థం కాలేదు. ఏదేమైనా, రాజశ్రీ అనువాదగీతాలు బాగా వ్రాసారు అంటే నేను కచ్చితంగా ఒప్పుకుంటాను.

ఇప్పుడు వేటూరి విషయానికి వద్దాము. వేటూరి అనువాదగీతాల వ్రాసేటప్పుడు lip-sync కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని నేను విన్నాను. అందులో నిజం ఉంది. ఎంతవరకు నిజం ఉంది అంటే "చూసుకున్నవాళ్ళకు చూసుకున్నంత మహాదేవా" అని సమాధానిమిస్తాను. అదేమైనా వేటూరి వయసా నిఖార్సుగా చెప్పడానికి? వాద-ప్రతివాదాలు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చును.

చిన్నప్పుడు మణిరత్నం దిల్-సే చిత్రాన్ని తెలుగులోకి అనువదించినప్పుడు సిరివెన్నెల పేరు చూసి మా తమ్ముడు, నేను సంబరపడ్డాము. (అప్పట్లో మేము రహ్మాన్, సిరివెన్నెలలకు వీరాభిమానులం. ఇప్పుడు కూడా అభిమానులమే కానీ, ఇతర సంగీతదర్శకులు, కవులు కూడా ఈ ప్రపంచంలో బ్రతికే ఉన్నారు అన్న విషయం గుర్తించాము. అప్పట్లో వేటూరి గురించి పెద్దగా తెలియదు. మెరుపు కలలు వంటి అనువాదచిత్రాలకు పాటలు వ్రాసారని తెలిసి, అవి అర్థం కాక చిన్నచూపు చూసేవాడిని.) అప్పటికే (జీన్స్) "నాకేనక" వంటి సాహిత్యంతో విసిగిపోయిన మేము, ఇన్నాళ్ళకు రహ్మాన్ అనువాదగీతాలు అర్థమయ్యే అవకాశం వచ్చిందని ఉత్సాహంగా cassette కొనుక్కుని విన్నాము. కానీ అందులో కూడా "ఛయ్య ఛయ్య" పాట విని నిరాశ చెందాము. ఓ పట్టాన అర్థం కాలేదు. నిస్సందేహంగా  చాలా వరకు కారణం సుఖ్విందర్ సింఘ్ పలికిన తీరు, అసలు తెలుగు పదాలు ఇమడటం కష్టమైన బాణీ. అసలు lip-sync లేదు. అందుచేత అనువాదగీతాలకు అన్నీ కుదరవు అన్న విషయం అర్థమైంది. ఉదాహరణకు అదే దర్శకుడు తీసిన గురు చిత్రంలో "రూఖి రె ఓ రూఖి రె, కాటొరె కాటె కటెనా" అని వచ్చినప్పూడు తెలుగులో దాన్ని వేటూరి "రుచే లేదు ఏ రాత్రీ, కాటేసే కదా కలైనా" అని వ్రాసారు. ఇక్కడ గమనిస్తే వీలైనంతవరకూ అవే అక్షరాల వరుసని వాడుతూ వచ్చారు. నేను ఇలాంటి ఉదాహరణలు బోళ్ళు గమనించాను. అందుచేత వేటూరి lip-syncను దృష్టిలో ఉంచుకున్నారు అనడంలో సందేహమేమీ లేదు.

వేటూరి అనువాదగీతాలతో వచ్చిన మఱొక చిక్కు చెప్పే ముందు నా అనుభవాలు కొన్ని చెప్పాలి. నాలుగు స్తంభాలాట చిత్రంలో వేటూరి ఎంతో అద్భుతంగా వ్రాసిన "చినుకులా రాలి" పాటని నేను చిన్నప్పుడు విని, "చినుకులు ఆరాలి అంటున్నాడు. ఏ ఒడియాలో ఎండబెట్టుకోవాలేమో?" అనుకున్నాను.  అలాగే సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో "ముల్లోకాలే కుప్పెలై" అన్న వాక్యం విన్నప్పుడు "కాల్లో ముల్లు విన్నాను కానీ ముల్లులో కాలేమిటి?" అనుకున్నాను. గోదావరి చిత్రంలో వేటూరి మూడు దశాబ్దాలు వెనక్కు తిప్పిన "రామచక్కని సీతకు" పాట విని నా మిత్రుడు "ఆ మాటకు అర్థం పర్థం లేదు. రామ, చక్కని -- ఆ రెండింటికి సంబంధం ఏమిటి?" అని అడిగాడు. విషయమేమిటి అంటే ఒక్కోసారి శ్రోత కొన్ని పదాలను పక్కపక్కన చూడటానికి అలవాటు పడక ఒప్పుకోలేకపోతాడు. అప్పుడు ఆ పదసమూహానికి అర్థం లేదనో, రచయితకు జ్ఞానం లేదనో అనేసుకుని తన అహాన్ని సంతృప్తిపెడతాడు. ఈ ప్రక్రియకు ఎక్కువగా గురయ్యేవి వేటూరి పాటలు.

Surrealism కోసం ప్రాకులాడే వేటూరికి, pseudo-realism కు అలవాటు పడిన శ్రోతకు మధ్యలో ఇది నిత్యసంఘర్షణ. ఒకరుగోదావరిలో "మనసా వాచా" పాట వింటూ "కలలు వెన్నెలై కాటేస్తున్నా" అన్న వాక్యం విని "కల కాటేయడమేమిటి?" అని అడిగారు. ఏం చెప్తాను? ఏమీ చెప్పలేక తడబడి ఊరుకున్నాను. తెలుగు దర్శకులు ఇలాంటి surrealism ని ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకు సృష్టిలో ఉన్న విషయాలన్నీ తెలుసును కాబట్టి, వేఱెవరికీ తెలియవు కాబట్టి. కాకపోతే అనువాదగీతాలు వ్రాసినప్పుడు ఆ దర్శకులు, కథానాయకపాత్రధారులు వేధించరు కాబట్టి కవికి కొంచెం స్వేఛ్ఛ వస్తుంది. అది దొరికినప్పుడే వేటూరి కొంచెం వేఱుగా వ్రాసే ప్రయత్నం చేసిన సందర్భాలు కొన్ని గమనించాను.

ఉదాహరణకు విలన్ (వేటూరి చివరి అనువాద చిత్రం)లో "మనసుని ఇవ్వవే మగనాలా" అనే వ్రాసారు. చిన్నప్పుడైతే మగనాల అనే పదాన్ని మగ, నాలా అని నాస్తిసంధి విడదీసుకుని "మగవాడు ఇచ్చినంత సులువుగా మనసుని ఇవ్వుమా, అంటున్నాడు కవి. ఏడ్చినట్టుంది" అనుకునేవాణ్ణి. ఇప్పుడు బ్రౌహ్ణ్య నిఘంటువు తెరిచి "మగనాల అంటే వివాహిత" అని అర్థం తెలుసుకున్నాను. మనసు, మగనాల యతి, సందర్భం కుదిరాయి కదా అనుకుని వేటూరి అలాగ వ్రాసి ఉండచ్చును. పైగా చిత్రంలో ఈ దృశ్యంలో విక్రం పెదాలు కదపడు. అందుకని స్వేఛ్ఛగా వ్రాసుకున్నది జనాలకు అర్థం కాక వేటూరి పిచ్చి పిచ్చిగా వ్రాస్తున్నారు అనుకుని ఉంటారు.

చిన్నప్పుడు నేను చిఱాకు పడిన మెరుపు కలలు చిత్రంలో "తల్లో తామర మడిచే" తామర మడవడం ఏమిటి? తురుముకోవడం అనాలి కదా అనుకున్నాను. తమిళంలో "తంగత్తామర మగళే" అని ఉంది. ప్రతీ పదానికి మొదటి అక్షరమైనా కలిసేలాగ వ్రాసే ప్రయత్నంలో తురుముకి బదులుగా మడుచు అని వ్రాసారు. ప్రతిఫలంగా నాకు పాట పల్లవే విచిత్రంగా తోచింది. నిజానికి పాఠ్యపుస్తాలలో పూర్వకవులు యతిమైత్రి కోసం ఇదే పని చేస్తే "ఓహో, ఎంత గొప్ప vocabulary" అనుకునేవాడిని.  "అట్టిట్టాయెను మనమే" అంటే అర్థం కాలేదు. అట్టా, ఇట్టాను ని అలాగ కలిపేయవచ్చునా? అసలు "మన ఇద్దరి (మనం) గురించి మాట్లాడుతూ అయ్యెను అంటాడేమిటి? అయ్యాము అనాలి కదా? అసలీ కవికి తెలుగు వచ్చునా?" అనుకున్నాను. Ignorance is bliss అన్నారు. "ఒడిలో హృదయం కాగడం ఏమిటి?" అనే సందేహం వచ్చింది. ఆ తఱువాత సంస్కృతం పాఠ్యపుస్తకంలో "రామేణ భరతః అంకే ఆరోపితః" అని చదివి "ఒళ్ళో కూర్చోపెట్టుకోవడానికి భరతుడేమైనా చంటికూచా?" అనుకుంటుంటే మా ఉపాధ్యాయుడు "అంకే అంటే పక్కనే అని భావం" అని చెప్పారు. అది సంగతి. నాకు వేటూరి సాహిత్యాన్ని అర్థం చేసుకునే అనుభవం లేక ఆ పాటంతా పిచ్చిపిచ్చిగా అనిపించింది. ఇక కంఠం వరకూ ఆశలు, ఉదయంలో ఊహ ఉడుకుపెట్టడం, యదను మూతపెట్టుకోవడం, పరువం వచ్చిన పోటుతుమ్మెదలు, గలబాకప్పలు, ఎడారి కోయిల పెంటిని వెతకడం, విరాళిగీతం, నఖం కొరికిన పిల్ల, నాగరికం పాటిస్తే ఎలా సాగు పూజ, కౌగిలి భాష -- ఇవన్నీ నాకేమర్థమౌతాయి చెప్పండి? అదే మన తెలుగు దర్శకులు ఐతే ఈ అర్థం కాని శృంగారాన్ని తీసేసి చక్కగా అందరికీ అర్థమయ్యే బూతులు వ్రాయించేవారు. చెప్పవచ్చేదేమిటి అంటే వేటూరి అనువాదగీతాలలో కొంచెం పరుషమైన భాష, భావం వాడేవారు. అది అర్థం కాక కొంతమంది ఆ పాటలను చెత్త పాటలనుకున్న సందర్భాలు ఉన్నాయి.

వేటూరిని బాగా వెనకేసుకుని వస్తున్నావు. అసలు బాగా వ్రాసిన పాటలేంటో చెప్పు అని అడిగేవాళ్ళుంటారు. వేటూరి పాటలో ప్రతి వాక్యం అంతే అందంగా, ఒక ధార (flow) లో ఉండాలనుకుంటే వేటూరి సరదా పాటలు, అనువాదగీతాలు వినద్దు అని చెప్తాను. వేటూరి పాటలో కొన్ని వాక్యాల impact ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అనువాదగీతాల్లో అవధానంలాగా lip-sync, దృశ్యాలు, బాణీ అన్నీ గుర్తుపెట్టుకుని వ్రాసినప్పుడు ఇది మరింత జరుగుతుంది.

ఉదాహరణకు సూర్య s/o కృష్ణన్ చిత్రంలో పాత్రధారులు పాడుతున్నట్టు ఉండే దృశ్యాలకు పదానికి పదం అనువదించి, చిన్న చిన్న మార్పులతో కానించేసి, background లో వచ్చే "నిదరే కల ఐనది" పాటలో చక్కని ప్రయోగాలు చేసారు. ఈ పాట తెలుగులో ఇక్కడ చూడచ్చును, తమిళంలో ఆంగ్లానువాదంతో ఇక్కడ చూడచ్చును.


నిదురే కల ఐనది, కలయే నిజమైనది
బ్రతుకే జత ఐనది, జతయే అతననన్నది
మనసేమో ఆగదు, క్షణమైనా తోచదు
మొదలాయే కథే ఇలా...

మొదటి సారి పాట విన్నప్పుడు, నిదుర కల అవ్వడం ఏమిటి? అనుకున్నాను. మళ్ళీ ఆలోచిస్తే "కల అవ్వడం" అంటే జరగకపోవడం అని తెలిసింది. "సుఖంగా తినడం కలైపోయిందనుకో" అంటే "ఈ మధ్యన సుఖంగా తినట్లేదు" అని అర్థం. ఇక్కడ వేటూరి తెలివిగా నిదుర కల ఐంది అన్నారు. అంటే నిద్ర పట్టట్లేదు. కానీ నిద్రపోనిదే కల రాదు. అదే కవి చమత్కారం. అది అర్థం కాకపోతే మన అజ్ఞానం.

"బ్రతుకు జత అవ్వడం" ఏమిటి? అని మఱొక సందేహం. బ్రతుకు అంటే జీవితం, ప్రాణం అని రెండు అర్థాలు చెప్పుకోవచ్చును. జీవితం అనుకుంటే, అప్పటిదాక తన మనసుకు నచ్చే విధంగా లేని తన జీవితం ఇప్పుడు తనతో పాటు (అనుకూలంగా) నడుస్తోంది అని. లేదా అతడి జతే తనకు బ్రతుకైంది అని. బ్రతుకు అంటే ప్రాణం అనుకుంటే అతడిని చూసినప్పటినుండి ప్రాణం లేచి వచ్చింది అని (అప్పటిదాక జీవం లేనట్టు ఉంది అని). ఇన్ని అర్థాలు ఉండటం ఏదో నేరం లాగా చూడకుండా అదొక అందం లాగా చూడలేని వాళ్ళు వేటూరి పాటలకు దూరంగా ఉండాలని నా సలహా. ఒలిచిన అఱటిపళ్ళు కావాలనుకుంటే వేటూరి అప్పుడప్పుడు నిరాశపరుస్తారు కానీ అలాంటప్పుడే శ్రమపడి కొబ్బరికాయ ఒలిచి, పగలగొట్టి త్రాగాలనుకునేవాళ్ళకు మరింత ఆనందం కలిగిస్తారు. 

చరణాల్లో సందర్భాన్ని మరింతగా వివరిస్తూ వ్రాసారు. ఈ చిత్రంలో నాయిక దివ్య మొదట్లో మద్యానికి బానిసైన సూర్యని చూస్తుంది. తఱువాత అతను ఆ చెడ్డ అలవాటునుండి బయటపడి ప్రయోజకుడైనప్పుడు అతడిని ఇష్టపడుతుంది. అది ఎంత చక్కగా చెప్పారో చూడాలి.

వయసంతా వసంతగాలి, మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారి దారి, చిగురులతో చిలకలతో
యమునకొకే సంగమమే కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై నిలిచినది తన కొఱకే
పడిన ముడి, పడుచు ఒడి ఎదలో చిరుమువ్వుల సవ్వడి

వసంత గాలి లాంటి ప్రయోగాలను శిష్టులు దౌష్ట్యం అనుకోవచ్చును. కాకపోతే మనసు పెట్టి చేసిన ప్రయోగమే. అతడిపైన కేవలం మనసు పడటం వలనో, లేక అతడిని తనవాడిగా భావించడం వలనో ఆమె వయసు ఉన్నట్టుండి వసంతావరణాన్ని చూపిస్తోందిట. అప్పటిదాకా ఎడారి దారి అనుకున్నది ఉన్నట్టుండి చిగురులేసిన, చిలకలు నిండిన చెట్లతో ఉందిట. యమునకు సంగమం కడలితో కాదు, కేవలం గంగతో వ్రాసిపెట్టి ఉంది. అలాగే అతడు చెడిపోయినప్పటినుండి మళ్ళీ బాగుపడేదాకా ఆమె ఓర్పుగా వేచి ఉంది. ఏర్పడిన ఈ బంధం ఆమె గుండెల్లో చిరుమువ్వల సవ్వడిలాగా తీయగా అనిపించింది.

రెండో చరణంలో వేటూరి ఆత్రేయ కండువా ధరించి ఒక వాక్యం వ్రాసారు.

అభిమానం అనేది మౌనం, పెదవులపై పలుకదులే
అనురాగం అనే సరాగం స్వరములకే దొరకదులే
నిను  కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి
నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి
ఎదుట పడి కుదుటపడే మమకారపు నివాళి లే ఇది

అభిమానాన్ని మౌనం తో పోల్చడం, అను"రాగం" స్వరాలకు దొరకదు అంటూ చమత్కరించడం నాకు నచ్చాయి. మధుమురళి చిగురించడం (వేటూరి trade-mark రాధాకృష్ణుల ప్రణయాన్ని గుర్తు చెయ్యడం) అంటూ మూగబోయిన వేణువు రాగాలు తీయగా పాడుతోంది అని రెండు పదాల్లో చెప్పడం మొ. అంశాలు అన్నీ బాగున్నాయి అనిపించింది. ఆ తఱువాతి వాక్యం వచ్చేటప్పుడు దృశ్యంలో శృంగారానికి తగ్గట్టుగా ఎద రగిలి, తనువు పులకరించింది అనడం కూడా సముచితంగా ఉంది. ఇంకా ఇది చెత్తపాట అనుకుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? అలాగే సఖి చిత్రంలో "అలై పొంగెరా" అనే పాట, వేఱొక విషాద గీతం ఎంతో అందంగా వ్రాసారు. ఇవన్నీ ఈ వ్యాసం వ్రాస్తున్నప్పుడు గుర్తుకొచ్చిన పాటలు. అందుచేత వేటూరి వ్రాసిన మంచి అనువాదగీతాలు ఉన్నాయి. ఎన్ని అనే విషయం పైన వాదించుకోవచ్చును. కాకపోతే "అసలు లేవు" అనే మాట మాత్రం పొఱబాటు.

[1] గాలి-సలహా అంటే ముఖాముఖీ ఇవ్వకుండా జనాలు పక్కవాడితో చెప్తే, అది వ్యాపించి, చివరికి media వాళ్ళు దాన్ని ప్రచారం చేయడం ద్వారా అసలు వ్యక్తికి తెలియడం.

11 comments:

bhavaraju said...

వేటూరి గారి గురించి బాగా చెప్పారు

గిరి said...

"ఇతర కవులు ప్రపంచంలో బ్రతికే ఉన్నారాని....." బావుంది. చలనచిత్రకవులను ప్రక్కనపెట్టి పరిధిపెంచుకుపోతే, అనతికాలంలోనే సినీకవులు కుఱుచలవలే కనిపిస్తారు.

padmaja said...

మీ పోస్టులు ఎప్పుడూ ఇంట్రెస్ట్ తో చదువుతుంటాను. చాల బాగా వ్రాస్తారు.
అట్టిట్టాయెను మనమే అన్నదానిలో మనమే అంటే మనసు గురించి కాదా? నాకు దాని ముందు వాక్యం తెలీదు అన్వయించుకోవడానికి.
మగనాలి అంటే మగని ఆలి అనుకుంటున్నాను

Sandeep said...

మగనాలు అంటే మగని + ఆలు (అకార సంధి) సరైనదేనండి. అట్టిట్టాయెను మనమే అంటే మీరన్నట్టుగా "మనసు అటూ ఇటూ అయింది", అనే అర్థం. చిన్నప్పుడు "మనం" అంటే "we" అనే అర్థం మాత్రమే తెలుసు కాబట్టి వేటూరి ని అపార్థం చేసుకున్నాను.

మీ మంచి మాటలకు ధన్యవాదాలు.

Sandeep said...

@గిరి గారు,

మీరన్నది నిజమే. స్వేఛ్ఛ ఎంత ఎక్కువ ఉంటే కవిత్వం అంత బాగుంటుంది.

ఉష said...

కవిత్వం అంటే పైత్యం అని ఆ సాహిత్య పార్శ్వానికి దూరమైపోయిన దాదాపు రెండు తరాల్లో ఇంకా కాస్త జా/జనపదం కి మారుపేరుగా ఇలా సినిమాపాటల్లో కవితామతల్లి విడిది చేసుకొనటానికి ఈ సినీకవులే కారణమన్న గాఢ అభిప్రాయం వలన నాకు చాలా గౌరవం వారి పట్ల. కుఱచ తనం అనేకన్నా పోనీ ఉందనుకున్నా కొత్తతరం కవులు వీరు. ఆత్రేయ తో పుట్టి, వేటూరి పాట తోనే నాలో కవితావేశం పెరిగిందని నమ్మకమూనూ. కనుకనే మీ పోస్ట్ 3-4 సార్లు చదివాను (ఈ సాయంత్రపు సింహభాగమంతా) :) అన్నట్లు, శీర్షిక "వేటూరి అనువాదగీతాలు" కాదా? మీరు "వేవేల వర్ణాల..." మాదిరిగా "వేటూరి అనువాదగీతాల" అనే పెట్టారా?

"ఒక పక్కన lip-sync, మఱొక పక్కన అప్పటికే చిత్రీకరించబడిన దృశ్యాలు, మఱొక పక్కన మాతృకలో భావాలు -- ఇవన్నీ తూగాలంటే కొంచెం కష్టమే." - అనువాద కవులకి ఇదొక కత్తి మీద సాము. ఈ మధ్యన బాలు గారు దాదాపుగా నిలదీస్తే (రోబో పాటల గందరగోళ సాహిత్యం పైన) భువన చంద్ర ఇదే చెప్పారు.

వేటూరి గారి అనువాదాలు నాకు ఇబ్బంది ఇవ్వలేదేప్పుడూ. ఎందుకంటే కొబ్బరిబోండాలు వలి/పిం/చి, తాగి, లేత పాకుడు గుజ్జుని తినటం అలవాటు కనుక. "రామ చక్కని..." పాటలో "నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలచే. చూసుకోమని మనస్సు తెలిపే మనస్సు మాటలు కాదుగా" ఎంత విడదీసుకుంటే అంతా విశదం కదా? ఆలాగే ఆయన సృజన చేసే పదాలు చాలా బావుంటాయి "గసగసాల కౌగిలింత" ఒక మచ్చుక. నిజానికది సగ సగాల అన్నదానికి కొత్త ప్రయోగమని ఆయనే చెప్పారు.

"రాలిపోయే పువ్వా..." ఒక్కసారి వినగానే ప్రతి పదం ఎలా ఎదలో పదిలంగా అద్దకం వేసిందో. చాలానే గుర్తొస్తున్నాయి గానీ ఇది టపా కాదు వ్యాఖ్య అన్న స్పృహ ఆపుతుంది.

ఆదివారపు సాయంత్రాన్ని అర్థవంతంగా గడపగల వీలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

Sandeep said...

ఉష గారూ

నేనూ మీతో ఏకీభవిస్తాను. ఒక రకం కవిత్వం గొప్పది, మఱొక రకం కవిత్వం తక్కువది అనలేము. కాకపోతే చలనచిత్రకవిత్వంలో కొంచెం ఎక్కువ కత్తుల మధ్యన సాము చెయ్యాలి. అందుకని ఒకటొ రెండో గాట్లు పడుతూ ఉంటాయి అని గిరిగారి అభిప్రాయం అనుకుంటున్నాను.

వ్యాసం టైటిల్ సవరించాను. మీకు ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం. మీలాంటి కవితాభిమానులను చూస్తే నాకు చాలా సంతోషం. అభినందనలు అండి.

అద్దకం అనే పదాన్ని ఎప్పుడూ వినలేదు. ఇప్పుడే దాని అర్థం చూసాను. మంచి పదం తెలియజేసినందుకు ధన్యవాదాలు :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ said...

బాగా రాశావు, సందీప్.
తెలుగు అంతంతమాత్రమే వచ్చిన నాకే "మనసుని ఇవ్వవే మగనాలా" అర్థమైందంటే నీకు బ్రౌణ్యం అవసరమైందంటే నమ్మను :-)

మగనాల బాగా వాడుకలో ఉన్న పదమే కదా?

Sandeep said...

@అవినేని

నాకు తెలుగు మీద అభిమానం ఉన్నంత అందులో ప్రావిణ్యంలో లేదు సోదరా :) అందుచేత నాకు ఆ పదం తెలియదు. అర్థం తెలిసాక, నేను సంధిని, వ్యుత్పత్తిని అన్వయించుకున్నాను.

MURTHY the reseacher in Social Innovations said...

సినీ అనువాద గీతాలపై క్రిటికల్ ఎనాలిసిస్ చెయడానికి మీరు చేసిన ప్రయత్నం బానేవుంది. కాని ఇందులొ దానికి అవసరమైన పరిణితి కనిపించలేదు.
However, thanks for such an attempt!
http://www.facebook.com/rrkmurthy

Sandeep said...

మూర్తి గారు, సినీ అనువాదగీతాల గురించి ఏనాలిసిస్ చెయ్యాలన్నది నా ప్రయత్నం కాదు. "వేటూరి అనువాదగీతాలు అన్నీ చెత్తవి" అని అనడం సబబు కాదు అని మాత్రమే నేను చెప్తున్నది. అనువాదగీతాల గురించి వ్రాసేంత అనుభవం మీరన్నట్టే నాకు లేదు.